ఒక చిన్న నాటిక - ABC (A Skit on workplace safety)

A.B.C.
(A skit on workplace safety)


సీన్:1
(ఒక ఫాక్టరీలో)

(ఆనందం పని చేసుకుంటూ వుంటాడు. అప్పుడే అక్కడికి ఇంజనీర్ రవి వస్తాడు. లోపలికి వస్తూనే కాలు జారి పడతాడు. )

రవి: ఆనందం.. ఏంటిక్కడ.. ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఆయిల్ స్పిల్ అవ్వగానే తుడవమని... ఆనందం.. ఆనందం..!!

(ఆనందం పలకడు.. తన పనిలో బిజీగా వుంటాడు.)

రవి: పిలుస్తుంటె పలకవేం? ఆనందం.. ఆనందం.. అబ్బా..!

(అంటూ లేస్తాడు. ఆనందం దగ్గరకి వెల్తాడు)

రవి: ఏరా ఏమైంది నీకు.. పిలుస్తుంటే పలకవే?..!! హలో.. వినపడుతోందా..!! (స్వగతం) ఏమైంది వీడికి.. కొంపతీసి చెవుడేమైనా వచ్చిందా..? అందుకే చెప్పాను.. మెషీన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కాటన్ పెట్టుకోరా అని.. వింటేనా?

(ఆనందం దగ్గరకి వెళ్ళి గట్టిగా అరుస్తాడు.. "ఆనందం..!!")

(స్వగతం: డౌట్ లేదు.. వీడికి చెవుడొచ్చింది).

(అనుకుంటూ అక్కడే మషీన్ పైన వున్న స్పానర్ కింద పడేస్తాడు. వెంటనే ఆనందం స్పానర్ వైపు చూస్తాడు)

ఆనందం: ఇదేంటిది ఇలా పడిపోయింది..??

(అంటూనే అది తీసి పైన పెడతాడు. రవి వైపు మాత్రం చూడడు)

రవి: ఆనందం.. అది పడేసింది నేనే.. ఇటు చూడు.. నేను రవిని..!!

(ఆనందం పట్టించుకోడు)

(రవి వెళ్ళి ఆనందం ముందు నిలబడతాడు. అయినా ఆనందం పట్టించుకోడు. రవి ఆనందం కళ్ళముందు చెయ్యి వూపుతాడు. అయినా ఆనందం తన పనిలో వుంటాడు. రవి ఎగురుతాడు.. అరుస్తాడు.. డాన్స్ చేస్తాడు అయినా ఆనందం పట్టించుకోడు)

రవి: (స్వగతం): డౌట్ లేదు.. వీడికి పిచ్చి పట్టినట్లుంది.. లేకపోతే కళ్ళముందు నేనుంటే వీడెంటి పట్టించుకోడు.

బ్యాక్‌గ్రౌండ్‌లో గొంతు: నువ్వు ఎంత అరిచినా ఆనందానికి వినపడదు రవి..!!

రవి: ఎవరు.?. ఎవరది మాట్లాడేది..??

బ్యాక్‌గ్రౌండ్: నేనెవరో తెలుసుకోవాలని వుందా

రవి: ఎవరది.. నా పర్మిషన్ లేకుండా ప్లాంట్‌లోకి వచ్చింది?

(తెల్లటి డ్రస్‌లో ఆత్మారాం స్టేజి మీదకి వస్తాడు)

ఆత్మారాం: నేనే మాట్లాడింది..

(ఆనందం అప్పుడే టైం చూసుకోని ఏదో గుర్తుకు వచ్చినట్లు వెళ్ళిపోతాడు)

రవి: ఎవరు నువ్వు.. ఈ తెల్ల డ్రస్సేమిటి? ప్లాంట్‌లోకి వచ్చేటప్పుడు యూనిఫార్మ్ వేసుకోవాలి.. తలకి హెల్మెట్ పెట్టుకోవాలి.. నిన్ను లోపలికి పంపించిందెవరు?

ఆత్మారాం: నన్ను ఒకడు పంపించేదేమిటి.. నువ్వెట్లా వొచ్చావో నేనూ అట్లే వచ్చాను..!

రవి: నేను ఇక్కడ ఇంజనీర్‌ని.. నేను రావటానికి నువు రావటానికి తేడాలేదూ..? ఎవరు నువ్వు?

ఆత్మారాం: నేనా.. ఆత్మని..!!

రవి: ఆత్మవా? ఎవరి ఆత్మవి?

ఆత్మా: ఇదుగో ఈ మెషిన్ వుందే.. ఆ మెషిన్ ఆత్మని..!!

రవి: (గట్టిగా నవ్వుతాడు) మెషీన్‌లకి కూడా ఆత్మలుంటాయా?

ఆత్మ: ఏం వుండకూడదా?

రవి: ఇంతవరకూ సినిమాల్లో మనుషుల ఆత్మలే చూసాను.. మెషీన్లకి, స్కూటర్లకి, ప్రెజర్ కుక్కర్లకి ఆత్మలుంటాయని నాకు తెలియదు.

ఆత్మ: అదే మా ప్రాబ్లం.. ఆ విషయం తెలిస్తే నా మోకాళ్ళకి, మోచేతులకి నొప్పులొచ్చినప్పుడు కనీసం ఇంత ఆయిల్ పోసేవాడివి.

రవి: అవును ఆయిల్ పొయ్యలేదు.. కాని ఆ విషయం నీకెలా తెలుసు?

ఆత్మ: చెప్పానుగా.. నేనే మెషిన్ ఆత్మనని

రవి: అయితే ఈ మెషిన కి ఎంత పవర్ అవసరమో చెప్పు?

ఆత్మ: నీకు తెలుసా?

రవి: తెలుసు

ఆత్మ: ఎంతో చెప్పు?

రవి: 200 మెగా వాట్స్.. అదికూడా ప్రతి గంటకొకసారి ఆఫ్ చెయ్యాలి.

ఆత్మ: మరి తెలిసినవాడివి.. పవర్ ఆన్ చేసి రెండు గంటలసేపు ఎక్కడికెళ్ళావు?

రవి: ఆసంగతి నీకెలా తెలిసింది?

ఆత్మ: చెప్పానుగా ఆత్మనని..!

రవి: అయితే నువ్వు మెషీన్‌లో వుండాలి కదా.. బయట ఏంచేస్తున్నావు?

ఆత్మ: ఎందుకంటే ఆ మెషీన్ చచ్చిపోయింది. మీ భాషలో చెప్పాలంటే బ్రేక్‌డౌన్ అయ్యింది. నువ్వు రెండుగంటలు హై వోల్టేజ్ కరెంటు పెట్టి చంపేశావు

రవి: కాని నేను అట్లా చాలాసార్లు చెశాను.. ఎప్పుడు ఇలా అవ్వలేదు

ఆత్మ: Just because you always did it that way, doesn't make it right.

రవి: నేనొప్పుకోను.. ఈ మెషిన్ గురించి నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు

ఆత్మ: అవునా? ఓర్విల్ రైట్ గురించి ఎప్పుడైనా విన్నావా?

రవి: ఆయనెవరు.. కొత్త మేనేజరా?

ఆత్మ: కాదు రవి, రైట్ బ్రదర్స్ అని వున్నార్లే వాళ్ళలో ఒకడు.

రవి: నాకు తెలుసు.. విమానం కనిపెట్టారు కదూ?

ఆత్మ: అవును.. 1908 సెప్టెంబరు 17న ప్రపంచంలోనే మొదటి విమాన ప్రమాదం జరిగి ఒకతను చనిపోయాడు. ఆ విమానానికి పైలెట్ ఎవరో తెలుసా?

రవి: తెలియదు

ఆత్మ: ఆ విమానాన్ని కనిపెట్టిన ఓర్విల్ రైట్

రవి: అంటే?

ఆత్మ: అంటే When safety fails, It doesn't matter if you are an expert.. Mishap happens.

రవి: ఎలాంటి విషయాలు మాకు సేఫ్టీ డ్రిల్ లో చాలా చెప్తారు.. నేను చాలా సార్లు సేఫ్టీ స్లోగన్ కాంటెస్ట్‌లో ప్రైజ్ కూడా తెచ్చుకున్నాను తెలుసా.

ఆత్మా:ఏదీ ఒకటి చెప్పు

రవి: Safety doesn't slow the job down but mishaps do

ఆత్మ: బాగుంది కాని.. మైటైనెన్స్ చేస్తే ప్రొడక్షన్ లేటౌతుందని ఆరు నెలలు నన్ను ఎందుకు అలా వదిలేసావు?

రవి: ఇదుగో సేఫ్టీ రూల్స్ మాకు తెలుసు.. చాలా వరకు అవన్నీ పాటిస్తాను తెలుసా?

ఆత్మ: చాలా వరకు పాటిస్తావా? అన్నీ ఎందుకు పాటించవు?

రవి: ఒక్కోసారి కుదరదు. జాబ్ ఇంపార్టెంట్ కదా?

ఆత్మా: మరి నువ్వు చేసేది పార్ట్‌టైం జాబా? ఫుల్ టైం జాబా?

రవి: ఫుల్ టైం జాబే..

ఆత్మ: మరి సేఫ్టీ్‌ని ఎందుకు పార్ట్‌టైం చేస్తున్నావు?

