విలువైనది

ఇంటి యజమాని చనిపోయి పదిహేనురోజులైంది. పల్లెటూరు కావడంతో బంధువులు ఎక్కువ రాలేదు. ఊర్లో వాళ్ళే ఒక్కక్కరు వచ్చి పరామర్శించి వెళ్ళరు. మొదటి గదిలో ఓ మూల పెట్టిన ఆయన ఫోటో తీసి గోడకు తగిలించాడు చిన్న కొడుకు రాఘవ. దీపారాధన చేసిన ప్రమిదను మిగిలిపోయిన నూనెను ఆ ఇంటి పనిమనిషికి ఇచ్చేసాడు. ఆయన తాలూకు జ్ఞాపకం, బాధ ఆ ఇంటివాళ్ళని అప్పుడప్పుడే వదిలి వెళ్తున్నది.

"అన్నయ్యా ! రేపు నేను విమల వెళ్ళిపొదామనుకుంటున్నాం. లీవ్ అయిపొయిందికదా!" అన్నడు ఆ ఇంటి రెండో కొడుకు పరమేశ్వర్.

ఉండమని చెప్పలని వున్న వెళ్ళద్దని అనలేదు విద్యధర్.


"మేం కూడా వెళ్ళిపొతాం అన్నయ్య. ఇంకా ఎందుకీక్కడ?" రాఘవ అన్నడు తండ్రి పటానికి దండవేస్తూ.

విద్యధర్ తలెత్తి చూసాడు 'నువ్వుకుడానా ' అన్నట్లు. చిన్నగా "ఊ" అన్నాడు. పరమేశ్వర్ వచ్చి తన అన్నయ్య దగ్గర కూర్చున్నాడు. రాఘవ అతని భార్య సరళ కూడ అతని దగ్గరకి వచ్చారు.

"అన్నయ్యా! ఇక ఈ ఆస్తి సంగతి తేల్చేద్దం. ముగ్గురం మూడుచొట్ల వున్నాం. ఈ వూర్లో ఇంకా ఎందుకు?" అన్నాడు.

"అవును బావగారు. మూడు భాగాలు చేసుకుని పంచేసుకుంటే సరిపోతుంది. మళ్ళి మళ్ళి ఇక్కడికి రావడం ఏం కుదురుతుంది చెప్పండి" సరళ అన్నది

ఈ పనంతా అయిపోతే ముగ్గురం రేపు బయలుదేరవచ్చు" పరమేశ్వర్ అన్నాడు.

విద్యాధర్ 'సరే' అన్నాడు.


***


ముందుగా అనుకున్నట్లుగానే అన్ని పనులు చెసేసారు ఇద్దరు చిన్న కొడుకులు. ఇంటిని అమ్మేసి మూడు భాగాలు చేసారు. మూడు ఎకరాల పొలం మూడు చోట్ల వుంది. 'నీకిది, నాకిది, అన్నయ్యకిది ' అంటూ పంచేశాడు పరమేశ్వర్. మూడిటికి కౌలు కుదర్చటం కూడా పూర్తైంది. ఇంటి సామాన్లు ఒక్కొక్కటె పంచుకొసాగారు.

విద్యాధర్ అంతటిని గమనిస్తునే వున్నడు. అతనికి తెలుసు తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు కలిసి అప్పటికే పంపకాలకు అన్ని సిద్ధం చేసే తనని అడిగారని. ఆ పంపకాలలో తనకు అన్యాయం చెస్తున్నరని అతనికి తెలుసు. తనకిచ్చిన పొలంలో ఏది పండదని, తనకు చెప్పిన ఇంటి ధర అంత తక్కువగా వుండదని అన్నీ తెలుసు. అయినా అవన్ని పట్టించుకునే స్థితిలో లేడతను.

తనకేనాడు వాటిమీద ఆశలేదు. తను సంపాదిస్తున్నది తనకీ, తన భార్యాపిల్లలకి సరిపోతుంది. అంతవరకు చాలు. కానీ శారద ఊరుకుంటుందా? ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు.అప్పుడు గమనించాడతను. తన తమ్ముళ్ళు అన్నీ సమానమనే ముసుగులో లాభదాయకంగా పంచుకుంటున్నారు. అవసరాన్నిబట్టి ఇద్దరూ 'ఇది క్రితం ఏడాదివచ్చినప్పుడే నాన్న నాకిస్తానాన్నడ్రా' అని అబద్దలు కల్పించుకుంటూ పంచుకుంటున్నారు కాని,


కాని, ఆ గదిలో మూల వున్న ఆ ఒక్కటీ వాళ్ళు పట్టించుకోవటంలేదు. మర్చిపోయారా? విలువ కట్టలేని ఆ సంపదని ఎలా మర్చిపోగలరు? తమ తండ్రి ఎంతో ప్రాణాప్రదంగా చూసుకున్నడు? చివరికి చనిపొయేముందు కూడా తన పక్కనే ఉంచుకున్నాడు. ఆ ఇద్దరిలో ఎవరైనా తీసుకెల్తారా? లేక తనకే వదిలెసారా? అంత అదృష్టమా?

