అసమర్థుని ప్రేమయాత్ర


ఆమె చనిపోయింది.
అవును అంతే…! ఆమె చనిపోయింది… ఆ చిన్న వాక్యంలోనే గూడుకట్టుకోని వుంది నా విషాదమంతా. పన్నెండేళ్ళ సావాసానికి, ప్రేమకి చరమగీతం పాడేసి వెళ్ళిపోయింది గీత. వెన్నలలో తడిసిన మా మనసుల తడి ఆరకముందే చీకటైపోయింది. నా చెవిలో గుసగుసగా చెప్పిన రహస్యాలకి అర్థం నేను తెలుసుకునేలోపే తనే ఒక రహస్యమైపోయింది.
నేను అలాగే నిలబడి చూస్తున్నాను.
ఇప్పుడు నా ఎదురుగా వున్నది ఒకప్పుడు నేను చూసిన గీత కాదు. అప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు కళ్ళ కింద ఆ నల్లటి చారలు లేవు, మందు తాగి తాగి ఉబ్బిపోయిన కళ్ళు లేవు, సిగెరెట్లతో నల్లబడ్డ పెదాలు లేవు. అప్పట్లో ఆమె ముఖంలో ఈ విషాదంలేదు… అవునులే అప్పట్లో ఆమెకి భగ్న ప్రేమాలేదు, అసమర్థుడైన నా లాంటి ప్రేమికుడూ లేడు. నేను గమనించలేదు కానీ బహుశా నాతో పరిచయమే ఈ మార్పుకి కారణం అయ్యుంటుంది.
నా కళ్ళలోకి నీళ్ళు రావటంలేదు. తడి మొత్తం మనసులోనే. ముఖంలోకి రానంటోంది. ఎవరైనా చూస్తారేమో అన్న భయం. అప్పుడప్పుడు వచ్చి పోయే స్నేహితుడిగా వున్న హోదా, ఎక్కువగా ఏడవటానికి సరిపోదు. ఆమెని కలవడానికి ఎన్నిసార్లు వచ్చినా మనసులో ముల్లులా ఇదే భయం. ఎవరైనా చూస్తారేమోనని !! ఈ సారి కూడా.
సెల్ ఫోన్ మోగింది. శారద.
“ఎక్కడున్నావు? పొద్దుననగా వెళ్ళావు… ఎక్కడికో, ఏమిటో చెప్పి చావవు… తినడానికన్నా వస్తావా లేదా?” శారద మాట్లాడితే సమాధానం చెప్పడానికి అవకాశాలు వుండవు. “వస్తాను” అన్నాను.
“వచ్చేటప్పుడు ఏదైనా కర్రీ పాకెట్ తీసుకురా… అన్నం మాత్రం వండాను… అన్నట్టు వీధి చివర టైలర్ నా జాకెట్లు ఇస్తానన్నాడు. అవి కూడా తీసుకురా”
“సరే” అన్నాను గీత శవం వైపే చూస్తూ.
“సరే అనడం కాదు… గుర్తుపెట్టుకో… మళ్ళీ మర్చిపోయాను అనకు…”
“సరే అంటున్నాగా…”
“ఎందుకు అలా నెమ్మదిగా మాట్లాడుతున్నావు”
“ఏదో పనిలో వున్నాలే… మళ్ళీ చేస్తా…” పెట్టేశాను. ఎప్పుడు శారద ఫోన్ చేసినా నవ్వేది గీత. ఇప్పుడు కూడా నవ్వుతున్నట్టే అనిపిస్తోంది.
“నీకు పెళ్ళాం ఫోన్ చేసిందంటే భయం… కదూ” అంది ఒకసారి జలజలా నవ్వేస్తూ.
“నీకు తెలుసుగా శారద సంగతి. చిన్న విషయాన్ని పెద్దది చేసేస్తుంది. అరుస్తుంది” అన్నాను సంజాయిషీగా.
“ఏ పెళ్ళానికీ మొగుడు ఇంకో అమ్మాయితో పడుకోవడం చిన్నవిషయం కాదు భద్రం… అయినా నీ భయం ఒక్క శారద విషయంలోనే అయితే ఆమెని తప్పు పట్టచ్చు… నీకు ఎప్పుడూ భయమే కదా… ఊర్లో జనం అంతా నిన్నే చూస్తారని భయం, పక్కింటివాళ్ళకి మన పడకింట్లో శబ్దాలు వినపడతాయని భయం… అలా భయపడుతూనే ప్రేమించావు, భయం కారణంగానే నన్ను పెళ్ళి చేసుకోలేకపోయావు…” అలా అన్నప్పుడు ఆమె మాటల్లో కోపం కన్నా నిరాశే ఎక్కువగా కనపడేది.
“ఇంకా ఎవరైనా కావల్సినవాళ్ళు రావాలా?” పురోహితుడు గట్టిగా అడుగుతున్నాడు.
