కౌముదిలో నా కథ

ఈ మాసం కౌముదిలో నా కథ "వానరవీరుడు" ప్రచురితమైనది. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

http://koumudi.net/Monthly/2009/september/index.html

ఇది నా వందొవ టపా - ఆఖరు టపా

"ఓసోస్.. ఏతంతవూ.. వంద టపాలు రాసీసినావా.. ఎలగెలగా..!!"

"యోవ్.. ఏందయ్యానువ్వా.. వంద టపాలు రాయంగానే సరా.. పదిమందైనా చూడబళ్ళేదాంట.."

"ఏంరా భై.. పరేషాన్ జేస్తున్నవ్.. దమాకిట్ల ఖరాబైంద మళ్ళ.. ఎంత మంది జూసిన్రనిగాదు.. ఎన్ని కామెట్లు గొట్టిన్రో జూడాలే.. గప్పుడే టపా మంచిగగొట్టినవా బేకారుగొట్టినవ ఎర్కైతది.."

"అదేమిటండీ మాష్షారూ.. అలాగంటే ఎలాగండీ.. వ్యాఖ్యలూ వ్యాఖ్యానాలు సరేనండీ.. అందులో "భేషుగ్గా వుంద"ని ఎన్ని వచ్చాయి.. "అబ్బే బాగాలేదురా అబ్బి" అని ఎన్ని వచ్చాయి? అది తేల్చండీ ముందు.."

***

"అయ్యా పాఠక మహాశేయులారా.. పుణ్య పోషకులారా.. మా బ్లాగు పాలిటి దేవతలారా..."

"ఏమిటా హరి కథ?"

"అబ్బ చెప్పనిస్తేగా.. ఇది నా వందో టపా.."

"ఓహో ఇలాంటివి చాలా చూశాం.. వంద టపాలు, వెయ్యి హిట్లు అనుకుంటూ.. విషయం చెప్పు"

"చెప్పడానికేముంది.. ఈ విధంబుగా నా బ్లాగును ఆదరించి, అభిమానించి, ఆస్వాదించి, ఆశీర్వదించి.."

"ఇంకా ఏమిటి దించేది.."

"దించడమంటే ఆ దించడం కాదయ్యా.. ఆనందించి, అభినందించి"

"ఈ దించుడు - నంచుడు ఆపి విషయం చెప్పవోయ్"

"అలాగలాగే. ఈ బ్లాగులో నేను కథలు వ్రాసితిని. కవితలు వ్రాసితిని. కబుర్లు వ్రాసితిని"

"ఏమిటది ఏడో ఎక్ఖం వొప్పజెప్పినట్లు? సరిగ్గా చెప్పు."

"ఇలాగైతే నా వల్లకాదండీ... నేను ఏమి చెప్పలేను."

"చెప్పకపోతే ఫో.. నువ్వుకాకపోతే కూడలికి పోతే సవాలక్ష బ్లాగులు"

"అదే చెప్పేది.. ఆ సవా లక్ష బ్లాగుల మధ్యలో మా బ్లాగు నిలబడిందా లేదా"

"ఏమిటి నీ ప్రజ్ఞే.."

"అబ్బే నా ప్రజ్ఞేపాటిది.. ఏదో చదివేవాళ్ళు పదిమంది వుండబట్టి నా రాతలు గాని.."

"పోనీలే సత్యం గ్రహించావు.."

"అది మన పేరులోనే వుంది కదా"

"ఏమిటి"

"సత్యం"

"బాగానే వుంది సంబడం.. పేరు పెట్టుకోగానే సరా? అక్కడికి లక్ష్మీ పేరు పెట్టుకున్నవాళ్ళు చెయ్యెత్తితే డబ్బులు రాలుతున్నట్లు"

"ఇదుగో మా ఆవిడనేమన్నా అన్నావో.."

"ఏమిటీ మీ ఆవిడ పేరు లక్ష్మా? ఏదో తెలియక అన్నానయ్యా బాబు. క్షమించు."
"క్షమించాములే ఫో"

"అది సరేగాని ఇంకా ఎంతకాలమిలా పలక మీద బలపం పెట్టి పిచ్చి రాతలు... దీనికి అడ్డు ఆపు ఏమైనా వుందా?"

"ఎందుకులేదు.. అయినా నా బ్లాగు మూసెయ్యాలనుకుంటున్న విషయం నీకెలా తెలుసు?"

"ఏమిటి నిజంగానే"

"అంత సంతోషపడకు.. ఇదంతా తాత్కాలికమే.. పలక-బలపం మీద రాతలు అయిపోయాయి.. పలక నిండిపొయింది. ప్రమోషన్ వస్తే కలం-కాగితం పట్టుకుంటా. లేకపోతే మళ్ళీ ఇదే క్లాసుకి వచ్చి పలకమీద రాతలన్నీ కడుక్కోని మళ్ళీ మొదట్నించి మొదలెడతా.. అంతదాకా శెలవలే శలవలు.."

(శలవు)

వెలుగు గోడలు

ఎరుపు రంగు ఆకాశానికి పులిమి

సూర్యుడు అలసటగా కొండచాటుకి దిగిపోతాడు


అప్పుడు మా గుట్ట మీద కూర్చుంటే

ఎదురుగా వూరు పరుచుకున్న చిత్రపటంలా వుంటుంది

సాయంత్రం చలిగాలి మొదలౌతుంటే

గాలిపటాలతోపాటు వెలుగునీ లాకెళ్ళే పిల్లలు కనపడతారు


వూరి మధ్యలో వున్న గడియారం స్థంభం

చిన్నగా కొట్టే ఏడుగంటలకోసం కిక్కిరించి వింటుంటే

"అల్లాహో అక్బర్" అంటూ ఒక మూల మసీదు అరుస్తుంది

దానికి సమాధానమన్నట్టు మరో మైకు నుంచి

"అష్ హదు అన్ లా ఇలాహ ఇల్ అల్లాహ్".. అంటూ మరో మసీదు బదులు పలుకుతుంది

ఇంతలో వినాయాకుడి గుడిలో గంటలు, బాబా గుడిలో ఆరతులు మొదలుతాయి

ఇక్కడ్నించి చుస్తుంటే సెక్యులరిజం గొంతులో అన్నీ కలిసిపోయినట్టే వుంటాయి


అందరికన్నా ముందుగా వెలిగే వీధి దిపాలు

ముగ్గెయ్యడానికి ముందు చుక్కల్లా వుంటాయి

ఆ తరవాత ఒక్కొక్కటిగా ఇంటి దిపాలు వెలుగుతుంటే

మీణుగురు పురుగులు రెక్కలిప్పి లేస్తున్నట్టుంటుంది

ఇంకొంచెం చికటి పడగానే

రోడ్డెక్కిన బండ్లన్నీ

టర్చిలైటు పట్టుకున్న చీమల్లా పరుగెడుతాయి

వ్యాపారం విధుల్లో వ్యభిచారుల్లా

రంగు రంగు దిపాలు మిణుకు మిణుకు మంటూ కన్ను కొడతాయి..

మరో వైపు ఇరుకు ఇళ్ళలో లాంతరు దిపాలు బిక్కు బిక్కు మంటూ కంటనీరెడతాయి..

సరిగ్గా చూస్తే అప్పుడు మా వురి మీద

పేదా ధనిక మధ్య వెలుగు సరిహద్దులు పుట్టుకొస్తాయి


(నిన్న, (18.08.2009) నాహర్‌గఢ్ కోటపైనుంచి జైపూర్ నగరాన్ని చూస్తుంటేకలిగిన భావాలు..)

మేరా భారత్ మహాన్ (సరదా కథ)


"భారత స్వాతంత్ర దినోత్సవం"

"అంటే?"

"అదేరా ఇండిపెండెన్స్ డే"

"అయితే?"

"అందుకని మన కంపెనీలో ప్రత్యేకంగా ఫాన్సీ డ్రస్ కాంపిటీషన్" చెప్పాడు రాజు

"ఫాషన్ షోనా?" తన అమాయకత్వం వెలిబుచ్చాడు సుందరం.

"ఫ్యాషన్ షో కాదురా... ఫాన్సీ డ్రస్.. అదీ మన స్వాతంత్ర సమర యోధుల గెటప్పుల్లో రావాలట"

"బాగానే వుంది.. అయితే నేను ఎన్టీ రామారావు గెటప్పులో వస్తా.."

"ఓరేయ్.. స్వాతంత్ర సమరయోధుడంటే ఎన్టీ రామారావు.. అక్కినేని నాగేశ్వరరావు కాదు..!"

"మరి?"

"అంటే గాంధీ నెహ్రూ... ఇలాగన్నమాట"

"అయితే నేను నెహ్రూ..."

"అలా కాదు.. మన ఆఫీసులో అన్ని రాష్ట్రాల వాళ్ళు వున్నారు కదా.. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం నాయకుడి గెటప్పులో రావాలి.."

"అంటే?"

"అంటే మన శుక్లాజీ వున్నారు కదా.. ఆయనదేమో యూపీ..! అందుకని ఆయన నెహ్రూ గెటప్పులో వస్తాడట.."

"అయితే మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎవరి గెటప్పు వేస్తే బాగుంటుంది?"

"అదే ఆలోచిస్తున్నా.. మన సరళ లేదు.. ఆవిడేమో సరోజినీ నాయుడు గెటప్పులో వస్తుందట.. నేను టంగుటూరి ప్రకాశం గెటప్పులో వద్దామని..."

"తూచ్.. నేనొప్పుకోను.. నేను ప్రకాశం గెటప్పులో వద్దామనుకుంటుంటే.."

"అహా.. కుదరదు.. నేను ముందే చెప్పేశాను.."

"పోనీ ఇంకెవరైనా వుంటే చెప్పు.."

"పింగళి వెంకయ్య?"

"ఆయనెవరు?"

"వురేయ్.. మన జాతీయ పతాకం రూపొందించిన వ్యక్తి.."

"ఆయన ఎలా వుంటాడో తెలియదే..!!"

"అవును నిజమే.. పోనీ భోగరాజు పట్టాభిసీతారామయ్య?"

"ఈయనెవర్రా బాబు? అసలు తెలియనే తెలియదే..!"

"ఏమోరా.. నాకు ఇంకెవరూ గుర్తులేరు.."

"పోనీ శ్రీశ్రీ?"

"శ్రీశ్రీ ఆత్రేయ చంద్రబోసు.. వీళ్ళు దేశనాయకులు కాదురా.."

"ఆ గుర్తొచ్చింది.. చంద్రబోస్.. సుభాష్ చంద్రబోస్"

"చంద్రబోస్ ఒరిస్సాలో పుట్టిన బెంగాలీ... తెలుగువాడు కాదుగా..?"

"మరి వెంకటేష్ సినిమాలో వేషం వేశాడుగా"

"ఆ చంద్రబోసు.. ఈ చంద్ర బోసు ఒకళ్ళు కాదురా"

"సరే నేనేదో ఆలోచిస్తాలే.."

"సరే రేపు కలుద్దాం"

"బై"

"బై"


***

"ఇడుగడుగో.. ఇడుగడుగో.. ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడిడిగో అగ్గిపిడిగు అల్లూరి.." పాడుకుంటూ వచ్చాడు సుందరం


"వురేయ్ ఏమిటిరా ఈ గెటప్పు" అడిగాడు ప్రకాశం పంతులు గెటప్పులో వున్న రాజు.

"ఏం.. ఇదికూడ తెలియదా.. సూపర్ స్టార్ కృష్ణగారు.. అన్నగారు వేసిన గెటప్పు..అల్లూరి సీతా రామరాజు"

"అది సరే.. ఈ చొక్కా లేకుండా ఈ బాణాలేమిటి? ఈ గడ్డం ఏమిటి?"

"మరి అల్లూరి అంటే క్లీన్ షేవింగ్ చేసుకోని.. జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడా? కరెక్ట్‌గానే వుందిగా"

"వుంది సరే.. ఇలా ఆఫీసుకి చొక్కా లేకుండా వస్తే ఎట్లారా?"

"మరి అల్లూరి సీతారామరాజు చొక్కా వేసుకోడు కదా?"

"కరెక్టే.. అప్పుడు వేరే ఏదైనా గెటప్పు వేసుకోవచ్చుగా?"

"నాకు ఇంకెవ్వరూ గుర్తు రావటంలేదురా... శ్రీహరి సినిమా హనుమంతు గుర్తుకొచ్చింది కాని మళ్ళీ అది నిజం కాదంటావని ఇదుగో ఇలా.."

"అదుగో బాసు వస్తున్నాడు.."

"ఏమిటి సుందరం ఈ గెటప్పు..??" ఇంగ్లీషులో అడిగాడు భగత్‌సింగ్ గెటప్పులో వున్న జస్‌ప్రీత్.

"మీకేమి సార్.. మీ భగత్‌సింగ్‌కి చొక్కా వుంది.. మా అల్లూరి గెటప్పు ఇంతే మరి"

"అయితే వేరే ఏదైనా గెటప్పులో రావాలి.. ఇలా చొక్కా లేకుండా ఆఫీసుకు వస్తారా? ఇప్పుడు మన ప్రొప్రైటర్‌గారు వచ్చారంటే ఏం సమాధానం చెప్పాలి?"

"అదుగో ప్రొప్రైటర్ కారు వచ్చింది" చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గెటప్పులో వున్న సుబేంద్రు రాయ్.

అందరూ అలెర్ట్ అయిపొయారు. మన సుందరం గుండె గడబిడ గడబిడ అని కొట్టుకుంటోంది..!!

అంతలో -

అక్కడ కారులోనించి చిన్న పంచెతో పైన మరో చిన్న గుడ్డతో, చేతిలో కర్రతో దిగాడు బట్టతల ప్రొప్రైటర్ - జిగ్నేష్ భాయ్..


పెసరట్టు చదువుతూ - పుస్తకం తింటూ...

నిన్న ఆఫీసులో పని వుండి కొంచెం ఆలస్యమైంది. ఇంటికెళ్ళినా స్వయంపాకం చేసుకునే వోపిక లేకపోయింది. దగ్గర్లోనే విజయవాడ వారి అమరావతి హోటల్ గుర్తుకొచ్చింది. రిక్షా ఎక్కి అక్కడి చేరుకోని ముందుగా అక్కడే వున్న సౌత్ ఇండియన్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన సరుకులు తీసుకుంటుంటే కొత్తగా వచ్చిన స్వాతి వారపత్రిక కనపడింది. తెలుగుపుస్తకం కనపడితే (అందునా ప్రవాసంలో వున్నప్పుడు) చేతులు ఎలా ఆగుతాయి.?? వెంటనే కొనుక్కోని హోటల్లోకి అడుగు పెట్టాను.


స్వాతి చేతిలోకి రాగానే అనివార్యంగా చూసేవి బాపు కార్టూనులు - ఆపైన కోతికొమ్మచ్చి - తరువాతే ఏదైనా. ఈ వారం కోతి కొమ్మచ్చి పుస్తకావిష్కరణ గురించి ఎంబీయస్ ప్రసాద్‌గారి వ్యాసం కూడా వుంది.


"సార్ ఆడర్ ఇవ్వండి" అన్నాడు సర్వరుడు.


"ఇడ్లీ.. ఇదుగో ప్లేట్లో ఒక మూలగా కొద్దిగా కారప్పొడి కూడా వేసుకొస్తావా?" చెప్పాను.


మళ్ళీ పుస్తకంలోకి -


భలే వుందీ కార్టున్.. బాపుగారికి టీవీ సీరియల్ అంటే మా చెడ్డ కోపం అనుకుంటా - అవి చూసే లేడీస్ మీద ఎన్ని కార్టూన్లు వేసారో.. కోతి కొమ్మచ్చిఎక్కడా కనపడదే - ఆ దొరికింది.


సాక్షి - వారెవా.. అరే ఆమ్యామ్యా అనే పదం కనిపెట్టింది అల్లురామలింగయ్యగారా.. బాగుంది..

"నా రాజ్యం పెళ్ళాం ఇప్పిస్తావా అల్లు రామం?.."ఓహో సుగ్రీవుడన్నమాట.. కార్టూను హ హహ్హదిరింది


"సార్ ఇడ్లీ"


"వీడొకడు మధ్యలో... ఏమైనా ఈడ్లీ తిని ఎన్నాళ్ళైందో.. తెలుగు వారి ఇడ్లీ..!!"


