దాడి ఆట తాతలే కాదు మనలాంటి మనుమలు/మనుమరాండ్రు కూడా ఆడే వుంటారు...!! అయితే నేను చెప్పబోయేది మరో రకం దాడి గురించి. తెలియని వారి సౌలభ్యం కోసం మనం ఆడిన ఆట:

ఇందులో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు. ఒకరు ఇంటూ గుర్తులు పెట్టాలి ఒకరు సున్నాలు చుట్టాలి. ముందు ఒకరు ఇంటూ పెట్టగానే రెండొవవారికి సున్నా చుట్టే అవకాశం వస్తుంది.. తరువాత మళ్ళీ ఇంటూ. అడ్డంగాగాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే గుర్తు ఎవరైతే వ్రాయగలుగుతారో వారే గెలిచినట్టు. ఇది చాలా సులభమైన ఆట. ఒక పది సార్లు ఆడితే అందులో వున్న కిటుకు అర్థమౌతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి ఆట డ్రాగా ముగుస్తుంది.
మన తాతలు ఆడిన దాడి అట్లా కాదు. అది చూడటానికి ఇలా వుంటుంది:

ఇద్దరు ఆటగాళ్ళకి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత పిక్కలో/గింజలో/రాళ్ళో ఇవ్వబడతాయి. (అయితే ఒక చింత పిక్కలు తీసుకుంటే ఒకరు గవ్వలు తీసుకోవాలి.. ఏ పావు ఎవరిదో తెలిసేట్టు). ఆట పైన చెప్పిన "చిన్న దాడి"లాగానే వుంటుంది. పైన బొమ్మలో ఎర్ర రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే వారికి ఒక పాయంటు వచ్చినట్లు.
అసలు గమ్మత్తంతా ఇక్కడే వుంది.. ఆ గెలిచిన వారు అవతలి వారి పావుని ఒకదాన్ని తీసేసుకోవాలి. ఇలా ఆడుతూ ఆడుతూ తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకి కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు..!
ఈ ఆట పటం కూడా బండలమీద ఆడి ఆడి.. పావుల్ని జరిపి జరిపి.. అనేక రచ్చబండలమీద ఎవరో చెక్కినట్లు నిలిచిపోయి కనపడుతుంది.
ఈ ఆట కూడా ప్రయత్నించి చూడండేం..!!
2 వ్యాఖ్య(లు):
సత్యప్రసాద్ గారు చిన్నప్పుడు ఆడి, ఇప్పుడు ఆ "ఆట పేర్లు" కూడా మర్చిపోయే సందర్భంలో మళ్ళీ మీ బ్లాగు అన్నీ గుర్తు చేసింది.ధన్యవాదాలు.
meeru chppina modati aata (chinna daadi) ni emglish lo tic-tac-toe antaaru....
కామెంట్‌ను పోస్ట్ చేయండి