పోరాడాల్సింది ఎవరితో..?

ఇప్పటిదాకా యుద్ధం అంటే ఎక్కడో దేశ సరిహద్దులో జరిగేదనుకునేవాళ్ళం... దేశానికి వాణిజ్య రాజధాని ముంబై నగరంలో అత్యంత సంపన్నులుండే ప్రదేశంలో, చారిత్రాత్మక గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర్లో, వాటిని వీక్షించడానికొచ్చే సందర్శకుల్తో కిట కిట లాడే ప్రాంతంలో యుద్ధం జరుగుతుందని మనం ఎవరం వూహించి వుండం..!! పోలీసులూ, నిఘా వర్గాలూ వుహించి వుండక పోవటం కొసమెరుపు..!!


ఇప్పటిదాకా టెర్రరిజానికి ముఖం లేదు అనుకున్నాం. దర్జాగా సీసీ కెమెరాల్లో ఫొటోకి ఫోజిచ్చినట్టు నిలబడ్డ పాతికేళ్ళ కుర్ర టెర్రరిస్టులు ఇప్పుడు అందరికీ కలల్లోకి వచ్చే టెర్రరిజం ముఖచిత్రాలు. అరవై గంటలపాటు పోరాడటానికి సరిపడా గ్రెనేడ్లు, తుపాకులు, బులెట్లు హోటల్ గదిలో నింపుకో గలిగిన తీవ్రవాదులు మన పోలీసు తెలివితేటల్ని నరిమన్ పాయింట్లో నగ్నంగా నిలబెట్టారు.


బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..? అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?


గుర్తుకు రావు.. ఎవ్వరూ అడగరు.. ఎందుకంటే నిజాలు బయటికి వస్తాయి. నిజం వినాలని వుందా..??


పోలీసులు వేసుకున్న జాకెట్లను చూడండి.. గూగులమ్మని అడిగితే చిత్రాలతో ఆ జాకెట్ల గురించి చెప్తుంది. అవి బులెట్లను తట్టుకునే జాకెట్లు కావు. వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్లు రాళ్ళ దాడిని మాత్రమే నిరోధించడానికి తయారు చేసినవి. బులెట్ల ధాటికి అవి ఆగలేవు..!! ఎందుకంటే పోలీసులు "ఇలాంటి" సంఘటనలు ఎదురుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చెదురుమొదురు సంఘటనలంటారే అలాంటివాటికి మాత్రమే సిద్ధంగా వున్నారు. మొదటి రోజు రాత్రి బులెట్ ప్రూఫు జాకెట్లు తయారు చేసే సంస్థ ఒకటి వాటిని పోలీసులకు వుచితంగా పంచి పెట్టిన సంగతి మీడియా వారికి తెలియనే తెలియదెందుకో..?


అయితే పోలీసుల దగ్గర ఇవి లేవా అంటే.. వున్నాయి. టెండర్లలో అందరికన్నా చవకగా కొటేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొని (అంటే మీకు తెలుసుగా ఎవరి కొటేషన్ ఎందుకు తెల్లారే సరికి చౌకైపోతుందో) స్టోర్లో పెట్టి తాళంవేసి వుంచారు. ఇలాంటి సందర్భంలో ఆ స్టోరెక్కడ వుందో తెలుసుకోని, ఇండెంట్ పెట్టి తీసుకొని వేసుకోవాలి. అన్నట్టు మరిచాను.. దానికి ముందు టెర్రరిస్టులను అప్పటిదాకా ఆగండి నాయనా అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవాలి..!!


పరామర్శ పేరుతో వచ్చే రాజకీయ నాయకులకు భద్రత కల్పించాలా లేక టెర్రరిస్టుల సంగతి చూడాలా అని అడిగే పోలీస్ ఆఫీసరు ఫ్రస్ట్రేషనంతా ఆ తీవ్రవాదిని కిటికీలోనించి పడేసటప్పుడు తీరి వుంటుంది. మునుపు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన మంచులో కాళ్ళకున్న జోళ్ళు చాలక మంచులో పనికొచ్చే షూస్ పంపించమంటే కాంట్రాక్టర్ల గోలుమాలులో చిన్న పిల్లల షూస్ పంపించిన అవినీతి నాయకులేగా వీళ్ళంతా..! ఆ రోజు కార్గిల్ మంచుకి తట్టుకోలేక రక్తపు అడుగులేసిన సైనికుడెవరైనా తాజ్ దగ్గర వుండుంటే ఆ పరామర్శగాళ్ళని ముందు కాల్చేసేవాడు.


అన్నట్టు మరో అనుమానం..!! నాలుగు వందల మంది ఎన్ఎస్‌జీ కమెండోలలో చాలావరకు ఉత్తర భారతీయులు వున్నార్ట.. ముంబైలో వుత్తర భారతీయులా...!! రాజ్ థాకరే..!! వీళ్ళనెలా రానిచ్చావ్.. తరిమికొట్టకపోయావా..!!

ఇదంతా జరిగి కొంత మంచీ చేసింది -


తీవ్రవాదులపై నెగెటివిటీని ఇంకా పెంచింది, ఈ రోజు తీవ్రవాదం వైపు అడుగులెయ్యబోతున్న వారిలో ఒక్కడైనా ఈ మారణహోమం చూసి కనీసం ఒక్క అడుగు వెనక్కి వేసుంటాడు.దేశం మొత్తం సంఘటితంగా నిలబడింది, బ్లాగులు, మొబైళ్ళు చివరికి పిచ్చా పాటి కబుర్లు కూడా నిరశన వార్తలు మోశాయి..మీడియాకు, రాజకీయాలకు కొత్త టాపిక్ దొరికింది. పాపం పోతూ పోతూ న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఇచ్చి వెళ్ళారు కార్కర్, ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఇరుకున పడేట్టుంది..

కానీ

ఎక్కడో వొకచోట ఆక్రోశం ప్రతిహింసకు పునాదులు తొవ్వేవుంటుంది.. అది ఏ దుర్వార్తలు మోసుకొస్తుందో చూడాలి..!!

