గతం గతః (కథ)


దండపాణి ఆనందంతో పెట్టిన పొలికేక దాదాపు నాలుగు సార్లు ప్రతిధ్వనించింది. అయినా అతని మనసు శాంతించలేదు. ముఫ్ఫై ఏళ్ళ కఠోర శ్రమ ఫలించి కళ్ళ ముందు నిలిస్తే ఎవరికైనా అంతే ఆనందం కలుగుతుంది మరి. పైగా ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వైజ్ఞానిక విప్లవం అది. కేవలం కలలకో, కథలకో, సినిమాలకో పరిమితమైన ఊహ అది. ఇప్పుడు దండపాణి ఆవిష్కారం పుణ్యమాని వాస్తవం అయ్యింది. ఆ ఆవిష్కారం పేరు – టైమ్ మెషీన్.

ముఫ్పై ఏళ్ళ క్రితం ఇలాంటి ఆవిష్కారం సాధ్యమేనని దండపాణి చెప్తే అందరూ ఎద్దేవా చేశారు. ఇదే ధ్యాసలో పిచ్చివాడిలా తయారయ్యాడని ఉద్యోగంలోంచి తీసేశారు. పిచ్చి కుదరాలంటే పెళ్ళి చెయ్యాలని పెళ్ళి చేశారు. రాను రాను పిచ్చి ముదిరిందే తప్ప తగ్గలేదని మందులు, మాకులు, షాకులు కూడా ఇప్పించారు. శాంతియాగాలు, భూతవైద్యాలు చేయించారు...!! అన్నింటినీ సహించాడు దండపాణి. తాతలు సంపాదించిన ఆస్తి మొత్తం ధారపోసి తన ఇంటి పైన రెండు గదులూ ఒక ఖార్కానా చేసి, ఎలాగైతేనేం చివరికి కనుక్కునాడు. టైమ్ మెషీన్ కనుకున్నాడు. ఆ ఆనందంలోనే గెంతుతూ దుముకుతూ అరవడం మొదలుపెట్టాడు –

“ఇప్పుడు... ఇప్పుడు... అనండిరా నన్ను పిచ్చోడని... ఇప్పుడు అనండి చూస్తాను...” అంటున్నాడు.

“ఏమిటండీ ఆ పిచ్చి కేకలు” అంది అతని భార్య సక్కుబాయి లోపలికి వస్తూ.

గాలి తీసిన బెలూన్ లా, పంక్చర్ అయిన టైరులా ఆనందం అంతా జారిపోయి నిలబడ్డాడు దండపాణి.

“ఆ గెంతులేమిటి? ఆ అరుపులేమిటి? మీ పిచ్చికి ఇప్పటికే చుట్టుపక్కలవాళ్ళు మెంటల్ హాస్పిటల్ కి కంప్లైంట్ ఇస్తామంటున్నారు... ఇప్పుడు ఈ గోలకి పోలీస్ స్టేషన్ కి కూడా ఇస్తారు..” అంది సక్కుబాయి.

“పోలీసులేమిటే... ఇదిగో ఇప్పుడు నేను కనుక్కున్న విషయం తెలిసిందంటే ప్రసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి చెప్తారు..” అన్నాడు గర్వంగా.

“అయ్యోరామా... అంత పెద్దమనిషికి చెప్పేంత తప్పు ఏం చేశారండీ...” అంది ఖంగారుగా.

“తప్పు కాదే మొద్దు... కనిపెట్టాను... ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేకపోయిన టైం మెషీన్ కనిపెట్టాను..” చెప్పాడు దండపాణి కాలరెగరేస్తూ.

“సరే కనిపెడితే కనిపెట్టారు... ఇంక చాలు... కిందకి రండి పోదాం..”

“ఓసి నా పల్లెటూరి మొద్దూ... నేను కనిపెట్టింది ఏమిటో తెలుసా కాలవాహకం... కాలంలో ముందుకీ వెనక్కీ వెళ్ళగలిగే మెషిను... దీని ద్వారా మనం ఎన్ని సంవత్సరాలైనా ముందుకు ఎన్ని సంవత్సరాలైనా వెనక్కీ వెళ్ళచ్చు...” చెప్పాడు టైమ్ మెషీన్ చూపించి. సక్కుబాయి దగ్గరగా వచ్చి ఆ మెషీన్ ని చూసింది.

“ఇదేమిటండీ మా కోటప్పకొండ జాతరలో చిన్న ప్రభలా వుంది... దీనికి ఇంత మహత్తు వుందా?” అంది ఆశ్చర్యంగా.

“మరి ఏమనుకున్నావు?” అన్నాడు

“అయితే ఒక పనిచేసి పెట్టరూ... ఇస్తరాకులు సీరియల్ లో ఆ పంకజాక్షికి రెండో మొగుడికి నాలుగో పెళ్ళాం వుందన్న సంగతి తెలుస్తుందా తెలియదా కొంచెం చూసి చెప్తారూ...” అంది బ్రతిమిలాడుతూ.

“ఒసే సక్కూ... ఇంత కష్టపడి కనిపెట్టింది ఈ ఇస్తరాకులు, ఇనపరేకులు సీరియల్ గురించి తెలుసుకోడానికి కాదు... దీంతో నేను సాధించాల్సింది చాలా వుంది... నువ్వు కిందకి వెళ్ళి ఆ సీరియళ్ళు చూసుకో... నేను ఈ మెషీన్ ఎక్కి అలా షికారుకి వెళ్ళొస్తాను.” చెప్పాడు దండపాణి. అప్పటికే టైమ్ మెషీన్ ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని తొందరగా వుంది అతనికి.

“షికారా... అయితే నేనూ వస్తానండీ... ఎప్పుడో పెళ్ళైన రెండు నెలలకి సైన్స్ మ్యూజియంకి తీసుకెళ్ళారు... మళ్ళీ ఇప్పటికి వింటున్నాను షికారనే మాట... నన్నూ తీసుకెళ్ళండీ..” అంటూ బ్రతిమిలాడింది ఆమె.

“ఏమిటే... నేనేమన్నా బిగ్ బజార్ కి వెళ్తున్నానా... కాలంలోకి ప్రయాణం... భవిష్యత్తులోకి వెళ్ళి...” అతను చెప్పకముందే అందుకుంది సక్కుబాయి.

“సరేలెండి.. మీరు తీసుకెళ్తారేమో అని అనుకోవడమే తప్పు... మీరు వెళ్ళి రండి..” చెప్పింది. “అన్నట్టు రాత్రి భోజనానికి వస్తారా? ఏం వండమంటారు?” అడిగింది అమాయకంగా.

సమాధానం ఏం చెప్పాలో తెలియక తలబాదుకున్నాడు దండపాణి. “నేను ఏదో ఒకటి తింటాలేగానీ.. నువ్వు జాగ్రత్తగా పడుకో... నేను ఇలా వెళ్ళిన సంగతి ఎవరితో అనకు...” చెప్పి టైం మిషన్ లోకి ఎక్కాడు అతను.

“సరే... వచ్చేటప్పుడు చంటాడికి ఏమన్నా తీసుకురండి” అంటూ కదిలింది సక్కుబాయి.
దండపాణి టైమ్ మెషీన్ ఎక్కి కూర్చున్నాడు.

ఎక్కడి వెళ్ళాలి? ముందుకా? వెనక్కా?

“వెనక్కి వెళ్ళి ఇందిరాగాంధీనో, బాపూజీనో చూసి వస్తే ఎలా వుంటుంది?” అనుకున్నాడు. “అంత దూరం వెళ్ళి ఊరికే చూసిరావడం ఎందుకు? ఫలానా ఫలానా వాళ్ళు ఫలానా తేదీ రోజు వాళ్ళని చంపబోతున్నారని చెప్తే పాపం జాగ్రత్త పడతారు కదా?” అని మరో ఆలోచన వచ్చింది.

తీరా వెళ్ళి చెప్పిన తరువాత పిచ్చివాడని తీసిపారేస్తారేమో అని అనుమానం వచ్చింది. “అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు?” అని అనుమానించి లోపల వేసి కుళ్ళబొడుస్తారేమో అని భయం వేసింది.

