గుండెల్లో ఏముందో...


అప్పటికే రెండు బైపాస్ సర్జరీలు చేయించుకున్న విశ్వకర్మకి ఆ ప్రకటన మొదట ఆశ్చర్యాన్ని కలిగించినా పోను పోనూ ఆసక్తిని, ఆ తరువాత ఆశని రేకెత్తించాయి. ఆ రోజు సాయంత్రం దాకా ఆలోచించి చివరికి అందులో వున్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేశాడు. మర్నాడు ఉదయం పది గంటలకి అపాయింట్ మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఇక రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదతనికి. మళ్ళీ ఒకసారి లేచి దిండు కింద దాచుకున్నా ఆ కాగితాన్ని మళ్ళీ తీసి చూసుకున్నాడు.
వైద్య రంగలో సరికొత్త సాంకేతిక విప్లవం – ఎలక్ట్రానిక్ అవయవాలు
మీ శరీరంలో గుండె, లివర్, మెదడు లాంటి ఏ భాగమైనా ఇక పని చెయ్యనని మొరాయిస్తోందా? అయితే వెంటనే రండి. మా డాక్టర్ త్రినేత్రం ఆధ్వర్యంలో తయారైన ఎలక్ట్రానికి అవయవాన్ని అమర్చుకోని వెళ్ళెండి. వివరాలకు సంప్రదించండి: పంచభూత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్..
మళ్ళీ మళ్ళీ చదువుకోని తృప్తిగా అనిపించాక మంచం మీద పడుకోని కలత నిద్ర పోయాడు విశ్వకర్మ.
***
పంచభూత హాస్పిటల్ కి వెళ్ళి రిసెప్షన్ లో తన పేరు వివరాలు చెప్పాడు. రిసెప్షనిస్ట్ వెంటనే ఎవరో డాక్టర్ కి ఫోన్ చేసి – “ఆయన వచ్చారు” అంది క్లుప్తంగా. అంత క్లుప్తంగా చెప్పినా ఆమె గొంతులో వున్న ఉత్సుకతని గమనించి నవ్వుకున్నాడు విశ్వకర్మ.
మరునిముషంలో హాస్పిటల్ మొత్తం కలకలం రేగింది. దాదాపు అయిదుగ్గురు డాక్టర్లు, నలుగురు నర్సులు పరుగులాంటి నడకలో అతని కూర్చోని వున్న లాబీలోకి వచ్చి నిలబడ్డారు.
“మిస్టర్ విశ్వకర్మ??” అడిగాడు అందరిలో చురుకైనవాడిలా కనపడుతున్న డాక్టర్. విశ్వకర్మ నిలబడి తల వూపాడు.
“ఓహ్.. వెరీ గ్లాడ్... నా పేరు డాక్టర్ త్రినేత్రం... రండి నా ఛాంబర్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం..” అంటూనే ముందుకు కదిలాడు అతను. ఆ వెనకాలే విశ్వకర్మ, అతని వెనకాల హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కదిలారు.
ఏసీతో చల్లబడిపోయిన ఒక గదిలోకి వెళ్ళి త్రినేత్రం వెనక్కి తిరిగి విశ్వకర్మని సాదరంగా ఆహ్వానించాడు. ఆ వెనకే వస్తున్న పరివారాన్ని వద్దని కళ్ళతోనే వారించి పంపించాడు.
“కూర్చోండి...” అన్నాడు సీటు చూపిస్తూ.
విశ్వకర్మ చుట్టూ పరికించి చూశాడు. గది మొత్తం చాలా కుదురుగా సర్దినట్లు వుంది. ఏ డాక్టర్ దగ్గరైనా కనిపించే స్టెతస్కోప్, ప్రిస్ క్రిప్షన్ పాడ్ లాంటివి ఏవీ అక్కడ లేకపోవటం  గమనించాడతను. గోడల మీద మొత్తం రకరకాల మానవ అవయవాల ఫొటోలు, వాటి పక్కనే చిన్న చిన్న కంప్యూటర్ పరికరాల్లాంటి ఎలక్టానిక్ అవయవాలు వున్నాయి. గుండెకు సంబంధించిన ఫోటో, దాని పక్కనే వున్న చిన్న స్పీకర్ లాంటి పరికరాన్ని చూసి అదే తన గుండె స్థానంలో చేరబోతోందని అనుకోని ఒక్కసారి గుండెని తడుముకున్నాడు.