ఎవరు కావల్సినవాళ్ళు? గీతకి ఎవరూ కావల్సినవాళ్ళు లేరు. తల్లి లేదు. పెళ్ళి చేసుకున్నవాడు వదిలేశాడు. మిగిలిన బంధుజనాన్ని గీతే వదిలేసింది. ఆమె మునుపు పనిచేసిన ఆఫీస్ కొలీగ్స్ కొంతమంది వచ్చినా అక్కడ ఎక్కువసేపు నిలబడలేదు. ఆ అమ్మాయి తండ్రి, నేను మాత్రమే లెక్కకి మిగిలిన కావల్సినవాళ్ళం.
గీత శవాన్ని చూసినప్పుడు కన్నా ఇంటినిండా వున్న మందు బాటిల్స్, సిగరెట్ పీకలు చూసినప్పుడు ఎక్కువ ఏడ్చాడు గీత తండ్రి విశ్వేశ్వరరావు. దానికే ఇంత గుండెలు బాదుకుంటే ఆ అమ్మాయికి నాకు వున్న సంబంధం గురించి తెలిస్తే ఇంకా ఏమైపోతాడో అనుకున్నాను.
పురోహితుడు కావల్సిన సర్దుకోని కార్యక్రమానికి ఉపక్రమించాడు.
“మీ పేరు రామభద్రే కదూ?” అన్నాడు గీత తండ్రి విశ్వేశ్వరరావు.
“అవునండీ..”
“అమ్మాయి నీ గురించి చెప్తుండేది… నువ్వన్నా ఆ పిల్లకి ఆసరగా వున్నావు అదే చాలు…” అన్నాడాయన నిట్టూరుస్తూ.
చెప్పేసింది…!!
నా గురించి వాళ్ళ నాన్నకి చెప్పేసింది.
ఎవరికీ చెప్పనని నాకు ఒట్టేసిన గీత… వాళ్ళ నాన్నతో మా సంబంధం గురించి చెప్పేసింది…!! ఎంత పరువు తక్కువ? అసలు ఇలాంటి విషయం తండ్రితో ఎలా చెప్పగలిగింది? నేను గీతని ప్రేమించిన సంగతి మా నాన్నకి చెప్పడానికే భయపడ్డాను. ఆ తరువాత మా ఇద్దరికి విడివిడిగా పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆమె మొగుడు వదిలేసిన తరువాత మళ్ళీ మా ఇద్దరికీ అనుకోకుండా పరిచయం. ఆ తరువాత ఎండిపోయిన చెట్టు మొదట్లోనుంచి కొత్త పచ్చదనం పుట్టుకొచ్చినట్లు మా ప్రేమ మళ్ళీ చిగురించడం మొదలైంది. అయినా కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా నెట్టుకొస్తున్న వ్యవహారం అది.
నిజంగా గుట్టుగానే వుందా? లేకపోతే తండ్రికి చెప్పినట్లు అందరితో చెప్పేసిందా? కళ్ళు మూసుకోని పాలు తాగే పిల్లిలాగే నేను కూడా అందరికీ తెలిసిపోయిన విషయాన్ని, ఎవరికీ తెలియదన్న భ్రమలో బ్రతికేస్తున్నానా?
చుట్టూ చూశాను. అన్నీ శవాన్ని చూడటానికి వచ్చిన ముఖాల్లానే వున్నాయి.
అదిగో అక్కడ – ఆ ఎర్రచీర కట్టుకున్న ఆవిడ నా వైపే చూస్తూ పక్కన వున్న ఆవిడతో ఏదో చెప్తోంది… ఖచ్చితంగా నా గురించే అయ్యుంటుంది. ఈ పక్కన గీత శవం వెనుకగా వున్న వ్యక్తి నన్నే చూస్తున్నాడు. తెలిసిపోయిందేమో… అందరికీ తెలిసిపోయిందేమో… వుండకూడదు… ఇక్కడ వుండకూడదని మనసు చెప్తోంది. వెళ్ళి పోవాలి… ఇక్కడ్నుంచి… గీత నుంచి దూరంగా… వెళ్ళిపోవాలి.
ఫోన్ రింగ్ అయ్యింది.
“ఏమయ్యా వస్తున్నావా లేదా?” శారద గొంతు.
“వ..వస్తున్నా..!”
“ఎక్కడ వున్నావు ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి…”
“గుళ్ళో” పెట్టేశాను.
నా పక్కన వున్నవాళ్ళు చిత్రంగా చూశారు నా వైపు. ఇక అక్కడినుంచి తప్పుకోక తప్పదనిపించింది నాకు. నెమ్మదిగా కదిలాను. గీత తండ్రి విశ్వేశ్వరరావు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
“నీతో మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తావా?” అడిగాడు. నేను తలాడించి అతని వెనకే ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. పక్కనే టేబుల్ మీద వున్న గీత ఫోటోనే చూస్తున్నాను నేను. కొంతసేపు తటపటాయించి మొదలుపెట్టాడు ఆయన.
