కోయిల కోసం వసంతం

పిల్లలు స్కూల్ కి, ఆయన ఆఫీస్ కి వెళ్ళారు. వాళ్ళ బాక్సుల్లో పెట్టడానికి వంట చేసేశాను కాబట్టి అట్టే పని కూడా లేదు. కాఫీ కలుపుకోని బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. చుట్టూ కీకారణ్యం – అదే కాంక్రీట్ జనారణ్యం. మా ఇంటికి నాలుగు భవనాల అవతల కనిపించే రోడ్డు మీద దూసుకుపోతున్న వాహనాలు. అంతా ఆఫీసులకీ, వుద్యోగాలకి, స్కూళ్ళకీ, కాలేజీలకీ పెడుతున్న పరుగులు. పొరపాటున ఏదో ఒక వాహనం ఆగినట్టుంది, ఒక్కసారిగా అన్ని వాహనాలు గొంతు చించుకు కేకలు పెడుతున్నాయి. రకరకాల గొంతులు, రకరకాల శబ్దాలు... మోత. రణగొణధ్వని.

ఒక్క క్షణం ఆగితే వీళ్ళ సొమ్మేం పోయింది? ఆ ఆగిపోయిన బండివాడు ఏమన్నా సరదాగా ఆగేడా? ఆ బండీ ముందుకెళ్ళాల్సిందేగా? ముందున్న బండి కదిలాక ఎలాగూ అందరూ కదలక తప్పదు. ఇంతలోనే హారన్ గొంత్తెత్తి గోలపెట్టాలా?

బండ్లు మళ్ళీ కదిలాయి. అంతా ఒక రూల్ ప్రకారం... ముందే నిర్ణయించుకున్న దారిలో ముందుకు... ముందుకు. ఏమిటో... ఎన్నో సంవత్సరాలు ఒకే రోడ్డు వెంట, ఒకే దారిలో అదే పనిగా తిరుగుతుంటే విసుగనిపించదూ? ఎప్పుడూ అవే భవనాలు, అదే ట్రాఫిక్ కానిస్టేబుల్, ఆ సిగ్నల్ దగ్గర అదే ముసలాయన చెయ్యి చాస్తూ... ఎప్పూడూ అదే రొటీన్ రూటూ... రొటీన్ బ్రతుకు. కనీసం ఒక్కసారన్నా ఎప్పుడూ వెళ్ళే దారిని వదిలి వేరే దారిలోకి మలుపు తిప్పారా? అసలు ఆ మలుపు తిప్పితే ఏముందో ఎవరికైనా తెలుసా? ముందే నిర్ణయమైపోయిన దారిలో విసుగూ విరామం లేకుండా అలా పోతూ వుండకపోతే ఒక్కసారైనా దారి మార్చి చూడకూడదూ...!!

కాఫీ అయిపోయి లేవబోతుంటే ఎక్కడి నుంచో కోయిల గొంతు పలకరించింది. ఎడారిలో నీటిబుగ్గ పుట్టినట్టు పచ్చదనం మచ్చుకైనా కనిపించని ఈ ఇటుకరాళ్ళ గూళ్ళ మధ్యలో కోయిల కూడా ఒకటుందా? “కూ... కూ..” మళ్ళీ కూసిందది. ఇది ఇంకా ఫిబ్రవరి నెలే... ఇంకా దాదాపు నెలరోజులుంది ఉగాదికి. తొందరపడి కూసే కోయిల అని ఎవరో కవి అన్నట్టు, ఇదేనా ఆ కోయిల? వసంతాగమనానికి ముందే గొంతెత్తి కూస్తోంది. లేకపోతే వసంతార్భాటాలన్నీ చూడాలన్న తపనతో ఇంకా రాలేదే అని కోప్పడుతోందా? ప్రియ వసంతుణ్ణి రావేలా అని పిలుస్తోందా? అదే నిజమైతే అసలు వసంతం వచ్చాక కోయిల కూయాలా లేక కోయిల పిలిచిందని వసంతం వస్తుందా?

కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది పనమ్మాయి సుమ. నా చేతిలో గ్లాసు అందుకోని నేరుగా సింక్ దగ్గరకు వెళ్ళి పని మొదలుపెట్టింది. నేనేమీ చెప్పలేదే? అసలు మాట్లాడనేలేదే? రొటీన్.. రొటీన్... ఎప్పుడూ అదే సింక్ అవే గిన్నెలు.. అదే పని. నేను మళ్ళీ బాల్కనీలోకి వచ్చాను. కోయిల గొంతు వినపడ్డటంలేదు. వసంతానికి ఇంకా కొంతకాలం ఆగాలని తెలుసుకుందో, లేక పూత పూసి పిందెలెయ్యడానికి చెట్లు లేని చోటుకి వసంతుణ్ణి ఆహ్వానించడమే తప్పని తెలుసుకుందో... బహుశా ఏ చిక్కటి అడవికో వసంతానికి దారి చూపిస్తూ ఎగిరిపోయి వుంటుంది. మళ్ళీ కార్లు, బస్సులు, స్కూటర్లు... వాటి వాటి చిత్ర విచిత్రమైన హారన్లు.. గోల గోలగా. ఇంట్లో సింకులో గిన్నెలు తీసి కడిగి ఎత్తిపడేస్తున్నట్లు చప్పుడు.

“సుమా... గిన్నెలు జాగర్తగా పెట్టు... పడెయ్యద్దు... గోలగోలగా” అరిచాను నేను. అటునుంచి సమాధానం లేదు. చప్పుడు మాత్రం ఆగింది. సుమ పూర్తి పేరు సుమధార. “అదేం పేరు?” అన్నాడు శ్రీధర్ మొదటిసారి వినగానే.

“ఆ పేరుకేం... అంత చక్కగా వుంటే?” అన్నాను.

“అది కాదు... పనెమ్మయి పేరులా లేదని..”
ఏం చెప్పేది..?? అదేమన్నా భారత రాష్ట్రపతి సంతకం చేసిన చట్టమా – పనెమ్మాయి మంచి పేరు పెట్టుకోకూడదని? ఎల్లమ్మ, పుల్లమ్మ అయ్యింటే అదొక తృప్తి మనకి... మనకి కావాల్సింది మొనాటనీ... మారిస్తే తట్టుకోలేం. ఏం చేస్తాం అందరివీ అవే స్టీరియోటైపు మనసులు, మనస్తత్వాలు.

పనైపోగానే సుమ వెళ్ళిపోయింది. నేను ఏం చెయ్యాలి? టీవీ పెట్టాను. పెట్టానన్నమాటే కానీ చూద్దామంటే ఉత్సాహం కూడా రావటం లేదు. పేరుకు నలభై పైనే తెలుగు చానల్స్ కానీ ఏం లాభం? అవే సీరియల్స్ అవే కథలు, అవే సినిమాలు. ఇప్పటికి నలభై సార్లు వేసినా, అదే సినిమా మళ్ళీ “సూపర్ హిట్ మూవీ” అని, మళ్ళీ మళ్ళీ వెయ్యడానికి ఈ చానల్స్ ఆలోచించవా అనిపిస్తుంది. పండగపూట కూడా చద్దన్నం పెట్టకపోతే... ఇంతింత డబ్బులున్నాయి కదా, సొంతగా ఈ చానల్ వాళ్ళే ఒక సినిమా తీసి చూపించచ్చు కదా? ఇంత వరకూ ఎవరూ చూడని సినిమా అని ప్రకటించచ్చు కదా? ఊహు... అలా చెయ్యరూ... అందరూ ఇరవై సార్లు అదే చానల్లో చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూపిస్తే చూస్తారు. ఇంత వరకూ చూడని సినిమా అంటే అదెట్లా వుంటుందో అని భయం మనకి.

టీవీ ఆపేసి, ఇల్లు సర్దే నెపంతో అటు సోఫా ఇటు, ఇటు కుర్ఛీలు అటూ మార్చి చూశాను. కిటికీకి అడ్డంగా వున్న సోఫా పక్కకి జరిపితే గదిలో గాలీ వెలుతురు పెరిగాయి. గది మధ్యలో ఖాళీ స్థలం కూడా పెరిగింది. మార్పు... ఒక్క చిన్న మార్పు... మరింత మేలైన దిశగా ఒక్క అడుగు. ఇంత మాత్రం అర్థం ఛేసుకోరే ఎవరూ?

