ఈ మధ్య ఏదో సందర్భంలో పూర్వపు ఆటల గురించి చర్చకు వచ్చినప్పుడు, చాలా ఆటలు మనం మర్చిపోయామేమో అని అనుమానం వచ్చింది. ఆ ఆలోచనే ఈ టపాలకు మూలం. ఇలాంటి ఆటలు గుర్తు చేసుకోవడానికి కొంత కారణం లేకపోలేదు...
1. ఇలాంటి ఆటలు మన పూర్వికులు ఆడారు.. కాబట్టి ఇవి మన చరిత్ర, సంస్కృతిలో భాగం. ఇలాంటివి మనం ఇప్పుడు ఆడకపోయినా ఫర్వాలేదు కనీసం తెలుసుకోవడంలో ఒక ఆనందం వుంటుంది.
2. ఈ ఆటలలో ప్రత్యేకత ఏమిటంటే ఇలాంటి ఆటలకి ప్రత్యేకమైన పరికరాలు అరుదుగా అవసరమౌతాయి. కాలాంతరంలో కొన్ని పరికరాలు (వామన గుంతలు లాంటివి) పుట్టుకొచ్చినా అవి లేకపోయినా ఆడేందుకు అనుకూలంగా వుంటాయి. కాబట్టి, తెలుసుకున్నవాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఆడతారని ఆశ.
3. ఈ ఆటల్ని గమనిస్తే, ఇందులో వస్తువులు, ఆటకు మూలమైన విషయం అప్పటి సామాజిక, వ్యవహారిక విషయాలకు సంబంధించే వుంటాయి. పులి జూదం చూడండి అది ఎక్కువగా గొడ్లు/మేకలు కాసుకునేవాళ్ళు ఏ బండమీదో కూర్చొని ఆడుకునేవాళ్ళు. వాళ్ళ ధ్యాసంతా ఆ మేకలు, వాటిని కొట్టేందుకు వచ్చే పులులమీద వుండటంతో ఆటలో వస్తువు కూడా అదే అయ్యిందనిపిస్తుంది. అంతే కాదు ఆ పులులని మేకలన్నీ కలిసి కట్టడి చేసి గెలవాలని ఒక చిత్రమైన ఆశ కూడా ఆటలో అంతర్భాగమైంది.
4. ఇక ఇప్పుడు పల్లెలనించి పట్టణాలకి, అక్కడి నుంచి విదేశాలకి వలసెళ్ళిన మనలాంటి వారి పిల్లలు ఇలాంటి ఆటలు తెలుసుకునేందుకు, ఆడుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది. మన బ్లాగ్మిత్రులలో సాఫ్ట్వేర్ నిపుణులు ఈ టపాలు చదివి ఇలాంటి ఆటలని కంప్యూటర్లో ఆడేందుకు వీలుగా తయారు చేస్తారేమోనని ఒక కోరిక...
వుపోద్ఘాతం పక్కన పెట్టి అసలు విషయం చెప్తాను - ఈ రోజు ఆట పులి జూదం.
ఆడేవారు: ఇద్దరు
కావాల్సినవి: పులులుగా నాలుగు రాళ్ళు (కొంచెం పెద్దవి), మేకలుగా 15 రాళ్ళు (చిన్నవి), కింద చూపినట్లు పులిజూదం పటం, ఆడటానికి కొంచెం నేర్పు.
(ఆటలో అరటిపండు: ఇక్కడ చూపిన పటం కాకుండా ఇంకా రెండు మూడు రకాలుగా కూడా గీయవచ్చు. ఆ పటం బట్టి మేకల సంఖ్య మారుతుంటుంది. పులులు మాత్రం ఎప్పుడూ నాలుగే.)
ఆడే విధానం:
ఇక్కడ పటంలో వున్నది ఒక కొండ అన్నమాట. కొండెక్కే భాగ్యం ఎప్పుడూ పులిదే. అందుకని ముందుగా నాలుగు పులులను ఇలా పేర్చాలి.
ఇవి వేటకి వచ్చినవికదా ఎప్పుడూ కలిసే బయలుదేరుతాయి. ఇక మేకలు కాసే ఆటగాడు ఒక్కొక్క మేకని ఒక్కొక్క కూడలిలో పెడతాడు. (ఆ లో అ: కూడలంటే మన కూడలి కాదు. రెండు లేదా అంత కన్నా ఎక్కువ గీతలు/దారులు కలిసే ప్రదేశమన్నమాట.) ఒక మేక పెట్టగానే, పులి కి కదిలేందుకు అవకాశం వస్తుంది. పులి ఎటు వైపైనా, గీత వెంబడే కదిలి తరువాతి కూడలి చేరాలి. మళ్ళీ మేక పెట్టేందుకు అవకాశం. ఇలా సాగుతూ వుంటుంది.
పులికి దగ్గరలో ఏదైనా కూడలిలో మేక వుంటే, పులి ఆ మేక మీద నుంచి దూకి ఆ మేకను తినేందుకు అవకాశం వస్తుంది. అంటే పులి-మేక-ఖాళి వుంటే పులి ఖాళిలోకి దూకి మేకను మింగేస్తుంది. ఆ మేకను తీసి పక్కన పెట్టాలి. పులి ఒకటి కంటే ఎక్కువ మేకలమీద నుంచి దూకలేదు. పులి పులి మీదనుంచి దూకలేదు.
