వామన గుంతలు అనే ఆట ఒకటుందని ఎంతమందికి తెలుసు చేతులెత్తండి..!! ఫర్లేదే చాలా మంది ఈ ఆట గురించి విన్నారన్నమాట. సరే అయితే ఈ ఆట ఎలా ఆడతారో చూడండి:
ఆడేవారు: ఇద్దరు
చూసేవారు: అక్కడ పట్టినంతమంది
కావాల్సినవి: 146 చింత పిక్కలు (అంటే ఏమిటి అని అడగకండి - మళ్ళీ చెప్తా - ఆపద్ధర్మానికి రాళ్ళు ఏరుకోండి) లేదా ఏవైనా గింజలు వాడండి డబ్బున్న మారాజులైతే రత్నాలు, మణులు వగైరాలు వాడచ్చు. వామన గుంతలు అనబడు ఒక పరికరం. అడ్డంగా ఏడు గుంతలతో రెండు వరసలుగా వుంటుంది. ఇదుగో ఇలా..
ఇలాంటి పరికరం లేకపోతే నేల మీద ఇలా గీసుకోనైనా ఆడచ్చు..!!
ఆట మొదలు పెడదామా?
ముందు కొన్ని నియమాలు:
1. తొండి చెయ్యకూడదు. ఏది చూపించు నీ జేబులో ముందే చింత పిక్కలు వుంచుకోలేదు కదా? (చింత పిక్కలు అంటే ఏమిటి అని అడిగేవారు రాళ్ళని చదువుకోండి)
2. ఆట మధ్యలో గుంతల్లో చింత పిక్కలు లేదా రాళ్ళు లెక్కపెట్టుకోవడాలు లేవు.
ఆట మొదలు:
మధ్యలో వున్న ఒక్క గుంత మినహాయించి మిగిలిన అన్ని గుంతల్లో రెండు వైపులా 12 చొప్పున పిక్కలు వేయండి. మధ్యలో మాత్రం రెండు పిక్కలే వెయ్యాలి. (6X12X2 + 2X2 = 146).
ఇప్పుడు ఎవరు ఆట మొదలు పెడతారో వాళ్ళు, తమ వైపు మధ్య గుంత కాకుండా వేరే ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని అపసవ్య దిశగా (anticlock) ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క పిక్క వేసుకుంటూ వెళ్ళాలి. తనవైపు చివరి గుంత తరువాత అవతలి వైపు గుంతల్లో కూడా అలాగే వేసుకుంటూ రావాలి. ఈ క్రింద చూపిన పటంలో ఎర్ర బాణం వున్న దగ్గర మొదలు పెడితే నీలం రంగు బాణం దిశగా సాగుతూ నల్ల రంగు బాణం దగ్గర ఆగుతాం అన్నమాట.
ఇలా ఎక్కడ చేతిలో పిక్కలు అయిపోతాయో ఆ గుంత పక్క గుంతలో పిక్కలు తీసుకోని మళ్ళీ అదే విధంగ తిప్పుతూ రావాలి. మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకోవడామే...!! ఇందాక చెప్పిన వుదాహరణలో అలాగే మూడు రౌండ్లు ఆడితే కింద చూపించినట్లు ఎర్ర బాణం దగ్గర ఆగుతాం. పక్కనే వున్న ఖాళీ గుంతలో చెయ్యిపెట్టి (దీన్నే నాకడమంటారు.. కాబట్టి ఆ గుంతని నాకి) దాని అవతలి గుంతలో పిక్కలు తీసేసుకోవాలి (అంటే కింద పచ్చ రంగు బాణం చూపించే గుంతలొ ఒక్క పిక్క అన్నమాట..). అది ఒక రౌండ్ అయ్యేసరికి మీరు సంపాదించిన ఆస్థి.
(ఆ.లో అ.: ఏ గుంతతో మొదలు పెడితే అత్యధిక పిక్కలు తీసుకోవచ్చో కొంచెం అనుభవం మీద తెలుస్తుంది. ఇందాక ఉదాహరణాలో చూడండి చుట్టూ 15 పిక్కలున్న గుంతలు వున్నా ఒక్క పిక్కే దక్కింది.)
ఇప్పుడు అవతలి వారికి అవకాశం. అవతలి తన వైపు వున్న ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని ఇందాకటి మాదిరిగానే వేసుకుంటూ, తిరిగి తిరిగి ఒక చోట నాకి పక్క గుంతలో పిక్కలు తీసుకుంటారు. ఎవరికి వచ్చిన పిక్కలు వారికే అన్నమాట.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత రెండు గుంతలు వరుస ఖాళీలు తగుల్తాయి. అప్పుడు నాకినా ప్రయోజనం లేదన్నమాట. మీ ఆట అక్కడ ఆగిపోయినట్లే. అవతలి వారికి అవకాశం.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత దాని పక్కన గుంతలో ఆరు పిక్కలు వుంటే మీరు ఆ ఆరు పిక్కలు తీసేసుకోవచ్చు. అయితే మీ ఆట ఆగిపోతుంది. అవతలి వారికి అవకాశం.
