అమెరికా అబ్బాయి

దాదాపు పదిహేనేళ్ళ తరువాత అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చాడు అప్పారావు. మనిషి పూర్తిగా మారిపోయాడు. తల నెరుపు, ముఖంలో వయసు బరువు స్పష్టంగా తెలుస్తున్నాయి. పేరు కూడా మారిపోయింది. అప్పు. ఆర్. కాక్ అని అక్కడ వ్యవహరించాడట అప్పారావు కాకర్ల. మొదట్నించి అప్పు అని పిలవటం అలవాటవటం మూలాన కాక్ అనే పేరు చిత్రంగా తోచింది అందరికీ.
అదలా వుంటే అప్పారావు వూర్లోకి వచ్చాడని తెలిసి అతని బంధువులు, స్నేహితులు అంతా అతని ఇంటికి బయల్దేరారు. అమెరికా నుంచి వస్తూ వస్తూ అభిమానంతో అందరికోసం బొమ్మలో, ఎలక్ట్రానికి వస్తువులో, కనీసం అమెరికా చాక్లెట్లో తెచ్చుంటాడని అందరి అభిప్రాయం. ఆశ కూడా. అప్పారావు ఉరఫ్ అప్పు కూడా అమెరికా నుంచి వస్తూ వస్తూ విమానంలో పర్మిషిన్ ఇచ్చినంత మేర రకరకాల వస్తువులు తెచ్చాడు. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అమెరికా వెళ్ళిన చాలాకాలం తరువాత తిరిగి వచ్చాడు కాబట్టి దగ్గర బంధువులను తప్ప ఇంకెవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు. అయితే అప్పారావు బాగా తెలివైనవాడు కాబట్టి, ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తపడుతున్నాడు.
“ఏరా అల్లుడూ బాగున్నావా?” అని ఎవరో అంటే – “అల్లుడు అంటున్నాడు కాబట్టి మామ వరసైవుంటాడు” అనుకోని
“బాగున్నాను మామా. మీరెలా వున్నారు” అన్నాడు.
“చూశావా చూశావా... వాడికి నేనింకా గుర్తే...” అంటూ సంబరపడిపోయాడాయన. అమెరికా పెట్టె తెరిచి చేతికందిందేదో తీసి – “నీకోసమే తెచ్చాను మామా” అని ఇస్తే ఆయన కన్నీళ్ళ పర్యంతమై వెళ్ళిపోయాడు.
“ఎవరు ఎవరో తెలియక ఇబ్బందిగా వుంది” అంటూ తల్లిదండ్రి దగ్గర ప్రస్తావించాడు ఎవరూ లేనప్పుడు.
“అమెరికా వెళితే మాత్రం బంధుత్వాలు మరిచిపోతే ఎలాగురా?” అంటూ మందలించాడు తండ్రి.
అప్పు వాళ్ళ అమ్మని దగ్గరుండి ఎవరు ఎవరో చెప్పమని చెప్పాడు కానీ, ఆమె కూడా నొచ్చుకోని “వాళ్ళంతా నీకోసం వస్తే... నువ్వు మర్చిపోయావని తెలిస్తే బాధపడరట్రా...?” అంది. దానికి పరిష్కారం కూడా ఆమే చెప్పింది. “వచ్చిన వాళ్ళని నేను ముందు పలకరిస్తాను... దానిబట్టి నువ్వు నీకు ఏ వరస అవుతారో తెలుసుకోని మాట్లాడు...” అంది.
వినడానికి సులభంగానే వుంది కానీ అప్పు కష్టం రెండింతలైంది. వాళ్ళ అమ్మకి ఆడపడుచు కొడుకంటే తనకేమౌతాడో తెలుసుకోడానికి తలప్రాణం తోకకొచ్చింది. ఇహ ఇలా కాదని  ఎవరు వచ్చినా నవ్వుతూ “బాగున్నారా? కులాసా? ఆరోగ్యం ఎలా వుంది?” అంటూ చాలా సురక్షితమైన పలకరింపులు మొదలుపెట్టాడు.
ఇదిలా వుండగా, ఆ రోజు వూరి బయట పోలేరమ్మ గుళ్ళో జాతర వుందనీ, కొడుకుని తీసుకెళ్ళాలని తాపత్రయపడ్డారు అతని తల్లీతండ్రి. అయితే అప్పు ప్రయాణపు అలసటలో వున్నాడని గుర్తించి కొంత వెసులుబాటు కల్పించారు. ఉదయం జరిగే పూజకు వాళ్ళు మాత్రం వెళ్ళేటట్లు, సాయంత్రం జాతరకు అప్పు కూడా వచ్చేటట్లు ఒప్పుకున్నారు. ఇద్దరూ బయల్దేరి వెళ్ళారు. అప్పుకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది వాళ్ళమ్మ.
అప్పు బడలికగా సోఫాలో కూలబడ్డాడు. అతని భయమల్లా ఒకటే – ఎవరైనా బంధువులో, (పాత)పరిచయస్తులో వస్తే వాళ్ళు ఎవరో గుర్తుకురాక ఇబ్బందిపడతానేమో అని. అతను అనుకున్నంతా అయ్యింది. సరిగ్గా సోఫాలో కూర్చున్న చోటే కిందకు జారి ఒక గంట నిద్ర పోయాడోలేదో ఏదో అలికిడి అయ్యి మెలకువ వచ్చింది.
“ఎవరూ?” అన్నాడు లేస్తూనే.
వచ్చిన వ్యక్తి సమాధానం ఇవ్వలేదు సరికదా అప్పు వైపు చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళలోకి చూసిన అప్పు ఆ కళ్ళలో ఆనందం కనిపించి ఎవరో బాగా తెలిసినవాళ్ళై వుంటారని అనుకోని అలవాటైన పలకరింపు మొదలుపెట్టాడు.
“రండి.. రండి... అక్కడే ఆగిపోయారే? అంతా కులాసానా?” అన్నాడు. అవతలి వ్యక్తి తలూపాడు.
“ఏమిటిలా తయారయ్యారు? ఆరోగ్యం అదీ సరిగానే వుంది కదా?” అన్నాడు మళ్ళీ. అవతలి వ్యక్తి ఏదో ఒక సమాధానం చెప్తే, దాని బట్టి బంధుత్వం తెలుసుకోవాలని అప్పు ప్రయత్నం. అవతలి వ్యక్తి సమాధానం చెప్పకుండా నిలబడ్డాడు.
“కూర్చోండి...” అంటూ బలవంతంగా కూర్చోబెట్టాడు అప్పు.
“మీకోసం అమెరికా నుంచి ఇదిగో ఈ వాచి తెచ్చాను” అంటూ అందినదేదో తీసి చేతిలో పెట్టాడు.
“నాకెందుకులే బాబూ” అన్నాడు అతను.
“భలేవారే... తీసుకోండి... పిల్లలు ఎలా వున్నారు?” అన్నాడు అప్పు. నిజానికి చీకట్లో రాయి వేశాడు. సరిగ్గా తగిలింది.
“బాగున్నారు బాబూ... పెద్దది డిగ్రీ చదువుతోంది, చిన్నాడు స్కూల్ కి వెళ్తున్నాడు...”
అప్పుకి మరో క్లూ దొరికింది కాబట్టి అల్లుకుపోయాడు. పెట్టెలో నుంచి రెండు చాక్లెట్ ప్యాకెట్లు తీసి- “పిల్లాడికి..” అంటూ మొహమాటంగా నవ్వాడు. అతను తీసుకున్నాడు. అతన్ని పరిశీలనగా చూశాడు. వేషధారణ చూస్తే అట్టే డబ్బున్న లక్షణాలు ఏవీ కనిపించలేదు.
“పిల్లల్ని బాగా చదివించండి. ఏమన్నా ఇబ్బందైతే నాకు చెప్పండి...” అన్నాడు తన తెలివితేటలకి తానే మురిసిపోతూ. ఆ తరువాత అలాగే మరో పావుగంట మాట్లాడి మరీ పంపించాడు అతన్ని.
అతను వెళ్ళిపోయిన గంట తరువాత వచ్చారు అమ్మానాన్న. వచ్చిన వ్యక్తి వివరాలు చెప్పాడు అప్పు. అలాంటి వ్యక్తి ఎవరున్నారా అని ఆలోచించారు కానీ ఎవరికీ అంతుపట్టలేదు. అతను రంగు, పొడుగు, పోలికలు, బట్టలు అన్నీ చెప్పాడు కానీ ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. తెలిసినవాళ్ళందరినీ వాకబు చేసినా ఫలితం లేదు.
వాళ్ళు ఆ రోజు సాయంత్రం కల్లుపాక దగ్గరకు వచ్చి వాకబు చేసుంటే విషయం తెలిసేది. అక్కడ ఫుల్లుగా తాగేసిన గవర్రాజు తన మిత్రుడి దగ్గర మొత్తం చెప్పుకున్నాడు.
“ఏమైనా ఆయన దొరబాబురా... దొంగతనానికి ఎళితే దగ్గరుండి మర్యాద చేసాడు... పిల్లల సదువులకి డబ్బులిత్తానన్నాడు... ఇట్టాటోరింట్లో దొంగతనం చెయ్యడానికెళ్ళానని తెగ ఇదైపోతన్నా.... ఇదే చెప్తన్నా ఇక దొంగతనాలు చెయ్యనుగాక చెయ్యను...” అంటూ ప్రకటించాడు చిల్లర దొంగతనాలు చేసే గవర్రాజు.
ఆ తరువాత నెలకి అప్పారావు తిరిగెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియని మిస్టరీ అతని మనసులో మిగిలిపోయింది. వూరు మొత్తానికి గవర్రాజు దొంగతనాలు ఎందుకు మానేసాడనేది అంతుచిక్కని మిష్టరీగా మిగిలిపోయింది.