మేకలు అన్నీ పేర్చిన తరువాత మేకలకు కదిలేందుకు అవకాశం వస్తుంది. ఇవి కూడా పులుల మాదిరిగానే కదులుతాయి. అయితే దూకడాలు వుండవు. మేకలు కదులుతూ పులికి కదిలేందుకు అవకాశం లేకుండా చేస్తే (పులులు కట్టడి అయిపోయినట్లు) అప్పుడు మేకలు గెలిచినట్లు. మేకలనన్నిటిని పులులు మింగేస్తే పులులు గెలిచినట్లు.
(ఆ.లో అ.: మేకలు పెడుతుండగానే పులులని తెలివిగా వూరిస్తూ, ఒకటి అరా మేకల్ని కావాలనే బలిపెడుతూ పులుల్ని మూలల్లో ఇరికించేసి చేతిలో మేకలుండగానే గెలిచేస్తారు కొంతమంది. ఒకోసారి కింద చూపినట్లు ఒకటే చోట మేకల్ని కిందకి పైకి జరుపుతూ, అక్కడికేదో ఆ మేక తన మరదలైనట్లు సరసమాడుతూ పులుల్ని విసిగించేసి వోడించేస్తారు కొందరు.)
ఏది ఏమైనా తెలివిగా ఆడాల్సిన ఆట. ఈ ఆటని పల్లెటూర్లలో ఇప్పటికీ ఎంతగా ఆడతారంటే ఏ రాములవారి గుడి అరుగు మీదో, రచ్చబండ మీదో రాళ్ళను జరిపి జరిపి గాట్లు పడిపోయి ఈ పులి జూదం పటం కనిపిస్తుంటుంది. నేను చూపించినది తమిళనాడులో అక్కడికి దగ్గరలో వున్న ప్రాంతాలలో ఆడే ఆట పటం. మరి కొన్ని ప్రాంతాలలో పటం ఇలాగ వుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆడి చూడండి..!!
7 వ్యాఖ్య(లు):
నా బోటోళ్ళు ఈ ఆట మర్చిపోయి చాలా కాలమైంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
భలే! మా ఊళ్ళో ఆడతారు. నాకు రాదు, నేర్చుకోవాలి. ఈ ఆటని కంప్యూటరీకరించాలి.
ఇంత క్రితం నేనో చిన్న ఆటని తయారు చేసాను. (అది ఆడటానికి SVG తోడ్పాటు ఉన్న విహారిణి ఉండాలి. ఫైర్ఫాక్స్ 3, ఓపెరా లేదా సఫారీలను వాడొచ్చు.) అలానే ప్రదీపు కూడా చుక్కలూ గీతలూ అనే ఒక ఆటని కంప్యూటరీకరించాడు.
మాష్టరూ
మా ఊళ్లల్లో దీన్నే పులిమేక అంటారు.
ఆడి ఆడీ ఇది గీసిన బండలపి గుంటలు పడేవి. :):)
మనోహర్‌గారు,
నెనర్లు
వీవెన్గారు
ఇలాంటి ఆటల్ని కూడా కంప్యూటరీకరిద్దురూ..!!
భాస్కర్‌గారు
అవునండి.. చాలా చోట్ల అక్కడ ప్రత్యేకంగా చెక్కినట్లు వుండిపోతాయి.
నేను ఇది చిన్నప్పుడు మా తాతగారితొ అడెవాడిని. మేము పులి-మేక అంటాము. మొన్నమద్య ఈ ఆట గుర్తుకు వచ్చింది కానీ పటం మర్చిపొయాము. గుర్తు చెసినందుకు చాలా థాంక్స్ . ఇది అన్ లైన్ లొ వుంటె బావుండును..
మా నానమ్మ గారి ఇంట్లొ పులి-మేక, గవ్వలాట పటాలు ఇంటి గచ్చు (ఫ్లొర్)లొనె చెక్కెసి వుండెవి. మళ్ళీ సుద్దతొ గీయాల్సిన అవసరం లెకుండా:)
hmm... idi Puli-meka aata. chinnappudu maa thathayyatho aadevallam.... adatame kani, maa thathayyani oodinchatam mathram eppudoo jaragaleedu.
పులి-మేక ఆట గురించి అంతర్జాలంలో వెదుకుతుంటే మీ బ్లాగు కనిపించింది అండీ!. మీ ప్రయత్నానికి అభినందనలు.
చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగ ఆడతారు అనుకుంటా. 3 పులులు , 15 మేకలు ఉంటాయి. కొండ దగ్గర నుంచి నిలువు గడులు 4 ఉంటాయి. ఇంక పులుల ప్రాధమిక స్థానాలు ఒకటి కొండ పైన, మిగతా రెండు పులులు మొదటి అడ్డ గడి లో మధ్య స్థానాలు.
మీరన్నట్లు గానే ముందుగానే పులులకు ఒకటి గానీ, రెండు గానీ మేకలు ఎరవేసి, ఆట కట్టిస్తారు.
మా వైపు పూర్తిగా పులులు ఆడేవాళ్ళకు అనుకూలంగానే ఆడతారు. అంటే మేకలు ఆడే వాళ్ళు అటు కదిపి - ఇటు కదిపి ఎలాగైతేనేం పులుల ఆట కట్టించాలి. పులుల ఆటగాడు మాత్రం పులిని ఒక్క గడికే అటూ ఇటూ మార్చవచ్చు.
సాధారణంగా మూడు మేకలు పోయాయంటే పులుల ఆట కట్టించటం చాలా కష్టం.
ఒక సందేహం ఉంది, అన్ని మేకలు చనిపోతేనే మేకలు వాళ్ళు ఓడిపోతారనుకుంటే ఆ ఆట ఎప్పటికీ తేలకుండా చేయవచ్చు అని నాకు అనిపిస్తుంది.
ఏది ఏమైనా ఈ ఆటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి