సినిమా టైటిల్ పజిల్ - సమాధానాలు

పజిల్ అంటూ పెట్టినందుకు తప్పో కరెక్టో ఏదో ఒక సమాధానం వ్రాసిన మిత్రులకు నెనర్లు.. ఏమి రాయనివారికీ నెనర్లు..!!

అచ్చులతో ఇచ్చిన పజిల్ చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నాను.. జీడిపప్పు వరూధిని, జ్యోతి గార్లు మూడు సరైన జవాబులు, నీలాంచలగారు రెండు సరైన జవాబులు, చివరికి చైతన్యగారు తొమ్మిది సరైన జవాబులతో పాల్గొన్నారు.

ఇది బొమ్మ

ఇవి జవాబులు:

అ: అరుంధతి
ఆ: ఆకాశమంత
ఇ: కొంచెం 'ఇ'ష్టం కొంచెం కష్టం
ఈ: అ.ఆ.ఇ.ఈ
ఉ: ఉత్సాహంగా ఉల్లాసంగా
ఊ: ఒక ఊరిలో
ఎ: ఎవడైతే నాకేంటి
ఏ: ఏక'లవ్'యుడు
ఐ: ఐతే
ఒ: ఒక్క మగాడు
ఓ: ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమికా (ఇది చాలా కష్టం అందుకే హీరోయిన్ కనిపించేట్టు పెట్టాను)
ఔ: ఔను వాళ్ళిద్దరు..
అం: అందరివాడు


మొదటిది సులభంగా ఇచ్చానని (అనుకొని) రెండొవది కొంచెం కష్టంగా ఇవ్వాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో చాలా కష్టంగా ఇచ్చానని వచ్చిన జవాబుల బట్టి తెలిసింది.. చైతన్యగారు మాత్రమే ఒక్కటి సరిగా చెప్పారు..

ఇది రెండొవ పజిల్ఇవి జవాబులు


క: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కా: ఆవకాయ్ బిర్యాని
కి: పోకిరి
కు: ఆడవారి మాటలకు..
కూ: అప్పు చేసి పప్పు కూడు
కృ: మెంటల్ కృష్ణ
కే: ఎవడైతే నాకేంటి
కై: భూకైలాస్
కో: పెళ్ళైన కొత్తల్లో
కో: అనుకోకుండా ఒక రోజు
కౌ: కౌసలా సుప్రజ రామ
కం: కంచు


అదీ విషయం.. బాగుంటే చెప్పండి మరికొన్ని ప్రయత్నిద్దాం..!!


ఉగాది శుభాకాంక్షలతో


జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్


(దుర్గేశ్వరరావుగారు చేస్తున్న హనుమత్ రక్షా యాగానికి నా ఉడుతా సాయం)
సినిమా టైటిల్ పజిల్ - 2

నిన్న నేనిచ్చిన సినిమా పజిల్ చూసేవుంటారు.. (లేకపోతే ఇక్కడ నొక్కండి)!! ఇదుగో మరో పజిల్:

క్రింద వున్న బొమ్మలో క గుణింతంలో అక్షరాలు వున్నాయి. ప్రతి అక్షరం ఒక్కో సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేరు కనిపెట్టేస్తే చాలు..!!


క్లూ: ఇక్కడున్న అక్షరాలు సినిమా పేరులో మొదటి అక్షరమే కానక్కరలేదు.


ప్రయత్నించండి..!!

(తరువాతి టపాలో రెండింటికి సమాధానం ఇస్తాను..!)


సరికొత్త సినిమా పజిల్..!!

తెలుగువారికి సినిమాకి జన్మ జన్మల బంధం వుందని నా నమ్మకం. సినిమా బాగాలేదంటే 'ఏం బాలేదో తెలుసుకుందామని' సినిమాలకెళ్ళేవాళ్ళు మనకు తెలుసు. 'పాపం అంతంత డబ్బులు పెట్టి సినిమా తీసి అది ఫ్లాపైతే మనలాంటి వారు టికెట్టు కొని చేతనైనంత సాహాయం చెయ్యొద్దూ..?' అంటూ సంజాయిషీ చెప్పుకునేవాళ్ళు మనకి బాగా తెలుసు.