ఆస్ట్రేలియా జంతువులు

(గత సంవత్సరం సిడ్నీ వెళ్ళినప్పుడు తీసిన చిత్రాలివి.)

నాకు కంగారు ఎక్కువనుకునేరు అది నా పేరు: ఆస్ట్రేలియా జాతీయ జంతువు














వుతికి వుతికి వెలిసిపోలేదు.. నా రంగే అంత.. తళ తళలాడే తెలుపు













కువ కువ - కిచ కిచ






నిజంగానే బ్రష్ చేసాను.. కావాలంటే చూడూ ఆఆఆ..

రోడ్డున పడ్డ దేవుళ్ళు..!!

నా పెళ్ళాం పిల్లలకి ఆకలేస్తే

నేను దేవుణ్ణి రోడ్డుమీదకు లాగుతాను

నాకు అన్నం పెట్టాలని నా దేవుళ్ళు

ఎంతోమందితో తొక్కించుకుంటారు



రంగులడబ్బా పట్టుకొని ఇంటినించి కదలగానే

నా బొమ్మ వెయ్యమంటే నా బొమ్మ వెయ్యమని

సాయిబాబా, సిలువెక్కిన ఏసు, వినాయకుడు

కలిసి నా బుర్రలో రంగులు కలిపినట్టు గిలక్కొడతారు



చెప్పులులేని నా కాళ్ళను చూసి తారురోడ్డు ఆబగా చుర్రెక్కుతుంది

దేవుళ్ళకి రంగులు రుద్ది రుద్ది నా వేళ్ళు అరిగిపోతాయి

మోకాళ్ళపై కూర్చొని బొమ్మవేసేసరికి ఏసుప్రభువు శిలువపై రక్తపు మరకలౌతాయి

బొమ్మలో అందంకన్నా మనసులో భక్తి చిల్లర పైసలై రాలుతుంది



నేను వేరే బొమ్మలు ఇంతకంటే బాగా వెయ్యగలను కానీ

వేసేది దేవుడి బొమ్మకాకపోతే మీ కాళ్ళకింద రంగులు నలిగిపోతాయి

అందుకే దేవుణ్ణి తెచ్చి రోడ్డుపై పరుస్తుంటాను



ఆ దేముణ్ణికి దణ్ణంపెట్టి పక్కనున్న నన్ను ఛీ కొట్టి వెళ్తారు జనం

ట్రాఫిక్ పోలీసు వస్తే నా రంగుడబ్బాని తన్ని కొత్త రంగులు పుట్టిస్తాడు

కారుపార్కింగ్లో బొమ్మేమిటని షాపువాడు నీళ్ళు కుమ్మరిస్తాడు



అయినా నా ఆకలి ఏ గుడి ముందో జాగా వెతికేస్తుంది

నా పేదరికం పేరు చెప్పుకొని ఒక కళ బతికేస్తుంది

ఈసారెప్పుడైనా నా బొమ్మ కనిపిస్తే మీరు కళను చూడపోయినా పర్లేదు

దాని వెనక నా కాలే కడుపును చూస్తే చాలు

ఉమాపతి ఛలో తిరుపతి..!!

"రేయ్ బాచి లేవరా లే.." లేపాడు ఉమాపతి. ఇద్దరం ఒకే వూర్లో పుట్టి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఎక్కడో దూరపు చుట్టరికం కూడా వుందని వాళ్ళ బామ్మ మా బామ్మ కలిసినప్పుడు నిర్ధారించారు. ఆ లెక్క ప్రకారం వాడికి నేను బావ వరస అవుతాను.

మా అన్నయ్యను పెద్ద బావ అని పిలిచినా నన్ను మాత్రం చనువుగా బాచి అని పిలుస్తాడు. బాచి తిరగేస్తే చిబా అనీ, అంటే చిన్నబావ అని వ్యాఖ్యానం కూడా ఇచ్చుకున్నాడు. ఇద్దరం ఆ సంవత్సరం పదొవ తరగతి పరీక్షలు రాసి, పాసైపోవడంతో మొక్కుబడికని తిరుపతి బయలుదేరాము. రైలు రేణిగుంట దాటుతుండగా ఇదుగో ఇలా -

"లేవరా బాచిగా... తొందరగాలే.." గుస గుసగా అంటున్నాడుగాని గట్టిగా తడుతున్నాడు.

నేను లేచి కళ్ళు నులుముకోని - "ఏమిట్రా ఉమా..ఏమైంది???" అన్నాను

"నువ్వు ముందు లేవరా బాబూ.. త్వరగా" అన్నాడు. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.

"ఏమిట్రా కొంపదీసి రైలేమైనా తగలబడుతోందా.." అన్నా అర్థంగాక.

"కాదెహే.. నువ్వు దిగు చెప్తా.. రా నాతోటి.." అంటూ బాత్రూంల వైపు పరుగెత్తాడు. వాడివెనకాలే నేనుకూడా.

"పద త్వరగా బాత్రూంలో చెయ్యాల్సిన పనులేమైనా వుంటే చేసై.." అన్నాడు అక్కడికెళ్ళగానే.

"ఇప్పుడేమిట్రా అంత తొందర..?"

"తొందరే మరి.. ఇంకా ఎవరూ లేవలేదు. లేచారంటే దానికి కూడా పోటీ.. పైగా ఎవడో వాడి పారేసిన బాత్రూంలోకి వెళ్ళాలంటే నాకు అసహ్యం. ఒకసారిట్లాగే వైజాగు వెళ్ళినప్పుడు లేటుగా లేచేసరికి నీళ్ళైపోయాయి. నాకు తెలియక ఎంటరైపోయా.."

"ఆ తరువాత..?"

"ఏం చేస్తాం..? లక్కీగా నా జేబులో ఏదో కాగితం వుండబట్టి సరిపోయింది గాని.."

"ఛీ"

"మరందుకే చెప్పేది.. వూ కానీ.. ఎంటర్ ది డ్రాగెన్"

"నాకంత ప్రాబ్లం లేదుకాని నువ్వు కాని.. నేను నిద్రపోతా.."

