ఆవకాయ్.కాంలో నా కథ "మనసొక మధు కలశం"

ప్రముఖ అంతర్జాల పత్రిక ఆవకాయ్.కాంలో నా కథ "మనసొక మధు కలశం"
చదివి ఎలా వుందో చెప్తారు కదూ..!!

ఓపెన్ టైప్

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక పొద్దులో ప్రచురితం)  కొంచెం దూరంగా తన కొలీగ్స్ తో భోజనం చేస్తూ కనపడిందామె. చటుక్కున తల తిప్పుకున్నాను.


“ఉష లాగా వుందే..!! లాగా వుండటం ఏమిటి ఉష.. కొంచెం వొళ్ళు చేసినట్లుంది..!! నన్ను చూసిందా? గుర్తు పట్టిందా? ఏమో.. గుర్తు పట్టకపోతే బాగుండు..!!” అనుకుంటూ మళ్ళీ అటు చూడకుండా భోజనం వడ్డించుకున్నాను.


నాకు ఆ కంపెనీలో అదే మొదటిరోజు. ఇండక్షన్ ట్రైనింగ్ జరుగుతోంది. మూడేళ్ళ వుద్యోగానుభవం వున్నా కొత్త కంపెనీ, కొత్త ఇండస్ట్రీ కావటంతో నాకు అంతా కొత్తగా వుంది. అప్పుడే పరిచయమైన కొత్త మిత్రులతో కలిసి క్యాంటీన్‌లో వున్నాను.


"హేయ్.. రమణ ఈజ్ దట్ యూ?" వినిపించి వెనక్కి చూశాను. ఉష..!!


"ఉష.. హాయ్.. ఏంటి ఇక్కడ" అన్నాను ఆశ్చర్యం నటిస్తూ.


"అవును ఇక్కడే.. బిజినెస్ ఎక్సలెన్స్ టీంలో వున్నాను.. సో.. నువ్వు ఇక్కడే చేరావన్నమాట.. ఏ డిపార్ట్మెంట్?" అడిగింది నా మెళ్ళో వున్న ట్రైనీ టాగ్ చూసి.


"ఎలయన్సెస్" చెప్పాను క్లుప్తంగా. తను నవ్వింది.. ఐదు సంవత్సరాల క్రితం నన్ను కట్టిపడేసిన అదే నవ్వు..!!


"ఎలయన్సెస్.. ఎవరెవరికి..??" అంటూ మళ్ళీ నవ్వింది. నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను.


"నన్ను చూసి ఎక్సైట్ అవుతావనుకున్నాను.. అలాంటిదేమీ లేదే?.. సర్లే నా తో రా" అంటూ చెయ్యి పట్టుకుంది. “ఫ్రెండ్స్ వున్నారు.. ట్రైనింగ్ మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు త్వరగా వెళ్ళాలి” అన్నాను


"ఓకే.. ట్రైనింగ్ అయిపోగానే నాకు రింగ్ చెయ్యి.. కలుద్దాం" అనేసి వెళ్ళిపోయింది.


లంచ్ చేసి, ఫ్రెండ్స్‍తో కిందకి వెళ్ళి సిగరెట్ వెలిగించగానే ఉష కూడా అక్కడికి వచ్చింది.


"ఓ నువ్వు కూడా మొదలెట్టావన్నమాట.. ఏదీ నాకూ ఒకటి ఇవ్వు" అడిగింది. ఆడవాళ్ళు సిగరెట్ తాగడం నాకేమి కొత్తకాదు.. కాని ఉష సిగరెట్ కాలుస్తుందా?


"ఒక్కటే వుంది.." చెప్పాను.


"ఫర్లేదు.. వీ కెన్ షేర్" అంటూ నా చేతిలో సిగిరెట్ అందుకుంది. గట్టిగా రెండు దమ్ములు లాగి తిరిగి నా చేతిలో పెట్టింది. ఉష పెదవులను తాకిన సిగిరెట్ నా పెదవుల మీదకి.. ఆ వూహే నాకు గిలిగింత పెట్టింది. అదీ నా కొలీగ్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా గమత్తుగా వుంది. ఇద్దరం కలిసి సిగరెట్ పూర్తి చేశాం.


"మర్చిపోవద్దు.. ట్రైనింగ్ అవ్వగానే కలుద్దాం" అని మళ్ళీ చెప్పి తను వెళ్ళిపోయింది.


"ఎవరు రమణ ఆ అమ్మాయి?" అడిగాడు ట్రైనింగ్ రూంలో నా పక్కనే కూర్చున్న హేమేంద్ర.


"కాలేజిలో నా సీనియర్.. ఉష " చెప్పాను నేను టూకీగా. "సీనియర్" అనగానే అతను వూహించుకున్నదంతా తప్పు అనుకున్నాడేమో మళ్ళీ మాట్లాడలేదు. కాని అతను వూహించుకున్నదానికన్నా ఎక్కువే జరిగిందని అతనికి తెలియదు.


***


నేను ఎంబీయే కాలేజిలో చేరిన మొదటిరోజే ఉష పరిచయమైంది. భయం భయంగా నడుస్తున్న నన్ను సీనియర్స్ గ్యాంగ్ ఒకటి పిలిచింది. నాకిప్పటికీ గుర్తు.. అందరూ లైబ్రరీ మెట్లమీడ కూర్చోని వున్నారు. అందరి మధ్యలో ఉష.. బ్లాక్ జీన్స్ పైన ఎర్రటి స్లీవ్లెస్ టాప్.


"పేరు" ఎవరో అడిగారు.


"రమణ సార్"


"పూర్తి పేరు చెప్పు"


" "


"చెప్పు"


"వద్దు సార్ మీరు వెక్కిరిస్తారు"


"అంత వెక్కిరించే పేరా.. అయితే చెప్పాల్సిందే"


"హటకేశ్వరం ఇందీవర వెంకటరమణ"


ఉష వెంటనే నవ్వింది.. మిగతావాళ్ళకి అర్థమవ్వలేదు. తను నిలబడి -


"అంటే ఎచ్.ఐ.వి. రమణ అన్నమాట" అన్నది నవ్వుతూనే. అందరూ ఘొల్లు మన్నారు.


"అందుకే మేడం పేరు చెప్పను అన్నది.." అన్నాను ఆమె వైపు చూస్తూ.


"ఏయ్.. మేడం ముందు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా? దించు.. చూపు దించు.." అన్నాడు పక్కనే వున్న మరో సీనియర్. నేను కొంచెం తల దించాను. పూర్తిగా దించలేదని ఆమెకి కోపం వచ్చింది.


"కొందకి దించు అంటే ఎక్కడరా చూస్తున్నావు.. ఇక్కడేనా చూస్తున్నావూ?" అన్నది గుండెమీద చెయ్యేస్తూ. నేను భయంగా తలెత్తాను..


"ఏంటి నచ్చిందా? చూడు అయితే.. చూడు.." అంటూ చేతులు వెనక్కి విరిచి ముందుకొచ్చింది. అప్పుడు నేను పరుగెత్తిన పరుగు క్లాస్‌రూంకి వెళ్ళేదాకా ఆపలేదు. వెనకాల అందరూ నవ్వుతున్నారు.


***


అందరూ నవ్వుతున్నారు. ట్రైనర్ నా వైపే చూస్తున్నాడు..


"విల్ యు ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్." అన్నాడు కోపంగా.


"సారీసార్.. మీరు చెప్పింది వినలేదు." చెప్పాను నేను నిజాయితీగా.


"ఇది కాలేజ్ కాదు.. ట్రై టు బి ప్రొఫెషనల్..!!" అన్నాడు కోపంగా. నేను తల వూపాను. కాని మనసు ఉష చుట్టే తిరుగుతుంటే ఆలోచనలని ఎలా ఆపగలను?


ఎలాగైనా ఈ రోజు కలవకుండా తప్పించుకోవాలి. ట్రైనింగ్ అయిపోగానే గెస్ట్‌హౌస్‌కి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ‘ఉష అంటే ఎందుకంత భయం..’ అంతలోనే అనిపించింది. తనతో నాకు వున్న ఇంటిమసీ వేరే ఎవ్వరికీ వుండేది కాదు.. అప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు గిల్టీగా ఫీలౌతున్నానా? ఏమో అర్థం కావటంలేదు. కాని ఉష మాత్రం ఏమి మారినట్టులేదు. అదే రెక్లెస్నెతస్ అదే ఓపెన్ టాక్..!!


ట్రైనింగ్ పూర్తైపోయింది. మిగిలినవారు ఏవో జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలని ఆగిపోయారు. నేను మాత్రం వెంటనే టాక్సీ ఎక్కి గెస్ట్‌హౌస్‌కి వెళ్ళమని చెప్పి,నిర్లిప్తంగా కిటికీలోనించి బయటకు చూస్తున్నాను.


