"పొద్దు"లో నా కథ: మంచినీళ్ళ బావి

తడి చుక్కలేని మధ్యప్రదేశ్ పల్లెటూర్లగుండా వెళ్తుంటే మనసు చివుక్కుమంది.. ఉజ్జైనిలో తొమ్మిది రోజులకు ఒకసారి మునిస్పాలిటీ నీళ్ళు వస్తున్నాయని పేపర్లో చదివి మనసు కలుక్కుమంది.. వెరసి "మంచినీళ్ళ బావి" అనే కథ పుట్టుకొచ్చింది.


ప్రముఖ అంతర్జాల తెలుగు పత్రిక "పొద్దు"లో ఈ కథను చదవి మీ అభిప్రాయం చెప్తారు కదు..!!

ఇందోర్‌కు వీడ్కోలు (ఆఖరుభాగం)

(ఇందోరు వదిలి వెళ్తూ నేను వ్రాసిన టపాలలో ఇది నాలుగొవది మరియు ఆఖరుది. మిగిలన భాగాలకి ఇక్కడ నొక్కండి - మొదటిది, రెండొవది, మూడొవది)

ఓంకారేశ్వర్

ఇందోర్ కి దగ్గరగా వున్న మరో ప్రముఖ శైవ క్షేత్రం ఓంకారేశ్వర్. పవిత్ర నర్మదా, కావేరిల సంగమంలో వున్న ఈ దేవాలయం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం చేరాలంటే నర్మదా నది దాటి అవతలి వైపుకు వెళ్ళాలి. అలా దాటించడానికి నడకదారిలో ఒక చిన్న వంతన వుంది. పడవలలో దాటించే సౌలభ్యం కూడా వుంది.
ఇక్కడ ప్రవహించే నర్మదా, కావేరి నదులు మధ్యలో వున్న భూభాగాన్ని ఓం ఆకారంలో విభజించాయి. అందువల్లే ఈ ప్రాంతానికి ఓంకారేశ్వరమని పేరు వచ్చింది.



ఇక్కడి మర పడవల్లో ఎక్కి ఈ ద్వీపాల చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) చేసేందుకు వీలుంది. అలా చేసేటప్పుడు చుట్టూ వున్న అనేక దేవాలయాలను చూడచ్చు. 11 శతాబ్దంలో గజనీ మొహమ్మదు దండయాత్రల్లో కొన్ని ధ్వంసమైనా ఇంకా ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రత్యేకించి ఇక్కడి శిల్పాలలో దక్షిణాది శైలి కనపడి ఆశ్చర్యం కలిగిస్తుంది.



ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా వున్న మహాశివుడి లింగాలను చూడండి:


సూర్యవంశానికి చెందిన మాంధాత, అంబరీషులు ఇక్కడ తపస్సు చేసి రెండు పర్వతాలుగా వెలిసారని అక్కడ పరమేశ్వరుడు తన జ్యోతిర్లింగాలని రెండు భాగాలుగా విభజించి ఓంకారేశ్వరుడిగా, అమలేశ్వరుడిగా అవతరించాడాని ప్రతీతి. ఇప్పటికీ ఇక్కడ రాజా మాంధాత గది, ఆయన సింహాసనం గుడి పక్కగా వుంది కాని అది ఈ మధ్యే తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడికి కొంత దూరంలో ఆదిశంకరుని గురువు గోవిద భగవత్పాదులు తపస్సు చేసినట్టుగా చెప్పబడే గుహ ఒకటి వుంది.



మన వైపు కార్తీకమాసం ఎంత ప్రధానమైనదో వుత్తరాదిన శ్రావణం (సావన్ అంటారు) అంతే ప్రధానమైనది. ఇక్కడి భక్తులు శ్రావణ సోమవారాలు, శ్రావణ పౌర్ణమి రోజున శివ దీక్షలు ధరించి పసుపు బట్టలతో కాలినడకన దర్శనానికి బయలుదేరుతారు. ఉజ్జైని శిప్రా నది నీళ్ళు తీసుకోని ఓంకారేశ్వరం చేరి అక్కడ అభిషేకించి, అక్కడి నర్మదా నీటితో తిరిగి వచ్చి ఉజ్జైనిలో మహా కాలుడికి అభిషేకం చేస్తారు. వీరికోసం ప్రత్యేకంగా దారి పొడవునా అనేక గ్రుహస్తులు, వ్యాపారులు మంచి నీరు, ఫలహారాలు సరఫరా చేస్తుంటారు. ప్రత్యేకించి శ్రావణ పౌర్ణమిరోజు ఈ రెండు క్షేత్రాలు పసువర్ణం పరుచుకోని కనిపిస్తాయి.


ఉజ్జైని, ఓంకారేశ్వర్‌లలో కనిపించే మరో విషయమేమంటే ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రశాంతతను గుర్తించి సన్యాసం స్వీకరించి "గోరా బాబా"లు గా స్థిరపడ్డారు..!!



ఇందోరులో వుంటూ నేను చూడలేక పోయిన కొన్ని ప్రదేశాలు

ఇక్కడికి 90 కి.మీ దూరంలో వున్న మహేశ్వరం ముందుగా చెప్పుకోవాలి. పురాణాల్లో చెప్పబడే కార్తవీర్యార్జునుడి ద్వారా నిర్మితమైన ఈ నగరం తరువాత తరువాత ఇందోరు రాష్ట్రాన్ని పరిపాలించిన అహల్యాబాయి హోల్కర్ రాజధానిగా కూడా వుండినది. నర్మదా తీరంలో వున్న ఈ నగరంలో ప్రసిద్ధ శివ మందిరంతో పాటు, పెద్ద కోట, నదీ స్నానానికి ఘాట్‌లు చూడాల్సినవని చెప్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే మహేశ్వరీ కాటన్ చీరలు చెప్పుకోదగ్గవి. 1978లో ఇక్కడి మహిళలకు స్వయం వుపాధి కోసం ప్రారంభించిన ఒక స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ఈ చీరల తయారి మొదలైంది. ఇక్కడి కోట మీద వున్న చిత్రాలనే డిజైన్‌గా మార్చి చీరలు నేస్తారట ఇక్కడ.

మధ్యప్రదేశ్ లో మరో ప్రముఖ స్థలం - ఖజురహో. వాత్సాయనుడి కామసూత్రాలకి శిల్ప రూపం ఇక్కడి దేవాలయం అని చాలా మందికి తెలిసే వుంటుంది.
ఖజురహో గురించి విషయం వచ్చింది కాబట్టి ఒక పిట్టకథ. ఆ మధ్య నేను వారణాసి వెళ్ళడనికి ఇందోరు నుండి నేరుగా విమాన సౌకర్యం లేక డిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వారణాసికి మరో విమానం అందుకోవాల్సి వచ్చింది. ఆ విమానం డిల్లీ నుంచి వారణాసి వెళ్ళి అక్కడి నుంచి ఖజురహో వెళ్తోంది. నాతో పాటే ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వయసులో పెద్దవాడు..అందునా మొహమదీయుడు.

"ఖజురహో అంటే వూరు పేరా విమానశ్రయం పేరా?" అడిగాడు.
"ప్రదేశమే.. మధ్యప్రదేశ్‌లో వుంది" చెప్పాను.
"అక్కడేమైనా గుడి వుందా?"
"అవును"
"ఏ దేవుడు" అడిగాడు. ఏం చెప్తాను.. పెద్దాయన.
"కామసూత్ర గురించి విన్నారా.. దానిలో వున్న విషయాలన్నీ శిల్పాలలో చెక్కించారు"
"గవర్న్మెంటు వొప్పుకుందా?"
"ఇప్పుడుకాదు సాహెబ్.. ఎప్పుడో రాజులకాలంలో కట్టించారు" చెప్పాను.
"ఆ రోజులే నయం.." అన్నాడు గడ్డం నెమురుకుంటూ. కొంచెం సేపటి తరువాత మరో ప్రశ్న వేశాడు -
"మరి వారణాసి నుంచి ఖజురహోకి ఫ్లైటేమిటి..? అదేమి లింకు?"
"అది ముక్తి.. ఇది రక్తి" చెప్పాను నేను.
సరే ఆ విషయం అక్కడే వదిలేయండి.. ఇక్కడికి దగ్గర్లోనే మహులో వున్న ఒక గుడిలో ప్రతిరోజు వేల సంఖ్యలో రామచిలుకలు వచ్చి వాలే విశేషం ఒకటి వుంది. ఇవన్నీ చూడటం సాధ్యపడలేదు. మరీ ముఖ్యంగా ఇక్కడి అడవిలో ప్రపంచానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా వుంచే పచ్‌మడి, మఢయి లాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవటం ఒక లోటే.

అయితే ఒక్క విషయం చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడూ ఇవన్నీ చూస్తానని అనుకోలేదు. ఎలాంటి ప్రయత్నం లేకుండనే దేశంలో ఎన్నో ప్రాంతాలు చూసేదుకు వీలు కలిగింది. 12 జ్యోతిర్లింగాలలో 8 చూడగలిగాను. అందులో కొన్ని రెండు మూడుసార్లు దర్శించుకున్నాను. కేరళ ప్రకృతిని, రాజస్థాన్ ఎడారిని, ఇటు బంగాళా ఖాతాన్ని అటు అరేబియా సముద్రాన్ని చూసి వచ్చాను. చూడలేదని అనుకున్నవి మళ్ళీ చూసే అవకాశం వస్తుందేమో.. చెప్పలేను. అయితే మరికొన్ని కొత్త ప్రదేశాలను చూడటానికి మరో కొత్త చోటికి మారుతున్నాను. అదేమిటో అక్కడ ఏం చూశానో త్వరలోనే చెప్తాను.. అంతవరకు శలవు.




