గ్రీష్మగీతం (ఫోటో కవిత)


గ్రీష్మ తాపం చుర్రెక్కుతుంటే

వసంతగానం ఆగిపోతుంది

భావుకుల గుండెల్లో

ప్రకృతి పలకరింతలూ ఆగిపోతాయి


నిజానికి,


ఎండల సూర్యుణ్ణి నీటి కుండల్లో బంధించి

ఇంటి గొంతు తడిపే ఆడవాళ్ళ చెమట కూడా

కవిత్వ దాహాన్ని తీరుస్తుంది

పాటగా ప్రవహిస్తుంది


నూర్పిడి రాపిడిలో

కుప్పలైన ధాన్యం పొట్టు

కుడితికుండ పక్కన బంగారమై పరుచుకుంటుంది

నెమరేసే ఆవు కంటికి అది అమృతభాండమే


ఆకు రాల్చిన చెట్టు

బట్టలిప్పి తత్వం పాడుతున్న వేమనలా

నిర్వేదంగా చూస్తూ

మేఘం గుండెల్లో వర్షపు చిల్లులు పెడుతుంటుంది


మర్రి చెట్టు ఎండిన ఆకులు

రాలకుండా కొమ్మను పట్టుకొని

ధ్వజస్థంభం గంటల్లా

వడగాలికి వేద మంత్రం పాడతాయి


మసీదు ముందరి చెట్టుకి ఆకులు విడాకులిస్తే

పీర్ల జెండాలు పచ్చటి ఆకులా వేషంకట్టి

అల్లాహొ అక్బర్ అంటూ

మైకు కట్టి రెపరెపలాడతాయి


మండుటెండకి సడలిపోతూ

ముసలమ్మకి తపన పుడితే

మజ్జిగిచ్చేందుకు తోడుగా

మనవడికి ఎండాకాలం సెలవలొస్తాయి


ఎండిపోయి బీటలుపడ్డ నిన్నటి మాగాణి కళ్ళు

తన మట్టితో పుట్టిన

చలివేంద్రం సేవలు చూసి

ఆనందభాష్పాలై తడుస్తాయి


ఖాళీ అయిన పిచుకగూడు మినహా

అస్తిత్వం తెలియని చెట్టుకి

వలస వెళ్ళిన పిట్టలు తిరిగొచ్చేదాకా

వెన్నెల రాత్రులే ఊరడింపులౌతాయి


(02.04.2009, మధ్యప్రదేశ్ అడవుల వెంట ప్రయాణం చేస్తూ..)Category:

3 వ్యాఖ్య(లు):

చైతన్య చెప్పారు...

ఫొటోస్ మాత్రం సూపరండి... నాకు చచ్చేంత ఇష్టం bare trees అంటే....... వాటిలో ఏదో తెలియని ఆకర్షణ ఉందనిపిస్తుంది...
ఎప్పుడూ కప్పుకుని ఉండే ఆకులన్నీ రాల్చేసి వాటి అసలు రూపం చుపిస్తునట్టు అనిపిస్తుంది...

రవి చెప్పారు...

సత్యప్రసాద్ గారు,

చాలా బావుంది.

"మసీదు ముందరి చెట్టుకి ఆకులు విడాకులిస్తే

పీర్ల జెండాలు పచ్చటి ఆకులా వేషంకట్టి"...

వూళ్ళో మా ఇంటి దగ్గరే మసీదు, ముందర చెట్టు, పీర్ల జెండాలు. అచ్చు కళ్ళకు కట్టినట్టు ఉంది. ఇన్ని యేళ్ళ నుండీ చూస్తున్న దాన్ని కొత్తగా చూపించారు!

భాస్కర్ రామరాజు చెప్పారు...

మసీదు ముందరి చెట్టుకి ఆకులు విడాకులిస్తే

పీర్ల జెండాలు పచ్చటి ఆకులా వేషంకట్టి


-అత్భుతం