“మీ గురించి గీత పూర్తిగా చెప్పింది బాబూ… నేనేం మిమ్మల్ని కానీ, అమ్మాయిని కానీ తప్పుపట్టడం లేదు. మీ ప్రేమని పెళ్ళిదాకా తీసుకురాలేకపోయారు. ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోయినా ప్రేమని మాత్రం కొనసాగించారు… మీరు ఇంట్లో చెప్పలేనని భయపడ్డప్పడు, విషయం ముందే చెప్పకుండా శుభలేఖ పోస్ట్ లో పంపినప్పుడు గీత ఆ విషయం నాతోనే ముందు చెప్పింది. నువ్వు ప్రేమని గెలిపించుకోలేని అసమర్థుడివని, నిన్ను వదిలెయ్యమని చాలా చెప్పాను… కానీ, అప్పటికే గీత నిన్ను చాలా ప్రేమించింది…”
ఫోన్ మోగింది. శారద. సైలెంట్ మోడ్ లో పెట్టి విశ్వేశ్వరరావు వైపు చూశాను.
“ఇదంతా నీకు తెలియదని కాదు… చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దయచేసి జరగవలసిన కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించగలవా? గీత కోరిక కూడా అదే అయ్యుంటుంది” చెప్పాడాయన.
నా పక్కనే బాంబు పేలినట్లు అదిరిపడ్డాను నేను.
“ఏంటండీ… ఏం మాట్లాడుతున్నారు మీరు? నలుగురికీ తెలిస్తే ఏమౌతుంది? నేను ఎవర్ని అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు?”
“మీరు ఎవరో, గీతకి ఏమౌతారో మీకు తెలుసు, గీతకి తెలుసు, నాకు తెలుసు. మిగతా జనానికి తెలియకపోయినా ఫర్లేదు”
“ఎందుకు తెలియదు? తెలిసిన తరువాత నా పరువేం కావాలి?”
“ఇదే జనం కోసం, పరువుకోసం ఒకప్పుడు గీతని కోల్పోయావు. మళ్ళీ ఇప్పుడు కొల్పోతున్నావు” ఆయన కటువుగా అన్నాడు. నేను లేచి నిలబడ్డాను.
“సారీ అంకుల్… ఇది జరిగేది కాదు. వస్తాను…” అని ఆయన సమాధానం వినకుండా బయల్దేరాను.
మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది.
“ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారు?”
“వచ్చేస్తున్నా…. మైలపడ్డాను. కొంచెం వేడినీళ్ళు సిద్ధం చేస్తావా?”
“గుడికి వెళ్ళానని అన్నారు. అక్కడేం మైల?”
“వచ్చింది గుడికే కానీ మైల పడ్డాను…” చెప్పాను నేను ఆఖరుసారిగా గీత వైపు చూస్తూ. ఆమె ఇంకా నవ్వుతున్నట్లే అనిపిస్తోంది.
***
(వాకిలి e-పత్రిక, ఫిబ్రవరి సంచిక 2013)

మొపాస కథలు: బట్టల బీరువా


(కౌముది జనవరి 2013 సంచిక నుంచి)

పార్టీ చేసుకున్న మగవాళ్ళమంతా భోజనాలు పూర్తి చేసుకోని కబుర్లలో పడ్డాం. మాట్లాడుకునేందుకు ఏ విషయం దొరకక అమ్మాయిల గురించి మాట్లాడటం మొదలుపెట్టాం. మాలో ఒకడు అన్నాడు:
“అమ్మాయిల విషయంలో నాకు జరిగిన ఒక సరదా సంఘటన చెప్తాను వినండి” అంటూ ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు.
పోయిన ఏడాది శీతాకాలంలో ఒక సాయంత్రం నాకు ఒకరకమైన బాధ కలిగింది. అది ఎలాంటి బాధంటే ఒకలాంటి బడలికతో నన్ను పూర్తి ఆక్రమించి దారుణమైన పరిస్థితి కలిగించేది. పదే పదే పట్టి పీడించే వ్యసనంలాంటిదది. నాకు అప్పుడప్పుడు అలా జరుగుంటుంది. ఆ రోజు నా అపార్ట్మెంట్ లో నేను ఒక్కడినే వున్నాను. అలాగే ఇంక కొంతసేపు వుంటే నాకు మెలాంకలియా ఎటాక్ జరిగే అవకాశం వుందనిపించింది. అదే జరిగితే అది ఆత్మహత్య చేసుకునేలా నన్ను ప్రేరేపించవచ్చు.
వెంటనే నా కోటు తొడుక్కోని బయటపడ్డాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నడకసాగించాను. బౌలివార్డ్స్ దాకా దాదాపు ఖాళీగా వున్న కేఫ్ లను చూసుకుంటూ ముందుకు సాగాను. సన్నటి వర్షం పడుతోంది. బట్టలతో పాటు మనసుని కూడా తడిపే వర్షం అది. అలాగని అది కుండపోతగా కురిసి, జనాలని రోడ్డు మీదనుంచి పక్కలకు తరిమేసే వాన కాదు. కనపడకుండా పన్నీటి జల్లులా బట్టలమీద పడుతూ క్రమంగా మంచులో తడిసినట్లు చేసి, సన్నటి చలి పుట్టించే చిరుజల్లు అది.
ఏం చెయ్యాలి నేను? అనుకున్నాను. ఒకవైపు కొంత దూరం నడిచిన తరువాత మళ్ళీ వెనక్కి నడిచాను. ఎక్కడైనా రెండు గంటలు గడపడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాను. ప్యారిస్ మొత్తం వెతికినా సాయంత్రం పూట సరదా గడిపేందుకు ఎలాంటి ప్రదేశమూ లేదని మొదటిసారి అనిపించింది నాకు. చివరికి ఫోలీస్-బెర్గెరె వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆహ్లాదపరిచే అమ్మాయిలకి ఆ ప్రదేశం చాలా ప్రసిద్ధి.
నేను వెళ్ళిన గదిలో చాలా తక్కువమంది వున్నారు. గుర్రపు డెక్క ఆకారంలో గది మూలగా వున్న టేబుల్ దగ్గరమాత్రం కొంతమంది జనం కనిపిస్తున్నారు. వాళ్ళు, వాళ్ళ మాటతీరు, మాసిన తలలు గడ్డాలు, వాళ్ళ వంటి మీద చౌకరకం బట్టలు వాటి మీద మురికి... ఇవన్నీ చూస్తేనే అర్థం అవుతోంది వాళ్ళంతా తక్కువ స్థాయి జనం అని. శుభ్రంగా స్నానం అదీ చేసి, పైనించి కిందదాకా మేచింగ్ బట్టలు, మేకప్ వేసుకున్న వ్యక్తులు ఇలాంటి చోట చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇక అమ్మాయిల సంగతంటారా? వాళ్ళు మాత్రం ఎక్కడైనా ఒకటే. చూడగానే ఒకలాంటి భయం పుట్టించే ఈ అమ్మాయిలు అలిసిపోయి, సోలిపోతున్న కళ్ళతో నిరాసక్తంగా నడుచుకుంటూ తిరుగుతుంటారు. ఎందుకో తెలియదుకానీ నాకు అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి కొంత పొగరు వున్నట్లు అనిపిస్తుంటుంది.
నిజం చెప్పద్దూ - ఇలా నిర్వికారంగా, జిడ్డు జిడ్డుగా అక్కడక్కడ మాత్రమే కండ వున్నట్టు కనపడే బక్కపల్చటి అమ్మాయిలు నాకు నచ్చరు. వాళ్ళ శరీరాకృతి చూస్తే ఏదో మఠంలో యోగినులాగా, కాళ్ళను చూస్తే ఉలూం పిట్టల్లాగా కనిపిస్తున్నారు. అలాంటివాళ్ళు అయిదు వందలు అడిగితే వంద ఇవ్వడం కూడా ఎక్కువే అన్నట్లు వున్నారు.
సరిగ్గే అప్పుడే కనపడిందా పిట్టలాంటి అమ్మాయి. మరీ తొలి యవ్వనంలో లేదు కానీ కొంచెం ఫ్రెష్ గా... సరదాగా ఏదో ఆశపుట్టించి ఆడించే పిల్లలాగా కనిపించింది. ఆ అమ్మాయిని ఆపి ఎలాంటి ఆలోచన లేకుండా ఆ రోజు రాత్రికి ఆమె అపాయింట్ మెంట్ తీసుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళానంటే ఒంటరివాడిని అయిపోతాను – నిజంగా ఒంటరిని. అంతకన్నా ఇలాంటి ఒక విలాసిని తోడుగా వుండి నన్నుఆడిస్తేనే మేలని అనిపించింది.
ఆ అమ్మాయి వెంటే వెళ్ళాను. రూదస్ మార్టియర్స్ అనే ప్రదేశంలోని ఒక పెద్ద ఇంటిలో వుంటుందామె. మేము వెళ్ళే సరికి కరెంటు లేకపోవడంతో, అగ్గిపుల్లలు ఒక్కటే వెలిగిస్తూ నెమ్మదిగా మెట్లు ఎక్కాను. ఆ చీకట్లో మెట్లు తట్టుకుంటూ, ముందు నడుస్తున్న అమ్మాయి గౌను శబ్దం వెనకే తిట్టుకుంటూ ఎక్కాను.
