ఆహ్వానం: "ఊహాచిత్రం" నా కథల సంకలనం ఆవిష్కరణ

సాహితీమిత్రులకు ఇదే ఆహ్వానం -


లామకాన్ చేరాలంటే - 
బంజారాహిల్స్ రోడ్ నెం. 1, లో వెళ్తుండగా జీవీకే మాల్ దగ్గర (బంజారాహిల్స్ పోస్టాఫీస్ ఎదురుగా వున్న) "U" టర్న్ తీసుకోని ఎడమ చేతి వైపు C-Bay పక్కగా వున్న చిన్న గల్లీ లామకాన్ చేరుస్తుంది.

ఇది ముఖచిత్రం - 



వస్తారు కదూ...

మొపాస కథలు: ఒకనాటి ప్రేమలు

ఆ పాత రాజప్రాసాదం చుట్టూ ఉన్న ఉద్యానవనం పచ్చటి ఆకులతో దట్టంగా వుంది. ఆ వనం ఒక కొస అడవిలోకి దారి తీస్తుంటే మరో చివర దూరంగా వున్న వూరి వైపు సాగుతోంది. ఆ ఇంటికి కొన్ని అడుగుల ముందు ఒక రాతి పలక, దాని పైన పాలరాతి అమ్మాయిలు స్నానమాడుతున్న శిల్పం చెక్కబడింది. దానికి కిందుగా నడిస్తే అక్కడక్కడ మరికొన్ని నీటి బేసిన్లు కనిపిస్తాయి. పై శిల్పం నుంచి వెలువడే నీటిధార అన్ని బేసిన్ల మీదుగా ప్రవహిస్తూ ముందుకు సాగుతోంది.
వయసు మీదపడ్డా సొగసుతగ్గని ఆ రాజభవనాన్ని చూసినా, అందమైన తెల్లటి గవ్వలతో అలంకరించిన రహస్య గదులని చూసినా... ఒకటేమిటి, ఎక్కడ చూసినా అన్నింటా గతించిన ప్రేమకథల చిహ్నాలే కనిపిస్తున్నాయి. ప్రాచీనంగా కనిపిస్తున్న ఆ ఉద్యానవనం మొత్తం గతకాలపు వైభవాన్ని ఆభరణంగా ధరించినట్లు అనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ప్రతి అణువూ పురాతన కాలం నాటి సాంప్రదాయాలను, అలవాట్లను, నానమ్మలకి అమ్మమ్మలకు అందమైన జ్ఞాపకాలుగా మిగిలిన అప్పటి చిలిపి సంగతులను మనకి చెబుతునట్లే వుంటాయి.
ఎప్పుడో రాజులకాలం నాటి అంతఃపురంలా అనిపించే ప్రత్యేకమైన గది అది. ఆ గది గోడలపైన గొర్రెలు కాస్తున్న కాపరులు, వారి పక్కనే వున్న గొల్లభామలు, వారిని చూస్తూ మైమరచి నిలబడిపోయిన సైనికుల బొమ్మలు చిత్రించబడి వున్నాయి. ఆ గది మధ్యలో వున్న పడక కుర్చీలో వయసు మళ్ళిన స్త్రీ కూర్చొని వుంది. ఆమె కదలకుండా ఉంటే చనిపోయిందేమోనని అనుమానం వచ్చేంత వృద్ధాప్యం ఆమెది. పడకకుర్చీ చేతులు మీదుగా వేలాడుతున్న ఆమె చేతుల్లో కూడా జీవం లేనట్టు పడున్నాయి. వెలుగులేని ఆమె గాజు కళ్ళు అచేతనంగా ఎక్కడో దూరంగా వున్న ఆమె యవ్వన అనుభూతులను తడుముతున్నట్లు చూస్తున్నాయి. తెరిచి వున్న కిటికీలో నుంచి పచ్చని గడ్డి, దాని పూల పరిమళాలను మోసుకోని గాలి అప్పుడప్పుడు జొరబడుతోంది. ఆ గాలికి ఆమె కట్టుకున్న చీర పమిట రెపరెప లాడుతూ, తెరచాపలా ఆమెను జ్ఞాపకాల పడవలో వెనక్కి లాక్కెళ్తోంది.