టేబుల్ మీద కొడుకు రామ్ పుస్తకాలు పడివున్నాయి. మేథ్స్ మోడల్ పేపర్... పరాగ్గా నాలుగు కాగితాలు తిరగేస్తే అర్థం అయ్యింది. మొదటి సెక్షన్లో పది ప్రశ్నలు ఇస్తారు, అందులో ఆరు వ్రాయాలి. తరువాత అయిదు ప్రశ్నలు ఇస్తారు అందులో రెండు... ఏమిటిది? ఎందుకో మూస? వేరే రకంగా పరిక్ష పెట్టకూడదా? ఒక వేళ పెడితే ఇప్పుడు ర్యాంకు పొందిన వాళ్ళుగా పేపర్లకి, కోచింగ్ సెంటర్ల పోస్టర్లకి ఎక్కిన పిల్లలందరూ అంతే మార్కులు తెచ్చుకోగలరా? రామ్ మాత్రం పరీక్ష తప్పుతాడు. చదువు కూడా అదే మూసలో పడిపోయింది. ఇలాంటి పరీక్షకి ఎలా చదవాలో చెప్పే కోచింగ్ సెంటర్లు, పుస్తకాలు, గైడ్లు, మోడల్ పేపర్లు... అంతా అదే రొటీన్ మూసలోకి తోసేసేందుకు ఏర్పరచుకున్న సాధనాలు. చుట్టూ గోడలు కట్టుకోని, కళ్ళకి గంతలు కట్టుకోని – ఇది ఇంతే అని నమ్మేసి నడిచే మనుషులం మనం.

రామ్ బాగా చిన్నప్పుడు జరిగినది నాకు ఇప్పటికీ గుర్తుంది. మొదటిసారి కొనిచ్చిన రంగులతో బొమ్మల పుస్తకంలో రంగులు వేస్తున్నాడు. వాళ్ళ నాన్న శ్రీధర్ యధాలాపంగా చూసి వెంటనే అన్నాడు –

“రామ్... ఏంటది? ఆకాశం ఎక్కడైనా గ్రీన్ గా వుంటుందా? బ్లూ కలర్ వెయ్యి..” అని.

“వెయ్యనివ్వండి... ఏదో ఒకటి... వాడు పేపర్ మీద పచ్చరంగు వేస్తే ఆకాశం ఏమన్నా మారిపోతుందా?” అన్నాను.

“నో.. నో.. రేపు స్కూల్లో కూడా ఇలాగే వేస్తే ఒక్క మర్కు కూడా రాదు..” అంటూ వాడి వైపు తిరిగి, “కమాన్... బ్లూ తీసుకో...” అంటున్నాడు.

“ఆకాశం బ్లూ అని నాకు తెలుసు నాన్నా... కాని ఒకవేళ గ్రీన్ వుంటే ఎలా వుంటుందా అని చూస్తున్నాను..” వాడు సంజాయిషీ ఇస్తున్నాడు. ఈ విషయంలో బహుశా నా ఆలోచనలే వాడికీ వచ్చినట్లున్నాయి. కానీ వాటిని ఎదగనిస్తే కాదా. ఆ రోజు ఆకాశం మళ్ళీ నీలం రంగులోకి మారింది.

స్వతహాగా రొటీన్ జీవితానికి అలవాటు పడినవాడు శ్రీధర్. ఒకరోజు బాక్స్ లో బ్రెడ్ సాండ్ విచ్ పెడితే.. “ఎందుకు ఇవన్నీ... ఎంచక్కా అన్నం, కూర, పెరుగన్నం పెట్టచ్చు కదా?” అంటాడు.

ఎప్పుడన్నా పిల్లాడికోసం నూడిల్స్, పాస్తా లాంటివి చేస్తే కూడా శ్రీధర్ తినడు. “నాకు ఇలాంటివి సయించవు..” అంటాడు.