అహా ముళ్ళపూడి బొమ్మ బాపు రచన.. అదేనండి ముళ్ళపూడి మాటలతో బొమ్మలేస్తున్నారు బాపూ బొమ్మల్తో కథలు చెప్పేస్తున్నారు..


ఏమిటిది చట్నీలో నల్లగా - ఒహో పోపు మాడ్చినట్లున్నాడు. సరేలే కారప్పొడి వుందిగా.. ఏదీ?? అర్రెర్రె ఇడ్లీ కింద దాకున్నావా.. వుండు నీ పని చెప్తా..


హ్మ్మ్.. అయితే ఏమంటారు.. సాక్షి సినిమాకి పల్లెటూర్లో అన్నసంతర్పణలు చేసారా? సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల - అదేదో పాటుండాలే - "దయ లేదానీకు దయలేదా..!!" పీబీ శ్రీనివాస్ కదూ పాడింది.


"సార్.. ఇంకేమన్నా కావాలా?"


"పెసరట్టు.. కొద్దిగా వుల్లిపాయలు వేసి"


కోతికొమ్మచ్చి మొదటిభాగం పుస్తకం మాత్రం దొరకలేదు. మొన్నామధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు ప్రభవలో దొరుకుతుందేమోనని చూశాను. "రేగడివిత్తుల" చంద్రలతగారిదే కదా ప్రభవ.. అక్కడ రిజిస్టర్‌లో రాసి వచ్చాను తెప్పించమని. తెప్పిస్తే మా వాళ్ళకి చెప్పి కొనిపించి వుంచాలి..!!


పుస్తకావిష్కరణ గురించి చాలా బాగా వ్రాసారు ప్రసాద్ గారు - ఎంత అదృష్టం బాపు రమణల్ని సన్మానించడం వారి చేతులు మీదుగా సన్మానం పొందడం..! వేమూరి బలరాం గారు చాలా గొప్‌ప్‌ప్ఫ పని చేశారు. మళ్ళీ వంశీతో "మా దిగువ గోదావరి కథ"లట. మళ్ళీ బాపు కుంచె ఝుళిపిస్తారు..!!


ఏమిటిది పెసరట్టు మాడినట్లుంది - మాడినా పెసరట్టు అల్లం చెట్ని రుచే వేరు - ఒహో ఇది అల్లం చెట్నీ కాదా సాంబారు కాస్త గట్టిపడినట్లుంది -ఫర్లేదులే -


ఇంతకీ ఏమిటంటారు - రమణగారు మాట్లాడదామని మైకు ముందుకి రావటమే గొప్ప విషయం.. ఈ జనాలు సరిపోయారు ఏకబిగిన అలా చప్పట్లు కొడితే చివర్లో కొట్టే చప్పట్లు అనుకున్నారేమో ఆయన మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయారట. ఏమిటిది నా కళ్ళు చమర్చాయి - అబ్బే లేదు లేదు మిరపకాయ కొరికినట్లున్నా..!! రావికొండలరావు మాష్టరుతో ఏకిభవిస్తున్నా - ఏమిటీ.. కోతి కొమ్మచ్చి అంటూ ఈ బాపూ రమణలు అటూ ఇటూ గెంతుతూ - చక్కగా సూటిగా ఒక్క విషయం చెప్పలేరూ - సాంబారులో ఏమిటిది వుప్పు తక్కువ!!


ఎక్కడిదీ కాఫీ ఘుమ ఘుమ? - నా ముందే పెట్టాడే..! ఒహో నేనే ఆడర్ ఇచ్చానా?ఎప్పుడూ? గుర్తులేదే?

హమ్మయ్య స్వాతిలో నేను చదవాలనుకున్నవి అయిపోయాయి. ఇంక తీరిగ్గా ఇంటికివెళ్ళి మిగిలినవి చదువుకోవచ్చు.

"టిఫిన్ ఎలా వుంది సార్"


"బాగానే వుంది - సాంబారులో వుప్పు తగ్గింది, చట్నీలో పోపు మాడింది, పెసరట్టు ఎక్కువగా కాల్చారు.. ఇదుగో పెసరట్టులో వుల్లిపాయలంటే చిన్నచిన్న ముక్కలుగా తరగాలి - ఇలా పెద్ద పెద్ద ముక్కలు కాదు. కాఫీ రుచిపచి లేదు"

"అది కాఫి కాదు సార్.. టీ"


"ఏదో వొహటి.. చేతులు కడుక్కొస్తా గ్లాసులో కాసిని నీళ్ళు పొయ్యి" అంటూలేచాను. చేతులు కడుక్కోని తిరిగొచ్చేసరికి స్వాతి పుస్తకం మీద నీళ్ళుపడి "రేయ్.." వు-న్నా- "సర్వరా.." యి.


"సార్"


"నీకు కళ్ళు కనపడటంలేదా? పుస్తకం మీద నీళ్ళు పోస్తావా? అదీ బాపుకార్టూన్ తడిసేట్టు పోస్తావా.. నువ్వేం గడ్డి పెట్టినా తిన్నాను.. ఇదామర్యాదా.. ధాం ధూం.."


పెట్టిన టిఫిన్ బాలేకపోయినా ఏమి అననివాడు పుస్తకం తడిస్తే ఎందుకు అరుస్తున్నాడో సర్వరుడికి అర్థం అయినట్లు లేదు.


(బాపూ రమణలకి జయహో)

ఇత్తడిబిందె

ఏ తరానిదో తెలియదుగాని

ఈ ఇత్తడిబిందె అప్పటి నించీ మా ఇంట్లో జలసేద్యం చేసేది

ఎంతటి ఎండలైనా తడిగుడ్డ కప్పుకోని

తొణకని ప్రేమతో జలదానం చేసేది


మా ఇంటి కొత్తకోడలు చెరువుకెళ్తే

ఆమె నడుముపై సింగారంగా కూర్చోని

వీధి జనం చూపులకు దిష్టి తీసేది


గిలకబావి గట్టుపైన కుదురుగా కూర్చోని

చేదతో తోడిన నీళ్ళను, అమ్మలక్కల కబుర్లను

గుంభనంగా నింపుకోని ఒక్కసారిగా మోసుకొచ్చేది

శీతకాలపు శుభకార్యాలకు

తాను గుండమై వేడినీళ్ళను కాచి పెట్టి

వచ్చిన బంధువులందరికి మంగళస్నానాలు చేయించింది

ఎన్నిసార్లు కిందపడ్డా

ఖంగుమని సొట్టబోయి నొచ్చుకుందే కాని

నీరు నిలిపే పుణ్యకార్యం మాత్రం ఏనాడూ ఆపలేదు


పాపం

ప్లాస్టిక్ బిందెలతో పోటిపడలేని

తన వార్ధక్యపు బాధలన్నీ

అటక పైన చేరాక అందరితో చెప్పుకునేది

***

ఈ రోజు ఇంటి చిరునామా నేల కాక

గాలిలో లేచిన అపార్ట్‌మెంట్ అయినప్పుడు

బిందెకు జాగాలేక ఇరుకు మనసుతో

అమ్మేద్దామని తీసుకెళ్ళినప్పుడు-

ఇత్తడి బిందె దిగులుగా చూసింది

తన సొట్టకళ్ళలో కన్నీరు నింపుకుంది


(స్వల్ప మార్పులతో అవకాయ్.కాం లో April 16, 2009 న ప్రచురితం)

ఆత్మబధిర

ఎవరో పలకరిస్తున్నారు..

ఆ అస్పష్ట అలికిడి నా కోసమేనా?

ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు

ఆ గొంతులు పెగలడంలేదే.!!

పెదాలు మాత్రం కదులుతున్నాయి

వాక్య రూపం కలగకముందే

పదాల రెక్కలు మాయమౌతున్నాయి


దిక్కులు పగిలే అరుపులు కూడా

నిస్సత్తువగా నేల కొరుగుతున్నాయి

అది అరుపా? ఆక్రందనా? ఆదరింపా?

ఏదీ నాదాకా చేరందే?


ఏమైంది వీళ్ళకి

స్వరపేటికలు గ్రీష్మ కోయీలలయ్యాయి

సెలయేటి గలగలు

ఘనీభవించిన నిశబ్దం అయ్యాయి..


***

ఎక్కడో

మసి బారిన గుడ్డల్లో బాల్యపు పువ్వు

సీతాకోకచిలక రాగం పాడుతోంది

మరెక్కడో

వృద్ధాప్యపు దీపం

మిణుకు మిణుకు గీతం పలుకుతోంది..

నాకు మాత్రం ఏది వినపడట్లేదు

ఒకచోట

బిగించిన పిడికిలి

గొంతు డప్పు కొడుతొంది

ఇంకోచోట

పైకెత్తిన తుపాకి

శాంతిగీతం వెతుకుతోంది

నాకు మాత్రం తెలియటం లేదు..


అవునులే..!!

నా హడావిడి పరుగులలో

ఏ గుర్తు తెలియని మలుపులోనో

నా చెవి తలుపుల తాళం చెవి

జారిపోయింది కదా..!!


నా చెవులు తెరుచుకునేదెప్పుడో..!

ఆ గొంతులు వినేదెప్పుడో..!!

శ్రీరమణ మిథునం - మళయాళంలో "ఒరు చిరు పురించి"

"అప్పదాసు మామయ్య" - "కృష్ణ కురుపు" అయ్యాడు.. "బుచ్చిలక్ష్మి అత్తయ్య" - "అమ్మలుకుట్టి" అయ్యింది.. శ్రీరమణ "మిథునం" వాసుదేవన్ నాయర్ దర్శకత్వంలో "ఒరు చెరి పురించి" అయ్యింది. తెలుగు కథ - మళయాళ చిత్రమైంది. సినిమా కథంత గొప్పగా వుందా అంటే ఇదుగో నవతరంగంలో నా వ్యాసం చదవండి -


శ్రీరమణ మిథునం చూశాను

.

ఆవేదన దాటిన ఆలోచన

గడిచిపోయిన కాలం వొడిలో

శిలువైపోయిన సంతోషం

జ్ఞాపకం పేరుతో తిరిగొచ్చి

బాధల్ని రగల్చడమే కదా విచిత్రం


జ్ఞాపకం బాధగా రగులుతుంటే

ఆలోచనలు పొగగా అలుముకుంటాయి

ఆ ఆలోచనల్ని పట్టుకొని

కష్టాల వైతరణి దాటాలనుకుంటూ మొదలుపెట్టి

జీవితపు అవతలి వొడ్డు చేరటమే వైపరీత్యం


కనురెప్పలు స్రవించిన చీకటి చినుకులు

గుండెలో ఘనీభవించిన బాధలకు ద్రవరూపం ఇస్తాయి

ఆ కన్నీటితో బాధల మొక్కలు పెంచుతావో

మనసు ముత్యం కడుగుతావో

ఆ నిర్ణయం మాత్రం నీ దగ్గరే వుంది..!!

యాభైల్లో పత్రికాప్రకటనలు - 2


(గత టపా తరువాయి)

డాక్టరు కావడం ఇంతకన్న సులభం కాలేదు..!! జై "జుల్లుంధర్" సిటీ.ప్రచురణ సంస్థ పేరు చేస్తున్న సేవకు తగ్గట్టుగానే వుంది..


మొబైల్ డాక్టర్.. ఈ షాపులు ఇప్పుడున్నాయో లేదో..


ఈ రెండు ప్రకటనల్లో ఒకటి వాచి కొంటే బైనాకులర్స్ ఫ్రీ ఇంకొకటి ఏదో తైలం కొంటే వాచీ ఫ్రీ... అసలు ఈ సన్యాసి ఫార్మసివారు ఫరీదాబాద్ నుంచి, ఇండో ట్రేడింగ్ వారు బొంబాయి నుంచి ఇవన్నీ పంపిస్తారంటారా?


ఈ "జుల్లుంధర్"లో మొత్తానికేదో విషయం వుంది. మీరు పువ్వు పేరు కార్డురాస్తే మీ జాతకం చెప్పడమంటే మాటలా? అదిన్నూ రూపాయి నాలుగణాలకే..!!


ఇది నాకు బాగా నచ్చింది - ఏ హడావిడి లేకుండా చెప్పదల్చుకున్నది బొమ్మలో చెప్పేసారు..


అదండీ విషయం.


(రచన పత్రిక వెబ్సైటులో కథా ముత్యాల పేరిట పాత కథలు పెట్టారు. ఆ కథల మధ్యలో నుంచి సేకరించినవే ఈ ప్రకటనలు.)

యాభైల్లో పత్రికాప్రకటనలు - 1

1950 ప్రాంతంలో కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూడండి -

మరీ బొత్తిగా మూడు రూపాయల ఎనిమిదణాలే.. పోనీ ఒహట్రేండు తీసుకుందారేటి?


అహా చతుర్ముఖ పారాయణానికి శ్రేష్టమైనవి... ఆకర్షణీయమైన డిజైనుతో దివ్యంగా వుంటాయట..


ఈ పేస్టు ఎప్పుడైనా వాడారా? పళ్ళపొడిగా కూడా దొరుకుతుందట..!! అన్నింటికన్నా చివర వాక్యం గమనించారా - "రెమి హాస్యనాటకం - ప్రతి శుక్రవారం రేడియో సిలోను 41.72 మీటర్ల మీద సా. 6-00 నుండి 6-45 వరకు వినండి"


టీ కాఫీ పాలు గంజి పళ్ళరసం - అన్నింటికి ఒకటే ప్రత్యామ్నాయం


రామ బాణం.. హ హ హ


డాక్టరు కావడం ఇంత సులభం అని మీరెప్పుడైనా ఊహించారా?


మరికొన్ని తరువాతి టపాలో...

పాటాడుకుందాం రా..! (హాస్య కథ)

మ్యూజిక్ డైరెక్టర్ రామబాణం నిరాశగా నిట్టూర్చాడు. ఆవులించాడు.. ఆలోచించాడు.. మళ్ళీ నిట్టూర్చాడు. ఇంతలో ఫోను మోగింది..!!

"రామబాణం బావా నేను గోపాలాన్ని.. ఇప్పుడే జింగాలియా అనే దేశంలో వున్న బొర్రు తెగ పాటల ఆల్బం విన్నాను.. కొప్పరొకం అనే ఇంకో దేశం పాటలు కూడా విని తీసుకొస్తా.... నువ్వు నెక్స్ట్ ఆల్బం ప్లాన్ చేసుకో.." చెప్పాడు గోపాలం అవతలివైపు నుంచి.

"వద్దురా గోపాలం.. ఇంక అర్జెంటుగా వచ్చేసై.. ఇక్కడ చాలా కష్టంగా వుంది.." చెప్పాడు రామబాణం.

"ఏంటి బావా ఏమైంది?" అడిగాడు గోపాలం ఖంగారుగా.

"ఏముందిరా.. ఈ ముదనష్టపు ఇంటర్‌నెట్ ఒకటి వచ్చి చచ్చిందిగా.. ఈ మధ్య నేను ఏ పాట చేసిచ్చినా నిర్మాతలు - "ఇది ఫలానా అప్పడిక్కం దేశం పాట కదా" అని కనిపెట్టేస్తున్నారు." వాపోయాడు.

"అదెలా జరిగింది బావా?"

"ఏం చెప్పమంటావురా మొన్నెప్పుడో కక్కుర్తికి పోయి గొంగారియా దేశం జాతీయ గీతం ట్యూన్‌లో పాట కట్టేశా.. అది తెలిసి ఆ దేశంవాళ్ళు నిర్మాత మీద దావా వేశారు.. ఇక అప్పటి నుంచి నేను ఏ పాట చేసిచ్చినా దాని గురించి ఇంటర్నెట్‌లో వెతికి మరీ కనిపెట్టేస్తున్నార్రా..!! నువ్వు తొందరగా రారా.. ఇక్కడ పరిస్థితి దారుణంగా వుంది.. బాధతో నేను హార్మోనియం పట్టడం కూడా మానేశాను.."

"సరేలే నేను వచ్చి ఒక కొత్త ఐడియా చెప్తాను.. అయినా నీకు హార్మోనియం వాయించడం రాదు కదా బావా"

"సరేలేవోయ్.. ఇప్పుడది చెప్పకపోతే ఏంటట..??" అంటూ ఫోను పెట్టేశాడు రామబాణం.