ఇందోరుకు వీడ్కోలు (మూడోవ భాగం): గుళ్ళు గోపురాలు; ఉజ్జైని


ఇందోరులో చెప్పుకోదగ్గ ప్రదేశాలలో ఒకటి "బడా గణపతి" మందిర్. ప్రాచీనమైనది కాకపోయినా కేవలం పెద్దదైన ఆకారం కారణంగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మే దేవుడు ఖజరానా గణపతి. ఇది కూడా ఆధునుక దేవాలయమే కాని ఎందుకో బాగా ప్రసిద్ధి. ఇక్కడ చాలా మంది ఈ దేవుణ్ణి ప్రతి మంగళ బుధవారాల్లో దర్శించుకుంటారు.



ఈ దేవాలయం చుట్టు దాదాపు అందరు దేవుళ్ళ చిన్న చిన్న మందిరాలు వుంటాయి. ఇదుగో ఈ ఫోటో అక్కడిదే.


అలాగే గీతా భవన్, అన్నపూర్ణ మందిర్ కూడ బాగా పేరు పొందాయి.


ఇక ఇందోరు దగ్గర్లో వున్న దేవాలయాలలో అత్యంత ప్రముఖమైనది - ఉజ్జైని.





మనకి బాగా తెలిసిన ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయం, అలాగే అష్టాదశ (18) శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి ఇద్దరూ కలిసిన ప్రదేశం కావటమే ఈ ప్రాంతం విశిష్టత. కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి; శ్రీశైలంలో బ్రమరాంబా మల్లికార్జునులు మాత్రమే ఇలా కనిపిస్తారు.


ఉజ్జైనిలో మరో విశేషమేమంటే ఇక్కడ మహాకాలభైరవుడి మందిరం కూడా వుంది. ఇలా ముగ్గురు దేవతలు (మహాకాళుడు, మహాకాలి, భైరవుడు) క్షుద్ర పూజకి చెందిన వారు కావటంతో అలాంటి ప్రయత్నాలు చేసేవారు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.





చిన్నప్పుడు చందమామ కథల్లో మనం చదువుకున్న విక్రం-భేతాళ్ కథలు ఇక్కడికి సంబంధించినదే. ఇప్పటికి బర్తృహరి తపస్సు చేసినట్లు చెప్పబడే గుహలు కనిపిస్తాయి.




విక్రమార్కుడి సింహాసనం దొరికిన గుట్టకూడా ఇక్కడి సిప్రా నది మధ్యలో కనిపిస్తుంది. తదనంతరం భోజరాజు పరిపాలిచినట్లు కూడా చారిత్రక ఆధారాలు వున్నాయి.



సరే అసలు విషయానికి వస్తే - ఇక్కడున్న గుళ్ళు చాలా ప్రాచీనమైనవి. అందులో వున్న దేవతల మూర్తులు చూస్తేనే ఆ విషయం అర్థమౌతుంది. అక్కడి పద్దతులు కూడా అంతే విచిత్రంగా వుంటాయి. అవేంటో ఒక్కొక్కటి -



మహాకాలుడు ఇక్కడి ప్రధాన దేవుడు. ఈయనే మృత్యుంజయుడు కూడా. అపమృత్యు దోషం నివారణకోసం చాలామంది ఇక్కడికి వస్తారు. ఈయనకి తెల్లవారుఝామునే హారతి ఇస్తారు. అయితే ఇక్కడిచ్చే హారతి మామూలు దీప హారతి కాకుండా భస్మ ఆరతి అంటారు (వీడియో లింకు). ఈ భస్మం కూడా ఉజ్జైని శ్మశానం నుంచి తెచ్చిన శవభస్మం. అయితే ఇప్పుడు శవభస్మం వాడట్లేదనీ ఆవు పేడ పిడకల భస్మం వాడుతున్నారని కొందరు అంటారు.



కాల భైరవుడిది ఇంకొక ప్రత్యేకత - ఈయనకి నైవేద్యం సారాయి. గుడి ముందు నాటుసారా నించి మంచి బ్రాండు విస్కీలదాకా గుప్పు గుప్పున అమ్మకాలు సాగుతుంటాయి. "స్వామీ నా కోరిక తీర్చు.. నీకు మంచి స్కాచ్ పట్టిస్తా" అని మొక్కుకుంటుంటారు కొందరు.

ఇలా లోపలికి తీసుకెళ్ళిన సారాయి మన కళ్ళముందే దేవుడికి పట్టిస్తారు. లోపల దేవుడి నోటి దగ్గర చిన్న చీలక వుంటుంది. అందులో ఒక ప్లేటు లాంటిది పెట్టి సారాయి (నీటే..!) పోస్తారు. మన పానకాల స్వామిలాగ ఈయన మందు మొత్తం లోపలికి తీసుకుంటాడు. (మన పానకాల స్వామి కొంచెం వెనక్కి ఇస్తాడని ప్రతీతి. ఇక్కడ అదీ లేదు. పోసేటప్పుడే కొంచెం మిగిల్చి తీర్థంగా తిరిగిస్తారు)


