మర్రినీడ - మల్లెతీగ (నా తొలి కథ)

(1995 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రైల్వే జూనియర్ కాలేజ్, హైదరాబాద్ వారు "ఈ పెద్దవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?" అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ.)

"బాబూ.. జ్యోతి బాబూ" దూరం నుండి వినపడింది తోటమాలి రాములు కేక.

"అబ్బా.. ఈ పెద్దవాళ్ళు మేం చెప్పేది విననే వినరు కదా.. నన్ను జ్యోతి అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ జ్యోతీ! జ్యోతీ!!" తనలోతానే అనుకున్నాడు జ్యోత్యిస్వరూప్.

'జ్యోతి బాబూ.. ఎక్కడున్నారు..? అయ్యగారు పిలుస్తున్నారు.." మళ్ళీ పిలిచాడు రాములు.

"అసలు నాకు జ్యోత్యిస్వరూప్ అని పేరెందుకు పెట్టారో.. రాఘవ, విజయ్ అంతా నన్ను అమ్మాయి.. అమ్మాయి.. అంటూ ఏడిపిస్తారు..." తనలోనే అనుకుంటూ వెనక్కి తిరిగాడు.

"ఇక్కడేం చేస్తున్నారు బాబూ... అక్కడ పెద్దయ్యగారు పిలుస్తుంటే.." అడిగాడూ అక్కడికొచ్చిన రాములు.

"ఇదుగో చూడు రాములు... ఇక్కడ మల్లె చెట్టు నాటాను. ఇది పెద్దదై ఇన్ని పూలు పూస్తుంది.." జ్యోత్యిస్వరూప్ అలా అంటూ చక్రాల్లంటి కళ్ళను గుండ్రంగా తిప్పాడు.

"భలేవారు బాబూ.. మర్రి చెట్టు నీడన మల్లెతీగేటి? అసలు మర్రినీడలో ఏ చెట్టూ పెరగదు బాబూ.. అట్టాంటిది మల్లెచెట్టు ఎట్టా పెరుగుతాది..?"

"ఎం కాదు.. బాగానే పెరుగుతుంది. నేను నాటాను కదా.."

"సర్లెండి.. పదండి.. మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు.." చెప్పాడు రాములు. జ్యోత్యిస్వరూప్ కి ఇక కదలక తప్పలేదు. ఇద్దరూ నడుచుకుంటూ తోటలోంచి బయటికొచ్చారు.

"ఎమిట్రాది.. ఎక్కడికెళ్ళావ్?" అడిగాడు చక్రపాణి జ్యోతిర్మయిని.

"ఏం లేదు డాడీ.. విజయ.. ఒక చెట్టు ఇచ్చాడు... దాన్ని మనతోటలో నాటుదామని వెళ్ళాను" అన్నాడు జ్యోతి భయంగా.

"షట్అప్.. డర్టీఫెలో... చేతులు చూడు ఎంత మురికిపట్టాయో.. కొత్తబట్టలు వేసుకోకురా అంటే వినవు.. ఇట్లా మట్టి పూసిపెడతావు... రాములూ వాణ్ణి తీసుకెళ్ళి చేతులు కాళ్ళు కడిగి పంపించు..." పురమాయించాడు చక్రపాణి. రాములు, జ్యోతి అక్కడ్నుంచి కదలగానే తన ఆఫీస్ ఫైల్స్‌లో తల పెట్టేసాడు.

"ఏంటీ రాములూ.. డాడీ ఎప్పుడూ ఇలా తిడుతూనే ఉంటారు..? నేను చెప్పేది అసలు విననే వినరు.." చేతులు కడుక్కుంటూ రాములుతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు జ్యోతి.


"పోన్లెండి బాబూ.. అయ్యగారు మీ మంచికే కదా చెప్తున్నారు.. ఆయన మాట కూడా ఇనండి బాబూ..." రాములు అన్నాడు. జ్యోతి ఎమి మాట్లాడలేదు.

"మీరింట్లోకెళ్ళండి బాబూ.. నేను తోటకి నీళ్ళేట్టుకోవాలి.." అన్నడు రాములు.

"నేనూ నీతో వస్తా రాములు... నేను నాటిన మల్లె చెట్టుకి నీళ్ళు పట్టాలి.."