"అన్ని పంచెసినట్లేగా అన్నయ్యా?" పరమేశ్వర్ అడిగాడు.

సంశయంగా ఆలోచించాడు. మిగిలిపోయినా ఆ ఒక్కటి? అటు వైపు చూపిస్తూ ఏం చేద్దాం అన్నట్లు చూసాడు ఇద్దరు తమ్ముళ్ళవైపు.

"అదేంటన్నయ్యా.. నాన్న కోరిక నీకు తెలుసు కదా.. నువ్వే తీసుకెళ్ళు"

"అవునన్నయ్య మీ మరదలు కూడా వద్దంటే వద్దంటోంది.. అందుకే నీకే వదిలేశాం." చిన్నవాడు అన్నాడు.

'వదిలేశారా?' అంతేలే వాళ్ళకి విలువలేం తెలుసు? ఎమైనా తనకే ఆ అదృష్టం కలిగింది.' విద్యాధర్ అనుకున్నాడు.

ముగ్గురు కొడుకులు ఆ ఇంటిని వదిలి తమ తమ ఊర్లకి ప్రయాణమయ్యారు.***


"శారద ఏమంటుందో" విద్యాధర్ అదే ఆలొచిస్తున్నాడు.

"ఏ రోజైనా డెలివరీ కావచ్చు. పల్లెటూర్లో ఎందుకు ఇబ్బంది పడతారని" డాక్టర్ తీసుకెళ్ళద్దని చెప్పింది. లేకపోతే శారద తప్పకుండా వచ్చేది. ఇప్పుడు తన తోడికోడళ్ళు తెలివిగా అన్నీ పంచేసుకున్నారని తెలిస్తే ఏమనుకుంటుందో? తనతో తీసుకెల్తున్నవన్ని ఎందుకూ పనికిరానివని తనకే తెలుసు. కాని ఎంతో విలువైనది తమ్ముళ్ళు తనకే వదిలిపెట్టారు. శారద ఒప్పుకుంటుందా లేక సరళలా వద్దంటునదా? ఏమో!

ఇల్లు చేరగానే పక్కింటి కాంతమ్మగారు వచ్చి తాళం ఇచ్చింది.

"శారద లేదు. హాస్పిటల్ కి వెళ్తూ తాళాలు ఇచ్చివెళ్ళింది" చెప్పింది. విద్యాధర్ పక్కనున్న విలువైనదాన్ని విచిత్రంగా చూస్తూ.

అన్నీ ఇంట్లోకి చేర్చాడు. తన తండ్రి ప్రాణమనికిన్న ఆ ఒక్కటీ తన బెడ్రూంలో చేర్చాడు.

శారద వచ్చింది. రెండురోజుల్లో డెలివరీ కావచ్చునని డాక్టర్ చెప్పిందట. శారదని కూర్చోమని జరిగిందంతా చెప్పాడు. ఆమె తేలిగ్గా కొట్టి పారేసింది. చివరగా తను ఓ విలువైన బహుమతి తెచ్చానని, తన తండ్రి ఎంతో ప్రేమగా చూసుకున్నదని చెప్పాడు.

"అక్కడ బెడ్రూంలో వుంది వెళ్ళు. ఇష్టం లేకపోతే చెప్పు. వేరే మార్గం ఆలోచిద్దాం." అన్నడు. శారదా నవ్వుతూ లేచింది.

"ఏంటో చెప్పొచ్చుకదా!" అంటూ బెడ్ రూం వైపు అడుగులేసింది.

'శారద కాదనదు, తన మనసు నాకు తెలుసు ' విద్యాధర్ మనసులోనే అనుకున్నాడు. శారద వెనకాలే వెళ్ళాడు.

బెడ్‌రూమ్ తలుపు తెరిచి స్థాణువులా నిలబడిపోయింది శారద. ఒక్క క్షణంలో తేరుకుని పరుగున పరుపు దగ్గరకు చేరుకుంది.

"అత్తయ్యా!" అంటూ ఆమెను కౌగలించుకుంది

విద్యాధర్ తృప్తిగా నిట్టూరుస్తూ అనుకున్నాడు.

'నాకు తెలుసు శారద కాదనదు!'


(02.09.1999, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక)
Category:

3 వ్యాఖ్య(లు):

MURALI చెప్పారు...

ఒక రోజున ఇలాంటివి జరిగితే అది ఒక వింత,కధ,వార్త. కానీ ఇప్పుడు ఇది ఇంటింటి కధ.

చిన్నమయ్య చెప్పారు...

మీకు హాస్యమే కొట్టిన పిండి అనుకున్నాను. ఎంత తప్పు? గుండె చిక్క బట్టిందంటే నమ్మండి.

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

మురళి, చిన్నమయ్యగార్లకి

మీ అభినందనలకి ధన్యవాదములు.

అరిపిరాల