***

ఆ తరువాత ఒక నెల రోజులకి "ఇరుగు-పొరుగు" టీవీ చానల్‌లో ప్రకటన వచ్చింది..

"త్వరలో మీ ఇరుగు-పొరుగు చానల్లో... గోపాలం ప్రొడక్షన్స్... టీవీ చరిత్రలోనే అది పెద్దదైన పాటల పోగ్రాం "పాటాడుకుందాం రా..!!"..!! ఇందులో పాల్గొనాలంటే మీ వయసు మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు వుండాలి. మీ పిల్లల పాటగాని, మాంఛి శృతిలో ఏడుపుగాని రికార్డ్ చేసి మాకు పంపించండి.."

మరో నెలకి పోగ్రాం షూటింగ్ ప్రారంభమైంది.

ఏంకరు చిట్టి అనబడే చింతపల్లి చిట్టెమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

"ఇరుగు పొరుగు ఛానల్ సమర్పిస్తున్న " పాటాడుకుందాం రా..!" కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి జెడ్జీలుగా ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ రామబాణంగారు, ప్రముఖ సినిమా కవి శ్రీ వరదరాజులుగారు, ప్రముఖ సింగర్ కోకిలా దేవిగారు వ్యవహరిస్తారు.." అంటుండగానే రామబాణం అందుకున్నాడు -

"ఈ కార్యకరమంలో పాల్గొనడం చాలా సంతోషంగా వుంది. అందుకే మీకోసం ఈ పాట -

"ఎంత మేలు చేసావయ్యా.. నన్ను ఎంత ఎత్తుకు ఎత్తావయ్యా.. ఓ ఓ నా బావమరిదయ్యా" అంటూ పాడి, గోపాలం వంక కృతజ్ఞతగా చూసి కళ్ళు తుడుచుకున్నాడు. వెంటనే వరదరాజులు అందుకోని -

"బాగా పాడారండీ కాకపోతే మీ శ్రుతి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండేది.. అలాగే లిరిక్‌లో పాట పల్లవితరువాత.. కొంచెం స్పష్టంగా పలకాలి.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. గోపాలం పరుగెత్తుకొచ్చాడు..

"సార్.. సార్.. ఇంకా పోగ్రాం మొదలవలేదు సార్.. అప్పుడే ఇలా కామెంట్స్, మార్కులు ఇచ్చేస్తే ఎట్లా? కొంచెం ఆగండి." అన్నాడు ఖంగారుగా.

"ఆల్రెడీ ఇలాంటి పోగ్రాం ఒకటి చేశాను అందుకే అలవాటులో పొరపాటు.." అంటూ నాలిక కరుచుకున్నాడు వరదరాజులు.

ఇంతలో ప్రముఖ సింగర్ కోకిలాదేవి గోపాలాన్ని పక్కకి పిలిచి - "గోపాలంగారు.. నాకు ఇలాంటి కామెంట్లు చెప్పడం రాదు.. ఇప్పుడేమిటి చెయ్యడం?" అంటూ వాపోయింది.

'ఏమి రాని నిన్ను సింగర్ ఎవరు చేశారమ్మా' అనబోయి, తన బావ రామబాణమే ఈమెకు తొలి అవకాశం ఇచ్చాడని గుర్తొచ్చి చల్లబడ్డాడు.

"మరేం ఫర్లేదు మేడం.. నేను కొన్ని కామెంట్లు వ్రాసి ఇస్తాను.. పాట అయిపోగానే అందులో వున్నవి ఏమైనా చదవండి.." అంటూ ఒక కాగితం మీద కొన్ని వ్యాఖలు వ్రాసిచ్చాడు.

మొదటి పాట మొదలైంది. విజయనగరం నుంచి వచ్చిన తార అనే రెండేళ్ళ పాప "జుంబాలో జుగుంబలాలో.." అనే కొండజాతుల పాట పాడింది. పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు. కోకిలాదేవిని తన అభిప్రాయం చెప్పమంది ఏంకరు చిట్టి.

కోకిల వుత్సాహంగా గొంతు సర్దుకోని -

"పాట బాగానేవుంది లేదా ఫర్లేదు.. కొంచెం ఫీల్ తక్కువైంది.. పాట గొంతులోనించి లేదా కడుపులోనించి లేదా మనసులోనించి రావాలి.. టెంపో కొంచెం ఎక్కువైంది లేదా తక్కువైంది.." అంటూ చెప్పసాగింది.

"కొంపలు మునిగాయి.." అంటూ గోపాలం పరుగెత్తుకోని కోకిల దగ్గరకు వచ్చాడు. "అమ్మా.. నేను వ్రాసిచ్చినవన్నీ ఒకేసారి చదవకూడదమ్మా.. ఏదైనా ఒక్కటే చదవాలి.. ఒక పని చెయ్యి.. ముందు మా బావ రామబాణం ఏం చెప్తాడో విను.. నువ్వు కూడా అదే చెప్పు.. సరేనా అమ్మా?" అడిగాడు.

"సరే.." అంది కోకిల.

"తరువాత పాట పాడేది.. కోరెట్లపాలం నుంచి సీత." చెప్పింది ఏంకరు. ఒక ఐదేళ్ళ పాప స్టేజిమీదకొచ్చి చుట్టూ బిత్తర చూపులు చూసింది. జనంలో కూర్చున్న వెంకన్నను చూడగానే "నాన్నా.." అంటూ కేక పెట్టింది.

అప్పుడు కాని వెంకన్నకి అర్థం కాలేదు, ఆ వచ్చింది తన కూతేరేనని. "ఓలయ్యో.. ఏందిది.. ఇట్లాంటి బట్టలేశారు.. నా కూతురు పేరు సీతాలైతే సీతంటారేంది.. నేనొప్పుకోను" అంటూ చిందులు వెయ్యసాగాడు. రామబాణం దిగులుగా గోపాలం వైపు చూశాడు.

గోపాలం మళ్ళీ పరుగెత్తుకుంటూ వెంకన్న దగ్గరకి వచ్చారు.

"అయ్యా.. సీతాలు పేరు మరీ పాత చింతకాయలాగా వుంది.. అందుకే సీత అని పెట్టాము."

" అయితే మాత్రం.. ఎట్టాగంటే అట్టా పేరు మార్చేస్తే వూరుకుంటానా.. రేపు మా వూళ్ళో ఈ పేరు విని ఇదెవరో వేరే పిల్ల అంటే మా గతేంకావాలి..? అయినా ఆ బట్టలేంది? మట్టసంగా మేము పట్టు లంగా వేసి పంపిస్తే అయ్యి గాదని ఇట్టా పేలికలు గట్టారు?" అడిగాడు వెంకన్న రొప్పుతూ.

"అయ్యా వెంకన్నగారు.. ఇవాళ ఎపిసోడు "అడవి జాతుల" ప్రత్యేకం అందుకే ఇలాంటి బట్టలేశాము. రేపు ఉగాది ఎపిసోడ్ వుంది అప్పుడు పట్టు లంగ వేద్దాం.. ముందు మీరు కూర్చోండి.." అన్నాడు గోపాలం.

"మరి పేరు సంగతేందని?"

"అలాగే బాబూ.." అంటూ ఏంకరు వైపు తిరిగి "ఇదుగో చిట్టీ..! సీతాలనే చెప్పు" అంటూ ఇంకా ఏదో గొణిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.

ఏంకరు వచ్చి ఇప్పుడు మన రామబాణంగారు స్వరపరిచిన "చెంచురామయ్య" చిత్రంలోని పాట.. పాడుతున్నది సీతాలు" అంటూ చెప్పింది.

రామబాణం ఆ మాట వింటూనే చెంచురామయ్య చిత్రం రికార్డింగ్ రోజు గుర్తు తెచ్చుకున్నాడు. ఎక్కడో ఒరిస్సా అడవుల్లో పాడుకునే పాటని తను ఎలా కాపీ కొట్టిందీ.. ఎలా ఆ పాటకు డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆనందపడిపోయి.. తనకి పార్టీ ఇచ్చింది.. ఆ పాట ఎంత పెద్ద హిట్టైంది.. తల్చుకుంటూ చిన్న కునుకు తీసాడు. నిద్ర లేచేసరికి సీతాలు స్టేజిమీద లేదు. వెంటనే మైకు ముందుకు వంచుకోని -

"చాలా బాగా పాడింది. ఈ అమ్మాయి గొంతులో ఒక ప్రత్యేకత వుంది. కొంచెం టెంపో పెంచితే ఇంకా బాగుండేది.. నేనిచ్చే మార్కులు తొమ్మిది" అన్నాడు, తను నిద్రపోయిన విషయం తెలియకూడదని.

వెంకన్నకి ఏమి అర్థంకాలేదు -
"ఏందిది.. మా అమ్మాయి పాడకుండానే మార్కులిస్తాడేంది ఈయన" అన్నాడు గట్టిగా.

ఇంతలోనే కోకిలాదేవి తొమ్మిదిమార్కుల బోర్డు పైకెత్తి - "అవును. సార్ చెప్పిన మాటే నా మాట కొంచెం టెంపో పెంచుకుంటే.." అంటూ చెప్పబోయింది.

గోపాలం జుట్టు పీకున్నాడు - "ఆపమ్మా.." అరిచాడు "ఇంకా పాడిందే లేదుగాని టెంపో కావాలంట టెంపో" అన్నాడు అరుస్తూ.

"నాకేం తెలుసు. మీరేగా చెప్పారు సార్ ఏం చెప్తే అదే చెప్పమని" కోకిల పలికింది.

"ఏంటి బావా ఇది" దీనంగా అడిగాడు గోపాలం. అప్పటికి తన తప్పు అర్థమైంది రామబాణానికి.

"సారీ గోపాలం. చిన్న కునేకేసి లేచాను. ఈ లోపల పాట అయిపోయిందేమో అని.." సణిగాడు రామబాణం. అప్పటిదాకా మాట్లాడకుండా వున్న వరదరాజులు లేచాడు -

"ఇది సంగీతానికి జరిగిన అవమానం. సరస్వతీదేవికి జరిగిన అవమానం. రామబాణంగారు క్షమాపణ చెప్పేదాకా నేను ఈ పోగ్రాంలో జడ్జీగా కూర్చోను.." అంటూ చెర చెరా వెళ్ళిపోయాడు. గోపాలం వెనక పరుగెత్తాడు.

"సార్.. సార్.. వరదగారు"


"నో.. రాజులు.. వరదరాజులు.."

"అదే సార్ వరదరాజులుగారు.. ఇలా మీరు అర్థాంతరంగా వెళ్ళిపోతే ఎలా సార్.. పోగ్రాం ఆగిపోతుంది సార్.." ఏడ్చినంత పనిచేశాడు గోపాలం.

"ఎందుకయ్యా అంత ఫీల్ అవుతావు.. ఇదంతా ఏక్షనే కదా.. ఇంతకు ముందు నేను చేసిన రియాలిటీ షోలో.. ఇలా చేస్తే ఎంత పాపులారిటీ వచ్చిందో తెలుసా. అదే అనుభవంతో.."

"సార్.. మీ అనుభవం మా చావుకొచ్చింది సార్. ముందు కూర్చోండిసార్..!!" అంటూ ఆయన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టాడు గోపాలం.

సీతాలు పాట మొదలైంది.

"ఓలమ్మో చెంచోడు.. నా సంచీ చించాడు.." అంటూ డబల్ మీనింగ్ పాట పాడింది. అందరూ చప్పట్లు కొట్టారు.

"బాగుంది.. చాలా బాగుంది అసలు నీ వాయిస్ భలే కొత్తగా వుంది" అన్నడు రామబాణం

"అవును భలే కొత్తగా వుంది" అంది కోకిలమ్మ.

"సార్ ఎవరిదో చెంచు డ్రస్సు నాకు వేశారు.. అది గొంతు దగ్గర టైట్‌గా వుంది అందుకే నా గొంతు అలా వుంది" అసలు విషయం చెప్పింది సీతాలు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టడంతో ఆ మాటలు వినపడలేదు.

***

“పాటాడుకుందాం రా” పెద్ద హిట్టైంది. చెంచు పాటలకి, గొబ్బెమ్మపాటలకి, బూతుపాటలకి ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేక ఎపిసోడ్లు పెట్టారు. ఆ వారంలో ఎవరి సినిమా ఫ్లాపైతే ఆ సినిమా హీరోనో, డైరెక్టర్‌నో ప్రత్యేక గెస్టుగా పిలిపించాడు గోపాలం. వాళ్ళందరికీ డైలాగులు ముందే రాసిచ్చాడు.

"ఇంత గొప్ప సినిమా తీసిన డైరెక్టరుకు జై" అని రామబాణం అంటే కోకిలమ్మ కూడా "అవును సార్ చెప్పినట్లే జై" అనేది. మధ్య మధ్యలో వరదరాజులు లేచి వెళ్ళిపోయేవాడు. ఆయన్ని బ్రతిమిలాడే సీన్లు పెద్ద హిట్టైపోయాయి. ఇలాంటి సన్నివేశాలు, డైలాగులు వ్రాయడంకోసం డైలీ సీరియల్ రచయితలను పెట్టుకున్నాడు గోపాలం.

అలాంటి ఎపిసోడ్‌కి - "మళ్ళీ లేచెళ్ళిపోయిన వరదరాజులు.. తప్పక చూడండి ఈ వారం పాటాడుకుందాం రా..!!" అంటూ వారం రోజులముందునుంచే తెగ పబ్లిసిటీ ఇచ్చేవారు. తీరా ఆ వారం అందరూ కళ్ళు అప్పగించుకోని ఎపిసోడ్ అంతా చూస్తే ఎప్పుడో చివర్లో మార్కులు చెప్పేముందు ఆయన లేచి వెళ్ళిపోయేవాడు.

"వరదరాజులుగారు ఎందుకు లేచెళ్ళిపోయాడు.. చూడండి రేపటి ఎపిసోడ్‌లో.." అంటూ బీపీ పెంచేసేవాళ్ళు. మర్నాడు ఆడవాళ్ళు అన్నం వండటం మానేసి, మొగుళ్ళతో పోరాడి ఆ ఎపిసోడు చూస్తే వరదరాజులు తిరిగి వచ్చేవాడు.

"ఎందుకు సార్ లేచి వెళ్ళిపోయారు?" అంటే
"పొద్దున్న సమోసాలు తిన్నాను.. కడుపులో గడబిడ" అంటూ చల్లగా చెప్పేవాడు వరదరాజులు.

ఇలా సాగుతుండగా వెంకన్నకు నెమ్మదిగా రియాలిటీ షోలలో రియాలిటి ఏమిటో తెలిసొచ్చింది. అసలు పాటని వదిలేసి ధ్యాసంతా వేషాల పైనా, నాటకాలపైనా వుండటం అతనికి నచ్చలేదు. అవకాశం కోసం చూస్తున్నాడు.

ఆ అవకాశం అతనికి ఫైనల్ ఎపిసోడు ముందే వచ్చింది.

విజయనగరం తార, కోరెట్లపాలం సీతాలు, మరో ఇద్దరు ఫైనల్స్ దాకా చేరుకున్నారు. జనాలంతా సీతాలు గెలుస్తుందా, తార గెలుస్తుందా అంటూ పందాలు వేసుకుంటున్నారు. ఆ రోజు గోపాలం జడ్జీలని కూర్చోబెట్టి విషయం చెప్పాడు -

"అయ్యా.. ఈ షోకి డబ్బులు పెట్టిన రాజుగారు తరువాత "పాటాడుకుందాం రా - 2" కి డబ్బులు పెడతామంటున్నారు. అందులో మూడు నెలల నించి రెండు సంవత్సారాల లోపు పిల్లలుంటారు.. కాకపోతే వాళ్ళది ఒక కండీషన్"

"ఏమిటది?" అడిగారు జడ్జీలు ఆసక్తిగా.

"ఈ ఫైనల్స్‌లో తార అనే అమ్మాయే గెలవాలి. ఏదో వొకటి చేసి ఆ అమ్మాయినే గెలిపించాలి" అన్నాడు.

ఈ మాటలు వెంకన్న చెవినబడ్డాయి. అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అప్పటికి సమయం కాదని వూరుకోని, గోపాలం ఒక్కడే వున్నప్పుడు అతని గదిలోకి వెళ్ళి చొక్కా పట్టుకున్నాడు..

