గుండెల్లో ఏముందో...


అప్పటికే రెండు బైపాస్ సర్జరీలు చేయించుకున్న విశ్వకర్మకి ఆ ప్రకటన మొదట ఆశ్చర్యాన్ని కలిగించినా పోను పోనూ ఆసక్తిని, ఆ తరువాత ఆశని రేకెత్తించాయి. ఆ రోజు సాయంత్రం దాకా ఆలోచించి చివరికి అందులో వున్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేశాడు. మర్నాడు ఉదయం పది గంటలకి అపాయింట్ మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఇక రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదతనికి. మళ్ళీ ఒకసారి లేచి దిండు కింద దాచుకున్నా ఆ కాగితాన్ని మళ్ళీ తీసి చూసుకున్నాడు.
వైద్య రంగలో సరికొత్త సాంకేతిక విప్లవం – ఎలక్ట్రానిక్ అవయవాలు
మీ శరీరంలో గుండె, లివర్, మెదడు లాంటి ఏ భాగమైనా ఇక పని చెయ్యనని మొరాయిస్తోందా? అయితే వెంటనే రండి. మా డాక్టర్ త్రినేత్రం ఆధ్వర్యంలో తయారైన ఎలక్ట్రానికి అవయవాన్ని అమర్చుకోని వెళ్ళెండి. వివరాలకు సంప్రదించండి: పంచభూత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్..
మళ్ళీ మళ్ళీ చదువుకోని తృప్తిగా అనిపించాక మంచం మీద పడుకోని కలత నిద్ర పోయాడు విశ్వకర్మ.
***
పంచభూత హాస్పిటల్ కి వెళ్ళి రిసెప్షన్ లో తన పేరు వివరాలు చెప్పాడు. రిసెప్షనిస్ట్ వెంటనే ఎవరో డాక్టర్ కి ఫోన్ చేసి – “ఆయన వచ్చారు” అంది క్లుప్తంగా. అంత క్లుప్తంగా చెప్పినా ఆమె గొంతులో వున్న ఉత్సుకతని గమనించి నవ్వుకున్నాడు విశ్వకర్మ.
మరునిముషంలో హాస్పిటల్ మొత్తం కలకలం రేగింది. దాదాపు అయిదుగ్గురు డాక్టర్లు, నలుగురు నర్సులు పరుగులాంటి నడకలో అతని కూర్చోని వున్న లాబీలోకి వచ్చి నిలబడ్డారు.
“మిస్టర్ విశ్వకర్మ??” అడిగాడు అందరిలో చురుకైనవాడిలా కనపడుతున్న డాక్టర్. విశ్వకర్మ నిలబడి తల వూపాడు.
“ఓహ్.. వెరీ గ్లాడ్... నా పేరు డాక్టర్ త్రినేత్రం... రండి నా ఛాంబర్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం..” అంటూనే ముందుకు కదిలాడు అతను. ఆ వెనకాలే విశ్వకర్మ, అతని వెనకాల హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కదిలారు.
ఏసీతో చల్లబడిపోయిన ఒక గదిలోకి వెళ్ళి త్రినేత్రం వెనక్కి తిరిగి విశ్వకర్మని సాదరంగా ఆహ్వానించాడు. ఆ వెనకే వస్తున్న పరివారాన్ని వద్దని కళ్ళతోనే వారించి పంపించాడు.
“కూర్చోండి...” అన్నాడు సీటు చూపిస్తూ.
విశ్వకర్మ చుట్టూ పరికించి చూశాడు. గది మొత్తం చాలా కుదురుగా సర్దినట్లు వుంది. ఏ డాక్టర్ దగ్గరైనా కనిపించే స్టెతస్కోప్, ప్రిస్ క్రిప్షన్ పాడ్ లాంటివి ఏవీ అక్కడ లేకపోవటం  గమనించాడతను. గోడల మీద మొత్తం రకరకాల మానవ అవయవాల ఫొటోలు, వాటి పక్కనే చిన్న చిన్న కంప్యూటర్ పరికరాల్లాంటి ఎలక్టానిక్ అవయవాలు వున్నాయి. గుండెకు సంబంధించిన ఫోటో, దాని పక్కనే వున్న చిన్న స్పీకర్ లాంటి పరికరాన్ని చూసి అదే తన గుండె స్థానంలో చేరబోతోందని అనుకోని ఒక్కసారి గుండెని తడుముకున్నాడు.
“ఓకే మిస్టర్ విశ్వకర్మ... మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు గుండె మార్పిడి కోరుకుంటున్నారు... వెల్.. వెరీగుడ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు... రెండు సార్లు ఎటాక్ వచ్చిందని చెప్పారు... ఇంకోసారి వచ్చిందంటే ప్రాణానికే ప్రమాదం... మీకు తెలిసేవుంటుందిలెండి.. డాక్టర్ కన్నా రోగికి అనుభవం ఎక్కువ కదా...” అంటూ జోక్ వేసినవాడిలాగా నవ్వాడు. విశ్వకర్మ జోక్ అర్థం కానివాడిలాగా ముఖం పెట్టి తలాడించాడు.
“సరే... ఎలాగూ అన్నింటికి సిద్ధపడ్డారు కాబట్టి అసలు విషయానికి వస్తాను... మీకు అమర్చడానికి ఎలక్ట్రానికి గుండె రెడీగా వుంది. దానికి సంబంధించిన షరతులు, ఎలా వాడుకోవాలో ఆ వివరాలు అన్నీ ఈ మాన్యువల్స్,  డాకుమెంట్స్ లో వున్నాయి. అవన్నీ పూర్తిగా చదివి, అందులో వున్న కండీషన్స్ మీకు ఓకే అయితే కింద సంతకాలు పెట్టండి...” అంటూ ఒక దాదాపు వంద పేజీలు వున్న ఫైలుని అతని ముందు పెట్టాడు. “చదువుతూ వుండ”మని చెప్పి త్రినేత్రం బయటికి వెళ్ళాడు.
ఎప్పుడెప్పుడు గుండె మార్చుకుందామా అని తొందరలో వున్న విశ్వకర్మకి ఆ ఫైలు చూసే సరికి నిరుత్సాహం కమ్ముకుంది. సంతకం చెయ్యటం ఎలాగూ తప్పదు కాబట్టి చదవటం ఎందుకని అనుకోని అన్ని కాగితాల మీద టకటకా సంతకాలు పెట్టేశాడు. అందులో అక్కడక్కడా ఆ మెషీన్ కి సంబంధించిన ఫొటోలు, అది వాడాల్సిన విధానం వంటి వివరాలు వున్నాయని గమనించాడు కానీ వాటిని చదవలేదు. అవసరం అయితే అన్నీ డాక్టరే చెప్తాడని అతని అభిప్రాయం.
డాక్టర్ త్రినేత్రం తిరిగివచ్చాక ఫైలు లో సంతకాలు పెట్టి వుండటం చూసి – “అన్నీ చదివారా?” అని అనుమానం వెలిబుచ్చాడు.
విశ్వకర్మకి ఏం చెప్పాలో తెలియక చదివినట్లే తల వూపాడు.
“అన్ని పేజీలు ఇంత తొందరగా చదివారంటే నేను నమ్మను... మీరు సంతకాలు చేశారు కాబట్టి ఇంక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు... కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి“ అంటూ ఒక క్షణం తటపటాయించి మళ్ళీ కొనసాగించాడు.
“మీకు ఇప్పుడు అమర్చబోయేది ట్రైల్ పాక్... వారం రోజులు వాలిడిటీ వుంటుంది. ఆ తరువాత ఎలానూ మీరు రెన్యువల్ చేయించుకుంటారు... అలా చెయ్యని పక్షంలో మరో వారానికి మా పరికరాన్ని తిరిగి తీసేసుకునేందుకు అవకాశం వుంటుంది. ఇందులో ప్రతి నెలా రెంటల్ ప్యాక్ వుంది, లేదా మొత్తం ఒకేసారి కట్టే అవకాశం కూడా వుంది...” అంటూ ఇంకా ఎన్నో వివరాలు చెప్పాడు. అన్నింటికీ తలాడించాడు విశ్వకర్మ.
“ఒకవేళ నాకు రెన్యువల్ వద్దనిపిస్తే?” అడిగాడు విశ్వకర్మ.
“వద్దంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తాము..”
“తీసేసి మళ్ళీ నా గుండె తిరిగి పెట్టేస్తారా?”
“ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ విశ్వకర్మా? ఒకసారి తీసేసిన గుండె ఇంక ఎందుకూ పనికిరాదు... ఈ వివరాలన్నీ మీకు ఇచ్చిన మాన్యువల్ లో వున్నాయి... అందుకే మీరు దాన్ని ఒకసారి చదవటం మంచింది...” చెప్తున్న డాక్టర్ మాటలకి అడ్డుపడ్డాడు విశ్వకర్మ.
“నాకు మాన్యువల్స్, ఇన్స్ట్రక్షన్స్ చదివే అలవాటు లేదు... మీ పని మీరు కానివ్వండి..” చెప్పాడు స్థిరంగా. చేసేదిలేక డాక్టర్ ఒప్పుకున్నాడు.
ఆపరేషన్ జరిగిపోయింది.
***
విశ్వకర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కొత్త గుండెతో కొత్త రక్తం పుట్టుకొచ్చిన కుర్రవాడిలా ప్రవర్తిస్తున్నాడు. రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతున్నాడు.
“ఎందుకురా అన్ని తాగుతావు? నీ గుండె ఆగిపోగలదు జాగ్రత్త” అని అతని స్నేహితుడు సురేష్ అంటే గట్టిగా నవ్వేశాడు.
“నా గుండె స్టీల్ రా స్టీల్... గుండేసి పేల్చినా పేలదు...” అంటూ ఇంకా నవ్వాడు.
మరోసారి బస్ స్టాప్ లో వున్నప్పుడు పక్కనే నిలబడ్డ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. కొత్త గుండె కదా కొత్త కొత్త కోరికలు కూడా పుట్టుకొస్తున్నాయి. అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తే గొడవ గొడవ చేసి, దాదాపు పోలీసులు వచ్చేదాకా చేసింది. ఆ వచ్చిన పోలీసుల్లో పరిచయం వున్నతను వున్నాడు కాబట్టి బయటపడ్డాడు.
మరో రోజు చాలా కాలంగా చూడాలనుకుంటున్న హర్రర్ సినిమాల డీవీడీ తెచ్చుకోని అర్థరాత్రి దాకా అవే చూశాడు. ఇప్పుడు అతని గుండెల్లో భయమనేదే లేదు కాబట్టి ఆ హర్రర్ సినిమాలన్నీ కామెడీ సినిమాల లాగా అనిపించాయి.
ఆ రోజు నుంచి మూడు రోజులపాటు గుండెలేని మనిషిగా ఒక కొత్త లోకాన్ని చూస్తున్న అనుభూతి పొందాడు విశ్వకర్మ. మూడో రోజు రాత్రి ప్రశాంతగా నిద్రపోయాడు కానీ తెల్లవారుఝాము నాలుగు గంటలకి ఛాతిలో నొప్పిగా అనిపించి లేచి కూర్చున్నాడు. ఇంతకు ముందు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చినవాడు కాబట్టి ఇప్పుడు వస్తున్న నొప్పి అలాంటిదే అని అర్థం చేసుకున్నాడు. అయితే నిజం గుండె వున్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపొయేది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియదు.
“ఆ మాన్యువల్ చదివినా బాగుండేది...” అనుకున్నాడు. అప్పటికప్పుడు ఎక్కడో పడేసిన మాన్యువల్ కోసం వెతికి తీసేసరికి అరగంట పట్టింది. నొప్పి ఇంకొంచెం ఎక్కువైంది. మాన్యువల్ లో వున్న కాల్ సెంటర్ కి ఫోన్ చేశాడు.
“హలో” అంది తీయని కంఠం.
“హలో... నా పేరు విశ్వకర్మ... మొన్ననే ఎలక్ట్రానిక్ గుండె పెట్టించుకున్నాను...”
“మీ గుండె నెంబర్ చెప్పండి..” అలవాటైన తరహాలో అడిగిందా అమ్మాయి.
“నెంబరా... అదేంటో నాకు తెలియదు... ఎక్కడుంటుంది?”
“మీ గుండె మీదే రాసి వుంటుంది... వెతకండి..”
“అమ్మాయ్... నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? లోపల వున్న గుండెని తీసి ఎలా చూస్తారు?” కోపంగా అడిగాడు విశ్వకర్మ.
“అయితే మీ ఫైల్ లో ఒక గ్రీన్ కలర్ పేపర్ వుంటుంది అందులో చూసి చెప్పండి...” అడిగింది. అతను చెప్పాడు.
“మీ ప్రాబ్లం చెప్పండి?”
“నొప్పి... గుండెల్లో నొప్పి పుడుతోంది...”
“మా రికార్డ్స్ ప్రకారం అంతా కరెక్ట్ గానే వుందే... ఈ మధ్య మీరేమైనా నదిలో కానీ, సముద్రంలో కానీ దూకారా?”
“లేదే”
“పోనీ అతి చలి ప్రదేశానికి కానీ, ఎడారుల్లాంటి వేడి ప్రదేశానికి కానీ వెళ్ళారా?”
“లేదే”
ఆ అమ్మాయి ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగింది. అప్పటికే నొప్పి ఎక్కువై కూలబడిపోయాడు విశ్వకర్మ. దాదాపు పన్నెండు ప్రశ్నల తరువాత ఆ అమ్మాయి చెప్పింది – “సార్ నాకు తెలిసినంతవరకూ సమస్య ఎక్కడ వుందో అర్థం కావటంలేదు... ఒకసారి హాస్పిటల్ కి తొమ్మింది గంటలకి రండి... అన్నట్టు వచ్చేటప్పుడు మీ హార్ట్ ఫుల్ ఛార్జింగ్ వుండేట్టు చూసుకోండి...” మధ్యలోనే అందుకున్నాడు విశ్వకర్మ.
“ఏమన్నావు... ఛార్జింగ్ ఫుల్ గా వుండాలా? అంటే ఈ గుండెని ఛార్జింగ్ లో పెట్టాలా?” అడిగాడు కొత్త విషయం విన్నవాడిలా.
“అవునండీ... ఆ విషయం మాన్యువల్ లో వుంది కదా చదవలేదా? అయితే మీరు గుండె పెట్టించుకున్న తరువాత ఒక్కసారి కూడా ఛార్జింగ్ చెయ్యలేదా?” అడిగింది ఆందోళనగా.
“లేదు చెయ్యలేదు...”
“ఓ మై గాడ్... అర్జంట్ గా చార్జింగ్ పెట్టండి... లేదంటే అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది..” దాదాపు అరిచినంత పని చేసింది ఆ అమ్మాయి. విషయం అర్థం అయిన వెంటనే మాన్యువల్ ముందేసుకోని ఎలా ఛార్జింగ్ చెయ్యాలా అని వెతికాడు విశ్వకర్మ. అది తెలుసుకునే సరికే పావుగంట పట్టింది. దాదాపు కదలలేని స్థితిలో ఛార్జర్ తగిలించుకోని, అతి కష్టం మీద ప్లగ్ లో పెట్టాడు. – ఠప్..!!
పవర్ కట్...!!
“నేటి నుంచి ఉదయం మూడు గంటలు పవర్ కట్...” పేపర్ లో వార్త చూస్తూ నేలకి ఒరిగిపోయాడు విశ్వకర్మ.

