ప్లాస్టిక్ మనసులు

మీరు ఏటీ్‌యం లైన్లో నిలబడ్డప్పుడు

మీచూపు నన్ను విసుగుగా పలకరిస్తుంది

మీ చీదరింపు నా పెదాలపై బలవంతంపు చిరునవ్వై పులుముకుంటుందిక్రెడిట్ కార్ద్ కావాలా సార్ అని అడగడానికి

వెనకముందాడే నా మొహమాటం

మీ తిరస్కారం వరదలో కొట్టుకుపోతుందివచ్చీరాని ఇంగ్లీషులో నాలుగు ముక్కలు పలకగానే

మీ ఆర్ధిక సంక్షోభాలన్నింటి నేనే కారణమై కనిపిస్తాను

'మీ బాంకు చార్జీలన్నీ మోసం ' అంటూ నన్నోక దోపిడీ దొంగను చేస్తారుగ్లోబలైజేషన్‌కి కాంపిటీషన్‌కి పుట్టిన చిన్న వుద్యోగాన్ని నేను

మీ బాంకు చార్జీలకి కారణం ఎలాగౌతాను

ఈ మాట మీతో చెప్పేలోపే లైన్లో మీ వంతొస్తుంది

డబ్బులు లెక్కపెట్టుకుంటూ నన్నో అంటరానివాణ్ణిలా చూస్తూ వెళ్ళిపోతారుమీ శాపాలు తగిలి నా వుద్యోగం పోయినా ఫర్లేదు

మరోరోజు ఆక్స్‌ఫోర్డ్ డిక్ష్నరీ పట్టుకొని మళ్ళీ కనిపిస్తాను

(26 సెప్టెంబరు)

---

అక్షింతలు

"కౌసల్యా సుప్రజా రామా.. పూర్వా సంధ్యా.."

"ఒరేయ్.. వెధవా... ఇంకలే తెల్లారింది.."

"ఉత్తిష్ఠ నరశార్దూలా.. కర్తవ్యం"

"లేవమంటుంటే నిన్నుకాదూ.. బడుద్దాయ్.. ఆ మొద్దు నిద్రేమిట్రా.." బామ్మ గట్టిగా అరిచింది.

"అబ్బా వుండవే పొద్దున్నే నీ సుప్రభాతమొకటి.. కాస్సేపు పడుకోని" అంటూ ముసుగు కప్పాను నేను..!

"ఓరి నీ ఇల్లు బంగారంకాను... నాది సుప్రభాతమా... సన్నాసికి ఇంతింత పిల్లలు పుట్టినా కప్పుకున్నది లుంగీనో దుప్పటో తెలియదుకాని.." ఆమె వాక్యం పూర్తికాలేదు చటుక్కున లేచి లుంగీ చుట్టుకున్నాను. బామ్మ నవ్వుతూ నిలబడింది.

"ఓరి గాడిదా.. నిద్రాదేవి నిన్ను పూనెగదరా నిర్భాగ్య దామోదరా అని... ఇంతింత సేపు పడుకోకూడదురా... వెనకటికేవడో నీలాంటి శుంఠే.."

"బామ్మా.. ఇలా తెల్లారి తెల్లారకముందే ఇన్ని రకాల తిట్లు ఎలా గుర్తొస్తాయే నీకు.. ఏది తప్పినా ఈ అక్షింతలు తప్పవు నాకు.." అన్నాను.

"నీ అసాధ్యం కూలా.. నావి తిట్లటరా.. ఏదో రేపు నాకు తలకొరివిపెట్టే కుంకవని నీ మీద ప్రేమరా... అందుకే అసలు.." నాకర్ధమైపోయింది ఇంక ఆమె దండకం మొదలెట్టబోతోందని. పరుగెత్తుకెళ్ళి బాత్రూంలో దూరాను.

బయటనుంచి ఆమె మాటలు వినిపిస్తూనే వున్నాయి -

"నా ఖర్మ కాలింది కాబట్టే ఇట్టాగ మిగిలున్నా. మీ చేత మాటలు పడాలని ఆ దేవుడు రాసిపెట్టాడు... లేకపోతే ఆ కుంకకి నా మాటలు సుప్రభాతాలు దండకాలూనా... చచ్చి ఏ లోకానవున్నావో... నీతో పాటే నన్ను తీసుకెళ్ళివుంటే ఈ మాటలైనా తప్పేవి నాకు..." ఆ ప్రవాహం అలా సాగిపోతూనే వుంది.

ఆ మాటలు నేను ఆఫీసుకి వెళ్ళేదాకా ఆగలేదు. ఆఫీసులో కూడా నా చెవిలో అవే మాటలు...
"కుంక.. భడవ... వెధవ..."


***

ఈ తిట్లు నాకు కొత్తేమికాదు. పుట్టిబుద్ధెరిగిన దగ్గర్నుంచి ఇలాగే ఈ తిట్లు భరిస్తూనే వచ్చాను. అయితే చుట్టూ ఎవరైనా ఉన్నది లేనిది చూసుకోకుండా తిట్టేస్తుంటుంది మా బామ్మ. ఒకసారి నాకు పెళ్ళైన కొత్తల్లో ఇద్దర్నీ కూర్చోబెట్టి పేరంటం చేసారు పెద్దవాళ్ళు. ఆ రోజు పెరంటాళ్ళ ముందు కూడా.. వెధవ, చవట, దద్దమ్మ అంటూ మొదలు పెట్టింది.

"మా దద్దమ్మకి ఇంక పెళ్ళి కాదేమో అనుకున్నాను సుబ్బమ్మా... చదువు సంధ్యా వున్నా వుద్యోగం లేకపోతే ఏ చవటకి మాత్రం పిల్లనిస్తారు చెప్పు..? ఎదో ఈ కుంక అదృష్టం... మహాలక్ష్మిలాంటి పెళ్ళాం వచ్చింది.." అంది పేరంటాళ్ళతో.

నేను సిగ్గుతో చచ్చిపోతుంటే నా అవస్థ చూసి నా శ్రీమతి ముసిముసి నవ్వులు. అందరూ వెళ్ళిపోయాక ఇంక వుండబట్టలేక బామ్మని పట్టుకొని దులిపేసాను.

"ఏమే బామ్మా.. చుట్టూ ఎవరైనా ఉందిలేంది చూస్కోఖర్లేదా..? నోటికేదొస్తే అది వాగెయ్యడమేనా..?" అడిగాను నేను.

"ఓరి నీ దుంపతెగ... నేను మాట్లాడటమే తప్పైపోయిందిరా నీకు... చీత్కారివెధవానీ... నా మాటకి మీ తాతే ఎదురుచెప్పేవాడు కాదు... నువ్వు నన్నంటావా..?" అంటూ నన్ను మరికాస్త తిట్టింది. నాకు అప్పటికే వళ్ళు మండిపోయింది.

"చాల్లే ఇక నోరుమూసుకొని పడుండు.." అంటూ వెళ్ళిపోయాను.

అంతే..!! మళ్ళి బామ్మ నాలుగురోజులపాటు నాతో మాట్లాడితే ఒట్టు. అందరితో మాత్రం - "ముండమోపి.. వాడితో నేను మాట్లాడకూడదట, నోరుమూసుకోవాలట... అయినా వాణ్ణాని ఏం లాభంలే... నా రాత ఇట్లాగ ఏడ్చింది.." అంటూ రాగాలు తీసింది.

నాలుగు రోజుల తరువాత నేను బతిమిలాడి క్షమాపణలు చెప్పుకుంటేగాని రాజీకి రాలేదు బామ్మ. ఆ రోజు నుంచి ఆమెని ఏమన్నా అనాలన్నా భయమే... అందుకే ఆమె తిట్లు భరిస్తూ వుండాల్సివచ్చింది.

***

ఆఫీసు నుంచి ఇంటికి రాగానే బామ్మ ఒక్కతే ఉంది.

"ఏంటే ఒక్కదానివే వున్నావు..?" అడిగాను.

"ఏం చెయ్యన్రా..? నీ కొడుక్కేమో వచ్చిన ప్రతి సినిమా చూపించందే వూరుకోడు.. అదేమో బయటికెళ్ళడానికి ఎప్పుడెప్పుడా అని చూస్తుంది.. మధ్యలో నువ్వే
చవటవౌతున్నావు.."

"ఇప్పుడేమైందే..?"

"అమ్మాకొడుకు ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు.. నువ్వు రా భోజనం వడ్డిస్తా... ఎప్పుడనగా తిన్నావో వెధవ్వి.." అంటూ లోపలికి నడిచింది బామ్మ. అన్నం పెట్టి నేను తింటుండగా తీరిగ్గా అంది -

"ఒరే సన్నాసి వచ్చేవారం మీ నాన్న తిధి గుర్తుందా..?"

"వచ్చేవారమా..? అమ్మో లీవ్ దొరకదేమోనే.." అనుమానంగా అన్నాను.

"ఛీ వెధవాఫీసు.. లీవు దొరక్కపోతే ఎగ్గొట్టేయ్యరా పిచ్చోడా... ఆ ఆఫీసరుకి బుద్ధిలేకపోతే సరి... ఇలాంటి వాటికి కాకపోతే ఇంకెందుకురా శెలవలు..?? వాడి దినంబెట్టనా..??"

"అబ్బా ఆపవే... పొద్దస్తమానం ఒకటే గొడవ.. అయినా తిధి పెట్టడం అంత అవసరమంటావా..?"

"ఓరిని దుంపతెగ... నీ ఇల్లు కూలా... నోటికేదొస్తే అది వాగెయ్యడమేనా... ఛీ.. ఛీ భ్రష్టుపట్టిపోతున్నావురా.." అంటూ లోపలికెళ్ళిపోయింది బామ్మ.

మర్నాడు అనుకున్నట్టుగానే లీవు కుదరదని చెప్పేశాడు బాస్. ఆ మాట వింటూనే అంతెత్తున లేచింది బామ్మ.

"వాడి కొంప కొల్లేరుగాను.. శెలవివ్వడానికేమైందిరా వాడి సంగతి తేల్చిపారెయ్యక... ఒరే సన్నసి రేపే ఆ ముదనష్టపు ఉద్యోగానికి రాజీనామా చేసై. ఏ పింజారి వెధవ అడ్డొస్తాడో చూస్తా.. ఆయ్.." అంటూ ఘీంకరించేసరికి నాకు మతిపోయింది.

"ఎదో విధంగా సర్దుతాను లేవే.." అన్నాను సముదాయిపుగా.

"ఏమిట్రా నువ్వు సర్దేది.. సర్దుతాడట... నువ్వలా పిచ్చి కుంకలా ఉండబట్టే ఆ దరిద్రుడు అట్లా పేట్రేగిపోతున్నాడు. వాడి సంగతి వాడి బాబు సంగతి కూడా తేల్చి పారేస్తాను ఏమనుకుంటున్నాడో ఏమో.." అంటూ అరిచేసింది రొప్పుకుంటూ.

ఆ రోజుకి ఎలాగో సర్దిచెప్పేసరికి నా తల ప్రాణం అరికాలికొచ్చింది. ఆ కథ అంతటితో అయిపోయింది కదా అనుకున్నను. మర్నాడు ఆఫీసులోకి నేరుగా వచ్చేసింది బామ్మ.

"ఎవరుకావాలమ్మా.." ఆఫీస్ బోయ్ అడిగాడు ఆమెను వింతగా చూస్తూ. బామ్మ తన చీర బొడ్లో దోపుకుంటూ - "మీ ఆఫీసర్ని కలవాలి.." అంది.

"అపాయింట్మెంట్ తీసుకున్నారా? అసలేంపని..??" అడిగాడు వాడు. 'పాపం పొద్దున్నే ఎవరి ముఖం చూశాడో' అనుకున్నాను నేను మనసులోనే. ఇంతలోనే బామ్మ మొదలెట్టేసింది -

"ఎత్తుభారం పని.. నీకెందుకు చెప్పాలోయ్ బోడిగా... ముందు వాణ్ణి పిలువ్.."

"వాడా.. ఆయన మీకేమౌతాడు.."

"ఎత్తి పగలేస్తే రెండు ముక్కలౌతాడు.. వెధవ.. అయనా మధ్యలో నీ బోడి పెత్తనమేంటోయ్... ముందు మావాడేడి.. " అంటూ నా దగ్గరికి రాబోయింది.పక్క సీటు పరమేశం దగ్గరగా వచ్చి అన్నాడు -

"ఏరా నిన్నేననుకుంటా తిడుతుంది.. కాస్త ఆపమన్రా బాబూ.." అన్నాడు బాధగా.

ఇంతలో బామ్మ నా దగ్గరకొచ్చింది."బామ్మ.. ఏంటే ఇది.. ఇది ఆఫీసు... ఇక్కడికొచ్చి మ బాసునే తిడితే
ఊరుకోరు.."

"ఊరుకోక ఏంచేస్తారోయ్.. ఉప్పుపాతరేస్తారా.. ఏడి మీ ఆఫీసరు.. పిలువ్.. నేను తేల్చిపారేస్తా.. నిలువున నరికినా పాపంలేదు ఆ త్రాష్టుణ్ణి.."

"అబ్బ వూరుకోవే..." నేనంటుండగా పరమేశం మళ్ళీ లేచాడు.

"ఇదేమిట్రా మన బాస్‌ని తిడుతోందా.. మరి చెప్పవే... తిట్టమ్మా నా పేరు కూడా చెప్పి మరి నాలుగు తిట్టు... నాశనం కావాలి దరిద్రుడు.."

"ఉత్త దరిద్రుడు కాడు నాయనా... నిష్ట దరిద్రుడు. మా చవట సన్నాసి శెలవడిగితే ఇవ్వడా వాడి కాష్టం కాలా..." బామ్మ గట్టిగా అరుస్తోంది.

నిలబడి విచిత్రంగా చూస్తున్న స్టాఫ్ ముఖాల్లోకి ఇబ్బందిగా చూసాను. ఇంతలో క్యబిన్ తలుపు తెరుచుకుంది -

"అయ్యబాబోయ్ బాస్.." అంటూ బమ్మ చెయ్యపట్టుకొని లాకెళ్ళబోయాను. నావల్లేమౌతుంది. ఒక్క విదిలింపు విదిల్చి బాస్ వైపు అంగలేసింది. ఆయన ఆశ్చర్యంగా నిలబడిపోయాడు.

"ఏమయ్యా నువ్వేనా ఈ ఆఫీసులో బాసువి.." ధీమాగా అడిగింది బామ్మ. అందరూ నోరు తెరిచి చూస్తున్నారు. బాస్ ఇబ్బందిగా తలూపాడు.

"నీకు పిల్లలున్నారా.." మళ్ళి అడిగింది.

"ఉన్నారు.."

"రేపు నువ్వు చస్తే... నీ శ్రాద్ధం పెట్టడానికి నీ పిల్లలకి శలవలు దొరకవు చూడు.." ఒక్కసారి హై పిచ్‌లో అరిచింది. బాస్ గొంతులో ఆముదం పడ్డట్టు ముఖం పెట్టాడు.

"నీ పిండాకూడు కాకులు కూడా ముట్టవ్ దుర్మార్గుడా... మా సన్నాసికి తద్దినం పెట్టుకోడానికి శెలవివ్వవా.. ఈ పాపం వూరికే పోదురా శుంఠ..." అంతులేని రికార్డ్‌లా సాగుతూనే వుంది బామ్మ బాణాల పరంపర.

"బామ్మా..." అరిచాను

"నువ్వాగు.. వీడిని కాల్చిపారేసినా పాపంలేదు..."

"బామ్మా... ఆపవే.. నా వుద్యోగం పోతుంది.."

"పోతే పోనీ దరిద్రపుగొట్టు వుద్యోగం... ఈ ముచ్చువాడి దగ్గెర చెయ్యటంకంటే మరమరాలమ్ముకోవడం నయం..."

"సరేలేవే ఇంకాపు... "

"నీ బొంద నువ్వు నోరుముయ్... ఏమయ్య ఆఫీసరూ చెప్పు మా వాడికి శెలవిస్తావా ఇయ్యవా..?" పీకమీద కత్తి పెట్టినట్లు అడిగింది బామ్మ.

"తీసుకోమనమ్మా... తీసుకోమను..." అంటూ అనేసి క్యాబిన్లో దూరిపోయాడు బాస్.ఎక్కడో మండుతోంది నాకు... దానికి తోడు పరమేశం వచ్చి -

"శెభాష్‌రా.. మనమెవ్వరం చెయ్యలేని పనిని మీ బామ్మ చేత చేయించావు.." అన్నాడు. అప్పటిదాక అరికాల్లో వున్న మంట నడినెత్తికెక్కింది.