ఉష నా కోసం ఎదురు చూస్తుంటుందా? అసలు ఎందుకు వుండమంది? కాలేజిలో నా రాగింగ్ ప్రహసనం విన్న తరువాత నా క్లాస్‌మేట్స్ చెప్పింది గుర్తుకు వచ్చింది.


"ఆ అమ్మాయి పేరు ఉష.. చాలా ఓఓఓపెన్" అన్నాడు మధుర్ చివరి పదాన్ని సాగదీస్తూ.


"అంటే"


"అంటే ఏముంది బ్రదర్.. షీ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్.. నెవర్ సే నో.. ఇంట్రెస్ట్ వుంటే ప్రయత్నించు" చెప్పాడు వాడు. అది విన్న తరువాత నాకెందుకో ఆమెంటే మంచి అభిప్రాయం కలుగలేదు. కాని ఇప్పుడు..!! ఇప్పుడున్న అభిప్రాయమే వేరు..!!


టాక్సీ ఏదో సిగ్నల్ దగ్గర ఆగింది. ఒక పిల్లాడు చేతిలో రకరకాల మేనేజిమెంట్ పుస్తకాలు అమ్ముతున్నాడు. ప్రత్యేకించి రెండు పుస్తకాలు నన్ను ఆకర్షించించాయి - "రాబర్ట్ కియోసాకి - రిచ్ డాడ్ పూర్ డాడ్" దాని పక్కనే "రాబిన్ శర్మ - ద మాంక్ హూ సోల్ద్ హిస్ ఫెరారి". అవే పుస్తకాలు.. కాలేజిలో ఉషతో నాకు పరిచయాన్ని, ఆ తరువాత చనువుని పెంచినవి....


నా చేతిలో "రిచ్ డాడ్..” పుస్తకం చూసి అడిగింది.


"నచ్చిందా?" అని


"ఏమిటి?"


"అదే ఆ బుక్"


"బాగానే వుంది.."


"ఏంటి బాగుండేది.. ఇట్స్ కంప్లీట్‌లీ మెటీరియలిస్టిక్.. రీడ్ రాబిన్ శర్మ.. అతను మెటీరియల్ ప్లజర్స్ అనుభవించి వాటికి అతీతంగా వుండాలని వ్రాసిన పుస్తకం" చెప్పింది.


"మెటీరియలిజం అంటే మీకు ఇష్టంలేదా?" అంటే ఆ అమ్మాయి నవ్వింది.


"నీ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ తరువాత ఆమెకి వెయ్యి రూపాయలు ఇస్తే ఆమె ఏమంటుంది" అడిగింది కాజువల్‌గా. వూహించని ప్రశ్నకి ఖంగు తిన్నాను. తడబాటును కప్పిపుచ్చుకోని -


"నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.." అన్నాను.


ఉష గట్టిగా నవ్వి "చో చ్వీట్.." అంటూ నా తలపై చేత్తో చిన్నగా కదిపింది.. "ఎనివేయ్.. నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమైందని నాకు తెలుసు" అంటూ కన్ను గీటింది.


"అలా ఎలా తెలుస్తుంది?" అడిగాను.


తను నాకు దగ్గరగా వచ్చి అన్నది - "అదే కాదు... గర్ల్‌ఫ్రెండ్ తో సెక్స్ అనగానే నీ ఖంగారు చూస్తే నువ్వు వర్జిన్ అని కూడా తెలిసిపోయింది.."


నా గుండే కొట్టుకుంటున్న వేగం మెదడుదాకా తెలుస్తోంది. ఈమె నిజంగానే ఆ టైపా? చూడటానికి చక్కగానే వుందే..! ఏమైనా ఈమెకి దూరంగా వుండాలి అనుకున్నాను.


"ఈవినింగ్ ఇంటికిరా ఆ పుస్తకం ఇస్తాను.. డోంట్ ఫర్గెట్.." అనేసి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి తల మీద చెయ్యి పెట్టి అన్నది - "చో స్వీట్.." అని.


***


"సార్ బాంద్రా గెస్ట్‌హౌస్" అన్నాడు టాక్సీ డ్రైవర్.


నేను తేరుకోని డబ్బులిచ్చి నా రూంలోకి వడివడిగా వెళ్ళిపోయాను. రూంలో బాత్‌టబ్ వుంది. దాని నిండా గోరువెచ్చటి నీళ్ళు నింపుకోని అందులో దిగాను. మళ్ళీ ఉష గురించే ఆలోచన. ఇప్పుడు ఎక్కడ వుంటుంది? నా కోసం ఎదురుచూస్తూ ఆఫీస్‌లోనే వుంటుందా? లేకపోతే తన గురించి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి వుంటుందా? పెళ్ళైందో లేదో..!!


అప్పుడు కాలేజిలోనూ అలాగే చేశాను.. తను రమ్మన్నా నేను ఆమె ఇంటికి వెళ్ళలేదు.


"నువ్వు వస్తావని ఎంతసేపు వైట్ చేశానో తెలుసా? ఇంట్లో ఎవ్వరూ లేరు.. నాకు బోరు కొడుతూ వుండింది. నువ్వొస్తే ఎంతబాగుండేది" అన్నది


"మార్కెటింగ్ ప్రాజెక్ట్ గురించి ప్రొఫెసర్‌తో..." చెప్తుండగానే మధ్యలో అందుకుంది.


"స్టాపిట్ యార్.. ఒక అమ్మాయి పిలిస్తే రాకపోవటానికి చాలా సిల్లీ రీజన్ అది.. వేరే ఏదైనా అమ్మాయితో కలిసి పార్క్‍కి వెళ్ళాను అనో డేట్‌కి వెళ్ళాననో చెప్పు కొంచెం బాగుంటుంది" అన్నది


"ఛ ఛ అలాంటిదేమి లేదు"


"ఛ ఛ ఏమిటి.. అదేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు.. నేనైతే తప్పు చేసినా ఛ ఛ అనుకోను తెలుసా?" కన్నుగీటింది.


ఏమిటీ అమ్మాయి.. ఎందుకలా మాట్లాడుతోంది..??


"ఈ రోజైనా వస్తావా..?" అడిగింది


"వస్తాను" చెప్పాను.


నా క్లోజ్ ఫ్రెండ్ శేఖర్‌కి జరిగింది చెప్పాను. పక్కన మధుర్ కూడా వున్నాడు.


"నాకు తెలిసి ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. గో ఎహెడ్ బ్రదర్.." అన్నాడు శేఖర్.


"అవును.. మంచి ఛాన్స్.. నేను ముందే చెప్పానుగా.. ఆల్వేస్ విల్లింగ్.. ఎంజోయ్ రమణ" అన్నడు మధుర్.


"ఛ.. ఛ.. అలాంటిదేమిలేదు.. పుస్తకం ఇవ్వటానికే.." అన్నాను నేను తడబాటుగా.


"పుస్తకం ఇవ్వాలంటే తనే తెచ్చి ఇవ్వచ్చుగా.. ఇంటికి రమ్మనడం ఎందుకూ" శెఖర్ అడిగాడు.


"అవును.. అది కూడా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పడం ఎందుకూ? అనుమానమే లేదు.." మధుర్ వంతపాడాడు.


"నాకు ఇలాంటివేమి తెలియదురా.. ఫస్ట్ టైం" అంటుంటేనే నాకు గుండెల్లో దడ పెరుగుతోంది.


"ఫర్లేదులేరా.. ఆ అమ్మాయికి అంతా తెలిసే వుంటుంది.. తీసుకెళ్ళాల్సినవి మర్చిపోకు" అన్నాడు కన్ను గీటుతూ.


"ఛ.." అన్నాను మనసులో మరోరకంగా ఆలోచిస్తూ.ఆ రోజు సాయంత్రం రూంలో స్నానం చేసి నీటుగా తయారయ్యాను. మథుర్ తన సెంట్ బాటిల్ ఇచ్చి "వాడరా.. బాగుంటుంది" అన్నాడు. శేఖర్ తన బైక్ ఇచ్చాడు. కొత్త పెళ్ళికొడుకుని శోభనానికి తయారు చేసినట్లు ముస్తాబు చేశారు ఇద్దరూ. మధ్య మధ్యలో ఆ టైపు జోకులు.. చివరికీ విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు.


నేను ఉష ఇంటికి వెళ్ళాను. గుండె చప్పుడు చెవుల్లో కొడుతున్నట్టు వినపడుతోంది. నుదిటిమీద చమట తుడుచుకున్నాను. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ మీద చెయ్యిపెట్టి మళ్ళీ వద్దనుకున్నానో లెక్కే లేదు. చివరికి స్థిరంగా నిర్ణయించుకోని కాలింగ్ బెల్ కొట్టాను.


***


గణ గణ మోగింది ఫోను. అలా ఎంతసేపు బాట్ టబ్బులో వున్నానో నాకు తెలియనే లేదు. చట్టుక్కున లేచి టవల్ చుట్టుకోని ఫోను ఎత్తాను. అవతల రిసెప్షనిష్ట్.


"సార్ మీకు ఎవరో ఫోన్ చేశారు..!! కనెక్ట్ చెయ్యమంటరా" అడిగిందామె.


"సరే ఇవ్వండి" అన్నాను. అది ఖచ్చితంగా ఉషే అని అనిపించింది. నా ఆలోచన తప్పు కాదు.


"ఏమైంది.. నన్ను కలవమన్నాను కదా"


"ఏం లేదు.. కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దామని రూంకి వచ్చాను" అబద్దం చెప్పాను.


"ఏంటి సంగతి.. ఫ్రెష్‌గా వచ్చి ఏం చేద్దామని.." అంటుంటే ఆమె గొంతులోనే చిలిపితనం వినపడుతోంది.


"నువ్వేం మారలేదు ఉషా" అన్నాను నేను.


"అవును.. మారే వుద్దేశ్యాలు కూడా లేవు.. నాతో పాటు వస్తే నీకే తెలుస్తుంది.."


"ఎక్కడికి?"


"హవాయన్ షాక్స్.." అంటూ అడ్రస్ చెప్పింది.


నేను ఫోను పెట్టేసి బయలుదేరాను. అక్కడికి చేరుకునే సరికి ఆమె అక్కడే వుంది. చెయ్యి పట్టుకోని లోపలికి లాక్కెళ్ళింది. లోపల వాతావరణం అర్థమవ్వటానికి రెండు నిమిషాలు పట్టింది. అది ఒక పబ్.


"ఏం తీసుకుంటావు?"


"నువ్వు తాగుతావా?"


"ఏం నువ్వు తాగవా?"


"ఎప్పుడన్నా"


"ఇదే ఆ ఎప్పుడన్నా.. చెప్పు"


"విస్కీ విత్ షోడా.."


తను ఆర్డర్ ఇచ్చింది. తనకేమో లాంగ్ ఐలాండ్ చెప్పింది. తను మందు తాగుతుందని నేను వూహించనే లేదు.


చిన్న పడవ గోడలో నుంచి దూసుకొచ్చినట్లు వుంది ఆ కౌంటర్. మిగిలిన భాగమంతా తక్కువ కుర్చీలతో ఎక్కువ శాతం డాన్స్ వెయ్యడానికి వీలుగా వుంది. చాలా ఇరుకుగా వుంది.. అయినా చాలా మంది వున్నారక్కడ.. ఇంకా వస్తూనే వున్నారు. రంగు రంగుల లైట్లు దారి తప్పినట్లు ఎటంటే అటు తిరుగుతూ వున్నాయి.


నా గ్లాస్ నాకిచ్చి, తను కాక్‌టైల్ పట్టుకోని చిన్నగా డాన్స్ చెయ్యడం ప్రారంభించింది. నన్ను కూడా డాన్స్ చెయ్యమంది. "నా వల్ల కాద" న్నాను. అసలు ఒకరి మాటలు ఒకరికి వినపడకుండా మోతగా వున్న ఆ పాటలే నాకు రుచించట్లేదు. ఉష నన్ను పట్టుకోని గట్టిగా ముందుకు లాగింది. తుళ్ళిపడబోయి తమాయించుకున్నాను. నా చేతిలో విస్కీ ఆమె మీద కొద్దిగా వొలికింది. "ఫర్లేదు" అన్నట్టు నాలుక చిత్రంగా బయట పెట్టి నా నడుం మీద చెయ్యివేసిది. మరో చెయ్యి భుజం మీద పడింది. నేనూ డాన్స్ చెయ్యడం మొదలు పెట్టాను.


ఆ రోజు ఇలాగే ఇంతే దగ్గరగా.. పుస్తకం తీసుకోడనికి వెళ్ళి ఎంత సేపు వున్నానో నాకే గుర్తులేదు. అటకం మీద పుస్తకాలు దించేందుకు చిన్న స్టూల్ వేసుకోని ఎక్కింది. నేను స్టూల్ పట్టుకోని.. ఆమె చేతులు పైకెత్తి పుస్తకాలందుకుంటుంటే నేను అలాగే ఆమె "స్ట్రెచ్డ్" శరీరాన్నే చూస్తూ వుండిపోయాను. స్టూల్ ఎప్పుడు వదిలేశానో నాకే తెలియలేదు.


తను నా మీద పడింది. ఇద్దరం మంచం మీద పడ్డాం. అది ఆమె కావాలనే చేసిందా, లేక యాదృశ్చికంగానే జరిగిందా ఆలోచించే స్థితిలో లేను. ఆ దగ్గరతనం.. ఆ స్పర్శ మాధుర్యంలో ఎప్పుడు కరిగిపోయానో నాకే తెలియదు. కొద్దిగా ముదుకు వంగి ఆమె పెదవుల మీద…


***


"ఏయ్ ఏమైంది నీకు… ఎక్కడ ఆలోచిస్తున్నావ్? కమాన్ డాన్స్.. ఇదే ఆఖరు పాట" చెప్పిందామె. అప్పటికే ఆమె నాలుగు గ్లాసులు నేను నాలుగు గ్లాసులు తాగేశాము.


పబ్‌లో డాన్స్ అయిపోగానే తన ఇంటికి రమ్మన్నది ఉష.


"వద్దు ఉష.. బాగుండదు..." అన్నాను.


"ఏ కాలంలో వున్నావ్ రమణ.. ఇది ముంబై... నువ్వు రావటమేకాదు.. నాతో కాపురం చేసి నలుగుర్ని కన్నా కనీసం పక్కింటోళ్ళకి కూడా తెలియదు.." చెప్పిందామె.


ఇద్దరం ఆమె కార్లో బయలుదేరాము.


"ఉషా.. పెళ్ళి చేసుకున్నావా?"


"ఈ ప్రశ్న నాతో డాన్స్ చెయ్యక ముందు అడగాల్సిందేమో కదా.." అంటూ నవ్వేసి "అయ్యింది.. ఖంగారు పడకు ఆయన ఇంట్లో లేదులే. మేం విడిపోయాం." చెప్పింది. నేను ఆమె వైపు ఎంతసేపు చూశానో, ఎందుకు చూశానో కూడా గుర్తులేదు.


ఇంట్లోకి అడుగుపెట్టగానే సిగరెట్ వాసన గుప్పుమంది.


"కూర్చో.. ఫ్రెష్ అయ్యి వస్తాను.." అంటూ వెళ్ళబోయి మళ్ళీ ఆగి "ఫ్రిజ్‌పైన విస్కీ వుంది.. ఫ్రిజ్‌లో సోడా.. నాక్కూడా ఒకటి కలిపివుంచు" కన్నుగీటి వెళ్ళిపోయింది.


నేను లేచి ఫ్రిజ్ వైపు నడిచాను.


***


విస్కీ గ్లాసులో సోడా కలపగానే మధుర్ వెంటనే పైకెత్తాడు..


"చీర్స్.. చీర్స్" అరిచాడు వుత్సాహంగా


"ఇంతకీ పార్టీ ఎందుకో చెప్పనే లేదు.." అడిగాడు శేఖర్.


"ఇంకెందుకురా.. మనవాడు నిన్న వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తిచేశాడు." మధుర్ అన్నాడు. నాకేదో ఇబ్బందిగా వుంది.


"ఏరా నిజమేనా? మరి చెప్పనే లేదు? ఏంటి వర్క్ఔట్ అయ్యిందా"


"ఊ" అన్నాను నేను.


"దానికి సిగ్గెందుకోయ్.. బీ లైక్ ఏ మాన్.. ఇంతకీ ఎలాజరిగిందో చెప్పు"


"చెప్పేదేముంది.. వి డిడ్ ఇట్.."


"అదే రా ఎలా.. ఐ మీన్ ఎలా మొదలైంది.. ఎవరెవరు ఏం చేశారు"


"నోరు ముయ్యి.. అదంతా ఇక్కడా.. రూంకి వెళ్ళాక చెప్తా.. ఇందాకే మధుర్ గాడికి చెప్పాను.."


"అవునురా.. డీటైల్డ్‌గా చెప్పాడు.. నేను చెప్తాగా" అన్నాడు మధుర్ కన్నుగొడుతూ.


నేను ఆలోచిస్తూ వుండిపోయాను.***


"ఏంటి ఎప్పుడూ ఏదోవొకటి ఆలోచిస్తుంటావు.." ఉష అడిగింది. తెల్లటి నైట్ డ్రస్ వేసుకోని వుందామె.


"ఏమిలేదు..” అన్నతరువాత చాలాసేపు మాట్లాడుకోలేదు. తర్వాత నేనే అడిగాను “ఎందుకు విడిపోయారు.." అని.


ఆమె సూటిగా చూసింది. "ఈ ప్రశ్న ఇంకెవరన్నా వేస్తే నీకెందుకు అనేదాన్ని.. నీతో అలా అనలేను.. వాడు నా గురించి పూర్తిగా తెలిసే పెళ్ళి చేసుకున్నాడు. నీకు తెలుసుగా నేను మాట్లాడే తీరు.. అవతలి వాడు ఏమనుకుంటాడో ఆలోచించకుండానే డబల్ మీనింగ్ డైలాగులు.. ఒక్కోసారి డైరెక్ట్ మీనింగ్ డైలాగులు.. మొదట్లో అతనికీ ఇలా వుండటం నచ్చింది కాని తరువాత తరువాత అతనితోనే అలా వుండమనే వాడు. మిగతా మొగవాళ్ళతో అలా మాట్లాడకూడదన్నాడు.. నేను అలా వుండలేనన్నాను.. అలా మా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.. అంతే విడిపోయాము.." చెప్పింది. "అంతేనా...?” అడిగాను.


"అసలు బేసిక్ కారణం అదే.. కాకపోతే.. నాకు వేరే ఎవరితోనో సంబంధం వుందని అతనికి ఎవరో చెప్పారు.. జోక్ చెప్పనా ఆ సంబంధం ఎవరితోనో కాదు.. నీతోనే వుందట.. దట్ వాజ్ ద లాస్ట్ నైల్"


నేను అదిరి పడ్డాను. ఉషకి నాకు అఫైర్... నా వల్లే ఉష ఆమె భర్త విడిపోయారు...!


"హలో.. అంత ఆలోచించాల్సిన పనిలేదు.. ఆ మనిషే అంత... నువ్వు కాకపోతే ఏ పోస్ట్‌మానుకో, పాలవాడికో అంటగట్టేవాడు.. కాలేజిలో మనిద్దరి గురించి ఏం మాట్లాడుకునేవారో నీకు తెలుసుగా.. అదే ఎవరో వాడికి చెప్పారు, దాంతో వాడికి ఒక పేరు దొరికింది అంతే.. పోస్ట్మాకన్, పాలవాడికన్నా నువ్వే బెటర్ అని అక్కడే సంబంధం తెంచేసుకున్నాను.. నువ్వేం దిగాలుగా ముఖం పెట్టాల్సిన పనిలేదు." అన్నదామె మరో పెగ్గు కలుపుకుంటూ.


ఆ తరువాత ఇద్దరం ఏమి మాట్లాడలేదు.


***


ఆమె ఏమి మాట్లాడలేదు.


మంచం మీద అలాగే వున్నాం.. నేను కొంచెం దగ్గరగా జరిగి ఆమె పెదవులమీదకు వంగాను. ఆమె చట్టుకున తేరుకోని గట్టిగా నన్ను తోసేసింది. లేచి మంచం దిగి -


"ఫర్లేదే.. మంచి స్పీడు మీదే వున్నావు.." అంది.


జరిగిన దానికి నేను తత్తరపడ్డాను. "అయితే నీ కవ్వింపులు దీనికోసం కాదా" అని అడగబోయాను. కాదని తెలుస్తూనే వుంటే ఇంకా అడగటం ఎందుకని తల దించుకోని "అయాం సారీ" అన్నాను.


ఆమె గట్టిగా నవ్వి - "దట్స్ ఓకే.. ఫర్లేదు.. నన్ను చూసిన ప్రతివాళ్ళు ఇలాగే అనుకుంటారు. నేను ఓపెన్‌గా మాట్లాడటం వల్లే అందరూ అలా అనుకుంటారు అనుకుంటా.. అయినా నేను ఇంతే..నా నేచరే అంత.. నిన్ను చూస్తే ఎందుకో నా గురించి అలా అనుకోవట్లేదు అనిపించింది.. అందుకే ఇంకొంచెం చొరవగా వున్నాను.. ఇంకెప్పుడూ నా గురించి ఇలా ఆలోచించకు.. లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్.." చెప్పిందామె.


నేను తలవూపాను.


***


"ఏమిటి మళ్ళీ ఆలోచిస్తున్నావు?" అడిగింది ఉష.


"అదే మన గురించి అలా ఎవరు చెప్పారో అని.." అన్నాను.


"ఎవరో మా ఆయన కొలీగ్... మన క్యాంపస్ లోనే చదివాడట.. ఎవరో మథురో మాథురో..”


నాకు వూహించని షాక్..!!


అప్పుడేదో యవ్వనోత్సాహంలో జరగనిది జరిగినట్లు నా ఫ్రెండ్స్ దగ్గర కోతలు కోసాను..!! దాని పర్యవసానం ఇంత దారుణంగా వుంటుందా? నాకెందుకో గిల్టీ ఫీలింగ్ ఎక్కువౌతూ వుంది.


"హలో మాష్టారు.. అది గెస్ట్ బెడ్‌రూం.. వెళ్ళి అక్కడ పడుకోని తీరిగ్గా ఆలోచించుకోండి.." చెప్పిందామె.


నాకెందుకో ఆమెకి జరిగింది చెప్పి క్షమించమని అడగాలని వుంది. కాని మనసుకు మాటకు మధ్య ఏదో అడ్డం పడుతోంది. నేను లేచి ఆ బెడ్‌రూం వైపు అడుగులువేశాను.


ఉషకి ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు..!!


వానర వీరుడు

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక కౌముది సెప్టెంబర్ 2009 సంచికలో ప్రచురితం)

రోజు కేతకి మనసు మనసులో లేదు. ఆ రోజు హనుమంతుడు అశోకవనానికి రెండొవసారి వస్తున్నాడట..!! మునుపు వచ్చినప్పుడు రాక్షస స్త్రీలనందరిని మాయలో ముంచి, నిద్ర పోనిచ్చి కేవలం సీతమ్మను మాత్రమే కలిసి వెళ్ళాడు. ఈ సారి అలా కాదు, అందరూ మేల్కోని వుండగానే, అందరూ చూస్తుండగానే వస్తాడట..!! తాను హనుమంతుణ్ణి మళ్ళీ చూడబోతోంది..!! ఈ సారి అతనితో మాట్లాడాలి.. తన మనసులో మాట చెప్పాలి.. ఇలా ఆలోచిస్తుంటే కేతకికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు.


రావణవథ నెరిపిన వెంటనే శ్రీరాముడు విభీషణ పట్టాభిషేకానికి ఆజ్ఞ ఇచ్చాడు. అరణ్యవాసం చేస్తున్నందున లంకా నగరంలోకి అడుగుపెట్టనని, లక్ష్మణుడికి పట్టాభిషేక బాధ్యత అప్పజెప్పాడు. ఆంజనేయుడు స్వయంగా సకల నదీనదాల నీరు తీసుకోని రాగా, దేదీప్యమానంగా విభీషణ పట్టాభిషేకం జరిగింది. ప్రజలు, సామంతులు ఇచ్చిన అనేకానేక బహుమతులు, మణులు, రత్న మాణిక్యాలు తీసుకోని విభీషణుడు సముద్రతీరానికి చేరుకున్నాడు. ఆ కానుకలన్నీ రాముడికి సమర్పించి నమస్కరించాడు.

రఘునందనుడు నవ్వి - "విభీషణా.. అరణ్యవాసికి ఈ కానుకలేల..? నాకు నీవు ఇవ్వవలసినది వేరొకటి వున్నదయ్యా.." అన్నాడు.


"రామచంద్ర ప్రభూ.. సీతామాత క్షేమంగా వున్నది. వెంటనే మీ విజయవార్తను ఆ అమ్మకు పంపిస్తాను" అన్నాడు విభీషణుడు.


"నీవు ఇప్పుడు లంకా రాజ్య ప్రభువు, నీ అనుమతి కోసమే వేచి వున్నాము. నీవు అనుమతిస్తే హనుమ ఆ కార్యం నిర్వర్తిస్తాడు" అన్నాడు రాముడు.


"ఎంత మాట ప్రభు... నేను రాజునుకాదు.. నీ దాసాను దాసుణ్ణి.. మీ అనుజ్ఞ ప్రకారమే హనుమను పంపించండి.." అన్నాడు విభీషణుడు.


ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పించుకుందో కేతకి. హనుమంతుడు అశోక వనానికి వస్తున్నాడు.. ఎంతటి శుభవార్త..!! యుద్ధభూమి నుంచి నగరంలోకి రోజూ మరణవార్తలు మోసుకొస్తున్న చారులు మొదటిసారి ఈ శుభవార్త తెచ్చారు. వెంటనే త్రిజటను కలవడానికి విభీషణ గృహానికి బయలుదేరింది.


దారి పొడవునా ఆంజనేయుడి గురించి ఆలోచనలే. అసలు ఆంజనేయుడి గురించి తప్ప ఈ మధ్య వేరేమి ఆలోచించట్లేదు కేతకి. అది ప్రేమ? అభిమానమా? భక్తా? ఏమో తనకీ తెలియదు. అతను ఆజన్మ బ్రహ్మచారి అని తెలిసినప్పుడు మాత్రం కొంచెం బాధపడింది.. కాని అతని మీద అనురాగం మాత్రం తగ్గలేదు. అతని కఠోర బ్రహ్మచర్యం గురించి విని మరింత గౌరవించింది. పూజించింది.


లంకా నగర వీధులన్నీ వెల వెల పోతున్నాయి. ప్రతి ఇంటి ముందు రాక్షస సైనికుల శవాలు, వాటి వెనక విధవలై, అనాధలై భోరున విలపిస్తున్న వారి కుటుంబ సభ్యులు. నాటి లంకా పురీ విభవమ్ము నేడు మచ్చుకైనా కనరావటం లేదు.


"అసలు ఆ రోజు ఆంజనేయుడు వచ్చి ఈ నగరాన్ని తన వాలముతో తగులపెట్టినప్పుడే ఈ నగరం కాంతి హీనమైనది. ఈ నాటి అగ్ని కీలకల్లో తగల బడిన మొండి గోడలు అదుగో ఇప్పటికీ కనిపిస్తున్నాయి.. ఒక్క కోతి కారణంగా మయుడిచే నిర్మించిన ఈ మహా నగరం ఇలా బూడిద పాలౌతుందని ఎవ్వరూ, ఏనాడు వూహించి వుండరు..." అలా ఆలోచిస్తూ పుర వీధుల్లోకి అడుగుపెట్టింది కేతకి.


"ఇదుగో ఇక్కడే కదూ... ఆనాడు ఆ వానర వీరుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధించి ఈ వీధుల్లోనే కదూ నడిపించాడు మేఘనాథుడు? అప్పుడే తాను ఆ వీరుణ్ణి మొదటిసారి చూసింది. ఎలా వున్నాడు..? బంధించారన్న దిగులు లేదు, రొమ్ము విరుచుకొని, చేతులు వెనక్కి పెట్టుకోని, నగరంలో వీధి వీధిని పరికించి చూస్తూ, వాలాన్ని ఝుళిపిస్తూ, రామ మంత్రాన్ని జపిస్తూ, మధ్య మధ్యలో తనని చూడాటానికి వచ్చిన జనులను వానర చేష్టలతో భయపడుతూ.." ఆలోచిస్తూనే అనుకరిస్తోంది కేతకి. చేతులు వెనక్కి పెట్టుకోని, రొమ్ము విరుచుకోని, తల ముందుకు వంచి కోతిలా పళ్ళు చూపిస్తూ "గుర్ర్.. గుర్ర్" అంటోంది.


"ఏమిటే ఇది కేతకీ.. కేతకీ.." చేతులు పట్టుకోని వూపింది కాళనామి. ఆమె కేతకి స్నేహితురాలు. "ఏమిటే ఇది మళ్ళీ ఆ తోకవీరుడు గురించేనా.." అంది కవ్విస్తూ.


"ఏయ్.. కాళ.. నా మారుతినేమైనా అన్నావో" వేలు చూపించింది కేతకి.


"ఏమిటి… ఆ బ్రహ్మచారి నీ మారుతి ఎట్లైనాడమ్మా?"


"వీరుణ్ణి అభిమానించడం తప్పా.. నేనేమి ఆయన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదే"


"సరేలేమ్మా.. నీతో నాకెందుకు.. నాకు అవసరమైన పని వుంది వస్తా"


"ఏమిటే ఆ పని?"


"యువరాణి త్రిజటమ్మగారు చెప్పారు... ఆ పుష్పక విమానాన్ని పూలతో అలంకరించాలట.. అవును నువ్వెక్కడికే?"


"నేనూ త్రిజటమ్మగారి దగ్గరికే.. నాకు ఆ అశోకవనంలో ఏదైనా పని చెప్పమని"


"అశోక వనమేమిటే..?"


"నీకు తెలియదులే.. ఆయన అక్కడికే వస్తున్నాడు" చెప్పి పరుగెత్తింది కేతకి.
***
కేతకి వెళ్ళేసరికి త్రిజట సీతను అలంకరించడానికి నగలు సిద్ధం చేస్తోంది. నగరంలో వున్న సమస్త ఆభరణాలను తెప్పించింది.


"సీత మేని ఛాయ ముందు ఈ బంగారం దిగదుడుపే.. ఇదిగిదిగో ఈ నీలం చీర చూడండి.. అయ్యో ఇది రాముని మేని ఛాయముందు దిగదుడుపే.." అంటూ ఒక్కట్టే సవరిస్తోంది. కేతకి రావటం చూసి -


"ఏమిటే ఇప్పుడా రావటం.. పద పద.. వెళ్ళి సీతను తీసుకెళ్ళే రథం అలంకరించు.." అంటూ పనిలో మునిగిపోయింది. కేతక హతాశురాలైంది. ఎలాగైనా అశోక వనం చేరాలి, అక్కడ హనుమంతుణ్ణి చూడాలి.


"యువరాణిగారు.." అన్నది.


"ఏమిటే.."


"అమ్మా.. నేను అశోక వనానికి వెళ్తానమ్మా.. సీతమ్మను అలంకరిస్తాను.." అన్నది చిన్నగా.


"ఓహో.. హనుమయ్య అక్కడికి వస్తాడనా? బాగానే వుంది.. ఆయనంటే అంత ఇష్టం వున్నదానివి, ఆయన స్వామి భక్తి గురించి తెలిసినదానివి, నేను చెప్పిన దానికి ఎదురు చెప్తావా?" అంది నవ్వుతూ.


"అమ్మా.. అమ్మా.. కాదనకండమ్మా" ప్రాధేయపడింది కేతకి.


"సరేలే.. ఈ నగలు తీసుకెళ్ళి జానకీదేవిని అలంకరించు.. అశోకవనంలో.." అన్నది చివర్లో వత్తి పలుకుతూ.


కేతకి నమస్కరించి, చిన్నగా నవ్వుతూ అశోకవనం వైపు సాగింది. వెనకే పరిచారికలు రకరకాల మణిహారాలు, కేయూరాలు, కడియాలు ఇంకా ఎన్నెన్నో చిత్రమైన రంగులు కలిగిన వస్త్రములు తీసుకొని ఆమెను అనుసరిస్తూ కదిలారు.


కేతకి నడుస్తూ ఆలోచిస్తోంది -


"త్రిజటమ్మగారు అలా అంటారుగాని.. అమెకు తెలియదా తనకి హనుమంతుడంటే ఎంత ఇష్టమో.. ఎన్నిసార్లు ఆమె దగ్గరకు వెళ్ళి హనుమంతుడి కథలు చెప్పలేదు.. ఆ రోజు లంకా నగర రక్షకి లఖిణిని ఎవరో చంపేశారన్నప్పుడు తాను అశోకవనంలోనే వుంది. త్రిజట ఆ రోజు తన స్వప్న వృత్తాంతం వివరించి, ఎవరో వానరవీరుడు వస్తాడని, లంకా నగర నాశనం తప్పదని చెప్పింది కదా. అప్పుడే కదా తను మొదటిసారి వాయునందనుడి గురించి వినడం.. ఆ తరువాత ఆయన రావటం లంకా దహనం కావించడం.. ఆహా.. వాలానికి నిప్పు పెడితే నిబ్బరంగా గాలిలోకి లేచి ఆ ప్రాకారం నుంచి ఈ ప్రాకారం మీదకి దుముకుతూ, తోకని పెంచుతూ ఈ లంకా ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంటే, తనొక్కతే సంభ్రమంగా అలాగే నిలుచోని తదేకంగా అతన్ని చూసిన క్షణాలు.. ఎంత కాలమైనా మరపుకు రావుకదా..!! ఆనాడు ఆయనకు ఏ హాని కలగకూడదని సీతమ్మతోపాటే తాను అగ్నిదేవుడిని ప్రార్థించింది... అప్పుడు ఆ వీరుడు తనను చూశాడా? ఏమో.." ఇలా ఆలోచిస్తూనే అశోక వనం ముందున్న ఫలతోటలోకి చేరుకున్నారు పరివారమంతా.