?
(సన్ ఫ్లవర్)

అగంతకులు


రెండో పెగ్గు ఘాటుగా దిగిన తరువాత గమనించాను అతన్ని. నా వైపే చూస్తున్నాడతను. ఆ బార్ మొత్తానికి దాదాపుగా మధ్యలో వున్నాను నేను. అతనేమో కుడివైపు మూలగా కూర్చున్నాడు. కొంచెం తల ఎత్తి చూస్తే ఒకరికొకరం కనడతాము. కానీ పరిచయం లేని వ్యక్తి అలా అదే పనిగా నా వైపే చూస్తూ వుండటం నాకు ఆశ్చర్యంగానూ, కొంత అనుమానంగానూ అనిపించింది. పైగా అతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం కూడా సతాయిస్తోంది.

మూడో పెగ్గు వచ్చి టేబుల్ మీద చేరిన తరువాత ఆ గ్లాసు ఎత్తుతూ మళ్ళీ అతని వైపు చూశాను. అతని కళ్ళు నిశ్చలంగా నా పైనే నిలిచి వున్నాయి. అతను నాకు పరిచయస్తుడే అయ్యి వుంటాడు, బహుశా నేనే మర్చిపోయి వుంటాను అని అనుకున్నాను. అందుకే చిన్నగా నవ్వి నా చేతిలో గ్లాసు ఎత్తి పలకరించాను. అతను తిరిగి గ్లాసు ఎత్తుతాడని వూహించాను కానీ అతనిలో ఏ మాత్రం చలనం లేదు. అతని చూపు మరలటంలేదు. ఏదో చిన్నగా 
గొణిగినట్లు అర్థం అయ్యింది.

బార్ మొత్తం గోలగోలగా వుంది. నాకు ఎడమపక్కన వున్న కుర్రళ్ళు ఏదో జోక్ వేసుకొని గట్టిగా నవ్వుతున్నారు. నా ముందు కూర్చున్న సీటులో ఖద్దరు చొక్కా వేసుకున్న పెద్దమనిషి లేవబోయి ఉన్నట్టుండి ఎదురుగా వున్న బల్ల మీద పడిపోయాడు. ఖంగారుగా అక్కడికి చేరిన వెయిటర్ ని అతను తాకనివ్వకుండా – “ఏం ఫర్లేదు... ఐ యామ్ ఆల్ రైట్... నాకేమన్న ఎక్కువైందనుకున్నావా..?” అంటూ గోల చేయటం మొదలుపెట్టాడు. ఇంత గొడవ జరుగుతుంటే అందరి దృష్టి అతని వైపే తిరిగింది, నన్ను చూస్తున్న ఆ ఒక్క అగంతకుడి చూపు తప్ప.

అతను ఎందుకు అదే పనిగా నన్ను చూస్తున్నాడో నాకు అర్థం కావటంలేదు. కళ్ళు ఎగరేసి ఏమిటన్నట్లు సైగ చేశాను. అతను మళ్ళీ అస్పష్టంగా పెదాలు కదిపాడు. అతను ఎంత చిన్నగా మాట్లాడాడంటే, మేం ఇద్దరం ఏ లైబ్రరీలో వున్నా కూడా అతని మాటలు నాకు వినిపించేవి కాదు, అలాంటిది ఇంత గోలలో వినపడే అవకాశమే లేదు. లైబ్రరీ అంటే గుర్తొచ్చింది, వుదయం లైబ్రరీలోనే చూశాను అతన్ని..!!

ఆ రోజు వుదయం లైబ్రరీకి వెళ్ళి నైజీరియాలోని తెగల గురించి పుస్తకం కావాలని అడిగాను. మరో ఆరు నెలల్లో నేను నైజీరియాలో వుద్యోగం చెయ్యడానికి వెళ్ళాలి కాబట్టి, అందులోనూ అక్కడి తెగలగురింఛి తెలుసుకోవాల్సిన అవసరం వుంది కాబట్టి లైబ్రరీకి వచ్చాను. నా ఎదురుగా వున్న లైబ్రేరియన్ తన కంప్యూటర్ లో వెతికి, “సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్ ఎండ్” అని చెప్పాడు.

రెండో అంతస్తులో కుడివైపు చివరికి వెళ్తుండగా కనిపించాడతను. దాదాపు అన్ని పుస్తకాల ర్యాకులు దాటిన తరువాత వున్న గోడ దగ్గర నిలబడి వున్నాడు. చాలా తీక్షణంగా నా వైపే చూస్తున్నాడు. మొదట పట్టించుకోలేదు కానీ, నేను పుస్తకం వెతుకుతున్నంతసేపూ నన్నే చూస్తుండటంతో కొంచెం చిరాకుగా అనిపించింది. అతని వైపు తిరిగి “ఏం కావాలి?” అన్నట్టు చేత్తో సైగ చేశాను. అతను ఏదో చిన్నగా గొణిగాడు. అతను చెప్పింది అర్థం కాక రెండడుగులు అతని వైపు వేశానో లేదో, అతను ఖంగారుగా కదిలి పక్కనే వున్న ర్యాకు దాటి వెళ్ళిపోయాడు. అప్పుడే అతని చేతి కర్రని, సగమే వున్న కుడి కాలుని గమనించాను. ఆ తరువాత అటువైపుగా వెళ్ళాను కానీ, అతను మాత్రం కనపడలేదు. మళ్ళీ ఇదుగో ఇక్కడ బార్ లో కనిపించాడు.