"నిద్ర పోతే ఎట్లా నా లగేజి చూస్తూ వుండు నేను వచ్చేస్తా.." అంటూ బాత్రూంలోకి దూరాడు. నిముషంలో బయటకి వచ్చాడు.

"ఏంట్రా అప్పుడే వచ్చావు ?.. అప్పుడే అయిపోయిందా?" అడిగాను నేను.

"ఏంటి అయిపోయేది.. మనకసలే పొలాల్లోకెళ్ళే అలవాటు.. ఈ అమెరికా బాత్రూములు మనవల్ల కాదు. దానికి తోడు ఇంత చలిగా వుంటే ఆ పింగాణీ మీద కూర్చుంటే ఆ చలికి నీలుక్కుపోవటమే గాని పని జరగదు.." అంటూ ఎదురుగా వున్న ఇండియన్ బాత్రూంలోకి దూరాడు.

నేను నవ్వుకుంటూ వచ్చి నా బెర్తు మీద పడుకున్నా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, లేచేసరికి తిరుపతిలో వున్నాం.

రైల్వే స్టేషన్లో స్నానాలు అది చేద్దాంరా అంటే ససేమిరా అన్నాడు ఉమాపతి.

"ఎందుకురా.. మనవూరి చెరువుగట్టు వర్ధనమ్మగారు లేరు, ఆవిడకి తెలిసిన వాళ్ళవి ఇక్కడ గెస్టుహౌసులు వున్నాయిట. ఆవిడ లెటరుకూడా ఇచ్చి పంపించారు. అక్కడికి వెళ్దాం పద" అంటూ కూలీని పిలిచాడు.

"ఇప్పుడు కూలీ ఎందుకురా..? ఏమంత లగేజీ వుందని??" అన్నాను నేను.

"నీకు తెలియదురా బాచి. తిరుపతి వచ్చేటప్పుడు ఇంట్లో మొక్కు పెట్టిన హుండీలో డబ్బులన్నీ తీసుకువచ్చాను. ఇంకా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు అంతా హుండీలో వెయ్యమని తలా కొంత ఇచ్చారు"

"అయితే"

"అయితే ఏమిట్రా.. ఆ డబ్బులు మొత్తం దేవుడి హుండీలోనే వెయ్యఖ్ఖరలేదుట.. దర్శనం అయ్యేదాకా అదే డబ్బుని వాడుకోవచ్చు అని మా నాన్న చెప్పాడు.."

"తప్పురా.. దేవుడి డబ్బది.."

"అవును మనం ఖర్చు పెట్టేదికూడా ఆయన్ని చూడటానికే కదా.. నీకెందుకు నాతో రా.." అంటూ కూలి వెంట కదిలాడు.

స్టేషన్ బయట సుదర్శనం చేతికి కట్టించుకున్నాము. సాయంత్రం వేళకి దర్శనం సమయం ఇచ్చారు. అక్కడినుంచి చెరువుగట్టు వర్ధనమ్మగారి బంధువుల గెస్టుహౌసుకి వెళ్ళాం.

వాళ్ళు మమల్ని చూడగానే "అరెరే మీరు వర్ధనమ్మగారి తాలూకా.. రండ్రండ్రాండి" అనలేదు కాని ఒక రూమేదో ఇచ్చారు. అసలు పైన తిరుమలలో అన్ని సత్రాలుంటే ఇక్కడ సత్రమెందుకు పెట్టారో మాకర్థం కాలేదు. సరేలే ఏదైతేనేమి అనుకొని స్నానలు ముగించి బయటపడ్డాం. అక్కడినుంచి అలిపిరి ఆ పైన పైనున్న తిరుమల.

"ఉమా ఆకలేస్తోంది ఏదైనా టిఫిన్ చేద్దామేమిట్రా..?" అడిగాను

"తప్పురా.. స్వామివారి దర్శనం కాకుండా టిఫిన్ చెయ్యకూడదు. పద అక్కడ హోటల్లో కాఫీ తాగుదాం.." అన్నాడు.


నేను కాఫీ చెప్పాను, ఉమా బాదంపాలు చెప్పాడు. మా ఎదురుగా కూర్చున్న అరవాయన సాంబరులో ఇడ్లీ పిసుకుతూ పూరీ కూడా చెప్పాడు. ఆయన వైపే చూస్తూ ఉమాపతి మెల్లగా అన్నాడు -

"బాచి చూడరా ఎలా తింటున్నాడో.. సాంబారు బాగున్నట్టుందిరా... వాసనకే కడుపులో ఆకలి నిద్ర లేస్తోంది.." అన్నాడు.

అంతలో బేరర్ చల్లటి కాఫీ వేడి వేడి బాదంపాలు తెచ్చి పెట్టాడు. అలాగే ప్లేటు పూరీ అరవాయనకి.

"ఇదేమిటయ్యా బాదంపాలు వేడిగా వున్నాయి.."

"ఇక్కడలాగే వుంటాయి... చల్లగా కావాలంటే చల్లార్చుకో..." అంటూ వెళ్ళిపోయాడు బేరర్.

ఉమాపతి ఒకరకంగా ముఖంపెట్టాడు. "మా సత్తెనపల్లిలో అయితే బాదంపాలు అంటే చల్లగా.." అంటూ చెప్పబోయాడు.

"సర్లేరా.." అంటూ నేను కాఫీ ముగించాను. ఉమాపతి బాదంపాలు వూదుకుంటూ పూరీ ప్లేటు వైపు ఆశగా చూస్తూ తాగాడు.

"పూరీ కూర చాలా బాగా చేసినట్టున్నాడురా వీడు.." అన్నాడు చూపు మరల్చకుండానే. అరవాయన ఒక రకంగా మా వైపు చూసాడు. ఇద్దరం లేచి బయటపడ్డాము.


***

మూడు గంటల్లో అవుతుందనుకున్న దర్శనం ఐదు గంటలు పట్టింది. ఎవరో వీఐపీ వచ్చుంటారనుకున్నాము. చివరకి గర్భాలయంలోకి "గోవిందా గోవిందా" అంటూ అడుగుపెట్టాము.

"బాచి.. ఒరేయ్ బాచి.. అది చూసావా.." అంటూ మూలవిరాట్టువైపు చూపింఛాడు.

"స్వామినే చూస్తున్నానురా.."

"స్వామి కాదురా.. స్వామినెప్పుడైనా చూడచ్చు. వెనకాల ఆ ఫాను చూసావా.."

"ఫానా..?"

"అవునురా.. చూడు ఎంత స్పీడుగా తిరుగుతోందో.. అసలు రెక్కలున్నాయా లేవా.."

"ఉమా.. ఇంత దూరం వచ్చింది స్వామి దర్సననికిరా.. ఫానేమిటిరా ఫాను...??"

"స్వామిదేముందిరా.. కాలండర్లో కూడా చూడచ్చు.. రెక్కలు వున్నాయా లేవా అన్నట్టు తిరిగే ఆ ఫాను చూడరా.." అంటూనే వున్నాడు వాణ్ణి నన్ను కలిపి తోసేసారు. ఇంకేముంది బయట పడుతూనే బండనీతులు తిట్టాను. నువ్వు చెడింది కాక నన్నూ చెడగొడతావా అంటూ.. ఇంతలో ప్రసాదాల దగ్గరకి వచ్చాము. చక్కరపొంగలి చేస్తున్నారు. నేను, ఉమాపతి చెరొక ఆకు దొప్ప పట్టుకొని ప్రసాదం తీసుకున్నాం.
"పదరా ఆ పక్కన కూర్చొని లాగించేద్దాం.." అన్నా నేను.

"ఏమిటి తినేది.. ముదు అర్జెంటుగా పొద్దున్న వెళ్ళిన హోటల్‌కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ, పూరీ కూరా తినాలి. పొద్దున చూసిన దగ్గర్నించి అవే కళ్ళముందు మెదుల్తున్నాయి.." అన్నాడు ఉమ.

నేను మాత్రం ప్రసాదం తినడం మొదలుపెట్టాను. అక్కడే వున్న చిన్న షాపుకు వెళ్ళి, వాళ్ళతో ఎదో గొడవ పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తెచ్చుకున్నాడు ఉమ. ఆ కవర్లో ప్రసాదం వేస్తుంటె నేను అడిగాను -

"ఏమిట్రా గొడవ..?" అని

"లేకపోతే డబ్బులిచ్చినా వుత్త కవర్లు అమ్మర్ట.. ఏదైనా కొనుక్కోవాళ్సిందే అన్నాడు.. నేను వదుల్తానా.."

"సరే ఇంద ప్రసాదం" అంటూ నా చేతిలో వున్న కొంచం మిగులు వాడి చేతిలో పెట్టాను. అది తింటూనేఎ వాడు అరచినంత పని చేసాడు.

"బ్రహ్మాండంగా వుందిరా.. బాచిగా.. ఇంత బాగుందని తెలిస్తే ఇక్కడే.." అంటూనే వునాడు వాడి చేతిలో కవర్ కింద అడ్డంగా చిరిగిపోయి చక్కర పొంగలి రోడ్డుమీద పడిపోయింది. ఆ కవరు ఇవ్వడానికి గొడవ పెట్టుకున్న షాపాయన పగలబడి నవ్వడం వినిపిస్తూనే వుంది. మేము ముఖ ముఖాలు చూసుకున్నాం. ఉమాగాడు ఆ పొంగలి మీదకు వంగి -


"చూడరా జీడిపప్పులు ఎట్లా కనిపిస్తున్నాయో... నెయ్యి కూడా దండిగా వేసినట్టున్నారు.."

"సర్లే పదరా... ఇప్పుడింకేమి చెయ్యగలం.."

"కానీ ఎంత బాగ చేసార్రా.. నీ కక్కుర్తి కాకపోతే మొత్తం నువ్వే తినాలా.."

"నువ్వే కద్రా వద్దన్నావు..!!" అన్నాను నేను

"అంటే మాత్రం తినెయ్యడమేనా... " అంటూనే ముందుకు నడిచాము. ఉమాపతి అప్పటికీ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే వున్నాడు. ఇద్దరం హోటల్ దగ్గరకు చేరేసరికి రాత్రి పది కావొస్తోంది. హోటల్లోకి వెళ్ళగానే ఇడ్లీ సాంబార్, పూరీ కూరా అన్నాడు మనవాడు.

"ఇప్పుడు అవెందుకు దొరుకుతాయి సార్... చెపాతీ, భోజనం వున్నాయి" చెప్పాడు సర్వర్.

"రేయ్ అటు ప్రసాదమూ పాయే, ఇటు సాంబారూ పాయరా..!!"

"ఇంక సణుగుడు ఆపి, ఏం కావాలో చెప్పు.."

"చెపాతీ.."

"ఒక చెపాతి ఒక భోజనం" చెప్పను నేను సర్వర్‌తో.

భోజనం బాగానే వుంది.

"చెపాతీ కాస్త గట్టీగా వున్నటుంది..?" అడిగాను ఆపుకోలేక.

"గట్టిగానా.. మా గోవిందానికిస్తే చెప్పులు కుట్టిపెడతాడు.."

నేను నవ్వుకున్నాను. ఇద్దరం కానిచ్చి, హోటల్ కి వచ్చి ఖాళీ చేస్తున్నామని చెప్పాం. బ్యాగులు సర్దుకొని వచ్చే సరికి వాళ్ళు బిల్లు చేతిలో పెట్టారు.

"ఏమిటిది..??"

"బిల్లు సార్... పన్నెండువందల డెభై.."

"మేము చెరువుగట్టు వర్ధనమ్మగారి తాలూకా అని చెప్పాం కదా.. లెటర్ కూడా ఇచ్చాము."

"అయితే.. డబ్బులు కట్టరా..??మీరు వర్ధనమ్మ గారి తాలుకనో జిల్లానో మాకు తెలియదు. ఇక్కడ వుంచమని ఆమె లెటరిచ్చింది గాని వూరకనే వుంచమని కాదు."

"అంటే.. ఇప్పుడు.."

