పేపర్ పురాణం

"ఆంధ్రప్రభ ఒకటివ్వు..." అడిగాను రైల్వేస్టేషన్ బుక్ షాప్ లో. న్యూస్ పేపర్ తీసి ఇచ్చాడతను.

బంధువులింటికి పెళ్ళికని బయల్దేరిన నేను ట్రైన్ లేటనితెలియడంతో టైంపాస్ కోసం పేపర్ కొన్నాను. దగ్గర్లోనే వున్న బెంచి మీదకు చేరి పేపర్ తెరిచాను. వార్తలన్నీ మాములే. కొద్దిక్షణాల తర్వాత ఎవరి తాలుకోగాని ఒక తలకాయ నాకూ పేపరుకి అడ్డమొచ్చింది.

తెరుకొని చూద్దునుకదా నా కుడివైపు కూర్చొని ఉన్న రుబ్బురోలు లాంటి వ్యక్తి నా మీదుగా పేపర్ మీద పడిపోతున్నాడు.

"బాబూ... నిద్రపోతున్నావా..?" అడిగాను నేను.

"ఛ.. ఛ.. చదువుతున్నానండీ బాబు..." అన్నాడతను.

"నాకు అడ్డంగా తలపెట్టారండీ... నేనెలా చదువుకోను...?" ఆ మాటకు ఎడమవైపు కూర్చున్న వ్యక్తి సమాధానం ఇస్తూ

"ఓహొ మీరూ ఈ పేజే చదువుతున్నారా..! నేను పక్క పేజీ అనుకున్నను.. హి హి" చెవుల్దాక నవ్వి సర్దుకుకూర్చున్నాడతను. అతను నాకు ఎడమవైపు వున్నాడు. నిదానంగా నా భుజం మీదుగా తలచేర్చి పేపర్లోకి చూడటం మొదలుపెట్టాడతను.



"అబ్బా.. వీరప్పన్ మళ్ళి తప్పించుకున్నడా..? గ్రేట్... ప్చ్ ఈ పోలీసులు లంచాలు మరిగారు.." తనలో తానే అనుకున్నాడు. నేను పేజీ తిప్పాను.



"ఓహొ.. మళ్ళి అజారుద్దీన్ పెళ్ళి చేసుకున్నాడా? బాగానే ఉంది.. ఈసారి అందాల పోటీలు.. " అతను చదివేలోపే పేజీ తిప్పేసాను నేను.



"అబ్బా కొద్దిగా ఆగండిసార్! మాంఛి ఇంటరెస్టింగ్ ఐటం." అన్నాడతను.



"పేపర్ కొన్నది నువ్వు చదవడానికి కాదు..!" ఈ మాటలన్నది నేను కాదు..! నా కుడివైపు కూర్చున్న రుబ్బుడు పొత్రం లాంటి వ్యక్తి..! అతను కూడా నా పేపర్లోకే చూస్తున్నాడు. నేనతని వైపు చూడగానే ఒక వెర్రినవ్వు నవ్వాడు.. "చూసావా నీ బదులు నేనన్నాను.." అన్నట్లు



"నువ్వెవరయ్యా.. మధ్యలో.." ఎడమవైపు అతనన్నాడు



"ఎవరా..? నేను కూడా చదువుతున్నా..! నీలాగా ఏమన్నా గొడవ చెశానా?" కుడివైపున్నతను.



"నేను గొడవ చెసానా..?" ఎడమవైపు



"లేకపోతె నేనట్రా..?" కుడివైపు



"మాటలు జాగర్త..!" రుబ్బుడురోలు



"లేకపోతే..?" రుబ్బుడుపొత్రం



ఇక అక్కడ్నుంచి లేవకపొతే నాకు ప్రామాదమనిపించి లేచి పరుగెత్తబొయాను. ఇంతలో నాకాళ్ళకి ఒక శాల్తీ అడ్డంపడి బోర్లాపడ్డాను. అక్కడెవడో ముష్టివాడున్నాడు.



"నువ్విక్కడెందుకున్నావురా.. కాళ్ళ కింద..?" అడిగాను లేస్తూనే.



"పేపర్లో చిరంజీవి బొమ్మేసినారు సారు.. సూస్తుండినా.. ఇట్ట నువ్వు జర్రున లేస్తావని నాకేమెరుక.. హి.. హి.. బోర్ల పడినావులే.. హి" అనండువాడు నవ్వుతూ.