ఇక మహాకాళి. ఆ గుడికి వెళ్తే అది ఒక అష్టాదశ పీఠమని అనిపించనే అనిపించదు. చాలా సాదాసీదా గుడి. కాళిదాసుని కరుణిచిన కాలిక ఈమే. అక్కడికి కొంచెం దూరంలో హరిసిద్ధీ మాత ఆలయం వుంది. విక్రమార్కుడు కొలిచిన దేవత, భట్టి తన ప్రాణార్పణ చేసి సాహసం ప్రదర్శించి అమ్మవారిని మెప్పించిన గుడి. ఆ పక్కన కర్కాటకేశ్వరుడి గుడి (తమాషా ఏమిటంటే కర్కాటక రేఖ సరిగ్గా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. ఇక్కడికి దగ్గర్లో ఒక పల్లెటూరిలో సంవత్సరంలో ఒకరోజు సూరుడు సరిగ్గా తల మీద చేరటంతో నీడలు మాయమౌతాయని చెప్పుకుంటారు).

ఇవి కాక శ్రీరాముడు అరణ్యవాసంలో దశరధ మరణవార్త విని తర్పణాలు వదిలిన శిప్రా నది, కుజదోషం వున్నవారు విషేష పూజలు జరిపించే మగళనాథుని గుడి, బర్తృహరి గుహలు, శ్రీకృష్ణుడు, కుచేలుడితో సాందీపముని దగ్గర విద్యనభ్యసించిన ఆశ్రమం ఇవన్నీ వున్నాయి చూడటానికి.

ఉజ్జైనికి సంబంధించిన మరో విశేషమేమంటే ఇక్కడ మహాకాలుడే మహారాజు. అందువల్లే ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఇక్కడ బస చేసేవారు కాదు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చే మంత్రులు, ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏలు, ఇతర అధికార యంత్రాంగం రాత్రిళ్ళు ఇక్కడ బస చెయ్యరు.
జై మహాకాల్

ఇందోరుకు వీడ్కోలు - రెండొవభాగం: రాజవాడ - దాల్ బాఫ్లే

నిన్నటి టపాలో ఇందోర్ సరాఫాలో దొరికే పానీయాల గురించి చెప్తూ షికంజీ అన్నాను గుర్తుందా? దాని గురించి ఓ కథ:

షికంజీ అనేది ఇందోరులో మాత్రమే దొరికే ఒక పానీయం. మన లస్సీ కన్నా చిక్కగా వుంటుంది. పాలు, పెరుగు కలిపి చేస్తారు. ఇలాంటి సరికొత్త రకం పానీయం కనిపెట్టింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తే నాగోరి అనే కుటుంబంవాళ్ళని తెలిసింది. వాళ్ళ షాపు సరాఫాలోనే వుంటుంది.. అయితే ఎప్పుడూ మూసేసి వుంటుంది..!! ఏమిటని అడిగితే -

"వాళ్ళ షాపులో సరుకు అయిపోయింది.. రోజు వుదయం పదకొండు గంటలకి తెరుస్తాడు..మధ్యాహ్నానికి అయిపోతుంది" అని చెప్పారు.

సరే కదా అనుకొని ఒకరోజు ఒంటిగంటప్పుడు అక్కడికి వెళ్ళాను. అప్పటికి షాపు తెరిచేవుంది. లోపలికి వెళ్ళేసరికి రెండు మూడు గంగాళాలు కడుగుతున్నారు. ఏమిటంటే - "షికంజీ అయిపోయింది.." అన్నారు.

"పోని లస్సీ"

"ఏమి లేదు సార్.. అన్నీ అయిపోయాయి" చెప్పాడతను.

పదకొండుకు షాపు తెరిస్తే ఒంటిగంటకు అయిపోయింది. రోజుకి రెండుగంటల వ్యాపారం..!! తరువాత వేరే ఒకటి రెండుచోట్ల షికంజి తాగాను కానీ నాగోరి దగ్గర తాగలేదు అని లోటు వుండిపోయింది. చూద్దాం ఇందోరు వదిలే లోపల తాగి తీరుతాను..!

అసలు ఈ రాజవాడ ప్రాంతంలో ఇలాంటివి చాలా వున్నాయి. ఒక చోట కచోరి మరో చోట పాన్ షాపులో పాన్ - (ఈ పాన్ షాపుకు షట్టర్లు వుండేవి కాదు.. ఇరవై నాలుగు గంటలు తెరిచే వుంచేవాడు. కుటుంబసభ్యులు షిఫ్టు డ్యూటీలు చేసేవారట. ఈ మధ్య పోలీసుల పుణ్యమా అని రాత్రి పన్నెండు నించి నాలుగు దాకా మూస్తున్నారు.) అసలింతా ఈ రాజవాడా ఏమిటయ్యా అంటే - ఇందోరు నగరాన్ని పాలించిన అహల్యా బాయి హోల్కరు వారి వశీకులు కట్టించిన భవనం.


ఈ భవనంలో శివ భక్తురాలైన అహల్యా బాయి హోల్కర్ వుంటూ రాజ్యపాలన చేసింది. ఇప్పుడు కనిపించే భవనాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు.

లోపల శిల్పాలు, శివ మందిరం ఆకట్టుకుంటాయి.

ఈమె పూజలో వుండే నవరత్న సాలగ్రామం ఒకసారి దొంగలు దోచుకెళ్ళి మళ్ళీ తెచ్చి యధాస్థానంలో పెట్టేశారట.


ఈ భవనం చుట్టూ వుండే వీధుల్లో రకరకాల వస్తువులు అమ్ముతుంటారు. ఒక వీధంతా స్టీలు సామాన్లు (బర్తన్ బజార్), ఒక వీధంతా చీరలు (కపడా బజార్) మరో వీధంతా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాగన్నమాట. సాయంత్రంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోని, సరాఫాలో తినేసి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ.

ఈ సరాఫా వెనుకే పృథ్వీలోక్ అనే ఒక రెస్టారెంట్ వుంది. ఇక్కడ రోజు పెట్టే థాళి కన్నా ఆదివారం నాడు పెట్టే దాల్ బాఫ్లే ప్రత్యేకమైంది. బాఫ్లే అనేది ఈ ప్రాంతంలో ప్రముఖంగా తయారు చేసే ప్రత్యేక వంటకం. మన సంకటి లాగా పూర్వపు వంట. పట్టణాలలో అరుదుగా దొరుకుతుంది. దీని తయారి గురించి చెప్పేదా? - వినండి -

దాల్ అంటే తెలుసుగా మన పప్పు లాంటిదే.. కాకపోతె కొంచెం పల్చగా చేస్తారు.

ఇక బాఫ్లే -

కావల్సిన పదార్థాలు:


గోధుమ పిండి (రొట్టలకు చేసే పిండి కన్నా గరుకుగా వుంటుంది)
వుప్పు వగైరాలు
ఆవు పేడ పిడకలు - లేదా బొగ్గులు - లేదా మైక్రో ఓవెన్
ప్రజర్ కుక్కర్

విధానం:

పిండి సరిపడ వుప్పు కొంచెం నీళ్ళు, కొంచెం నెయ్యి వేసి అరచేతిలో పట్టేంత వుండలుగా చేయ్యాలి. వాటిని వుప్పు నీటిలో కొంచెం వుడకబెట్టి (మూడు విజిల్స్) ఆ తరువాత కాలుతున్న పిడకల్లోనో బొగ్గుల్లోనో ఓవెన్లోనే గట్టిపడే దాకా కాలుస్తారు.


ఆ తరువాత వాటిని బాగా కాచిన నేతిలో వేస్తారు (అవును నేతిలోనే..!!) అవి నేతిలో వూరిన తరువాత తీసి ప్లేట్లో పెట్టి దాల్‌తో పాటుగా ఇస్తారు.


తినే విధానం:


ఆ వుండలను రెండు చేతులతో ముక్కలు చేసి.. పొడి పొడిగా నలిపి దానిమీద దాల్ కుమ్మరించడమే.. సిమెంటులో నిళ్ళు పోసినట్టు.. బాఫ్లే దాల్ పీల్చేస్తూ వుంటే మరి కొంచెం.. మరికొంచెం దాల్ పోస్తూ వెళ్ళాలి. ఆ తరువాత దానితోపాటు ఇచ్చే వెల్లుల్లి పచ్చడి నజుకుంటూ, పచ్చి మిరపకాయలు, వుల్లిపాయలు కొరుక్కుంటూ తినెయ్యడమే.

చట్టబద్దమైన హెచ్చరిక:

1. సామాన్యమైన బ్యాటింగ్ చేసేవాళ్ళు రెండు కన్నా ఎక్కువ బాఫ్లేలు తినలేరు.. ప్రయత్నిచవద్దు.

2. తిన్న దగ్గరనుంచి విపరీతంగా దాహమెయ్యడం.. విపరీతంగా నిద్ర రావటం.. రాత్రికి ఆకలెయ్యకపోవటం సర్వ సాధారణం. దీనికి తోడుగా రెండు గ్లాసులు జల్‌జీరా తాగితే ప్రయోజనం వుండచ్చు.

3. ఒక్కొక్క బాఫ్లేతోపాటు ఎంత నెయ్యి లోపలికి వెల్తుందో చెప్పలేం కాబట్టి బరువు పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇదే వంటకాన్ని కొంచెం మార్పులతో దాల్ భాటి అని గుజరాత్, రాజస్థాన్‌లలోనూ - లిట్టీ పేరుతో ఉత్తర్ ప్రదేశ్‌లోనూ తయారు చేస్తారు. ఉత్తర్ ప్రదేశ్‌లో దీన్ని చౌకా (మన కాల్చిన వంకాయ పచ్చడి లాంటిది) తో ఇస్తారు ఇలాగ -

ఇక్కడికి కల్నరీ టూరిజం (culinary tourism) అయిపోయింది. తరువాత టపాలో దగ్గర్లో పర్యాటక స్థలాల గురించి చెప్తాను..

ఇండోరుకు వీడ్కోలు మొదటిభాగం - సరాఫా

నాకు ఇందోరు నుంచి బదిలీ దాదాపు ఖరారైపోయింది. అసలు ఈ కార్పొరేట్ వుద్యోగాలే అంత. మా గురు మామయ్య కూడా ఇలాంటి కష్టాలవల్లే అనుకుంటా ఈ మధ్య కథలు చెప్పటంలేదు. విషయం ఏమిటంటే నేను ఈ కంపెనీలో చేరి ఐదొవ సంవత్సరం అవుతోంది.. ఐదొవ వూరుకి బదిలీ జరుగుతోంది. హైదరాబాదుతో మొదలెట్టి, చెన్నై, బాంబే మీదుగా ఇండోరు చేరుకోని ఇప్పుడు - మరో వూరు. అది ఏ వూరు ? త్వరలోనే చెప్తాను..!!


సరే ఇందోరు వదిలిపెట్టే ముందు ఇక్కడి విశేషాలు, దగ్గర్లో చూడదగ్గ ప్రదేశాలు (నేను చూసిన ప్రదేశాలు అని చదువుకోండి) గురించి ఓ రెండు మాటలు - కాదూ రెండు టపాలు చెప్పాలని ఈ టపా మొదలు పెట్టాను.



మీకు తెలుసుగా ఇందోరు మధ్యప్రదేశ్‌లో వుందని.. వూరు చూస్తే రాజధాని నగరంలా వుంటుందికాని - రాష్ట్ర రాజధానికి దాదాపు 200 కి.మీ దూరం. మన కృష్ణా జిల్లాకి విజయవాడ ఎట్లాగో మ.ప్ర.కి ఇందోరు అలాగా. భోపాలులో అన్నీ గవర్నమెంటు ఆఫీసులేకాని ఒక్క మాల్ లేదు, ఒక్క మల్టీప్లెక్సు లేదు. అదే ఇందోరులో అయితే ఒక ఐదుకు తగ్గకుండా పెద్ద పెద్ద మాల్‌లు, ఒక నాలుగు మల్టీప్లెక్సులు వున్నాయి. ఇంకా చాలా పుట్టుకొస్తున్నాయి. హోటళ్ళు, కాలేజిలు ఏవి చూసినా భోపాల్‌కి కన్నా ఓ రెండాకులు ఎక్కువే. అందుకేనేమో ఇందోరుని మిని బాంబే అంటారిక్కడ.


ఇందోరు దేనికి ప్రసిద్ధి అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పగలిగేది "సేవ్" అని ఇక్కడ పిలిచే మన శనగపిండి కారాసు లాంటివి. ఇంకా రత్లామి సేవ్ అనీ, హీంగ్ సేవ్ అని రకరకాల వెరైటీలు కూడా దొరుకుతాయి. (ఆ మధ్య హైదరాబాద్‌లో ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో ఒక చోట ఇందోరి సేవ్ అమ్ముతుండటం చూశాను..) అదలా పక్కన పెడితే ఇందోరులో చిరు తిండ్లు కూడా చాలా ప్రసిద్ధి.



"చెప్పన్ దుకాణే" అని ఒక ప్రాంతం పేరు. అక్కడ యాభై ఆరు (చప్పన్ అంటే 56) దుకాణాలలో కేవలం చిరుతిండ్లు అమ్ముతారు - కచోరి, సమోస, సాండ్‌విచ్, పాని పతాషే (పాని పూరి), చోలె కట్లెట్, చోలే భతూరే... ఇలాంటి వుత్తరాది వంటకాలే కాక చైనీస్, సౌత్ఇండియన్ కూడ దొరుకుతాయి. సాయంత్రం ఆరునుంచి రాత్రి పదకొండుదాక వేడి వేదిగా అమ్మకాలు సాగుతుంటాయి.

అంతకన్నా ముఖ్యమైంది, ఇందోరు వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం రాజవాడ వెనక వున్న సరాఫా అనే ప్రాంతం. పగటిపూట ఇక్కడంతా బంగారు, వెండి నగల దుకాణాలతో కోలాహలంగా వుంటుంది. రాత్రి ఏడు దాటగానే ఒక్కొక్క దుకాణం మూతపడాగానే దాని ముందొక తాత్కాలిక షాపు తయారవుతుంది. చాలా వరకు బంగారం కొట్టుకు సంబంధించినవాళ్ళో, ఆ షాపు మెట్లని అద్దెకి తీసుకున్నవాళ్ళో ఇలాంటివి మొదలు పెడతారు. మునుపు రాత్రి మూడు దాకా నడిచే ఈ బజారు ఇప్పుడు పోలీసు ఆజ్ఞలకు పన్నెండు గంటలకే మూతపడుతోంది.


ఇందోరు ప్రజలు మరి భోజనం చేసి వస్తారో, ఇదే భోజనంగా వస్తారో కాని ఏ రోజు వచ్చినా ఇసుకేస్తే రాలని జనం వుంటారు. రకరకాల రంగు లైట్లు, అమ్మేవాళ్ళ అరుపులు, జనరేటర్ చప్పుళ్ళు, చిన్న పిల్లల బొమ్మలు అమ్మేవాళ్ళు వూదే పీకల కూతలు, ఇరుకు జనం మధ్యలోనించీ దూసుకెళ్తూ స్కూటర్ల హారన్‌లు.. అది రాత్రంటే నమ్మటం కష్టమే.


ఆ ప్రాంతంలో అడుగుపెట్టాక ఒక పది అడుగుల తరువాత కనిపించే "జోషి కా దహీ వడా" ప్రత్యేకమైంది, చెప్పుకోదగ్గది. "నాదేముది సార్.. నేను వడా అమ్మేది తక్కువ.. మాటలు అమ్మేది ఎక్కువ" అంటూ నవ్వుతాడుగాని, సదరు జోషిగారు చేసే దహీ వడా ఇంతవరకూ నేను తిన్న దహీ వడల్లోకెల్లా వుత్తమమైనది.


మనలాంటి వాళ్ళని చూడగానే "తెలుగా? తమిళా?" అని అడిగేస్తాడు. "తెలుగు" అనగానే "రండి కూర్చోండి.. దహీ వడా తింటారూ? ఎన్ని? ఒకటి రెండు మూడూ?" అంటాడు తెలుగులో వచ్చిన నాలుగు వాక్యాలు అప్పజెప్తూ. ఈ వడా మన తెలుగువాళ్ళు చేసే ఆవడ లాంటిదికాదు - పిండి అదే అయినా వడలను ముద్దగా చేసి నూనెలో వేయించిన తరువాత నీళ్ళలో నానపెడతారు. కావాలన్నప్పుడు ఆ వడని పిండి చిన్న దొన్నెలో పెట్టి దానిలో పెరుగు (తియ్యటిది) దానిపైన చింతపండు చెట్నీ, వుప్పు, కారం, మసాల, నల్ల వుప్పు వేసి ఇస్తారు.

ఇది మాములుగా ఎవరైనా చేసేదే.. మన జోషి మాత్రం పెరుగు వెయ్యగానే వున్నట్టుండి ఆ దొన్నెను పైకి గాలి లోకి విసురుతాడు. చిత్రంగా తిరుగుతూ అది రెండో చేతిలో వచ్చి పడుతుంది. "ఒక్క చుక్క పెరుగు కూడా వొలకలేదు చూసుకోండి" అంటాడు. ఆ తరువాత దొన్నె మనచేతిలో పెట్టి, వరసగా వుప్పు, కారం, మసాల, నల్ల వుప్పు గిన్నెల్లో చెయ్యి పెడతాడు. అన్ని అతని బొటన వేలికి, మిగిలిన నాలుగు వేళ్ళకి మధ్యలో వుంటాయి. అప్పుడే మన దొన్నెపైన చెయ్యిపెట్టి - "ఇది వుప్పు, ఇది కారం, ఇది మసాలా.." అంటూ ఒక్కొక్క వేలు తీస్తుంటే సరిగ్గా ఉప్పు, కారం, మసాల మాత్రమే దొన్నెలో పడతాయి.


"ఎంతకాలం నించి ఇక్కడ వున్నారు?" అంటే "మా తాత కూడా ఇక్కడే అమ్మేవాడు. అంతకు ముందు ఎంతమంది అమ్మారో తెలియదు.. అప్పుడు అదుగో ఆ కోటలో (పక్కనే రాజవాడా కోట) నవాబులు పోషించారు.. ఇప్పుడు మీలాంటి మహరాజులు పోషిస్తున్నారు" అంటాడు.

"మాటలు మాత్రం బాగా చెప్తావు.." అంటే"మా నాన్న ఏమి మాట్లాడే వాడు కాదు. దహీ వడా రుచిగా వుంటుంది కాబట్టి.. ఇప్పుడు నాకు వడా చెయ్యటం రాదు కాబట్టి ఇలా మాటలు చెప్పడం నేర్చుకున్నాను." అని నవ్వేస్తాడు.
నమ్మకండి. అంతా అబద్ధం. దహీవడా మొదటి చెంచా నోట్లో పెట్టుకోగానే అప్రయత్నంగా "వాహ్.. క్యా బాత్ హై" అంటారు.


ఇంక అక్కడి నుంచి మొదలు. ముందుకెల్తే బుట్టే కి కీస్ అనే ఒక వెరైటీ కనిపిస్తుంది. మొక్క జొన్న విత్తులని పాలలో మెత్తగా వుడకబెట్టి గట్టిగా అయ్యాక దాని మీద మసాల చల్లి, నిమ్మకాయ పిండి ఇస్తారు.

మరో చోట సాబు దానే కి కిచిడి - సగ్గు బియ్యంతో చేసిన కిచిడి. కొంచెం కారం ఎక్కువగా వుంటుంది కాని.. అదేంటో ఒక ప్లేటు తింటే సరిపోయినట్లు అనిపించదు. ఇవి కాక దోసిలి వెడల్పు జిలేబీలు, మాల్ పూరి, గులాబ్ జామున్ లాంటి స్వీట్లు, లస్సీ, బాసుంది, షికంజీ లాంటి పానీయాలు.. మీరే చూడండి..!!


(మరికొన్ని విశేషాలు తరువాతి టపాలో)

కాశీకి పోయాను రామాహరి..!!

అవునండి.. అనుకోకుండా ఆఫీస్ పనిమీద కాశికి వెళ్ళే అవకాశం కలిగింది. వుద్యోగరీత్యా ప్రస్తుతమున్న ఇండోర్ నుంచి దక్షిణాదికి వచ్చే ప్రయత్నాలేవి ఫలించకపోగా, ఇంకొంచెం వుత్తరానికి బదిలీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కారణాల దృష్ట్యా ఈ వారం ఆంధ్రప్రదేశ్ రావాల్సింది రాలేకపోయాను. కొత్తగా చేపట్టబోయే బాధ్యతలలో ఉత్తర్‌ప్రదేశ్ కూడా వుండటంతో, మొన్న వారణాసి వెళ్ళాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళకపోగా ఈ వుత్తారాది కష్టాలేమిటి" అన్న మా ఆవిడతో - "దేవి..! కష్టములెట్లున్ననూ పరమ పావనమగు వారాణాసి క్షేత్రము దర్శించుటకు వీలాయకదా.." అంటూ ప్రయాణమయ్యాను.


అక్కడ పని వత్తిడి వున్నా, ఎలాగో వీలు చేసుకోని గంగా తీరానికి, విశ్వేశ్వర, అన్నపూర్ణ దర్శనానికి వెళ్ళగలిగాను. భద్రత దృష్ట్యా ప్రధాన ఆలయం దగ్గరకి సెల్‌ఫోనులు, కెమెరాలు అనుమతించలేదు. కాబట్టి ఈ సారికి "కాశికి పోయానును రామా హరి.. గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి.." అంటూ ఇదుగో గంగమ్మ చిత్రాలు...!! కొన్ని కబుర్లు..!!




ప్రహ్లాద ఘాట్‌తో మొదలై అస్సీ ఘాట్‌తో ముగిసే ఎనభై ఘాట్‌లలో రెండు మూడు ఘాట్‌లు చూడగలిగాను. శవదహనాలు జరిగే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లు చూడలేకపోయాను.





గంగా స్నానం చెయ్యలేకపోయినా ఇలా చేసేవాళ్ళను చూసి సంబర పడ్డాను.




వారణాశి గంగ వొడ్డున తప్పక కనిపించేవి ఈ తాటాకు/వెదురు గొడుగులు. వీటికింద కూర్చోనే పండారీలు తర్పణాలు, పిండప్రదానాలు చేయిస్తుంటారు..!!






ఇంకా వారణాసిలో చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా వున్నాయి.. సంకటమోచన్ హనుమాన్, బనారస్ హిందూ యూనివర్సిటి.. ఇంకా బాల్య వివాహం తరువాత విధవలై ఇక్కడికి చేరినవారు, కాశిలో మరణిస్తే మోక్షం కలుగుతుందని ఇక్కడి సత్రాలలో వుంటూ చావుకోసం ఎదురుచూసే ముసలి వాళ్ళు.. గంగ వొడ్డున సాయంత్రం జరిగే హారతులు.. బనారస్ పట్టు చీరలు, బనారస్ పాన్... ఎన్నో విశేషాలు, కథలు..!! ముందు ముందు మళ్ళీ వారణాసి వచ్చే అవకాశం వుంది కాబట్టి.. ఈ సారి మరింత తీరిగ్గా రావాలనుకుంటూ తిరుగు టపా కట్టాను..!!




అక్కడ ఒక మిత్రుడు చెప్పిన మాట -


"రాండ్, సాండ్, సీడి, సన్యాసి

ఇన్‌సే బచ్‌పాయే తో భవ్య కాశీ"


అంటే -


"రాండ్ అంటే మన గీరీశం చెప్పిన "యంగ్ విడోస్", అందునా తప్పుదోవ పట్టినవాళ్ళు అన్నమాట, సాండ్ అంటే "అచ్చోసిన ఆంబోతులు" శైవ క్షేత్రంలో వాటికి అడ్డేముంది.. సీడి అంటే మెట్లు - ఎనభై ఘాట్లలో ఎన్నో మెట్లు - కొన్ని పాచి పట్టి జారేవైతే కొన్ని ఎదురు తగిలేవి.. ఇక సన్యాసి - ఇక్కడి సన్యాసులు చాలా ప్రమాదకరం. చాలా మందికి తెలుగు, తమిళ భాషలు తెలుసు.. నయానో, భయానో - భయపెట్టో భక్తి పెట్టో డబ్బు గుంజగల సమర్థులు. కాబట్టి ఇలాంటివన్నీ తప్పించుకోగలిగితే కాశీని మించిన గొప్ప క్షేత్రం లేదు.." అని


హర హర మహాదేవ..!!