"డబ్బులు కట్టండి.. "

"అంత లేవే.."

"మాకు ముందే తెలుసు మీకంత లేదని.. వున్నవిచ్చి, వాచీలక్కడపెట్టండి.."

ఇద్దరం వున్నదంతా వూడ్చి అక్కడ పెట్టాం, వాచీలు కూడా.. అదృష్టం బాగుండి రిజర్వేషన్ టికెట్ వుంది. రిక్షా కని పదిహేను రూపాయలు తీసుకొని బయటపడ్డాం.

"ఏరా.. దేవుడి డబ్బులు దర్శనం దాకా ఎంతైనా వాడచ్చా..?? నిలువు దోపిడి అంటే తెలుసా నీకు.." ఆడిగాను నేను.

ఉమాపతి నా వైపు గుర్రుగా చూసాడు.

గోవిందా గోవిందా అన్నాను నేను.
(ఉమాపతిలాంటి ఒకరితో తిరుపతి వెళ్ళి వచ్చిన మా బంధువుల దగ్గర విని చిన్న మార్పులతో ఈ కథ..!!)

మతిమరపించే కట్టడం - భూల్‌భులయ్య

లక్నో.. ఆ నగరంలో ఆడుగు పెడుతూనే ఎక్కడ్నించో చిన్నగా ఘజల్ విన్న అనుభూతి కలుగుతుంది.అవధ్‌గా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతంలో పెర్సీయా నించి వచ్చిన నవాబులు పాలించినట్టు చరిత్ర చెబుతుంది. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడి ద్వారా నిర్మించిన నగరమని లక్ష్మణుడి పేరుమీదే లక్నో అనే పేరువచ్చినట్టు ఇక్కడి పుక్కిటపురాణం. నవాబుల రాచరిక విలాసాలు, ఇక్కడ దొరికే కబాబులు బిర్యానీల గురించి ఒక రెండు మూడు టపాలేసుకోవచ్చు. ఇప్పటికిమాత్రం "భూల్ భులయ్యా" గా పేరుపడ్డ ఇమాంబారా అనే ఒక కట్టడం గురించి చెప్తాను.


ఫోటో చూసారుగా.. లోపలికి అడుగుపెడుతూనే కాలంలో వెనక్కి వెళ్ళిపోయామా లేక ఏదైనా చారిత్రక సినిమా చూస్తున్నామా అని అనుమానం వస్తుంది (హిందీ గదర్, ఉమ్రావ్ జాన్ లాంటి సినిమాలు ఇక్కడే తీసారుట). అక్కడి గైడులు అడక్కుండానే మొదలు పెట్టేస్తారు - "సార్ గైడులేకుండా లోపలికి వెళ్తే రెండురోజులైనా బైటికి రాలేరు" అని. అందుకే దాన్ని భూల్ భులయ్యా అన్నారు..!!


1784లో అసఫుద్ద్‌దౌలా అనే నవాబ్ గారి ఆదేశాల మేరకు ఈ కట్టడాన్ని కట్టారు. ఆ సమయంలో కరువు పరిస్థితులు చూసి నవాబుగారు కొన్ని వేల మందికి వుద్యోగం కల్పించాలని ఈ కట్టడాన్ని కట్టించారట. పైగా కట్టడం పూర్తైతే పని ఉండదని నవాబుగారు పగటిపూట కట్టినదాన్ని రాత్రిపూట కూలగొట్టేవారట. ఎంత ముందు చూపు..!!


ఈ ప్రాంగణంలో కనిపించేవి మూడు కట్టాడాలు - బరాఇమాంబారా, ఒక మసీదు, దిగుడుబావిగా రూపాంతరం చెందిన అయిదంతస్థుల భవనం. మూడూ మొఘలు-పెర్షీన్-గోథిక్ శైలుల సమాగమంగా కనపడుతాయి.

భూల్‌భులయ్య

ఇమాంబారాలో మూడు పెద్ద పెద్ద హాల్సు లాంటి గదులుంటాయి. ఈ ముడు గదుల మధ్య వుండే లింకులే మన భూల్‌భులయ్య. దాదాపు వెయ్యి గుమ్మాలతో ప్రతి పది అదుగులకి ఒక నాలుగు దారుల కూడలితో వుంటుంది. ఆ దారుల్లో కొన్ని అర్థాంతరంగా ఆగిపోతాయి. కొన్ని తిప్పి తిప్పి మళ్ళి అక్కడికే చేరుస్తాయి. కొన్ని రహస్య మార్గాలు గోమతి నదీ తీరానికి చేరుస్తాయి(ట).. ఇప్పుడు అవి మూసేసారులెండి. నిపుణుడైన మార్గదర్శకులు లేకపోతే ఎటువెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడం అసాధ్యం. మనం ఒకసారి తిరిగిన చోటికే మళ్ళీ వచ్చినా గుర్తించటం చాలా కష్టం. అన్ని దారులు ఒకే లాగ వుంటాయి మరి..!!



అక్కడి గైడులు అంతా చూపించి చివరగా పై అంతస్థుకు తీసుకెళ్తారు. అక్కడ కిందికి వెళ్ళడానికి ఆరు దారులుంటాయి. మీ ఇష్టం వచ్చిన దారి ఎంచుకోండి ఎంత సేపటికి వెళ్ళగలరో చూద్దామని సవాలు విసురుతారు. (నాకు ఒక క్లూతో అరగంట పట్టింది - అసలు ఆ దారిలో తెలిసినవాడు కిందకి రావటానికి రెండు నిముషాలు పడుతుందట!!)