"చాల్లే నోర్ముయ్.." అని అరుస్తూ అక్కడ్నుంచి కదిలాను నేను. ఈ హడావిడిలో ట్రైన్ కూడ వచ్చెసింది. గభాల్న ఎక్కేసి సీట్లొ కూలబడ్డను.



పేపర్ని బాగ్ లో దాచాను. చదవాలని మనసు పీకుతుండటంతో బయటకు తీసాను. కొద్దిసేపట్లోనే..



"సార్.. చదువుతున్నారా?" అడిగాడు ఎదురుటాయన



"అబ్బే.. అక్షరాలు లెక్కబెడుతున్నా.." అన్నను నేను కోపంగా



"అహా.. అలాకాదూ మెయిన్ చదువుతున్నరు కదా.. స్పెషల్ ఇవ్వండి చదివిస్తా.." అడిగాడతను. నేను మొహమాటపడిపొయి ఇచ్చేసాను.



ఇంకొద్దిసేపట్లో పక్కన కూర్చున్నతను పేపర్ పట్టుకొని చిన్నగా లాగాడు. నేనతని వైపు చూశాను. పేపర్ ఇవ్వమని బ్రతిమిలాడుతున్నట్లు కళ్ళతోనే సైగ చేసాడతను.



"నేను చదువుతున్ననండి.."



"అదే లోపలి పేజీ ఇవ్వండి" అడిగాడతను.



"అట్లా నాకిష్టం ఉండదండి మొత్తం చదివాక మీకే ఇస్తాగా.."



ఫర్లెదండీ.. మీరు పై పేజీ చదివే లోపు ఇచ్చేస్తాగా.. ఢిల్లీ హెడ్ లైన్స్..." అంటూ నా సమధానం రాకుండానే సర్రున లాగేసుకున్నాడతను. ఒళ్ళుమండినా ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపొయాను నేను. కొద్దిసేపు పేపర్లో తలపెట్టి చదువుతూ వుండిపొయిన నాకు పక్కన కాగితం చింపిన చప్పుడవడంతో తలతిప్పాను. పేపర్ తాలుకు రెండో పేజీ రెండు ముక్కలైంది. ఒకటి పక్కనతని చేతిలో మరొకటి అతని ఎదురుగా వున్నతని చెతుల్లొ ఉన్నాయి.




"సారి సార్. ఇవ్వమని కాస్త గట్టిగా లాగాను. అదీ..." నా పక్కనతనికి ఎదురుగా కూర్చున్నాయన చెబుతున్నాడు.



"ఫర్లేదులెండి.." అంటూనే తెలుగు నిఘంటువులొ లేని తిట్లన్ని తిట్టుకుంటూ మళ్ళి పేపర్ లోకి వంగిపొయాను. అంతలోనే అనుమానం వచ్చింది.. 'స్పెషల్" పేపర్ పరిస్థితి కూడా..? తలెత్తి చూసేసరికి ఆయన నిద్రపొతున్నాడు.



చేతిలో పేపర్ లేదు.
"మాష్టారు... అయ్యా.." అంటూ లేపి "నా పేపరెక్కడ.." అంటూ అడిగాను."చాల్లేవయ్యా అదేమన్నా బంగారమా... దానికోసం బంగారంలాంటి నిద్ర పాడుచెసావు.. నా వెనకతను అడిగితె ఇచ్చాను.. ఆ.. హా.. హా.. వ్" అంటూ ఆవలించాడు. మరోమూల కుర్చున్న పెద్దమనిషి మెయిన్ పేపర్ కూడా తీసుకున్నాడు.



"మీదేగా ఇంటికెళ్ళాక చదువుకోవచ్చులెండి" అన్నాడు పేపరందుకుంటూ. పుండుమీద కారం, ఉప్పు కూడా చల్లినట్లు అనిపించింది. అట్లాగే కొద్దిగంటలు గడిచిపోయాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. గంటసేపు నిద్రపోయి కళ్ళు తెరిచాను. బండి ఏదో స్టేషన్ లో ఆగివుంది.



"ఏ వూరండి..?" అడిగాను"తెనాలి.." చెప్పాడొకడు



"దీని తర్వాత..?"