“ఇదంతా కాదు... వెనక్కి వెళ్ళడం కన్నా ముందుకి వెళ్ళడమే కరెక్ట్... ఈ ప్రపంచాన్ని సాంకేతికంగా ముందుకు నడిపించే యంత్రం కనుకున్నాను కాబట్టి, నేను కూడా ముందుకే వెళ్తాను” అనుకునాడు స్థిరంగా.

“రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో కనిపెట్టవచ్చు... అసలు ఇలాంటి పరికరం ముందు ముందు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు... ఇలాంటి మెషీన్ కనిపెట్టినందుకు తనకు ఎంత పేరు వచ్చిందో కళ్లారా చూసి రావచ్చు..” అంటూ ఉత్సాహపడ్డాడు. మెషీన్ లో బటన్లు నొక్కి, 2032 అని సంవత్సరం నొక్కాడు... ఒక్కసారి అన్నీ సక్రమంగా వున్నాయో లేదో చూసుకోని అసలైన ఎర్రబటన్ నొక్కాడు. టైం మెషీన్ మాయం అయ్యింది.

***

ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇరవై ఏళ్ళలో అనుకున్నదాని కన్నా ఎక్కువ అభివృద్ధే జరిగినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న ఇళ్ళ స్థానంలో పెద్ద పెద్ద సౌధాలు వున్నాయి. చిన్న చిన్న గుడిసెలు వుండాల్సిన చోట “ఈ స్థలం ఫలానా ఎమ్.ఎల్.ఏ. గారికి చెందును” అని రాసిన బోర్డులు కనిపించాయి. రోడ్ల నిండా గుంతలు, కార్లు విపరీతంగా పెరిగిపోయాయి. కాలుష్యం ప్రమాద స్థాయిలోనూ, పర్యావరణం పతనావస్థలోనూ వున్నట్టు గుర్తించాడు. వూరంతా తిరిగి సంభ్రమంగా చూశాడు.

రాబోయే కాలాన్ని అతి దగ్గరగా చూసేందుకు అవకాశం తనకి మాత్రమే వచ్చినందుకు చాలా సంతోషించాడు. అలాంటి అనుభవం తన టైం మిషీన్ వల్లే వచ్చిందని గుర్తుకువచ్చి తన భుజం తనే చరుచుకోని “శభాష్” అనుకున్నాడు. ఆ కాలంలో వున్న వింతలు విశేషాలు ఒక్కొక్కటిగా పరిశీలించాడు.

పేపర్లో అచ్చులో వార్తల బదులు కదులుతున్న బొమ్మలు కథలు చెప్పడం చూశాడు. టీవీకి పేపరుకు అంటు కడితే పుట్టిన కొత్త పరికరం కాబోలని ఆశ్చర్యపోయాడు. అయితే వార్తల్లో పెద్ద మార్పేమీ లేదని గ్రహించాడు. నేరం చేసినట్లు రుజువైనా రాజ్యమేలుతున్న నాయకుల గురించి, చంద్రమండలంలో జరిగిన లాండ్ మాఫియా గురించి తెలుసుకున్నాడు. డేబ్బై ఏళ్ళ హీరో పదహారేళ్ళ హీరోయిన్ తో పాటలు పాడుతూ వేసిన స్టెప్పులను చూశాడు. రోబోల తో వివాహాలు ఎక్కువైపోతున్నాయని సంసారాల శాఖా మంత్రి చేసిన ప్రకటన గురించి చదివాడు. వేల మైళ్ళ వేగంతో పరుగెత్తే రైళ్ళను, కార్లను దాని వల్ల పెరిగిపోయిన ప్రమాదాలను గమనించాడు. అన్ని సంవత్సరాలైనా బాబాలను, స్వామీజీలను నమ్మి మోసపోతున్న ప్రజలను చూశాడు. ఇవన్నీ తిరిగి వెళ్ళిన తరువాత అందరితో చెప్పాలని ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఆ తరువాత ఆకలేస్తే దగ్గర్లో కనపడ్డ రెస్టారెంటుకు వెళ్ళాడు. సర్వర్ వచ్చి ఏదో మెషీనుతో దండపాణిని పైనుంచి కిందదాకా తనిఖీ చేశాడు. ఆ తరువాత వినయంగా నమస్కరించి -

“సార్.. మీకు షుగర్ లెవల్స్ ఎక్కువగానూ, హార్ట్ బీటు తక్కువగా వున్నాయి... అందువల్ల...” అన్నాడు సర్వరు.