ఇలా ఆడగా ఆడగా అన్ని పిక్కలు అయిపోయి మొదటి ఇన్నింగ్స్ ముగుస్తుంది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టబోయే ముందు ఎవరి దగ్గర ఎన్ని పిక్కలున్నాయో లెక్కబెట్టుకోవాలి. ఎవరి దగ్గర తక్కువ వుంటే అవతలి వ్యక్తి కూడా అన్నే తీసి కలుపుతాడు. (అచ్చం మన క్యారమ్స్‌లో లాగా). మళ్ళీ మధ్యలో రెండు రెండు వెయ్యడం.. పన్నెండు పన్నెండు లెక్కన వేసుకుంటూ వెళ్ళడం. అప్పుడు చివర్లో వున్న గుంతలు మిగిలిపోతాయి. అవి ఆటలోనించి తొలగించబడతాయి (కింద చూడుడూ). ఇక మిగిలిన ఆట అంతా మామూలే. పిక్కలు తీసుకోవడం.. పంచడం.. నాకడం.. వగైరా.
(ఆ.లో అ.: ఏ గుంతలో ఎన్ని పిక్కలున్నాయి అనే విషయం ఎప్పటికప్పుడు లెక్క వేసుకోగలిగితే ఆట ఇట్టే గెలవచ్చు. అందుకే లెక్కపెట్టుకోడాలు లేవని ముందే చెప్పింది.. మనసులోనే లెక్కేసుకోవాలి. ఏంటి కష్టమా? అదే పేకాటైతే ఒక్క రౌండు అవ్వగానే ముక్కలన్నీ చెప్తావా? మరదే తాతలు ఆడిన ఆటలంటే..!! దీనికీ తెలివితేటలు, లెక్కలు వేయగలిగిన నేర్పు చాలా అవసరం)
ఈ ఆటకి దగ్గరగా వున్న గేం ఇక్కడ ఆడి చూడండి
మరో ఆట గురించి మరోసారి..!!
9 వ్యాఖ్య(లు):
దీన్ని రాయలసీమ (తాడిపత్రి) ప్రాంతం లో "పిచ్చల పీట" అని అంటారు. చిన్నప్పుడు ఆడేవాళ్ళం...
భలే ఆటని గుర్తు చేసారు. నిజంగా మెదడుకి మేతే ఇలాంటి ఆటలు. మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఈ ఆటల్లో భలే ప్రావీణ్యులు. బొమ్మలతో సహా భలే వివరించారండి.
యోగిగారు,
సీమలో "చింత పిక్కల"నే "చింత పిచ్చ"లంటారు కదా..!!
సిరిసిరిమువ్వగారు,
మీ మూడు "భలే"లకి నెనర్లు.
గుంతలు కాదు మహాశయా - ఈ ఆట పేరు "వామన గుంటలు".
ఈ ఆటకంటే ముందు మీరు తెలుగు నేర్చుకుంటే బావుంటుంది.
@ అజ్ఞాత
గుంటూరు ప్రాంతాలలో వామన గుంతలనే అంటారు ఇప్పటికీ.. నెల్లూరు ప్రాంతంలో వామన గుంటలు అనడం నేనూ విన్నాను.. (గుంటలు, గుంతలూ సమానార్థకాలే అనుకుంటా..!) .. రాయలసీమలో పిచ్చల పీట అంటారని యోగిగారు చెప్పారు.. ఇంకా వేరే చోట్ల వేరే పేర్లు వుండచ్చు..!!
తెలుగు నేర్చుకుందామనే "పలక బలపం" పట్టాను.
మీ తెలివీ, తెలుగూ బాగానే ఉన్నాయి.
ఎటొచ్చీ మా ఖర్మమే ఇలా తగలడింది.
గురూ, ఇదే ఆటని తెలంగాణలో(కరీంనగర్) "ఓనబద్దులు" అని ఆడేవాళ్ళండీ. ఇప్పుడు కూడా ఆడుతున్నారో లేదో నాకైతే తెలీదు సుమీ.
సత్యప్రసాద్ గారూ,
నేను చెయ్యెత్తాను. చిన్నప్పుడు సెలవుల్లో అక్కలు, కజిన్స్ ఆడుతుంటే పక్కన కూచుని చూసేవాళ్లం. మా వేపు దీన్ని వామన గుంటలనే అంటారు. చింత గింజలు సెలవుల్లో పోగేయడం ఒక పెద్ద తంతు. నాకు ఈ ఆట ఎలా ఆడతారో గుర్తు లేదు. చక్కగా వివరించారు. తిరుపతి, కాళ హస్తి ల్లో ఈ చెక్క ఫ్రేము దొరుకుతుంది, బొమ్మలు అమ్మే కొట్లలో! మీ టపా స్క్రీన్ షాట్ దాచుకుని, తిరుపతి వెళ్ళినపుడు ఈ ఫ్రేము తెచ్చుకుని నేను మా పాపాయీ ఆడుకోవాలి. మీకు బోలెడన్ని థాంక్స్ లు! నిజంగానే ఈ ఆట ఆడటానికి తెలివి, లాజిక్కు చాలా కావాలి. కార్పొరేట్ కంపెనీల్లో ఈ ఆట ను ఉపయోగించి లాజిక్కు, క్విక్ డెసిషన్ మేకింగ్ వంటివి నేర్పడానికి ట్రైనింగ్ లో వాడుతున్నట్టు చదివాను ఆ మధ్య ఎక్కడో!
యోగి గారు చెప్పిన పిచ్చల ఆట లో బహుశా పిచ్చలు అంటే చింత పిక్కలేమో!
చాలా మంచి ఆట మళ్ళీ గుర్తు చేసారు నేను ఆడాల్సిందే :)కాని ఆ ప్రేము ఎక్కడ నుండి తేను?? పేపర్ పైన గీసి తయారు చేసుకుంటాను .. శత కోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి