పరపతి"ఏవమ్మా వెంకటలక్ష్మీ! మీ వారేరీ? రాలేదా?’’ అడిగింది వసంత.
‘‘ఎక్కడ అక్కయ్యా! ఆఫీసు పనుల్లో తీరిక చిక్కితేనా?’’ అంటూ సర్ది చెప్పింది వెంకటలక్ష్మి.

ఆమె మనసులో మాత్రం భర్తమీద కోపంగానే ఉంది. రెండు రోజులు సెలవులు కూడా కలిసొచ్చాయి కదా. వస్తే ఆయన సొమ్మేం పోయింది. ‘పెళ్లీడుకొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఇలాంటి ఫంక్షన్లకి రాకపోతే, మంచి సంబంధాలు ఎలా వస్తాయ’ని శతవిధాల పోరింది. అయినా ఫలితం లేకపోయింది.
‘‘ఇది నీ కూతురేనా? ఏం అమ్మాయి... నీ పేరు మర్చిపోయానే... మందారమా?’’ అడిగింది వసంత.
‘‘కాదు అత్తయ్యా! పారిజాతం’’ చెప్పింది కూతురు.

‘‘ఏమ్మా! వెంకటలక్ష్మీ! పిల్లకి సంబంధాలేమైనా చూస్తున్నారా?’’
‘‘నీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పరాదు.’’
‘‘నా ఎరుకలు, సోదులు ఎందుకులే గాని, ఇప్పుడంతా ఇంటర్‌నెట్టు సంబంధాలేగా’’ అంటూ మూతి వంకర్లు తిప్పింది.
‘‘అదేమిటొదినా మీ అన్నయ్య కొడుక్కి సంబంధాలు చూస్తున్నారట కదా!’’ అంటూ గుర్తుచేసింది వెంకటలక్ష్మి.
చూస్తున్నారే. కానీ వాళ్లతో మీరు తూగగలరా? వాడేమో ఫారిన్ వెళ్లి వచ్చాడు. మళ్లీ వెళ్తాడట. అయినా మా వదిన సంగతి తెలుసుగా. నీ కూతురి వల్ల కాదు దానితో వేగడం’’ అంటూ చక్కాపోయింది వసంత.
వెంకటలక్ష్మి ఆలోచనలో పడిపోయింది. భర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. సంపాదనకేమీ లోటు లేదు. గవర్నమెంట్ ఇచ్చే జీతంతోపాటు అడపాదడపా వచ్చే పైడబ్బుతో బాగానే సంపాదించాడు. ఒక్కగానొక్క కూతురు. అంతా దానికి కాక ఇంకెవరికి? అయినా వసంత వదిన ఇలా అంటుందేమిటి? మేము వాళ్లన్నయ్య సంబంధానికి తూగలేమా?

పెళ్లి హడావుడి జోరందుకుంది. పట్టుచీరల ప్రదర్శన మొదలైంది.
‘‘చూశావా? చూశావా? సూరమ్మత్త స్టైలు. ఇంత వయసొచ్చినా లిప్‌స్టిక్‌తో సహా మేకప్ వెయ్యాల్సిందే. ఆ నగలు దిగెయ్యడం చూడు. అంతా ఏం చేసుకుంటుంది? పెద్దాడు ఎవత్తినో దొరసానిని చేసుకున్నాడటగా’’ రాగం తీసింది వనజ.
‘‘దొరసాని కాదులే. తెలుగువాళ్లే. అక్కడికి వెళ్లి చాలాకాలం అయ్యిందట’’ చెప్పబోయింది వెంకటలక్ష్మి.
‘‘ఎవరైతేనేంలే పిన్నీ! రెండోవాడికి మా చెల్లెలి సంబంధం అడిగితే, ఎంత పొగరుగా మాట్లాడిందని. అక్కడికేదో ఆమె, ఆమె కొడుకు పైనుంచి దిగి వచ్చినట్లు. అన్నీ కలిపి ఒకటి ఇస్తామన్నాం. తెలుసా?’’ చెప్పింది వనజ.

‘‘లక్షా?’’ వెంకటలక్ష్మి అన్న తరువాత నాలిక కరుచుకుంది.
అప్పటికే వనజ నవ్వేసింది - ‘‘ఇంకా ఏ కాలంలో ఉన్నావు పిన్నీ?’’ అంది.
‘‘అదే అనుకున్నాలే’’ అంది వెంకటలక్ష్మి సర్దుకొని. ‘‘మరి ఇంతకీ ఏమైంది?’’ అడిగింది కుతూహలంగా.
‘‘ఆ సూరమ్మత్త కంటికి మేమెక్కడ ఆనుతాం చెప్పు పిన్నీ. ఆవిడే వద్దనింది.’’
‘‘అయితే మన పారిజాతానికి అడుగుదామే’’ అంటుంటేనే తాను చేసిన రెండో తప్పు అర్థం అయ్యింది వెంకటలక్ష్మికి.
వనజ మళ్లీ గట్టిగా నవ్వింది - ‘‘కొంచెం చూసుకో వదినా. మమ్మల్నే వద్దంటే...’’ అంటూ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది.

ముహూర్తం దగ్గర పడింది. స్టేజ్‌మీద ఉన్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకునే బంధుమిత్రులతో నిండిపోయింది. వాళ్ల చొక్కాలు తప్పించి ఇంకేమీ కనిపించక పోవడంతో, పెళ్లికొడుకు బహుశా తాళిబొట్టు కట్టి ఉంటాడని అనుకుంటున్నారు జనం అంతా.
‘‘అత్తయ్యా! వెంకటలక్ష్మి అత్తయ్యా...’’ అరుచుకుంటూ వచ్చింది ప్రణీత. భజంత్రీల హడావిడిలో ఆ అమ్మాయి గొంతు వెంకటలక్ష్మిని చేరనేలేదు. చివరికి వెతికి వెతికి ప్రణీత వెంకటలక్ష్మిని పట్టుకుంది.
‘‘అత్తయ్యా! అత్తయ్యా! త్వరగా రా. టీవీలో మామయ్యని చూపిస్తున్నారు.’’

‘‘ఏ మామయ్యే?’’ ఆశ్చర్యంగా అడిగింది.
‘‘ఇంకెవరు? మన మూర్తి మామయ్యే. రా త్వరగా’’ చెయ్యి పట్టుకుని లాగుతోంది ప్రణీత. వెంకటలక్ష్మి ఆశ్చర్యం కాస్త ఆందోళనగా మారింది.
‘‘ఎందుకే... ఏం చూపిస్తున్నారు? ఏం చెప్తున్నారు?’’ హడావిడిగా నడుస్తూనే అడుగుతోంది.
బంధుమిత్రులు మాత్రం తలంబ్రాల పేరుతో రంగు కాగితాలు, తళుకులు, బెండు ముక్కలు తలపైన పోసుకునే ప్రహసనాన్ని చోద్యంగా చూస్తున్నారు.

‘ఇన్‌కంటాక్స్ వలలో పెద్ద చేప’ ఇదీ టీవీలో వస్తున్న వార్త.
అప్పటికే పారిజాతం అక్కడ చేరి నోరు తెరిచి చూస్తోంది. వెంకటలక్ష్మి వచ్చి పారిజాతం పక్కనే స్థాణువులా నిలబడిపోయింది.
‘‘సెక్రటేరియట్లో పనిచేసే ఒక మామూలు ఉద్యోగి కె.పి.మూర్తి ఇంట్లో, ఈ రోజు ఉదయం నుంచీ ఇన్‌కమ్‌టాక్స్ దాడులు జరుగుతున్నాయి. గత ఐదు గంటల నుంచి అధికారులు లోపలే ఉన్నారు. ఇంతవరకూ దాడిలో బయటపడ్డ ఆస్తుల వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇంత చిన్న ఉద్యోగిపైన ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు కన్నెయ్యడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు...’’ చెప్పుకుంటూ పోతోంది న్యూస్‌రీడర్. తరువాత అదే వీధిలో ఉండే కనకయ్యతో అభిప్రాయం చెప్పించారు.

‘‘చాలా సాదాసీదాగా ఉండేవాడండి. మరి ఇంత ఎత్తున దాడి జరిగేంత సంపాదించాడంటే, మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. గణేష్ చందాకి అయిదు వేలు ఇచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి’’ చెప్తున్నాడతను.
మొదట తేరుకుంది పారిజాతం. ‘‘అదేమిటమ్మా! ఆ కనకయ్యే కదా బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నాడు.’’
వెంకటలక్ష్మి మాట్లాడలేదు. ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినట్లు చుట్టూ చూసి, అవమానంతో కుంచించుకుపోయింది.
‘‘ఏమిటే ఇది?’’ అడిగింది వసంత.
‘‘ఏమిటో వదినా! తెలియటం లేదు’’ అంది వెంకటలక్ష్మి కంగారుగా. హ్యాండ్ బాగ్‌లో నుంచి మొబైల్ తీసి ఫోన్ చెయ్యాలని ప్రయత్నం చేసింది. అందరూ టీవీని, తనని మార్చి మార్చి చూస్తున్న విషయం తెలుస్తూనే ఉంది.

‘‘ఫోన్ కలవటం లేదు’’ జనాంతికంగా చెప్పింది రెండుసార్లు ప్రయత్నించి.
‘‘ఇన్‌కంటాక్స్ రైడ్ అంటే ఫోన్లు అవీ మాట్లాడనివ్వరనుకుంటా’’ దూరపు బంధువొకాయన చెప్పాడు.
వెంకటలక్ష్మి అప్పటికే భోరున ఏడ్చేస్తూ కింద కూలబడింది. పారిజాతం ఏం చెయ్యాలో తోచక, తల్లి పక్కనే భుజం పట్టుకొని కూర్చుంది.

అక్కడ పెళ్లిలో చదివింపులు పూర్తవడంతో అతిథులంతా పెళ్లి ఐపోయిందనే నమ్మకంతో భోజనాలకి బయల్దేరి, దారిలో ఈ టీవీ ప్రహసనం దగ్గర ఆగిపోయారు. ఇంకా పెళ్లి అయిపోలేదన్న సంగతి తెలిసిన ఏకైక వ్యక్తి పురోహితుడు నాగవెల్లికి ఏర్పాటు చేసుకుంటున్నాడు.
‘‘అరెరె..రె.. మన మూర్తి గురించేనా టీవీలో చెప్తా... ఎంత పని జరిగింది?’’ గుంపులో ఎవరో అన్నారు. వెంకటలక్ష్మికి చాలా ఇబ్బందిగా తోస్తోంది.

‘‘మొత్తానికి అసాధ్యుడే వీడు. ఏం ఎరగనట్టు ఉంటాడు కానీ, ఉత్త దొంగ’’ ఇంకెవరో ముసలావిడ అంది.
‘‘అదుగో... అదుగో మన మూర్తి’’ సూరమ్మ అంది టీవీ చూస్తూ. మూర్తి ముఖం వేలాడేసుకొని ఉన్నాడు.
ఇంతలో టీవీలో మరో ఫ్లాష్ న్యూస్.
‘‘గత ఆరు గంటలుగా జరిగిన ఆపరేషన్ ముగిసినట్లు ఇన్‌కంటాక్స్ అధికారులు తెలియజేశారు. అయితే ఎంత డబ్బు రికవరీ అయినది చెప్పకుండా గోప్యంగా ఉంచారు. మూర్తి మాట్లాడటానికి నిరాకరించారు’’ టీవీలో మళ్లీ మళ్లీ అదే విషయం చెప్తున్నారు. వెంకటలక్ష్మికి మొదటిసారి చెప్పినదే మళ్లీ చెప్పే చానల్స్ మీద కోపం వచ్చింది.
చుట్టూ ఉన్న బంధువులని చూస్తే ఆమెకి బాధ ఇంకా రెట్టిపవుతోంది.
‘‘రాబర్ట్ అంకుల్ ఇన్‌కమ్‌టాక్స్‌లోనే ఉన్నారు కదమ్మా’’ అంది పారిజాతం.

‘‘ఉండీ ఏం లాభం? ఇహ మా పరువు, పరపతి మొత్తం పోయినట్లే’’ భోరుమంది వెంకటలక్ష్మి.
‘‘పోనీలేవే! పరపతి కోసం ఎందుకంత బాధపడతావు?’’ ఓదార్చడానికి వచ్చింది సూరమ్మొదిన.
ఆమె అంతమాత్రం ఓదార్పు మాటలు చెప్పడం కనీ వినీ ఎరుగని వనజ, నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉంది.
‘‘చూశావా వొదినా! లక్షణంగా ఈ పెళ్లికి వచ్చి ఉన్నా ఇది తప్పేది కదా’’ మళ్లీ భోరుమంది వెంకటలక్ష్మి.
వసంత కూడా చేరి, ‘‘ఊర్కో... ఊర్కో... ఇప్పుడేమైందని?’’ అంటోంది అనునయంగా.

‘‘ఇంకా ఏం జరగాలి అక్కయ్యా! ఇంత అవమానం జరిగిన తరువాత, మా పారిజాతాన్ని ఇంకెవరు చేసుకుంటారు చెప్పు’’ అంది పారిజాతం వైపు చూస్తూ.
విషయం తిరిగి తిరిగి తన పెళ్లి మీదకు రావడంతో, ఇబ్బందిగా అనిపించింది పారి జాతానికి. అందరూ ఆ పిల్లవైపే చూశారు.
‘‘నిక్షేపం లాంటి పిల్ల. ఎవరైనా ఎందుకు కాదంటారు’’ సూరమ్మ అంది.
‘‘అవునవును. మా అన్నయ్య కొడుకున్నాడు. నేను మాట్లాడతాను. నీకెందుకు?’’ వసంత ధైర్యం చెప్పింది. వెంకటలక్ష్మి ఏడుపాపి చూసింది.

‘‘మీ అన్నయ్యదాకా ఎందుకొదినా? మా అబ్బాయి లేడూ. ఇదుగో నేను చెప్తున్నాను. ఈ గొడవలన్నీ అయ్యాక, అన్నయ్యగారిని మంచిరోజు చూసుకొని ఇంటికి రమ్మనమను చెప్తాను’’ సూరమ్మ ఈ మాట అనగానే కళ్లు తిరిగినంత పనైంది పారిజాతానికి, ఇంకా అక్కడ ఉన్న సగం మంది బంధువులకి.
వెంకటలక్ష్మి కాస్త తేరుకుంది.

హడావుడి ముగియటంతో అంతా భోజనాల వైపు ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ బయల్దేరారు. భోజనం అవగానే పెట్టె సర్దుకొని తల్లీకూతుళ్లు ప్రయాణమయ్యారు. అక్కడ ఇన్‌కంటాక్స్ రైడ్ జరిగిందన్న బాధ ఒకవైపు, పారిజాతానికి సంబంధం-అదీ వాళ్లు ఊహించిన దానికన్నా మంచి సంబంధం కుదిరేట్టు కనపడటంతో సంతోషం ఒకవైపు... ఇలా ఉంది పరిస్థితి బస్టాండుకు చేరేసరికి. సరిగ్గా అప్పుడే ఫోను మోగింది మూర్తి దగ్గర్నుంచి.

‘‘ఏమండీ! ఏమిటండీ ఇదీ’’ ఫోను ఎత్తుతూనే ఏడ్చేసింది. పారిజాతం తల్లిని పట్టుకొని ఇబ్బందిగా చుట్టూ చూసింది.
‘‘అబ్బా! అనవసరంగా ఏడవకే. ఇక్కడేం జరగలేదు’’ చెప్పాడు మూర్తి.
‘‘మరి టీవీలో అలా చెప్తున్నారు. మీ ఫ్రెండ్ రాబర్ట్ ఉన్నాడు కదా. అతనేం సహాయం చెయ్యలేదా?’’ అడిగింది వెంకటలక్ష్మి.
‘‘ఈ రైడ్ చేయించిందే వాడు’’ అతను చెప్తుంటే మధ్యలోనే అందుకుంది వెంకటలక్ష్మి.
‘‘అయ్యో! ఎంత పని చేశాడండీ.’’
‘‘చెప్పేది వినవే. ఇంతకీ అక్కడ పెళ్లి ఎలా జరిగింది?’’

‘‘పెళ్లికేం బాగానే జరిగిందిలెండి. అంతకన్నా మన కథే చెప్పుకున్నారంతా. అందరూ కలిసి మమ్మల్ని ఓదార్చడమే సరిపోయింది’’ అని, కళ్లు తుడుచుకొని కొనసాగించింది వెంకటలక్ష్మి.
‘‘కాకపోతే గుడ్డిలో మెల్లన్నట్లు, మా సూరమ్మొదిన లేదూ ఆమె పారిజాతం సంబంధం మాట్లాడటానికి రమ్మంది. వసంతక్కయ్య, వాళ్ల అన్నయ్యతో మాట్లాడతానంది.’’
‘‘హమ్మయ్య! అయితే ప్లాను పనిచేసిందన్నమాట.’’
‘‘ప్లానేంటండీ?’’
‘‘నేను, రాబర్ట్ కలిసే ఈ ఇన్‌కమ్‌టాక్స్ ప్లాన్ వేశాం. అక్కడ రైడ్‌లో దొరికేదేమి లేదు. ఊరికే రైడ్ చేశారు అంతే.’’

‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా?’’
‘‘పిచ్చేమిటే? అలా రైడ్ జరిగే సరికి నేనేదో తెగ సంపాదించానని అందరూ అనుకుంటారు. దాంతో మన పరపతి ఎలా పెరిగిపోతుందో చూడు. మీ సూరమ్మొదిన, వసంతక్కయ్యలాగా మన పారిజాతానికి ఎంతమంది సంబంధం వెతుక్కుంటూ వస్తారో’’ చెప్తూనే ఉన్నాడు మూర్తి.
వెంకటలక్ష్మి సగం అయోమయం, సగం సంతోషంతో పారిజాతం వైపు చూస్తోంది.

(30.01.2011, సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్‍డేలో ప్రచురితం)