మరిన్ని విశేషాలు

ఒకేలా కనిపిస్తున్న ఆ మార్గాలో వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఒక హాలు పై భాగంలో వుంటారు. "అదిగో చూడండి గుండ్రటి పైకప్పు చైనా శైలిలో నిర్మించారు" అంటాడు గైడు. కొంచం ముందుకి అంటే కుడి ఎడమలు ఎడాపెడా తిరిగి మళ్ళి అలాగే కనిపిస్తున్న ప్రదేశానికి చేరాక చూస్తే - అది గుండ్రటి కప్పున్న హాలు కాదు.. అంటే రొండొవ హాలన్నమాట. ఎప్పుడు మొదటి హాలులోనించి రెండోవ హాలులోకి వచ్చామో అర్థం కాదు. గుండ్రటి చైనా కప్పుకోసం చూస్తే అది పర్షియన్ శైలిలో కట్టిన చతురస్రాకారాకారపు కప్పు. "మీరు నిలిచున్న చోటే నవాబుగారు కూర్చునేవారు" అంటాడు గైడు మళ్ళి. వొల్లు జలదరిస్తుంది... ఈ నవాబుగారేమైనా బిల్డింగు నమూనా పట్టుకొని తిరిగేవారా అనిపిస్తుంది. ఇక్కడే ఒక మూల మనల్ని నిలబెట్టి గైడు అవతలి వైపు (330 అడుగులు) నిలబడి అగ్గిపుల్ల గీస్తాడు. ఆ శబ్దం మనకి స్పష్టంగా వినపడుతుంది. అలాగే కాగితం చించిన చప్పుడు సైతం మనకి వినపడుతుంది. శబ్దం ప్రాయాణించే మార్గాలని నిర్దేశించే పెర్షియన్ శైలి ఆర్చీలు నవ్వుతున్నట్టు కనిపిస్తాయి.
ఆ హాలుకి దక్షిణంవైపున్న కిటికీలలోనించి ప్రధాన ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ద్వారం దగ్గర నిలబడ్డవారికి ఈ కిటికీ దగర వున్న వాళ్ళు కనిపించే అవకాశమే లేదు. శత్రుదాడులేమైనా జరిగితే రక్షణ కోసమే ఈ ఏర్పాటు. ఆ పక్కనే వున్న గోడ దగ్గర నిలబడి గుస గుసగా మాట్లాడితే ఒక పదడుగుల దూరంలో నిలబడ్డ వాళ్ళకి వినబడటం మరొక ఆశ్చర్యం. "గోడకి చెవులుండటం అనే సామెత ఇందుకే వచ్చింది" అని గైడు నవ్వుతూ చెప్తాడు.


ఆ పరిసరంలోనే వున్న మరో కట్టడం పడమటివైపున్న షాహీ హమాం అనే భవంతి. ఇది ముందు సైనికుల నివాసంగా రూపొందించినా తరువాత తరువాత దుగుడు బావిగా మార్చారు (భవంతి అంత బావి..!!). ఆ భవంతి ముఖద్వారం దగ్గర నిలబడితే, అదంతస్తుల భవనం పైకప్పే కనపడుతుంది. ఆ భవంతిలో వున్న వారికి మాత్రం దర్వాజా దగ్గర నిలబడ్డవారు గురి చూసి బాణం వదిలేంత స్పష్టంగా కనపడతారు - అదీ నీటిలో..!!

ఈ భవనంలో ప్రస్తుంతం రెండు అంతస్థులు భూగర్భంలో నీటిలో వున్నాయి. ఈ బావి గోమతీ నదితో కలపబడిందని, లోతు తెలుసుకునే ప్రయ్త్నాలు అందుకే ఫలించలేదని చెప్తారు. ఈ భావికి ఎదురుగానే మసీదు వుంది - ఎదో టర్కీ దేశంలో వున్నాట్టు పొడవాటి మినార్లు అద్బుతంగా కనపడతాయి.
బయటికి వచ్చాక గుర్రపుబండ్లు ఎక్కి అలా ఆ వీధుల్లో తిరిగితే మనంకూడా ఏదో రాజ్యానికి నవాబులం అపోయినట్లుంటుంది.


తోలుబొమ్మలాట

పేరే తోలుబొమ్మలాట అని పెట్టి తోలుబొమ్మలాట అంటే ఏమిటో చెప్పకపోతే ఎట్లా. ఇదిగో ఇదే తోలుబొమ్మలాటంటే-



దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జానపద కళలో ప్రముఖంగా భారతం, రామాయణం (లంక దహనం మరీ ప్రత్యేకం. ఇక్కడ వున్న చిత్రాలు ఆ కథలోనివే) ప్రదర్శిస్తారు. ఆంగ్లంలో చెప్పే పప్పెట్రీని, షాడో ప్లేలని కలిపి చేసినట్టుండే ఈ కళ ఆంధ్ర తమిళనాడులకు మాత్రమే ప్రత్యేకం.




గొర్రె తోలును ఎండబెట్టి దానిపై రగులద్ది బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలు పారదర్శకంగా వుంటాయి కాబట్టి తెరవెనక నిలబెట్టి వాటి వెనక దీపాలు (పూర్వం ఆముదపు దీపాలు, ఇప్పుడు కరెంటు దీపాలు) పెడతారు. దాంతో ఆ బొమ్మల రూపం తెల్లటి తెరమీదుగా మనకి కనిపిస్తాయి.



చెన్నైలో వుండగా జరిగిన తెలుగు సభలలో తీసినవివి.

ధర్మరాజు స్వర్గారోహణం

యుధిష్టరుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా వైభోవోపేతంగా నిర్మించిన ద్వారమొకటి కనపడింది. తానెక్కడున్నాడో అర్థంకాలేదు. తన తమ్ముళ్ళతో ద్రౌపదితో కలిసి స్వర్గారోహణ చెయ్యటం ఒక్కొక్కళ్ళుగా అందరూ రాలి పోవటం అంతా అతని కళ్ళముందు కనపడింది.

అంటే తాను మరణించాడా..? ఈ కనపడేవి స్వర్గ ద్వారాలేనా..??

"యుధిష్టిరునికి స్వాగతం" అన్నారు ద్వారానికి ఇరువైపులా వున్న భటులు. మహారాజా అన్న పిలుపుకి అలవాటు పడ్డందుకేమో యుధిష్టరుడనే పిలుపు కొత్తగా వినపడింది.

"నన్ను అందరూ ధర్మరాజంటారు.." చెప్పాడు

"మాకున్న ధర్మరాజు ఒకడే.. మా ప్రభువు యమధర్మరాజు.."