రవి: అంటే

ఆత్మ: Safety is a full time job, don't make it a part time practice.

రవి: బాబూ ఆత్మారాం.. నువ్వు చెప్పేవన్నీ ఇంపార్టెంటే నాకు తెలుసు. అయినా ప్రతి నిముషం ఇక్కడ ఎంత ఇంపార్టెంటో తెలుసా?

ఆత్మా: ఒక నిముషం ఇంపార్టెంటా? లైఫ్ ఇంపార్టెంటా?

రవి: లైఫే ఇంపార్టెంట్

ఆత్మ: So, It’s better to lose one minute in life... than to lose life in a minute. అంతేనా?

రవి: అవును అంతే..!

ఆత్మ: మరి ఒక్క పది నిముషాలకోసం నీ లైఫ్‌ని ఎందుకు పోగొట్టుకున్నావ్?

రవి: ఏంటి.. లైఫ్ పోగొట్టుకున్నానా? నేనేం పోగొట్టుకోలేదు.. చూడు నేను బాగానే వున్నాను..!!

ఆత్మ: అని నువ్వు అనుకుంటున్నావు.. ఆనందం నువ్వు అరిచినా ఎందుకు వినలేదు? ఎందుకు చూడలేదు? అసలు ఆత్మనైన నేను నీకెలా కనిపిస్తున్నాను? ఆలోచించావా?

రవి: అంటే?

ఆత్మ: నువ్వు చచ్చి ఇప్పటికే పది రోజులైంది

రవి: మరి ఇప్పటిదాకా నాకెందుకు తెలియలేదు?

ఆత్మ: (వెటకారంగా) ఇప్పటిదాకా నీ జాయనింగ్ ఫార్మాలిటీస్ నడుస్తున్నాయిలే..!

రవి: నో నేను నమ్మను.. నేను చావలేదు.. అయినా నేను ఎమంత పెద్ద తప్పు చేశానని చావాలి..??

ఆత్మ: నీకు గుర్తులేదా? పద అక్కడ ఆనందం గోవిందం నీ గురించే మాట్లాడుకుంటున్నారు చూద్దాం.

సీన్ టూ:

(ఆనందం, గోవిందం ఇద్దరూ టీ తాగుతుంటారు. ఆనందం టీ తాగకుండానే గ్లాసు పెట్టేస్తాడు)


ఆనందం: రవిగారు చనిపోయక నాకు టీ తాగబుద్దెయ్యట్లేదు.

గోవిందం: పోనీలేరా.. పోయినోళ్ళ కోసం టిఫిన్‌లు టీలు మానేస్తామా చెప్పు.

ఆనందం: అదికాదురా ఈ టీ వల్లేకదా ఆయన చనిపోయింది

గోవిందం: టీ వల్ల చనిపోయాడా అదేంటి రా?

ఆనందం: అవును, పాపం ఆయనకి టీ వేడిగా వుంటే తప్ప తాగ బుద్దెయ్యదు. ఆ రోజు నైట్ డ్యూటీలో మేమిద్దరమే వున్నాం. రవిగారు "క్యాంటీన్‌కి వెళ్ళి టీ తాగుదాం" అన్నాడు. నేను "ఎందుకు సార్ ఇక్కడికే తెస్తారు కదా" అన్నాను. ఆయన పాపం నవ్వి - "వురేయ్ ఆనదం.. క్యాంటీన్‌లో తయారు చేసిన టీ సెక్యూరిటి కి ఇచ్చి, టైం ఆఫీస్‌లో ఇచ్చి, ఎలక్ట్రికల్, సివిల్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి చల్లగా అయిపోతుంది.. చల్లారిన టీ తాగడం కంటే ఇంత విషం తాగటం మేలు. అందుకే నేను ఎప్పుడూ క్యాంటీన్ దగ్గరకే వెళ్ళి టీ దించగానే తాగేస్తాను" అన్నాడు.

గోవిందం: టీ అంటే అంత ఇష్టమేమోరా ఆయనకి

ఆనందం: అవునురా.. నాకు అసలు టీ ఎలా తయారుచెయ్యాలి, ఏ రకం ఆకులతో ఏ రకం టీ తయారౌతుంది అన్నీ చెప్పాడు పాపం. ఇంతలో లేటైపోయిందని, మైన్ దారిలో కాకుండా ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో నించి కన్వేయర్ బెల్ట్ల కిందనుంచి దూరుతూ వెళ్ళాడు. అక్కడ ఫోర్‌మెన్ అప్పుడే ఒక కునుకేశాడు. బెల్ట్లో ఏదో ప్రాబ్లం వుంది, టక్కున మెటీరియల్ అంతా ఆయన మీద పడిపోయింది.

గోవిందం: అయితే వేడి వేడి టీ అన్నాడే గాని తాగనే లేదన్నమాట.

ఆనందం: అదే మరి.. ఆఫీసులోనే వుంటే కనీసం చల్లటి టీ అయినా దక్కేది.. ఆయన ప్రాణమూ దక్కేది.

గోవిందం: సరేలేరా.. పద పోదాం.

(ఇద్దరూ లేచి వెళ్ళిపోతారు)

(ఆత్మారాం, రవి ఇద్దరు ప్రవేశిస్తారు)

రవి: ఇది అన్యాయం..!

ఆత్మ: ఏంటి అన్యాయం?

రవి: ఒక్క టీ కోసం వెళ్తే నన్ను చంపేశారు.. వాడెవడో నిద్రపోయాడు.. ఆ బెల్ట్‌లో ఏదో ప్రాబ్లం వుంది.. నేను రెండు సెకన్లలో దూరి వెళ్ళిపోయేవాణ్ణి.. సరిగ్గా అప్పుడే అది తెగాలా?

ఆత్మ: ప్రమాదాలు అలాగే జరుగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు.. అన్నీ కలిపితే పెద్ద డిజాస్టర్. They might be trivial things with least probability.. but you forgot that there is probability.


రవి: తప్పైపోయింది.. ఇంకెప్పుడు ఇలా నిర్లక్ష్యం చెయ్యను. నన్ను మళ్ళి బ్రతికించు. ప్లీజ్.. నన్ను బతికించు

(లైట్స్ డిం. వాయిస్ ఓవర్: నన్ను బతికించు.. ఇంకెప్పుడు నిర్లక్ష్యం చెయ్యను.. తప్పైపోయింది. నన్ను బతికించు..)


(లైట్స్ ఆన్..)

(రవి ఆయిల్ మీద కాలేసి పడిపోయున్నాడు. ఆనందం, గోవిందం కంగారుగా అతన్ని లేపుతున్నారు)

ఆనందం: సార్.. రవి గారు..!

రవి: (కళ్ళు మూసుకోనే) నన్ను బతికించండి.. తప్పైపోయింది.. నన్ను బతికించండి

గోవిందం: సార్.. మీరు బతికే వున్నారు..

రవి: (కళ్ళు తెరచి లేచి కూర్చొని) ఏమైంది? నాకేమైంది?

ఆనందం: రవి గారు.. మీరు ఇక్కడ ఆయిల్ మీద కాలేసి జారి పడ్డారు.. ఆ తరువాత ఏమిటో బతికించమంటూ..!!

రవి: ఓహ్.. స్పృహ తప్పానా..!! (అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు) ఆనందం..!! వెంటనే ఆ మెషీన్ ఆఫ్ చెయ్యి. గోవిందం ఇక్కడ ఆయిల్ క్లీన్ చెయ్యి. నేను ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళి బెల్ట్ ప్రాబ్లం చెక్ చేసి వస్తాను.

(రవి వెళ్ళబోతాడు)

ఆనందం: ఏంటిది సార్.. ఏమైంది మీకు?

రవి: (ఆగి వెనక్కి తిరిగి) రేపు సేఫ్టీ డేకి నాటకం వెద్దామనుకున్నాం కదా.. దానికి కథ దొరికింది. నాటకం పేరు - ఏ.బీ.సి

ఆనందం & గోవిందం: అంటే

రవి: Always Be Careful.
(ఒక మిత్రుడి కోరిక పై వర్క్‌ప్లేస్ సేఫ్టీ (workplace safety) అనే అంశంపై వ్రాసిన చిన్న నాటిక ఇది. ఎవరైనా ఎక్కడైనా ప్రదర్శించదలిస్తే నిరభ్యంతరంగా తీసుకోండి. తెలియజేస్తే మరీ సంతోషం..!!)

తాతలు ఆడిన ఆటలు: దాడి

దాడి ఆట తాతలే కాదు మనలాంటి మనుమలు/మనుమరాండ్రు కూడా ఆడే వుంటారు...!! అయితే నేను చెప్పబోయేది మరో రకం దాడి గురించి. తెలియని వారి సౌలభ్యం కోసం మనం ఆడిన ఆట:


ఇందులో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు. ఒకరు ఇంటూ గుర్తులు పెట్టాలి ఒకరు సున్నాలు చుట్టాలి. ముందు ఒకరు ఇంటూ పెట్టగానే రెండొవవారికి సున్నా చుట్టే అవకాశం వస్తుంది.. తరువాత మళ్ళీ ఇంటూ. అడ్డంగాగాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే గుర్తు ఎవరైతే వ్రాయగలుగుతారో వారే గెలిచినట్టు. ఇది చాలా సులభమైన ఆట. ఒక పది సార్లు ఆడితే అందులో వున్న కిటుకు అర్థమౌతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి ఆట డ్రాగా ముగుస్తుంది.

మన తాతలు ఆడిన దాడి అట్లా కాదు. అది చూడటానికి ఇలా వుంటుంది:


ఇద్దరు ఆటగాళ్ళకి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత పిక్కలో/గింజలో/రాళ్ళో ఇవ్వబడతాయి. (అయితే ఒక చింత పిక్కలు తీసుకుంటే ఒకరు గవ్వలు తీసుకోవాలి.. ఏ పావు ఎవరిదో తెలిసేట్టు). ఆట పైన చెప్పిన "చిన్న దాడి"లాగానే వుంటుంది. పైన బొమ్మలో ఎర్ర రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే వారికి ఒక పాయంటు వచ్చినట్లు.

అసలు గమ్మత్తంతా ఇక్కడే వుంది.. ఆ గెలిచిన వారు అవతలి వారి పావుని ఒకదాన్ని తీసేసుకోవాలి. ఇలా ఆడుతూ ఆడుతూ తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకి కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు..!

ఈ ఆట పటం కూడా బండలమీద ఆడి ఆడి.. పావుల్ని జరిపి జరిపి.. అనేక రచ్చబండలమీద ఎవరో చెక్కినట్లు నిలిచిపోయి కనపడుతుంది.

ఈ ఆట కూడా ప్రయత్నించి చూడండేం..!!

తాతలు ఆడిన ఆటలు: వామన గుంతలు

వామన గుంతలు అనే ఆట ఒకటుందని ఎంతమందికి తెలుసు చేతులెత్తండి..!! ఫర్లేదే చాలా మంది ఈ ఆట గురించి విన్నారన్నమాట. సరే అయితే ఈ ఆట ఎలా ఆడతారో చూడండి:


ఆడేవారు: ఇద్దరు


చూసేవారు: అక్కడ పట్టినంతమంది


కావాల్సినవి: 146 చింత పిక్కలు (అంటే ఏమిటి అని అడగకండి - మళ్ళీ చెప్తా - ఆపద్ధర్మానికి రాళ్ళు ఏరుకోండి) లేదా ఏవైనా గింజలు వాడండి డబ్బున్న మారాజులైతే రత్నాలు, మణులు వగైరాలు వాడచ్చు. వామన గుంతలు అనబడు ఒక పరికరం. అడ్డంగా ఏడు గుంతలతో రెండు వరసలుగా వుంటుంది. ఇదుగో ఇలా..

ఇలాంటి పరికరం లేకపోతే నేల మీద ఇలా గీసుకోనైనా ఆడచ్చు..!!

ఆట మొదలు పెడదామా?
ముందు కొన్ని నియమాలు:
1. తొండి చెయ్యకూడదు. ఏది చూపించు నీ జేబులో ముందే చింత పిక్కలు వుంచుకోలేదు కదా? (చింత పిక్కలు అంటే ఏమిటి అని అడిగేవారు రాళ్ళని చదువుకోండి)
2. ఆట మధ్యలో గుంతల్లో చింత పిక్కలు లేదా రాళ్ళు లెక్కపెట్టుకోవడాలు లేవు.
ఆట మొదలు:
మధ్యలో వున్న ఒక్క గుంత మినహాయించి మిగిలిన అన్ని గుంతల్లో రెండు వైపులా 12 చొప్పున పిక్కలు వేయండి. మధ్యలో మాత్రం రెండు పిక్కలే వెయ్యాలి. (6X12X2 + 2X2 = 146).
ఇప్పుడు ఎవరు ఆట మొదలు పెడతారో వాళ్ళు, తమ వైపు మధ్య గుంత కాకుండా వేరే ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని అపసవ్య దిశగా (anticlock) ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క పిక్క వేసుకుంటూ వెళ్ళాలి. తనవైపు చివరి గుంత తరువాత అవతలి వైపు గుంతల్లో కూడా అలాగే వేసుకుంటూ రావాలి. ఈ క్రింద చూపిన పటంలో ఎర్ర బాణం వున్న దగ్గర మొదలు పెడితే నీలం రంగు బాణం దిశగా సాగుతూ నల్ల రంగు బాణం దగ్గర ఆగుతాం అన్నమాట.
ఇలా ఎక్కడ చేతిలో పిక్కలు అయిపోతాయో ఆ గుంత పక్క గుంతలో పిక్కలు తీసుకోని మళ్ళీ అదే విధంగ తిప్పుతూ రావాలి. మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకోవడామే...!! ఇందాక చెప్పిన వుదాహరణలో అలాగే మూడు రౌండ్లు ఆడితే కింద చూపించినట్లు ఎర్ర బాణం దగ్గర ఆగుతాం. పక్కనే వున్న ఖాళీ గుంతలో చెయ్యిపెట్టి (దీన్నే నాకడమంటారు.. కాబట్టి ఆ గుంతని నాకి) దాని అవతలి గుంతలో పిక్కలు తీసేసుకోవాలి (అంటే కింద పచ్చ రంగు బాణం చూపించే గుంతలొ ఒక్క పిక్క అన్నమాట..). అది ఒక రౌండ్ అయ్యేసరికి మీరు సంపాదించిన ఆస్థి.
(ఆ.లో అ.: ఏ గుంతతో మొదలు పెడితే అత్యధిక పిక్కలు తీసుకోవచ్చో కొంచెం అనుభవం మీద తెలుస్తుంది. ఇందాక ఉదాహరణాలో చూడండి చుట్టూ 15 పిక్కలున్న గుంతలు వున్నా ఒక్క పిక్కే దక్కింది.)
ఇప్పుడు అవతలి వారికి అవకాశం. అవతలి తన వైపు వున్న ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని ఇందాకటి మాదిరిగానే వేసుకుంటూ, తిరిగి తిరిగి ఒక చోట నాకి పక్క గుంతలో పిక్కలు తీసుకుంటారు. ఎవరికి వచ్చిన పిక్కలు వారికే అన్నమాట.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత రెండు గుంతలు వరుస ఖాళీలు తగుల్తాయి. అప్పుడు నాకినా ప్రయోజనం లేదన్నమాట. మీ ఆట అక్కడ ఆగిపోయినట్లే. అవతలి వారికి అవకాశం.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత దాని పక్కన గుంతలో ఆరు పిక్కలు వుంటే మీరు ఆ ఆరు పిక్కలు తీసేసుకోవచ్చు. అయితే మీ ఆట ఆగిపోతుంది. అవతలి వారికి అవకాశం.
ఇలా ఆడగా ఆడగా అన్ని పిక్కలు అయిపోయి మొదటి ఇన్నింగ్స్ ముగుస్తుంది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టబోయే ముందు ఎవరి దగ్గర ఎన్ని పిక్కలున్నాయో లెక్కబెట్టుకోవాలి. ఎవరి దగ్గర తక్కువ వుంటే అవతలి వ్యక్తి కూడా అన్నే తీసి కలుపుతాడు. (అచ్చం మన క్యారమ్స్‌లో లాగా). మళ్ళీ మధ్యలో రెండు రెండు వెయ్యడం.. పన్నెండు పన్నెండు లెక్కన వేసుకుంటూ వెళ్ళడం. అప్పుడు చివర్లో వున్న గుంతలు మిగిలిపోతాయి. అవి ఆటలోనించి తొలగించబడతాయి (కింద చూడుడూ). ఇక మిగిలిన ఆట అంతా మామూలే. పిక్కలు తీసుకోవడం.. పంచడం.. నాకడం.. వగైరా.
(ఆ.లో అ.: ఏ గుంతలో ఎన్ని పిక్కలున్నాయి అనే విషయం ఎప్పటికప్పుడు లెక్క వేసుకోగలిగితే ఆట ఇట్టే గెలవచ్చు. అందుకే లెక్కపెట్టుకోడాలు లేవని ముందే చెప్పింది.. మనసులోనే లెక్కేసుకోవాలి. ఏంటి కష్టమా? అదే పేకాటైతే ఒక్క రౌండు అవ్వగానే ముక్కలన్నీ చెప్తావా? మరదే తాతలు ఆడిన ఆటలంటే..!! దీనికీ తెలివితేటలు, లెక్కలు వేయగలిగిన నేర్పు చాలా అవసరం)
ఈ ఆటకి దగ్గరగా వున్న గేం ఇక్కడ ఆడి చూడండి
మరో ఆట గురించి మరోసారి..!!

తాతలు ఆడిన ఆటలు: పులి జూదం

ఈ మధ్య ఏదో సందర్భంలో పూర్వపు ఆటల గురించి చర్చకు వచ్చినప్పుడు, చాలా ఆటలు మనం మర్చిపోయామేమో అని అనుమానం వచ్చింది. ఆ ఆలోచనే ఈ టపాలకు మూలం. ఇలాంటి ఆటలు గుర్తు చేసుకోవడానికి కొంత కారణం లేకపోలేదు...

1. ఇలాంటి ఆటలు మన పూర్వికులు ఆడారు.. కాబట్టి ఇవి మన చరిత్ర, సంస్కృతిలో భాగం. ఇలాంటివి మనం ఇప్పుడు ఆడకపోయినా ఫర్వాలేదు కనీసం తెలుసుకోవడంలో ఒక ఆనందం వుంటుంది.