ఆమె పక్కనే ఒక ముక్కాలిపీట వేసుకోని ఒక అమ్మాయి కూర్చోని వుంది. ఆమె యవ్వనానికి, అందానికి నిదర్శనంగా వున్న బంగారు రంగు జడలు ఆమె వీపు మీద కదులుతున్నాయి. ఆమె ఎంతో లాఘవంగా తెల్లటి గుడ్డమీద అల్లికలు కుడుతోంది. ఆమె కళ్ళలో వున్న దిగులు చూపులు గమనిస్తే, ఆమె ఏదో కలల లోకంలో వుందని ఇట్టే తెలిసిపోతోంది. ఆ కలలతో ఏ సంబంధం లేదన్నట్లు చేతులు మాత్రం తమ పని చేసుకుపోతున్నాయి.
కుర్చీలో వున్న ముసలామె తల తిప్పి చూసింది.
“బెర్థే... ఏదన్నా పత్రిక తెచ్చి ఏమన్నా విశేషాలు చదవిపెట్టమ్మా... బొత్తిగా బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియకుండా పోతోంది..” అన్నది.
ఆ అమ్మాయి దగ్గర్లోనే వున్న పేపరు అందుకోని అందులో వున్న వార్తల శీర్షికలను అటూ ఇటూ చూసింది.
“పేపరు నిండా రాజకీయలకు సంబంధించిన వార్తలే వున్నాయి బామ్మా... అవి నీకిష్టం లేదుగా...”
“అబ్బే... అవన్నీ ఎందుకే... ఎక్కడా ప్రేమ కథలు లేవూ... దేశంలో సాహసికులు కరువయ్యారా? ప్రేమించి పారిపోవడం లాంటి సాహసాలు ఎవరూ చెయ్యటంలేదా ఇప్పుడు?”
ఆ అమ్మాయి పేపరులో ప్రతి వార్తనీ గాలించింది.
“ఆ... ఇది విను బామ్మా... దీనికి పేరేం పెట్టారో తెలుసా... ’ఓ ప్రేమ నాటకం’...” చెప్పిందామె
ముడుతలు పడ్డ బామ్మ ముఖంలో చిరునవ్వు విరిసింది. “బాగుంది... అదే చదువు” అన్నదామె.
బెర్థే చదవడం మొదలుపెట్టింది. అదేదో యాసిడ్ దాడికి సంబంధించిన వార్త. ఎవరో ఒకామె తన భర్తతో అక్రమ సంబంధం పెట్టికున్నందుకు సవతి ముఖం  పైన యాసిడ్ పోసి ముఖం కళ్ళూ తగలబెట్టిందట. ఆమెను కోర్టువారు కూడా నిర్దోషిగా ప్రకటించి, ప్రజల హర్షధ్వానాల మధ్య విడుదల చేశారట.
ఇదంతా వింటూనే బామ్మ, కుర్చీలోనే ఖంగారుగా కదిలింది.
“అబ్బబ్బ... దారుణం... దారుణమేమిటి... ఇది ఘోరంగా వుంది... ఇంతకన్నా మంచి ప్రేమకథ దొరకలేదుటే నీకు... చూడు ఇంకేమన్నా వున్నాయేమో..” అంది.
బెర్థే మళ్ళీ వెతికింది. ఎక్కడో క్రైం పేజి కింద మరో వార్త కనపడింది.
“ఇది కూడా విషాదమైనదే... ఈ పిల్ల ఏదో షాపులో పనిచేస్తుందట... వయసుకూడా తక్కువేం కాదు... ప్రియుడు ఆమెను వాడుకున్నాడని తెలుసుకుంది. అతనికి మరో ప్రియురాలు వుందని తెలుసి పగతో అతని రివాల్వర్ తో కాల్చింది. పాపం అతను చావలేదట కానీ చెయ్యి పడిపోయిందట... ఈమెను కూడా కోర్టువారు మందలించి వదిలేశారు...”