నాలుగో అంతస్థులో ఆగి, తలుపేసి వున్న ఒక ఇంటి ముందు ఆగి అన్నది –
“అయితే మీరు రేపటి దాకా వుంటారా?”
“అవును. మనం అనుకున్నది అదే కదా? ఎందుకు అడుగుతున్నావు?”
“ఏం లేదు డియర్... ఊరికే ఆడిగాను. సరే మీరు ఇక్కడే వుండండి, నేను క్షణంలో వచ్చేస్తాను”
నన్ను చీకట్లో వదిలేసి వెళ్ళింది. రెండు తలుపులు మూసిన చప్పుడు వినిపించింది. ఆ తరువాత ఆమె ఎవరితోనో మాట్లాడినట్లు అనిపించింది. నాకు కొంచెం ఆశ్చర్యంగానూ, అసహనంగానూ అనిపించింది. ఒకవేళ ఆమెను కాపాడేందుకు ఎవరైనా వున్నారేమో, వాళ్ళు నన్ను పొడిచేస్తారేమో అని అనుకున్నాను. కానీ నాకు ఇనపగుండు లాంటి పిడికిలి, బలమైన చేతులు వున్నాయి. “చూద్దాం ఏం జరుగుతుందో” అనుకున్నాను.
నేను చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేశాను. లోపల ఎవరో కదులుతున్నారు. చాలా జాగ్రత్తగా, చప్పుడు కాకుండా నడుస్తున్నారు. ఇంకో తలుపేదో తీసిన చప్పుడు, ఆ తరువాత వినపడీ వినపడనంత లో గొంతులో ఎవరో మాట్లాడినట్లు కూడా అనిపించింది.
ఆమె ఒక కొవ్వొత్తి వెలిగించి దాన్ని పట్టుకోని వాకిట్లోకి వచ్చింది.
“లోపలికి రండి” అన్నది ఆమె.
ఆమె నన్ను “మీరు, తమరు” అని సంభోదిస్తోంది. బహుశా ఆమె నన్ను ఆ రాత్రికి అంగీకరించడం వల్ల అలా మాట్లాడుతోందేమో. నేను లోపలికి వెళ్ళి డైనింగ్ రూమ్ దాటుకుంటూ వెళ్ళాను. అక్కడి డైనింగ్ టేబుల్ చూస్తే బహుశా దాని మీద ఇప్పటివరకూ ఎవరూ భోజనమే చెయ్యలేదేమో అన్నట్లుంది. ఆ తరువాత ఇలాంటివాళ్ళ అందరి ఇంట్లో వుండే బెడ్ రూమ్ లాంటి రూమ్ లోకి వెళ్ళాను. గది మొత్తం అలంకరింఛి వుంది. ఎర్రటి కర్టన్లు, గది మధ్యలో పెద్ద పరుపు దాని పైన మెత్తటి పరుపు పరిచివున్నాయి.
మీ ఇల్లే అనుకోండి మాన్సియర్” అందామె.
నేను చుట్టూ అనుమానంగా పరికించి చూశాను కానీ, ఇబ్బంది పడటానికి ఏ కారణం కనపడటం లేదు.
ఆమె తన పై బట్టలు తొలగించి నవ్వడం మొదలుపెట్టింది.
“ఏమైంది... ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఉన్నట్టుండి ఉప్పుబస్తాలా తయారయ్యారే? రండి.. త్వరగా కానివ్వండి..”
ఆమె చెప్పినట్లే చేశాను. త్వరగానే కానిచ్చాను.
అయిదు నిముషాలు తరువాత నా బట్టలు తొడుక్కోని వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇంతకు ముందు ఇంట్లో కలిగిన బడలిక లాంటి బాధ మళ్ళీ తిరిగివచ్చి నన్ను ఆక్రమించింది. ఆ బాధ నన్ను ఎంతగా కమ్మేసిందంటే అక్కడ వుండటానికి ఇబ్బందిగా వున్నా కదలడానికి వీల్లేని నిస్సత్తువ ఆవహించింది. ఏ అమ్మాయినైతే ఆ ఖరీదైన దీపాలమధ్య చూసి ఆకర్షితుడనయ్యానో ఆ అమ్మాయిని దగ్గరగా చూశాక ఆ  ఆకర్షణ ఒక్కసారిగా అదృశ్యమై ఒక సామాన్యస్త్రీలా గోచరించడం మొదలైంది. ఆమె మొహమాటంగా పెట్టిన ముద్దులో వెల్లుల్లి వాసన మాత్రమే మిగిలింది.
ఏమన్నా మాట్లాడాలని అనుకున్నాను.
“చాలా కాలం నుంచి వుంటున్నావా ఇక్కడ” అడిగాను.
“జనవరి పదిహేనుకి ఆరునెలలు దాటుతాయి”
“అంతకు ముందు ఎక్కడ వుండేదానివి?”
“రూక్లౌజల్ లో. కానీ అక్కడా ఒక పనివాడు ఇబ్బంది పెట్టాడు. అందుకే అక్కడ్నుంచి వచ్చేశాను”
ఆ తరువాత ఆమె ఆ పనివాడు ఆమె గురించి ఏ విధంగా చెడుగా ప్రచారం చేసిందీ అంతులేని కథలా వివరించింది.
సరిగ్గా అప్పుడే మాకు చాలా దగ్గర్లో ఉన్నట్టుండి ఎవరో కదిలినట్లు వినిపించింది నాకు. ముందు చిన్నగా ఎవరో నిట్టూర్చినట్లు, ఆ తరువాత చిన్న శబ్దం, కానీ ప్రత్యేకంగా వినపడింది. ఎవరైనా ఒక చెక్క కుర్చీలో కూర్చోని దాని మీద అటూ ఇటూ తిరిగితే వచ్చేలాంటి శబ్దం.
నేను అదిరిపడి నిలబడి అడిగాను –
“ఏంటా శబ్దం?”
“మీరు ఇబ్బంది పడద్దండీ... నాకు పొరుగువాళ్ళు. ఇద్దరి మధ్య గోడ ఎంత పల్చటిదంటే, అక్కడ జరిగేవన్నీ ఈ గదిలోనే జరుగుతున్నంత స్పష్టంగా వినపడతాయి. చాలా దారుణమైన గదులు ఇవి, గోడలు అట్టముక్కలతో చేసినట్లే వుంటాయి” ఆమె చాలా మామూలుగా, నెమ్మదిగా చెప్పింది.
నాకు అప్పటికే బద్దకంగా అనిపించడంతో ఆ విషయాన్ని ఆపైన పట్టించుకోలేదు. మా సంభాషణ కొనసాగింది. ఇలాంటి మనుషుల్ని చూడగానే ప్రతి మగావాడిలో ఒక పనికిమాలిన ఉత్సుకత ఒకటి పుట్టుకొచ్చి వాళ్ళ తొలి అనుభవం గురించి అడగబుద్దేస్తుంది. బహుశా వారి తొలి పొరపాటు పైన వున్న పరదా తొలగించి చూస్తే స్వచ్చమైన అమాయకత్వం కనపడుతుందనేమో, లేక పోతే వారి నాజూకైన పూర్వజీవితం మాటల్లో తెలిసిపోతే వారి మీద ప్రేమ పుడుతుందనేమో. నేను కూడా కొంచెం బలవంతంగానే ఆమె పాత ప్రియుల గురించి అడిగాను.
ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే అని నాకు తెలుసు. అయితే ఏం? ఆ అబద్ధాల మాటున ఎక్కడో ఏదో ఒక నిజమైన విషాదం వెతుకుతున్నాను.
“ఫర్వాలేదు... అతను ఎవరో నాకు చెప్పు” అన్నాను.
“అతను పెద్ద పడవలు నడిపే సరంగండీ”
“ఓహ్... చెప్పు చెప్పు... ఎక్కడ వుండేదానివి?”
“అర్జెంటీల్ లో వుండేదాన్ని”
“ఏం చేసేదానివి అప్పుడు?”
“ఒక రెస్టారెంట్ లో వైట్రెస్ గా పనిచేసేదాన్ని”
“ఏ రెస్టారెంట్”
“ది ఫ్రెష్ వాటర్ సైలర్... మీకు తెలుసా అది?”
“తెలియకేం... బొనానఫన్ నడిపేవాడు కదూ”
“అవును అదే”
“సరే ఆ సరంగు సంగతి చెప్పు... నీతో ఎప్పుడు? ఎలా?”
“ఒకరోజు నేను అతని గది సర్దటానికి వెళ్ళాను. అదే అతను అవకాశంగా తీసుకున్నాడు”
నాకు ఉన్నట్టుంది నా మిత్రుడు చెప్పిన సిద్ధాంతం గుర్తుకొచ్చింది. వాడు ఒక వేదాంతి, పరిశీలకుడు, డాక్టరు కూడా. అతని దగ్గరకు రోజు ఇలాంటి వ్యభిచారులు, పెళ్ళి కాకుండా తల్లులైనవారు చాలా మంది వస్తుంటారు. ఆ పేద మహిళలు సిగ్గుపడే ఆ దారుణాలన్నింటికీ ఎవరో ఒక మగవాడే కారణం అయ్యుండటం ఇద్దరం గమనించాం.