సినిమాకి కథ అవసరం ఎక్కువా? హీరో అవసరం ఎక్కువా? డైరెక్టర్ అవసరం ఎక్కువా? అని చాలా చర్చలు వుంటే వుండచ్చుగాక.. కాని నా దృష్టిలో సినిమాకి అతి ముఖ్యమైంది పోస్టర్.. అందులో టైటిల్. ప్రతి సినిమాకి టైటిల్ ఒక ప్రత్యేకమైన ఫాంట్లో వుంటుంది. నగిషీలు చెక్కినట్లు అవి ఎంత బాగుండేవంటే - స్కూల్ రోజుల్లో వాటి నకళ్ళు గీయడానికే సోషల్ క్లాసులు వినియోగించేవాణ్ణి.

ఇదంతా మాకు తెలుసులేవోయ్ అంటారా? సరే అసలు సంగతి చెప్పేస్తా. విషయమేమిటంటే.. ఇదుగో క్రింద వున్న ఈ పజిల్.


పజిల్ చాలా సులభం.. క్రింద తెలుగు అక్షరమాలలో అచ్చులు వున్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేర్లు చెప్పుకోండి చూద్దాం...!!


తేలు కొండి ( కథ )

"గురవయ్యని సర్పంచి బసిరెడ్డి పిలిపించాడు" పోలిగాడి కొట్టు ముందు బండమీద కూర్చోని టీ తాగుతున్న సూరయ్యకి చెప్పాడు గోపాలం.

"అద్దిరి.. అనుకున్నట్టే అయ్యింది కదరా.. గురవయ్యగాడి ఎన్నిమాట్లు చెప్పానంటావ్.. వద్దురా ఎదవా, బసిరెడ్డికిగాని కోపం వచ్చిందంటే చెండాలెక్కన తీస్తాడు.. వూరుకోరా నాయాలా అని.. ఇన్నాడా." అన్నాడు సూరయ్య బీడి వెలిగించి.

"అది సరే మామా.. ఇప్పుడు వీడి గతేందని?" అడిగాడు గోపాలం మరో బీడీ అందుకుంటూ.

"ఏందంటావేందిరా ఎదవా? పిలిచినోడు వూరకే వదిలేత్తాడా? చమ్డకోల తీసుకోని తాటరేగ కొడతాడు. వీడి పెళ్ళాం పుస్తెలు గట్టివైతే బతికొస్తాడు లేకపోతే సాములోరి మటం అవతల వాగులో తేల్తాడు. ఖర్మ కాకపోతే ఈడికెందుకు చెప్పు" అంటూ తుప్పుక్కున వూసాడు. పోలిగాడు కొట్లో నించి బయటకివచ్చి సూరయ్య ముందు కూర్చొన్నాడు.

"ఏందయ్యా.. సంపేత్తాడంటావా ఆణ్ణి" అడిగాడు.

"సంపినా సంపుతార్రా. వూరికి పెద్దోడంటే పడగెత్తిన నాగుపాము లాంటోడు.దణ్ణం బెట్టి తొలిగావా నాగదేవతలాగా కాస్తాడు. కాదని తోక తొక్కావా కాటేసి కాటికి పంపుతాడు. మునుపు ఇట్టాగే గురవయ్యగాడి అయ్య సాంబయ్య, ఇదే సర్పంచి వాళ్ళ అయ్య సేసేది అన్నాయమని లేచాడు. ఏటైంది? నాలుగు రోజుల తరువాత రైల్టేషన్ కాడ పాడుబడ్డ క్వాటర్స్ కాడ చెట్టుకు ఏలాడతా కనిపించాడు"

"ఆడి పెళ్ళనికేదో రంకుందని కద వాడు సస్తా?" అన్నాడు పోలిగాడు.

"నోరుముయ్యరా. బంగారంలాంటి ఆడకూతురు గురించి తప్పుడు కూతలు కూస్తే కడుపుకి అన్నం పుట్టకుండా పోతారు.. ఆడు ఆత్మహత్య చేసుకోలేదురా సంపేశారు" సూరయ్య కోపంగా అన్నాడు. ఆ విషయాన్ని అప్పటికే సూరన్న చాలా చోట్ల చెప్పినా పోలిగాడికి విషయం తెలియకపోవడమేమిటా అని అతనికి చిరాగ్గావుంది.