"దుగ్గిరాల.. మీరెక్కడిదాక...?" అతనడిగాడు. నా దగ్గర మొదట పేపరడిగింది అతనే.


"అక్కడికే.. అవును నా పేపరేది?"


"చెప్పానుగా వెనకిచ్చానని వెళ్ళి అడుగు ఇస్తారు.." అన్నడాయన ధీమాగా. బండి కదిలింది. నేను వెళ్ళి వెనకేన్న వ్యక్తిని అడిగాను.


"మీకు పేపర్ ఇచ్చరటకదా.. ఇస్తారా..?"


"పేపరా..? అదుగో ఆయనకిచ్చాను..." నేను ఆయనవైపు చూశాను. చేతిలో పేపర్ లేదు. నాకర్ధమైపోయింది. ఆ పేపరు చాలాదూరం వెళ్ళిపోయుంటుందని. అందుకే ఒక్క అంగలో మొదట వ్యక్తి దగ్గరకు వెళ్ళాను.


"వాళ్ళ దగ్గర లెదట.. మీరే వెళ్ళి తీసుకురండి." అన్నను పంతంగా. నాకప్పటికే కసిగా వుంది. కొద్దిసేపు వాదించి చివరికి స్పెషల్ పేపర్ వెతకటానికి బయల్దేరాడతను. నేను మెయిన్ పేపర్ అన్వేషణలో పడ్డాను.


నా పక్కనతని దగ్గర్నుంచి అతని పక్కనతనికి, అతని వెనక లేడీకి అక్కడ్నుంచి నిల్చునున్న కాలేజీ స్తూడెంట్ దగ్గరకి.. అక్కడే ఆగిపోయింది.


"బాబూ పేపరెది..?"


"ఇక్కడే ఉండాలే.." అన్నాడు కిందకు చూస్తూ. నేను సీటుకిందట దూరి వెతుకుతున్నను. శనక్కయలమ్మేవాడు వచ్చి నన్ను తట్టుకొని కిందపడ్డాడు. చివరకు పేర్పర్ దొరికింది.. సగానికి చినిగిపోయుందది."ఏంటి బాబూ ఇలా చించెశారు..?" అడిగాను.


"నేనా..? ఏంతిక్కగా వుందా నా దగ్గరకు అట్లాగే వచ్చింది" అన్నాడతను కోపంగా"


పోని మీకొద్దనుకుంటే ఇట్లగీయ్ పొట్లం గట్టుకుంటా" శనక్కయలమ్మేవాడన్నడు. నాకు కసి పెరిగింది. చించిందెవరని అడుగుతూ ఆ స్తూడెంట్ దగ్గరనించి లేడీదగ్గరకు, అక్కడ్నుంచి వెనకతని దగ్గరకు అతని పక్కనతని దగ్గరకు వచ్చను. నా వెనకాలే శనక్కాయలోడు కూడా! "పొట్లం కట్టడానికి పేపరిమ్మంటూ.."


ఆ చివరి వ్యక్తి కూడా అదె అన్నడు. "నా దగ్గరకూ అట్లాగే వచ్చింది" అంటూ.


"అంటే నేనే చించి ఇచ్చానా..? ఛ కర్మ.." అన్నాను తలపట్టుకుని.


"పోని నాకివ్వండి సార్ పొట్లం కట్టుకుంటా" శనక్కయలు.


"రేయ్ నువ్వునోరు మూసుకొని పో.. ఇది ఇవ్వనుగాక ఇవ్వను.." అరిచాను నేను. వాడు బెదిరిపొయి వెళ్ళిపొయాడు. నేను రెండో పేజీ కోసం వెతకబోయాను. వెతకగా వెతకగా చివరకు ఆ కంపర్ట్ మెంట్ చివరి బెర్త్ పైన చదువుతూ ఉన్నాడొకడు.


"బాబు పేపర్ ఇవ్వవయ్యా.." అడిగాను.


"ఆగవయ్యా.. చదువుతున్నను కదా.. చదివిస్తాలే. ప్రతి వాడికి పేపర్ కావల్సిందే.." అన్నడతను. నేను జుట్టుపీక్కొవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాను.


"ఆ పేపర్ నాదే బాబూ.." అన్నను నేను బాధగా.


"అరే.. ఇది మీదేనా..? ఇదుగో తీసుకొండి.. అన్నట్లు స్పెషల్ పేపరుంటే ఇవ్వండి చదివిస్తాను.." అన్నడతను.