2. ఈ ఆటలలో ప్రత్యేకత ఏమిటంటే ఇలాంటి ఆటలకి ప్రత్యేకమైన పరికరాలు అరుదుగా అవసరమౌతాయి. కాలాంతరంలో కొన్ని పరికరాలు (వామన గుంతలు లాంటివి) పుట్టుకొచ్చినా అవి లేకపోయినా ఆడేందుకు అనుకూలంగా వుంటాయి. కాబట్టి, తెలుసుకున్నవాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఆడతారని ఆశ.

3. ఈ ఆటల్ని గమనిస్తే, ఇందులో వస్తువులు, ఆటకు మూలమైన విషయం అప్పటి సామాజిక, వ్యవహారిక విషయాలకు సంబంధించే వుంటాయి. పులి జూదం చూడండి అది ఎక్కువగా గొడ్లు/మేకలు కాసుకునేవాళ్ళు ఏ బండమీదో కూర్చొని ఆడుకునేవాళ్ళు. వాళ్ళ ధ్యాసంతా ఆ మేకలు, వాటిని కొట్టేందుకు వచ్చే పులులమీద వుండటంతో ఆటలో వస్తువు కూడా అదే అయ్యిందనిపిస్తుంది. అంతే కాదు ఆ పులులని మేకలన్నీ కలిసి కట్టడి చేసి గెలవాలని ఒక చిత్రమైన ఆశ కూడా ఆటలో అంతర్భాగమైంది.

4. ఇక ఇప్పుడు పల్లెలనించి పట్టణాలకి, అక్కడి నుంచి విదేశాలకి వలసెళ్ళిన మనలాంటి వారి పిల్లలు ఇలాంటి ఆటలు తెలుసుకునేందుకు, ఆడుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది. మన బ్లాగ్మిత్రులలో సాఫ్ట్‌వేర్ నిపుణులు ఈ టపాలు చదివి ఇలాంటి ఆటలని కంప్యూటర్‌లో ఆడేందుకు వీలుగా తయారు చేస్తారేమోనని ఒక కోరిక...

వుపోద్ఘాతం పక్కన పెట్టి అసలు విషయం చెప్తాను - ఈ రోజు ఆట పులి జూదం.

ఆడేవారు: ఇద్దరు

కావాల్సినవి: పులులుగా నాలుగు రాళ్ళు (కొంచెం పెద్దవి), మేకలుగా 15 రాళ్ళు (చిన్నవి), కింద చూపినట్లు పులిజూదం పటం, ఆడటానికి కొంచెం నేర్పు.




(ఆటలో అరటిపండు: ఇక్కడ చూపిన పటం కాకుండా ఇంకా రెండు మూడు రకాలుగా కూడా గీయవచ్చు. ఆ పటం బట్టి మేకల సంఖ్య మారుతుంటుంది. పులులు మాత్రం ఎప్పుడూ నాలుగే.)

ఆడే విధానం:

ఇక్కడ పటంలో వున్నది ఒక కొండ అన్నమాట. కొండెక్కే భాగ్యం ఎప్పుడూ పులిదే. అందుకని ముందుగా నాలుగు పులులను ఇలా పేర్చాలి.


ఇవి వేటకి వచ్చినవికదా ఎప్పుడూ కలిసే బయలుదేరుతాయి. ఇక మేకలు కాసే ఆటగాడు ఒక్కొక్క మేకని ఒక్కొక్క కూడలిలో పెడతాడు. (ఆ లో అ: కూడలంటే మన కూడలి కాదు. రెండు లేదా అంత కన్నా ఎక్కువ గీతలు/దారులు కలిసే ప్రదేశమన్నమాట.) ఒక మేక పెట్టగానే, పులి కి కదిలేందుకు అవకాశం వస్తుంది. పులి ఎటు వైపైనా, గీత వెంబడే కదిలి తరువాతి కూడలి చేరాలి. మళ్ళీ మేక పెట్టేందుకు అవకాశం. ఇలా సాగుతూ వుంటుంది.

పులికి దగ్గరలో ఏదైనా కూడలిలో మేక వుంటే, పులి ఆ మేక మీద నుంచి దూకి ఆ మేకను తినేందుకు అవకాశం వస్తుంది. అంటే పులి-మేక-ఖాళి వుంటే పులి ఖాళిలోకి దూకి మేకను మింగేస్తుంది. ఆ మేకను తీసి పక్కన పెట్టాలి. పులి ఒకటి కంటే ఎక్కువ మేకలమీద నుంచి దూకలేదు. పులి పులి మీదనుంచి దూకలేదు.

మేకలు అన్నీ పేర్చిన తరువాత మేకలకు కదిలేందుకు అవకాశం వస్తుంది. ఇవి కూడా పులుల మాదిరిగానే కదులుతాయి. అయితే దూకడాలు వుండవు. మేకలు కదులుతూ పులికి కదిలేందుకు అవకాశం లేకుండా చేస్తే (పులులు కట్టడి అయిపోయినట్లు) అప్పుడు మేకలు గెలిచినట్లు. మేకలనన్నిటిని పులులు మింగేస్తే పులులు గెలిచినట్లు.

(ఆ.లో అ.: మేకలు పెడుతుండగానే పులులని తెలివిగా వూరిస్తూ, ఒకటి అరా మేకల్ని కావాలనే బలిపెడుతూ పులుల్ని మూలల్లో ఇరికించేసి చేతిలో మేకలుండగానే గెలిచేస్తారు కొంతమంది. ఒకోసారి కింద చూపినట్లు ఒకటే చోట మేకల్ని కిందకి పైకి జరుపుతూ, అక్కడికేదో ఆ మేక తన మరదలైనట్లు సరసమాడుతూ పులుల్ని విసిగించేసి వోడించేస్తారు కొందరు.)


ఏది ఏమైనా తెలివిగా ఆడాల్సిన ఆట. ఈ ఆటని పల్లెటూర్లలో ఇప్పటికీ ఎంతగా ఆడతారంటే ఏ రాములవారి గుడి అరుగు మీదో, రచ్చబండ మీదో రాళ్ళను జరిపి జరిపి గాట్లు పడిపోయి ఈ పులి జూదం పటం కనిపిస్తుంటుంది. నేను చూపించినది తమిళనాడులో అక్కడికి దగ్గరలో వున్న ప్రాంతాలలో ఆడే ఆట పటం. మరి కొన్ని ప్రాంతాలలో పటం ఇలాగ వుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆడి చూడండి..!!

మర్రినీడ - మల్లెతీగ (నా తొలి కథ)

(1995 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రైల్వే జూనియర్ కాలేజ్, హైదరాబాద్ వారు "ఈ పెద్దవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?" అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ.)

"బాబూ.. జ్యోతి బాబూ" దూరం నుండి వినపడింది తోటమాలి రాములు కేక.

"అబ్బా.. ఈ పెద్దవాళ్ళు మేం చెప్పేది విననే వినరు కదా.. నన్ను జ్యోతి అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ జ్యోతీ! జ్యోతీ!!" తనలోతానే అనుకున్నాడు జ్యోత్యిస్వరూప్.

'జ్యోతి బాబూ.. ఎక్కడున్నారు..? అయ్యగారు పిలుస్తున్నారు.." మళ్ళీ పిలిచాడు రాములు.

"అసలు నాకు జ్యోత్యిస్వరూప్ అని పేరెందుకు పెట్టారో.. రాఘవ, విజయ్ అంతా నన్ను అమ్మాయి.. అమ్మాయి.. అంటూ ఏడిపిస్తారు..." తనలోనే అనుకుంటూ వెనక్కి తిరిగాడు.

"ఇక్కడేం చేస్తున్నారు బాబూ... అక్కడ పెద్దయ్యగారు పిలుస్తుంటే.." అడిగాడూ అక్కడికొచ్చిన రాములు.

"ఇదుగో చూడు రాములు... ఇక్కడ మల్లె చెట్టు నాటాను. ఇది పెద్దదై ఇన్ని పూలు పూస్తుంది.." జ్యోత్యిస్వరూప్ అలా అంటూ చక్రాల్లంటి కళ్ళను గుండ్రంగా తిప్పాడు.

"భలేవారు బాబూ.. మర్రి చెట్టు నీడన మల్లెతీగేటి? అసలు మర్రినీడలో ఏ చెట్టూ పెరగదు బాబూ.. అట్టాంటిది మల్లెచెట్టు ఎట్టా పెరుగుతాది..?"

"ఎం కాదు.. బాగానే పెరుగుతుంది. నేను నాటాను కదా.."

"సర్లెండి.. పదండి.. మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు.." చెప్పాడు రాములు. జ్యోత్యిస్వరూప్ కి ఇక కదలక తప్పలేదు. ఇద్దరూ నడుచుకుంటూ తోటలోంచి బయటికొచ్చారు.

"ఎమిట్రాది.. ఎక్కడికెళ్ళావ్?" అడిగాడు చక్రపాణి జ్యోతిర్మయిని.

"ఏం లేదు డాడీ.. విజయ.. ఒక చెట్టు ఇచ్చాడు... దాన్ని మనతోటలో నాటుదామని వెళ్ళాను" అన్నాడు జ్యోతి భయంగా.

