చెట్టు నీడ - చెరకు రసం - చెనా (శనగ) గుత్తులు

ఆ మధ్య ఒక వూరెళ్ళాను.. భోపాల్‌కి దగ్గర్లో వున్న సీహోర్ అనే వూరి నించి దాదాపు ముప్పై కిలోమీటర్లు లోపలికి వున్న చిన్న పల్లెటూరు. ఉత్తర భారతంలో బాగా ప్రసిద్ధికెక్కిన సీహోరి/సుజాత అనే రకం గోధుమలు ఇక్కడ పండుతాయి. అలాగే నీటి కరువులేదు కాబట్టి చెరకు కూడా బాగా పండుతుంది. ఇంతకీ మేమెళ్ళింది ఆ పల్లెటూరు సర్పంచి చెరకు తోటకే.

ఫార్మ్ హౌస్ చేరుకున్నా ఆయన జాడలేకపోవటంతో మిత్రుడొకరు అక్కడే వున్న చిన్న గుట్ట ఎక్కి ఆయనకి ఫోన్ చేశాడు. అదేమిటంటే - "ఆ గుట్టమీద తప్ప ఇంకెక్కడా నెట్వర్క్ రాదు" అన్నాడు. ఇదేదో విక్రమార్క సింహాసనం లాగుందే అనుకున్నాను నేను.


ఆయన వచ్చేలోగ అక్కడ చెరకురసంతో బెల్లం తయారు చేసే బట్టీల దగ్గరికి వెళ్ళాను.


సర్పంచిగారు వస్తూనే ఒక స్టీలు బక్కెట్ పట్టుకోని దాని నిండా చెరకు రసం పట్టుకొచ్చాడు. వెనక తోటలోకి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు కోసుకొచ్చి అందులో పిండాడు. తలా ఒక గ్లాసు తీసుకున్నాం. ఇలా చెట్టు నీడన నులకమంచం మీద కూర్చొని అందమైన ప్రకృతి మధ్యలో స్వచ్చమైన చెరకు రసం.. మన పట్టణాలలో ఐసు వేసి ఇస్తే మాత్రం దీనికి సాటిరాగలదా..!


ఇలా అనుకుంటున్నామో లేదో గ్లాసు మళ్ళీ నిండిపోయింది. మరో అయిదు నిముషాలలో మూడు గ్లాసులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇంతలో సర్పంచిగారి అబ్బాయి ఎదురుగా వున్న పొలంలోకి వెళ్ళి శనగ మొక్కలు పీకి తీసుకొచ్చాడు. కాబూలి చెనా, దేశీ చనా అంటూ శనగ గుత్తులు చేతిలో పెడుతూ తినిపించారు.


ఆ తరువాత అవే శనగలు వేయించి అప్పుడే తయారైన బెల్లంతో.. తర్వాత మరో గ్లాసు చరకు రసం..!!


"సార్ ఇంకొక అరగంట వున్నారంటే దాల్ బాఫ్లే తో భోజనం సిద్ధం చేస్తా"నన్నాడు.."

వెళ్ళిన ముగ్గురం పొట్టలు పట్టుకొని, దణ్ణం పెట్టి "మళ్ళీ వస్తాం" అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. మళ్ళీ వచ్చే వారం వెళ్ళే ఆలోచన చేస్తున్నాం.. ఎవరైనా మతో వద్దామనుకుంటున్నారా?

నాడీ జోతిషం - అసలు రహస్యం (చివరి భాగం)

(ఇది వ్యాసంలొ మూడో భాగం
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)

అతను అశ్వనీ నక్షత్రం అనగానే నాకు విషయం అర్థమైపోయింది.

"మాష్టారు..! మీరు నా వివరాలు ఎలా కనిపెట్టారో నాకు తెలుసు" అన్నాను.
ముందు ఎదురు చెప్పాడు, తరువాత మెత్తబడ్డాడు ఆ తరువాత ఒప్పుకున్నాడు. ఆ రహస్యమేమిటో మీకు చెప్తా వినండి. కానీ దానికి ముందొక పిట్ట కథ:

చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడే వాళ్ళం.. గుర్తుందా? ఏదైనా బొమ్మల చార్టుతోనో (అందులో అడ్డంగా అయిదు, నిలువుగా ఆరు మొత్తం ముఫై బొమ్మలుండేవి), లేదా పేకముక్కలతోనో ఒక ట్రిక్ చేసేవాళ్ళం. అయిదు ఇంటూ ఆరు ముప్పై బొమ్మలో/పేకలో పేర్చాక, ఎదుటివాణ్ణి అందులో ఏదో ఒకటి మనసులో తల్చుకోమనేవాళ్ళం. ఆ తరువాత ఈ వరుసలో వుందా, ఈ వరుసలో వుందా అంటూ అడ్డంగా, ఆ తరువాత అదే రకంగా నిలువు వరసలపైనా ప్రశ్నించేవాళ్ళం. అడ్డం వరుస నిలువు వరుస తెలిసిపోతే ఆ రెండు కలిసే గడి/పేకే వాళ్ళనుకున్నదని చెప్పేవాళ్ళం. అంటే మనకి కావల్సిన సమాధానం అవతలి వారి దగ్గరనించే రాబట్టేవాళ్ళం.

సరిగ్గా ఇలాగే నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా ప్రశ్నల ద్వారా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని మన నించే రాబడతారు. వారికి ప్రధానంగా కావల్సింది మన పేరు, జనన తేది, సమయం. ఇవి తెలుసుకోడానికి ఒక వంద, నూటాభై ప్రశ్నలుంటాయి. ఏవీ నేరుగా వుండవు - ఒకసారి ఇంగ్లీషు నెల గురించి అడిగితే మరోసారి వారం, మరో సారి తిధి, నక్షత్రం, సంవత్సరం, తెలుగు నెల, వయసు ఇలాగన్నమాట. ప్రతిసారి మనం చెప్పిన సమాధానం ఆధారంగా మన జనన తేదీకి దగ్గరవుతారు. మధ్యలో "రెండో" గ్రంధం తేవడానికి వెళ్ళినప్పుడు అవసరమైతే పాత పంచాంగాలో క్యాలుకులేటర్లో వాడుకుంటారు. ఇలా జనన తేది సమయం కనుక్కోలేకపోతే "అగస్త్యుడు ఈ రోజు కాదన్నాడు, మళ్ళీ రండి నెల తరువాత (అప్పటికి మీరు మా ప్రశ్నలు మర్చిపోతారు)" అని చెప్తారు.

పేరు ఎందుకు అంటే - అది మన వ్యక్తిగత వివరాలలో అతి ముఖ్యమైనది. అది చెప్పగలిగితే అవతలి వారిని పట్టేసినట్టే. దీంట్లో కూడా నక్షత్రం ఆధారంగా, పుట్టిన ప్రాంతం ఆధారంగా, కులం ఆధారంగా కొన్ని వూహించి ప్రశ్నలు అడుగుతారు.

ఇక మిగిలిన ప్రశ్నలు. ఇవి ప్రధానంగా జననతేదీ కనుక్కునే ప్రశ్నల మధ్యలో అడిగేవి. అంటే జననతేది సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నారు అని అనుమానం రాకుండా ఏమార్చేందుకు వుపయోగపడతాయి. చాలా తెలివిగా సర్వ సాధారణమైనవి, ఓపెన్ ఎండెడ్ (open ended) ప్రశ్నలు వేస్తారు. "మీకు చిన్నప్పుడు ఒక ప్రమాదం తప్పింది కదా?" లాంటివి. చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పుడు? 90% మందికి చిన్నప్పుడు ఏదో ఒక గాయమో, దెబ్బో, ఇంట్లోంచి తప్పిపోవడమో ఏదో ఒకటి జరిగేవుంటుంది కదా. ఇందులో "అవును" అని సమాధానం వచ్చినవన్నీ ఒక పక్క మెమొరీలో స్టోర్ అవుతుంటాయి. వాటి వుపయోగం చివర్లో చెప్తాను.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - ప్రశ్నలు అడిగే విధానం. ఇది స్కూల్ మాష్టరు పిల్లల్ని అడిగినట్లు కాకుండా ఏదో క్లూ ఇస్తున్నట్టు అడుగుతారు.
"మీకు పెళ్ళి ఇరవై నాలుగూ ఇరవై ఎనిమిదీ మధ్య అయ్యిందా?" అంటూ.

వచ్చిన వాళ్ళలో కొంతమంది (పూర్వ జన్మలో!!) కూచిపూడి కళాకారులు వుంటారు. ప్రశ్న సగంలో వుండగానే ముఖం చిట్లించి, తల వూపేస్తారు. అలాంటి ఎక్ష్ప్రెషన్ కనపడగానే ప్రశ్న మారిపోతుంది.