"ఎంటయ్యా ఇది? నా కూతుర్ని కాదని ఇంకెవరినో గెలిపించమని సిఫార్సులు చేస్తున్నావు?” అడిగాడు కోపంగా.

"అబ్బా అదికాదయ్యా.. ఇప్పుడు తారకి నీ కూతురికి మధ్యే కదా కాంపిటీషను.. మీ అమ్మాయి బాగానే పాడుతుందికాని ఆ అమ్మాయికి క్రేజ్ ఎక్కువ, పైగా పెద్ద పెద్ద వాళ్ళ రికమండేషను.. అందుకని.." ఏదో చెప్పబోయడు గోపాలం. వెంకన్న ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాడు. వెంటనే అందుకున్నాడు -

"చిన్నపిల్లలతో రాజకీయం చేస్తానంటావు.. మీకసలు మనస్సనేది వుందా? పాటలు పాడదామని వస్తే నానా రకాల వేషాలు వేయించారు.. ఒకసారి ముసలమ్మ పాటల్ని ముసలి వేషం, భయంకరమైన పాటలని భేతాళ వేషం వేయించారు.. దీనికన్నా మా వూర్లో వీధి నాటకం వేసుకోవచ్చు.." అన్నడు కోపంగా.

గోపాలం సర్ది చెప్పబోయేంతలో మళ్ళీ అందుకున్నాడు.

“పాటలపోటీ అని చెప్పి రికమండేషను పిల్లకి ప్రైజ్ ఇస్తారా? మీ సంగతి తేలుస్తా.. అట్టాగాని జరిగిందో మా పిల్ల చేత ఆత్మహత్య నాటకం ఆడిస్తా.. జడ్జీలు చేసిన మోసం వల్లే ఇలా జరిగిందని నేను నాలుగు న్యూస్ ఛానళ్ళలో గగ్గోలు పెడతా.. గోపాలంగాడే ఇదంతా చేయించాడని చెప్తా.. పేపర్లలో మీ పోగ్రం గురించి నానా తప్పుడు కూతలు వ్రాయిస్తా.." అంటూ శివతాండవం చేసేశాడు.

దాంతో బిక్క చచ్చి గోపలం మళ్ళీ జడ్జీల దగ్గరకి పరుగెత్తాడు. "అయ్యా.. ఎలాగైనా ఆ సీతాలునే గెలిపించండి" అంటూ బ్రతిమిలాడాడు.


"అదేంట్రా.. ఇందాక తారని గెలిపించాలన్నావు.." అడిగాడు రామబాణం.

"అవును అన్నావు" అంది తందాన కోకిల.

"అన్నాను బావా.. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. తార గెలవకపోతే నెక్స్ట్ పోగ్రాంకి డబ్బులు రావు.. సీతాలు గెలవకపోతే మనకి ఇంక బతుకే వుండదు" అంటూ జరిగింది చెప్పాడు.

"అవునవును.. అలా చేసినా చేస్తారు.. మునుపు నేను చేసిన పోటీలో ఇలాంటిదే నాకు అనుభవమైంది.." చెప్పాడు వరదరాజు. గోపాలం కన్నీళ్ళ పర్యంతమై -

"మీకు దణ్ణం పెడతాను.. మీ అనుభవాలు పక్కన పెట్టి ఆ అమ్మాయినే గెలిపించండి" అన్నాడు.

"ఈ గోలంతా దేనికి.. ఎవరు బాగా పాడితే వారినే గెలిపిద్దాం" అన్నాడు రామబాణం.

"అవును సార్ చెప్పినట్లే చేద్దాం" అంది తందాన కోకిల.

గోపాలం బాధగా "సరే కానివ్వండి" అన్నాడు.

అక్కడ పోటి చివరికి వచ్చింది. ఏంకరు విజేత ఎవరో ప్రకటించబోతోంది.

"ఇంతకాలం మీరెంతగానో ఆదరించిన పాటాడుకుందాంరా.. పోటిలో చివరికి నలుగురే మిగిలారు.. అందులో చివరి రౌండు వచ్చేసరికి ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.. విజయనగరం నుంచి వచ్చిన తారంగం తార.. కోరెట్లపాలం సీతాలు.. ఈ ఇద్దరిలో విజయం ఎవరిది? ఎవరు ఇంటిదారి పడతారు..??"

"లబ్.. డబ్.. లబ్.. డబ్.." గుండె చప్పుడు మ్యూజిక్‌గా పెట్టారు.

"తొందరగా చెప్పవమ్మా.. ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతోంది" ఎవరో అరిచారు.

"ఆ విజేత ఎవరో" కొంచెం ఆపింది ఏంకరు. మళ్ళీ "లబ్.. డబ్.. లబ్.. డబ్.." సౌండు తరువాత కొనసాగించింది ఏంకరు - "వచ్చే వారం తెలుసుకుందాం.."

టెన్షన్ తట్టుకోలేక గొపాలం గుండె పట్టుకోని కింద పడిపోయాడు.


- ( 0 ) -

అదీ సంగతి (కథ)

"రశీదు కావాలి" అన్నాడతను. నేను చప్పున అతని వైపు తిరిగాను. సరుకులు కొనడమన్నమాటే కాని ఏనాడూ రశీదు తీసుకున్న పాపాన పోలేదు నేను. నేనే కాదు ఎవరూ రశీదు విషయంలో జాగర్త తీసుకోరనేది సర్వవిదితమే.


"రశీదా? రశీదు మేము ఇవ్వం సార్.." చెప్పాడు కొట్టువాడు.


"రశీదు లేకపోతే నాకీ వస్తువులు వద్దు.." అన్నాడతను. నిజంగా మనం కూడా అంత ఖచ్చింతంగా వుంటే అసలు వినియోగదారులకు సమస్యలే వుండవనిపించింది నాకు. ఆ క్షణమే అతను నాకు ఆదర్శమైపోయాడు.


"ఫర్లేదు సార్.. తీసుకెళ్ళండీ... గ్యారంటీ సరుకు" సముదాయించబోయాడు వాడు.

"సరుకు ఏమైన కాని.. నాకు మాత్రం రశీదు కావాలి.. అంతే.. రేప్పొద్దున ఈ సరుకుల్లో ఏమైనా తేడాలొస్తే మీ దగ్గర కొనలేదని బుకాయిస్తారు.."

"అబ్బె మేమలాంటి వాళ్ళాం కాదు సార్.. మా మాట నమ్మండి.."

"నమ్మకమా? అడగగానే రశీదు ఇచ్చి వుంటే కలిగి వుండేది.." అంటూనే సంచీలో సరుకులు తీయబోయాడు.

"సార్.. రసీదు కావాలంటే అయ్యగారు రావాలి.. లేటౌతుంది..." అన్నాడు.

"ఫర్వాలేదు.. నేను వైట్ చేస్తాను" అన్నాడు అతను అక్కడే వున్న బల్ల మీద కూర్చుంటూ. నేను నెమ్మదిగా అతను పక్కన చేరాను.

"వీళ్ళేప్పుడూ ఇంతే సార్.. రసీదులు ఇవ్వరు..." అన్నాను అతనితో మాట కలిపే ఉద్దేశ్యంతో.

"మీలాంటి వాళ్ళంతా ఇలా చూస్తూ వూర్కోబట్టే ఇలా తయారౌతున్నారు... ఏమైన నేను రసీదు తీసుకోందే ఇక్కడ్నుంచి కదలను.." అన్నడతను దృఢంగా.


"అవునులెండి.. మనమిలాగే గట్టిగా ఉంటే అతను మాత్రం ఏం చేస్తాడు.. అసలు ఈ సరుకు చూడండి..! నిండా రాళ్ళు.. కల్తీ.. ఇది చూడండి నిర్మా సోప్ అడిగితే సరిగ్గా అలాగే వున్న బర్మా సోపు అంటగట్టాడు.." అన్నాను.

"మరి ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకున్నారండీ వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టక..!!" అన్నాడతను. పక్కన కొట్టువాడు అదిరిపడ్డాడు.

"అబ్బే అంత దూరం ఎందుకులెండి.. ఇదుగో అయ్యగారు వచ్చేశారు.. అయ్యా రసీదు అడుగుతున్నారు.." అన్నాడతను.

"రసీదా" అంటూ చిత్రంగా చూశాడు ఓనర్.

"అవును రసీదే ఇస్తారా లేక.." నా పక్కనున్నతను అన్నడు.

"అబ్బె అవన్నీ ఎందుకు లెండి.. అయ్యా మీరు ముందు రసీదివ్వండి.." అన్నాడు కొట్టువాడు. రసీదు తీసుకోని ఇద్దరం బయటపడ్డాం.

"ఏ మాత్రం అవకాశమిచ్చినా వీళ్ళు మన మెడకు బిగిస్తారు.. అందుకే నేను ప్రతిచోట ఇలాగే గట్టిగా వుంటాను.." అన్నాడతను.

"అవునవును.. ఇలానే వుండాలి.. అన్నట్టు మీ పేరు?" అడిగాను నేను.

"నా పేరు రామకృష్ణ.. నిజాయితీగా వ్యాపారం చేసి నష్టపోయాను.. ప్రస్తుతానికి చిన్న చిట్‌ఫండ్ కంపెనీతో కాలం గడుపుతున్నాను.." అంటూ తన వివరాలు చెప్పాడు. ఆ రోజు నుంచి నాకు మంచి స్నేహితుడయ్యాడతను. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాడిలాగా మాట్లాడేవాడు. అతని మాటలేకాదు చేతలు కూడా నన్ను ఆకర్షించేవి. చిన్న బండివాడి దగ్గర్నుంచి.. సినిమాహాలు ఓనరుదాకా అంత అతడు అనే "ఫోరం" అనే మాటతో బెదిరిపోయేవారు. తద్వారా తను పొందవలసిన హక్కులన్నీ పొందేవాడు.

"మనం అవకాశమిచ్చిన కొద్దీ వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు.. అసలు మోసగాళ్ళను కనిపెట్టి వాళ్ళకి దూరంగా ఉండటం ఎంతో అవసరం..! అది కూడా ఒక కళేననుకోండి..." అంటూ అతను చెప్పే విషయాలు నాకెంతో ఆసక్తిని కలిగించేవి.

అతనిలో ఉన్న ఒకానొక మంచి గుణం కనపడ్డ వారినందరినీ పరిచయం చేసుకోని కలుపుగోలుగా మాట్లాడటం. ఆ కళ అతనికి, అతని చిట్‌ఫండ్ కంపెనీకి ఎంతో సహాయపడింది. అతని చిట్‌ఫండ్ స్కీములు చాలా బాగున్నాయి. ప్రతినెలా లక్కీడిప్‌లు, ప్రతివారికి ఏదోక ప్రైజు.. ఇంకా ఇలాంటి 'ఎట్రాక్షన్స్'తో ఎంతో ఆర్జించటం మొదలుపెట్టాడు. నేను కూడా చాలా స్కీముల్లో దాదాపు ఐదారు వేలు పెట్టాను.

ఒకరోజు నాకొక వాల్‌క్లాక్ ప్రైజ్ తగిలిందన్నాడు.. అన్నటుగానే ఒక వాల్‌క్లాక్ తెచ్చిపెట్టాడు. ఎంతో అందంగా ఉందా క్లాక్. గోడకు తగిన మాచింగ్ కలర్‌లో ప్రతి ఒకళ్ళని ఆకర్షించింది. దాదాపు వారం రోజుల తర్వాత ఉదయన్నే చూసేసరికి ఆ వాచి ఆగిపోయింది. ఏ వస్తువు కొన్నా ఆచితూచి కొనే రామకృష్ణ ఇచ్చిన వాచి ఇలా ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఆ రోజు టిఫిన్ చేసి ఆ వాచీతో అతనింటికి బయలుదేరాను. ఇంటిముందు బాగా జనం పోగై ఉన్నారు. వాళ్ళలో తెలిసినతన్ని పట్టుకొని విషయం అడిగాను.

"మీకింకా తెలియదా.. అయ్యో! ఆ రామకృష్ణ మనల్నదరినీ మోసం చేసి డబ్బుతో సహా పరారైపోయాడు.. రాత్రికి రాత్రే ఉడాయించాడు.." అన్నాడు. ఒక్కసారిగా గుండాగినంత పనైంది.

నాకు నమ్మకం కుదరలేదు. గుంపులోకి వెళ్ళేసరికి మధ్యలో పోలీసులు, పేపరువాళ్ళు హడావిడి చేస్తూ కనపడ్డారు. వాళ్ళు కూడా ముందు విన్న మాటల్ని ధృవపరిచారు. కడుపులో బాధను దిగమింగుకొని వాచ్‌షాపుకు వెళ్ళాను. షాపువాడు అంతా ఇప్పదీసి -

"ఇదెక్కడ పట్టుకొచ్చారు సార్.. ఒకా పార్టు సవ్యంగా లేదు.. ఏభైరూపాయలు కూడా చెయ్యదు.." అన్నాడు వెటకారంగా

తల దిమ్మెక్కుతుంటే రామకృష్ణ మాటలు గుర్తొచ్చాయి -

"మోసగాళ్ళను కనిపెట్టి దూరంగా ఉండటం ఎంతో అవసరం.. అది కూడా ఒక కళేననుకోండి.."

(వనిత - ప్రగతి నియోగదారుల కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ - వనిత ఆగస్టు 1995)

విమానయానంలో పదనిసలు

విమానయానం ఒకప్పుడు కొందరి కల. ఇప్పుడు చాలామందికి అది చాలా సాధారణ వీషయం అయిపోయిందనుకోండి. దాదాపు అయిదేళ్ళ క్రితం నా మొదటి విమాన ప్రయాణం మొదలుకోని ఇప్పటిదాకా కొన్ని తమాషా అనుభవాలు ఎదురయ్యాయి నాకు. మచ్చుకి రెండు -

1
ఒకానొక సందర్భంలో విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. నిజానికి బాపట్లలో ఒక పని ముగించుకోని వెంటనే హైదరాబాదులో ఒక మీటింగ్ అటెండ్ కావాల్సి వుండటంతో ఈ సాహసం చెయ్యాల్సి వచ్చింది. బాపట్ల నుంచి రెండున్నర గంటలు విజయవాడ ప్రయాణం, అక్కడినుంచి గన్నవరం, ఒక గంట ముందు చేరి, విమానం ఒక గంట లేటు అంతా కలుపుకుంటే ఏ కారులోనే హైదరాబాద్ చేరుకునేవాణ్ణి. అదే ఇప్పటి శంషాబాదు ఏయిర్‌పోర్ట్ అయితే మరో రెండు గంటలు కలుపుకోవచ్చు. సరే ఒకసారి కమిటయ్యాను కదా అని అలా కానిచ్చాను.


గన్నవరం విమానశ్రయం చూశాక అదొక షాక్. కొంచెం కొత్తగా కట్టిన బస్టాండ్ మాదిరిగా వుంది. ఆటో వాళ్ళు లోపల తిరుగుతున్నాను. సమోసా టీ లోపల అమ్ముతున్నారు. (ఇప్పుడు కొంత బాగుపడింది లెండి). నేను వెళ్ళిన రోజు ఎనౌన్స్‌మెంట్ పని చెయ్యటంలేదని ఒక అమ్మాయి వచ్చి - "హైదరాబాద్.. హైదరాబాద్ ఎవరండీ" అంటూ అరిచింది.

నవ్వుకుంటూ వెళ్ళి విమానం ఎక్కాను. అప్పుడు ఏయిర్ డెక్కన్‌గా పిలువబడే విమానమది (కింగ్‌ఫిషర్ రెడ్ అయ్యింది). లోపల నేను కూర్చున్న తరువాత ఒక్కసారిగా అత్తరు వాసన గుప్పుమంది. చూస్తే ఒక ముస్లిం కుటుంబం. సకుటుంబ సపరివార సమేతంగా ఒక పదిహేనుమంది ఎక్కారు. వాళ్ళలో కాస్త చదువుకున్నాయన ఎర్‌హోస్టెస్ దగ్గరకు వెళ్ళి "ఏ సీట్‌లో కూర్చోవాలే?" అడిగాడు బోర్డింగ్ పాస్ చూపిస్తూ.

"ఫ్రీ సీటింగ్ సార్" చెప్పిందామె.