"షట్అప్.. డర్టీఫెలో... చేతులు చూడు ఎంత మురికిపట్టాయో.. కొత్తబట్టలు వేసుకోకురా అంటే వినవు.. ఇట్లా మట్టి పూసిపెడతావు... రాములూ వాణ్ణి తీసుకెళ్ళి చేతులు కాళ్ళు కడిగి పంపించు..." పురమాయించాడు చక్రపాణి. రాములు, జ్యోతి అక్కడ్నుంచి కదలగానే తన ఆఫీస్ ఫైల్స్‌లో తల పెట్టేసాడు.

"ఏంటీ రాములూ.. డాడీ ఎప్పుడూ ఇలా తిడుతూనే ఉంటారు..? నేను చెప్పేది అసలు విననే వినరు.." చేతులు కడుక్కుంటూ రాములుతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు జ్యోతి.


"పోన్లెండి బాబూ.. అయ్యగారు మీ మంచికే కదా చెప్తున్నారు.. ఆయన మాట కూడా ఇనండి బాబూ..." రాములు అన్నాడు. జ్యోతి ఎమి మాట్లాడలేదు.

"మీరింట్లోకెళ్ళండి బాబూ.. నేను తోటకి నీళ్ళేట్టుకోవాలి.." అన్నడు రాములు.

"నేనూ నీతో వస్తా రాములు... నేను నాటిన మల్లె చెట్టుకి నీళ్ళు పట్టాలి.."

"అయ్యో.. మీకెందుకు బాబూ...మళ్ళీ అయ్యగారు చూస్తే తిడతారు... మీరెళ్ళి తమ్ముడితో ఆడుకోండి.." అంటూ నచ్చజెప్పాడు రాములు

తమ్ముడు గుర్తుకురాగానే జ్యోతిర్మయి పరుగుపరుగున ఉయ్యాల దగ్గరకు చేరాడు. ఉయ్యాలలో ఉన్న తమ్ముణ్ణి చూసి మురిసిపోయాడు.

"తమ్ముడూ.. ఇంట్లో ఎవ్వరూ నా మాట వినట్లేదు.. అందుకే పెద్దైయ్యాక నువ్వు నేను ఒక జట్టు.. నేను ఈ రోజు ఒక చెట్టు నాటాను.. అది పూలు పూస్తుంది. అప్పుడు అ పూలతో మనిద్దరం ఆడుకుందాం... కానీ, ఆ చెట్టు పెరగదని రాములు అంటున్నాడు. డాడీ కూడా మట్టితో ఆడద్దని తిట్టారు.

"అందరూ నన్ను 'జ్యోతి' అనే పిలుస్తారు.. జ్యోతి ఏంటి అమ్మాయి పేరులాగా... అవును ఇంతకీ నీ పేరేంటి? నీకు తెలియదా? నీకు నేను పేరు పెడతాను.. ఊ.. నీ పేరు రాజా.. బావుందా?" అంటూ బుగ్గ చిదిమాడు.

"ఏం చేస్తున్నావురా అక్కడ?" వెంకనుంచి వినపడ్డ కేకతో ఉలిక్కిపడ్డాడు జ్యోతి. అతను పొందిన ఆనందమంతా వెనకే వున్న వాళ్ళ అమ్మను చూడగానే రెక్కలు కట్టుకోని ఎగిరిపోయింది.

"ఏం లేదు మమ్మీ.. తమ్ముడికి పేరు పెడుతున్నాను.. తమ్ముడి పేరు రాజా.. బావుందా?"

"రాజానా.. అదేం పేరురా? కుక్కపిల్ల పేరులాగా.." అన్నదామె. ఆ మాట వింటూనే జ్యోతిస్వరూప్ మనసు చివుక్కుమంది. మౌనంగా తలదించుకున్నాడు.

"సరేలే.. ఇంక నువ్వెళ్ళి చదువుకో.. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.. తక్కువ మర్కులు వచ్చాయంటే మీ డాడీ ఒళ్ళు వలిచేస్తారు.." కోపంగా అన్నది ఆమె. జ్యోతిస్వరూప్ మాట్లాడకుండా తన గదివైపు నడిచాడు.



***

గదిలోకి వెళ్ళి పుస్తకం ముందు పెట్టుకున్నాడు కానీ మనసులో ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి.. ఆ ఆలోచనలు అతన్ని చదవనివ్వడంలేదు.

"ఎందుకూ అందరూ నన్నర్థం చేసుకోరు... నన్ను జ్యోతి అని పిలవద్దంటే అలాగే పిలుస్తారు.. సిన్మాలు చూడకూడదట, మట్టిలో ఆడకూడదట, మర్రి చెట్టు నీడలో మల్లెతీగె పెరగదట..!

"నేనూ పెద్దవాణ్ణే అంటే అందరూ నవ్వుతారు... ఫ్రెండ్స్ అందరితో ఎక్స్‌కర్షన్ వెళ్తానంటే వద్దంటరు.. మా టీచర్ కూడా అంతే - హోంవర్క్ చెయ్యక పోతే తంతుంది.. ఆ కష్టమైన లెక్కలు డాడీని చెప్పమంటే చెప్పరు.. మమ్మి అసలు పట్టించుకోదు.. ఇంక ఎలా చెయ్యాలి.. ??

"తమ్ముడికి రాజా అనే పేరు బాలేదట.. కుక్కపిల్ల పేరులా వుందట.. మరి నా పేరు ఏం బాగుంది.." అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

ఆ నాటి నుంచి రోజూ ఇదే ప్రహసనం నడిచింది. పుస్తకం చేతిలోకి రాగానే ఆలోచనలు మొదలౌతాయి. అవి అయిపోయేసరికి నిద్రలో వుంటాడు. నిద్రలో కూడా అవే కలవరింతలు. కానీ వాటిని పట్టించుకునేవారెవరు..? ఆ ఖరీదైన గది గోడల్లోనే ఆగిపోయేవి.

ఈ ఆలోచనల్లోనే పరీక్షల సంగతి మర్చిపోయాడు. సరిగా వ్రాయలేకపోయాడు... పరీక్ష హాలులో కూడా అవే ఆలోచనలు, అనుమానాలు, భయాలు... పరీక్ష పాసౌతాడన్న నమ్మకమూ మిగల్లేదు.

"పరీక్ష ఫైలైతే..?" అమ్మో నాన్నగారు చంపేస్తారు.. మరి ఎలా..? పోనీ ఇక్కడ్నుంచి తప్పించుకొని పారిపోతే..!!?" ఆ ఆలోచన అతనికి నచ్చింది. ఇంటి నుంచి పారిపోయాడు..!!

చక్రపాణి తన పలుకుబడి ఉపయోగించి ఎంత వెతికించినా ఫలితం దక్కలేదు. కాలం గిర్రున తిరిగింది.. ఆరు సంవత్సరాల తరువాత -

"బాబూ రాజా.. ఈ మర్రి చెట్టు దగ్గర ఏం చేస్తున్నావురా..?" అడిగాడు చక్రపాణి.

"డాడీ ఇక్కడ మల్లె చెట్టు నాటుతున్నాను డాడీ.. పూలు పూయాలని.." చెప్పాడు రాజా.

"మర్రి నీడలోనా.. ఇక్కడ ఏ చెట్టూ పెరగదు బాబు..!" అన్నాడు అతను.

"ఎందుకు డాడీ..?"

"అంతేరా.. మర్రి నీడలో మల్లెతీగ పెరగదు.. పూలు పూయవలసిన చెట్టు ఎండిపోయి, వాడిపోతుంది... అది తెలుసుకోడానికి ఇంతకాలం పట్టింది." అంటూ రాజాని తన అక్కున చేర్చుకున్నాడు చక్రపాణి.

రాజాకి ఈ విషయాలేమి తెలియదు. కానీ తన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని మాత్రం తెలుసు.


- ( ౦ ) -

వారసుడొచ్చాడు (సరదా కథ)

అప్పటికే వయసు మీద పడుతోందని గ్రహించాడు పరమేశ్వర్. తన తండ్రి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని పెద్దది చేస్తూ, శాఖోప శాఖలుగా విస్తరిస్తూ కోట్ల ఆస్థి సంపాదించాడు అతను. భార్య ఉమాదేవి అనుకూలవతి, సహధర్మచారిణి. గణేష్, కుమార్ వారి సంతానం. ఆ ఇద్దరికి తను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే అంతటి ఆస్థికి మూలమైన తన తొలి వ్యాపారం ఎవరి చేతుల్లో పెట్టాలా అని చాలా ఆలోచించాడు. చివరికి తన అడ్వైజర్ త్రిలోక్ సంచారి చెపిన సలహా మేరకు తన పిల్లలిద్దరికీ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.



ఆ రోజు రానే వచ్చింది.



పరమేశ్వర్ భార్య ఉమాదేవితో కలిసి, వ్యాపారంలో కీలకమైన వ్యక్తులందరి సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు. త్రిలోక్ కూడా ఏమి జరగబోతోందా అని వుత్సుకతతో వున్నాడు. ఇద్దరు పిల్లలు అక్కడికి చేరుకున్నారు. వారిద్దరినీ చూసి పరమేశ్వర్ అన్నాడు -



"నాయనలారా.. నేను మునుపు చెప్పినట్టే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాను. అందుకు ముందుగా నా సమస్త వ్యాపారాలని మీ ఇద్దరి మధ్య పంచాలని నిర్ణయించుకున్నాను. అంతా సమానంగా పంచిన తరువాత అతి ముఖ్యమైన, నాకు ఎంతో ఇష్టమైన మన మూల వ్యాపారాన్ని ఎవరికి ఇవ్వాలి అన్న విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాను. అందుకే మీకొక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. మీకు సమ్మతమేనా?" అడిగాడు పరమేశ్వర్.