"మీకు పెళ్ళి అయ్యి ఇప్పటికి (అప్పటికే ముఖం చిట్లిస్తే అసలు పెళ్ళికాలేదు అని) నాలుగు, అయిదు సంవత్సరాలూ... (ఇక్కడ చిట్లిస్తే) పోనీ ఏడు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది" అంటాడు

మరికొంతమంది (పూర్వ జన్మలో) దానకర్ణులు వుంటారు. వీళ్ళు ప్రశ్న అడగాన్నే "అవునండీ అసలేం జరిగిందంటే చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళింట్లోనే వుండేదాన్నేమో... అబ్బ దబ్బ జబ్బ అబ్బ్బ జాబ్బ్బ"

ఇలాంటి వాళ్ళు దొరికితే అదేంటో అన్నీ అగస్త్యమహాముని వ్రాసిన పుస్తకాలే దొరుకుతాయి. నాడీ జాతకం చెప్పించుకొని హాశ్చర్యపడిపోయిన మా మిత్రులు ఇలాంటివారే.

ఇంతవరకు విషయ సేకరణ పూర్తయ్యాక మీ ఆఖరు మరియు అసలైన నాడీ గ్రంథం తీసుకు రావటానికి లోపలికి వెళ్తాడు. లోపల కప్యూటరో, రెండు వేల సంవత్సరాల పంచాంగమో వుంటుంది. మీ జాతక చక్రం వేసేస్తారు. ఇక బయటికి వచ్చి గ్రంధం తెరుస్తూనే లొడ లొడా మీరు ఇందాక ప్రశ్నలలో అవునన్న విషయాలు, అబ్బ దబ్బ జబ్బ అని చెప్పిన విషయాలు, కొంత కల్పిత కథలు, కొంత మీ జాతకం ఆధారంగా విషయాలు చెప్పేస్తారు. -

"అగస్య మహాముని తేదీ (ఈ రోజు డేటు) న ఇక్కడికి వస్తారని. (మిస్టర్ సొ సొ) చేత నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటారని ఇక్కడ వ్రాసుంది. పూర్వ జన్మలో మీరు భంభోజం అనే ఏనుగు. అప్పుడు ఒక ముని శాపం వల్ల ఈ జన్మ ఎత్తి గ్యాస్ తదితర ఉదర సంబంధమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. (ఇందులో ముని శాపం అబద్ధం, పర్సనాలిటి చూస్తే గ్యాస్ ప్రాబ్లం వుందని చెప్పచ్చు/జాతకం ఆధారంగా కూడా చెప్పచ్చు లేదా మీ జేబులో జెలుసిల్ స్ట్రిప్ కనపడి వుండొచ్చు)." ఇలా సాగుతుంది. డబ్బులు సంగతి వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

ఈ విషయం ఇలా జరుగుతుందని చెప్పగానే నాకు జాతకం చెప్పిన జ్యోస్యుడు ఒప్పుకున్నాడు. ముందు నేను ఆవేశంలో - "నీ బోర్డు పీకించేస్తాను, మా బ్యాచినేసుకొని వచ్చానంటే అయిపోతావ్.. ఈనాడుకి చెప్తాను" అని వీరంగం చేసాను. తరువాత అతను నిజాయితీగా - "సార్ నేను జాతక చక్రం చూడటం నేర్చుకున్నాను. మా విద్యలో ఏ లోపమూలేదు. అందరిలాగానే జనన తేదీని బట్టి జాతకం వేస్తాము. కాకపోతే ఆ జనన తేదీ తెలుసుకోడానికే ఈ నాటకం. ఏదైనా కడుపు నింపుకోడానికే" అన్నాడు. నేను వచ్చేసాను.

ఇది జరిగింది గుంటూరులో ఒక బ్రాంచిలో. హెడ్డఫీసులో కూడా ఇలాగే జరుగుతుందని నేననుకున్నాను. కాకపోతే అక్కడా ఇంత సులభంగా దొరికే ఘఠాలు వుండకపోవచ్చు. ఏది ఏమైనా అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టి, ఇలాంటి ప్రశ్నలు తయారు చేసి, పుస్తకాలు తయారుచేసినవాడు మహా మేధావి. ఈ ప్రశ్నలు అడగటానికీ చాలా తెలివితేటలు కావాలి. కాకపోతే నేనుకూడా కొంచెం తెలివైనవాణ్నే కదా..! అక్కడ దొరికిపోయారు...!!


మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)

నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (2)

(ఇది వ్యాసంలో రెండో భాగం
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి

మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)

మరో రెండు నెలలు గడిచాయి. ఈ సారి గుంటూరులో వాళ్ళ బ్రాంచి వచ్చిందని పేపర్లో చదివాను. మళ్ళీ నా తెహల్కా మొదలైంది. ఈసారి మరీ అనుమానంతో కాకుండా కొంచెం నమ్మేవాడిలా ప్రవర్తించాలని అనుకున్నాను. మళ్ళీ అదే రకమైన గది, మళ్ళీ అదే కాషాయం, తాళపత్రం, అదే వుపోద్ఘాతం. ఆ తరువాత తమిళంలో పద్యాలు, తెలుగు తర్జుమా ప్రశ్నలు.
"మీ పేరు ర, క, మ తో ప్రారభమౌతుందా?"
"లేదు"
"అయితే ఈ పేజిలో లేదు.
"అంటే"
"ఇది మరెవరిదో. ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్కరి జాతకం వుంటుంది.
"సరే అడగండి"
"మీ వయసు 21-25 మధ్యలో వుందా"
"అవును"
"మీ సొంతవూరు గుంటూరు"
"సొంత వూరంటే పుట్టిన వూరా? పెరిగిన వూరా?"
"ఎక్కువ కాలం గడిపిన వూరు"
"గుంటూరే.. పుట్టింది మాత్రం నెల్లూరు"
"గుంటూరే వుంది.. మీ నక్షత్రం ప, మ, ఆ లతో మొదలౌతుందా"
"లేదు"
"మీరు పుట్టిన నెల జనవరి నుంచి జూన్‌లో వుందా?"
"వుంది"
"మీకు చిన్నప్పుడు చిన్న అగ్ని ప్రమాదం జరిగిందా?"
"చిన్నప్పుడంటే ఆరో ఏట దీపావళికి టపాసు కాలుస్తుంటే చేతిలో పేలింది"
"మీరు పుట్టిన తేది సరి సంఖ్యా"
"అవును"
"మీరు ప్రైవేటు అంటే బ్యాంకులు, సాఫ్ట్వేర్ వుద్యోగం చేస్తున్నారా?"
"లేదు"
"మీరు గవర్న్మెంటు వుద్యోగం చేస్తున్నారా"
"అవును"
"మీరు పుట్టిన నెల వైశాఖం, జేష్టం ఆషాఢంలో వుందా?"
"అవును"
"మీరు పుట్టిన సంవత్సరం 1978"
"అవును"
"మీకు లవ్ ఫైల్యూర్ ఎమైనా వుందా"
"లేదు"
మధ్యలో మరో తాళపత్రం తెచ్చాడు.
"మీకొక సోదరుడు"
"లేదు"
"మీరు పుట్టిన నెల జూన్"
"అవును"
"మీకొక చెల్లెలు"
"అవును"
"మీరు పుట్టిన తేది 4, 6, 8 లలో దెనితోనైనా ముగుస్తుందా?"
"లేదు"
"మీకు ఈ మధ్య ఏదైనా ఆక్సిడెంట్ అయ్యిందా"
"లేదు"
"మీరు పుట్టిన తేది 2"
"అవును"
"మీరు చేసే వుద్యోగం పోస్టాఫీసులో.."
"లేదు"
"రైల్వేలో?"
"అవును"
"మీ పేరు చివర్లో శర్మ, శాస్త్రి, రెడ్డి, నాయుడు, లాంటిది వుంది"
"లేదు"

(ఇంకా ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగాడు. అందులో ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ చెప్పాను.) అతను ఇక్కడ ఆపి -

"మీ జాతకం దొరికేట్టే వుంది. వుండండి మరొకటి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళాడు. నేను ఒక్కసారి ప్రశ్నలన్నీ తిరిగి గుర్తు తెచ్చుకున్నాను. ఎక్కడో ఏదో లింకు దొరుకుతోంది...!! తళుక్కున మెరిసింది..!!