“ఒక మహిళని అదే ఆర్థిక స్థితిలో వున్న మగవాడే చెరుస్తాడు. ఇది నిరూపించేందుకు నా దగ్గర స్టాటిస్టిక్స్ కూడా కావాల్సినన్ని వున్నాయి. డబ్బున్నవాళ్ళు ఆడపిల్లల అమాయకత్వాన్ని పువ్వులు తుంచేసినట్లు తుంచేస్తారని మనం అనుకుంటాము. కానీ అది నిజం కాదు. వాళ్ళు కావాల్సింది డబ్బిచ్చి కొనుక్కుంటారు. మొదటిసారి చెరచడం లాంటివి చెయ్యరు” అంటాడు వాడు.
అదే నిజమైతే ఆ హోటల్లో బసచేసిన సరంగు ఆమెను చెరిచే అవకాశమే లేదు. నేను ఆమె వైపు తిరిగి నవ్వసాగాను.
“నీ చరిత్ర మొత్తం నాకు అర్థం అయ్యింది. ఆ సరంగు మాత్రం నీకు మొదటివాడు కాదు కదూ?”
“లేదండీ... నేను నిజమే చెప్పాను. ఒట్టు”
“కాదు నువ్వు అబద్దం చెప్తున్నావు”
“కాదండీ... నిజంగా”
“నేను నమ్మను... పూర్తిగా చెప్పటంలేదు నువ్వు”
ఆమే ఆశ్చర్యంగా కొద్దిసేపు తటపటాయించింది. నేను కొనసాగించాను –
“నేను కొన్ని విద్యలు తెలుసు... నాకు యోగదృష్టి కూడా వుంది. నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేదో యోగనిద్రలోకి వెళ్ళానంటే అన్నీ తెలిసిపోతాయి నాకు...”
ఆమె నమ్మేసి బయపడింది. మాటలు తడబడ్డాయి.
“మీకు ఎలా తెలుసు?”
“ఎలాగైతేనేం... ఇప్పటికైనా నిజం చెప్పు” అన్నాను నేను.
“మొదటి సారి పెద్దగా జరిగిందేమీ లేదు. వూర్లో ఏదో పండగ జరుగుతోంది. రెస్టారెంట్ వాళ్ళు స్పెషల్ వంటకోసం ఎలగ్జాండర్ అనే కొత్త వంటవాణ్ణి పిలిపించారు. అతను వచ్చిన రోజు నుంఛే తన ఇష్టం వచ్చిన విధంగా మసలేవాడు. అందరి మీద అతనిదే అధిపత్యం. ఆఖరుకు ఓనరు, అతని భార్య కూడా అతని మాటే వినేవాళ్ళు. బాగా ధృఢంగా ఎత్తుగా వుండేవాడు. వంటింటి సామాను స్టాండ్ పక్కన నిలబడితే ఆ వస్తువులే చిన్నబోయేవి. ఎప్పుడూ అరుస్తూ వుండేవాడు – ’త్వరగా కొంచెం వెన్న, కొన్ని గుడ్లు, కొంచెం మైదా ’అలా అరిచాడంటే వెంటనే అవి అతని అందించాలి, లేదంటే కోపంతో అతను అనే మాటలకి సిగ్గుతో చచ్చిపోవాళ్ళం.
“రోజూ సాయంత్రం పని అయిపోగానే బయట గుమ్మం దగ్గర నిలబడి పైప్ కాల్చేవాడు. ఒకరోజు నేను చేతినిండా ప్లేట్లు పెట్టుకొని అటుగా వెళ్తుంటే నన్ను చూశాడు. “ఏయ్.. అమ్మాయ్... అలా నన్ను నది దాకా తీసుకెళ్ళి మీ వూరు చూపించకూడదూ’ అన్నాడు. నేను పిచ్చిదానిలా అతనితో వెళ్ళాను. నది ఒడ్డుకు చేరామో లేదో అంతలోనే అతను అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఉన్నట్టుండి జరిగిపోయిన ఆ సంఘటనకి అతను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. అంతే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ట్రైన్ కి వెళ్ళిపోయడు. మళ్ళీ కనిపించలేదు.”
“అంతేనా?” అడిగాను నేను.
ఆమె చెప్పడానికి జంకింది.
“నాకు తెలిసినంత వరకు ఫ్లోరెంటిన్ అతనికే చెందాలి”
“ఫ్లోరెంటిన్ ఎవరు”
“నా పిల్లాడు”
“అవునా... అయితే ఆ సరంగు గాడిని బోల్తా కొట్టించి, ఈ పిల్లాడు ఆయన కొడుకే అని కూడా నమ్మించి వుంటావు కదూ?”
“సరిగ్గా చెప్పారు!”
“వాడి దగ్గర బాగా డబ్బు వుండి వుండాలే... అ సరంగుగాడి దగ్గర?”
“అవును... నాకు మూడు వందల ఫ్రాంకులు వదిలిపోయదు. అదంతా ఫ్లోరెంటిన్ పేరు మీద వుంది”
నాకు తెలుస్తున్న విషయాలు ఆశ్చర్యంగా, ఆసక్తికరంగానూ అనిపించాయి.