"అంటే" అడిగాడు పోలిగాడు. గోపాలం అందుకున్నాడు -"అంటే ఏందసే.. ఆ దొరగారే..అదే ఇప్పుడు సర్పంచి బసిరెడ్డిగారు లేరూ ఆళ్ళ నాయన వెంకటి రెడ్డిగోరు, ఆయనే దగ్గరుండి ఆడికి వురిబిగించి చెట్టు ఏలాడేశారని అప్పుడు వూరంతా అనుకున్నార్లే" అన్నాడు. విషయం గురవయ్యని వదిలి ఎప్పుడో జరిగిన సాంబయ్య కథలోకి వెళ్ళడం నచ్చలేదేమో, గోపాలం మళ్ళీ వెనక్కి లాక్కొచ్చాడు -

"అయితే సూరయ్య మామా ఆ అయ్యకి పట్టిన గతేనా కొడుకుక్కూడా?"

"వొరేయ్ నీకో సంగతి చెప్తా ఇను. ఇప్పుడు ఈ పోలిగాడే వున్నాడు. పొరుగూరునించి వచ్చి ఇక్కడ టీకొట్టు పెట్టాడు. బజ్జీలని, పుణుకులనీ, నిమ్మపులిహోరని అమ్మడం మొదలుపెట్టాడు. అట్టాంటప్పుడు మన కుంటి సెట్టివూరుకున్నాడా?" అడిగాడు

"ఏడూరుకున్నాడు సూరయ్యమామా..!! బండిపెట్టినకాడి నుంచి ఎన్నిసార్లు రేత్రిళ్ళు రాళ్ళేయించాడు.. మోసం చేత్తన్నానని, చద్ది సరుకు అమ్ముతున్నానని పెచారం సేసాడు.. ఒక పాలి రేత్రేళ నా బండి తగలబెట్టించాడు.. ఆ తరువాత మీలాంటోళ్ళు నాలుగు డబ్బులిస్తే కదా ఈ కొట్టు పెట్టుకున్నాను" ఏకరువు పెట్టుకున్నాడు పోలిగాడు.

"అదే సెప్తండా.. కుంటి సెట్టి ఇదంతా ఎందుకు సేయించాడంటావ్?" మళ్ళీ అడిగాడు సూరయ్య.

"ఎందుకేంది మావా.. ఈ పోలిగాడు రాక మునుపు కుంటిసెట్టిగాడు ఇంటో కజ్జికాయలు, నువ్వుండలు, మణూబూలు చేసుకోని వూరెంట పొలం గట్లెంటా తిరిగి అమ్ముకునేవోడు. ఇప్పుడు పోలిగాడు రావటంతో ఆడి యాపారం దెబ్బైపోయింది. ఆడి చేతిలో వున్నది ఈడులాక్కుంటాంటే ఎవ్వడైనా అట్టాగేసేత్తాడు కదా? దానికి ఇప్పుడు గురవయ్యగాడికి ఏందంట కనెచ్చను?"అడిగాడు గోపాలం.

"అదే కనెచ్చను. సర్పంచిగారి దగ్గర అధికారం చెలాయించే కర్ర వుంది. మనదగ్గర ఆ కర్ర కి భయపడి దణ్ణంపెట్టే సేతులున్నాయి. అట్టా కాదని ఆయన కర్ర వూడబెరుకుంటానని అంటే ఆరు మాత్రం వూరుకుంటారా? మన గురవయ్యగాడేందిరా అంటే మొన్నా మొన్ననే వాళ్ళ నాన్న కథ తెలిసొచ్చింది. కసి తీర్చుకోడానికి ఆ ఎంకటిరెడ్డి లేడు. ఆయన కొడుకు మీన తిరగబడ్డాడు. అందినకాడల్లా మీటింగులు పెట్టి సర్పంచిగారు ఇట్టాసేత్తన్నాడు అట్టాసేత్తున్నాడు అనీ నానా యాగీ జేత్తన్నాడు. ఆయన మింగిన డబ్బుల లెక్కలు గట్టి అందరికీ సెప్తా వున్నాడు.

ఎవరైనాగాని ఎందుకూరుకుంటార్రా?" అంటూ ఆవలించాడు "సాయంత్రానికి గురవయ్యగాడు వంటినిండా దెబ్బల్తో అయినా సరే - వచ్చాడా ఆడి పెళ్ళాం అదృష్టం లేకపోతేదాని తాడు తెగినట్టే" అంటూ ఇంటికి పోయాడు.