ఎలాంటివి సయించవు? ఇటాలియన్ ఏదైనా సైంచవా? లేక ఇవి మాత్రమే సయించవా? అంటే నూడుల్స్ పాస్తా రెండూ ఒకే రకమైన రుచిలో వుంటాయనుకుంటున్నారా... అసలు ఒకసారైనా తింటే కదా తెలిసేది? మొదటిసారి తెచ్చినప్పుడు కూడా అదే మాట – “ఇలాంటివి నాకు సయించవు..” ఎలాంటివి? ఎలాంటివి సయించవో తెలుసా నీకు... ఇదంతా అడగాలనుకున్నాను. అడిగితే వచ్చే రొటీన్ జవాబులు వినలేక అడగలేదు.

సరే, ఎవరి జీవితాలు వారివి. కొందరికి ఇలాగే ఒక చట్రం గీసుకోని, గీచిన గిరి దాటకుండా బతకడమే ఇష్టం కావచ్చు కాక. కానీ తోటివారిని కూడా అదే గిరిలో ఇరుక్కోమనడం ఎంతవరకు సమంజసం?

“పెళ్ళైన దగ్గర్నుంచి మీరేమీ మారలే”దని నా ఫిర్యాదు. అసలెందుకు మారాలని ఆయన అనుమానం. ఏ మార్పూ లేని సంసారానికి పదిహేడేళ్ళు...!!

***

క్రితం రోజు ఆరేసిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెట్టను. బీరువాలో వున్న నా బట్టలన్నీ ఒకసారి చూసుకున్నాను. ఒక ముప్ఫైకి తక్కువ కాకుండా చీరలు, అయిదో ఆరో చుడీదార్లు, ఒకే ఒక జీన్స్ ప్యాంట్.

“ఏం మారలేదంటావు..?? చీరలు మాత్రమే కట్టాలి అనేవాణ్ణి చుడీదర్ వేసుకోడానికి పర్మిషన్ ఇచ్చాను కదా.. అది మార్పు కాదా?” శ్రీధర్ అడిగాడు ఒకసారి.

“ప్రపంచం అంతా మారిన తరువాత ఆఖరుగా మనం మారటం మార్పు కాదు శ్రీధర్... అది కంపల్షన్.. వేరే మార్గంలేక మారుతూ నేను కూడా మారాను అనుకోవడం అవివేకం..” అన్నాను.

“ఇప్పుడేమంటావు? బికినీ వేసుకోని తిరుగుతావా?” వెటకారంగా అడిగాడు.

“నేనేం ఈతల పోటీలకి వెళ్ళట్లేదు... వెళ్తే తప్పకుండా వేసుకుంటా...  ప్రస్తుతానికి మాత్రం ఒక జీన్స్ కొన్నాను..” చెప్పాను.

“వ్యాట్... నీ వయసెంతో తెలుసా? నువ్వు మాట్లాడేదానికి, నీ వయసుకి ఏమన్నా సంబంధముందా?” అన్నాడు ఆవేశంగా.

“అదే నేనూ అంటున్నాను... నేను మాట్లాడేదానికి, వయసుకి సంబంధం లేదు... జీన్స్ అంటే టీనేజర్స్ మాత్రమే వేసుకోవాలని రూల్ లేదు... నాకు నచ్చిందని కొన్నాను.... అన్నట్టు నీకు కూడా ఒకటి కొన్నాను..” చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను.

శ్రీధర్ జీన్స్ పేంట్ అతని బీరువాలో అన్ని బట్టలకి కింద స్థిరనివాసం ఏర్పరుచుకుంది. నా పేంట్ వుండటానికి పైనే వుంది కానీ, వేసుకునేందుకు అనుమతి రాలేదు. రెండు పేంట్లు బయట ప్రపంచం తెలియని బావిలో కప్పల్లా జీవితంలో ఏ మార్పు లేకుండా వుండిపోయాయి.

“నీకు ఎందుకు ఇంత పంతం? జరిగేదేదో బాగానే జరిగిపోతోంది కదా... ఎందుకు ప్రపంచాన్ని మార్చేదానిలా మాట్లాడుతావు?”  అడిగాడు ఒకరోజు.

ప్రపంచం మారాలంటే ముందు మనుషులు మారాలి శ్రీధర్... ఈ సమాజం, ఈ వ్యవస్థ, రాజకీయం, మన సినిమాలు, విద్యా వ్యవస్థ అన్నీ మారాలని మనకీ తెలుసు. కానీ ఆ మార్పుని ఒక అడుగు ముందుకేసి ఆహ్వానించే ధైర్యం లేదు. అసలు నిజం ఏమిటంటే... మార్పు అంటే మనకి భయం. కొత్త అంటే భయం. అనుమానం... ఒక అపనమ్మకం. ఒక అలవాటు ప్రకారం చేసుకుంటూ పోవటం సులభం. కొత్తగా ఏదన్నా చేయాలంటే, చేస్తే ఏమౌతుందో అని భయం, నలుగురూ ఏమనుకుంటారో అని అనుమానం. చెయ్యగలనో లేదో అని అపనమ్మకం. ఎందుకులే మార్చడం అనో, నలుగురితో నారాయణ అనో, సో కాల్డ్ పరువు ప్రతిష్ట కోసమో ఇంకేదో... మరేదో... చిన్నప్పటి నుంచీ నువ్వూ నేర్చిన ఆచారాలు, నమ్మకాలు, నియమాలు, ఫార్ములాలు... ఇవేవి నిన్ను మారనివ్వవు.... మరొకరిని మారనివ్వవు..” ఆవేశంగా అనేసి నా గదిలోకి వెళ్ళిపోయాను.

శ్రీధర్ చాలాసేపు మాట్లాడకుండా నిలబడ్డాడు. ఎంతసేపు వున్నా పరిస్థితి మార్పు రాకపోవటంతో లేచి తను ఎప్పుడూ కాఫీ తాగే ఉడిపి హోటల్ కి వెళ్ళాడు. చెప్పానుగా... పరిస్థితిలో మార్పు లేకపోతే ఒక అడుగు ముందుకేసి మార్పుని మొదలుపెట్టే ధైర్యం, చొరవ అతనికి లేవు.

***

ఎదురుగా జీన్స్ పేంట్. శ్రీధర్ ఆఫీస్ నుంచి రావటానికి మరో అరగంట పట్టచ్చు. అప్పటికే ఇంట్లో అటు ఇటు మారిన సోఫా, కుర్చీలను చూసి ఖచ్చితంగా సణుగుతాడు. అయినా తప్పదు... నేను జీన్స్ పేంట్ తీసుకోని వేసుకున్నాను.

దూరంగా కోయిల మళ్ళీ కూసింది. వసంతం వస్తేనే కోయిల కూయలనేం లేదుగా... కోయిల కూసిందని వసంతమే ముందుకు వస్తుందేమో...!!

<***>
(నవ్య వీక్లీ, 15 అక్టోబర్ 2014)

తప్పిపోయిన సూర్యుడు (కథ)

అప్పటికే మూడు రోజుల ముసురు. ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు కురుస్తుందో కనిపెట్టలేని కాలం. అలాంటి ఓ వర్షాకాలం సాయంత్రం వూర్లోకి వచ్చాడు సూర్యనారాయణరావు. పేరు గుర్తుంచుకోవాల్సినంత ప్రాధాన్యత లేని ఓ లాడ్జిలో మకాం. ఏసీ సూట్లకి అలవాటు పడ్డ శరీరం కాబట్టి అంతటి వర్షాకాలంలోనూ కూలర్ పెట్టించుకున్నాడు. దాని చప్పుడూ, బయట వర్షం చప్పుడు కలిసి దరువులా వినిపిస్తోందతనికి. వచ్చినప్పటి నుంచి కిటికీ పక్కనే కుర్చీలో కూర్చోని కిటికీ అద్దం మీద పడి జారిపోతున్న వర్షపుచుక్కల్ని చూస్తూ వున్నాడు. రాత్రి పదైందో, పన్నెండైందో తెలియదు. గోడకి గడియారం లేదు. వున్నా టైం తెలుసుకునే ఉద్దేశ్యం అతనికి లేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒక ఉషస్సు కోసం జాగారం చేస్తున్నాడతను.