<< SS>>

(ఎంప్లాయీస్ వాయిస్, జూన్ 2013)

మొపాస కథలు: బికారి

ఇప్పుడిన్న కష్టాలు పడుతున్నాడు కానీ, వాడి జీవితంలో ఇంతకంటే మంచిరోజులు లేకపోలేదు.

పదిహేనేళ్ళప్పుడు వార్విల్ రహదారి మీద బండి చక్రాలకింద పడి వాడి రెండు కాళ్ళూ నలిగిపోయిన తరువాతే ఇలాంటి దుర్భరమైన రోజులు దాపురించాయి. ఇక అప్పటి నుంచి చేతులకింద కట్టెలతో తన శరీరాన్ని ఈడ్చుకుంటూ పొలాల దగ్గర, దార్ల వెంట అడుక్కుంటూ బతికాడు. అలా చేతికింద కర్రలు పెట్టుకోని నడుస్తుంటే వాడి భుజాలు చెవులదాకా పోయి, వాడి తల రెండు కొడల మధ్య నలిగిపోతున్నట్లు కనపడేది.

చిన్నప్పుడే ఒక అనాథలాగా చెత్తకుప్పలో పడివున్న వాణ్ణి చర్చి ఫాదరు దగ్గరతీసి, బాప్టిజం ఇచ్చి పోషించాడు. అలా ఆయన దయాధర్మాలతో బతుకుతూ, చదువు సంధ్యలు లేకుండా, అక్కడే వున్న ఒక బేకరీ వాడు వూరికే ఇచ్చిన బ్రాందీ తాగుతూ అల్లరి చిల్లరిగా సంవత్సరాలు గడిపేశాడు. అందువల్ల రెండు కాళ్ళు పోయిన తరువాత చెయ్యి చాపి అడుక్కోవడం తప్ప ఇంకేమి చెయ్యలేని పరిస్థితికి వచ్చాడు.

ఒకసారెప్పుడో బారొనీస్ అనే ఆవిడ వాణ్ణి చూసి తన చావిట్లో కోళ్ళ బుట్ట పక్కన గడ్డి పరుచుకోని పడుకోడానికి అనుమతిచ్చింది. అవసరమైతే రెండు రొట్టముక్కలో, కాస్త మజ్జిగో వాడికి ఇచ్చేది. ఒకట్రెండుసార్లు చిల్లర డబ్బులు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆవిడ కాలం చెయ్యడంతో వాడు మళ్ళీ వీధిన పడ్డాడు.

వూరేమో చిన్నది. వాడి ముఖం అందరికీ పరిచయం. నలభై ఏళ్ళుగా వాళ్ళ ముందే పెరిగాడు వాడు. అప్పుడు వాడి అల్లరి చూశారు, ఇప్పుడు ఆ చెక్క కట్టెల మీద శరీరాన్ని ఇళ్ళిల్లూ ఈడ్చుకుంటూ తిరగడం కూడా రోజూ చూస్తున్నారు. దాంతో వూర్లో జనం ఒక్కళ్ళు కూడా పైసా రాల్చేవాళ్ళు కాదు. వాడు మాత్రం ఇంకో చోటికి వేళ్ళాలన్న ఆలోచన కూడా చేసేవాడు కాదు. అసలు వాడికి ఆ చుట్టుపక్కల వున్న మూడు నాలుగు గ్రామాలు తప్పించి వేరే ప్రపంచం వుందని కూడా తెలియదు. తెలుసుకోవాలనీ లేదు. దాంతో తిరిగిన వూళ్ళోనే తిరుగుతూ, వాడికంటూ ఒక గిరిగీసుకోని అందులోనే అడుక్కుంటూ బతుకుతున్నాడు.

"ఎప్పుడూ ఇక్కడే కుంటుకుంటూ తిరక్కపోతే వేరే వూరు పొయ్యి చావకూడదూ" అని ఎవరో ఒక రైతు చిరాగ్గా అడిగేవాడు. వీడు మాత్రం సమాధానం చెప్పేవాడు కాదు.
"ఏదో తమ దయ" అనుకుంటూ పక్కకి తొలిగేవాడు.
వాడి ముఖంలో ఇలాంటి నిర్భాగ్యులందరి ముఖాల్లో కనిపించే దైన్యం కనిపిస్తుంది. ఆ వూర్లో అవే ముఖాలు, అవే చిరాకులు, అవే అవమానాలు పదే పదే చూసి చూసి ఎలాంటి భావన కనిపించని శవంలాంటి ముఖంలా తయారైంది వాడి ముఖం. అయితే ఎప్పుడైనా పోలీసులు కనిపిస్తే మాత్రం ఆ ముఖంలో భయం తాండవించేది. వాళ్ళు ఏ రోడ్డు చివరైనా వస్తూ కనిపిచారో, చటుక్కున ఏదో ఒక పొద చాటునో, రాళ్ళ గుట్ట చాటునో నక్కేవాడు.

దూరంగా పోలీసుల యూనిఫారం కనపడగానే పెద్ద పులిని చూసిన జింకలాగా వణికిపోయేవాడు. చేతిలో కట్టాలు జారి కిందపడిపోయేవి. ఒక్కసారి కింద మట్టిలో పడి ఆ దుమ్ములో పాక్కుంటూ పక్కకి వెళ్ళేవాడు. ముడుచుకుంటూ శరీరాన్ని వీలైనంత చిన్నదిగా చేసుకోని, మట్టిలో కలిసిపోయినట్లు వుండిపోయేవాడు. అయితే ఏ రోజూ పోలీసులు వాణ్ణి భయపెట్టింది లేదు. వాళ్ళను చూస్తేనే భయం కలుగుతుంది కానీ ఆ భయానికి కారణం ఏమిటో వాడికి కూడా తెలియదు. బహుశా ఎవరో తెలియని వాడి అమ్మా నాన్న దగ్గర్నుంచి వారసత్వంగా వచ్చిందేమో.

వాడికి వుండటానికి ఏ గూడూ లేదు. ఎండాకాలంలో ఎవరో ఒకరి ఇంటి అరుగు మీద గడిపేసేవాడు. చలికాలంలో మాత్రం గుట్టుగా ఏదో ఒక పశువుల కొష్టంలోకి దూరి, అక్కడే గడిపేవాడు. వాడు అక్కడ వున్న సంగతి ఆ ఇంటివాళ్ళు తెలుసుకునే లోపే అక్కడి నుంచి జారుకునేవాడు. ఏ ఇంటి పెరట్లోకి ఎలా దూరాలో వాడికి బాగా తెలుసు. కట్టెల మీద బరువు వేసి నడవటం వల్లేమో వాడి చేతుల్లోకి విశేషమైన బలం వచ్చింది. ఒకోసారి గడ్డి వాము పైకి చేతుల సహాయంతొనే ఎక్కేసి, గుట్టు చప్పుడు కాకుండా మూడు నాలుగు రోజులు గడిపేసేవాడు. అయితే ఆ మూడు నాలుగు రోజులకి సరిపడా తిండి దొరికినప్పుడే ఇలాంటి పని చేసేవాడు.

వాడు పేరుకి మనిషే కానీ అడవిలో జంతువులా బతికేవాడు. వాడి చుట్టూ వున్నవాళ్ళు కూడా మనుషులే కానీ ఏ ఒక్కరూ వాడి పట్ల ప్రేమ, జాలి చూపించరు. వాడికి కూడా ఎవరిపైనా ఎలాంటి అభిమానమూ లేదు. వాడి వాలకం అదీ చూసి అందరూ గేలి చేసేవారు. రెండు కట్టల మధ్య వూగుతుండే వాడి శరీరాన్ని చూస్తే చర్చిలో గంట గుర్తుకొస్తోందని వాడికి "గంటయ్య" అని పేరుపెట్టి నవ్వుకునేవాళ్ళు.

***
రెండు రోజులైంది వాడు కడుపుకి ఇంత ముద్ద తిని. ఎవరిని ఏం అడిగినా లేదు పొమ్మంటున్నారు. అందరిలో ఒక్కసారి జాలి, దయ ఇంకిపోయినట్లు అనిపించింది. ఏ ఇంటి ముందుకెళ్ళినా ఆ ఇంటి ఆడవాళ్ళు మొండి చెయ్యి చూపించారు.
"నువ్వెక్కడ దాపురించావురా దరిద్రుడా... మూడు రోజుల క్రితమేగా మిగిలిపోయిన బిర్యానీ పెట్టాను? మళ్ళీ ఇక్కడికే వచ్చావేం?" అరిచిందో మహాఇలాలు.
వాడు మాట్లాడకుండా కట్టెలు వేరే ఇంటివైపుకు తిప్పుకోని కదిలాడు. అక్కడ కూడా అదే అనుభవం అయ్యిందివాడికి.
ఆ ఇంటి ఇల్లాలు పక్కింటి పిన్నిగారితో మాట్లాడుతూ వుంది.
"ఇదెక్కడి చోద్యం పిన్నిగారూ... ఈ బద్దకపు ముండాకొడుక్కి సంవత్సరం అంతా మనమే తిడిపెట్టాలా ఏమిటి?" అంటూ ఈసడించింది.
వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం. బద్దకపు ముండాకొడుక్కైనా తినడానికి ఇంత తిండి కావాలిగా?

ఆ చుట్టు పక్కల వున్న సెయింట్ హిలేహ్, వార్విల్, లే బిలియ లాంటి వూర్లు అన్నీ తిరిగాడు వాడు. ఎక్కడా నయాపైసా కానీ, ఇంత ముద్దకానీ దొరకలేదు. ఇక మిగిలిందల్లా టోర్నోలే అనే వూరు. అక్కడికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డుమీదే నాలుగు మైళ్ళు నడవాలి. వాడికేమో అడుగుతీసి అడుగేసే వోపికలేదు. కడుపుతోపాటు జేబులు కూడా ఖాళీగానే వున్నాయి. తప్పదు కదా! టోర్నోలే వైపు కదలడం మొదలుపెట్టాడు.

మంచి శీతాకాలం. డిసెంబరు చలిగాలులు పొలాలమీదుగా, చెట్లమీదుగా కదులుతున్నాయి. నల్లటి ఆకాశంలో పనిలేని మబ్బులు పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నాయి. ఆ అవిటివాడు బాధని పంటి బిగువున భరిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. ఒక్కొక్క కట్టెని ముందు వేసుకుంటూ, శరీరాన్ని భారంగా లాగుతూ ముందుకుసాగాడు. దారిలో ఏ చెట్టు కిందో కొద్దిసేపు ఆగి, అలసట తీర్చుకుంటూ మూడు గంటలపాటు ప్రయాణం చేశాడు. ఆకలి లొపల్నుంచి దహిస్తుంటే వాడి బుర్ర పనిచెయ్యడం కూడా మానేసింది. తినాలి... ఎక్కడో అక్కడ, ఏదో ఒకటి తినాలి... అంతే. ఇదే ఆలోచిస్తోంది వాడు మెదడు. ఆ ఏదో ఒకటి ఎలా సంపాదించుకోవాలనేది మాత్రం వాడి ఆలొచనలోకి రావటంలేదు. తినాలి..! ఎలాగొలా తినాలి..!! అంతే..!!

వూరి పొలిమేరలో రోడ్డుపక్క చింతచెట్లు కనపడగానే వచ్చేశానన్న సంతోషంతో వూర్లోకి అడుగుపెట్టాడు. అప్పుడే పొలం బయల్దేరిన ఒక రైతు ఎదురొచ్చాడు.
"వోరి శనిగాడా... మళ్ళీ తగలబడ్డావా? మాకు నీ శని ఎప్పుడు వదుల్తుందిరా?" అంటూ తిట్టాడు.
'గంటయ్య' ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనపడ్డ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి చేతులు చాపాడు. చీవాట్లు, తిట్లు పలహారంగా దొరికాయి తప్ప చిల్లికాణీ కూడా ఎవరూ రాల్చలేదు.
వూరి చివర వున్న పొలాలదగ్గరికి కూడా వెళ్ళాడు. బురదమట్టిలో కట్టెలు తీసివేస్తూ నడవడానికే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎవ్వరూ చెయ్యి విదిలించలేదు. గడ్డకట్టించే చలికాలం అది. వాళ్ళ మనసులు కూడా గడ్డకట్టినట్లున్నాయి. చలికి ముడుచుకున్న ఏ ఒక్క చెయ్యి 'గంటయ్య'ను ఆదుకోవటం కోసం ముందుకు రాలేదు.

అవకాశం వున్న ప్రతిచోటా ప్రయత్నించిన తరువాత అలసిపోయి చిక్యువే అనే ఆసామి పెరడు పక్కన ఒక గుంటదగ్గర కూలబడ్డాడు. చేతి కట్టెలు పక్కన పడేసి కదలలేని బడలికతో మట్టిలో కదలకుండా పడుకున్నాడు. ఆకలికి అల్లాడుతూ ఆలొచించే శక్తి కోల్పోవటంవల్ల తాను అనుభవిస్తున్న దౌర్భాగ్యాన్ని కూడా గుర్తించలేని అశక్తుడై పడివున్నాడు.

మనిషి బతికున్నంతకాలం ఆశ కూడా వుంటుందికదా. ఈ 'గంటయ్య'కూడా అంతే. ఎదురుచూస్తూ కూర్చున్నాడు. దేనికోసమో తెలియదు. ఎవరికోసమో తెలియదు. ఏదైనా అద్భుతం జరిగి దేవుడు పైలోకం నుంచి ఏదైనా పంపిస్తాడేమో అని ఎదురుచూశాడు. లేకపోతే ఏ ధర్మాత్ముడైనా జాలిపడి ఒక రూపాయి ఇస్తాడేమో అనుకున్నాడు. ఆ సహాయం ఎప్పుడొస్తుందో తెలియక ఎదురుచూస్తున్నాడు. వస్తుందో రాదో తెలియకపోయినా ఎదురుచూస్తూనే వున్నాడు.

చలిగాలు వీస్తూనే వున్నాయి. చిక్యువే పెరట్లో కోళ్ళు అటూ ఇటూ పరుగెడుతున్నాయి. ప్రాణమున్న ఏ జీవికైనా ఉదరపోషణ తప్పదు కదా. వాటి తిండికోసం అవి వెతుక్కుంటున్నాయి. ఆ మట్టిలో ఒక గింజో, ఒక పురుగో దొరికితే దాన్ని మింగి ఇంకా రుచికరంగా ఏమన్నా దొరుకుతాయేమో అని మొత్తం వెతుకుతున్నాయి. కడుపు నిండిన తరువాత రుచి పచి కావాల్సివస్తుంది మరి.

మొదట గంటయ్య వాటి వైపు ఏ ఆలోచన లేకుండా చూశాడు. ఆ తరువాత అతని బుర్రకి కాదు కానీ కాలే కడుపుకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ తిరుగుతున్న కోళ్ళలో ఒక్కటి దొరికినా తన ఆకలి తీరిపోతుంది అనుకున్నాడు. ఎండుపుల్లలు తగలపెట్టి కొడిని కాల్చుకోని తినవచ్చనే ఒక పథకం కూడా రూపుదిద్దుకుంది.
అతని ఆకలి అతని చేత దొంగతనం చేయిస్తోందని కూడా అతనికి అర్థంకాలేదు. అందుబాటులో వున్న ఒక రాయిని తీసుకోని గురి చూసి దగ్గర్లో వున్న కోడి మీదకు విసిరాడు. వంట్లో నీరసం వున్నా అతని గురి మాత్రం తప్పలేదు. రాయి తగిలిన కోడి రెక్కలు అల్లల్లాడించి తలవాల్చేసింది. గంటయ్య సంబరంగా కిందపడి వున్న కట్టెలను అందుకోని, అతి కష్టం మీద లేచి నిలబడి తాను సాధించుకున్న ఆహారం వైపు అడుగులేశాడు. చచ్చిపడున్న ఆ ఎర్రకోడి దగ్గరకు వెళ్ళాడో లేదో, సరిగ్గా అప్పుడే అతని వీపు మీద ఎవరో చరిచినట్లు పెద్ద దెబ్బపడింది. చేతిలో కెట్టెలు జారిపోయి, పదడుగుల అవతల పడ్డాడు వాడు. వెనక్కి తిరిగితే చిక్యువే. కోపంతో బుసలుకొడుతూ, చొక్కా చేతులు మడుచుకుంటూ అందిన చోటల్లా కొట్టాడు. కాళ్ళతో, చేతులతో ఎలా కుదిరితే అలా కొట్టాడు. గంటయ్య ఎదురుతిరిగే ఓపిక లేక ఆ తన్నులు తింటూ పడివున్నాడు.