పోలిగాడు, గోపాలం సర్పంచిగారి బంగళాలో ఏమి జరుగుతోందో వూహించుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకోని గుటకలు మింగారు.


***

"సూరయ్య మామా.. సూరయ్య మామా.. లెగు.. తొందరగా" లేపాడు గోపాలం. పోలిగాడి కొట్టునించి వచ్చి ఇంటిదగ్గర అన్నం తిని బయట రావిచెట్టు కిందపడుకోని వున్నాడు. ఒక గొంటైనా పడుకున్నాడో లేదో గోపాలం వచ్చి లేపాడు.

"ఏందిరా అల్లుడూ నిద్రపోతుంటే అంత కొంపలంటుకుపోయే సంగతి" అన్నాడు సూరయ్య నిద్ర మత్తుగా.

"అట్టాటిదే మామా.. ఆ గురవయ్యగాడు లేడు... గురవయ్యగాడు.." గోపాలం చెప్పేంతలో సూరయ్య నిద్ర మత్తు ఎగిరిపోయింది.

"చంపేసారేందిరా?" అన్నాడు నులకమంచం మీద కూర్చుంటూ.

"లేదు మామా.. ఆడు వచ్చి మన పోలిగాడి టీకొట్టు ముందు కూర్చోని వున్నాడు"

"కాళ్ళు సేతులు బాగానే వున్నాయట్రా?"

"ఆహా.. బెమ్మాణంగ వున్నాడు. ఒంటిమీద దెబ్బకాదు కదా ఆడు ఏసుకున్న సొక్కా కూడా నలగలేదు."

"ఇదెట్టా? ఏందిరా పులి గుహలోకి పొయ్యి మేకపిల్ల అట్నే బయటికొచ్చిందా? పద ఆ కతేందో సూద్దాం" అంటూ సూరయ్య తోలుచెప్పులు తొడుక్కోని వడివడిగా అడుగులేస్తూ కొట్టు దగ్గరకి వచ్చాడు.

గురవయ్య అక్కడ బల్ల మీద కూర్చోని టీ తాగుతున్నాడు. పోలిగాడు కొట్లొనించి సూరయ్యని, గురవయ్యని మార్చి మార్చి చూసి చిన్నగా నవ్వాడు.సూరన్నకి ఆ నవ్వు చూసి, వెక్కిరింపని అర్థం అయ్యింది, అయినా అదేం పట్టించుకోలేదు. నేరుగా గురవయ్య పక్కన కూర్చొని వొళ్ళంతా తడిమాడు.

"ఏరా సర్పంచిగారింటికి ఎళ్ళిన మాట నిజమేనా?" అడిగాడు అనుమానంగా.

"ఎళ్ళిన మాట నిజమే.. వచ్చిన మాట నిజమే" అన్నాడు గురవయ్య నవ్వుతూ.

"ఏందిరా.. రేపెప్పుడో శవంగా కనిపిస్తావని అంతా అనుకుంటుంటే దర్జాగావచ్చావు? ఆరు నిన్నేమి అనలేదా? కొరడాలతో కొట్టలేదా? చంపుతానని బెదిరించలేదా?"

"ఏంది సూరయ్యమామా? ఆయన ఎందుకంటాడు. పల్లెత్తు మాట కూడా అనలేదు. పైపెచ్చు కడుపునిండా అన్నం పెట్టి పంపించాడు" అన్నాడు గురవయ్య.

"అన్నం పెట్టాడా? ఇషం పెట్టాడా?" గోపాలం మనసులో అనుకోవాలనుకుంటూ బయటికి అనేశాడు.

"నోర్ముయ్యరా.. తప్పుడు కూతలు కుయ్యబాకు. మనం అనుకున్నట్టు ఆయనసెడ్డోడు కాదురా.. సానా మంచోడు" గురవయ్య చెప్పాడు. పోలిగాడు, గోపాలం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

సూరయ్య కొంచెం దగ్గరకు జరిగాడు. "వురేయ్.. గురవయ్య.. అసలేం జరిగిందిరా?" అన్నాడు.