తెల్లవారితే తన బతుకులోకి వెలుగొస్తుందని అతని నమ్మకం. పాతికేళ్ళుగా చూడని కొడుకుని చూడాలని ఆరాటం. ఆ కొడుకు తనని తండ్రిగా అంగీకరిస్తాడో లేదో అని భయం. వెరసి అతనికి నిద్రకీ ఆమడ దూరం పెరిగింది.

అరవై ఏళ్ళ జీవితంలో అర్థం భాగం అదే వూర్లో గడిపాడతను. ఆ అర్థం భాగం ఏ మాత్రం అర్థం పర్థం లేనిదని అతని అభిప్రాయం. పుట్టిన దగ్గర్నుంచి పుట్టెడు దుఖాన్ని దగ్గర్నుంచి చూశాడు. పాపం అనేవాళ్ళనీ చూశాడు. పాపం చేసేవాళ్ళనీ చూశాడు. తండ్రి వ్యసనాలను భరించలేక ఉరిపోసుకున్న తల్లిని చూశాడు. భార్య చచ్చిపోయిందన్న సాకుతో కనపడ్డ ఆడదాన్నల్లా కామించిన తండ్రిని చూశాడు.

ఒక శివరాత్రి మర్నాడు జరిగినది అతనికి బాగా గుర్తు. తండ్రితో కోటప్పకొండ జాతరకి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. దారిలో ఏదో పల్లెటూరు. ’ఇక్కడ్నుంచి లారీలో పోదా’మని తండ్రి చెప్తే తలూపాడు. టీ కొట్టు చావిట్లో ముడుక్కోని కూర్చున్నాడు. తెల్లవారిందాకా తండ్రి టీ కొట్టు వెనక ఎవరో అమ్మాయితో వున్నాడని మాత్రం తెలిసింది. ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ తప్పు చేస్తున్నాడని తెలుసు. ఎముకలు కొరికే చలిలో గడగడ వణుకుతున్నప్పుడు ఏడేళ్ళ వయసులో తండ్రిని మొదటిసారి అసహ్యించుకున్నాడు.  పదేళ్ళకు అలాంటి విషయాలకు అలవాటుపడిపోయాడు. ఇరవై ఏళ్ళకు అది తండ్రి అవసరం కాబోలు అని అనుకున్నాడు. పాతికేళ్ళకు అదే అడుగుల్లో అతనూ నడిచాడు. అతని అడుగుల కింద నలిగిన అమ్మాయి పేరు మల్లి.

మల్లి గుర్తుకురాగానే మనసులో ఎవరో కవ్వంతో చిలికినట్లైంది సూర్యనారాయణకి. ఖరీదైన సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకున్నాడు. బలవంతంగా మల్లి ఆలోచనలు పక్కకి నెట్టి అతని జీవితంలో రెండో సగం గురించి తలుచుకున్నాడు.

మంచో చెడో, తండ్రి వల్ల సూర్యం జీవితంలో రెండు ముఖ్యమైనవి జరిగాయి. ఒకటి తండ్రి ద్వారా సంక్రమించిన అలవాటు అయితే రెండోది తండ్రి పేదరికం కారణంగా పుట్టుకొచ్చిన కసి. అది అలాంటి ఇలాంటి కసి కాదు. కొండల్ని పిండి చెయ్యగలిగిన కసి. ఒక ఉప్పనలా లేచి సూర్యాన్నికబళించి సూర్యనారాయణగా తయారుచేసింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. పెద్దవాడయ్యాడు. పెద్ద పెద్ద సంస్థలకు అధిపతి అయ్యాడు. పగలూ రాత్రి తెలియని అలాంటి పరుగు మధ్యలో సంధ్యారాగంలా కలిసింది మల్లి. పేరుకు తగ్గ పిల్ల. విరిసీవిరియని జాజిమల్లి.