"అంటే"

"ఎక్కడైనా కూర్చోవచ్చు.."

"ఏంటీ?"

"ఎక్కడైనా కూర్చోవచ్చండి.."

వింటూనే ఆయన వెనక్కితిరిగి "సునే.. ఇది భీ మన ఎర్ర బస్సు లెక్కనే ఎక్కడైనా కూర్చోవచ్చు.." అన్నాడు.

ఏయిర్హోస్టెస్ ఎర్ర మేకప్పు బుగ్గలు మరింత ఎర్రగా అయ్యాయి.

2

2008 డిసెంబరు రెండొవ వారంలో ఒక రోజు. నేను డిల్లీ నుంచి ఇండోరుకి ప్రయాణం చేస్తూ ఇండియన్ విమానంలో అడుగుపెట్టాను. నా సీటు అత్యవసర (ఎమర్జెన్సీ) ద్వారం వెనకగా వున్న వరసలో కిటికీ సీటు. అత్యవసర ద్వారం దగ్గర వున్న మూడు సీట్లలో ఒక చిన్న పాప ఆ అమ్మాయి తల్లిదండ్రులు (పంజాబీ జంట) వున్నారు. విమానమెక్కడం మొదటిసారనుకుంటా ఆ చిన్న పిల్ల చాలా సంబరంగా కిటికీ పక్కన కూర్చొని సంతోషపడుతోంది. ఇంతలో ఏర్‌హోస్టెస్ వచ్చి చిన్న పిల్లలు అత్యవసర ద్వారం దగ్గర కూర్చోను వీల్లేదంటూ అభ్యంతరపెట్టింది.

ఆ పిల్లకేమో కిటికీ దగ్గర కూర్చోవాలని.. చివరికి నేను కూర్చున్న వరస లోకి వారిని మార్చి మమ్మల్ని ముందుకు పంపారు. నేను కూర్చున్న వరసలో వున్న ఒకతను సీటు మారనని మొరాయించడంతో నాలుగైదు మార్పులు చేసేసరికి చివరికి నేను కిటికీ సీటు వదిలిపెట్టి ఐల్ సీటుకు చేరుకున్నాను. విమానం బయలుదేరింది.

నా పక్కన కూర్చున్న ఇద్దరికి ముందే పరిచయం వున్నట్లుంది.. అదే పనిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యసీటులో వ్యక్తి ఏర్‌హోస్టెస్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు స్వల్పాహారం ఇస్తుందా అని పదే పదే తొంగి చూస్తున్నాడు. అప్పటికే గంటన్నర ఆలస్యమైందని అందుకే భోపాల్ వెళ్ళి ఇండోరు వెళ్ళాల్సిన ఫ్లైటు ముందు ఇండోరు వెళ్ళి ఆ తరువాత భోపాల్ వెళ్తుందని చెప్పారు.

నేను సంతోషపడ్డాను. విమానం ఆలస్యమైనా నేను సమయానికే ఇల్లు చేరుకుంటానని.

"ఛ.. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నా" అన్నాడు నా పక్కన కూర్చున్నతను.

"ఓ.. చేసుకున్నారా?" అంటూ ఆశ్చర్యపోయాడు కిటికీ సీటు.

కొంతసేపటికి ఏర్‌హోస్టెస్ వచ్చి స్వల్పాహారం వడ్డించింది. నా పక్కన కూర్చున్నతను తన జేబులోనించి ఒక మంచినీళ్ళ బాటిల్ తీసాడు. ఇండియన్ ఫ్లైట్లలో సర్వ్ చేసే ఇండియన్ స్ప్రింగ్ 200ఎంఎల్ బాటిలే అది. మూత తీయగానే విషయం గుప్పుమంది - అందులో వుంది నీళ్ళు కాదు.. వోడ్కా.

నేను ఖంగారుగా "ఏమిటిది" అన్నాను.

"సారీ నేను మిలటరీలో పనిచేస్తున్నాను. టైముకు పడకపోతే ఇబ్బంది అందుకే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. భయపడకండి.. మీకెలాంటి ఇబ్బంది వుండదు. కావాలంటే నా ఐడీ కార్డ్ చూపిస్తాను" అన్నాడు.

నేను "ఫర్లేదు" అన్నాను. అంతలో నాకు మరో షాక్ - అతను మరో జేబులోనించి ఒక నిమ్మకాయ, చిన్న బటన్ నైఫ్ తీసాడు. పద్ధతిగా నిమ్మకాయ కోసి, విమానంలో ఇచ్చిన టీ కప్పులో పిండాడు. వోడ్కా, మంచినీళ్ళు కలిపాడు. తనతో తెచ్చుకున్న బాటిల్, ఎయిర్లైన్స్ వారు ఇచ్చిన బాటిల్, రెండింటిలో ద్రావకాన్ని నింపుకోని మూతలు బిగించాడు. ఇంక చెప్పేది ఏముంది? దర్జాగా ఏ బారులోనో కూర్చున్నట్టు కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటూ, మధ్య మధ్యలో ఎయిర్లైన్స్ ఇచ్చిన కట్‌లెట్ తింటూ..!!

"అసలు కత్తి జేబులో పెట్టుకోని సెక్యూరిటీ ఎలా దాటి వచ్చారు సార్?" షాక్ నించి తేరుకోని అడిగాను.

"ఇంకొక విషయం చెప్పనా? సీటు కింద బ్యాగులో సిగెరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె కూడా వున్నాయి.. ఇంతకు ముందు విమానంలో బాత్రూంలోకి వెళ్ళి సిగిరెట్ కూడా తాగేవాణ్ణి. ఈ మధ్య చెయ్యట్లేదు" అన్నాడు. కిటికీ సీటులో వున్న అతని మిత్రుడు నవ్వి అవునన్నట్లు తలవూపాడు.

"అసలెలా సాధ్యం? సెక్యూరిటీ వాళ్ళు పై నించి కిందదాకా తడిమి తడిమి చూస్తారు కదా?" అడిగాను నేను.

"వాళ్ళ ముఖం.. ఈ సెక్యూరిటీగాళ్ళ పైన నన్ను ఇన్‌చార్జిగా వెయ్యమను వారం రోజుల్లో అందరినీ సస్పెండ్ చేయిస్తాను.." అన్నాడు.

"ఎలా తెచ్చారు అని అడుగుతున్నాడు" గుర్తు చేశాడు కిటికీ సీటు.

"అలాంటివి చెప్పకపోవడమే మంచిది.. కేమోఫ్లాజ్ అని ఒకటుందిలే.. మిలటరీ ట్రైనింగ్‌లో నేర్పించారు.." అన్నాడు నవ్వుతూ.

నేను ఇంకేమీ మాట్లాడలేదు.

ఒక మందు బాటిల్, ఒక కత్తి, ఒక అగ్గిపెట్టె విమానంలోకి తేవడం ఎలాగో తెలిస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయో అని ఆలోచిస్తే ఇప్పటికీ వళ్ళు జలదరిస్తుంది.

కార్పొరేట్ గీత

పార్థా!

ఈ సంవత్సరం బోనస్సు రాలేదని పశ్చాత్తాప పడవద్దు..

ఇంక్రిమెంటు వస్తుందో రాదో అని విచారించవద్దు..

జీతం తరగకుండా వచ్చిందని సంతుష్ఠుడివై వుండు..

నీ జేబులోంచి ఏం పుట్టిందని, ఇప్పుడు పోయిందని బాధపడుతున్నావు

వచ్చినదంతా మీ కంపెనీ నించే వచ్చింది

నిన్న నువ్వు లేనప్పుడు కంపెనీ వుండేది

రేపు నువ్వు లేనప్పుడు కంపెనీ అలాగే వుంటుంది

కంపెనీ శాశ్వతం కాని నువ్వు కాదు

నువ్వు ఏమి చేసినా కంపెనీ కోసమే చేశావు

డిగ్రీ తీసుకొని వచ్చావు

పొయ్యేటప్పుడు ఎక్స్పీరియన్సు తీసుకొని పోతావు

ఈ రోజు నీదనుకుంటున్న కంప్యూటర్

నిన్న మరెవరిదో

రేపు ఇంకెవరిదో అవుతుంది

ఇది నీదేనన్న మాయలో నువ్వు సంతోషపడుతున్నావు

ఆ సంతోషమే అన్ని కష్టాలకు మూలం

మార్పు అనేది కంపెనీలలో శాశ్వతమైన నియమము

బెస్ట్ పెర్ఫార్మర్ అయిన నువ్వు మరో గంటలో వర్స్ట్ పర్ఫార్మర్ కాగలవు

నెంబర్ వన్ అనిపించుకున్న నువ్వే రేపు టార్గెట్ సాధించలేక పోవచ్చు

అందుకే

ఇంక్రిమెంటు లేదని బాధ పడకు

జీతమొచ్చినందుకు సంతోషించు

అప్రైజల్, ఇన్సెంటివ్ వంటివి నీ మనసులోనుంచి తొలగించు

నీ ఆలోచనలనుంచి తొలగించు

నిన్ను నీవు కంపెనీకి అర్పించుకో

అప్పుడు కంపెనీ నీకు గాని, నీవల్ల కంపెనీకి గాని

ఎలాంటి ఆశలు వుండవు


(ఇదం కార్పొరేట్ గీత, చివరి అధ్యాయం, ఇంక్రిమెంట్ల పర్వం సమాప్తం)

(ఒక ఈమైల్ ఆధారంగా కార్పొరేట్ కాశీ మజిలీ కథలకోసం తయారు చేసినదిది..)

గాంధీగిరి - గాంధీ సిద్ధాంతాలు

ఆఫీసులో నా క్యూబికల్ సాఫ్ట్‌బోర్డ్ పైన ధ్యాన ముద్రలో వున్న గాంధీ బొమ్మ ఒకటి వుంది.

నిన్న ఒక అమ్మాయి ఏదో పని గురించి నా దగ్గరకు వచ్చి ఆ బొమ్మ చూసి "మీకు గాంధి అంటే ఇష్టమా?" అని అడిగింది.

"గాంధీ మొత్తం కాదు.. గాంధీలో కొన్ని విషయాలు మాత్రమే ఇష్టం" అన్నాను.

ఆ అమ్మాయి చిత్రంగా చూసి "ఏమిటవి" అంది.

"చాలా వున్నాయి ముఖ్యంగా మొండితనం" అన్నాను. ఏమనుకుందో ఇంకా ఆ విషయం పై చర్చ కొనసాగించలేదు.

***

లగే రహో మున్నా భాయి (తెలుగులో శంకర్ దాదా జిందాబాద్) చూశారుగా. అందులో గాంధీగిరి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం ఎదుటివాడు ఒక చెంపమీద కొడితే మరొ చెంప చూపించాలి, ఎదుటివాడు ఉమ్మేస్తే అతని ఎదురుగానే అది తుడవాలి, లంచం కోసం వేధించే వుద్యోగి ముందు నిలబడి నిలువు దొపిడీ ఇవ్వాలి..!! ఇలాగే ఇంకా ఎన్నో. చిత్రం గమనించారో లేదో ఇక్కడ గాంధిగిరి పాటించేవాడు నిస్సహాయుడు. ఎదుటివాడి కన్నా మనం బలవంతులమైతే (లేదా బలవంతులం అని అనుకున్నా సరే) వెంటనే తిరగబడతాం. ఎదుటివాడు మనకన్నా బలవంతుడైతే మనం ఏం చెయ్యలేం. అప్పుడే గాంధీగిరి పనిచేస్తుంది.

సినిమాలో గుర్తుందా - కిళ్ళీ నములుతూ వుమ్మేసే అతను చాలా బలవంతుడుగా వుంటాడు.. ఆ కిళ్ళీ మరకలు తుడిచేవాడు సన్నగా బలహీనంగా వుంటాడు. అలా కాకుండా వుమ్మేసేవాడు సన్నగా వుండి ఆ ఇంటి ఓనరు కండలు తిరిగివుంటే..?? వెంటనే చొక్కా పట్టుకుంటాడు. కాబట్టి గాంధిగిరి అసహాయులకి, బలహీనులకి బాగా వుపయోగపడే ఆయుధం. బలహీనులు బలవంతులను ఎదిరించే ఆయుధం తయారు చెయ్యడం గొప్ప విషయం. ఇది ఒక కారణం గాంధి ఫోటో నా సాఫ్ట్ బోర్డ్ పైన పెట్టుకోడానికి.

***

ఏదో తప్పు చేశాడని తండ్రి కొడుకుని కొడతాడు. ఇక్కడ తండ్రి బలవంతుడు కొడుకు నిస్సహాయుడు. వెంటనే కొడుకు నేను అన్నం తినను ఫో అని అలిగి కూర్చుంటాడు. చాలా సహజమైన దైనందిన విషయం ఇది. ఇదే విషయం గాంధీ చేతిలో సత్యాగ్రహమైంది. "నేను చెప్పినది జరిగే దాకా నేను అన్నం తినను" అని మొండికెయ్యడమే కదా సత్యాగ్రహం.
అలాంటప్పుడు సామాన్యంగా ఏ తండ్రి అయినా మూడు రకాలుగా వ్యవహరిస్తాడు -

మొదటిది: "తినకు నాకేం నష్టం? ఎంతసేపు అలా వుంటావో నేనూ చూస్తాను." అనడం. ఇది ఎక్కువ సేపు నిలవదు. మిగిలిన రెండు మార్గాలలో ఎదో ఒకటి చెయ్యక తప్పదు.

రెండొవది: అన్నం పళ్ళెంలో పెట్టి వాడి ముందు పడేసి "తిను.. ఎందుకు తినవో నేనూ చూస్తా.. ఈ కర్ర ఇరిగిపోతుందివేళ.." అంటూ చావబాదటం. ఇలాంటి ప్రయత్నమే బ్రిటీషు చెయ్యబోయి (లాఠీలతో సత్యగ్రహులను కొట్టడం) అది పని చెయ్యదని నిరూపించారు.

ఇక మూడొవది: "మా నాయన కదూ.. మా తండ్రివి కదూ. పోనీ నువ్వడిగిన సైకిల్ కాదుగాని కొంచెం చిన్నది కొనిస్తాలే" అంటూ బేరానికి దిగడం. ఈ బేర సారాల్లో ఆ పిల్లాడు తనకు కావల్సినవి సాధించుకోవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ సాధించుకోవచ్చు.. లేదా కావల్సినదానికన్నా తక్కువ సంపాదించుకోవచ్చు

(అసలిదంతా మానేసి "నువ్వు అన్నం తినే వరకు నేను తినను" అని రివర్స్ సత్యాగ్రహం చెయ్యడం ఇంకో పద్ధతి. అంటే - "నాయనా నీ సత్యాగ్రహం పైన నేను ప్రయోగించే సామ దాన భేద దండోపాయలు పని చెయ్యవు. కాబట్టి ఇప్పుడు నేను నిస్సహాయుణ్ణి. అందుకే సత్యాగ్రహం" అని అంగీకరించడమే)

మొత్తం మీద చెప్పేదేమిటంటే బలహీనుల మరో ఆయుధం సత్యాగ్రహం..!

***

ఇక మూడొవది - అహింస.

ఇందాక చెప్పినట్లు బలహినులకి, నిస్సహాయులకి బాగా పనికి వచ్చే సాధనం నిరసన, సత్యాగ్రహం, గాంధిగిరి..!! మరి ఈ బలముండటం, బలంలేకపోవటం అనేవి గిరిగీసినట్లుగా వుండవు. స్థాన, సమయాదుల బట్టి బలవంతులు బలహీనులు కావచ్చు, బలహీనులు బలవంతులు కావచ్చు. శంకర్‌దాదా సినిమాలో నిజానికి చిరంజీవి శత్రువు కన్నా బలవంతుడే కదా..!! అయినా ఒక సంధర్భంలో తను నిస్సహాయుడై గాంధీమార్గం పడతాడు..!! అలా గాంధీగిరిలో పడ్డా కథానాయుకుడికి (తన బలం గురించి తెలిసీ) శత్రువుని కొట్టకుండా వుండటం గొప్ప పరీక్ష. అందునా ఎదుటివాడు కొట్టినా మనం కొట్టకుండా వుండాలంటే అందుకు ఎంతో మనఃశక్తి కావాలి. ఎవరు కొట్టినా తిట్టినా నేను తిరగబడను అని అనుకోవడమే అహింస.