"ఏముంది మామా.. ఆయన పాలేరుతో పిలిపిస్తే ఎళ్ళానా? మీరనుకున్నట్లే నన్ను కొడతాడో సంపుతాడో అని భయపడతానే వున్నా. తీరా ఎళ్ళాక సూత్తే ఏముంది? బాగా మాట్లాడాడు. "వురేయ్ మీ అయ్యని సంపింది మా నాయన కాదురా/ అప్పుడు మా అయ్య అసలు వూర్లోనే లేడు. నా మీద, మా అయ్య మీద కక్షగట్టినోళ్ళు నీకు లేని పోనివి ఎక్కేశారు" అని నచ్చజెప్పాడు. ఆయన గురించి నేను వూళ్ళో సేత్తున ప్రచారం గురించి అడిగాడు. అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. నిజంగానే ఆయన ఎలాంటి తప్పు సెయ్యలేదు. మునుపు ప్రసిడెంటుగా వున్నాడే నాయుడుగారు.. ఆయన సేసిన తప్పులంట ఇయన్నీ. ఆయన సేసిన మంచి పనుల గురించి సెప్పాడు. ఆయన సానా గొప్పోడు మామా" అన్నాడు గురవయ్య టీ తాగిన గ్లాసు తిరిగిస్తూ.

"ఇంకా ఎమన్నాడ్రా మీ మంచి సర్పంచి?" అడిగాడు సూరయ్య కొంచెం పెళుసుగా.

"సర్పంచేమిటి సర్పంచి..! ఆయనకున్న ఆస్థి, పరపతి ముందు సర్పంచి పదవొక లెక్కా? ఆ పదవి ఆయన వదిలేస్తున్నాడు. అంతేకాదు ఈసారి నన్నే నిలబడమని చెప్పాడు. ఈ సారి రిజర్వేషన్లో మా కులానికే వచ్చిందంట సీటు" చెప్పి లేచాడు గురవయ్య. అతను పదడుగులు వేసాడో లేదో గోపాలం అన్నాడు -

"ఏంది మామా కథ ఇట్టా అడ్డం తిరిగింది? పెద్దపులి వున్నట్టుండి ఆవు ఐపోయిందా?"

"ఎక్కడైందిరా.. పెద్దపులి పెద్దపులే"

"ఏంది మామా.. వాణ్ణేదో కొట్టేస్తాడు, సంపేస్తాడు అన్నావు."

"ఎందుకు కొట్టలేదురా..!! మీరన్నట్టు గురవయ్యని కొట్టలేదు.. ఇద్దరూ కలిసి గురవయ్యని నమ్ముకున్నోళ్ళనందరి కొట్టారు..!! తేలు కొండె ఎత్తుకొని తిరుగుతుంటే పైనించి ఎవ్వరూ పట్టలేరు. అదే అడుగున చెయ్యెయ్యగలిగితే తేలు నీ దగ్గరే వుంటుంది. కొండె అవతలోడి మీదకు విసురుతుంది. ఈ సంగతి బాగా తెలిసినోడు మీ మంచి సర్పంచి.." అన్నాడు సూరయ్య బీడీ వెలిగించి.

బ్లాగులతో హౌసీ ఆడదామా..??

హౌసీ (లేదా బింగో) గురించి చాలమందికి తెలిసే వుంటుంది. అడ్డంగా అయిదు నిలువుగా మూడు గళ్ళ పెట్టెల్లో ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా అంకెలు వుంటాయి. ఏ రెండు కార్డులు ఒకటిగా వుండవు. నిర్వాహకులు ఒక్కొక్క అంకె లాటరీ తీసినట్టు తీసి ఆ అంకె గట్టిగా చెప్తారు. ఆ అంకె వున్న వాళ్ళు కార్డులో ఆ అంకె చుట్టూ చుట్టు చుడ్తారు. అలా ఎవరి కార్డు ముందుగా పూర్తైతే వాళ్ళు (బింగో అని అరుస్తారు) నెగ్గినట్టు. ఇది కాక జల్దీ ఫైవ్ అని, వరుసలు వారీగా, నాలుగు మూలలనీ అనేక విధాలుగా గిలిచినవారికి ఇతోధికంగా (అమ్ముడైన కార్డులననుసరించి) బహుమతులు ఇస్తారు.


