వాడు – మసాలా దోశ


“ఏం కావాలి..?” అడిగాడు అతను. అతను అంటే ఖాసిం. బలంగా దిట్టంగా వుంటాడు. హైవే పక్కనే వున్న ఆ చిన్న హోటల్లో సర్వర్.

“నా దగ్గర డబ్బుల్లేవు” అన్నాడు వాడు. వాడి పేరేంటో తెలియదు. అందరు చిన్నా అంటారు. పదకొండు పన్నెండేళ్ళు వుంటాయేమో వాడికి.

“నీ డబ్బులు సంగతి నేను అడిగానా? ఏం కావాలొ చెప్పు” అన్నాడు ఖాసిం కోపంగా. అతని కళ్ళలోకి చూస్తే నిజంగా పెట్టడానికే అడుగుతున్నాడా అని అనుమానం వచ్చింది వాడికి.

“మసాలా దోశ” అన్నాడు చిన్నగా, భయంగా.

“మసాలా..??” అన్నాడు ఖాసిం వ్యంగ్యంగా. “నీ మొహానికి మసాలా దోశ కావాలా?” అన్నట్లు వుంది అతని ముఖం. ఆ పిల్లాడు మాత్రం అదేమి పట్టించుకోలేదు.

దాదాపు మూడు నెలలనించి అడుగుతూనే వున్నాడు మసాలాదోశ కావాలని. ఎప్పుడూ ఇడ్లీ ఉప్మా పెట్టడమేకానీ, ఇలా అడిగి పెట్టిందే లేదు. ఇంతకు ముందు కూడా రెండు ఇడ్లీలు ఇచ్చి తినమన్నారు. అవి తిని ఒక్క మసాలాదోశ వేసి పెట్టమని వంటమాస్టర్ గోవిందుని అడిగితే వాడు తిడుతూవున్నాడు. ఇంతలోనే ఖాసిం వచ్చి బలవంతంగా లాక్కొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు.

“నిజంగానే ఇస్తాడా.. లేకపోతే లోపలికి తీసుకెళ్ళి కొడతాడా?” అని అనుమానం వచ్చింది వాడికి. తలెత్తి కౌంటర్ దగ్గర కూర్చోని వున్నఓనర్ వైపు చూశాడు. అతనూ ఇటే చూస్తున్నాడు. ఆ చూపు కూడా ఒక రకంగా వుంది. చిన్నాకి ఇంకా భయం ఎక్కువైంది. మసాలాదోశ ఎందుకడిగానా అని తనని తానే తిట్టుకున్నాడు.

సర్రున చప్పుడు చేస్తూ ప్లేటు అందులో మసాలాదోశ టేబుల్ ఆ చివర నించి వచ్చి వాడి ముందు ఆగింది. ప్లేటు గుండ్రంగా తిరుగుతోంది. తల ఎత్తితే ఎదురుగా ఖాసిం తినమన్నట్టు సైగ చేశాడు. తినమంటున్నాడా లేకపోతే తింటే చంపేస్తా అంటున్నాడో అర్థంకావటంలేదు వాడికి. మళ్ళీ దోశ వైపు చూశాడు. మధ్యలో ఎత్తుగా వున్న చోట వత్తి చూశాడు. మెత్తగా వుంది.

“నిజంగానే మసాలా దోశ..” అనుకున్నాడు. వాడి ముఖం ఆనందంతో విప్పారింది. పక్కనే రెండు రకాల చట్నీలు చూస్తే వాడికి ఆవురావురనిపించింది. మధ్యలో ముక్క తుంచి మసాలాతో సహా తీసుకోని చట్నీ అద్దుకోని నోట్లో పెట్టుకున్నాడు.

అప్పుడు చూశాడు చుట్టూ.. ఆ హోటల్‍లో పని చేసే వాళ్ళంతా ఏదో హడావిడిలో వున్నారు. అయినా అందరూ వాణ్ణే చూస్తున్నారు. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది.

“ఏమైంది వీళ్ళందరికి? మసాలా దోశ తినడం ఏదో పెద్ద తప్పైనట్లు ఎందుకు చూస్తున్నారు? తినకూడదా? ఇప్పుడు తినేశానే.. నన్ను ఏం చేస్తారో..??” భయం భయంగా అందరి వైపు చూస్తున్నాడు. ఖాసిం మళ్ళీ దగ్గరకు వచ్చాడు. ఖాళీ గ్లాసులో మంచినీళ్ళు పోసి – “తినూ..” అన్నాడు.

చిన్నా ఉలిక్కిపడి ప్లేట్‍లో చెయ్యిపెట్టాడు.. తినబుద్ధి కావటంలేదు...! తినక తప్పేట్టు లేదు..!! ఖాసిం అక్కడే నిలబడ్డాడు. ఇంకొక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు. ఖాసిం మరో టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు.
హోటల్లో ఏం జరుగుతోందో అర్థంకావటంలేదు చిన్నాకి. ఎవరివో రెండు కార్లు వచ్చి ఆగాయాయి. నలుగురు మనుషులు దిగారు. ఓనర్ కుర్చీలోంచి దిగి ఎదురెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. అతను అలా ఎదురెళ్ళడం ఎప్పుడూ చూడలేదు చిన్నా. వాళ్ళు వడివడిగా లోపలికి వచ్చేసి చుట్టూ కలియచూశారు. వాళ్ళలో ఒకరు నేరుగా వంటమాస్టర్ దగ్గరకి వెళ్ళి ఏదో మాట్లాడాడు. ఇక్కడ మిగిలిన ఇద్దరూ ఓనర్‍తో మాట్లాడుతున్నారు. చాలా సేపు అలా మాట్లాడుతూనే వున్నారు.

దోశ అయిపోయింది. లేచి వెళ్ళబోతుంటే ఖాసిం వచ్చి నిలబడ్డాడు. చిన్నా ఖాసిం వైపు చూడగానే అతను – “ఒక బూస్ట్” అంటూ అరిచాడు. “నాకు బూస్ట్ వద్దు..” అనబోయాడు చిన్నా. ఖాసిం అతనికి ఆవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.

కార్లలో వచ్చినవాళ్ళు అక్కడే కూర్చోని టిఫిన్ చేస్తున్నారు. చిన్నా బూస్ట్ తాగి, లేవాలా వద్దా అని సంశయిస్తూ అక్కడే కూర్చోని వుండిపోయాడు.

టిఫిన్‍లు కాఫీలు అయ్యాక వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే కార్లో వెళ్ళిపోయారు. ఖాసిం ఓనర్ దగ్గరకు వెళ్ళి అడిగాడు – 
“ఎవరు సార్..” అని.

“చైల్డ్ లేబర్ డిపార్ట్మెంటు... ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది..” అని చిన్నా వైపు తిరిగి – “ఏరా.. అయిపోయిందా.. ఫో.. లోపలికి తగలడు... ఆ కప్పులు, ప్లేట్లు త్వరగా కడుగు..” అరిచాడు. చిన్న ఒక్క ఉదుటున లేచి లోపలికి పరిగెత్తాడు.

“వచ్చినోళ్ళు ఎవరోగాని.. వాళ్ళ వల్లే ఈ రోజు మసాలా దోశ తిన్నాను” అనుకున్నాడు వాడు ఆనందంగా.

( స్వప్న మాసపత్రిక నిర్వహించిన సింగిల్ పేజీ కథలపోటీలో ఎంపిక అయ్యి, మే 2011 సంచికలో ప్రచురితం)