“ఇదేమిటి... హోటల్ అనుకోని హాస్పిటల్ కి వచ్చానా?” అని అనుమానంగా అడిగాడు.

“లేదు సార్... మీ ఆరోగ్యం సంగతి తెలిస్తే కదా మీకు ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలిసేది... మీకు వున్న రోగాలకి చక్కర వెయ్యని డ్రింకు, ఉప్పు వెయ్యని పచ్చి కూరలు, యమహో వారి ప్యాకేజ్డ్ కాకరకాయ జూస్ ఇవ్వగలం... మీకు ఇష్టమైతేనే చెప్పడి” అన్నాడు అతను.

మనిషి ఆరోగ్యం స్పర్శమాత్రంగా తెలుసుకునే ఆ మెషీన్ ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. అయితే తనకి ఇష్టమైనవి తిననీయకుండా, రోగిష్టివాడికి పథ్యం ఇస్తున్నట్లు పెట్టే తిండి తినాలని అనిపించలేదు. సరిగ్గా అప్పుడే అతనికి భార్య సక్కుబాయి గుర్తుకువచ్చింది.

“ఎలా వుందో, ఏం చేస్తోందో... నా ఇల్లు ఎలా వుందో, అసలు తను ఇప్పుడు ఎంత ముసలాడు అయిపోయాడో” లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనిపించింది అతనికి. వెంటనే తన ఇల్లు వుండాల్సిన చోటుకి వెళ్ళాడు.

ఇల్లు అక్కడే వుంది. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం చూసిన ఇళ్ళు ఇప్పటికీ అదే విధంగా వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. కాకపోతే కొంచెం రంగులు వెలిసిపోయి వుందంతే. అసలు ఇంతకాలం ఏ కబ్జాదారుడు కన్ను దానిమీద పడకపోవటమే అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. తలుపు పక్కనే వున్న కాలింగ్ బెల్ నొక్కాడు.

“ఎవరదీ...?” అంటూ వచ్చింది ఒక ముసలామె. ఆమెను చూడగానే పెద్దగా నవ్వటం మొదలు పెట్టాడు దండపాణి.

“ఎవరండీ మీరు? ఎందుకు నవ్వుతున్నాడు” అడిగిందా ముసలామె.

“ఒసేయ్... సక్కుబాయ్.. నేనే దండపాణిని...” అన్నాడు అతను. ఆమె కళ్ళలో ఆశ్చర్యం చూసి ఇంకా నవ్వు వచ్చొందతనికి. సక్కుబాయి కాస్సేపు స్తబ్దుగా వుండిపోయింది. ఆ తరువాతే మొదలైంది –

“చచ్చినోడా... ఎందుకు వచ్చావు ఇప్పుడు.. నేను బతికి వున్నానో లేదో అని చూడటానికి వచ్చావా?” అంది నిష్టూరంగా.

“అదేమిటే అలా అంటావు... నేను నీతో లేనా? నేను నువ్వు అనుకుంటున్న నేను కాదు... ఇరవై ఏళ్ళ క్రితం నుంచి టైం మెషిన్ ఎక్కి వచ్చాను...” చెప్పాడతను. ఆమె తల కొట్టుకుంది.

“ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నారా? నా ఖర్మ..!!” అంది ఆమె కోపంగా.

“ఇందులో తప్పేముందే... అప్పుడు ఎప్పుడో ఎక్కాను... ఇక్కడ దిగాను... చూడు అందుకే నీ కన్నా వయసులో, అందంగా వున్నాను...” కాలర్ ఎగరేస్తూ చెప్పాడతను.

“ఎందుకు వుండవూ... నీ కోసం ఎదురుచూసి చూసే నేను కదా ఇలా తయారయ్యాను... లేకపోతే నీ కన్నా అందంగా వుండేదాన్ని కాదూ..” అంది ఆమె.