అతను నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని మాత్రం అర్థం అయ్యింది. కానీ దాని కోసం అలా అదే పనిగా చూడటం ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడైనా అతన్ని కలిసి ఆ విషయం ఏమిటో కనుక్కోవాలని లేచాను. సరిగ్గా అప్పుడే నా ఎదురుగా కూర్చున్న ఖద్దరు చొక్కా పెద్దమనిషి తోసిన తోపుకి వెయిటర్ వచ్చి నా మీద పడ్డాడు. ఇద్దరం పడబోయి తమాయించుకోని నిలబడ్డాం. అప్పటికే ఆ పెద్దమనిషి చాలా పెద్ద గొడవ పెట్టుకున్నట్లున్నాడు. ఒక టై కట్టుకున్న వ్యక్తి, బహుశా ఆ బార్ మేనేజర్ అనుకుంటాను వచ్చి నాకు క్షమాపణ చెప్పాడు.
నేను సర్దుకోని కుడివైపు మూల చూసేసరికే ఆ అగంతకుడు అక్కడ లేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు..!!

“అక్కడ ఇప్పటిదాకా కూర్చున్న అతను ఏమయ్యాడు..?” అడిగాను నేను.

“ఎవరు సార్? ఎక్కడ?” అడిగాడు మేనేజర్.

“అదే ఆ మూల టేబుల్...” అంటూ చూపింఛాను.

“అక్కడ ఎవ్వరూ లేరు సార్..” అన్నాడు వెయిటర్.

“ఇప్పుడు లేడు.. ఇప్పటి దాకా కూర్చోని వున్నాడు కదా అతను..?” మళ్ళీ అడిగాను.

“అసలు అక్కడ ఎవరూ కూర్చోలేదు సార్... చూడండి టేబుల్ మీద కూడా ఏమీ లేవు...” అన్నాడు మేనేజర్. 

“మరో తాగుబోతు గొడవ మొదలు పెట్టాడురా” అన్నట్టు వుంది అతని ముఖం.

అతను చెప్పింది కూడా నిజమే. ఆ టేబుల్ ఖాళీగానే వుంది. ఇందాక గమనించలేదు కానీ, ఇప్పుడు గుర్తొస్తోంది... అతను అక్కడ కూర్చొని నన్ను చూడటమే తప్పించి ఏమీ తాగను కూడా లేదు. అంటే కేవలం నన్ను చూడటానికే వచ్చి కూర్చున్నాడన్నమాట. ఎవరా అగంతకుడు?

అప్పటికే ఖద్దరు చొక్కాని బయట వదిలి పెట్టి వచ్చారు బలిష్టంగా వున్న బౌన్సర్ లు. ఆ అగంతకుడి విషయాన్ని మరీ ఎక్కువగా రెట్టిస్తే నన్ను కూడా అలాగే వదిలిపెడతారేమో అని నేను చప్పుడు చెయ్యకుండా మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను. అయిదు పెగ్గుల తరువాతో... లేకపోతే ఆరు పెగ్గుల తరువాతో గుర్తులేదు కానీ, నాకు అర్జంటుగా బాత్రూం కి వెళ్లాల్సివచ్చింది.

బాత్రూంలో పని కానిచ్చి టాప్ దగ్గర నిలబడి ఛేతులు కడుక్కుంటూ తల ఎత్తి చూశాను. ఎదురుగా అద్దంలో, నా వెనుక గోడని ఆనుకోని ఎవరో కొత్త వ్యక్తి కనిపింఛాడు. అప్పటి దాకా నన్ను చూసిన అగంతకుడు కాదితను, వేరే ఎవరో..!! ఇతన్ని కూడా ఎక్కడో చూసినట్లే వుంది. పైగా ఇతను కూడా ఏదో గొణుగుతున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం, భయం రెండూ పుట్టుకొచ్చాయి. అప్పటిదాకా తాగింది దిగిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగటంతో, శరీరంలో చేరిన మందు పనిచేసి తూలి కింద పడ్డాను. కొంచెం తేరుకోని లేచి చూసేసరికి అతను లేడు..!! నేను లోపలికి, బయటికి చూసాను కానీ అతను మాత్రం కనపడలేదు. నా భ్రమా? లేకపోతే ఎక్కువగా తాగానా? లేక నిజంగానే నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా? నాకు ఏమీ అర్థంకాలేదు.

ఆ ఇద్దరి చూపుల్లో ఏదో తెలియని ప్రశ్నలు కనపడ్డాయి నాకు. ఎందుకలా చూస్తున్నారో మాత్రం తెలియటం లేదు. ఆ ఇద్దరి ముఖాలలో పోలికలు ఏవీ లేవు కానీ, ఒక్క విషయంలో మాత్రం ఇద్దరికీ సామీప్యం వుంది. మొదటి వ్యక్తికి కాలు లేదు, రెండో వ్యక్తికి చేతులు లేవు..!!

బయటికి వచ్చి బార్ మొత్తం కలియచూశాను. ఎక్కడా ఆ ఇద్దరి జాడ మాత్రం లేదు. నా సీట్లో కూర్చోని మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను. అప్పటికే ఎక్కువ తాగేసినా, ఈ హడావిడిలో తాగిందంతా దిగిపోయిందని అనిపింఛింది. దాంతో మరో రెండు పెగ్గులు తాగి బిల్లు కట్టి బయటపడ్డాను.

నా కారు పార్కింగ్ లో నుంచి తీసి గేటు దగ్గరికి నడిపింఛాను. అప్పటికే నా నరనరాలలో ఇంకిపోయిన నిషా కళ్ళు మూతలు పడేలా చేస్తోంది. హఠాత్తుగా ఒక మనిషి నా కార్ ఎదురుగా నిలబడ్డట్లు గమనించాను. సడన్ బ్రేక్.. బండి అప్పటికి వేగం పుంజుకోలేదు కాబట్టి అతనికి దగ్గరగా వెళ్ళి ఆగింది. అతను కూడా నా వైపే చూస్తూ, తల అడ్డంగా ఆడిస్తూ ఏదో అస్పష్టంగా గొణుగుతున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు చూసినట్లుగానే అదే రకంగా చూస్తున్నాడు, అదే విధంగా పెదాలు కదిలిస్తున్నాడు. కాకపోతే ఇతను వేరే వ్యక్తి. ఇతని ముఖం నిండా బలమైన గాయాలు మానినట్లు గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ చూపులోనే ఆదో వ్యక్తీకరిస్తున్నాడు. ఏదో అభ్యర్థన, ఏదో హెచ్చరిక..!! అర్థం కాని ఏదో భావం..? ఏమిటది?? ఏమిటి??

హారన్ బలంగా కొట్టాను కానీ, అతనిలో ఏ చలనం లేదు. చేతులు కట్టుకోని అదే పనిగా నా వైపే తీక్షణంగా చూస్తూ ఏదో, మంత్రాలు పఠిస్తున్నట్లు గొణుగుతున్నాడు. హారన్ నాలుగుసార్లు కొట్టినా ఏ మాత్రం కదిలే వుద్దేశ్యం లేనట్టు చూస్తూ వుండిపోయాడు.