"ఇప్పుడు అతను తిరిగి రాగానే అడగబోయే ప్రశ్న - "మీ నక్షత్రం ఆశ్వని అవునా కాదా?". అలా అడిగాడంటే నా వూహ సరైనదే" అనుకున్నాను. అతను వచ్చాడు. నాకు నా గుండె కొట్టుకోవటం స్పష్టంగా తెలుస్తోంది. అతను కూర్చొని నవ్వి అడిగాడు -

"మీ నక్షత్రం అశ్వని. అవునా కాదా?"
(ఇదెలా జరిగింది.. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఒకసారి ప్రశ్నలను మళ్ళీ చూడండి. అప్పటికీ సమాధానం దొరకకపోతే తరువాత టపాదాకా ఆగాల్సిందే.)
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి

నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (1)

చాలాకాలం క్రిందట ఒక పేరుగల రచయిత ఒక వారపత్రికలో ఒక సీరియల్ వ్రాసారు. తమిళ్‌నాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతంలో నాడీ జ్యోతిషం ఆ నవలలో ప్రధానాంశం. సదరు వూర్లో అడుగుపెట్టిన ప్రతివారి జాతకం అక్కడ వున్న అనేకానేక జ్యోతిష్యుల ఇళ్ళలో వశపారంపర్యంగా వస్తున్న తాళపత్ర గ్రంధాలలో వ్రాసి వుంటుంది. ప్రతి రాత్రి అగస్త్య మహాముని స్వయంగా వచ్చి ఆ గ్రంధాలలో మర్నాడు జాతకం చెప్పించుకునేందుకు రాబోయే వారి వివరాలు వ్రాసి వెళ్తాడు. చిత్రంగా అక్కడికి వచ్చిన వారందరి వివరాలు, పేరు, వూరు, తల్లిదండ్రుల పేర్లు, గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, ఆఖరికి ఫలానా ఫలానా రోజు సదరు వ్యక్తి రాబోతున్నాడన్న విషయంతో సహా అన్నీ సవివరంగా వ్రాయబడి వుంటాయి. ఆ నవల అప్పట్లో సంచలనం రేపింది. ఎందరెందరో స్వయంగా అక్కడికి వెళ్ళి తమ తమ నాడీ జ్యోతిషం చెప్పించుకున్నారు. కేవలం వేలి ముద్ర మాత్రమే తీసుకొని ఆ వేలు ముద్ర ఆధారంగా అంత వివరంగా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం చూసి అబ్బురపడ్డారు.


అలా వెళ్ళిన వ్యక్తులలో నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు తిరిగొచ్చి ఆ విశేషాలు చెప్తుంటే మా మిత్ర బృందం నోరెళ్ళబెట్టి విన్నాము. ఒక కేసెట్‌లో అన్ని వివరాలు రికార్డ్ చేసి ఇచ్చారు. అది వింటుంటే దాదాపు అన్ని విషయాలు అంత సరిగ్గా చెప్పటం చూస్తుంటే ఇదెలా సాధ్యం అని అనుమానం వచ్చింది. అలాగని నేను జ్యోతిషం నమ్మనని కాదు. నాకు కూడా జ్యోతిషంలో ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశం వుంది. నాకు ఆ విద్యను పరిచయం చేసిన గురువుగారు అందులో వున్న శాస్త్రీయతని, తార్కాన్ని చెప్పి వుండటంతో అలాంటిదేమి లేని నాడీ జ్యోతిషం గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత ఆ విషయాన్ని తొందర్లోనే మర్చిపోయాను.



అయితే ఆ మిస్టరీ ఛేదించాలని అగస్త్య మహామునే వ్రాసాడేమో అన్నట్టు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మళ్ళీ అదే విషయం గురించి చర్చ జరిగింది. మా మిత్ర బృందంలో ఒక అమ్మాయి ఏదో ఒక సమస్య గురించి నాడీ జ్యోతిష్యులని సంప్రదించే ప్రయత్నంలో వుండింది. అప్పటికి హైదరాబాదులో నాడీ జ్యోతిష్యుల బ్రాంచి ఒకటి (శివం దగ్గర) మొదలైందని తెలిసి మరింత సంతోషించింది. మొత్తానికి అదేంటో తెలుసుకోవాలని ఇద్దరం, తమ జాతకం తెలుసుకోవాలని ఇద్దరు, మొత్తం నలుగురం బయలుదేరి అక్కడికి చేరుకున్నాం.



ఎంట్రీ ఫీజు లాంటిదేమి లేదు. మీ జాతకం అక్కడ దొరికితేనే అది చెప్పించుకుంటేనే డబ్బులు ఇవ్వాలి. దాంతో నలుగురం మా మా వేలి ముద్రలిచ్చాం. నలుగురిని నాలుగు గదుల్లోకి పంపించారు. అప్పటికీ మేమెవరైనా ఆ అమ్మాయికి తోడుగా వుంటామని చెప్పినా వొప్పుకోలేదు. నాడీ జ్యోతిష్యం కేవలం వ్యక్తిగతంగానే చెప్పబడుతుందని అందుకని వేరే వ్యక్తిని ఎవరినీ (తల్లిదండ్రులైనా, తోడబుట్టినవారైన సరే..!) అనుమతించరని చెప్పారు. చేసేది లేక నేను నాకోసం చెప్పబడిన గదిలో అడుగు పెట్టాను.