బలవంతుడైనా, బలహీనుడైనా ఇలా తిరగబడకుండా, శత్రువు పెట్టే కష్టాల్ని భరించి వుండాలంటే చాలా కష్టం. దానికి కావాల్సింది మనసిక బలం, స్థిత ప్రజ్ఞత లాంటివాటికన్నా ముఖ్యమైనది మొండితనం. అవును మొండితనం..!!

అ మొండితనమే శక్తినిస్తుంది. బలాన్నిస్తుంది. ఏమి జరిగినా నేను ఇలాగే వుంటాను అని చెప్పడం (చిరంజీవి చేతులుకట్టుకోని ప్రతినాయకుడి ఇంటి ముందు నిలబడటం) మొండితనం కాక ఇంకేమిటి..!!

మొండికెయ్యడం అనే విషయం ఒక సిద్ధాంతంగా మారటం ఆశ్చర్యమే కదా..!!

***

అయితే ఈ సిద్ధాంతాన్ని, ఈ ఆయుధాలని ఎప్పుడు వాడాలి అనేదానికి మార్గనిర్దేశ్యం చేసేది సత్యం. ఈ సత్యమే గాంధీ సిద్ధాంతాలకి ఆయువు పట్టు. ఇది లేకపోతే అన్యాయమైన కోరికలు తీర్చుకోడానికి ఈ ఆయుధాల వాడకం జరుగుతుంది. అలా జరకుండా ధర్మ మైన కోరికల కోసం వాడాలంటే అందులో సత్య వున్నది లేనిది బేరిజు వేసుకోవాలి. ఆ సత్యమే గాంధిగిరీ చెయ్యాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది.

***

ఆఖరుగా ఒక మాట - ఒకోసారి మనకి న్యాయమైనది, ధర్మమైనది మరొకరి న్యాయం కాకపోవచ్చు. కాబట్టి గాంధీ గాంధీగిరి ఆయుధాలు వాడిన సంధర్భాలన్నీ అందరికీ న్యాయమైనవి అనిపించక పోవచ్చు. గాడ్సేకి అనిపించలేదు. నాకు కూడా గాంధీ సత్యగ్రహం చేసిన కొన్ని సంధర్భాలు న్యాయమైనవి కావు అనిపించింది. అంతమాత్రాన ఆయన తయారు చేసిన సిద్ధాంతాల విలువ మాత్రం నా దృష్టిలో తగ్గలేదు.

అందుకే గాంధీ అంటే నాకు ఇష్టం అని చెప్పలేదు.. గాంధీలో కొన్ని విషయాలే ఇష్టం అని చెప్పాను. ఆ నచ్చిన విషయాలు నాకు గుర్తుచెయ్యడానికి ఆయన ఫొటో అక్కడ పెట్టాను.

***

ఇంత వివరంగా చెప్పాలి - నేను గాంధీ ఫొటో నా సాఫ్ట్ బోర్డ్ మీద ఎందుకు పెట్టుకున్నానో చెప్పాలంటే.. అంత తీరిక ఆ అమ్మాయికీ లేదు.. చెప్పే తిరిక నాకు లేకపోయింది. అందుకే ఇక్కడ రాసుకున్నాను

మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

రాజుకాయ - దోసకాయ - తులసి - వాము

నాకు పదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి మా పెదనాన్న ఒక పద్యం చెప్పాడు. గజేంద్రమోక్షం గురించిన ఆ పద్యం ఇదిగో -

ఎంతదయో దాసులపై
పంతంబున మకరి పట్టి బాధింపంగా శ్రీ
కాంతుడు చక్రం పంపెను
దంతావళి రాజుకాయ దత్తాత్రేయా

నాలుగుసార్లు అదే పద్యం చెప్పాడేమో ఆ పద్యం నా నోటికొచ్చేసింది. కాని చాలా రోజులదాకా ఆఖరి పంక్తిలో వున్న రాజుకాయ ఏమిటో అర్థమయ్యేదికాదు. మామిడికాయ, అరటికాయ లాగా ఇది కూడా ఏదో కాయ కాబోలని సరిపెట్టుకున్నాను. ఈ మధ్యే మళ్ళీ ఆ పద్యం గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. దంతావళి (దంతములు కల - ఏనుగుల) రాజు - కాయ (కాపాడను) అని అర్థమని మీకిప్పటికే అర్థమయ్యే వుంటుంది.

ఆ తరువాత అదే పెదనాన్న ఈ పద్యానికి పేరడీ పద్యం కూడా చెప్పాడు -

ఎంతదయో దోసకాయలపై
పంతంబున చెక్కుతీసి భాగింపంగా శ్రీ
కాంతుడు కారం పంపెను
దంతాలకు చేటు వచ్చే దప్పిక తీరన్.


కవిగారి చెమత్కారం కాకపోతే శ్రీకాంతుడి కారం పంపటమేమిటి..? అది రాజుకాయ నుంచి దోసకాయ దాకా కథ.

***

ఇదిలావుంటే చిలకమర్తివారి గణపతి గుర్తున్నాడుగా.. సదరు గణపతి "శ్రీ రఘురామ" పద్యానికి చెప్పిన వివరణ గుర్తుందా -

"శ్రీరఘురామ చారు తులసీ దళ" - శ్రీరాముడు ఒకసారి చారు కావాలనుకున్నాడట.. ఆ వూరిలో (ఏదీ అయోధ్యా నగరంలో...హతవిథీ) కర్వేపాకు దొరకటం దుర్లభం కావటంతో తులసీ దళములను ప్రత్యామ్నాయంగా వాడారుట. అట్టి చారు తాగడంతో శ్రీరాముడికి "సమక్షమాది శృంగార గుణాలు" కలిగి, అన్నిలోకాలను జయించే "శౌర్య రమాలలాముడై", "దాశరధి కరుణాపయోనిధియై " వెలుగొందాడట.

ఇలాంటిదే మా నాయనమ్మ ఒక పద్యం చెప్పేది -

వామే భూమి సుత, పురస్చ హనుమాన్
పస్చాత్ లక్ష్మణహ సుగ్రీవో జాంబవాన్...


ఇలా సాగుతుందీ పద్యం (తరువాత పంక్తులు గుర్తులేవు..!)

ఈ పద్యానికి చాలాకాలం నేను నమ్మిన అర్థం ఏమిటంటే (మా నాయనమ్మ చెప్పిందే) -

ఒకసారి శ్రీరాముడికి కడుపులొ నొప్పివచ్చిందట. "సీతా..! కాస్త "వాము" తెచ్చిపెట్టవే" అన్నాట్ట శ్రీరాముడు. సీత - "నేను పోలేను ప్రభు కిందే కూర్చొని హనుమంతుడున్నాడుగా" అన్నది. హనుమంతుడు లక్ష్మణుడి పేరుచెప్పి తప్పుకున్నాడట, లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడగచ్చుగా అన్నాడు... అక్కడినుంచి జాంబవంతుడు, భరతాదులు ఇలా అందరూ ఒకరంటే ఒకరనుకున్నారు కాని రాములవారికి వాముతెచ్చేవాడే లేకపోయారట.

ఒకరోజు ఏదో పుస్తకంలో ఆ పద్యం చదువుతూవుంటే ఆ అర్థం సరికాదేమో అనిపించింది. అప్పుడు వెలిగింది - వామే భూమిసుత అంటే ఎడమవైపు (వామహస్తం అంటే తెలుసుగా..!) సీతాదేవి వుంది, కాళ్ళదగ్గర హనుమంతుడు - అంటే ఈ పద్యం శ్రీరామపట్టాభిషేకం గ్రూప్ ఫొటో వర్ణనన్నమాట. వామ వైపు కాస్తా వామైపోయిన విధం గుర్తొస్తే ఇప్పటికి నవ్వొస్తుంటుంది.

ఇది తులసి - వాముల కథ.

జీడిపప్పుగారి బ్లాగులో నా కవిత - "మానవత్వపు ప్రతీక"


మానవత్వపు ప్రతీక
ఈ ఆటో -

అమ్మతనానికి ఒక అడుగు ముందుంటుంది

మాతృత్వాన్ని వరంగా ఇస్తుంది

ఈ ఆటో పుణ్యమా అని

ఎందరో అమ్మలు పుట్టారు


తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం

మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే

ఇతని ఫోను మోగుతుంది

అంతే -

పుట్టుకకు మరణానికి మధ్య

తన ఆటో అడ్డం పెట్టేస్తాడు


తండ్రిలా చేరదీసి

అన్నలా ఆదరించి

అమ్మగా బతకమని ఆశీర్వదిస్తాడు


ఆశకు మూడు చక్రాలు తొడిగి

ఆశయమనే ఇంధనం కలిపాడేమో

ఈ నగరారణ్యంలో

ఎన్నో పసి నవ్వుల పువ్వుల పూయించాడు


ఇప్పుడు ప్రసవ వేదనంటే

జీవితానికి మరణానికి మధ్య ప్రశ్న కాదు

జీవం పోసే మంచితనానికి

మానవత్వపు ప్రతీక..!(జీడిపప్పుగారు తన బ్లాగులో "ఆటో ప్రకాష్" గురించి చెప్పి, ఆ విషయం పై బొల్లోజుబాబాగారు, ఆత్రేయగారు రాసిన కవితలు వుంచారు. ఆ వార్త చదివి నేను వ్యాఖ్యగా రాసిన ఈ కవితను సహృదయంతో వారి బ్లాగులో పెట్టారు. )

ఉదయ్‌పూర్ రాజావారి పురాతన కార్లు (vintage cars)

మెర్సిడీస్ బెంజ్ మొదటి డీజిల్ కారు - జెర్మనీలో తయారు 1936ఈ రెండు కార్లు 1938 క్యాడిలాక్ అమెరికా తయారి; మొదటిది రాజుగారిదైతే రెండొవది రాణీ గారిది.. రాణీ గారి కారులో పరదా అడ్డంగా వేసి వుంటుంది. రాణిగారు డ్రైవరుతో మైక్రోఫోనులో మాట్లాడేవారు. ఎప్పుడన్నా రాణీగారికి బండి నడపాలన్న ఆలోచన వస్తే డ్రైవరు సీటు ముందు వున్న అద్దానికి నీలం రంగు అద్దంతో పరదా వేసేవారు.

ఇక ఇవన్నీ రోల్స్‌రాయ్స్ కార్లు (1924-26).. రాజావారి వివాహ సమయంలో వరకట్నంగా వచ్చినవి..!! అందుకే కారుకు ఒక వైపు రాజావారి రాజ్య చిహ్నం మరోవైపు రాణీగారి రాజ్య చిహ్నం వుంటాయి..!!
ఇందులో మొదటిది పురాతన కార్ల పోటీలో ఉత్తమ కారుగా దేశం మొత్తంలో మొదటిస్థానంలో వచ్చింది.
బ్యిక్ సూపెర్ 8 సాల్లొన్
ఫోర్డ్ స్టాండర్డ్ ఫాంటొన్ (ఎలిజ్బెత్ మహారాణి ఉదయ్‌పూర్ వచ్చినప్పుడు వాడిన బండి)మోరిస్ మైనర్
ఔటిన్ రంబ్లెర్ 1961ఔటిన్ రంబ్లెర్ 1965చెవ్రొలెట్ బస్ 1947 (దీన్ని స్కూల్ బస్‌గా వాడేవారు)
ఫోర్డ్ జీప్ 1942 (ఇది రాజా వారు వేటకి వెళ్ళినప్పుడు వాడే జీపు)

ఇక ఇవి రాజావారి సోలార్ వాహనాలు..


చిత్రమేమిటంటే ఇక్కడున్న కార్లన్నీ వాడకంలో వున్నవే.. దాదాపు అన్ని భాగాలు ఒరిజినల్..!! ఏదైనా రిపేర్లైతే ఇంగ్లాడు నుంచో జెర్మనీ నుంచో మనుషులు వచ్చి రిపేరు చేసి వెళ్తుంటారు. వారానికి ఒకసారి అన్ని కార్లు ఒక రౌండ్ వేస్తాయి..!! హోలి, దసరా వంటి సందర్భాలలో వీటిని వాడతారు.. అన్నట్టు కొందరు ప్రముఖుల పెళ్ళిళ్ళకీ వీటిని వాడటం జరిగింది.

ఉదయ్‌పూర్ అందాలు
పరాక్రమానికి మారు పేరుగా చెప్పబడే రాజ్‌పుట్‌ల రాష్ట్రం రాజస్థాన్. అందులోనూ ఎవ్వరికీ తలవంచని శౌర్యవంతులుగా పేరుగాంచిన మేవార్ రాజుల రజధాని నగరం ఉదయ్‌పూర్.
మహారాణా ఉదయ్ సింగ్ ద్వారా ప్రారంభించబడిన ఈ నగరం అందమైన సరస్సులకి, అధ్బుతమైన కోటలకి, ఎన్నో వీరగాధలకి, శైవవైష్ణవ భక్తి కథలకి, శిల్ప చిత్రకళా విశేషాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏ కోటకి వెళ్ళినా, ఏ వీధిలో తిరిగినా మొగలుల సైన్యాన్ని ఎదిరించిన మహారాణా ప్రతాప్ గురించో, కృష్ణ భక్తిలో ధన్యమైన మీరాబాయి గురించో, రాజ సేవలో ప్రాణాలను పణంగా పెట్టిన సేవకుల గురించో, అభిమానవతులైన రాణుల గురించో కథలు కథలుగా చెప్తారు.
శత్రు సైన్యం తమ పతులను వోడిస్తోందని తెలిసిన రాణులు కోటలోనే "జోహర్" పేరుతో అగ్నికి ఆహుతయ్యేవారట..! హల్దీ ఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ మాన్ సింగ్ చేతిలో వోడిపోవటం చూడలేక అతని గుర్రం చేతక్ రక్తమోడుతున్నా నెరవక నది దాటించి, ప్రతాప్ సురక్షితుడయ్యాక చనిపోయిందట.
బన్‌బీర్ అనే రాజు చిత్తోఢ్ ను ఆక్రమించి యువరాజు ఉదయ్ సింగ్‌ను చంపడానికి వస్తే, దాసి పన్నా దాయి తన కొడుకును ఉదయ్ సింగ్ స్థానంలో వుంచి ఉదయ్‌ని తప్పించిందట. ఆమె కొడుకు బన్‌బీర్ కత్తికి బలైన కథ నిజంగా కంటతడి పెట్టిస్తుంది..!!
స్వతహాగా ఏక్‌లింగ్‌జీ (శైవ) భక్తులైన ఈ రాజులు మ్లేచుల దండయాత్రల నుంచి ద్వారకాదీష్, శ్రీనాధ్‌జీ లని తమ రాజ్యానికి తెప్పించి సురక్షితంగా కపు కాశారు. ఆ ద్వారకాదీష్ మందిర శోభ ఇదుగో -
పక్కరాజ్యమైన అమేర్ (ఇప్పుడు జైపూర్) రాజులు తమ ఆడపడుచులను (జోధా) మొగలులకు ఇచ్చి పెళ్ళిచేసి రాజకీయ మైత్రి కలుపుకుంటే ఇక్కడి యువరాణి కృష్ణ కుమారి అలాంటి రాజకీయ లబ్దికోసం తనని పెడ్లాడ వచ్చిన జైపూర్, జోధ్‌పూర్ యువరాజులను కాదని విషం తాగి ఆత్మాహుతి చేసుకుంది. ఆమె జ్ఞాపకార్థం నిర్మించిన కృష్ణమహల్ అందాలు చూడండి-
కాలంతో పాటు ఈ కోట మార్పులకు లోనౌతూ ఒక్కొక విభాగం అనేక దేశ విదేశ శైలులను కలుపుకుంటూ మరింత మనోహరంగా తయారయ్యింది. ఈ కోటలో కనిపించే రకరకాల చిత్రాలు, శిల్పాలు చూడండి -
అప్పటి రాణివాసంలో పరదా పద్ధతికోసం కిటికీలకు పెట్టించిన జాలీలు, అప్పటి రాణులు వాడిన వంట సామానులూ, వాహనాలు ఇవిగో -


(ఉదయ్‌పూర్ రాజా వారి పురాతన కార్ల గురించి తరువాతి టపా)

నానోలు

ఈగ హనుమాన్ రూపొందించిన నానో అనే కొత్త ప్రక్రియ గురించి తెలిసే వుంటుంది..!! అది కవిత్వమా కాదా అని అంతర్జాలంలో విస్తృత చర్చే జరిగింది - జరుగుతోంది..!! అవి అలా పక్కన పెడితే - ఒక రోజు ఇలాంటివి నేను ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించింది. కవిత్వం సంగతి ఎలా వున్నా "నాలుగే పదాలు" అన్న నియమంలో ఇమిడి చెప్పదల్చుకున్న విషయం చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది.. ఆ ప్రయత్న ఫలితమే ఈ నానోలు..