చిక్యువే దగ్గర పని చేసే పాలేర్లు కూడా వచ్చి అయ్యగారి పనిలో పాలుపంచుకున్నారు. అందరు కలిసి కొట్టినంతసేపు కొట్టి, తీసుకెళ్ళి కొష్టంలో కట్టి పడేశరు. ఆ తరువాత పోలీసులకి కబురు చేశారు. గంటయ్య సగం చచ్చినట్లు అక్కడే పడివున్నాడు. రక్తం కారుతూనే వుంది. ఆకలి వేస్తూనే వుంది. సాయంత్రం అయ్యింది - చీకటి పడింది - మళ్ళీ తెల్లవారింది. పోలీసులు రాలేదు. గంటయ్య ఏమీ తినలేదు.

మధ్యాన్నానికి వచ్చారు పోలీసులు. ఎంతో జగ్రత్తగా వాడి కట్లు విప్పారు. వాడు తిరగబడతాడేమో అని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చిక్యువే వాళ్ళకు చెప్పిన సంగతి అలాంటిది మరి. "గంటయ్య తన మీద దాడి చేశాడనీ, తప్పనిసరి పరిస్థితిలో ఆత్మ సంరక్షణకోసం వాణ్ణి కొట్టాననీ" చెప్పాడు చిక్యువే.

"లేరా.. లే ఇక్కడ్నుంచి.." అన్నాడు పోలీసాయన.

గంటయ్య కదిలే పరిస్థితిలో లేడు. కట్టేలు అందుకోవాలని కష్టపడ్డాడు కానీ అందుకొలేకపొయ్యాడు. వాడి నిస్సహాయత మొత్తం నటనే అని నమ్మిన ఒక పోలీసు వాడి రెక్కపట్టుకోని ఈడ్చి కట్టెల మధ్య కుదేశాడు. గంటయ్యని ఒక్కసారిగా భయం కమ్మేసింది. పోలీసు యూనిఫారం కనపడితే వాడికి కలిగే భయం రాక్షసిలా నిద్రలేచింది. చిరుత పులిని చూసిన కుందేలులా వణికిపోయాడు. పిల్లి ముందు నిలబడ్డ ఎలుకలా ముడుచుకుపోయాడు. భయం వల్ల వచ్చిన శక్తితో కష్టపడి ఎలాగైతేనేం కర్రల సహాయంతో లేచి నిలబడ్డాడు.

"నడువ్.." అన్నాడు పోలీసు. వాడు కదిలాడు. చిక్యువే, అతని మనుషులు గంటయ్య బయటికెళ్ళేదాకా బుసలుకొడుతూ నిలబడ్డారు. ఆడవాళ్ళు శపనార్థాలు పెడుతూ మెటికెలు విరిచారు.
"పొయ్యాడు వెధవ."
"పీడా విరగడయ్యింది"
"శని వదిలింది"
ఇద్దరు పోలీసుల మధ్యలో నడిచాడు వాడు. ఎక్కడలేని శక్తి వచ్చేసింది వాడికి. అసహాయతలోంచి పుట్టుకొచ్చిన శక్తి అది. అలాగే సాయంత్రందాకా ఈడ్చుకుంటూ నడిచాడు. ఏం జరుగుతోందో తెలుసుకోనివ్వకుండా కళ్ళు బైర్లు కమ్మాయి. జరిగేది అర్థం చేసుకోనివ్వకుండా భయం కమ్మేసింది.
దారిలో ఎదురైనవాళ్ళు ఆగి మరీ వాడి వైపు చూసారు.
"ఏ దోంగతనమో చేసుంటాడు వెధవ" అనుకున్నారు.
సాయంత్రానికి పట్నం చేరారు అంతా. అంతదూరం నడిచిందే లేదు వాడి జీవితంలో. ఆ విషయం వాడికి కూడా అర్థం కాలేదు. అసలు అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఏం చెయ్యబోతున్నారో కూడా అర్థం కాలేదు. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలు, ఈసడింపులు, ఇప్పుడీ కొత్త ముఖాలు వాడిని ఏమీ అర్థం చేసుకోనివ్వని స్థితిలోకి నెట్టేశాయి.
ఒక్క మాటకూడా మాట్లాడలేదు వాడు. మాట్లాడటానికి ఏముందనీ? ఏం జరుగుతోందో అర్థం అయితే కదా మాట్లాడటానికి? అసలు అడుక్కోడానికి చెయ్యి చాపడమే తప్ప మనుషులతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలయ్యిందో. బహుశా వాడు నాలుక వాడటం కూడా మర్చిపొయాడేమో. అతనికే అర్థంకాని ఆలోచనలు నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రాకుండా చేశాయి.
లాకప్ లో పడేశారు. వాడికి తినడానికేమైనా పెట్టాలన్న ఆలోచన కూడా పోలీసులకు రాలేదు. వాణ్ణి అలాగే ఒంటరిగా గదిలో వదిలేశారు. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి వాడు చచ్చిపడున్నాడు.

"ఎంత విచిత్రం? వాణ్ణి ఏమీ చెయ్యలేదు. ఊరికే చచ్చిపోయాడు" అంటూ ఆశ్చర్యపోయారు అంతా.