ఇద్దరు కొడుకులూ సరే అన్నారు. పరమేశ్వర్ ఆ పరీక్ష ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు -



"పరీక్ష చాలా చిన్నది. మీ ఇద్దరు వెంటనే బయలుదేరి ప్రపంచంలో వున్న అన్ని దేశాలు చుట్టేసి రావాలి. ఏడు సముద్రాలు, ఐదు ఖండాలు దాటి ఇక్కడికి ఎవరు ముందు చేరుకుంటారో వారికే ఆ బిజినెస్ మొత్తం ఇవ్వబడుతుంది" అన్నాడు.



ఆ మట వింటూనే కుమార్ ఎగిరి గంతేసాడు. కుమార్ ఇరవై ఐదొవ పుట్టినరోజు సంధర్భంగా పరమేశ్వర్ అతనికి ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనిచ్చాడు. అందుకే ఆ ఆనందం. ఆలోచన వచ్చినదే తడవుగా కుమార్ పరుగున వెళ్ళి చార్టేడ్ ఫ్లైట్‌లో తన ప్రయాణం మొదలెట్టాడు.



గణేష్ నిరుత్సాహ పడిపోయాడు. తన ఇరవయ్యొవ పుట్టినరోజుకి ఇలాగే ఫ్లైట్ కొనిస్తానంటే తనే వద్దన్నాడు. తనకేమో కార్లమీద మోజెక్కువ.. అందుకే డిజైనర్ రోల్స్ రాయల్ కారు కొనివ్వమన్నాడు. ఇలాంటి పరీక్ష రాబోతోందంటే తనూ ఫ్లైట్ కొనివ్వమనేవాడు. ఏమి చెయ్యాలో పాలుపోక గణేష్ త్రిలోక్ దగ్గరకు వెళ్ళాడు.



"చూశారా అంకుల్.. నాన్నకి కుమార్ అంటేనే ఇష్టం. అందుకే ఇలాంటి పరీక్ష పెట్టాడు. వాడు ప్రపంచమంతా చుట్టి వచ్చేసరికి నేను కారులో మన దేశం కూడా దాటలేను. ఇప్పుడేమిటి చెయ్యడం?" అంటూ వాపోయాడు.



త్రిలోక్ సంచారి "మీ నాన్నకు ఎలాంటి పక్షపాతం లేదు. ఆలోచించు నాయనా" అన్నాడు.



గణేష్ ఆలోచించించాడు. ఒక వుపాయం తట్టింది. అతని ముఖంలో ఆనందం తాండవించింది. వెంటనే తన గదిలోకి పరుగెత్తాడు. వై ఫై కనెక్ట్ అయ్యి వున్న తన లాప్ టాప్ తెచ్చాడు. తన తల్లి తండ్రి ముందు పెట్టి, ఎక్స్‌ప్లోరర్ తెరిచి, టైపు చేశాడు -



.



.



.



.



earth.google.com



తన తల్లి తండ్రికి భారత దేశం మొత్తం చూపించాడు. తరువాత పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఆఫ్రికా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా.. అలా అన్ని దేశాలు తిప్పి తిప్పి చివరకి భారత దేశానికి తీసుకువచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్‌కు తీసుకు వచ్చాడు. తన ఇంటి పైకి తీసుకొచ్చాడు.. ఆఖరికి త్రిలోక్ సంచారి బట్టతలతో సహా అన్నీ చూపించాడు.



దాంతో సంతోషించిన పరమేశ్వర్ ఆశీర్వదించి - "నాయనా మన వ్యాపారం చెయ్యడానికి ఇలాంటి సమయస్ఫూర్తి చాలా అవసరం. అందుకే ఆ వ్యాపారం నీకే ఇస్తాను." అని ప్రకటించాడు.



(సరదాగా వ్రాసిన కథేకాని ఎవరి నమ్మకాలనూ నొప్పించాలని కాదు.)

ఆవకాయ్.కాం లో నా కవిత

ప్రముఖ తెలుగు వెబ్‌సైటు ఆవకాయ్.కాం లో నా కవిత "ప్లాట్‌ఫారం నెంబర్ వన్..!!" ప్రచురించబడింది.
ఇక్కడ నొక్కి, చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ..!

ఒక విజయసారథి (కథ)

భారత సైనికుల తెగింపు చూసి సూర్యుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. సైన్యం ఏ మాత్రం జంకు లేకుండా ముందుకు సాగుతోంది. వాళ్ళలో ఎంతమంది జీవించి వుంటారో తెలియదు, ఎవరెవరు తిరిగి తమ బిడ్డలను చూస్తారో తెలియదు. కానీ, భారతదేశ చరిత్ర వారి పేర్లు చేర్చుకోవడానికి తహతహ లాడుతోందన్న వూహే వాళ్ళని నడిపిస్తోంది.
మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి ఒక మైదానం లాంటి ప్రదేశానికి చేరారు. వారి కమాండర్ మనోహర్‌సింగ్ టెంట్లు వేసుకోని ఆ రాత్రికి అక్కడే వుండాలని ఆర్డర్ వేశాడు. అంతా ఒక్కసారిగా కూలబడిపోయారు. టెంట్స్ వెయ్యడం పూర్తి చేసి తమ తెచ్చుకున్న ఫుడ్‌పేకెట్స్ విప్పదీశారు.


నలుగురు - ఐదుగురుగా కూర్చుని మాట్లాడుకుంటూ.. జోక్స్ వేసుకుంటూ భోజనాలు పూర్తిచేశారు. ఆరు గంటల తరువాత ఎవ్వరూ సిగరెట్స్ కానీ ఏ ఇతర 'వెలుగునిచ్చే' వాటిని వెలిగించకూడదని మనోహర్‌సింగ్ ఆర్డర్. ఆ వెలుతురు శత్రువులకు తమ వునికి తెలియజేస్తుందని అతడీ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ఆరుకు ముందే అన్ని పనులు కానించుకోని ఏడుగంటలకే అంతా నిద్రకు వుపక్రమించారు.

కానీ, ఆ రాత్రి వారికి నిద్రపోయే అవకాశమే లేకపోయింది. ఆ ప్రాంతంలో ఎలుకలు ఎక్కువగా వుండటంతో అవి రాత్రంతా అటూ - ఇటూ పరిగెడుతూ చప్పుడు చెయ్యసాగాయి. వాటిల్లో సైనికుల్లా మరీ ధైర్యమైనవి జవాన్ల కాళ్ళా మీద నుంచి, చేతులుమీద నుంచి పాకడం మొదలుపెట్టాయి.

మర్నాడు వుదయం అంతా నిద్ర కళ్ళతోనే లేచారు. అందరినోటా ఒకటే మాట - 'ఎలుకలు నిద్రపోనివ్వలేదని..' తమ పనులు పూర్తి కాగానే అంతా ఒకచోట చేరారు. మనోహర్‌సింగ్ వారందరిని వుద్దేశించి చిన్న ప్రసంగం చేశాడు.

"వీర జవానులారా.. మనకి ఇక్కడ్నుంచి ముందుకు కదలవద్దని బేస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. శత్రువులు మనవైపే వస్తున్నారు. ముందు ముందు ఎక్కడా ఇంత అనుకూలమైన ప్లేస్ మనకి దొరకదు. యుద్ధానికి అంతా సిద్ధం కండి. భారతదేశం తన పుత్రుల ధైర్యసాహసాలు చూడాలనుకుంటోంది. మీ భార్యా పిల్ల దగ్గరికి విజయపతాకం తిరిగి వెళ్ళేందుకు అవకాశం వచ్చింది. జై హింద్.." అన్నాడు హిందీలో.

ఆ తరువాత అంతా బంకర్లు సిద్ధం చేసుకోవడంలో వుండిపోయారు. యుద్ధానికి అంతా సిద్ధమౌతూ వుంది. ఆ రాత్రే శత్రువులు అక్కడికి చేరుకోవచ్చని అంచనా వేసుకున్నారు. చాలామంది తమ ఇళ్ళకు యుద్ధం మొదలౌతోందని, తాము విజయంతో తిరిగిరావాలని ప్రార్థనలు చేయమంటూ ఉత్తరాలు రాసారు.

ఆ రోజు రాత్రి ఎవరినీ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశాడు మనోహర్‌సింగ్. అయినా ముందురోజు రాత్రి ఎవరికీ నిద్రలేకపోవటంతో ఒక్కొక్కరే నెమ్మదిగా నిద్రలోకి జారుకోసాగారు. అంతలోనే ఏ ఎలుకో రావటం అరికాళ్ళ మీద గోళ్ళతో గీరడమో, మీదనుంచి దూకడమో చెయ్యడంతో మళ్ళీ నిద్రలేస్తున్నారు. ఆ రోజు రాత్రి కూడా ఎలుకలు వాళ్ళని నిద్రపోనివ్వలేదు. శత్రువులు తెల్లవారినా కూడా అటు వైపు రాలేదు.