"అంటే ఇది స్వర్గం కాదా..?"

"ఇక్కడ స్వర్గమూ వుంది నరకమూ వుంది.." అంటుండగానే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి.

యుధిష్టరుడు లోపలికి ప్రవేశించాడు. కొంత ముందుకెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడ -

శొభాయమానమైన సింహాసనంపై ఆసీనుడై వున్నాడు ధుర్యోధనుడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతూ, సుర్యతేజంతో ప్రభాసిస్తూ..

ఇది నిజమా.. లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా..? అనుకుంటూ తల తిప్పేసుకున్నాడు. తనతో వస్తున్న భటులతో అన్నాడు -

"ఈ ముందుచూపులేని మూర్ఖుడు దుర్యోధనుడితో నేను ఈ లోకాన్ని పంచుకోలేను. కురుక్షేత్ర సంగ్రామానికి, కురు వంశ నాశనానికి కారణం అతడే. భటులారా నేను ఆతడి ముఖం కూడా చూడలేను. నన్ను దయచేసి నా తమ్ముల దగ్గరకు తోసుకెళ్ళండి.." అంటూ అడిగాడు. అంతలో ఒక మహాపురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

"యుధిష్టిరా.. ఇది సమవర్తి లోకం.. ఇక్కడ ద్వేషానికి, శత్రుత్వానికి ఆస్కారంలేదు. దుర్యోధనుడి గురించి నీవటుల పలకరాదు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో పోరాడి మరణించి అంతను ఇక్కడ స్వర్గ సౌఖ్యాలనుభవిస్తున్నాడు. ఇక్కడ దేవతలు సైతం అతనిని పూజిస్తారు. కాబట్టి ఇక ద్వేషాన్ని మరచి అతనితో కలువు.." అంటు హితబోధ చేసాడు.

"సరే దురోధనుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినవాడైతే అతన్ని ఇక్కడే వుండనీ... నేను మాత్రం ఇక్కడుండలేను. యుద్ధంలో మరణించినవారికే స్వర్గమైతే నా అభిమన్యుడెక్కడ, దుష్టద్యుమ్నుడు అతని కుమారులెక్కడ, గురు ద్రోణులు, పితామహుడెక్కడ... నా అగ్రజుడు కర్ణుడుడెక్కడ... నా తమ్ముళ్ళెక్కడ..?? నన్ను అక్కడికి తీసుకెళ్ళండి.."

"అవశ్యం. మీరు ఏది కోరితే అది నెరవేర్చమని మా ప్రభువు ఆజ్ఞ.. మా భటులతో వెళ్ళండి మీరు కోరిన చోటికి తీసుకెళ్తారు.." అంటూ ఆ దేవతాపురుషుడు అదృశ్యమయ్యాడు. భటులు ముందుకు కదిలారు. యుధిష్టరుడు వెనకే నడవసాగాడు.


ఆ దారంతా ఎంతో దుర్భరంగా వుంది. పాపాలు చేసిన మానవులంతటా పరుచుకొని వున్నారు. ఇనప ముళ్ళున్న కందిరీగలు కుడుతున్నాయి, కాకులు గద్దల ఇనుప ముక్కులతో రక్తమోడుతున్నాయి. కుళ్ళిపోయిన శవాలున్నాయి... వాటి నిండా దుర్గంధభరితమైన కీటకాలు. కొంత దూరం వెళ్ళాక మరుగుతున్న నీటితో నిండిన నది కనపడింది. అది దాటిన పిమ్మట ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అక్కడి చెట్లకు కత్తులాంటి ఆకులున్నాయి.. అవన్ని యుధిష్టరుడికి గీసుకొని రక్తం కారసాగింది. కాగుతున్న నూనెలో మరుగుతూ, రాళ్ళతో, ఇనుముతో చేసిన ఆయుధాల దెబ్బలు తింటూ యమలోకపు శిక్షలనుభవిస్తున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు భయంకరంగా వున్నాయి.

అక్కడి పరిస్థితి ముందుకెళ్తున్నకొద్దీ మరింత దుర్భరమవసాగింది. యుధిష్టరుడు అసహనంగా అడుగులు వెయ్యసాగాడు. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. భయంకరమైన దుర్గంధం తప్పించి తను ఎటు వెళ్తున్నది అర్థం కావటంలేదు. పాదాలలో సూదికొనయైన ముళ్ళు దిగబడి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఇక ముందుకు అడుగులెయ్యలేక అక్కడే ఆగిపోయాడు.

"భటులారా.. ఇంకా ఎంత దూరం ఈ హేయమైనా ప్రదేశంలో నడిపిస్తారు... నా తమ్ముళ్ళను చూపించండి.. ఇక వారిని చూడటానికి నేను ఒక్క క్షణం కూడా వేచి వుండలేను.." అన్నాడు బాధగా.

"అయ్యా.. మనం చేరవలసిన చోటికి చేరుకున్నాము. మిమ్మల్ని ఇక్కడిదాకా మాత్రమే తీసుకురమ్మని మా ప్రభువుల ఆజ్ఞ. మీరు సమ్మతిస్తే ఇక్కడే వదిలేసి మేము తిరిగి వెళ్ళిపోతాము. లేదా మాతో తిరిగి రాదలుచుకుంటే తీసుకు వెళ్తాము. తమ ఆజ్ఞ ఏమిటో తెలియజేయండి."

యుధిష్టరుడు ఆశ్చర్యపోయాడు. కన్ను కానని ఈ చీకటిలో, భయంకరమైన ఆడవిలో ఎక్కడని తమ్ముళ్ళను గాలించగలడు. ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఒక్క క్షణం కూడా జీవించి వుండలేడు. ఇలా అనుకుంటూ యుధిష్టరుడు వెనుతిరిగాడు. అంతలో నలువైపుల నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి..

"ధర్మనందనా.. మమ్మల్ని విడిచి వెళ్ళద్దు.."

"మమ్మల్ని కాపాడు అన్నయ్యా..."