ఎర్రటి ఎండా కాలం. మల్లెలకాలం. మంచినీళ్ళ బావి దగ్గర కలిసింది. ఉరుకుల పరుగులలో అలసిపోయిన అతని శరీరదాహాన్ని తీర్చింది. అతడు ఆమెని గుక్కెడు నీళ్ళు ఇచ్చే నీటి చెలమ అనుకున్నాడు. ఆమె మాత్రం నదీ ప్రవాహమై అతనిలో కలిసిపోవాలనుకుంది. అవసరం తీరాక అవతలికి నెట్టాడు. తను ఎక్కుతున్న మెట్లకి అడ్డంరావద్దని పక్కన పెట్టాడు. మల్లి ఏడవలేదు. మళ్ళీ అడగలేదు. తొమ్మిదినెలల కష్టాన్ని ఆశ అనే వారధితో దాటేసింది. పిల్లాడు పుట్టాడు.

అప్పటికే పెద్ద పారిశ్రామికవేత్త కూతురితో పెళ్ళి ప్రయత్నాలు సాగుతున్నాయి. పెళ్ళేకానివాడు పిల్లాణ్ణి ఎలా ఎప్పుకుంటాడు? పైగా పిల్లాణ్ణి కన్న తల్లిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా లేనప్పుడు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు.

“వాడు నీ కొడుకు... నీ రక్తం...” అని మల్లి అన్నప్పుడు మాత్రం దగ్గరకు వెళ్ళబోయాడు. అటు వేసే ప్రతి అడుగు అతని ఎదుగుదలను అణగదొక్కుతుందని అనుకున్నాడు. మెళ్ళో వున్న బంగారు గొలుసు తీసి ఆమె చేతికి ఇచ్చాడు. ఒక్క క్షణంపాటు కలిగిన ప్రేమ అది అని అతనుకున్నాడు. అతని పేరు బయటపెట్టకుండా వుండేందుకు ఇచ్చిన లంచమని ఆమె అనుకుంది.

“వాడి బాగోగులు చూస్తాను... డబ్బు పంపుతుంటాను” అన్నాడు. ఆ మాటలు వినకుండానే వెళ్ళిపోయింది మల్లి. మళ్ళీ కనపడలేదు.

ఇప్పుడు మల్లి సంగతి చెప్పగలిగినవాడు ఒక్కడే వున్నాడు. ఆమెకు వరసకి బావ అయిన శ్రీపతి. అతన్ని కలిసి తన కొడుకు వివరాలు తెలుసుకోవాలని అతని ఆలోచన. చీకట్లు తప్పుకున్న ఆకాశాన్ని కడిగేస్తూ సన్నటి వాన కురుస్తోంది. సూర్యనారాయణరావు ఎదురు చూసిన క్షణం మరింకెంతో దూరంలో లేదు. అతను తయారై బయటపడేసరికి మసకేసిన మబ్బులు కొంచెం తెరిపినిచ్చాయి.

శ్రీపతి కోసం వూరంతా వెతికాడు. అతని ఇల్లు తెలుసుకునేసరికే మధ్యాహ్నం అయ్యింది. కానీ, శ్రీపతి లేడు.

“ఊరెళ్ళారండీ..” చెప్పిందతని భార్య. “మీరు ఎవరని చెప్పమన్నారు?” అడిగింది.

ఏం సమాధానం చెప్తాడు? సూర్యనారాయణ కొద్దిసేపు తటపటాయించాడు.

“చిన్నప్పటి స్నేహితుణ్ణి... ఎప్పుడో ముప్ఫై ఏళ్ళ క్రితం...” అబద్ధాలాడటం అతనికి వ్యాపారంలో అబ్బిన కళ. వెళ్ళబోతూ మళ్ళీ ఆగాడు.

“వాడి మరదలు ఒకమ్మాయి వుండాలి... మల్లి అనీ...”

“అయ్యో మీకు తెలియదా?...” ఆమె చెప్పబోయేది ముందే తెలిసిపోయిందతనికి. వినకూడదంటే మాత్రం చెవులకు వినపడకుండా వుంటుందా? “చనిపోయింది”

“ఎంత కాలం అయ్యింది?”

“పదేళ్ళు పైనే...”

బాధపడాలా? పశ్చాత్తాపడాలా?

“ఆమె కొడుకు...?”