కొంతకాలం క్రిందట ఎంత మనోహరంగా వుండేదా తోట. ఎన్నో లోకాలతో యుద్ధాలు జరిపి, అన్ని లోకాల చిత్ర విచిత్రమైన ఫలాలను, పుష్పాలను రావాణుడు స్వయంగా మక్కువతో తెచ్చుకోని పెంచిన తోట అది. ఎప్పుడూ దోరమాగిన ఫలాల సువాసనలు వెదజల్లుతూ ఆఘ్రాణింపుకే మైమరపాటునిచ్చే మనోహరమైన తోట. మరి ఈ నాడు -


విరిగిన ప్రాకారాలతో, ఎక్కడిక్కడ పడిపోయి ఎండిపోయిన మహా వృక్షాలతో, దారికి అడ్డంగా పడివున్న మహా పర్వతాలవంటి రాళ్ళతో.. ఇదంతా ఆ వానర వీరుడి పనే కదూ..!! అతను చెట్లను పెళ్ళాగించిన చోట ఇప్పుడు చిన్న చిన్న తటాకాలయ్యాయి. రాళ్ళు విసిరినప్పుడు దాని కింద పడిన రాక్షసులు ఆ రాతికిందే సమాధి అయిపోయి వున్నారు. కొన్ని బండలకింద ఇప్పటికీ రధ శకలాలు వున్నాయి.


కేతకి అక్కడే పడి వున్న ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టును వేర్లతోసహా పెళ్ళగించినప్పుడు హనుమంతుడు చేతులు పడిన చోట నొక్కుకు పోయి వుంది. కేతకి ఆ అచ్చులమీద చిన్నగా తాకింది. ఒళ్ళంతా పులకరించినట్లైంది. భక్తిగా నమస్కరించింది.


"ఏం వీరుడివయ్యా? మా రాక్షసుల చేతులలో చిత్ర విచిత్రమైన ఆయుధాలు చూశాను. కానీ నీలా చెట్లను, బండరాళ్ళాను ఆయుధలు చేయగలిగినవాడిని ఇంతవరకు ఎరుగను..”


రామరావణ యుద్ధంలో హనుమంతుడు చేసిన పోరు జ్ఞాపకం వచ్చింది ఆమెకి. యుద్ధం నుంచి రోజు తిరిగొచ్చిన చారులు యుద్ధ విశేషాలను పూసగుచ్చినట్లు చెప్పేవారు. వారిని అడిగి ప్రత్యేకంగా హనుమంతుడి సంగతులు చెప్పించుకునేది కేతకి. అవే విషయాలు గుర్తుకొస్తున్నాయి. వెంట వస్తున్న పరిచారకలకు ఆ విశేషాలు చెప్పసాగింది -


"ధూమరాక్షసుడు పశ్చిమద్వారం గుండా వెళ్ళినప్పుడు అక్కడ కాళ యముడిలా నిలబడ్డాట హనుమంతుడు. పెద్ద బండరాయిని ఎత్తి అతని రధం మీద విసిరాడట. రథం తునాతునకలైంది. ధుమరాక్షసుడు పరుగు లంకించుకున్నాడు.. అతని వెంటే హనుమంతుడు కూడా. మరో పెద్ద రాతిని చేతులతో పైకెత్తి అలాగే పరుగెత్తాడట.. రాక్షసుడు గదతో కొట్టినా చలించలేదట.. ఎన్నో యోజనాలు అలా పరుగెత్తి ధూమరాక్షసుడు అలసిపోతే వాడి నెత్తి ఆ రాయిని విసిరి చంపేశాడు.. తెలుసా?" అన్నది.


"అమ్మయ్యో.. ఎంతటి వీరుడో" అన్నది ఒక రాక్షసపడుచు.


"మరి ఏమనుకున్నావు? మరోనాడు అకంపనుడు పధ్నాలుగు బాణాలతో హనుమంతుడి గుండెల్ని చీలిస్తే కూడా లెక్క చేయక పెద్ద చెట్టుతో వాడి తలపై మోదాడుట.. నీలుణ్ణి చంపబోయిన నికుంభుణ్ణి పిడిగుద్దులతో చంపాడు, త్రిషీరుడు కోపగించి వస్తే అతని కత్తితో అతనినే చంపాడు.. ఆనాడు జంబుమాలిని శిరస్సును సైతం గదతో వేయి వక్కల చేయలేదా?" తదాత్మీయంగా చెప్పుకొచ్చింది కేతకి.


"అయితే అమ్మా... రావణుడి రాజ్యంలో పుట్టి శత్రువైన హనుమంతుణ్ణి ప్రేమిస్తున్నారే.."


"నోరు ముయ్యండి.. ప్రేమకాదిది.. ఆరాధన.. ఆయన నాకు దైవంతో సమానం" కోపంగా అంటూ బిర బిరా నడిచింది కేతకి.


అక్కడ అశోకవనంలో సీత కూర్చొని వుంది. రామాలింగనాభిలాషియై క్షణ క్షణం పరితపించిపోతోంది. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదని ఆమె కళ్ళు చెప్తున్నాయి. శీతలపవనాలతో ఆమెను నిద్రింపచేయాలని ప్రయత్నిస్తూ అశోక చెట్లు అలసిపోయాయి. రావణ సంహారం గురించి త్రిజట చెప్పగానే ఆనందంతో త్రిజటను గట్టిగా కౌగలించుకుంది. "రముడొస్తున్నాడు.. నా రాముడొస్తున్నాడని.." ప్రతి చెట్టుకీ చెప్పుకుంది. కీరవాణి రాగాల పక్షులను చేరదీసి రామనామం చెప్పించి మురిసిపోయింది. ఇక రాత్రేమిటి పగలేమిటి.. ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా.. ఎప్పుడు తాను అహల్య అయ్యి పాదాలు తాకుతానా, ఎప్పుడు తాను గుహుడు అయ్యి పాదాలు కడుగుతానా అని ఎదురు చూస్తోంది.. రామవామాంకాన కూర్చొని ఎప్పుడు ఆ పవిత్ర కరస్పర్శకు పరవశురాలిని అవుతానా అని ఎదురు చూస్తూ నిద్రను ఎప్పుడో తరిమేసింది.


కేతకి సీతను పరిశీలనగా చూసింది. నిద్ర లేమితో ఆమె కళ్ళు మగతగా వున్నాయి. నెమ్మదిగా మూసుకుపోతున్న కళ్ళతో ఒక్క క్షణం నిద్రలోకి జారుకొని, ఆ ఒక్క క్షణంలోనే రాముడు వచ్చేశాడేమో అన్న ఆతృతతో చటుక్కున కళ్ళు తెరిచి చుట్టుపక్కల చూస్తోంది. కేతకి నవ్వుకుంది.


"ఆ రోజు.. హనుమంతుడు సంజీవని తేవడానికి ఉత్తరానికి వెళ్ళినప్పుడు.. తాను ఇలాగే రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూసింది. గగన మార్గంలో తిరిగి వచ్చే హనుమంతుణ్ణి చూడాలని కళ్ళలో దీపాలు వెలిగించి కూర్చుంది. నిద్ర మత్తు వదలకపోతుంటే అటూ ఇటూ గెంతుతూ ఆంజనేయుణ్ణి అనుకరిస్తూ.. ఎప్పుడెప్పుడు వస్తాడా అని దృష్టంతా ఆకాశం మీదే నిలిపి వుంచింది... అంతలో సూర్యోదయం... సూర్యుడు వుదయిస్తే లక్ష్మణుడు బతకడు... లక్ష్మణుడు లేకపోతే రాముడు జీవించడు... స్వామి కార్యం నిర్వర్తించలేకపోయాడన్న అపఖ్యాతి హనుమంతుడి వస్తుంది.. ఆ విషయం తలుస్తూ సూర్యుణ్ణి నిందిస్తూ భోరున విలపించింది... తీరా చూస్తే అది సూర్యబింబం కాదు... సంజీవని బదులు ఆ పర్వతాన్నే పెకలించుకొని హనుమంతుడు.. ఆ పర్వత కాంతిలో వెలుగుతూ... ఓహ్... ఎంతటి మనోహర దృశ్యమది..!!"


"అమ్మా కేతకమ్మగారు.. ఏమిటమ్మ మీ పరధ్యానం" అంటూ పిలిచారు పరిచారికలు.


కేతకి తేరుకోని తెచ్చిన నగలను, పట్టు వస్త్రాలను సీత ముందు పెట్టించింది. సీతకు నమస్కరించి - "అమ్మా మిమ్మల్ని అలంకరించమని యువరాణి త్రిజటగారి ఆజ్ఞ.." అన్నది.


సీతమ్మ నవ్వింది. అలంకార భూషణాదులు తిరస్కరించింది. తన భర్త నార వస్త్రాలతో వుంటే తాను అవే ధరిస్తానని పట్టుబట్టింది.


"అమ్మా ఇంతకాలానికి నీ భర్తను చూడబోతున్నావు.. కొంతైనా అలంకారం లేకపోతే ఎట్లాగమ్మా" అని నచ్చ చెప్పబోయింది కేతకి.


సీతమ్మ నవ్వి నాడు హనుమంతుడు తెచ్చిచ్చిన అగుళీయకము తీసి చూపించి, తన వేలికి తొడుగుకుంది. కేతకి సంభ్రమముగా చూసింది. సీతారాముల అనురాగానికి చిహనమైన ఆ అంగుళీయకము తళుక్కున మెరిసింది. ఆ వుంగరము తెచ్చి ఇచ్చి ఈ నాడు వారి సమాగమానికి కారణమైన ఆంజనేయుణ్ణి తలచుకొని కేతకి భక్తిగా నమస్కరించింది.