లోపల చాలా తక్కువ వెలుతురు వుంది. అక్కడేదో పూజ జరిగినట్టు దీపంలో నూనె కాలుతున్న వాసన. అంతలో ఒక తాళ పత్ర గ్రంధం చేతిలో పట్టుకొని, కాషాయ వస్త్రాలతో ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. నా ముందు పద్మాసనం వేసుకొని అన్నాడు -



"మీ వేలిముద్రను అనుసరించి కొన్ని తాళపత్ర గ్రంధాలను తీసి పెట్టాము. అందులో వున్న కొన్ని విషయాలను చదివి చెప్తాను. అవన్నీ తమిళంలో వుంటాయి కాబట్టి పద్యం చదివి తెలుగులో చెప్తాను. అవి మీ విషయంలో సరైనవి అయితే "అవును" అని లేకపోతే "కాదు" అని మాత్రం సమాధానం చెప్పాలి. ఆ విధంగా మీకు సంబంధించి అన్ని వివరాలు సరిగా దొరికే తాళపత్ర గ్రంధం దొరికే వరకు చేస్తాము. ఒకసారి మీ నాడీ గ్రంధం దొరకగానే అన్ని వివరాలు మేమే చెప్తాము."



నేను సరే అని స్థిరంగా కూర్చున్నాను. అతను ప్రారంభించాడు. ఒక్కొక్క పత్రమే తిప్పుతూ అందులో వున్న ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను అవును, కాదు అని మాత్రం చెప్తున్నాను. ఒక గ్రంధం పూర్తైపోగానే మరో గ్రంధం తెచ్చాడు. అది అయిపోగానే మరొకటి.. ఒక నాలుగు గ్రంధాలు చూసిన తరువాత పెదవి విరిచి చెప్పాడు -



"మీ నాడీ జ్యోతిషం ఈ రోజు చెప్పించుకుంటారని అగస్త్య మహాముని వ్రాయలేదు. మీరు మళ్ళీ ప్రయత్నించాలి - ఒక నెల తరువాత."



నేను నిరాశగా వెనుతిరిగాను. బయట నాతో వచ్చిన మరో మిత్రుడు నిలబడి వున్నాడు. "నాదీ దొరకలేదు" అన్నాడు నవ్వుతూ.



"వాళ్ళిద్దరు?" అడిగాను కుతూహలంగా.



"లోపలున్నారు. వాళ్ళవి దొరికినట్టున్నాయి.." అన్నాడు ఆ గదుల వైపు చూపిస్తూ. వాడూహించింది నిజమే. కొంతసేపటి తరువాత ఆ ఇద్దరూ బయటకి వచ్చారు. వాళ్ళిద్దరి ముఖంలో వెలుగు..!!



లోపల జరిగినది వింటే కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం, కొంత థ్రిల్.. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ సరిగ్గా వున్నాయి.



పేరు, వూరు, పుట్టిన తేది, నక్షత్రం, మూడేళ్ళ వయసులో జరిగిన ప్రమాదం, తండ్రి పేరు, ఆయన చేసే వుద్యోగం, ప్రస్తుతం వేధిస్తున్న సమస్య, దానికి పరిష్కారం, జరగబోతున్న విషయాలు. మరీ ఒకరికైతే అన్నయ్య పేరు అతను చేస్తున్న వుద్యోగం, పుట్టుమచ్చల్తో సహా చెప్పేశారు.



"ఇదెలా సాధ్యమైంది?"



"తెలియదు. వాళ్ళు తీసిన చివరి గ్రంధంలో వరసగా అన్ని విషయాలు వ్రాసున్నాయి. ఆశ్చర్యం కదూ"



"ఆశ్చర్యం కాదు అనుమానం.. ఇదేంటో కనిపెట్టల్సిందే" అనుకున్నాను నేను బయటకి నడుస్తూ.


(అసలు రహస్యం తరువాత టపాలో)
రెండో భాగం కోసం ఇక్కడ నొక్కండి
మూడో భాగం కోసం ఇక్కడ నొక్కండి