ఇదంతా మాకూ తెలుసులేవోయ్ అంటున్నారా..? సరే అసలు విషయానికి వస్తున్నా -


అసలు ఇలా కార్డులలో అంకెలే ఎందుకుండాలి అని ఒకసారి మా మిత్ర బృందానికి అనుమానం వచ్చింది. కొంచెం ఆలోచించి చిన్న మార్పుతో మూజికల్ హౌసీ తయారు చేశాం. అదెలాగంటే - ప్రతి కార్డు పైనా అంకెతో బాటు ఏదైనా (సినిమా) పాట మొదటి పంక్తి వుంటుంది. వుదాహరణకి (18. జాణవులే నెరజాణవులే: ఆదిత్య 369) ఇలాగన్నమాట. యధావిధిగా అంకెలు తీయగానే ఆ అంకె వరుసలో వున్న పాట వినిపించడం జరుగుతుంది. ఆ పాట వున్నవాళ్ళు కార్డులో దాని చుట్టూ చుట్టు చుడతారు. మిగితా పద్ధతి మామూలే.


దీని వల్ల రెండు వుపయోగాలు:1. ఎప్పుడూ అదే అంకెల గోల లేకుండా వెరైటీగా వుండటం. పాటలు వింటూ ఆడే అవకాశం.
2. గెలిచినవారు ఆ పాటకు డాన్సు వేసుకుంటూ రావాలని చెప్పటంతో అదో మజా..!

అయితే ఇబ్బందులు లేకపోలేదు


1. 99 పాటలు సేకరించడం. అన్నీ క్యాసెట్లలోనే.. పెట్టగానే ప్రతి పాట మొదలు వచ్చేట్టు సిద్ధం చేసి వుంచడం. (ఇది పదిహేనేళ్ళ క్రిందటి మాట. అప్పటికింకా కంప్యూటర్ తాకలేదు మేము)
2. అన్ని కార్డులు చేత్తో (రాత్రంతా) వ్రాస్తూ కష్టపడటం
3. సామాన్యంగా ఒక్కరే వుండే నిర్వాహకుడి బదులు నెంబర్లు తీసే వాడొకడు, పాటలు వెతికే వాళ్ళు ఇద్దరు, పాటలు పెట్టేవాడొకడు ఇలా నిర్వాహక బృందం ఏర్పాటైంది.
4. పాటలు పెట్టడం వల్ల (మొదటి లైన్లే ప్లే చేశామనుకోండి.. అయినా) సమయం ఎక్కువసేపు పట్టింది.ఇబ్బందులు వుంటే మాత్రం వదులుతామేమిటి.. మూడు రోజుల శ్రమ తరువాత మా కాలేజి పూర్వ విద్యార్ధుల మీటింగులో నిర్వహించి పలువురి అభినందనలు అందుకున్నాం.


నాలుగేళ్ళ క్రితం మళ్ళీ ఈ ఆలోచన వచ్చింది. గుజరాత్‌లో ఒక తెలుగు సంఘం ఉగాది సంబరాల్లో చెయ్యాలని నేను మరో మిత్రుడు ఆలోచన చేశాం. అప్పటికి కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి పాటలకి క్యాసెట్ల గొడవేలేదు. కంప్యూటర్ పెట్టి ప్రతి పాటని దాని సంబంధిత నెంబరుతో సేవ్ చేస్తే, నెంబరు చెప్పగానే ఆ నెంబరు పాటని నొక్కడమే. లేదూ.. అన్ని పాటలని ప్లేయర్లో పెట్టి రాన్‌డం(random) ప్లే నొక్కామా అన్నీ అదే చూసుకుంటుంది అనుకున్నాం. అయితే కార్డులు తయారు చెయ్యటం ఎలా? అప్పుటికి మా చదువులు తారా స్థాయిలో వున్నాయి. ఏప్రియల్‌లో పరీక్షలు..!! ఇక లాభం లేదనుకోని ఆ ప్రయత్నం విరమించి సినిమా పాటల్తో (ఆడియో విజువల్) సినిమా క్విజ్ నిర్వహించి వూరుకున్నాం.