"అయ్యో.. మీకెందుకు బాబూ...మళ్ళీ అయ్యగారు చూస్తే తిడతారు... మీరెళ్ళి తమ్ముడితో ఆడుకోండి.." అంటూ నచ్చజెప్పాడు రాములు

తమ్ముడు గుర్తుకురాగానే జ్యోతిర్మయి పరుగుపరుగున ఉయ్యాల దగ్గరకు చేరాడు. ఉయ్యాలలో ఉన్న తమ్ముణ్ణి చూసి మురిసిపోయాడు.

"తమ్ముడూ.. ఇంట్లో ఎవ్వరూ నా మాట వినట్లేదు.. అందుకే పెద్దైయ్యాక నువ్వు నేను ఒక జట్టు.. నేను ఈ రోజు ఒక చెట్టు నాటాను.. అది పూలు పూస్తుంది. అప్పుడు అ పూలతో మనిద్దరం ఆడుకుందాం... కానీ, ఆ చెట్టు పెరగదని రాములు అంటున్నాడు. డాడీ కూడా మట్టితో ఆడద్దని తిట్టారు.

"అందరూ నన్ను 'జ్యోతి' అనే పిలుస్తారు.. జ్యోతి ఏంటి అమ్మాయి పేరులాగా... అవును ఇంతకీ నీ పేరేంటి? నీకు తెలియదా? నీకు నేను పేరు పెడతాను.. ఊ.. నీ పేరు రాజా.. బావుందా?" అంటూ బుగ్గ చిదిమాడు.

"ఏం చేస్తున్నావురా అక్కడ?" వెంకనుంచి వినపడ్డ కేకతో ఉలిక్కిపడ్డాడు జ్యోతి. అతను పొందిన ఆనందమంతా వెనకే వున్న వాళ్ళ అమ్మను చూడగానే రెక్కలు కట్టుకోని ఎగిరిపోయింది.

"ఏం లేదు మమ్మీ.. తమ్ముడికి పేరు పెడుతున్నాను.. తమ్ముడి పేరు రాజా.. బావుందా?"

"రాజానా.. అదేం పేరురా? కుక్కపిల్ల పేరులాగా.." అన్నదామె. ఆ మాట వింటూనే జ్యోతిస్వరూప్ మనసు చివుక్కుమంది. మౌనంగా తలదించుకున్నాడు.

"సరేలే.. ఇంక నువ్వెళ్ళి చదువుకో.. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.. తక్కువ మర్కులు వచ్చాయంటే మీ డాడీ ఒళ్ళు వలిచేస్తారు.." కోపంగా అన్నది ఆమె. జ్యోతిస్వరూప్ మాట్లాడకుండా తన గదివైపు నడిచాడు.



***

గదిలోకి వెళ్ళి పుస్తకం ముందు పెట్టుకున్నాడు కానీ మనసులో ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి.. ఆ ఆలోచనలు అతన్ని చదవనివ్వడంలేదు.

"ఎందుకూ అందరూ నన్నర్థం చేసుకోరు... నన్ను జ్యోతి అని పిలవద్దంటే అలాగే పిలుస్తారు.. సిన్మాలు చూడకూడదట, మట్టిలో ఆడకూడదట, మర్రి చెట్టు నీడలో మల్లెతీగె పెరగదట..!

"నేనూ పెద్దవాణ్ణే అంటే అందరూ నవ్వుతారు... ఫ్రెండ్స్ అందరితో ఎక్స్‌కర్షన్ వెళ్తానంటే వద్దంటరు.. మా టీచర్ కూడా అంతే - హోంవర్క్ చెయ్యక పోతే తంతుంది.. ఆ కష్టమైన లెక్కలు డాడీని చెప్పమంటే చెప్పరు.. మమ్మి అసలు పట్టించుకోదు.. ఇంక ఎలా చెయ్యాలి.. ??