ఈసారి కథ విని బామ్మ మరింత అసహనానికి, ఆశ్చర్యానికి గురైంది. నిలువెల్లా వణికిపోతూ, అలాగే వణుకుతున్న గొంతుతో మట్లాడటం మొదలుపెట్టింది...
“ఈ కాలం పిల్లలకి పిచ్చిగానీ పట్టిందా? పిచ్చే... పిచ్చి కాకపోతే ఏమిటి? ఆ దేవుడు దయతో ప్రేమ అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు... ఒక జీవితానికి సరిపోయే మధురానుభవం అది... అలాంటి అనుభవానికి జీవితపు నిరర్థకమైన విషాలను జోడిస్తున్నారు... యాసిడ్ లు, రివాల్వర్లు తెచ్చి ప్రేమతో కలుపుతున్నారు... మధురమైన తేనె పాత్రలో మట్టి పోసినట్లుంది...”
బామ్మ చెప్పిన విషయం అర్థం కాక చిత్రంగా చూసింది బెర్థే.
“అదేంటి బామ్మా... ఈమె తన పగ చల్లార్చుకుంది... ఆమెను పెళ్ళి చేసుకోని, ఆమెకు ద్రోహం చేస్తున్నాడు వాడు... తప్పేముంది?”
బామ్మ మనవరాలి వైపు చూసింది.
“మీ తరం కుర్ర పిల్లలంతా ఇలాగే ఆలోచిస్తున్నారా? మీ బుర్రల్లో ఎలాంటి ఆలోచనలు నింపుకుంటున్నారే... అయ్యో..”
“కానీ వివాహబంధం పవిత్రమైనది కదా...”
బామ్మగారి మనసు ఒక్కసారి ఉరకలేసింది. ప్రేమకు స్వర్ణయుగంలో పుట్టిన మనసు ఆమెది. అందుకే ఆగలేకపోయింది.
“పిచ్చి పిల్లా... పెళ్ళికాదు పవిత్రమైనది.... ప్రేమే అన్నింటికన్నా పవిత్రమైనది... చెప్తాను విను” అంటూ చెప్పసాగింది –
“మూడుతరాలు చూశాను నేను... ఎంతమంది అమ్మాయిలను ఎంత మంది అబ్బాయిలను చూసుంటాను? ప్రేమకి పెళ్ళి ఎలాంటి సంబంధమూ లేదు. పెళ్ళిళ్ళనేవి కుటుంబ వ్యవస్థను పెంపొందించడానికే పనికొస్తాయి. అలాంటి కుటుంబెర్థేవల్లే సమాజం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమాజం పెళ్ళిని కాదని మనలేదు. సమాజం ఒక గొలుసు లాంటిదైతే కుటుంబం ఆ గొలుసును కలిపే లంకె లాంటిది. ఏదైనా లంకె పటిష్టంగా వుండాలంటే ఒక లోహాన్ని అదే రకమైన లోహంతో కలపాలి. అలాగే కుటుంబాన్ని ఏర్పాటు చేయ్యాలంటే ఒకే రకమైన మనుషులు కలవాలి. ఒకటే రకమైన గతం, వర్తమానం, భవిష్యత్తు కలిగినవాళ్ళు ఒకటవ్వాలి. ఒకే జాతికి చెందినవాళ్ళు ఒకటవ్వాలి. అప్పుడే ధన సంవృద్ధి, తరతరాల అభివృద్ధి రెండూ సాధ్యమౌతాయి. మనం జీవితంలో ఒక్కసారే పెళ్ళి చేసుకుంటాము, ఎందుకంటే మన సమాజం మన నుంచి అదే కోరుకుంటుంది కాబట్టి. కానీ మనం జీవితంలో ఏ ఇరవై సార్లో ప్రేమించవచ్చు, ఎందుకంటే ప్రకృతి మన నుంచి అదే కోరుకుంటుంది కాబట్టి.  