కథానాయకుడి కథ

వెతకగా వెతకగా దొరికాడు నా కథానాయకుడు. నా కథని తన భుజస్కంధాలపైన మోసే ధీరుడు. నాకూ, నా కథకీ శాశ్వతమైన కీర్తిని ప్రసాదించబోయే కల్పతరువు. ప్రపంచ కథకుల మధ్య నాకూ స్థానం కల్పించబోయే నా కామధేనువు. ఎంతగా వెతికాను వీడి కోసం. గవర్నమెంట్ ఆఫీసుల్లో, మధ్యతరగతి ఇళ్ళలో, పూరిగుడిసెల్లో, కల్లుపాకలో, సానికొంపల్లో చివరికి ఇలా... ఇక్కడ ఈ నగరం నడిబొడ్డున రోడ్డుకి అడ్డంగా నైరాశ్యం, నిర్వేదం కలగలిసిన రుషిలా, కఠినమైన తారు రోడ్డుపై సాక్షాత్తు శ్రీమహావిష్ణువులా పవళించి పడివున్నాడు వాడు. వాడే.. వాడే... నా కథానాయకుడు.
ఎవరై వుంటాడు?... ఎవరైతేనేం? వీడి జీవితంలో కష్టాలేమిటో... కన్నీళ్ళేమిటో... వాడి మీద ఈ సమాజం కక్షగట్టి ఎన్నెన్ని పరీక్షలు పెట్టిందో. ఎన్ని కష్టాల గంజినీళ్ళు వీడి ముఖాన కొట్టిందో... అవే.. అవే కావాలి నాకు. నా కథలో కరుణరసం పాతళగంగ పైకి తన్నినట్లు ఉబిఉబికి రావాలి. ఆ కథ చదివిన పాఠకులు కన్నీళ్ళై కరిగిపోయి నా కలానికి సలాములు చెప్పాలి. దీనజన ఆర్తనాదాన్ని విన్న కథకుడినై... “దీనకథాప్రవీణ”, “రోదనకథావిశారద”. నేనే... సన్మానపు దుప్పట్లు, హాలంతా చప్పట్లు. ఓహ్..!! దానికన్నా ముందు వీడి కథేమిటో తెలియాలిగా...!
ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు. కార్లు, బండ్లు, బస్సులు వాణ్ణి తప్పుకుంటూ, దాటుకుంటూ, రాసుకుంటూ ఎవరినా ఆగితే కదూ..?? అవునూ ట్రాఫిక్ కానిష్టేబుల్ ఒకడుండాలే ఇక్కడ. ఏడీ ఆ నగరరహదారి వాహన చలన నియంత్రణా ధురీణుడు.
“కానిష్టేబుల్... కానిష్టేబుల్... ట్రాఫిక్ కానిష్టేబుల్ ఎక్కడున్నా సరే వెంటనే ఇక్కడికి రావలెను”
“పిలిచారా సార్”
“అవునయ్యా... ఏమిటిలా రోడ్డుని వీధిమీద వదిలేసి ఎక్కడికి పొయ్యావు?”
“టీ తాగుతున్నాను సార్... ఇంతకీ మీరెవరు?”
“ఈ కథ రాస్తున్నవాణ్ణి. కథకుణ్ణి... అద్సరే ఇలా వదిలేసిపోతే ట్రాఫిక్ ఎలా కట్రోల్ అవుతుంది? చెప్పు”


“సార్... ఇది పెద్ద పెద్ద వాళ్ళు వుండే ఏరియా. అంతా చదువుకున్నవాళ్ళు. ఎర్ర రంగు కనిపిస్తే ఆగుతారు, పచ్చ రంగు కనిపిస్తే కదులుతారు. రోడ్డుకు ఎడమపక్కనే నడుస్తారు...”
“చాల్లే ఆపు... ఈ కథ రాస్తున్నవాణ్ణి నేనే అని చెప్పాను కదా... నిజం నిజంగా చెప్పు”
“సరే సార్. ఇక్కడ తిరిగేదంతా బాగా బలిసినవాళ్ళు. ఆపమంటే ఆపరు. ఆపినా పైసా ఇవ్వరు. అందుకే ఆ పక్కసందులోకి వెళ్ళి ఫ్రీగా వచ్చే టీ తాగుతూవున్నా. అయినా వీళ్ళని కంట్రోల్ చెయ్యడం బ్రహ్మతరం కూడా కాదు.”
ఎంత మాట అన్నాడు. వీళ్ళని ఆపడం ఎవరితరం కాదా? ఇన్నిన్ని పాత్రలు సృష్టించే అపరబ్రహ్మని నా తరం కూడా కాదా? ఎందుకు కాదు? అదీ చూద్దాం.
“అన్ని బండ్లు ఇప్పుడే ఇక్కడే ఆగిపోవునుగాక. అందరూ నా కథానాయకుడి చుట్టూ గుంపుగా మూగుగాక.”
బిలబిల వచ్చేశారు జనం. ప్యాంట్లు, పంచెలు, నిక్కర్లు, చీరలు, చుడీదార్లు...
“సార్ సార్... నా కంచిపట్టు చీర గురించి కూడా కాస్త రాయరూ?”
“ఎవరమ్మా నువ్వు?”
“బాగా బతుకుతున్న బంజారాహిల్స్ భామని.”
“నీ చీర సంగతి రాయాలో లేదో నేను చూసుకుంటాను. ముందు ఈ కథానాయకుడి గురించి నీకేమనిపిస్తోందో చెప్పు”
“ఏముంది రైటరుగారూ... ఇలాంటివాళ్ళని ఎంతమందిని చూడలేదు. పగలంతా మందు కొడతాడు. ఇంటికి వెళ్తే పెళ్ళాన్ని కొడతాడు. నాకు తెలియనివా వీళ్ళ బతుకులు”
“అలాగేం? మరి మీ ఆయన?”
“ఆయన మందు కొట్టేది నిజమే. నన్ను కొట్టేది మాత్రం అబద్ధం. మందుకొట్టాక ఆయన చిలక్కొట్టుడుకి గెస్ట్ హౌస్ కి వెళ్తారుగా...” ఆమె చెప్తుండగా తోసుకుంటూ వచ్చాడు ఒక భారీశాల్తీ.
“నువ్వు కాస్త పక్కనుండమ్మా... ఇదుగో రైటరూ... వాణ్ణి అక్కణ్ణుంచి తీసేసినట్లు రాయవయ్యా... అర్జెంటుగా పోవాలి” అన్నాడాయన గసపెడుతూ.

“అలాగే పక్కన పడేద్దాం కానీ ముందు వీడి గురించి ఏమైనా చెప్పండీ, కథ రాసుకోవాలి” అన్నాను.
“ఛీ.. ఛీ... వీళ్ళ గురించా కథ రాస్తారు. ఎందుకండీ అనవసరపు ప్రయాస. ఇంటికెళ్ళి ఏ ఫ్రెంచ్ కథలనో తిప్పిరాసేసి మీ కథేనని చలామణీ చేసుకోవచ్చుగా?”
“ఏదీ మీరు వేరే భాషల సినిమాలు తెలుగులో తీసి అవార్డులు కొట్టాస్తారు అలాగా?”
“అవన్నీ ఎందుకయ్యా ఇప్పుడు... వీడి గురించి నాకేమనిపిస్తోందో చెప్పాలి. అంతే కదా? రాసుకో... వీడి తల్లి దరిద్రపుదై వుంటుంది. తండ్రి తిరుగుబోతు అయ్యుంటాడు. అసలు పిల్లలు వద్దని వీడి తల్లీదండ్రీ అనుకోనే వుంటారు. ఎలానో పుట్టాడు వీడు... ఎలాగేముందిలే. ఆవేశం అణుచుకోలేక చేసిన ఏక్సిడెంట్ లో పుట్టుంటాడు...” గట్టిగా నవ్వాడు.
“మరి ఏం చేద్దాం వీణ్ణి?”
“చెప్పానుగా బతుకుంటే పక్కకు దొర్లించు. పోతే మున్సిస్పాలిటీ వాళ్ళతో ఈడ్పించు...”
“మరీ ఈ రచయితకు దయాజాలీ లేవని అంటారేమో... వేరే ఏదైనా ఆలోచన చెప్పండి” అన్నాను.
“నేను చెప్తాను... నేను చెప్తాను...” అంటూ వచ్చాడు ఒక సూటూబూటు వేసుకున్న పెద్దమనిషి.
“వీణ్ణి పోలీసులకి పట్టించండి. ఖచ్చితంగా వీడు దొంగ అయ్యుంటాడు. మొన్నామధ్య మీరు రాసిన కథలో నా పర్సు ఇదే ఏరియాలో పోయింది కదా...”
“అది నీ పెళ్ళామే తీసిందని చెప్పాను కదా?”
“చాల్లే వూరుకోండి. ఆ కథే బాగాలేదు. వీడే.. వీడే తీశాడని రాయండి. పోలీసులకి పట్టివ్వండి. జైల్లో తోయించి, ఏ మంత్రిగారి రికమండేషనో పెట్టించి, నా పర్సు రికవరన్నా చేయించండి...”
“సరే మీరు చెప్పినట్లే చేద్దాం.. అదిగో పోలీసు ఆఫీసర్ గారు కూడా వచ్చారు... ఆయన్నే అడిగితే సరి...” పోలీసు పేరు చెప్పగానే గుంపులో సగం మంది తప్పుకున్నారు.
“ఏమిటండీ హడావిడి. మీ కథకి ఈ రోడ్డే దొరికిందా?”


“కాదండీ... అదుగో ఆ కుర్రాడు.. నా కథానాయకుడు... వాడు అలా ఎందుకు పడిపోయాడో... ఏమిటో... తెలుసుకోని మీ దగ్గరకే పంపిద్దామని అనుకుంటున్నాము... ఇంతలోనే మీరు వచ్చారు...”
“అంతే కదా... నేను చెప్తాను వినండి. వీడి బతుకంతా చీకటి బతుకైవుంటుంది. తల్లి వేశ్య. అంత మంది అమ్మమొగుళ్ళలో తండ్రి ఎవరో తెలియక, మత్తు మందుకి, డ్రగ్స్ కి అలవాటు పడి, ఆ డబ్బుకోసం దోపిడీలు, హత్యలు చేస్తూ బతుకుతుంటాడు... ఏమంటారు?”
“అనడానికేముంది? బాగా సంపన్నులు వుండే ఏరియాకి ఆఫీసర్ కదా మీరు. సినిమా తారలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలతో మీకు పరిచయాలు. పబ్బులు, డ్రగ్గులు మీకు తెలిసినంత మాకెక్కడ తెలుస్తాయండీ? ఇంతకీ ఏం చేద్దామంటారు వీణ్ణి?”
“ఏదైనా ఒక ఎన్.జీ.వో. వాళ్ళకి అప్పజెప్తే, మంచి మాటలు చెప్పి, వాడి అలవాట్లు మాన్పించి ఒక దారికి తీసుకొస్తారు..”
ఇదేదో బాగానే వున్నట్లు అనిపిస్తోంది నాకు. ఏమంటారు? ఎవరైనా సంఘసేవకుణ్ణి పిలుద్దామా?
“సంఘసేవకుడు గారూ, సంఘసేవకుడు గారూ, సంఘసేవకుడు గారూ”
“జీ హుజూర్... చెప్పండి ఏం చెయ్యాలి...” సంఘసేవకుడుగారు హాజరయ్యారు.
“అదిగో అక్కడ పడున్నాడే... నా కథానాయకుడు... వాణ్ణి తీసుకెళ్ళి. క్షవరం చేయించి, స్నానం చేయించి, వాడి దురలవాట్లన్నీ మాన్పించి వాడి కథేమిటో కనుక్కోని నాకు చెప్పాలి... సరేనా?”
“అబ్బే... మీరు పొరబడుతున్నారు. సమస్య మూలాల్లోకి వెళ్ళాలి మీరు. వీడి సమస్య తల్లిదండ్రులూ కాదూ, నేరప్రవృత్తీకాదు, మత్తు నిషా అంతకన్నా కదు. వీడు ఇలా పడి వుండటానికి కారణం అనారోగ్యం అయ్యింటుంది. ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్తే ఉపయోగం వుండచ్చు...”
“మరి మీరు...?”
“భలేవారే... నాకెన్ని పనులు... ఫారిన్ నుంచి డబ్బులిచ్చే దాతలొస్తున్నారు... సాయత్రం నాకు సన్మాన కర్యక్రమం... మీరు డాక్టర్ ని పిలవండి చెప్తాను...”
“డాక్టర్... డాక్టర్... డాక్టర్...”

“చెప్పండి. ఏమిటి సమస్య?”
“సమస్య అంటే ఏం లేదండీ... ఇదుగో ఇక్కడ పడున్నాడే కథానాయకుడు. వాణ్ణి మీ ఆసుపత్రికి తీసుకెళ్ళి...”
“ఓకే... ఓకే... నాకు అర్థం అయ్యింది. ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి. ఆ తరువాత ఎమ్.ఆర్.ఐ., స్కానింగ్, నాలుగు ఎక్సరేలు... లిపిడ్ ప్రొఫైల్..”
“వీటన్నింటికీ ఖర్చుకాదటండీ?” అన్నాను.
“అవుతుంది. హాస్పిటల్ అంటే మరి వూరికే వైద్యం చేస్తారా? డాక్టర్ చదువంటే ఎంత డబ్బుపెట్టాలో తెలుసా? మరవన్నీ వడ్డీ కట్టి వసూలు చేసుకోవద్దూ...”
“నిజమే. మీరు చెప్పినదాంట్లోనూ పాయంటు వుంది... కనీసం వాడి చెయ్యపట్టుకోని బతికున్నాడో లేదో చూస్తే...”
“మరి నా కన్సల్టేషన్ ఫీజు రెండొందలు...”
“ఏమిటండీ మీ దబాయింపు... నేను రైటర్ ని... ఈ కథ రాస్తున్నదే నేను... మిమ్మల్ని సృష్టించిందే నేను...”
“అలా వచ్చారా... సరే అయితే. నా క్లినిక్ లో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు డబ్బా ఒకటుంది. అది తీసుకొచ్చి చూస్తాను... చూశారుగా వాడూ వాడి మడ్డి చేతులూ...” అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్.
“వెళ్ళిపోయాడా... ఇంకేం వస్తాడు... పైసా లేనిదా పసరుకూడా పొయ్యడు మహానుభావుడు...” ఎవరో అన్నారు.
పాత్రలు నా మాట వినడంలేదు... చెయ్యిదాటి, కాగితందాటి, కథని దాటి వెళ్ళిపోతున్నాయి. నా కథానాయకుణ్ణి కూడా దాటిమరీ పోతున్నాయి. “ఎవరైనా చెప్పండయ్యా.... ఏంటి నా కథానాయకుడి పరిస్థితి?”
“అబ్బే ఇలాంటి వాళ్ళ సంగతి పట్టించుకుంటూ కూర్చుంటే మా బతుకులేం కావాలి? పేరుకి పెద్ద రచయితలు... నా మొఖాన ఒక ప్రమోషనో... ఒక ఇంక్రిమెంటో... కనీసం ఒక లాటరీ టికెట్టో రాయలేరుగానీ...” ఒక నీటు క్రాఫు గవర్నమెంటు ఉద్యోగి ఈసడించాడు.
“అయినా వీడు కథానాయకుడేమిటండీ... సంఘానికి పట్టిన చీడపురుగులైతేనూ... నా లాంటి కుర్రవాణ్ణి హీరోగా పెట్టి ఓ ప్రేమ కథ రాసెయ్యకూడదూ...” సలహా విసిరాడో కాలేజీ విద్యార్థి.

“ప్రజాపాలనలో అయిదేళ్ళకోసారి సారా పేకట్టు పధకం పెట్టాం కదా... ఇంకా నిత్యపూజలకి వీధివీధినా వైన్ షాపులు వుండనే వున్నాయి... అయినా ఇలాంటివాళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు. ఇంకా ఏం చెయ్యమంటారండీ?” అడిగాడు ఖద్దరుచొక్కా.
ఇవన్నీ కాదు. అసలు కథానాయకుడి కష్టం ఏమిటో తెలుసుకోవాలి కదా. ఆ కష్టంలోనుంచే కదా అసలు కథ పుట్టేది. వాడి దయనీయమైన దరిద్రం గురించి రాస్తేనే కదా నా కథ ఆణిముత్యమయ్యేది. వాడి గురించి చెప్పండిరా అంటే నా పాత్రలన్నీ ఏదేదో వాగుతున్నాయి. పోనీ వాడి ముఖాన సోడా నీళ్ళు కొడితే... తప్పేదేముంది. కథ కావాలంటే ఈ ఒక్క రూపాయి ఖర్చు తప్పేట్టు లేదు.
వాడు లేచాడు. కథానాయకుడు లేచాడు.
“లేచారా? బాబూ కథానాయకుడు గారు... తమరు ఎందుకిలా పడిపోయి వున్నారు? అసలు మీ పేదబ్రతుకులో వున్న కష్టాలేమిటి? నువ్వు పొలం వదిలి పట్నం వచ్చిన రైతువా? పిల్లలు గాలికొదిలేస్తే ఎగురుకొచ్చిన గాలిపటానివా? పిల్ల పెళ్ళికి కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డ తండ్రివా? ఎవరు బాబూ నువ్వు? నీ కథ చెప్పవూ?”
“చెప్తానుగానీ... ఇంతకీ మీరెవరండీ?”
“నేనా... భలేవాడివే... ఈ కథ రాస్తున్న రచయితని. నీ బాధల్ని, కష్టాలనీ తెలుసుకోని కథగా అల్లే ప్రయత్నంలో వున్నాను...”
“నేను ఎంతసేపటి నుంచి ఇలా పడి వున్నాను?”
“కథ మొదలైన దగ్గర్నుంచి ఇలాగే పడివున్నావు... మందుగానీ పట్టించావా? ఏ బూర్జువా బియండబ్లూనో గుద్దితే ఇలా పడిపోయావా? చెప్పు బాబు చెప్పు... నా కలం కాగితం సిద్ధంగా వున్నాయి...”
“అంతసేపటి నుంచి పడివుంటే ఇలా చూస్తూ వూరుకున్నారా మీరూ, మీ పాత్రలు...? మీరు రచనలు మానేసి టీవీ జర్నలిష్టుగా చేరండి పైకొస్తారు...”
“అదేంటి బాబూ... అంతమాట అనేశావు... నువ్వు ఎవరివో? ఎందుకు పడిపోయి వున్నావో? అనే కదా చర్చిస్తున్నాము...”


“అయితే వినండి... అప్పుడెప్పుడో దేశం కోసం, స్వతంత్రం కోసం నిరాహారదీక్ష మొదలుపెట్టాను... ఈ మధ్య మళ్ళీ అవినీతి పైన పోరాడుతూ నిరాహారదీక్ష చేశాను... న్యాయం కోసం, నిజమైన నాయకులకోసం నిరాహారదీక్షలు చేస్తున్నాను... శోష వచ్చి పడిపోయానే తప్ప నేను అనుకునేవేవీ జరగడం లేదు... ఇలా ఎన్నాళ్ళు స్పృహలేకుండా వుండాలో నేను అనుకున్నది సాధించడానికి...” అనుకుంటూ వెళ్ళిపోయాడు కథానాయకుడు.
ఛీ... వీడొక కథానాయకుడు. వీడిదొక కథ. ఒక సెంటిమెంటు లేదు. గుండెల్ని పిండే కష్టంలేదు....  పేదరికం లేదు. బీద అరుపులూ లేవు. నా కథ మొత్తాన్ని పాడుచేశాడు. వీడి కథా నేను రాసేది. ఛీ... ఛీ.. రాయనంటే రాయను. అంతే...!!

<< ?>>
’జ్యోతి’ రాఘవయ్యగారి స్మారక ఆహ్లాదకర కథల పోటీలో బహుమతి పొందిన కథ
రచన, జూన్ 2013