ఇంతలో వందిమాగధులు వచ్చి నిలబడ్డారు. కేతకి గుండె వేగంగా కొట్టుకుంది.


"సీతారామసేవాపరాయణ.. బహాబలశాలి.. అంజనీపుత్ర.. వాయునందన.. హనుమనామభూషణ వేంచేస్తున్నారు.." అంటూ ప్రకటించారు.


సీత దిగ్గున లేచి నిలబడింది. కేతకి అనాలోచితంగా నాలుగడుగులు ముందుకు వురికి హనుమంతుణ్ణి చూడటానికి తహ తహ లాడింది.


"ఎందుకమ్మా అంత తొందర?" అన్నారు పరిచారికలు.


"నీకు తెలియదే.. ఒక్కసారి ఆయన్ను చూస్తే చాలు... ఆ వీరుడు.." చెప్తున్నదల్లా ఆగిపోయింది. అక్కడికి కొన్ని అడుగుల దూరంలో..


అదుగో.. అతనే.. వస్తున్నాడు.. చేతిలో గద, సూక్ష్మ దృష్టి, ఆజాను బాహువులు, కండలు తిరిగిన శరీరం.. ఠీవిగా.. దర్జాగా.. ఆయన వేసే ఒక్కొక్క అడుగుకి భూమి కంపిస్తున్నట్లుంది.. నిరంతర రామ నామ గానం.. అదిగో అదిగో అతనే ఆంజనా దేవి తపఃఫలం.. హనుమంతుడు.


కేతకి అలాగే చూస్తూ వుంది. హనుమంతుడు కొంత దూరమ్నుంచే సీతను చూశాడు.. అతనిలోని వానరుడు నిద్రలేచాడు. సంతోషంతో దుముకుతూ.. "అమ్మా.. సీతమ్మా.. జయం తల్లీ... విజయం.. శ్రీరామ విజయం.. నీ కష్టాలు తీరాయి మాతా.." అంటూ వచ్చాడి. సీతమ్మ పాదాలకు నమస్కరించాడు.


"అమ్మా నాడు నిన్ను దర్శించి నీ క్షేమ వార్తను రాముడికి తెలిపే భాగ్యం నాకు కలిగింది. ఈ నాడు యుద్ధానంతరం రామ క్షేమ వార్తను నీకు తెలియజేసే భాగ్యం కూడా నాకే దక్కింది తల్లీ.. నా జన్మ చరితార్థమైంది." అన్నాడు కన్నీళ్ళ పర్యంతమౌతూ.


సీతమ్మ కూడా కన్నీళ్ళు వర్షిస్తుండగా - "నాయనా.. ఈ శుభవార్త చెప్పిన నీకు ఏ బహుమతి ఇవ్వలేని నిర్భాగ్య స్థితిలో వున్నాను.. నిన్ను నా బిడ్డగా స్వీకరించడం తప్ప ఇంకేమి ఇవ్వలేను నాయనా" అన్నది.


"అమ్మా.. నీవెప్పూడూ మా సీతమ్మ తల్లివేనమ్మా.." అంటూ ఆమె చుట్టూ కలియ చూశాడు. ఆమె పక్కగా కేతకి తన పరివారముతో నిలబడివుంది. వారంతా అక్కడ జరుగుతున్న సంభాషణకు ఆర్ద్ర్తతకు లోనై స్థాణువుల్లా నిలబడిపోయారు.


"ఓహో.. రాక్షసులు అంతమైనా ఇంకా నిన్ను భయపెట్టి.. రావణుడికి లొంగమని నిన్ను ప్రలోభపెట్టిన ఈ రాక్షస కాంతలు ఇంకా బ్రతికే వున్నారా" అంటూ హూంకరించి గద పైకెత్తి వారి మీదకు దూకబోయాడు. ఆయన కళ్ళు పెద్దవి అయ్యాయి.. ఆవేశంతో వూగిపోతున్నాడు.. బలంగా పెదవులను బిగించాడు.. చేతులపై, వక్షస్థలం పైన కండలు వుబికి వస్తున్నాయి..


అతని భీకరాకారం చూసి పరిచారికలంతా భయంతో చెల్లాచెదురయ్యారు. ఎటు దిక్కు వారు అటు పరుగులు తీశారు. కేతకి ఒక్కతే అక్కడ నిలబడిపోయింది. నిశ్చలంగా, నిర్భయంగా.. హనుమంతుడి రౌద్ర రూపాన్ని మనసారా ఆస్వాదిస్తూ పరిసరాలను మర్చిపోయి వుంది.


"హనుమా ఆగు ఆగు నాయనా.." అంటూ సీత ఆపింది అతడిని. వీరంతా వీభీషణుడి కూతురు త్రిజట పంపించగా నన్ను అలంకరించేందుకు వచ్చారు. వీరే పాపము ఎరుగరు.. అయినా నన్ను బాధించిన రాక్షస కాంతలు సైతం వారి రాజు ఆజ్ఞనే కదా పాటించారు.." అంటూ సర్ది చెప్పింది.


కేతకి తేరుకోని హటత్తుగా ముందుకు వంగి హనుమంతుడి పాదాలపై పడి నమస్కరించింది. హనుమంతుడు ఆమెను లేవనెత్తి -


"నా రౌద్ర రూపం చూసి మహా మహులే భయకంపితులౌతారు.. నీవు చూస్తే పదహారేళ్ళు దాటని పసి పిల్లవి.. నీవు నన్ను చూసి అంత ధైర్యంగా ఎలా నిలబడ్డావు.." అన్నాడు మారుతి.


"స్వామి.. నేను పుట్టిన దగ్గరనుంచి లంకా నగర ఖ్యాతిని, రావణ పరివార వీరత్వాన్ని మాత్రమే విన్నాను. ఆ వీరులను సంభ్రమాశ్చర్యాలతో చూచాను.. అటువంటి వీరులనందరిని ఒక్క చేతితో మట్టి కరిపించిన మీ వీరత్వానికి ముగ్ధురాలనైనాను.. మిమ్మల్నే ఆరాధించాను.. పూజించాను.. మీరు నా దైవం.. అందుకే నాకు భయం వెయ్యలేదు.. ఈ లంకా నగర ఖ్యాతిని సమూలంగా నాశనం చేసిన మీ వీరత్వం.. మహా బలశాలురైన రాక్షుసులను దురిమిన మీ రౌద్రం దర్శించుకునే భాగ్యం కలిగినందుకు ధన్యురాలనైనాను.." అంటూ నమస్కరించింది కేతకి.


"పిచ్చి దానా.. ఎంతటి అమాయకురాలవమ్మా? ఈ రాక్షస సంహారం చేసింది మా కోతిమూక అనుకున్నావా? ఇదంత నా ప్రజ్ఞే అనుకున్నావా.. రాక్షసులను తుదముట్టించినది రామనామనే అస్త్రాలు, ఈ లంకను నాశనం చేసింది.. నా తోకకి పెట్టిన నిప్పు అనుకుంటున్నావేమో.. అది కాదు.. ఇదుగో ఈ సీతమ్మతల్లి కార్చిన కన్నీరు లంకా దహనం గావించింది.. అటువంటి ఈ సీతారాములను ధ్యానించు నీకు తప్పక శుభం కలుగుతుంది" అంటూ వెనుతిరిగాడు హనుమంతుడు.
కేతకి మనసులోనే సీతరాముల్ని ధ్యానించింది.

ముందే తెలిసెనా ప్రభూ.. (Information is wealth)"ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్" అని ఒక సామెత. మీకు గుర్తుందో లేదో ఆ మధ్య అరవ డబ్బింగ్ఐన "బాయ్స్" చిత్రంలో ఒక సన్నివేశం వుంది. నలుగురు కుర్రాళ్ళలో ఒకడు గుడిబయట వున్న ఒక సన్న్యాసి (సెంథిల్) దగ్గర చేరతాడు. అతను ఈ రోజు ఫలానా మురుగన్ గుడికి వెళ్ళు పొంగల్ ప్రసాదం పెడతారు, ఫలానా ఆండవర్ కోయిల్‌కి వెళ్ళు అక్కడ పులిహోర పెడతారు అని ప్రతి రోజూ చెప్తుంటాడు. మన బాయ్స్ కుర్రాడి పని రోజు అతను చెప్పిన చోటికల్లా వెళ్ళి రెండు ప్లేట్లు (ఇలా అనకూడదేమో) ప్రసాదం తీసుకోని రావడం. ఒకటి తను తిని రెండొవది ఆ సాధువుకు పెట్టడం.


ఒక రోజు ఆ కుర్రాడికి జ్ఞాన+వుదయమై (తెలివి తెల్లారి) "నేను నీ దగ్గర ఎందుకు పని చెయ్యాలి? నా అంతట నేనే తెచ్చుకోని తింటాను" అని ఎదురు తిరిగుతాడు. అప్పుడు మన సన్న్యాసి లేచి కూర్చోని - " చూడు నాయనా.. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఏ గుడి పడితే ఆ గుడికి వెళ్తే ప్రసాదం పెట్టరు. ఎ రోజు ఏ గుళ్ళో ఏ ప్రసాదం పెడతారో, ఏ రోజు ఏ సెంటర్‌లో అన్నదానం జరుగుతుందో, ఎవరెవరి పుట్టినరోజుకి ఎక్కడెక్కడ దుప్పట్లు, బట్టలు పంచుతారో.. ఆ వివరాలన్నీ నా దగ్గర వున్నాయి. ఆ ఇన్‌ఫర్మేషన్ లేకుండ నువ్వు మెతుకు కూడ సంపాదించలేవు" అని చెప్తూ "ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్" అని జ్ఞాన బోధ చేస్తాడు.


ఎంతో విలువైన మాటల్ని అలా కమెడియన్ చేత చెప్పించడం వల్ల మరుగున పడిపోయాయి కాని మన పడయప్ప రజనీ చెప్పుంటే కనీసం ఒక ఇరవై సార్లన్నా రీసౌండ్ అయ్యి వుండేవి.


నా మాట నిజం..!!


కావాలంటే రామాయణమే తీసుకోండి: సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడన్న ఇన్‌ఫర్మేషన్ దాదాపు మూడు కేరక్టర్ల చేత చెప్పిస్తాడు వాల్మీకి. జటాయువు, సంపాతి మరియు (ముఖ్యంగా) హనుమంతుడు ఆ ఇన్‌ఫర్మేషన్ చెప్పడం వల్ల రామాయణ కథ ముందుకు సాగుతుంది. అలాగే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల ఇన్‌ఫర్మేషన్ తెలియకపోవడం వల్లే కౌరవుల బతుకు కురుక్షేత్రమైంది.


ఎకనామిక్స్‌లో ఇన్‌ఫర్మేషన్ అసెమిట్రీ (Information asymmetry) అని ఒక సంగతి వుంది. మిగిలిన అన్ని విషయాలు సమానంగా వున్నప్పుడు, ఇన్‌ఫర్మేషన్ ఒకరికి వుండి ఒకరికి లేకపోవడం వల్లే లాభ నష్టాలు ఏర్పడతాయని ఆ శాస్త్రం చెప్తుంది. జాగర్తగా గమనిస్తే ఈ విషయాన్ని దైనందిన విషయాల్లో చాలా వాటిల్లో మనం గమనించవచ్చు. చిన్నప్పుడు చెవిలో రహస్యం చెప్పుకునేవాళ్ళం గుర్తుందా? అలా చెప్పుకున్నప్పుడు ఎదుటివాళ్ళు "ఆ ఇన్‌ఫర్మేషన్" నాకు తెలియడంలేదే అని వుడుక్కోవడం మనకి తెలుసు. పరీక్షా పేపర్లో ఏమొస్తుందో ఆ ఇన్‌ఫర్మేషన్ లీక్ చేసి (దొరకకపోతే) లాభపడే పిల్లలూ వున్నారు.


అసలు బ్రాహ్మలు ఇలా వేదాలనే ఇన్‌ఫర్మేషన్ దాచి పెట్టుకోవడం వల్లే అగ్రవర్ణాలుగా చలామణీ అవుతున్నారని ఒక అస్థిత్వవాదంవారి ఆరోపణ. నన్నడిగితే ప్రతి కులం, ప్రతి జాతి, ప్రతి కుటుంబం వారి వారి స్థాయిలో వారి వారి రహస్యాలను దాచి పెట్టి ఆ ఇన్‌ఫర్మేషన్ మరొకరికి లేకుండా చెయ్యడం ద్వారా లాభ పడుతూనే వుంటారు. బాబాయ్ హోటల్ ఇడ్లీలో చేసే చట్నీ, సికంద్రాబాద్ బ్లూ సీ టీ, మదురై మురుగన్ ఇడ్లీ షాపులో సాంబార్ - అంత ఏల కే.ఎఫ్.సీ.(KFC) వారి చికెన్ దాకా అన్నీ రహస్యాలే. ఆ రహస్యం విప్పితే వారి సొంత లాభం సాంతం పోయి అందరికీ చులకన అయిపోయుంది. ఇప్పుడు వుదాహరణకి ఉబ్బసానికిచ్చే చేప మందే తెలుసుకోండి - బత్తిన సోదరులు ఆ మందు తయారీ రహస్యం చెప్తే ఇంకేముంది? - జనాలకు అంత అంత వ్యయ ప్రయాసలకు వోర్చి వెళ్ళాల్సిన పని వుండదు, ప్రభుత్వానికి ఆ మందు పంపిణీ కోసం ఏర్పాట్లు చెయ్యాల్సిన అగత్యం వుండదు, హేతువాదులకు ఇదంతా బూటకమని ప్రదర్శించాల్సిన అవసరం వుండదు.

అంత ఎందుకు మీరు పది వేలు పెట్టి అమీర్‌పేట్‌లో కొన్న చీర అహమదాబాద్ వెళ్తే పదిహేను వందలకే దొరుకుతుంది అంటే మీరు కొంటారా? ఆ షాపు వాడు మీకు ఇన్‌ఫర్మేషన్ లేదు అని తెలుసు కాబట్టే "ఆ ఇన్‌ఫర్మేషన్ లేమిని (Lack of information)కి ఖరీదు కట్టి దాన్ని మీదగ్గర గుంజుతాడు.


ఇదంతా ఇన్‌ఫర్మేషన్ బయటికి చెప్పకుండా పబ్బం గడుపుకునే వారి సంగతి. మరో ముఖ్యమైన రకం మరొకటి వుంది. అది సెలక్టివ్‌గా ఇన్‌ఫర్మేషన్ బయటికి వదిలేవారి సంగతి. ఫలానా చోట ప్రభుత్వం పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతోంది అన్న విషయం ఆ పరిసర ప్రాంతాల్లో వున్న ముఖ్య మంత్రి లేదా పరిశ్రమల మంత్రి బంధువర్గానికే ముందు తెలుస్తుంది. వాళ్ళు అక్కడ పొలాలు కారు చౌకగా కొనుక్కున్న తరువాత రైతులకి తెలుస్తుంది. అప్పటికే పొలం ధర రెండింతలౌతుంది. ఇలాగే రింగ్‌రోడ్లు, సెజ్‌లు ఇలాంటి వివరాలన్నీ ప్రజాప్రతినిధులు, వారి వారి బంధువులకు ముందుగా తెలియడం వారి అమోఘమైన తెలివితేటలకి, మహత్తరమైన జాతకానికి కాక, పదవుల్లో వున్నవారితో పరిచయాల కారణంగానే జరుగుతున్నట్టు మనం గమనించాలి.


ఈ ఇన్‌ఫర్మేషన్ తెలిసినా, దాన్ని చెప్పకుండా దాచినా,లేదూ చెప్పేసినా.. ప్రతిదానికీ ఒక టైం వుంటుంది. ఆ టైం ప్రకారం దాచడం లేదా చెప్పడం వల్లే ఇన్‌ఫర్మేషన్ వల్ల లాభాలు కలుగుతాయి. ముందే తెలిసిపోతే ఆ ఇన్‌ఫర్మేషన్‌కి ఎం విలువ వుంటుంది? ఫలానా థ్రిల్లర్ సినిమలో విలన్, ఫలానా కమెడియనే అని చెప్తే ఎలా వుంటుంది? అలాగన్న మాట. ఇప్పుడు మన అమెరికానే చూడండి. ఆఫ్గనిస్థాన్‌లో ట్రిలియన్ ఖరీదు చేసే ఖనిజాలు వున్నట్టు ఇప్పుడు ప్రకటించింది. అదే ప్రకటన తాలిబన్‌ల మీద యుద్ధం చేసి, ఆఫ్గనిస్థాన్ని అమెరికా సైనికులు ఆక్రమించక ముందు చెప్పి వుంటే ఏమయ్యేది? అది ఇప్పటిదాకా అమెరికాకి తెలియదంటే మనం నమ్మాలా? ఏమో నా దగ్గర ఆ "ఇన్‌ఫర్మేషన్" మాత్రం లేదు.


ఏమైనా ఇప్పుడు ఆఫ్గన్లు మాత్రం బహుశా - "ముందే తెలిసెనా ప్రభూ.." అంటూ పాడుకుంటుంటారు..!!

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా కథ

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా కథ "చిలకరాయబారం" ప్రచురించారు. అంతర్జాలంలో ఈ లంకెలో కథ చదువవచ్చు - "చిలకరాయబారం"