ఆ ఆలోచన మాత్రం నా బుర్రలో తిరుగుతూనే వుంది. ఇన్నాల్టికి దానికీ సమాధానం కనిపెట్టాను. మనం కార్డులలో వుండాల్సిన పదాలు/పాటలు ఏవైనా లిస్టు వ్రాసిస్తే కార్డులు తయారు చేసే సైట్లు వెలిశాయి. ఇదుగో వాటిల్లో నాకు నచ్చినదొకటి ఈ లింకులో.http://www.saksena.net/partygames/bingo/


ఇంకనే.. అవకాశం రాగానే త్వరలోనే ఇలాంటిదొకటి నిర్వహించాలి...!! అనుకున్నా..అంతటితో ఆగుతానా... అంతలోనే మరో ఆలోచన. అసలు అంకెలైనా, పాటలైనా ఎందుకుండాలి. అది ఎవరో లాటరీ తీసి చెప్తేనే మనం గెలిచినట్టా? ఇలాగని ఆలోచిస్తూ గూగలమ్మని అడిగితే బిజినెస్ బింగో అనే కొత్త విషయం తెలిసింది. అదీ ఇలాంటి ఆటే. కాకపోతే కార్డు మీద రకరకాల బిజినెస్ పదాలు (జార్గాన్స్) వ్రాసుకోని కార్పొరేట్ మీటింగులలో కూర్చోవాలిట. మీటింగులో చెప్పే విషయాలలో మన కార్డులో వున్న పదమేదైనా వుంటే మనం చుట్టు చుట్టాలి. అలా అన్నీ అయిపోగానే మీటింగ్ మధ్యలో లేచి బింగో అని అరవాలిట. బాగుంది కదూ..!!


దానికి మరో రూపాంతరం ఆలోచించాను: అన్నీ సినిమా హీరోల పేర్లతో కార్డులు తయారు చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకి తలా వొకటి ఇచ్చి టీవీ చానళ్ళు మారుస్తూ ఎవరి కార్డులో వున్న హీరో కనపడితే చుట్టు చుట్టమనండి. చాలా సింపుల్‌గా చేసుకో దగ్గ "హౌసీ" కదూ ఇది.


ఇప్పుడు బ్లాగర్లకు హౌసీ ఆట. ఈ క్రింది బ్లాగుల పేర్లను కాపీ చేసి బింగో కార్డులు తయారు చేసే సైటులో పెట్టండి. కార్డు తయారు చేసుకోండి. ఆ కార్డును ముందు పెట్టుకొని కూడలి తెరవండి. ఎవరి బ్లాగు పోస్టు వస్తే ఆ బ్లాగు పేరు చూట్టూ చూట్టూ చుట్టండి.(సాహితి, తెలుగురత్న, శ్రీపదములు, సాహితీయానం, రౌడీరాజ్యం, న ప్రపంచం, పలకబలపం, విశ్వామిత్ర, ఉత్సాహంగా ఉల్లాసంగా, లీలామోహనం, రాతలు-కోతలు, మూడు బీర్ల తరువాత, జీడిపప్పు, నవతరంగం, చదువరి, సందేశం, సత్యశోధన, తెలుగు తులిక, కలగూరగంప, హాస్యదర్బార్, జ్యోతి, సౌమ్య, దార్ల, నాగన్న, పొగ్మంచు, నా మదిలో, లేవండి మేల్కొనండి, హరిసేవ, నరసిమ్హ, నా ప్రపంచం, జనశక్తి, సరిగమలు, జీవితంలో కొత్తకోణం, కాలాస్త్రి, నాన్న, నైమిశారణ్యం, రచన, రాతలు కోతలు, నా స్వగతం, అలలపై కలలతీగ, అర్జునుడి బాణాలు, సాహితీ ఝరి, ఆయుష్మాన్‌భవ, దిల్ సే, నువ్వుసెట్టి బ్రదర్స్, మరువం, గోదావరి, వరూధిని)ఇలా బ్లాగుల పేర్లు పెడితే తయారైన కార్డులు చూడండి:ఇంకనేం.. కార్డులు తయారుచేసుకొని కూడలి చూస్తూ వుండండి..!! అన్ని గడులూ చుట్టాక తెలుసుగా - బింగో అని క్రింద వ్యాఖ్య వ్రాయాలి..!!

రాజస్థానీ బొమ్మలాట

ఈ మధ్య రాజస్థానీ బొమ్మలాట చూసే అవకాశం కలిగింది. ఆ వీడియోలలో కొన్ని మీ కోసం.

ఇవి చూశాక మన తోలుబొమ్మలాట లాగానే ఇదీ ఎంతో నేర్పు అవసరమైన కళ అని మీరూ వొప్పుకుంటారు..!!

.

ఇది హీరోయిన్

.

.

ఇది కమెడియన్

.

.

ఇది మన హీరో

.


.

మరి విలన్ అంటారా...?? ఇలాంటి కళల్ని మర్చిపోతున్న మనం లేమూ...??