"తమ్ముడికి రాజా అనే పేరు బాలేదట.. కుక్కపిల్ల పేరులా వుందట.. మరి నా పేరు ఏం బాగుంది.." అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

ఆ నాటి నుంచి రోజూ ఇదే ప్రహసనం నడిచింది. పుస్తకం చేతిలోకి రాగానే ఆలోచనలు మొదలౌతాయి. అవి అయిపోయేసరికి నిద్రలో వుంటాడు. నిద్రలో కూడా అవే కలవరింతలు. కానీ వాటిని పట్టించుకునేవారెవరు..? ఆ ఖరీదైన గది గోడల్లోనే ఆగిపోయేవి.

ఈ ఆలోచనల్లోనే పరీక్షల సంగతి మర్చిపోయాడు. సరిగా వ్రాయలేకపోయాడు... పరీక్ష హాలులో కూడా అవే ఆలోచనలు, అనుమానాలు, భయాలు... పరీక్ష పాసౌతాడన్న నమ్మకమూ మిగల్లేదు.

"పరీక్ష ఫైలైతే..?" అమ్మో నాన్నగారు చంపేస్తారు.. మరి ఎలా..? పోనీ ఇక్కడ్నుంచి తప్పించుకొని పారిపోతే..!!?" ఆ ఆలోచన అతనికి నచ్చింది. ఇంటి నుంచి పారిపోయాడు..!!

చక్రపాణి తన పలుకుబడి ఉపయోగించి ఎంత వెతికించినా ఫలితం దక్కలేదు. కాలం గిర్రున తిరిగింది.. ఆరు సంవత్సరాల తరువాత -

"బాబూ రాజా.. ఈ మర్రి చెట్టు దగ్గర ఏం చేస్తున్నావురా..?" అడిగాడు చక్రపాణి.

"డాడీ ఇక్కడ మల్లె చెట్టు నాటుతున్నాను డాడీ.. పూలు పూయాలని.." చెప్పాడు రాజా.

"మర్రి నీడలోనా.. ఇక్కడ ఏ చెట్టూ పెరగదు బాబు..!" అన్నాడు అతను.

"ఎందుకు డాడీ..?"

"అంతేరా.. మర్రి నీడలో మల్లెతీగ పెరగదు.. పూలు పూయవలసిన చెట్టు ఎండిపోయి, వాడిపోతుంది... అది తెలుసుకోడానికి ఇంతకాలం పట్టింది." అంటూ రాజాని తన అక్కున చేర్చుకున్నాడు చక్రపాణి.

రాజాకి ఈ విషయాలేమి తెలియదు. కానీ తన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని మాత్రం తెలుసు.


- ( ౦ ) -
Category:

3 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

కథ నాకు నచ్చిందండీ. ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లవాడిపై అంత కోపమెందుకో మాత్రం అర్థం కాలేదు. తండ్రిది అటువంటి స్వభావమని సరిపెట్టుకుందామన్నా, తల్లి అంత కటువుగా ఉండటం సబబనిపించలేదు. ( అలా ఉన్నవాళ్లు లోకంలో ఉన్నారు. ఇది కథే కనుక ) ఒక ఉచిత సలహా : కార్పొరేట్ బళ్లలోని పిల్లల గురించి రాస్తే బావుంటుందేమో ఆలోచించండి. నాటను అనే వచ్చింది అన్నిచోట్లా.

Unknown చెప్పారు...

అరుణగారు,

మీ వ్యాఖ్యకు నెనర్లు. నిజమేనండి తల్లీ తండ్రి ఇద్దరిని విలన్స్ చెయ్యడం అంత బాలేదు కానీ, ఈ కథ వ్రాసే సరికి నాకు పాత్ర పోషణ అలోచించే వయసు లేకపోయింది (అప్పుడు 16 యేళ్ళు నాకు).. అందునా తొలి కథ కదా. పైగా టాపిక్‌లో "పెద్దవాళ్ళు" అని కనపడేసరికి బుర్రలో కటువుగా వ్యవహరించే తల్లిదండ్రులు వచ్చారేమో..!! కార్పొరేట్ స్కూళ్ళ పిల్లలు కూడా పెద్ద కథా వస్తువే. ప్రయత్నిద్దాం.

ఈ సారి మొక్కలు సరిగా "నాటాను". నెనర్లు.

Kathi Mahesh Kumar చెప్పారు...

ఇచ్చిన టాపిక్ నెగిటివ్ కాబట్టి కథ నెగెటివ్ గా ఉండటం నాకైతే నచ్చించి.