"ఇవ్వను.. చచ్చినా ఇవ్వను.." గట్టిగా అరిచి వచ్చెసాను నేను. వాడు తెల్లబొయాడు. తిరిగి నా సీటు దగ్గరకు వచ్చెసరికి మొదటివ్యక్తి కూడా వచ్చేసాడు.


"ఏంటి దొరికిందా..?" అడిగాడు నన్ను.


"ఆ దొరికింది.. ఒకటి నలిగిపొయి, ఇంకొకటి చిరిగిపొయి" బాధగా అన్నాను.


"సర్లే నాకు మాత్రం తడిసిపొయి దొరికింది.." అన్నాడు నా చెతికి తడిపేపర్ అందిస్తూ.


"తడిసిందా..??" ఆశ్చర్యంగా అడిగాను.


"అవును మరి.. ఈ వెనకాలాయన నుంచి ఎదురాయనకి, అక్కడ్నుంచి పైన బెర్తు మీదకు అక్కడ్నుంచి ఆ చివరకు వెళ్ళింది. పాపం వాళ్ళకి పసిపిల్ల ఉన్నట్లుంది. దానికేం తెలుసు పాపం తడిపేసినట్లుంది" అన్నాడు చల్లగా.


"ఛీ.. ఆ మాట ముందే చెప్పచ్చుగా.. నేనింకా నీళ్ళనుకున్న.." అంటూ బయటకు విసిరేసాను. అంతే కోపంతో పేపర్ని పరా పరా చించేశాను.


"అరే చించేసిన్రా.. నాకిస్తే పొట్లం కట్టుకుంటానన్నాను కదా.." మళ్ళి శనక్కయలోడు వచ్చాడు. వాణ్ణి కొట్టబోతుంటే నా ఎదురుటాయన ఆపి -


"పద.. పద.. దుగ్గిరాల వచ్చెసింది" అన్నాడు తన బాగ్ తీసుకుంటూ. ఇద్దరం కిందకి దిగాక అన్నాడు.


"చూడు బాబు.. ఇంకెప్పుడూ ప్రయాణంలో పేపర్ కొనద్దు.. కొన్నా బయటకు కనపడనీయద్దు.. కనపడిందంటే మళ్ళి నీకు చేరదు.. అందుకే కొన్నా దాన్ని లోపలే దాచుకో.. నాలాగ.."


అతను ఓపెన్ చేసిన బాగ్ లోంచి 'ఆంధ్రప్రభ ' పేపర్ నన్ను వెక్కిరిస్తూ కనపడింది.


(1996 ఆదివారం ఆంధ్రప్రభ సంక్రాంతి హాస్య కథల పోటీలో సాధారణ ప్రచురణాకు స్వికరించిన కథ, 8 డిసెంబర్ 1996)

Category:

2 వ్యాఖ్య(లు):

చిన్నమయ్య చెప్పారు...

చితక్కొట్టేసేరు. దేశం లో అన్ని ధరలూ చుక్కల్ని తాకుతున్నా, వార్తా పత్రికల కి అన్నేసి రెక్కలు ఇంకా రాలేదు. అయినా కూడా, మన వాళ్లకి ఇదో జాడ్యం. పేపరుని కొనుక్కోకుండా సంగ్రహించి, సామూహికంగా చదివి, ఖండ ఖండాలు చేసి, చివరికి పులిస్తరాకుని విసిరినట్టు విసిరేయడం మనకే చెల్లు. బ్రహ్మాండంగా రాసేరు.

Unknown చెప్పారు...

మీ అభినందనలకి కృతజ్ఞతలు. ఎప్పుడో పన్నెండేళ్ళక్రితం రాసినది ఇప్పటికీ వర్తిచటం మన తెలుగువాళ్ళ గొప్పతనమేనేమో.. నాటి హాస్యకథల పోటికి జంధ్యాల, ఆదివిష్ణు న్యాయనిర్ణేతలు. వారు నా ఈ కథను చదివారనే ఆలొచనే నాకు ఎంతొ ఆనందాన్నిస్తుంది. మీలాంటివారి ప్రొత్సాహం మరింత బలాన్నిస్తుంది. బ్లాగర్లకి కామెంట్లు.. సన్మానపు దుప్పట్లు కదా...