మర్నాడు తెల్లవారుతూనే యుద్ధం మొదలైంది. శత్రువుల మీద కాదు.. ! ఎలుకల మీద..! జవానులంతా తమ రైఫిల్స్ వెనక్కి తిప్పి కనపడ్డ ఎలుకనల్లా కొట్టడం మొదలుపెట్టారు. యుద్ధప్రాతిపదిక మీద అంతా వాటి కోసం గాలించారు. అని దొరికినట్లే దొరికి పారిపోసాగాయి. వాళ్ళ దెబ్బలను తప్పుకుంటూ అటూ, ఇటూ తప్పించుకోజూసాయి. అయినా వాటిని వదల్లేదు, జవాన్లు. దాదాపు అన్ని ఎలుకల్ని చంపేసి టెంట్లకి దూరంగ ఒక గుంటలో పడేశారు.

"ఈ రోజు రాత్రికి హాయిగ నిద్రపోవచ్చు..!" అనుకున్నారు. ఎవరు ఎక్కువ ఎలుకల్ని చంపారో లెక్కలేసుకొని వాడికే పరమవీర చక్ర అంటూ సరదాగా నవ్వుకున్నారు.

ఆ రోజు రాత్రి కాళరాత్రిలా వుంది. నక్షత్రానికి, నక్షత్రం కనపడనంత చీకటిగా వుంది. జవాన్లలో దాదాపు సగంపైనా నిద్రపోయారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది శత్రువులు వస్తారేమోనని సగం నిద్రేపోతున్నారు. మనోహర్‌సింగ్ అప్పటికీ చాలామందిని తట్టిలేపుతూ అప్రమత్తంగా వుండమంటూ చెప్తున్నాడు.

సరిగ్గా రాత్రి మూడుగంటలకు ఎవరో జవాను సిగరెట్ వెలిగించాడు.. అదీ ఒక చెట్టు చాటునుండి..! కానీ అప్పటికే అది శత్రువుల కంటబడింది. చీకట్లో ఎవరూ లేరని ముందుకు వస్తున్న సైనికులు అ చిన్న వెలుగు చూసి అకడే ఆగిపోయారు. ఒక గంటలో సురక్షితమైన చోట్లలో అంతా సిద్ధమైపోయారు. తెల్లవారక ముందే కాల్పులు మొదలయ్యాయి.

భారత జవాన్లు 'యమపాశం బిగిసుకుందా' అన్నంత భయంతో నిద్రలేచారు. ఎలర్ట్ అయిపోయి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసరికే కొంతమంది నేలకొరిగారు. ఇక మొదలైంది బులెట్ల వర్షం..!

ఒక పోరాటం ఆరంభమైంది. దేశంకోసం ప్రతి సైనికుడు ప్రాణాలను సైతం లెక్క చెయ్యలేదు. మాతృభూమికోసం నేలకొరుగుతున్న వీరులను చూసి భూమి కంపించిపోతోంది. మనోహర్‌సింగ్ సైనికులని ఉత్తేజపరచడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆ రోజు సాయంత్రానికి భారత జవానులే అత్యధికంగా గాయపడ్డారు.

ఈ లోగా భారత జవాన్ల టెంట్లలో ఒక విచిత్రం జరిగింది. చాలావరకు దుప్పట్లు, బట్టలు ఎలుకలు కొట్టేసాయి. చాలవరకు బట్టలు పేలికలైపోయాయి. పేస్టు, సబ్బు వంటివి, ఫస్ట్ ఎయిడ్ మందులు ఎత్తుకెళ్ళిపోయాయి. అది చూసిన జవాన్లు విస్తుపోయారు. అన్నింటినీ చంపగా మిగిలినవి నాలుగో - అయిదో వుంటాయి.. అవి ఇంత పని చెయ్యగలిగాయంటే నమ్మశక్యంగా అనిపించలేదు జవాన్లకు. ఈ విషయంలో మనోహర్‌సింగ్‌కి కూడా ఎలాంటి మినహాయింపు లేకుండాపోయింది.

యుధంలో రెండు వైపుల సైనికులకి అప్పటికే ఒక విషయం అర్థమైంది. చనిపోగా మిగిలిన వారందరూ రాళ్ళాచాటున, చెట్లచాటున సురక్షితంగా వున్నారు.కాబట్టి అనవసరంగా కాల్పులు జరపడం ఆయుధ బలాన్ని వృధా చెయ్యడమే అనుకున్నారు. దాంతో కాల్పులు చాలా వరకు తగ్గిపోయాయి. శత్రువులు మాత్రం ముందుకు రావడానికే ప్రయత్నిస్తూనే వున్నారు.

ఆ పరిస్థితుల్లో మనోహర్‌సింగ్ ఒక సమావేశం ఏర్పాతు చేశాడు. సైనికులు తగ్గలేదన్న భ్రమ శత్రువులకు కల్పిస్తూ అక్కడక్కడ కొంతమంది జవాన్లను వుంచి, వారినే అటూ, ఇటూ కదులుతూ కల్పులు జరపమని ఆదేశించాడు.
మిగిలిన వారంతా మనోహర్‌సింగ్ టెంట్ వద్దకు చేరారు. అతను ఠీవిగా నిలబడ్డాడు. ఒక పక్క స్ట్రెచర్లమీద చనిపోయిన వీరజవాన్లు వున్నారు. మనోహర్ చేతిలో ఒక చచ్చిన ఎలుక వుంది. అతను చెప్పడం ప్రారంభించాడు -


"వీర జవానులారా.. మీరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మాతృభూమి కోసం శ్రమిస్తున్న మీ అందరికీ అభినందనలు. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ముఖ్యకారణం ఏమిటంటే మనం మన యుద్ధ వ్యూహాన్ని మార్చబోతున్నాం. అది ఎమిటనే ముంది ఒక చిన్న మాట -

"ఈ ఎలక చూడండి.. ఎంత చిన్న జంతువో..! ఇది ఎన్ని డ్రస్సుల్ని, ఎన్ని గుడ్డల్ని కొరికేసిందో.. ఎన్ని సబ్బులు ఎత్తుకెళ్ళిందో.. ఇదంతా ఎందుకు చేసింది..? మనం వచ్చిన మొదటి రెండు రోజులు చెయ్యనిది ఈ రోజు చేసింది. అంటే దానర్థం ఏమిటి..? మనం దీని తోటి జంతువుల్ని చపామన్న కోపం..! కసి..!

"తన ప్రాణలకు తెగించి.. చచ్చినా ఫర్వాలేదనుకొని ఇది మన దుస్తుల్ని పాడు చేసింది. ఎందుకు ? కేవలం తన సహచరుల్ని చంపామన్న పగతో..!

ఇంత చిన్న జంతువులోనే ఇంత పగ వుంటే... మనకెంత వుండాలి.. అదుగో చూడండి మన జవాన్లు.." ఒక్క క్షణం ఆగాడు మనోహర్‌సింగ్. అందరి దృష్టి స్ట్రెచర్లమీద పడింది.

"నిన్నటిదాకా మీతో మాట్లాడుతూ.. మీ తల్లిని, భార్యని, బిడ్డల్ని మర్చిపోయేలా మీతో కలిసిపోయిన స్నేహితులు.. ఇప్పుడు నిర్జీవంగా వున్నారు. ఆ శత్రువులే వీళ్ళను చంపారు.చూడండి..! మీకు పౌరుషం కలగడం లేదా? పగ రగలడం లేదా? పదండి వాళ్ళాని నాశనం చేద్దాం.. సమూలంగా అంతం చేద్దాం..! ఏమంటారు?"

"ఎస్ సార్.." అరిచాయి అన్ని గొంతులు.

దానికి తగ్గట్టుగానే మనం మన వ్యూహాన్ని మారుద్దాం. మనం ఇప్పుడు మూడు గ్రూపులుగా విడిపోదాం. శత్రువులను మూడూ వైపుల నుంచి ముట్టాడి చేద్దాం. గుర్తుంచుకోండి వీలైనంతవరకు వారి ఆయుధా బలాన్ని తగ్గించాలి.. ఈ వీర జవాన్లక్ ఆత్మశాంతినివ్వండి.. పదండి.. వందేమాతరం" అన్నాడు ఆవేశంగా.

"వందేమాతరం" అన్నాయి జవాన్లందరి కంఠాలు. ఒక్కసారి అంతా చచ్చిన ఎలుక వైపు చూసారు. వారిలో పౌరుషం రగులుకుంది. ఆనకట్ట తెగిన వరదనీరులా దూసుకుపోయారు. ప్రతి జవాను ఒక ప్రళయకాళ రుద్రుడయ్యాడు. ఇప్పుడు వారి ధ్యేయం ఒక్కటే. అదే శత్రువినాశనం. ప్రాణాలకు తెగించారు.. గాయపడ్డా ఆగడంలేదు. వారి తెగింపుకు శత్రువులు వెనకడుగు వేసారు. ఆ రోజు సాయంత్రానికి త్రివర్ణ పతాకం వినువీధుల్లో గర్వంగా తలయెత్తింది.