1
చెట్టుకు
పూయని
పూవు
సీతాకోకచిలక-

2
చీకటి
చివరి
మజిలి
వెలుగేగా-

3
చలికాలం
పేదవాడి
వెచ్చదనం
ఆకలిమంట-

4
బ్రతుకుబడిలో
తీపిగుర్తులు
కలలు
కల్లలు-

5
ప్రేమవనంలో
పూలూ
మూళ్ళూ
కలిసేవుంటాయ్-

6
చింపేసిన
క్యాలండర్
తిరిగిరాని
కాలం-

7
పూల
పెదాలపై
తుమ్మెద
ముద్దుగుర్తులు-

8
మనసుకు
నేత్రదానం
కవితకు
భావుకత్వం-

9

పక్షులు
వలసెళ్ళాక
కిలకిలలన్నీ
గిలకబావివే-

10
చెట్టుకొట్టే
గొడ్డలికర్ర
చెట్టుకు
పుట్టిందేగా-

11
ఆలోచన
మహావృక్షం
బోన్సాయ్
నానో-

ప్లాట్‌ఫారం నెంబర్ వన్..!! (కవిత)

రైలు వచ్చి నిలబడగానే
ఆ ప్లాట్‌ఫారం అమ్మకాల అరుపులౌతుంది
పోర్టర్‌ల కేకలౌతుంది
పలకరింపులు, వీడుకోలులు అక్కడే చిత్రంగా కలిపోతాయి
ఎవరో సమోసా తింటూ..
గాలికి వదిలిన కాగితం పొట్లం
ప్లాట్‌ఫారం టికెట్టు లేకుండానే
స్టేషనంతా కలియ తిరుగుతుంది


రైలు ఎక్కించే నెపంతో
చేతులువేస్తున్న పెళ్ళికొడుకును చూసి
కొత్తపెళ్ళికూతురు సిగ్గుపడితే
అది మల్లెపూవై రాలి విచ్చుకుంటుంది

సీజన్ టికెట్టుగాళ్ళంతా
చివరి నించి రెండోపెట్టెలో చేరి
సరదా కబుర్ల సావాసగాళ్ళైతే
ఆ జ్ఞాపకం పేకముక్కలై పట్టాలమీద పడుతుంది

బేరాల్లేని పోర్టర్
ఎర్రచొక్కా తలకిందపెట్టుకొని
పస్తులున్న పిల్లల్ని తల్చుకుంటుంటే
కంటినీరు బాధను మోసుకుంటూ రాలుతుంది

రైలు కూతపెట్టి కదలగానే
గార్డు వూపిన పచ్చలైటు
బండెక్కించినవాళ్ళ ముఖాలపై
దిగులు రంగై పరుచుకుంటుంది

తిరుగు ముఖం పెట్టిన తాతయ్యకి
ఇంకా చెయ్యి వూపుతున్న మనవడికి మధ్య
దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాయి
జాలి లేని రైలు పెట్టెలు

ఆఖరి నిముషంలో
పరుగెత్తుకొచ్చిన ప్యాసింజరు
రైలు వేగంతో పోటి పెట్టుకుని
ప్లాట్‌ఫారం చివరిదాకా ఆశని పరుస్తాడు

చివరి రైలు తప్పిపోయాక
సూట్‌కేస్ దిండుపై పిల్లల్ని పడుకోబెట్టి
రాత్రంతా కునికిపాట్ల కాపలా కాస్తే
అది తెల్లవారేసరికి ఖాళీ టీ కప్పులై మిగులుతుంది

తూరుపు తలుపు తెరుచుకున్నాక
మల్లెల్నీ, ఆశల్ని, కన్నీళ్ళని వూడ్చేసిన వెంటనే
కొత్త అనుభవాలని మోయాలనుకుంటూ
ప్లాట్‌ఫారం మళ్ళీ నిద్ర మేల్కొంటుంది

(ఆవకాయ్.కాం లో ప్రచురితం)

మంచినీళ్ళ బావి (పొద్దు సౌజన్యంతో)

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక పొద్దులో మే 26 న ప్రచురితం)

ఎన్నో ఏళ్ళ క్రిందటి మాట. మా వూరిమధ్యలో శివాలయాన్ని ఆనుకోని ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. ఎప్పుడో రాజుల హయాంలో కట్టించిన ఆ బావి దాదాపు వూరు మొత్తానికి నీళ్ళు అందించేది. నాలుగు వైపులా నాలుగు గిలకలు రోజంతా కిలకిలమంటూ కళకళలాడుతుండేది. తెల్లవారుఝామున ఏ నాలుగింటికో శివాలయం పూజారి దక్షిణామూర్తిగారు బావిని నిద్రలేపి చన్నీళ్ళ స్నానం చేసి, తడిగుడ్డతో నాలుగు బిందెలు మడినీళ్ళు పట్టుకోని రుద్రం నమకం చదువుకుంటూ గుళ్ళోకి నీళ్ళు మోసుకెళ్ళేవారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బ్రాహ్మణవీధి ఆడంగులంతా దక్షిణామూర్తిగారి స్నానం అయ్యేదాక ఆగి, ఆ తరువాత ఏ వచనరామాయణమో పాడుకుంటూ బావికి పసుపు అద్ది, బొట్లు పెట్టి, గిలకలమీద చేదలేసేవారు. ఇక అక్కడినించి ఆ బావి చలివేంద్రంలా రోజంతా జలదానం చేస్తూనే వుండేది.

కొంచెం తెలవారుతుండగా ఆడవాళ్ళ వరస మొదలయ్యేది. కులం ప్రాతిపదికన వేళల్లో మార్పులుండేవిగాని ఫలానా కులం వాళ్ళు నీళ్ళు పట్టుకోకూడదని ఎవ్వరూ అనేవారు కాదు. అప్పుడే నిఖా అయ్యి మా వూరు వచ్చిన నూర్‌జహాన్, బిందెతో అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోడానికి వెనకా ముందు ఆడుతుంటే సెట్టెమ్మగారు చూసి -

“ఏమ్మా కొత్త కోడలా.. అట్టా ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి వేస్తే ఇంక ఇంటికి నీళ్ళు చేర్చినట్టే.. రా, నేను తోడి పెడతాను..” అంటూ వద్దన్నా వినకుండా బిందె నిండా తను తోడుకున్న నీళ్ళు పోసి పంపేది. “కొత్త కోడలుకదా నీళ్ళబావి దగ్గర ఎక్కువసేపు వుంటే ఆ అత్తగారు ఏం సాధిస్తుందో.. పోనీలే పాపం ఒక్క బిందె నీళ్ళిస్తే మాత్రం ఏం పోతుంది” అనేది మిగతా ఆడంగులతో. బావిలో నీళ్ళు నవ్వుతూ సుడులు తిరిగేవి.

తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే, అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గటగటా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి, గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు -

“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.

చాలాకాలం ఇలాగే ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ వుండే వూరిజనం మధ్య, నెమ్మదిగా గొడవలు మొదలయ్యాయి. అప్పటిదాకా అక్కచెల్లెళ్ళలా కలిసి నీళ్ళు తోడుకునే ఆడవాళ్ళు ఆడపడుచుల్లా గిల్లి కజ్జాలు పెట్టుకోసాగారు. తెల్లవారుఝామునే వచ్చే ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఆలస్యంగా వచ్చి మణ్ణీళ్ళు తోడుకోవాలంటే మిగిలిన వాళ్ళు అడ్డు తప్పుకునేవాళ్ళు కారు.

“నీ వేళలో నువ్వు రాకుండా మమ్మల్ని తప్పుకోమంటావేంది?” అనేవారు.

నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు. మాట మాటా పెరిగినాయి.

“ఇది శివాలయం బావి.. బ్రాహ్మల బజారులో వుంది.. మిగిలిన వాళ్ళు ఎవరూ ఇక్కడ నీళ్ళు తీసుకోను వీల్లేద”ని తీర్మానం చేశారు.

“బావులు, నీళ్ళు ఒకళ్ళ సొత్తవడానికి వీల్లేద”ని మిగిలిన జనం తిరగబడ్డారు. ఆ తరువాత కొంత గొడవ జరిగి ఇట్లా తేలేది కాదని వూరికి మరో పక్క పోలేరమ్మ చెట్టు దగ్గర ఇంకో బావి తొవ్వించారు. మిగిలిన కులస్తులంతా అక్కడికి వెళ్ళి నీళ్ళుతోడుకోవడం మొదలెట్టారు. ఆ తరువాత చిత్రంగా శివాలయం బావి నీళ్ళ రుచి మారటం మొదలైంది. చెరకు రసంలా తియ్యగా వుండే నీళ్ళు చప్పంగా మారిపోయాయి… కొంచెం కొంచెంగా ఉప్పెక్కడం మొదలైంది. అయినా అక్కడి పెద్ద కులాల ఆడంగులంతా అవే నీళ్ళతో కాలం గడుపుతున్నారు. అక్కడి నీళ్ళు తాగడానికి చాలా మంది వెనకాడటంతో నీళ్ళు తోడిపెట్టే పని తప్పింది జనానికి. పెద్ద బాడిసెతో పెద్ద పని జరగట్లేదని సాంబయ్య అక్కడే ఒక సోడా కొట్టు పెట్టుకున్నాడు. ఆ బావి మాత్రం పెద్ద బొట్టు పెట్టుకున్న ముత్తైదువులా చేతనైనంతవరకు జలదానం చేసేది.

ఇక్కడ పోలేరమ్మ చెట్టు దగ్గర కొత్తగా కట్టిన వొరల బావేమో అప్పుడే చీరకట్టడం నేర్చిన కుర్ర పిల్లలా వుండేది. అక్కడ నీళ్ళు చెరకురసంలా కాకపోయినా చక్కెరనీళ్ళలాగా బాగుండేవి. బావి గట్టున చెట్టు మీద కొన్ని పావురాళ్ళు కాపురం వుండేవి. ఆడంగులు నీళ్ళు తోడుకోని వెళ్ళిపోయాక అవి చిన్నగా దిగి వచ్చి, గట్టు మీద బిందెలు పెట్టి పెట్టి పడ్డ గుంటల్లో నీళ్ళు నిలిస్తే ఆ నీళ్ళు తాగుతూ కువ కువ కబుర్లు చెప్పుకునేవి. కొంతకాలం అట్లా గడిచింది.

ఒకరోజు పోలేరమ్మ బావిదగ్గరా ముసలం పుట్టింది. “నేను ముందు నీళ్ళు తోడుకుంటుంటే కోపంతో నీళ్ళలో చెన్నమ్మ వుమ్మేసింది” అని నూకాలు అన్నది.

“ముందొచ్చింది నేను.. నువ్వెట్టా తోడుకుంటాయే.. నీళ్ళు..” అని చెన్నమ్మ అరిచింది.

నూకాలుకి మా చెడ్డ కోపంవచ్చింది. చెన్నమ్మ జుట్టు పట్టుకోని వంచి బిందెతో బాదింది. ఇద్దరూ కిందపడి దొర్లారు.. బూతులు తిట్టుకున్నారు, దుమ్మెత్తి పోసుకున్నారు. విషయం తెలుసుకోని ఆ ఇద్దరి మొగుళ్ళు కర్రలతో కొట్టుకున్నారు. ఇద్దరి రక్తం బావి గట్టుమీది గుంటల్లో పడింది. అది చూసిన పావురాళ్ళు ఆ వూరు వదిలి వలసెళ్ళిపోయాయి. చాలామంది ఆ రోజు నీళ్ళు తోడుకోకుండానే ఇంటికెళ్ళిపోయారు.

వలసలెళ్ళిన పావురాళ్ళు తిరిగిరాలేదు. కొన్ని రోజులకి ఏదో మంత్రం వేసినట్టు పోలేరమ్మ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఎండిపోయిన నాలుగు రోజులకే ఆ బావిలో పురుగు పడింది. గుర్రపు డెక్క ఆకు వేస్తే నీళ్ళు బాగుపడతాయని ఎవరో అంటే అందులో ఆ ఆకు వేశారు. అది పెరిగి పెరిగి బావంతా పాకింది. బావి ఒరల గోడలకి నాచు పట్టింది. ఆ నీళ్ళు కూడా తాగడానికి పనికిరాకుండా పోయాయి.

దాంతో వూరంతటికి మంచినీళ్ళ బావి లేకుండాపోయింది. వూర్లో ఆడవాళ్ళంతా బిందెలు చంకన పెట్టుకోని నాలుగు మైళ్ళు నడిచివెళ్ళి వాగులో నీళ్ళు నింపుకొచ్చేవాళ్ళు. సోడా కొట్టు సాంబయ్య తమ్ముడు రాములు కావిడి కట్టి వూర్లోకి నీళ్ళు మోసుకొచ్చేవాడు. బిందెకు రూపాయి చొప్పున తీసుకునేవాడు. సాంబయ్య వ్యాపారం కూడా వూపందుకుంది. అప్పుడే బస్సు దిగిన పొరుగూరోళ్ళు, శివాలయం చూడటానికి వచ్చే భక్తులు బావిలో వుప్పు నీళ్ళు తాగలేక సాంబడి సోడాలతోనే సెదతీరేవారు. కొంతకాలానికి సాంబయ్య సోడా మిషను కూడా పెట్టాడు.

కొన్నేళ్ళు ఇలాగే గడిచాయి. వూర్లో డబ్బున్నవాళ్ళు మంచినీటి ఎద్దడి తట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించారు. బావులు తొవ్విస్తే బండలు అడ్డంపడుతున్నాయే కానీ నీళ్ళు పడటంలేదు. పట్నం నించి బోరు లారీలని పిలిపించి ఇళ్ళలో బోర్లు వేయించాలని కూడా చూశారు. ఎక్కడ వేసినా ఉప్పు నీళ్ళేకాని మంచి నీళ్ళు తగలట్లేదు.
శివాలయంలో శివుడికి వుప్పునీళ్ళ అభిషేకమే చేసేవారు దక్షిణామూర్తిగారు.


“శివుడి ఆజ్ఞ లేదు.. ఆ గంగమ్మను వదలటంలేదు.. ఏ భగీరథుడో మళ్ళీ రావాలి..” అనుకునేవాడు ఆయన.

***

గోపాలయ్య అనీ, శివాలయం పక్కవీధిలోనే వుండేవాడు. వూరిలో వచ్చిన మంచినీటి కరువు చూసి చాలా బాధపడ్డాడు. శివాలయంలో శివుడికి దణ్ణం పెట్టి -

“పరమేశ్వరా ఏదైనా మార్గం చూపించు స్వామీ..” అంటూ మొక్కాడు.

ఇంటికి తిరిగి వస్తూ దారిలో నీళ్ళ బిందెలు మోస్తున్న ఆడవాళ్ళని చూసి వుస్సురని నిట్టూర్చాడు. ఆయన ఇంట్లోకి రాగానే జానకమ్మగారు ఎదురొచ్చి చేతిలో సంచీ, భుజం మీద కండువా అందుకుంది. తీరిగ్గా కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చాక చెప్పుకొచ్చింది-

“మన ఇంటికి ఎలాగూ ప్రహరీ కట్టించాలని అనుకుంటున్నాము కదా.. ఆ ఆగ్నేయం మూల, స్థలం ఎట్లాగూ వదిలిపెట్టాలి.. ప్రహరీ అవతల, పోనీ ఒక బావి తొవ్వించే ప్రయత్నం చెయ్యకూడదూ.. నీళ్ళు పడితే వూరికి మంచి చేసినవాళ్ళమౌతాము.. పది మందికి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కితే వస్తుంది చెప్పండి..” అంది.