హఠాత్తుగా నా పక్కన కిటికీలో ఒక తల ప్రత్యక్షమైంది. గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆపేసి, తిరిగి వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను సెక్యూరిటీ గార్డ్.

“ఏమైంది సార్?” అడిగాడు.

“వాణ్ణి అడ్డం లేవమని చెప్పు..” అన్నాను ఎదురుగా చూపిస్తూ.

“అక్కడ ఎవరూ లేరు సార్..” చెప్పాడతను. నేను తలతిప్పి ఎదురుగా చూసి అదిరిపడ్డాను. అక్కడ ఎవరూ లేరు.. అటు ఇటూ చూసినా ఎవరూ కనపడలేదు. ఏమిటీ మాయ... మూడు సార్లు ఒకే అనుభవం... కనిపించినట్లే వుంటారు.. ఇంతలోనే మాయం అవుతారు.

“సార్.. కార్ తీయండి సార్..” అన్నాడు గార్డ్ అసహనంగా. కారుని గేటు దాటించి రోడ్డు ఎక్కగానే, కారుతో పాటే నా ఆలోచనలు కూడా వేగం పుంజుకున్నాయి.

పొద్దున్నించి కనిపించిన మనుషులే కనిపిస్తున్నారు. అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో విషాదాన్ని చూస్తున్నట్లు బాధ నిండిన కళ్ళతో చూడటం, అస్పష్టంగా వినపడని గొంతుతో ఏదో మాట్లాడటం, నేను వాళ్ళని కలిసేలోపలే మాయమవ్వడం. అసలు ఏం జరుగుతోంది... వున్నట్టుండి నాకో విషయం స్పురించింది. నాకు కనపడ్డవాళ్ళందరికీ ఏదో ఒక లోపం వుంది. లైబ్రరీలో, బార్ లో కనిపించిన వ్యక్తికి కాళ్ళు లేవు, వాష్ రూంలో కనిపించిన వ్యక్తికి చేతులు లేవు, ఇప్పుడు గేటు దగ్గర కనపడిన మనిషికి ముఖం నిండా గాట్లు, గాయాలు. ఆ మనుషులు గుర్తుకురాగానే ఏదో భయం కలుగుతోంది. నా చుట్టూ వున్న గాలిలో ఏదో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. వళ్ళంతా చమటలు పట్టేస్తున్నాయి. దానికి తోడు నేను తాగిన మందు మైకం కళ్ళను కప్పేస్తోంది.
నా ఆలోచనలు ఇలా నడుస్తుండగా, సరిగ్గా అప్పుడే క్షణంలో వెయ్యోవంతు సమయంలో జరిగిందా సంఘటన. ఏం జరిగిందో అర్థం అయ్యేలోపలే నా కారు ఒక మనిషిని కొట్టేసి ముందుకు సాగిపొయింది. మరుక్షణంలో తేరుకోని, కారు ఆపి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ కనపడ్డ దృశ్యం చూడగానే వొళ్ళు గగుర్పొడిచింది. అక్కడ.. అక్కడ..

ఒక తల లేని ఒక స్త్రీ మొండెం నా కారు వైపే చేతులు వూపుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయికి రెండడుగుల దూరంలో ఆ అమ్మాయి తల నేలపైన పడి దొర్లుతోంది. అప్పుడు నేను అరిచిన అరుపు ఎంత గట్టిగా వచ్చిందంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్నవాళ్ళకి కూడా వినిపించి వుంటుంది. వెంటనే కారు స్టార్ట్ చేసి, ముందుకు వురికించాను. ఆ అమ్మాయి మొండెం నా కారు వెనకే రావటం, కొంత దూరం తరువాత కింద పడిపోయి, తెగిపడిన తలకోసం రోడ్డు మీద వెతకడం అద్దంలో కనిపిస్తూనే వుంది.

ఇదెలా సాధ్యం? తల తెగిపోయిన తరువాత మిగతా శరీరంలో ప్రాణం ఎంత సేపు వుంటుంది? పైగా నేను కారుతో గుద్దితే మాత్రం, తల మాత్రమే తెగిపడే అవకాశమే లేదే? ఇప్పటిదాకా నాకు కనిపించిన వ్యక్తులు నాతో చెప్పబోయింది ఇదేనా? ఇలా ఒక మనిషి మరణానికి నేను కారణం అవుతానని వాళ్ళకి ముందే తెలుసా? ఒక్క సారి లక్ష ప్రశ్నలు మెదడులో తిరగడం మొదలైంది. మత్తు తలలో నించి కళ్ళమీదకి జారడం మొదలైంది. సరిగ్గా అప్పుడే ఒక్క క్షణం పాటు నా కళ్ళు మూతలు పడటం, నా కారు అదుపు తప్పి రోడ్డు మీదనుంచి పక్కగా వున్న చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయిది. నేను తేరుకోని కారుని ఆపే లోగా బలంగా ఒక చెట్టుకి గుద్దుకోని ఆగిపోయింది. నాకు స్పృహ తప్పింది.

***

నాకు స్పృహ వచ్చేసరికి నరనరాల్లో బాధ జివ్వు మంటోంది. తలకి తగిలిన గాయం నుంచి ధారగా రక్తం నా ముఖాన్ని తడిపేస్తోంది. ముంజేతి మీద గాజు పెంకులు గుచ్చుకుపోయి వున్నాయి. వీటన్నింటికన్నా బాధ పెడుతోంది పొత్తి కడుపు దగ్గర. ఒక ఇనుప ముక్క లోపలికి దిగిపోయి వుందక్కడ. అది ఎమిటో, గాయం ఎంత తీవ్రంగా వుందో తెలుసుకునే అవకాశమే లేదు. అసలు కదులేందుకే వీలు లేదు. భారంగా కళ్ళు తెరిచాను.
ఎదురుగా అతను..!! ... నాకు బార్ లో కనిపించినతను. అతనే... ఇంకా అలాగే చూస్తున్నాడు...!!
నాకు ఆశ్చర్యం, భయం కన్నా సంతోషం కలిగింది. అలాంటి ఆపదలో ఆదుకోడానికి ఒక మనిషి వున్నాడని.

“హెల్ప్ మీ” అతి కష్టం పలికాను. అతనిలో ఏ మాత్రం చలనం లేదు. అలాగే చూస్తూ వున్నాడు.

“ఏమిటలా చూస్తున్నారు... ప్లీజ్ హెల్ప్ మీ...” మళ్ళీ అడిగాను. ఈ సారి కూడా అతను కదలలేదు సరికదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి చుట్టూ చూశాడు. అప్పుడు అర్థం అయ్యింది నాకు. అక్కడ నేను, అతనే కాదు ఇంకా ఎవరో వున్నారని. నొప్పిగా వున్నా కష్టపడి చుట్టూ చూశాను.

షాక్..!!