“ఓకే మిస్టర్ విశ్వకర్మ... మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు గుండె మార్పిడి కోరుకుంటున్నారు... వెల్.. వెరీగుడ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు... రెండు సార్లు ఎటాక్ వచ్చిందని చెప్పారు... ఇంకోసారి వచ్చిందంటే ప్రాణానికే ప్రమాదం... మీకు తెలిసేవుంటుందిలెండి.. డాక్టర్ కన్నా రోగికి అనుభవం ఎక్కువ కదా...” అంటూ జోక్ వేసినవాడిలాగా నవ్వాడు. విశ్వకర్మ జోక్ అర్థం కానివాడిలాగా ముఖం పెట్టి తలాడించాడు.
“సరే... ఎలాగూ అన్నింటికి సిద్ధపడ్డారు కాబట్టి అసలు విషయానికి వస్తాను... మీకు అమర్చడానికి ఎలక్ట్రానికి గుండె రెడీగా వుంది. దానికి సంబంధించిన షరతులు, ఎలా వాడుకోవాలో ఆ వివరాలు అన్నీ ఈ మాన్యువల్స్,  డాకుమెంట్స్ లో వున్నాయి. అవన్నీ పూర్తిగా చదివి, అందులో వున్న కండీషన్స్ మీకు ఓకే అయితే కింద సంతకాలు పెట్టండి...” అంటూ ఒక దాదాపు వంద పేజీలు వున్న ఫైలుని అతని ముందు పెట్టాడు. “చదువుతూ వుండ”మని చెప్పి త్రినేత్రం బయటికి వెళ్ళాడు.
ఎప్పుడెప్పుడు గుండె మార్చుకుందామా అని తొందరలో వున్న విశ్వకర్మకి ఆ ఫైలు చూసే సరికి నిరుత్సాహం కమ్ముకుంది. సంతకం చెయ్యటం ఎలాగూ తప్పదు కాబట్టి చదవటం ఎందుకని అనుకోని అన్ని కాగితాల మీద టకటకా సంతకాలు పెట్టేశాడు. అందులో అక్కడక్కడా ఆ మెషీన్ కి సంబంధించిన ఫొటోలు, అది వాడాల్సిన విధానం వంటి వివరాలు వున్నాయని గమనించాడు కానీ వాటిని చదవలేదు. అవసరం అయితే అన్నీ డాక్టరే చెప్తాడని అతని అభిప్రాయం.
డాక్టర్ త్రినేత్రం తిరిగివచ్చాక ఫైలు లో సంతకాలు పెట్టి వుండటం చూసి – “అన్నీ చదివారా?” అని అనుమానం వెలిబుచ్చాడు.
విశ్వకర్మకి ఏం చెప్పాలో తెలియక చదివినట్లే తల వూపాడు.
“అన్ని పేజీలు ఇంత తొందరగా చదివారంటే నేను నమ్మను... మీరు సంతకాలు చేశారు కాబట్టి ఇంక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు... కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి“ అంటూ ఒక క్షణం తటపటాయించి మళ్ళీ కొనసాగించాడు.
“మీకు ఇప్పుడు అమర్చబోయేది ట్రైల్ పాక్... వారం రోజులు వాలిడిటీ వుంటుంది. ఆ తరువాత ఎలానూ మీరు రెన్యువల్ చేయించుకుంటారు... అలా చెయ్యని పక్షంలో మరో వారానికి మా పరికరాన్ని తిరిగి తీసేసుకునేందుకు అవకాశం వుంటుంది. ఇందులో ప్రతి నెలా రెంటల్ ప్యాక్ వుంది, లేదా మొత్తం ఒకేసారి కట్టే అవకాశం కూడా వుంది...” అంటూ ఇంకా ఎన్నో వివరాలు చెప్పాడు. అన్నింటికీ తలాడించాడు విశ్వకర్మ.