ఆ కోపంతో బామ్మని ఒక్క వూపులో బయటకి లాకొచ్చి ఆటోలో ఇల్లుచేర్చాను. ఆమె చేసిన గొడవకి చెడామడా తిట్టేసాను."అసలు నిన్నెవరు రమ్మన్నారే ఆఫీసుకి..? తద్దినాలు పెడితే పెడతా లేకపోతే లేదు.. అరే లీవ్ దొరకట్లేదన్నందుకు ఇంత రాద్దాంతం చేస్తావా..?"

"నువ్ నోరుముయ్యరా.."

"నువ్వే ముయ్యి.. ఇంక నిన్నూ నీ దండకాల్ని భరించడం నా వల్ల కాదు.. ఫో... మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కితే ఊరుకోను.. నీ ఇష్టం వచ్చిన చోటికి పొయ్యి చావు.." కసిగా అరిచాను. బామ్మ నా వైపు తీవ్రంగా చూసి వెళ్ళిపోయింది. నేను ఆఫీసుకు పరిగెత్తాను.

అప్పటికే ఆఫిసులో అంతా బామ్మ తిట్టిన తిట్లన్ని గుర్తుకుతెచ్చుకుని నవ్వుతున్నారు. బాస్ కి 'రెటమతం వెధవ ' అని నిక్‌నేం పెడితే బాగుంటుందా లేక 'ముదనష్టపు పీనుగ ' బాగుంటుందా అని చర్చించుకుంటున్నారు. పాపం ఆయనింకా క్యాబిన్ లోనించి బయటకి వచ్చినట్లు లేదు. నేనే లోపలికి
వెళ్ళాను.

"సారీ సార్.. మా బామ్మ కి చాదస్తం.. పైగా పల్లెటూర్లో పెరిగింది... జరిగినదానికి..."

"సరే ఇట్సాల్‌రైట్ నేనేమనుకోను..." అంటూ మొహమాటంగా, భయంగా నవ్వాడు.

"లీవ్ ఇవ్వపోయిన ఫర్వాలేదు... మీరు క్షమించానండి చాలు.."

"నో నో లీవ్ తీస్కోవాల్సిందే... నిన్ను నిజంగానే క్షమించాను... గో.. గో... అన్నట్టు ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుస్కో..."

'బ్రతుకు జీవుడా' అనుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే బామ్మ జాడ లేదు. నా మీద కోపంతో ఎక్కడికైనా పోయిందేమో అనుకున్నాను. 'పోతే పోయింది... ఒక గొడవ వదిలి పోయింది ' అనుకున్నాను. రెండురోజులు అలాగే గడిచి పోయాయి.

ఊదయాన్నే నిద్రలేపేవాళ్ళు లేరు.. రోజంతా ఇల్లు మూగగా వుంటోంది... అదేదో వింత నిశబ్దం. అలవాటుపడ్డ గొంతు వినపడకపోవటంవల్లేమో ఆ ఇంట్లో ఎంతో ఇబ్బందిగా అనిపించింది నాకు. అసలు బామ్మ లేకపోతే ఇల్లు పాడుపడ్డట్టైపోయింది... నాకు తెలుసు నా మీద కోపం వచ్చినప్పుడల్లా బామ్మ
గుడికెళ్తుంది. అందుకే అక్కడికి వెళ్ళాను. అక్కడే ఉంది బామ్మ..!

"బామ్మా.." పిలిచాను. ఆమె ముఖం తిప్పేసుకుంది.

"బామ్మా.. సారీనే... మా బాస్ నువ్వు అడిగినట్టే శెలవిచ్చాడు.. సారీ చెప్తున్నా
కదా.. ఇంక రావే ఇంటికి.."

" "

"అబ్బా మాట్లాడవే..."

" "

"మాట్లాడవా..? ఇంటికి రావా..?? సరే అయితే నేను ఇక్కడ్నించి కదలను..." అంటూ ఆమె పక్కనే కూర్చున్నాను. బామ్మ నా వైపు తిరిగింది. ఒక చిరునవ్వు నవ్వి అంది -

"బోడి వెధవ.. నువ్వు చావమంటే చస్తాననుకున్నావా..? కుంకాని పెద్ద పెద్ద చవటలే నా ముందు నోరు మూసుకున్నారు నువ్వెంతరా.. భడవకానా.. చీత్కారి వెధవాని.." ఆమె తిడుతూనే వుంది. ఆ మాటలు నాకు దీవెనల్లా వినిపిస్తుంటే ఆమె ఒళ్ళో తల పెట్టుకున్నాను.

(1995)