జానకమ్మగారి ఆలోచన వినగానే సంతోషంతో ఆయన ముఖం వెలిగిపోయింది. చటుక్కున లేచి.. ఆమె చేతిని గట్టిగా పట్టుకోని, చిన్నగా నొక్కి, ఒక చిరునవ్వు నవ్వాడు. ఆమె కండువా చేతికిచ్చింది. అంత ఎండనూ లెక్కచెయ్యకుండా గోపాలయ్య కరణంగారింటికి బయలుదేరాడు.

ప్రహరీ సంగతి పక్కన పెట్టి, ముందు బావి తొవ్వించాలని సంకల్పించాడు గోపాలయ్య. మంచినీళ్ళు ఎక్కడపడతాయో మంత్రం వేసి చెప్పగలిగిన కేశవాచార్యులు పెదవి విరిచి,

“లాభం లేదయ్యా.. వుత్త బండ తప్ప అసలు నీళ్ళు పడే మార్గమే లేదు” అంటూ తేల్చేశాడు. దాంతో పంచాయితీ పెద్దలు డబ్బు సాయం చెయ్యమన్నారు. గోపాలయ్య నీరసపడి ఇంటికొచ్చాడు.

ఆ రాత్రి జరిగింది విని జానకమ్మ ఎంతో నొచ్చుకుంది. “బండే పడుతుందో.. గంగే పడుతుందో.. ప్రయత్నిస్తే తప్పేముంది..? వాళ్ళేమనుకుంటే మనకెందుకు, మన స్థలం అది. మనం అనుకున్నట్టే చేద్దాం” అని ప్రహరీ ఖర్చుకి తీసిపెట్టిన డబ్బులు గోపాలం చేతిలో పోసింది.

మర్నాడే పని ప్రారంభమైంది. జానకమ్మ, గోపాలయ్య అందరు దేవుళ్ళకి మొక్కుకోని నలుగురు కూలీలతో తొవ్వడం మొదలు పెట్టారు. వూర్లో జనమంతా గోపాలయ్యని పిచ్చివాడన్నారు.

“మన కేశవాచారి నీళ్ళు పడవంటుంటే.. ఎందుకురా నీకీ పిచ్చి ఆరాటం..” అని ఎద్దేవా చేశారు.

వాళ్ళిద్దరు మాత్రం ఏ మాత్రం వెరవలేదు. ఒక కూలి ఖర్చు మిగిలినా మిగిలినట్టే అని గోపాలయ్య కూడా ఒక పలుగు పట్టాడు. జానకమ్మ కూలివాళ్ళందరికి అన్నం వండి వార్చేది. చల్లటి మజ్జిగ ఇచ్చేది.. ధనియాల కాఫీ పెట్టేది. ఖాళీ వుంటే మట్టి తట్టలు అందుకునేది. పది రోజులు తొవ్వారు. ఎక్కడా నీటి జాడ కనపడలేదు.

ఆ రోజు రాత్రి గోపాలయ్య చాలా మథనపడ్డాడు.

“పరమేశ్వరా.. ఇంక నా చేతిలో చిల్లిగవ్వలేదు.. ఊరికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇక నీదే భారం” అనుకున్నాడు. జానకమ్మ నవ్వుతూ తన నగలు తెచ్చి ఇచ్చింది.

మరి జానకమ్మ మంచితనం చూసి కరిగాడో, గోపాలయ్య మొరనే విన్నాడో, ఆ పరమేశ్వరుడు గంగను వదిలిపెట్టాడు. తెల్లవారేసరికి బావిలో నీళ్ళు..!! నీళ్ళంటే నీళ్ళుకాదు.. లేత కొబ్బరిపాలు వున్నట్టున్నాయి..!! వూరంతా వరదలా పరుగెత్తుకొచ్చారు. ఆ నీళ్ళు తాగారు.. ఒకరి మీద ఒకరు చల్లుకున్నారు.. ఆ వూరికి జలదానం చేసిన గోపాలయ్యకు, జానకమ్మకు దణ్ణాలు పెట్టారు. అప్పటి నుంచి అది జానకమ్మగారి బావి అయ్యింది.

వూరి జనమంతా మళ్ళీ ఒక బావిలో నీళ్ళు తోడుకోవడం మొదలు పెట్టారు. కావడి రాములు ఈ బావి నీళ్ళే తీసుకోని వూరిలో పెద్దవాళ్ళకి పోసేవాడు. రూపాయికి రూపాయి ఎక్కువడిగినా కాదనేవాళ్ళు కాదు. గోపాలయ్య ఇంట్లోకి వస్తూ పోతూ గిలక చప్పుడు విని వేదమంత్రం విన్నట్లు తలవూపేవాడు. జానకమ్మ బావి పక్కనే తులసి చెట్టు నాటింది.. ఆ పక్కనే ఒక వేపచెట్టు, రావి చెట్టు కలిసి పుట్టుకొచ్చాయి. ఆ చెట్లకు నీళ్ళు తోడి పోసి బిడ్డల్లా పెంచుకుంది.

కాలం తిరిగింది. జానకమ్మ పురుడు పోసుకోడానికి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ వూరందరికీ తులసి కోటలో చెంబెడు నీళ్ళు పొయ్యమని చెప్పింది. పండంటి మగబిడ్డని కన్న తరువాత, చూడవచ్చిన గోపాలయ్యతో “బారసాల మనింట్లోనే జరగా” లని పట్టుబట్టింది. అన్నట్టుగానే ఇరవై రోజుల పిల్లాడిని తీసుకోని ఎడ్లబండి కట్టించుకోని తిరిగివచ్చింది. రామచంద్రుడని పేరు పెట్టుకున్నారు. సాయంత్రం వుయ్యాలలో వేసేముందు బావికి పూజ చేసింది. ప్రేమగా ఆ బావి నెమిరింది. పసుపుతో గుండ్రంగా రాసి, కుంకుమ బొట్లు పెట్టింది. రావి, వేప చెట్ల చుట్టూ తిరిగింది. తులసి చెట్టు పాదులో నీళ్ళుపోసి “అమ్మా నా పసుపు కుంకుమలు పదికాలాలపాటు నిలుపు తల్లీ” అంటూ మొక్కుకుంది.

ఆ మర్నాడు గోపాలయ్య చెట్లపాదులు సవరిస్తూ పైకి చూస్తే రావి చెట్టు మీద రెండు పావురాలు కనిపించాయి. ఆయన జానకమ్మను కేకేస్తే ఆమె బయటకు వచ్చి వాటిని చూసి, బావి దగ్గరకు వెళ్ళి ఒక చేదడు నీళ్ళు తోడి అక్కడ పెట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళినట్లే వెళ్ళి తలుపు చాటు నించి తొంగి చూసారు. రెండు పావురాళ్ళు బావి గట్టు చేరి ఆ నీళ్ళు తాగి కువ కువల కబుర్లు మొదలు పెట్టాయి. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోని తృప్తిగా నవ్వుకున్నారు.

***

రామచంద్రుడు పెరిగి పెద్దవాడౌతున్న కొద్దీ ఆ వూరు నీటి ఎద్దడి సంగతి మర్చిపోయింది. జానకమ్మగారి బావి మినహాయించి ఆ వూరిలో ఏ బావిలోనూ మంచి నీళ్ళు పడనేలేదు. ఒకవేళ పడ్డా ఆ రుచి మరిగినవాళ్ళు తాగడానికి మాత్రం జానకమ్మగారి బావినుంచే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఎండకాలం వస్తే నాలుగు మైళ్ళ అవతలున్న వాగుతో సహా అన్నిచోట్లా నీళ్ళు ఎండిపోయేవి. శివాలాయం బావికూడా అందుకు మినహాయింపు కాదు. దక్షిణామూర్తిగారు తూర్పు వాకిలి నుంచి నీళ్ళు తేవడం మానేసి వుత్తర గోపురం గుండా వెళ్ళి జానకమ్మగారి బావి నుంచే నీళ్ళు తెచ్చేవాడు. సోడా కొట్టు సాంబడు వయసు మీదపడ్డాక కొట్టు మూసేసి పట్నంలో తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. కావిడి రాములు ముసలివాడై నీళ్ళు మొయ్యలేక ఇంటి పట్టునే వుంటున్నాడు. కొన్నేళ్ళు అలా గడిచాయి.

రామచంద్రుడికి పన్నెండేళ్ళ వయసులో జానకమ్మగారికి జబ్బుచేసింది. గోపాలయ్య అహర్నిశలు దగ్గరుండి ఆమెకు సపర్యలు చేసాడు. అయినా ఫలితం లేకపోయింది. మరో రెండేళ్ళకి ఆమె కన్నుమూసింది. ఉన్నా లేకపోయినా ఆమెను వూరంతా దేవతలానే చూసింది. ఆఖరి చూపులకి కులం మతం తేడాలేకుండా అందరు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. బావి గట్టునే ఆమెకు స్నానం చేయించి, నిండు ముత్తైదువలా అలంకరించి సాగనంపారు. గోపాలయ్యకు మరో పదేళ్ళ వయసు మీదపడ్డట్టైంది. అయినా బాధను దిగమింగుకోని రామచంద్రుణ్ణి పెద్దవాడిని చేశాడు. రామచంద్రుడు అదే వూర్లో డైరీలో వుద్యోగంలో చేరి గోపాలయ్య కళ్ళెదుటే వున్నాడు.

ఒకరోజు పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న సోడా సాంబయ్య కొడుకు కుమారస్వామి ఆ వూర్లో దిగబడ్డాడు. నేరుగా డైరీకి వెళ్ళి రామచంద్రుడితో మంతనాలు జరిపాడు. ఇద్దరి మధ్యా ఏం మాటలు జరిగాయో తెలియదుగాని మరో రెండురోజులకి రామచంద్రుడు జానకమ్మ బావిలో మోటరు బిగించాడు.

“నాయనా రాముడూ..ఎందుకురా ఈ మోటరు అదీ.. బావి ఎప్పుడో వూరికిచ్చేశాము.. వాళ్ళే చూసుకుంటారు” అన్నాడు గోపాలయ్య.

“ఈ బావి వూరిదికాదు.. ఆ స్థలం మనది, బావి మనది.. మీరు అనవసరంగా కల్పించుకోవద్దు..” అన్నడు రాముడు దురుసుగా. అంతేకాని అసలు సంగతి చెప్పనేలేదు.

మర్నాడు తెల్లవారుఝామునే పట్నం నుంచి నాలుగు ట్యాంకరు లారీలు వచ్చాయి. వాటి హారను మోతలకి వూరంతా వులిక్కిపడి లేచింది. గిర్రున తిరిగింది.. వచ్చిన నీళ్ళను ట్యాంకర్లకు పట్టుకున్నారు. ఆ మోటారు చప్పుడుకి రావిచెట్టుమీద వున్న పావురాలు చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. నీళ్ళు నింపుకున్న ట్యాంకర్లు చల్లగా వూరుదాటాయి.

గోపాలయ్య ఎంతో బాధపడ్డాడు. వూరంతా ఇంటి ముందు చేరి రాముడికి నచ్చ చెప్పాలని చూశారు. వాడు ససేమిరా అన్నాడు..

“ఏమిటండీ మీ అజమాయిషీ.. ఇది మా బావి.. మా ఇష్టం.. ఒక్కొక్క ట్యాంకరుకి ఆరొందలు ఇస్తారు.. ఎంత లేదన్నా నెలకి వేలల్లో లాభం.. వూరకొచ్చే డబ్బు.. నేనొదులుకోను” అన్నాడు.

“మోటర్లతో లాగితే నీళ్ళు తగ్గుతాయి.. వూర్లోవారందరికీ కరువొస్తుంది” అన్నాడోక పెద్దమనిషి.

“అసలు మా బావిలో మీరు నీళ్ళు తోడుకోవడం ఏమిటి.. పట్నంలో నీళ్ళతో ఇంత వ్యాపారం జరుగుతుంటే వూరందరికీ వూరకే నీళ్ళు ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడినా? అసలు మీరెవ్వరూ రేపటినుంచి నీళ్ళు తోడుకోవడానికి లేదు. ఈ రోజే బావిపైన ఇనపగేటు వేయించి తాళం వేస్తాను..” అన్నాడు. అన్నంత పనీ చేశాడు వాడు.

గోపాలయ్య ఎంతో మథనపడ్డాడు.

“పది మందికి మంచినీళ్ళు ఇస్తే ఆ పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కినా రాదురా.. ఆ బావి తొవ్వడానికి మీ అమ్మ తన నగ నట్రా కూడా ఇవ్వడానికి సిద్ధపడింది..” అంటూ బ్రతిమాలాడు.

“ఇప్పుడుమాత్రం ఏమైంది.. పట్నంలో ఎంతోమందికి మన నీళ్ళు వుపయోగపడుతున్నాయి.. వాళ్ళు ఇవ్వగలరు కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాము.. ఇందులో మాత్రం పుణ్యం రాదని ఎవరన్నారు..” అంటూ వితండవాదం చేశాడు రాముడు.

ఆ రోజునించి ట్యాంకర్లు వస్తూనే వున్నాయి. వూరి జనమంతా మళ్ళీ వాగు వైపు నడకసాగించారు. ఏ అమ్మలక్కలు ఒక చోట చేరినా “జానకమ్మ మనసుకి ఇట్టాటి కొడుకు పుట్టాడే” అని చెప్పుకున్నారు. ఎక్కడ నలుగు మొగవాళ్ళు చేరినా “నలుగురి మంచి ఆలోచించే గోపాలయ్య ఎక్కడ ఈ రామచంద్రుడు ఎక్కడ” అని తిట్టుకున్నారు.

గోపాలయ్య చెవిన ఇవన్నీపడ్డాయి. బాధతో కుమిలిపోయాడు.. మంచాన పడ్డాడు.. నిద్రలోను, మెలకువలోనూ జానకమ్మను పలవరించాడు. ఒకరాత్రి వోపిక చేసుకోని బావి దగ్గరకు వెళ్ళాడు. బావి చుట్టూ తిరిగాడు, రావి చెట్టును నెమిరాడు. తులసి చెట్టుకు నీళ్ళు పోద్దామంటే బావి దగ్గర చేదలేదు. చేద వేసేందుకు అవకాశంలేకుండా ఇనప వూచలు అడ్డంపెట్టివున్నాయి. తన బలమంతా వుపయోగించి లాగాడు. కొద్దిగా కదిలింది. ఇంట్లో రాముడు దాచిపెట్టిన తాళంచెవి తెచ్చి తెరిచాడు. కష్టపడి చేద దించాడు. నీళ్ళు తోడాడు.. తులసి మొదట్లో నీళ్ళు పోసాడు. నీళ్ళు బురద బురదగా వున్నాయి. రుచి చూసాడు.. మునుపటి రుచి లేదు. ఇంతలో చేద గిలక మీదనించి జారింది. ఆయనా కూలబడ్డాడు. ఇరుసు విరిగి గిలక ఒక పక్కకి వొరిగిపోయి చెరిగిన తిలకంలా వుండిపోయింది. గోపాలయ్య కూడా అలాగే వొరిగిపోయాడు…మళ్ళీ లేవలేదు.

తెల్లవారాక ట్యాంకర్లు వచ్చాయి. నీళ్ళు పట్టాలని మోటరెయ్యడానికి లేచిన రాముడు గోపాలయ్యను చూశాడు. వూరంతా వార్త గుప్పుమంది. అందరూ వచ్చారు..

“ఆయన కూడా పోయాడు.. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో..” అంటూ నిష్టూరమాడారు.

విరిగిన గిలకని, ఆయన చేతిలో వున్న చేదను చూస్తే అందరి మనసు చివుక్కుమంది. చేదతీయబోతే అందులో మురికి నీళ్ళు కనపడ్డాయి. బావిలోకి తొంగి చూశారు -

“బావిలో నీళ్ళు లేవు..” ఎవరో అరిచారు..

“జానకమ్మగారి బావి ఇంకిపోయింది..” వూరంతా చెప్పుకున్నారు.

“ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం.. ఎంతటి ఎండలొచ్చినా ఏ నాడైనా ఇంకిపోయిందా?” అన్నారెవరో శివాలయంలో.

“ఇంకిపోయింది నీళ్ళుకాదు.. పదిమందికి సాయంచేసే మంచితనం..” అంటూ శివాలయంలోకి వెళ్ళిపోయారు దక్షిణామూర్తిగారు.