"నీ రాకతో ఇక్కడికి పరిమళ భరితమైన సువాసనలు ప్రవేశించాయి.. మాకు ఈ దుర్గంధాన్ని తప్పించే ఆ ఒక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావా.."

యుధిష్టరుడు అదిరిపడ్డాడు. "ఎవరది.. ఎవరు మాట్లాడుతున్నారు..??" అడిగాడు

"అన్నయ్యా మేము నీ తమ్ముళ్ళం.. పాండు కుమారులం.."

"పెదనాన్నా మేము మీ పుత్రులం.. వుప పాండవులం"

"నేను ద్రౌపదిని"

"అభిమన్యుడను.."

యుధిష్టరుడి కంట అప్రయత్నంగా కన్నీరు వుబికింది.

"హతవిధీ.. ఏమిటీ ఘోరం..? మహావీరులైన తమ్ముళ్ళు, సాధ్వి ద్రౌపది, నా పుత్రులు వీరంతా వుండవలసిన చోటేనా ఇది. దుర్యోధనుడు చేసిన పుణ్యమేమిటి వీరంతా చేసిన పాపమేమిటి?? ఎందుకు వీరికీ శిక్ష విధించారు..? నా చిత్తమేమైనా చెలించినదా.. అస్వస్థుడనై నిద్రావస్థలో ఈ భయంకరమైన కలగంటున్నానా.." అనుకుంటూ అక్కడే కొంతసేపు నిలబడిపోయాడు.

అంతలోనే తేరుకొని భటులతో -

"మీరు వెళ్ళిపోండి.. మీ ప్రభువుతో నేను ఇక్కడే వుండటానికి నిశ్చయించుకున్నానని నివేదించండి. నా వునికి నా సోదరులకు ఇతర పాపులకి సాంత్వన కలగజేస్తుంటే వారి సుఖం కోసం నేను ఈ బాధలను భరించడానికి సిద్ధమే అని తెలుపండి.. వెళ్ళండి"

ఆ మాట వింటూనే వారు తిరిగివెళ్ళిపోయారు. యుధిష్టరుడు నిస్సహాయంగా నాలుగువైపుల చూసాడు.
"ఏమిటి విచిత్రం? నా తమ్ముళ్ళు నరకంలో వుండటమేమిటి? సరే, విధిరాతను తప్పించడం ఎవరికి సాధ్యం. నా పరివారానికి ఇదే రాసిపెట్టివుంటే అలాగే జరగునుగాక. సుయోధనుడు వీరమరణంతో అమరుడై వుంటే వుండుగాక. నేను మాత్రం ఇక్కడే వుంటాను. భూలోకంలో మహరాజుగా వీరందరి సేవలను అందుకున్నాను. ఇప్పుడు వీరందరికీ సేవ చేస్తాను. వారి సుఖంలోనే నాకు సుఖం వుంది, వారి సంతోషంలోనే నాకు సంతోషం వుంది, వారెక్కడ వుంటే అదే నాకు స్వర్గమౌతుంది" అనుకుంటూ ముందుకు కదలబోయాడు.

సరిగ్గా అప్పుడే దూరం నుంచి సుర్య తేజాన్ని మించిన వెలుగును చూసాడు. అది క్రమంగా దగ్గరకు రాసాగింది. ఆ వెలుగు ప్రసరించడంతో ఆ ప్రాంతమే మారిపోయింది. నరకలోక శిక్షలన్నీ మాయమై ఆ స్థానే దేవతా వృక్షాలు వాటికింద తపస్సు చేసుకుంటున్న మునులు కనిపించారు. అమోఘమైన పూల పరిమళాలు పరచుకున్నాయి. ఆ పరిసరాలన్నీ అద్భుతమైన దృశ్య కావ్యంగా మారిపోయాయి. ఆ వెలుగుతోబాటే ఇంద్రుడు, యమకుబేరాది అష్టదిక్పాలకులు వచ్చి యుధిష్టరుడి ముందు నిలబడ్డారు.

"ధర్మరాజా.." అన్నాడు ఇంద్రుడు.

"లేదు ప్రభూ నేను యుధిష్టరుడిగానే సంతుష్టుడిని. నా పరివారమంతా నరకంలోవుంటే నన్ను ధర్మరాజని పిలవడాం హాస్యాస్పదంగా వుంటుంది." అన్నాడు యుధిష్టరుడు చేతులు జోడించి.

"నీ పరివారమెవ్వరూ నరకంలో లేరు ధర్మనందనా.. అది కేవలం నీ భ్రమ మాత్రమే. రాజుగా పుట్టినవాడు నరకాన్ని చూసితీరాలని ప్రతీతి. అందునా ద్రోణుణ్ణి వధించడానికి నీవు మోసానికి పాల్పడ్డావు. మరణిచినా ఈర్షాద్వేషాలు నీలో చావలేదని దుర్యోధనుణ్ణి చూసి చెప్పకనే చెప్పావు. వీటన్నిటి పర్యవసానమే ఈ నరకలోక అనుభవం.." చెప్పాడు ఇంద్రుడు.

యమధర్మరాజు పుత్రవాత్సల్యంతో -"నాయనా.. నేను నీకు పెట్టిన మూడొవ పరిక్ష ఇది. పూర్వం ద్వైత వనంలో నీవు సమిధలకై వచ్చినప్పుడు ఒక తటాకం వద్ద నిన్ను ప్రశ్నించాను, మహాప్రస్థానంలో కుక్కగా నీ వెంట వచ్చి పరీక్షించాను, ఈ నరకానుభవం కూడా అలాంటిదే. అసూయ ద్వేషాన్ని విడనాడి నీ పరివారానికి తోడుగా నిలవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావో అప్పుడే నీ శిక్ష ముగిసింది. నరకము స్వర్గము అని రెండు వేరు వేరు ప్రదేశాలు లేవు. నీ మనసులో ఈర్ష వున్నప్పుడు ఇదే నరకం, సంతోషమున్నప్పుడు ఇదే స్వర్గం" అన్నాడు నవ్వుతూ.

"ధర్మరాజు" నమస్కరించాడు.


03.10.2008