“ఒకవేళ నాకు రెన్యువల్ వద్దనిపిస్తే?” అడిగాడు విశ్వకర్మ.
“వద్దంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తాము..”
“తీసేసి మళ్ళీ నా గుండె తిరిగి పెట్టేస్తారా?”
“ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ విశ్వకర్మా? ఒకసారి తీసేసిన గుండె ఇంక ఎందుకూ పనికిరాదు... ఈ వివరాలన్నీ మీకు ఇచ్చిన మాన్యువల్ లో వున్నాయి... అందుకే మీరు దాన్ని ఒకసారి చదవటం మంచింది...” చెప్తున్న డాక్టర్ మాటలకి అడ్డుపడ్డాడు విశ్వకర్మ.
“నాకు మాన్యువల్స్, ఇన్స్ట్రక్షన్స్ చదివే అలవాటు లేదు... మీ పని మీరు కానివ్వండి..” చెప్పాడు స్థిరంగా. చేసేదిలేక డాక్టర్ ఒప్పుకున్నాడు.
ఆపరేషన్ జరిగిపోయింది.
***
విశ్వకర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కొత్త గుండెతో కొత్త రక్తం పుట్టుకొచ్చిన కుర్రవాడిలా ప్రవర్తిస్తున్నాడు. రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతున్నాడు.
“ఎందుకురా అన్ని తాగుతావు? నీ గుండె ఆగిపోగలదు జాగ్రత్త” అని అతని స్నేహితుడు సురేష్ అంటే గట్టిగా నవ్వేశాడు.
“నా గుండె స్టీల్ రా స్టీల్... గుండేసి పేల్చినా పేలదు...” అంటూ ఇంకా నవ్వాడు.
మరోసారి బస్ స్టాప్ లో వున్నప్పుడు పక్కనే నిలబడ్డ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. కొత్త గుండె కదా కొత్త కొత్త కోరికలు కూడా పుట్టుకొస్తున్నాయి. అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తే గొడవ గొడవ చేసి, దాదాపు పోలీసులు వచ్చేదాకా చేసింది. ఆ వచ్చిన పోలీసుల్లో పరిచయం వున్నతను వున్నాడు కాబట్టి బయటపడ్డాడు.
మరో రోజు చాలా కాలంగా చూడాలనుకుంటున్న హర్రర్ సినిమాల డీవీడీ తెచ్చుకోని అర్థరాత్రి దాకా అవే చూశాడు. ఇప్పుడు అతని గుండెల్లో భయమనేదే లేదు కాబట్టి ఆ హర్రర్ సినిమాలన్నీ కామెడీ సినిమాల లాగా అనిపించాయి.
ఆ రోజు నుంచి మూడు రోజులపాటు గుండెలేని మనిషిగా ఒక కొత్త లోకాన్ని చూస్తున్న అనుభూతి పొందాడు విశ్వకర్మ. మూడో రోజు రాత్రి ప్రశాంతగా నిద్రపోయాడు కానీ తెల్లవారుఝాము నాలుగు గంటలకి ఛాతిలో నొప్పిగా అనిపించి లేచి కూర్చున్నాడు. ఇంతకు ముందు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చినవాడు కాబట్టి ఇప్పుడు వస్తున్న నొప్పి అలాంటిదే అని అర్థం చేసుకున్నాడు. అయితే నిజం గుండె వున్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపొయేది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియదు.
“ఆ మాన్యువల్ చదివినా బాగుండేది...” అనుకున్నాడు. అప్పటికప్పుడు ఎక్కడో పడేసిన మాన్యువల్ కోసం వెతికి తీసేసరికి అరగంట పట్టింది. నొప్పి ఇంకొంచెం ఎక్కువైంది. మాన్యువల్ లో వున్న కాల్ సెంటర్ కి ఫోన్ చేశాడు.
“హలో” అంది తీయని కంఠం.
“హలో... నా పేరు విశ్వకర్మ... మొన్ననే ఎలక్ట్రానిక్ గుండె పెట్టించుకున్నాను...”
“మీ గుండె నెంబర్ చెప్పండి..” అలవాటైన తరహాలో అడిగిందా అమ్మాయి.
“నెంబరా... అదేంటో నాకు తెలియదు... ఎక్కడుంటుంది?”
“మీ గుండె మీదే రాసి వుంటుంది... వెతకండి..”
“అమ్మాయ్... నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? లోపల వున్న గుండెని తీసి ఎలా చూస్తారు?” కోపంగా అడిగాడు విశ్వకర్మ.
“అయితే మీ ఫైల్ లో ఒక గ్రీన్ కలర్ పేపర్ వుంటుంది అందులో చూసి చెప్పండి...” అడిగింది. అతను చెప్పాడు.
“మీ ప్రాబ్లం చెప్పండి?”
“నొప్పి... గుండెల్లో నొప్పి పుడుతోంది...”
“మా రికార్డ్స్ ప్రకారం అంతా కరెక్ట్ గానే వుందే... ఈ మధ్య మీరేమైనా నదిలో కానీ, సముద్రంలో కానీ దూకారా?”
“లేదే”
“పోనీ అతి చలి ప్రదేశానికి కానీ, ఎడారుల్లాంటి వేడి ప్రదేశానికి కానీ వెళ్ళారా?”
“లేదే”
ఆ అమ్మాయి ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగింది. అప్పటికే నొప్పి ఎక్కువై కూలబడిపోయాడు విశ్వకర్మ. దాదాపు పన్నెండు ప్రశ్నల తరువాత ఆ అమ్మాయి చెప్పింది – “సార్ నాకు తెలిసినంతవరకూ సమస్య ఎక్కడ వుందో అర్థం కావటంలేదు... ఒకసారి హాస్పిటల్ కి తొమ్మింది గంటలకి రండి... అన్నట్టు వచ్చేటప్పుడు మీ హార్ట్ ఫుల్ ఛార్జింగ్ వుండేట్టు చూసుకోండి...” మధ్యలోనే అందుకున్నాడు విశ్వకర్మ.
“ఏమన్నావు... ఛార్జింగ్ ఫుల్ గా వుండాలా? అంటే ఈ గుండెని ఛార్జింగ్ లో పెట్టాలా?” అడిగాడు కొత్త విషయం విన్నవాడిలా.
“అవునండీ... ఆ విషయం మాన్యువల్ లో వుంది కదా చదవలేదా? అయితే మీరు గుండె పెట్టించుకున్న తరువాత ఒక్కసారి కూడా ఛార్జింగ్ చెయ్యలేదా?” అడిగింది ఆందోళనగా.
“లేదు చెయ్యలేదు...”
“ఓ మై గాడ్... అర్జంట్ గా చార్జింగ్ పెట్టండి... లేదంటే అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది..” దాదాపు అరిచినంత పని చేసింది ఆ అమ్మాయి. విషయం అర్థం అయిన వెంటనే మాన్యువల్ ముందేసుకోని ఎలా ఛార్జింగ్ చెయ్యాలా అని వెతికాడు విశ్వకర్మ. అది తెలుసుకునే సరికే పావుగంట పట్టింది. దాదాపు కదలలేని స్థితిలో ఛార్జర్ తగిలించుకోని, అతి కష్టం మీద ప్లగ్ లో పెట్టాడు. – ఠప్..!!
పవర్ కట్...!!
“నేటి నుంచి ఉదయం మూడు గంటలు పవర్ కట్...” పేపర్ లో వార్త చూస్తూ నేలకి ఒరిగిపోయాడు విశ్వకర్మ.

?
(సన్ ఫ్లవర్)
Category: