ఇందోర్‌కు వీడ్కోలు (ఆఖరుభాగం)

(ఇందోరు వదిలి వెళ్తూ నేను వ్రాసిన టపాలలో ఇది నాలుగొవది మరియు ఆఖరుది. మిగిలన భాగాలకి ఇక్కడ నొక్కండి - మొదటిది, రెండొవది, మూడొవది)

ఓంకారేశ్వర్

ఇందోర్ కి దగ్గరగా వున్న మరో ప్రముఖ శైవ క్షేత్రం ఓంకారేశ్వర్. పవిత్ర నర్మదా, కావేరిల సంగమంలో వున్న ఈ దేవాలయం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం చేరాలంటే నర్మదా నది దాటి అవతలి వైపుకు వెళ్ళాలి. అలా దాటించడానికి నడకదారిలో ఒక చిన్న వంతన వుంది. పడవలలో దాటించే సౌలభ్యం కూడా వుంది.
ఇక్కడ ప్రవహించే నర్మదా, కావేరి నదులు మధ్యలో వున్న భూభాగాన్ని ఓం ఆకారంలో విభజించాయి. అందువల్లే ఈ ప్రాంతానికి ఓంకారేశ్వరమని పేరు వచ్చింది.



ఇక్కడి మర పడవల్లో ఎక్కి ఈ ద్వీపాల చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) చేసేందుకు వీలుంది. అలా చేసేటప్పుడు చుట్టూ వున్న అనేక దేవాలయాలను చూడచ్చు. 11 శతాబ్దంలో గజనీ మొహమ్మదు దండయాత్రల్లో కొన్ని ధ్వంసమైనా ఇంకా ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రత్యేకించి ఇక్కడి శిల్పాలలో దక్షిణాది శైలి కనపడి ఆశ్చర్యం కలిగిస్తుంది.



ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా వున్న మహాశివుడి లింగాలను చూడండి:


సూర్యవంశానికి చెందిన మాంధాత, అంబరీషులు ఇక్కడ తపస్సు చేసి రెండు పర్వతాలుగా వెలిసారని అక్కడ పరమేశ్వరుడు తన జ్యోతిర్లింగాలని రెండు భాగాలుగా విభజించి ఓంకారేశ్వరుడిగా, అమలేశ్వరుడిగా అవతరించాడాని ప్రతీతి. ఇప్పటికీ ఇక్కడ రాజా మాంధాత గది, ఆయన సింహాసనం గుడి పక్కగా వుంది కాని అది ఈ మధ్యే తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడికి కొంత దూరంలో ఆదిశంకరుని గురువు గోవిద భగవత్పాదులు తపస్సు చేసినట్టుగా చెప్పబడే గుహ ఒకటి వుంది.



మన వైపు కార్తీకమాసం ఎంత ప్రధానమైనదో వుత్తరాదిన శ్రావణం (సావన్ అంటారు) అంతే ప్రధానమైనది. ఇక్కడి భక్తులు శ్రావణ సోమవారాలు, శ్రావణ పౌర్ణమి రోజున శివ దీక్షలు ధరించి పసుపు బట్టలతో కాలినడకన దర్శనానికి బయలుదేరుతారు. ఉజ్జైని శిప్రా నది నీళ్ళు తీసుకోని ఓంకారేశ్వరం చేరి అక్కడ అభిషేకించి, అక్కడి నర్మదా నీటితో తిరిగి వచ్చి ఉజ్జైనిలో మహా కాలుడికి అభిషేకం చేస్తారు. వీరికోసం ప్రత్యేకంగా దారి పొడవునా అనేక గ్రుహస్తులు, వ్యాపారులు మంచి నీరు, ఫలహారాలు సరఫరా చేస్తుంటారు. ప్రత్యేకించి శ్రావణ పౌర్ణమిరోజు ఈ రెండు క్షేత్రాలు పసువర్ణం పరుచుకోని కనిపిస్తాయి.


ఉజ్జైని, ఓంకారేశ్వర్‌లలో కనిపించే మరో విషయమేమంటే ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రశాంతతను గుర్తించి సన్యాసం స్వీకరించి "గోరా బాబా"లు గా స్థిరపడ్డారు..!!



ఇందోరులో వుంటూ నేను చూడలేక పోయిన కొన్ని ప్రదేశాలు

ఇక్కడికి 90 కి.మీ దూరంలో వున్న మహేశ్వరం ముందుగా చెప్పుకోవాలి. పురాణాల్లో చెప్పబడే కార్తవీర్యార్జునుడి ద్వారా నిర్మితమైన ఈ నగరం తరువాత తరువాత ఇందోరు రాష్ట్రాన్ని పరిపాలించిన అహల్యాబాయి హోల్కర్ రాజధానిగా కూడా వుండినది. నర్మదా తీరంలో వున్న ఈ నగరంలో ప్రసిద్ధ శివ మందిరంతో పాటు, పెద్ద కోట, నదీ స్నానానికి ఘాట్‌లు చూడాల్సినవని చెప్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే మహేశ్వరీ కాటన్ చీరలు చెప్పుకోదగ్గవి. 1978లో ఇక్కడి మహిళలకు స్వయం వుపాధి కోసం ప్రారంభించిన ఒక స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ఈ చీరల తయారి మొదలైంది. ఇక్కడి కోట మీద వున్న చిత్రాలనే డిజైన్‌గా మార్చి చీరలు నేస్తారట ఇక్కడ.

మధ్యప్రదేశ్ లో మరో ప్రముఖ స్థలం - ఖజురహో. వాత్సాయనుడి కామసూత్రాలకి శిల్ప రూపం ఇక్కడి దేవాలయం అని చాలా మందికి తెలిసే వుంటుంది.
ఖజురహో గురించి విషయం వచ్చింది కాబట్టి ఒక పిట్టకథ. ఆ మధ్య నేను వారణాసి వెళ్ళడనికి ఇందోరు నుండి నేరుగా విమాన సౌకర్యం లేక డిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వారణాసికి మరో విమానం అందుకోవాల్సి వచ్చింది. ఆ విమానం డిల్లీ నుంచి వారణాసి వెళ్ళి అక్కడి నుంచి ఖజురహో వెళ్తోంది. నాతో పాటే ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వయసులో పెద్దవాడు..అందునా మొహమదీయుడు.

"ఖజురహో అంటే వూరు పేరా విమానశ్రయం పేరా?" అడిగాడు.
"ప్రదేశమే.. మధ్యప్రదేశ్‌లో వుంది" చెప్పాను.
"అక్కడేమైనా గుడి వుందా?"
"అవును"
"ఏ దేవుడు" అడిగాడు. ఏం చెప్తాను.. పెద్దాయన.
"కామసూత్ర గురించి విన్నారా.. దానిలో వున్న విషయాలన్నీ శిల్పాలలో చెక్కించారు"
"గవర్న్మెంటు వొప్పుకుందా?"
"ఇప్పుడుకాదు సాహెబ్.. ఎప్పుడో రాజులకాలంలో కట్టించారు" చెప్పాను.
"ఆ రోజులే నయం.." అన్నాడు గడ్డం నెమురుకుంటూ. కొంచెం సేపటి తరువాత మరో ప్రశ్న వేశాడు -
"మరి వారణాసి నుంచి ఖజురహోకి ఫ్లైటేమిటి..? అదేమి లింకు?"
"అది ముక్తి.. ఇది రక్తి" చెప్పాను నేను.
సరే ఆ విషయం అక్కడే వదిలేయండి.. ఇక్కడికి దగ్గర్లోనే మహులో వున్న ఒక గుడిలో ప్రతిరోజు వేల సంఖ్యలో రామచిలుకలు వచ్చి వాలే విశేషం ఒకటి వుంది. ఇవన్నీ చూడటం సాధ్యపడలేదు. మరీ ముఖ్యంగా ఇక్కడి అడవిలో ప్రపంచానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా వుంచే పచ్‌మడి, మఢయి లాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవటం ఒక లోటే.

అయితే ఒక్క విషయం చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడూ ఇవన్నీ చూస్తానని అనుకోలేదు. ఎలాంటి ప్రయత్నం లేకుండనే దేశంలో ఎన్నో ప్రాంతాలు చూసేదుకు వీలు కలిగింది. 12 జ్యోతిర్లింగాలలో 8 చూడగలిగాను. అందులో కొన్ని రెండు మూడుసార్లు దర్శించుకున్నాను. కేరళ ప్రకృతిని, రాజస్థాన్ ఎడారిని, ఇటు బంగాళా ఖాతాన్ని అటు అరేబియా సముద్రాన్ని చూసి వచ్చాను. చూడలేదని అనుకున్నవి మళ్ళీ చూసే అవకాశం వస్తుందేమో.. చెప్పలేను. అయితే మరికొన్ని కొత్త ప్రదేశాలను చూడటానికి మరో కొత్త చోటికి మారుతున్నాను. అదేమిటో అక్కడ ఏం చూశానో త్వరలోనే చెప్తాను.. అంతవరకు శలవు.




4 వ్యాఖ్య(లు):

Bhãskar Rãmarãju చెప్పారు...

శివలింగాలు అత్భుతంగా ఉన్నాయ్ సోదరా. అలానే ఓంకారేశ్వర్...ఒక శివలింగం మాకు పంపవచ్చుగా. ఠ్క్కున కొనుక్కునేలా ఉన్నాయ్...

పానీపూరి123 చెప్పారు...

వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా
- ఆదిభట్ల కామేశ్వర శర్మ

> మీకు శర్మ గారు తెలుసా?

Unknown చెప్పారు...

భాస్కర్‌గారు,

కొనుక్కోవడం చిటికెలోపని.. కొలుచుకోవటమే కష్టం..

పానిపూరి,

ఈ కవిత ఎక్కడో అంతర్జాలంలోనె చూశాను, నచ్చి (నాకు బాగా అన్వయం అవుతోందని)బ్లాగులో పెట్టుకున్నాను. అప్పటికి ఇది వ్రాసిన వారెవరో నాకు తెలియదు. నా బ్లాగు చూసిన తరువాత ఆవకాయ.కాం ఎడిటర్ రఘోత్తమరావుగారు ఈ పద్యం శ్రీ ఆదిభొట్ల కామేశ్వర శర్మ గారిదని చెప్పారు. అప్పుడే పద్యానికి పేరు జోడించాను.. వారితో పరిచయ భాగ్యం కలగలేదు..!!

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగుంది.
మీ జీవన ప్రస్థానంలో అఖండ శుభములు కలుగుగాక.