“అదేమిటే... నా కోసం ఎదురు చూడటం ఏమిటి? అప్పటి నుంచీ నేను తిరిగిరాలేదా? నన్ను ఆఖరుగా ఎప్పుడు చూశావు.” అడిగాడు దండపాణి.

“ముదనష్టపోడా... అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రాత్రికి భోజనానికి వస్తానని వెళ్ళావు... నేను నీ కోసం గోంగూర పచ్చడి చేసి ఎదురుచూస్తూ కూర్చున్నాను..” గుర్తుతెచ్చుకుంటూ అంది సక్కుబాయి.

“అంటే ఆ తరువాత మళ్ళీ నేను కనిపించలేదా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఎక్కడా? మళ్ళీ ఇప్పుడే కదా కనిపించావు...” అంది కొంచెం బాధగా.

“అదేమిటి... నేను ఇప్పుడే టైం మెషీన్ లో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, నేను ఎందుకు తిరిగిరాలేదో కనుక్కుంటాను...” అంటూ కదలబోయాడు దండపాణి. ఠక్కున చెయ్యి పట్టుకోని ఆపింది సక్కుబాయి.

“ఇదుగో ఆ దిక్కుమాలిన మెషీన్ దగ్గరకు మళ్ళీ వెళ్ళారా మిమ్మల్ని చంపి నేనూ చస్తాను...”  అంది ఆవేశంగా.

“అదేమిటే... అప్పట్లోకి వెళ్తే కదా అసలేం జరిగిందో తెలిసేది... నీకర్థం కాదు కానీ... ఒక్క గంట ఓపిక పట్టు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తేను ” అని దండపాణి చెయ్యి వదుల్చుకోబోయాడు. ఆమె పట్టు వదలలేదు.

“ఆ దరిద్రపుగొట్టు మెషీన్ అప్పుడు ఎక్కి పొయ్యావు మళ్ళీ రావడానికి ఇరవై ఏళ్ళు పట్టింది... మళ్ళీ వెళ్ళావంటే నేను చచ్చిన తరువాత కానీ రావు... నేను వెళ్ళనివ్వను అంతే” అంది మొండిగా.

“ఇదెక్కడి గోలే సక్కూ... నీకు అర్థం కావటంలేదు... నేను ఇప్పుడు వెళ్తేనే నువ్వు చేసిన గోంగూర పచ్చడి తినేది... నీకు ఎదురుచూపులు తప్పేది...” వివరించడానికి వృధా ప్రయాస చేశాడు దండపాణి. సక్కుబాయి కాస్త మెత్తపడ్డట్టే అనిపించింది.

“సరే ముందు ఇక్కడ కూర్చోండి..” అంటూ కుర్చీ చూపించింది. దండపాణి కుర్చీలో కూర్చోగానే పరుగు లాంటి నడకతో ఇంటి బయిటికి అడుగుపెట్టి బయట నుంచి గడియ వేసేసింది. జరిగింది దండపాణి అర్థం చేసుకునే లోపల తన ఇంట్లోనే బందీ అయిపోయాడు.

“సక్కూ.. ఇదేమిటే... ఇలా బంధించావు? ముందు తలుపుతీ..” అన్నాడు కిటికీ దగ్గరకు వచ్చి.

“తలుపు తీయాలేం? తలుపు?... వుండండి... ఆ దిక్కుమాలిన మెషీన్ ని నాశనం చేస్తేగాని మీరు బుద్ధిగా వుండరు...” అంటూ పెరటి మొక్కల దగ్గర వున్న గునపం తీసుకోని టైం మెషీన్ దగ్గరకు పరిగెత్తింది.

“వద్దే... నా మాట విను... ఆ మెషీన్ పాడు చేస్తే మళ్ళీ నేను వెనక్కి పోలేను... మళ్ళీ అది తయారు చేసేందుకు నా దగ్గర నోట్స్ కూడా లేదు... వద్దే.. పల్లెటూరి మొద్దు...” అరుస్తూనే వున్నాడు దండపాణి. అప్పటికే సక్కుబాయి టైం మెషీన్ పగలగొట్టడం మొదలుపెట్టింది.

<< ?>>

(సాక్షి ఫన్ డే)

బందేమాతరం