***

నెలలు గడిచాయి..! కమాండర్ మనోహర్‌సింగ్‌కు గ్యాలంటరీ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు సాయంత్రం జరిగిన అభినందన సభలో మనోహర్‌సింగ్ ప్రసంగించాడు -

"ఇది మన విజయం... భారతదేశ విజయం.. ఈ విజయానికి నిజమైన సారధి నేను కాదు... మీకు చెప్పినా నమ్మరు కానీ ఈ గెలుపుకి నిజమైన కారణం ఒక చచ్చిన ఎలుక. అవును చచ్చిన ఎలుక.." అంటూ జరిగింది చెబుతుంటే అంతా సభ్రమంగా వినసాగారు.

(విద్యుల్లత, సెప్టెంబరు 1995)

గ్రీష్మగీతం (ఫోటో కవిత)


గ్రీష్మ తాపం చుర్రెక్కుతుంటే

వసంతగానం ఆగిపోతుంది

భావుకుల గుండెల్లో

ప్రకృతి పలకరింతలూ ఆగిపోతాయి


నిజానికి,


ఎండల సూర్యుణ్ణి నీటి కుండల్లో బంధించి

ఇంటి గొంతు తడిపే ఆడవాళ్ళ చెమట కూడా

కవిత్వ దాహాన్ని తీరుస్తుంది

పాటగా ప్రవహిస్తుంది


నూర్పిడి రాపిడిలో

కుప్పలైన ధాన్యం పొట్టు

కుడితికుండ పక్కన బంగారమై పరుచుకుంటుంది

నెమరేసే ఆవు కంటికి అది అమృతభాండమే


ఆకు రాల్చిన చెట్టు

బట్టలిప్పి తత్వం పాడుతున్న వేమనలా

నిర్వేదంగా చూస్తూ

మేఘం గుండెల్లో వర్షపు చిల్లులు పెడుతుంటుంది


మర్రి చెట్టు ఎండిన ఆకులు

రాలకుండా కొమ్మను పట్టుకొని

ధ్వజస్థంభం గంటల్లా

వడగాలికి వేద మంత్రం పాడతాయి


మసీదు ముందరి చెట్టుకి ఆకులు విడాకులిస్తే

పీర్ల జెండాలు పచ్చటి ఆకులా వేషంకట్టి

అల్లాహొ అక్బర్ అంటూ

మైకు కట్టి రెపరెపలాడతాయి


మండుటెండకి సడలిపోతూ

ముసలమ్మకి తపన పుడితే

మజ్జిగిచ్చేందుకు తోడుగా

మనవడికి ఎండాకాలం సెలవలొస్తాయి


ఎండిపోయి బీటలుపడ్డ నిన్నటి మాగాణి కళ్ళు

తన మట్టితో పుట్టిన

చలివేంద్రం సేవలు చూసి

ఆనందభాష్పాలై తడుస్తాయి


ఖాళీ అయిన పిచుకగూడు మినహా

అస్తిత్వం తెలియని చెట్టుకి

వలస వెళ్ళిన పిట్టలు తిరిగొచ్చేదాకా

వెన్నెల రాత్రులే ఊరడింపులౌతాయి


(02.04.2009, మధ్యప్రదేశ్ అడవుల వెంట ప్రయాణం చేస్తూ..)



భక్తిని నిర్వచించే ఒక హిందీ రామ భజన - నా విశ్లేషణ

శ్రీరామనవమి సంధర్భంగా బ్లాగ్మిత్రులందరికి శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా ఏదైనా అధ్యాత్మిక విషయం వ్రాద్దామని అనుకుంటుండగా ఈ పాట గుర్తుకువచ్చింది.

"తేరా రాం జీ కరేంగే బేడా పార్.."

నేను గుజరాత్‌లో చదువుకుంటుండగా ఈ పాట నా కంప్యూటర్‌లో చేరింది. పాడిన వారి గళ మాధుర్యమో తెలిసీ తెలియని అర్థంలో తెలిసి వచ్చిన అంతరార్థమో కాని ఈ పాట నాకు చాలా నచ్చింది. ప్రతి పరీక్షకి ముంది నేను నా మిత్రులు కొంతమంది ఈ పాట వినడం ఆనవాయితీ చేసుకున్నాము. (మొదటి పాదం అర్థం: రాముడే నిన్ను నది దాటిస్తాడు అని.. అదే ధైర్యంతో పరీక్షకి వెళ్ళే వాళ్ళం.)

నెమ్మదిగా అర్థం తెలిసాక భక్తి నిర్వచనం అంటే ఈ పాటే అనిపించింది. ఆ పాట హిందీ సాహిత్యం, దాని తరువాత నా స్వేచ్చానువాదం చదవండి:


తేరా రాం జీ కరేంగే బేడా పార్
ఉదాసీ మన్ కాహెకో కరే

నయ్యా తేరి రాము హవాలే
లహెర్ లెహర్ ప్రభు ఆప్ సమ్హాలే
హరి ఆప్‌హీ ఉఠావే మేరా భార్ (ఉదాసీ మన్ కాహే కో కరే)

కాబు మే మఝధార్ ఉసీకే
హాతోమ్మే పట్వార్ వుసీకే
తేరీ హార్ భీ నహీ హై తేరి హార్ (ఉదాసీ..)

సహజ్ కినారా మిల్‌జాయేగా
పరమ సహారా మిల్‌జాయేగా
డోరీ సోప్‌కేతో దేఖ ఎక్ బార్ (ఉదాసీ..)

తూ నిర్దోష్, తుఝే భీ క్యా డర్ హై
పగ్ పగ్ పర్ సాథ్ ఈశ్వర్ హై
సచ్చీ భావనాసే కర్లే పుకార్ (ఉదాసీ..)

ఇది తెలుగు అనువాదం:

నిన్ను నది దాటించేది ఆ రాముడే
దిగులుపడ్డ మనసా భయమెందుకే

నువ్వున్న పడవ రాముడి సొంతమే
ఎగసిపడే ప్రతి అలా ఆ ప్రభు అధీనమే
నీ బరువును మోసేదీ హరియే అయితే (దిగులుపడ్డ మనసా భయమెందుకే)
ఈ నడిసముద్రం కూడా ఆయన సృష్టే
తెడ్డు వుండేది ఆయన చేతిలోనే
నీ ఓటమి కూడా నీది కానప్పుడు (దిగులుపడ్డ..)

పరమాత్మ సాయం తప్పక దొరుకుతుంది
నువ్వు సహజమైన వడ్డుకే చేరుకుంటావు
కానీ, నీ పడవ తాడు ఆయన చేతిలో పెడితేనే కదా (దిగులుపడ్డ..)

నువ్వు తప్పు చెయ్యనప్పుడు నీకు భయమెందుకు?
ప్రతి అడుగులో ఆ పరమాత్ముడు తోడుంటాడు
కానీ, నిర్మలమైన భావంతో ఆయన్ని పిలిస్తేనే కదా (దిగులుపడ్డ..)

నిజమైన భక్తికి నిదర్శనమైన పాట అని ఎందుకన్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యేవుంటుంది.

పడవలో కూర్చొని "మునిగిపోతున్నాను దేవుడా కాపాడు" అంటే అది భక్తి కాదు.. "నీళ్ళు నీవి, పడవనీది, తెడ్డు నీది, అందులో కూర్చొని వున్న నేను నీవాడిని.. అల వచ్చినా తుఫానొచ్చినా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది కదా. ఇంక నాకు భయమెందుకు" అనుకుంటే అదే అసలైన భక్తి. "నా భారం నీది" అని వదిలేస్తే అప్పుడు గెలిచినా వోడినా అది ఆ రాముడిదే కాని నాది కాదుకదా అంటూ చంత్కరించాడు కవి. ఇంకొంచెం లోతుగా గమనిస్తే ఆ నది భవసాగరమని అర్థమౌతుంది. అప్పుడు అలలు, పడవలు మన చుట్టు వుండే విషయాలౌతాయి. అన్నింటినీ రాముడికే వదిలేస్తే (నీట ముంచినా పాల ముంచినా.. అన్నట్టు) ఇక దేనికి నెరవాల్సిన పనిలేదు అని అర్థమౌతుంది.

ఇదే దృష్టితో మరి కొంచెం ముందుకెళ్తే గీతలో కర్మ సిద్ధాంతం దగ్గరకో నిష్కామక్రియ దగ్గరకో చేరుకుంటాము..!! అదంతా మీ ఆలోచనలకే వదిలేస్తూ ఇదుగో ఆ పాట ఇక్కడ వినండి:



(హరి ఓం శరణ్ అనే ప్రఖ్యాత భజన్ గాయకుడు పాడిన పాట ఇది. ఇక్కడ నొక్కి దిగుమతి చేసుకోవచ్చు. ఆయన గురించి వివరాలు
ఇక్కడ)

కథా జగత్‌లో శ్రీరామనవమి ప్రత్యేకం - నా కథ "రామా కనవేమిరా..!!"


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు


శ్రీరామనవమి సందర్భంగా కోడీహళ్లి మురళి మోహన్‌గారు నిర్వహించే కథా జగత్‌లో నా కథ "రామా కనవేమిరా" ప్రచురించారు. ఇవీ లింకులు:




శ్రీరామనవమికి వేసే పందిళ్ళు, జరిగే సంబరాల నానాటికి మాయమౌతున్న తీరుపై వ్రాసిన కథ ఇది. చదివి మీ అభిప్రాయాన్ని చెప్తారు కదూ..!!


శ్రీ రామ జయ రామ జయ జయ రామ