“బాగానే వుంది పిల్లా.... నువ్వు కనపడ్డంత అమాయకురాలివేం కాదు... సరే నీ పిల్లాడు – అదే ఫ్లోరెంటిన్ వయసు ఎంత వుంటుంది ఇప్పుడు?”
“పన్నెండేళ్ళు... పెద్దవాడవుతున్నాడు”
“బాగానేవుంది. అయితే అప్పటి నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నావన్నమాట?”
ఆమె సమాధానంగా ఒక నిట్టూర్పు విడిచింది.
“నేను చేయగలింది ఇదొక్కటే... అందుకే చేస్తున్నాను..” అంది.
అంతలోనే ఆ గదిలో మళ్ళీ ఏదో శబ్దం అయినట్టు అనిపించడంతో అదిరిపడ్డాను. ఎవరో ధబ్బున పడి, అంతలోనే గోడని తడుముతూ లేచి నిలబడుతున్నట్లు అనిపించింది.
నేను ఒక్కసారిగా కొవ్వొత్తి అందుకున్నాను. ఆమె నా వైపు భయంగానూ, కోపంగానూ చూసింది. లేచి నిలబడి నన్ను పట్టుకోని ఆపాలని ప్రయత్నం చేస్తూ చిన్నగా గొణుగుతున్నట్లు మాట్లాడింది –
“ఏం లేదండీ... నేను చెప్తున్నానుగా... ఏమీ లేదు..”
అప్పటికే ఆ శబ్దం ఏ వైపు నుంచి వచ్చిందో నాకు అర్థం అయ్యింది. మంచం తల వైపు నేరుగా నడిచి అక్కడ దాచినట్లుగా వున్న బట్టల బీరువా తలుపు తీసి చూసాను. అక్కడ ఊహించని విధంగా వణుకుతూ, భయం నిండిన పెద్ద కళ్ళతో నన్ను చూస్తున్న సన్నటి పిల్లాడు కనిపించాడు. అతని పక్కనే పేముతో అల్లిన చిన్న కుర్చీ వుంది. దాని మీదనుంచే వాడు పడిపోయినట్లు వున్నాడు.
నన్ను చూడగానే వాడు ఏడుపులంకించుకున్నాడు.
“నా తప్పేం లేదమ్మా... నేనేం చెయ్యలేదు. నిద్రలో పడిపోయాను... నన్ను అరవద్దమ్మా... నా తప్పేం లేదమ్మా” అంటూ వాళ్ళ అమ్మ వైపు చేతులు చాచి ఏడుస్తూ అన్నాడు వాడు.
“ఏంటి దీనర్థం?” అన్నాను నేను ఆమె వైపు తిరిగి.
ఆమె కొంచెం బాధగా తడబడుతూ చిన్న గొంతులో చెప్పసాగింది –
“ఏం చెయ్యమంటారు చెప్పండి? వాణ్ణి స్కూల్ కి పంపించేంత సంపాదన లేదు. వాణ్ణి నా దగ్గరే వుంచుకోవాలి. రెండు గదులు వున్న ఇల్లు అద్దెకు తీసుకోలేను. నేను ఒక్కదాన్నే వున్నప్పుడు నా దగ్గరే పడుకుంటాడు. ఎవరైనా గంట లేదా రెండు గంటలకోసం వస్తే ఆ బట్టల బీరువాలో వుంటాడు. చప్పుడు చెయ్యడు. అర్థం చేసుకుంటాడు. మీ లాంటి వాళ్ళు ఎవరైనా రాత్రంతా వుండటానికి వస్తే పాపం వాడు ఆ కుర్చీ మీదే నిద్రపోతాడు.
“వాడి తప్పేమీ లేదు. రాత్రంతా అలా కుర్చీలో కూర్చోడం ఎంత కష్టమో మీకు అర్థం అయ్యిందనే అనుకుంటాను..”
ఆమె గొంతులో కోపమో, ఆవేశమో తెలియదుకానీ ఆమె గొంతు పెద్దదైంది.
పిల్లాడు ఇంకా ఏడుస్తూనే వున్నాడు. పాపం అర్భకుడు. పసిపిల్లాడు. ఆ చల్లటి బట్టల బీరువాలో, చీకట్లో రాత్రిళ్ళు గడపాలి. ఎప్పుడో ఒక్కోసారి మాత్రం వెచ్చగా మంచం మీద పడుకునే అవకాశం వస్తుంది. ఇంకెవరూ ఆ మంచాన్ని ఆక్రమించకపోతే...
నాకు కూడా ఏడవాలనిపించింది.
నేను ఆ రాత్రి ఇంటికి వెళ్ళి నా మంచం మీదే పడుకున్నాను.
<< ?>>