పెళ్ళి ఒక సామాజిక కట్టుబాటు. ప్రేమ ఒక స్వాభావికమైన అనుభూతి. ఆ అనుభూతి మనల్ని కుదురుగా ఉండనీదు. ముందుకు ఉరకలేయిస్తుంది. ఒకోసారి ఆ దారి సరైనది కావచ్చు, లేకపోతే అది అడ్డదారి కావచ్చు. ఈ ప్రపంచం మనల్ని స్వాభావికంగా, సహజంగా బతకనీయకుండా వుండేందుకు కట్టుబాట్లు తయారు చేసింది. అలా చెయ్యక తప్పదు కూడా...! కానీ మనకి స్వభావసిద్ధంగా పుట్టే అనుభూతులు బలమైనవి. వాటిని మనం బలవంతంగా అణిచివేయడం కూడా సరికాదు. ఎందుకంటే భగవంతుడి నుంచి అందేవి అనుభూతులు. కేవలం మానవులు తయారు చేసినవి కట్టుబాట్లు. మన జీవితం వుందే... ఈ జీవితం... పసిపిల్లలకి ఇచ్చే చేదు మందు లాంటిది. దానిలో ప్రేమ అనే చక్కెర ఎంత వేస్తే అంత మధురంగా తయారౌతుంది. అర్థం అవుతోందా పిల్లా? ఎంత వెయ్యగలిగితే అంత ప్రేమని వెయ్యాలి. చక్కెరలేని మందుని పిల్లాడు వద్దన్నట్లే ప్రేమ లేని జీవితాన్ని కూడా ఎవరూ తీసుకోరు..”
బెర్థే ఆశ్చర్యం నిండిన కళ్ళను పెద్దవిగా చేస్తూ తనలో తానే మాట్లాడినట్లుగా గొణిగింది –
“కానీ బామ్మా... ప్రేమ కూడా ఒకసారే కలుగుతుంది కదా...” అంది.
బామ్మ తాను చెప్పబోతున్న విషయానికి దైవత్వం ఆపాదించడానికా అన్నట్లు తన వణుకుతున్న చేతిని పైకి ఎత్తింది. ఆమె గొంతులో మాత్రం ఆశ్చర్యం.
“మీరంతా బానిస బతుకు బతుకుతున్నరే... చాలా సాధారణమైన జీవితానికి అలవాటు పడిపోయినట్లున్నారు... విప్లవం తరువాత గుర్తించలేనంతగా సమాజం మారిపోయినట్లుంది... ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద పదాలు తగిలించడం నేర్చుకున్నారు... బతికుండటానికి కూడా పనికిరాని బాధ్యతలు వెతుక్కుంటారు మీరు. సమానత్వం, శాశ్వతమైన ప్రేమ అంటూ ఏమిటేమిటో అంటుంటారు. మీలాంటి వారికోసమే కవులు ప్రేమను అజరామరం చేసేందుకు ప్రాణాలను సైతం ఒడ్డిన మహా ప్రేమికుల గాథలు రాసి పెట్టారు. అలాంటివన్నీ చదివి ఇలా తయారయ్యారు మీరు. అదే మేము... మా రోజుల్లో ఎవరైనా అబ్బాయి నచ్చాడంటే ఒక చీటీ రాసి పంపించేవాళ్ళము. మనసులో కొత్త అలజడి పుట్టి కాస్త చపలత్వం కలిగిందంటే, పాత ప్రియుణ్ణి త్యజించడంలో ఎలాంటి ఆలస్యం చేసేవాళ్ళం కాదు. ఇద్దరినీ ప్రేమిస్తూ ఉండే పరిస్థితిలో ఉంటే తప్ప..!!”
ముసలామె నవ్వింది. ఆ నవ్వులో ఏనాటిదో చిలిపితనం, ఆమె కళ్ళలో మెరుపై మెరిసింది. అవతలి వారి నమ్మకాలతో తమకేమాత్రం సంబంధం లేదని నమ్మే చాలా మంది మేధావుల్లాగే ఆమె కూడా మిగిలిన వారిలా కాకుండా తాను వేరే ప్రపంచం నుంచి వచ్చినదానిలా నవ్వింది.
ఆ కుర్రపిల్ల ముఖం ఆశ్చర్యంతో పాలిపోయింది. మాట తడబడింది.
“అయితే మీ కాలంలో ఆడదానికి మానం మర్యాద లాంటివేమీ లేవా?” అంది.
బామ్మ ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఆ తరువాత ఆమె అన్న మాటల్లో నింద వున్నా మనసులో వేదాంతం వుంది.
“అవును మర్యాద వుండేది కాదు... నిజమే... ఎందుకంటే మేము ప్రేమించేవాళ్ళం... ఆ ప్రేమని ధైర్యంగా ఒప్పుకునేవాళ్ళం... ధైర్యంగానే కాదు గర్వంగా కూడా చెప్పుకునావాళ్ళం. మరో విషయం తెలుసా పిల్లా? మన అంతఃపురంలో ఆడవాళ్ళకి ఏ ప్రేమికుడూ లేడంటే ఇక వాళ్ళని చూసి అందరూ ముఖం మీదే నవ్వేవాళ్ళు. ఏదైనా మఠంలో చేరాలనుకునే యోగినులు తప్ప ఇంకెవరూ ప్రేమికులు లేని జీవితాన్ని గడిపేవాళ్ళు కాదు. పిచ్చి పిల్లా... బహుశా జీవితాతం నిన్ను మాత్రమే ప్రేమించే భర్త వస్తాడని నువ్వు కలలు కంటున్నట్లున్నావు. అదే జరుగుతుందని నువ్వు అనుకుంటుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే. ఇందాక చెప్పినట్లు వివాహం కేవలం ఒక సామాజిక కట్టుబాటు, సమాజం సజావుగా సాగిపోడానికి ఏర్పాటైన పద్దతి. అయితే అది మనిషి లక్షణానికి విరుద్ధమైనది. జీవితంలో ప్రేమ ఒక్కటే నిజమైనది, శాశ్వతమైనది. అలాంటి ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. అలాంటి ప్రేమని కలుషితం చేస్తున్నారు మీదు. పవిత్రమైన ప్రేమ అని పేరు పెట్టి దాన్ని భయభక్తులతో చూస్తున్నారు. ఏదో ఒక బట్టల కొట్టుకు వెళ్ళి చీర కొనుకున్నట్లు ప్రేమని కూడా తెచ్చుకుంటున్నారు... ఇది సబబు కాదు...”
ఆ పిల్ల ఆవేశంతో వణుకుతున్న బామ్మ చేతిని తన చేతిలో తీసుకుంది.
“ఇక చాలు బామ్మా... ఇలాంటి విషయాలు ఇక కట్టి పెట్టు...”
అలా అంటూనే బెర్థే అక్కడే మోకరిల్లి పైకి చూస్తూ భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆధునిక కవులు చెప్పిన నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఒక్కసారే పుట్టే ప్రేమ తనకు లభించాలని కోరుకుంది. అదీ తన భర్త ద్వారా అందాలని ఆశించింది.
బామ్మ మనవరాలి నుదుటిపైన ముద్దు పెట్టింది. ఆమె కళ్ళలో ఇంకా గతం తాలూకు మెరుపు తగ్గలేదు. ఆమె యవ్వనంలో సిద్ధాంతీకరించిన ప్రేమ వేదాంతం ఇంకా ఆమె మనసులో మెదులుతుండగా ఆమె గొణిగింది –
జాగ్రత్తమ్మా... బంగారు తల్లీ... నిజం కాని దానిపైన నమ్మకం పెట్టుకుంటున్నావు... అది ఎప్పటికైనా నీ ఆనందాన్ని హరిస్తుంది... జాగ్రత్త...”
***
ఫ్రెంచ్ మూలం: గి ద మొపాస
మూల కథ: ది లవ్ ఆఫ్ లాంగ్ ఎగో (The Love of Long Ago)