అందరూ వున్నారు. బార్ టాయిలెట్ అద్దంలో కనిపించినతను, బయట కనిపించిన వ్యక్తి, ఇందాక రోడ్డు మీద నా కారు గుద్దుకోని తల తె..గి...పడిన... కానీ, తల వుంది. అతుక్కోనే వుంది...!! ఇదెలా సాధ్యం..?? నా గుండెల్లో భయం ముల్లులా గుచ్చుతోంది. వెన్నులో నుంచి ఒక లాంటి వణుకు మొదలైంది.

“ఎవరు... ఎవరు మీరంతా..” అడిగాను. నేను బార్ లో మొదట చూసిన వ్యక్తి కుంటుకుంటూ దగ్గరకు వచ్చాడు.

“మేమెవరమో తెలుసుకోవాలని వుందా? చెప్తే భయపడవు కదా?” అడిగాడు. ఇంతలో నాకు బార్ లో తారసపడ్డ వ్యక్తి మందుకొచ్చాడు.

“అయినా ఇందులో భయపడటానికి ఏముంది...? మేమంతా చనిపోయి కొంతకాలం అయ్యింది ”

“అంతే కాదు... ఇప్పుడు నీ వంతు వచ్చింది” నవ్వింది తలతెగిన అమ్మాయి.

“ఏమిటిది... ఇదేమైనా ప్రాక్టికల్ జోకా? ఏదైనా టీవీ ప్రోగ్రామా? ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో వుంటే మీరు జోక్స్ వేసుకుంటారా?” అడిగాను కోపంగా. వాళ్ళందరూ ఇంకా గట్టిగా నవ్వారు.

చేతులు లేని వ్యక్తి నాకు కొంచెం దగ్గరగా వచ్చి పక్కనే ఒక బండ రాయి మీద కూర్చోని చెప్పాడు –
“చూడు బ్రదర్... మేము టీవీ ఛానల్ కాదు... ఇది జోక్ అంత కన్నా కాదు. మేమంతా చనిపోయిన మాట కూడా నిజమే. అంతే కాదు.. మేమంతా రోడ్ ఏక్సిడెంట్లలోనే చనిపోయాం. ఇంకా చెప్పాలంటే, తాగి డ్రైవ్ చెయ్యటం వల్ల కానీ, లేక తాగి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ చేసిన ఏక్సిడెంట్ వల్లగానీ చనిపోయిన వాళ్ళం..”

మరో వైపు కాలు లేను వ్యక్తి వచ్చి పక్కగా కూర్చున్నాడు.

“ఇదుగో... నీ లాగే తాగేసి రోడ్డు మీదకు వచ్చేవాళ్ళను చావకుండా ఆపుదామని ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఏం లాభం మేం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇదుగో నీ లాగే... తాగి బండో కారు నడుపుతారు... చివరికి వచ్చి మాలో కలుస్తారు...”

నాకు పిచ్చిపట్టినట్లు అయ్యింది.

“ఏం మాట్లాడుతున్నారు... ఇదంతా చెప్పే బదులు నన్ను కాపాడచ్చు కదా...”

“నీకేమైనా పిచ్చా... నువ్వు ఈ రోజు తాగి కార్ నడిపి చావబోతున్నావని మాకు ముందే తెలుసు... ఆపుదామని ప్రయత్నించాం... ఇప్పుడు ఏం చేసినా నిన్ను కాపాడలేం... నీ చావు ఖాయం... అందుకే మా మాటలు నీకు అర్థం అవుతున్నాయి...” తలతెగిన అమ్మాయి చెప్పింది.

“అయితే... ఇప్పుడేం చెయ్యాలి?” అరిచాను.

“నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు... మేం చెయ్యగలిగిందీ ఏమీ లేదు... నీ చావు పూర్తి కావడం కోసం ఎదురు చూడటం తప్ప..” చెప్పాడు ఒకడు.

నేను చూసిన నలుగురే కాకుండా ఇంకా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా చుట్టూ కూర్చుంటున్నారు. శ్రద్ధగా బుగ్గ కింద చేతులు పెట్టుకోని, నా చావుని తదేకంగా పరిశీలిస్తున్నారు. అంతమందిలో ప్రాణం వున్న ఏకైక వ్యక్తిని నేను... ఆ ప్రాణం పోతోందని తెలిసి బిక్కుబిక్కుమంటూ చావు కోసం ఎదురు చూస్తున్నాను.
? 
(సన్ ఫ్లవర్ వార పత్రిక 09.05.2012)

‘బాసు’ సేవాపరాయణఒకరోజు వున్నట్టుండి నాకు ఫోన్ వచ్చింది.

“అన్నయ్యా... నేను సుమతిని మాట్లాడుతున్నాను... ఒకసారి ఇంటికి వస్తారా మీతో మాట్లాడాలి..” అంది సుమతి. ఆ అమ్మాయిది మా వూరే, నాకు దూరపు బంధువు కూడా. సంవత్సరం క్రితమే మా ఆఫీసులో పనిచేసే నారాయణతో పెళ్ళైంది. దాంతో ఒకటి రెండుసార్లు మా ఇళ్ళ మధ్య రాకపోకలు కూడా సాగాయి. ఆ అమ్మాయికి అన్నా, అండ నేనేనని మా వూర్లో అంతా అనుకుంటున్నారు కాబట్టి వెంటనే బయల్దేరాను.


నారాయణ గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు కనుక సుమతి నాతో మాట్లడబోయే విషయం నాకు ముందే తెలుసు.

విశ్వాసం అనేది కుక్కకే కాదు మనుషులకి కూడ వుండాలని ప్రగాఢంగా విశ్వసించేవాడు మా నారాయణ. అయితే ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే విషయంలో కూడా కుక్కనే ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు వాడు. బాసు దగ్గర నిలబడటం దగ్గర్నుంచి, గాలి పీల్చడం వదలడం లాంటివికి కూడా ఒక పరిధికి లోబడి, ఎట్టి పరిస్థితిలోనూ ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడగలగటం నారాయణకి వెన్నతో పెట్టిన విధ్య.

“అసలు బాసు ముందు గాలి పీల్చడంలో కూడా ఒక నిర్దుష్టమైన నాదం వుంది... ఒక ప్రత్యేకమైన పద్ధతి వుంది... నాలక పూర్తిగా చాపీ చాపకుండా, గొంతులోనుంచి గాలిని వదులుతూ పీలిస్తూ వుంటే...” అన్నాడొకసారి నాతో మందుకొడుతూ.

“అందుకేరా... నీకు కుక్కకీ దగ్గర పోలిక అని ఆఫీసులో అంతా అనుకుంటున్నారు..” చెప్పాను నేను.ఆఫీసులో బాస్ చలపతి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా అతని మెళ్ళో టై సరిగ్గా కుక్కతోక లాగే వూగుతుంటుందని చాలామంది చెప్పుకోగా విన్నానునేను.


ఏడ్చారు... ఎవరేమన్నా మనం పట్టించుకోము కదా...” అంటూ నవ్వేశాడు. ’నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అంటూ తను చెయ్యాలనుకున్నది చేసెయ్యడమే నారాయణ లక్షణం. దీని వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువ అని వాడిఅభిప్రాయం.


గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన బాసుప్రేమను ప్రదర్శిస్తూనే వున్నాడు నారాయణ. పదవులు మారినా, బాసులే మారినా, ఈ బాసుసేవాపరయణత్వానికి అణువంతైనా లోటు రానివ్వలేదు నారాయణ. ఎప్పుడో వుద్యోగంలో చేరిన మొదట్లో వుద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి వస్తూ వస్తూ బాసు కోసమని రెండు బాటిళ్ళు డ్యూటీ ఫ్రీ మందు తీసుకొచ్చాడు. అంతే ఆ బాసు వున్నంతకాలం ఆ మత్తులో నుంచి బయటపడిందే లేదు. దాంతో ఈ బాసుసేవ యొక్క మహిమాన్వితమైన శాక్తిని తెలుసుకున్నాడు. అందుకే ప్రమోషన్లు, బోనసులు, ఇంక్రిమెంట్లు వంటి పెద్ద పెద్ద లాభాలే కాకుండా చిన్నపాటి ఏ.సీ. క్యాబిన్, అందమైన సెక్రటరీ, శ్రావణ మంగళ గౌరీ వ్రతం తో సహా క్యాలండర్లో వున్న ప్రతి పండగకీ పబ్బానికి శెలవలు వంటి అనేకానేక ప్రత్యేక ప్రయోజనాలు పొందాడు వాడు.


నారాయణ చేసే బాసుసేవనం మహిమ ఎంతదంటే ఏ కొత్త బాసు వచ్చినా మొదట దండ మనవాడే వేస్తాడు. పాత బాసుని సాగనంపుతూ సభ ఏర్పాటు చేసి ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తాడు. పాత బాసు తెలుగు సినిమాకి చిరంజీవి లాంటి వాడని, తమిళ సినిమాకు రజనీ లాంటివాడని, హిందీ సినిమాకి ఏకంగా అమితాబచ్చనని చెప్పేస్తాడు. అవకాశం లేదు కానీ లేకపోతే ఏ భారతరత్నో, పరమవీరచక్రో ప్రకటించినా ప్రకటించేవాడు. ఆ తరువాత బాసు వెళ్ళిపోతున్నందుకు బాధ పడతాడు. కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎక్కిళ్ళు పెడతాడు. వాణ్ణి సముదాయించడానికి అయిదారుగ్గురు అవసరం అవుతారు.


ఇదంతా ఒక పక్క జరుగుతుంటే, వెళ్ళిపోతున్న బాసు కన్నీళ్ళు తుడుచుకోని వస్తున్న బాసుకి నారాయణ గురించి వివరిస్తాడు. నా కన్న బిడ్డలాంటివాడు అనీ, నువ్వు కూడా వాణ్ణి అలాగే చూసుకోవాలని చెప్పి, ఆఖరుకి వట్టు కూడా వేయించుకుంటాడు. దాంతో ఆఫీసు ఫర్నీచరు, స్టాక్ తో పాటు నారాయణ బాసు సేవనం కూడా హాండోవర్ అయిపోతుంది.


కొత్తబాసు సేవా కార్యక్రమాలు ఇల్లు వెతకటంతో ప్రారంభమౌతాయి.


“సార్... మీరు వూరికి కొత్తకదా పోనీ ఈ ఆదివారం చార్మినారు, సాలార్జంగు మ్యూజియం తీసుకెళ్ళనా? పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తారు...” అంటూ ఒక ప్రతిపాదన పెడతాడు. బాసు తలాడిస్తాడు. ఆ ఆదివారం సాలార్జంగు మ్యూజియంలో గంటలు కొట్టే గడియారం దగ్గరకు చేరెసరికి బాసు భార్యని ఆంటీ అనో, పిన్నిగారు అనో మరీ సెంటిమెంటు వర్కౌట్ అయితే అమ్మా అనో పిలిచేస్తాడు.


“బాసు వైఫు అన్నింటి కన్నా పెద్ద లివర్, పెద్ద పవర్... ఆ పవర్ కానీ మన చేతిలోకి చిక్కిందా ఇక మనంహారీపోటర్ తో సమానం... మన రామదాసు కూడా మేడమ్ తో – నను బ్రోవమని చెప్పవే – అని రికమెండేషన్ చేయించుకున్నాడు... గుర్తులేదా?” అంటూ ఆ టెక్నిక్ వివరింఛడు నాకు.


ఇలాంటి నారాయణ గురించి సుమతి ఏం చెప్పబోతోందో ఊహించడం పెద్ద కష్టమా చెప్పండి?


***


“మీ మిత్రుడితో చాలా కష్టంగా వుంది అన్నయ్యా...” అంది నేను ఇంట్లోకి అడుగుపెట్టగానే. మంచినీళ్ళు, టీ లాంటి పనికిఆహార పథకం ఏదీ ప్రకటించకుండా నేరుగా విషయానికి వచ్చేసిందంటే పరిస్థితి తీవ్రంగా వుందని నాకు అర్థం అయ్యింది.


“ఏమిటమ్మా... ఏం జరిగింది?” అడిగాను నేను.


“ఏంముందన్నయ్యా... మీకందరికీ ఆరు గంటలకి ఆఫీస్ అయిపోతే ఆయన అసలు పని అప్పుడే మొదలౌతుంది. బాసుని తన కార్లో స్వయంగా ఇంట్లో దించడం, అవసరమైతే వాళ్ళకోసం సినిమా టికెట్లు తీసుకోవడం, పార్కులో పిల్లల్ని ఆడించడం, అమ్మగారి కోసం బియ్యప్పిండో, ఇడ్లీ పిండో మెషిన్ లో ఆడించడం.. ఇలా వుంది వరస... ఇల్లు లేదు, సంసారంలేదు... అసలు నేనొకదాన్ని వున్నానన్న సంగతి కూడా గుర్తురాదు..” చెప్పిందామె.
నేను నిట్టూర్చి – “నాకు తెలుసమ్మా... ఆఫీసులో కూడా ఇవే కంప్లైంట్లు... చెయ్యాల్సిన పని చెయ్యడు, అవసరం వున్నా లేకఫోయినా బాసుని పొగడటం, ఆ పొగడ్తతోనే ఏ పనీ చెయ్యకుండానే గడిపేయటం... ఇది ఆయన చేసే వుద్యోగం...” చెప్పాను నేను.


సుమతికి “డోలు - మద్దల” సామెత ఏదో గుర్తొచ్చినట్లు వుంది. అందుకే ఏ సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడిపోయింది. ఒక అయిదు నిముషాల మౌనం తరువాత తనే నోరు విప్పింది – “అసలు సమస్య ఇంకొకటి వుందన్నయ్యా..” అంది చిన్నగా.నేను ఏమిటో చెప్పమన్నట్లు తలాడించి సోఫాలో ముందుకు జరిగాను.


“ఈయనకి కాకా పట్టడం, బాకాలు మోగించడం ఇవన్నీ బాగా అలవాటయ్యాయి... ఇక ఎక్కడికెళ్ళినా ఇదే వరసై పోయింది... ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళకి అనవసరమైన గౌరవం ఇచ్చి నెత్తికి ఎక్కించుకుంటాడు, చిన్నా పెద్దా పిల్లా జెల్లా ఎవరని లేదు వాళ్ళ పక్కన చేతులు కట్టుకోని నిలబడతాడు, వింతగా శబ్దాలు చేస్తూ నాలుక బయట పెడతాడు.,.”


“విశ్వాసం మార్కు కుక్క లక్షణాలు..” చెప్పాను నేను.


“అదే మాట మా పిన్ని అంటే నాకు తల కొట్టేసినట్లైంది... ఇంకా దారుణం, ఈ మధ్య నాతో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు... అన్నం మాడ్చినా... కూరలో వుప్పు లేకపోయినా కూడా తెగ పొగిడేస్తున్నాడు...మొన్నా మధ్య బిర్యానీ ఇంత అద్బుతంగా వండటం నీకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అన్నాడు.. తీరా తిని చూస్తే అందులో ఉప్పు లేదు...” బాధగా చెప్పింది సుమతి.నేనుఆలోచించడంమొదలుపెట్టాను.


***


మా బాస్ చలపతికి ఫేర్ వెల్ పార్టీ.


యధావిధిగా నారాయణ శవం లేచిన ఇంట్లోకి వచ్చినట్లు వచ్చాడు. బాసు చలపతి ముందు నిలబడి భోరుభోరున ఏడ్చాడు.


"సార్ పదికాలాల పాటు మీకు సేవ చేసుకోని తరించే భాగ్యమే మాకు లేదా?  మీరు తలపెట్టిన మహత్తరమైన ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేదే... మీ పిల్లలకి కొత్తసినిమా టికెట్టైనా కొనివ్వలేదే... మేడంగారిని ముత్యాలషాపింగ్కైనా తీసుకెళ్ళలేదే... కనీసం ఒక్కసారి కూడా మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళలేదే.." అంటూ ముక్కు చీదాడు.


"దానికేం భాగ్యమోయ్... రేపే మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాం..." అంటూ ప్రకటించాడు చలపతి.


నారాయణ సంతాపసభ మర్నాడు ఇంట్లో కూడా కొనసాగింది. బాసు భోజనం చేస్తున్నంతసేపూ పక్కన నిలబడి విజామరలు వీచాడు. బాసు భోజనం అయ్యేదాకా ఎవరూ తినడానికిలేదని నన్ను కూడా నిలబెట్టేశాడు. ఎగిరేవి, దూకేవి, ఈదేవి, పాకేవి అనే బేధాలు లేకుండా రకరకాల జంతుజాలాన్ని బలిగా సమర్పించాడు. కొసరి కొసరి వడ్డించాడు. సుమతిని చూద్దామంటే ఈ వంటంతా వండి వడ్డించి చిరునవ్వులు నటిస్తున్నా లోపల చిటపటలాడుతూనే వుంది.


భోజనానంతరం తాంబూలం సమర్పయామి.


"నేను ఎక్కడికి వెళ్ళినా నీలాంటివాడు దొరకరయ్యా.." అన్నాడు చలపతి గట్టిగా తేనుస్తూ.


"సార్ ఎంతమాట సార్...  వెంకటేశ్వరుడికన్నా వేరు దైవం దొరుకుతాడు కానీ మీ లాంటి బాసు నభూతోనభవిష్యతి.." అన్నాడు నారాయణ చేతులు జోడిస్తూ. పొగడ్తవల్లో, భోజనం ఎక్కువవడంవల్లో చలపతి పాంట్ ఇంకొంచెం వదులుచేసుకోవాల్సి వచ్చింది.


మళ్ళీ బ్రేవ్ మంటూ ఘీంకారం చేసి అన్నాడు బాసు చలపతి - "అందుకేనయ్యా... నిన్ను నాతో పాటే జార్ఖండ్ పంపమని హెడ్ఆఫీస్కి రికమెండ్ చేశా... రేపో మాపో ఆర్డర్స్ వచ్చేస్తాయి.."


నారాయణ గుండెల్లో బాంబు పడ్డట్టైంది. "సార్.. అదేమిటి సార్... నేను మీతో ఎలా రాగలను సార్... తెలుగువాణ్ణి పైగా నా ఫ్యామిలీ,  సొంత ఇల్లు, పిల్లల చదువులు అన్నీ ఇక్కడే వున్నాయి..."


"వుంటే వున్నాయిలేరా... నీకు వాటన్నింటికన్నా బాసుసేవ ముఖ్యం కదా.." నేను చెవిలో చురకంటించాను.


"అమ్మో.. జార్ఖండా నేను రాలేను సార్.." అన్నాడు నారాయణ దీనంగా.


"అదేమిటయ్యా... నాకు నా కుటుంబానికి సేవ చేసుకోడానికి పుట్టిన హనుమంతుడినన్నావు.. మరి సేవ చేసుకునే అవకాశం ఇస్తుంటే రానంటావే?" అడిగాడాయన. నారాయణ దాదాపు కాళ్ళ బేరానికి వచ్చాడు.


"వద్దు సార్... ఇక్కడికి కొత్తబాసు వస్తాడు కదా.. ఆయన సేవ చేసుకుంటాను.." చెప్పాడు ఆఖరి అస్త్రంగా.


"నాలాంటి బాసు మరొకడు దొరకడన్నావు?" సంహరాస్త్రం వదిలాడు బాసు. నారాయణ ఇరుకునపడ్డాడు. ఔనని జార్ఖండ్ పోలేడు...కాదని కప్పి పుచ్చలేడు. నిజం చెప్పడం మినహా వేరు మార్గం కనపడినట్లులేదు.


"నన్ను వదిలేయండి సార్... బాసును కాకాపడితే పనులు అవుతాయని ఇలా చేశాను సార్.. మీకే కాదు మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాడిని..." ఒప్పుకున్నాడు.


అయితే నాతో పాటు జార్ఖండ్కి రానంటావా?" అడిగాడు మళ్ళీ రెట్టిస్తూ.


"మహాప్రభో... మీకు దణ్ణం పెడతాను...నన్ను వదిలేయండి


"అయితే ఒక షరతు... నువ్వు ఈ బాసుని కాకా పట్టేవుద్యోగాన్నివదిలి, అసలు వుద్యోగమేదో అదిచెయ్యి... నువ్వు ఎక్కువగా కాకాపడితే నీ కాక తీర్చమని రాబోయే కొత్త బాసుకి చెప్తాను..." అన్నాడు చలపతి.


బుద్దొచ్చింది.. ఇక ఇలాంటి బుర్ర తక్కువ పని చెయ్యనుగాక చెయ్యను... మా సుమతి మీద ఒట్టు.." అన్నాడు దీనంగా.


చలపతి నా వైపు చూసి తలాడించి "సరే.. అయితే నీ ట్రాస్ఫర్ ఆపమని చెప్తాను.." అంటూ బయటికి నడిచాడు.
సుమతి నా వైపు కృతజ్ఞతగా చూసింది.***(చిత్ర మాసపత్రిక మే 2012 అనుబంధం, హాస్యకథల సంపుటిలో ప్రచురితం)