“భాస్కర్... మూడు వీధుల అవతల... కుడి వైపు రెండో ఇల్లు... ఇంటి ముందు జాజిమల్లె చెట్టు..” చెప్పిందావిడ.
సూర్యనారాయణరావు అక్కడి నుంచి కదిలాడు.

పదేళ్ళు... పదేళ్ళు... అనుకున్నాడు మనసులోనే. అవే పదేళ్ళలో అన్నీ జరిగాయి. తన సంసారంలో తుఫాను రేగింది ఆ కాలంలోనే. పిల్లలు పుట్టలేదని జయంతి బాధపడేది. వారసులు పుట్టలేదని అతను బాధపడేవాడు. ఆమె బాధకి పర్యవసానం ఆత్మహత్య అయితే, అతని బాధకి పర్యవసానం నిద్రలేమి, నిట్టూర్పులు అన్నింటినీ మించిన నిన్నటి జ్ఞాపకం.. మల్లి, మల్లి కొడుకు! మల్లికి పుట్టినవాడు తనవాడు కాడూ. తన రక్తం కాదూ.
అడపదడప చినుకులు పడుతున్నాయి. నడకలో వేగం పెంచలేని అశక్తుడై వున్నాడు సూర్యనారాయణరావు. ఏం చేస్తాడు? వయసు భారం మొత్తం మోకాళ్ళమీద వచ్చిపడింది. అయినా నడుస్తూనే వున్నాడు. మల్లె పందిరి కనిపించేంతవరకు.

ఎన్ని వ్యాపారాలు చేసి ఏం లాభం? ఎన్ని కార్పొరేట్ మీటింగులలో మాట్లాడి ఏం లాభం? ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అటుంచి, తొంగి చూడటానికే భయపడ్డాడతను. చినుకులు పెద్దవై తడుస్తున్నా, పూలు లేని మల్లెపందిరి చూస్తూ నిలబడిపోయాడు.

భాస్కర్ కి తన తండ్రి ఎవరో తెలిసేవుంటుందా? మల్లి చెప్పేవుంటుందా? చచ్చిపోయాడని చెప్పి వుంటుందా? చచ్చినారాడని చెప్పివుంటుందా? వర్షం కన్నా మనసులో ప్రశ్నలే అతన్ని ఎక్కువగా తడిపేస్తున్నాయి. సాయంత్రం దాటిన చీకట్లు కమ్ముకుంటున్నాయి.

“ఎవరదీ?” వినిపించిందో గొంతు. ఆ వెనకే ఎవరో పాతికేళ్ళ యువతి వర్షానికి తలపై చేతిని పెట్టుకోని వచ్చింది.

“ఎవరంటే పలకరేం?” కొంత ఖంగారు, కొంత భయం ఆమె గొంతులో.

“కోడలేమో...” అనుకున్నాడు. మరింత ఖంగారు, మరింత భయం అతని గుండెలో.

“ఏం లేదమ్మా... ఇక్కడ నా వస్తువు ఒకటి పోయింది వెతుక్కుంటున్నాను...” చెప్పాడతను. 

వెతుక్కుంటున్నమాట నిజమే అయితే అది వస్తువు కాదని అతనికీ తెలుసు.

“అయ్యో... వర్షం పడుతోంది కదండీ... పోనీ లోపలికి రండి...” ఆహ్వానించిందామె.

“ఫర్లేదమ్మా... దొరుకుతుందని నమ్మకం కూడా లేదు..” నిరాశ అతని గొంతులో.

“పోనీ... ఏం పోయిందో చెప్పండి. పిల్లాడికి చెబితే వెతికి పెడతాడు..”

ఆమె వెనుకగా గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు ఆరేళ్ళ పిల్లాడు.

“అది చెప్పేది కాదు తల్లీ... కానీ విలువైనది...” అన్నాడతను.

“అరెరె... ఈయన కూడా లేరే... ముందు లోపలికి రండి. వర్షం తగ్గాక వెతుకుదురుగానీ...” అందామె.

“వద్దమ్మా... నేను అనవసరంగా వెతుకుతున్నాను... పోయింది ఇక్కడ కాదేమో...” అంటూ వెనక్కి తిరిగాడు. ఒక మెరుపు మెరిసింది. ఆమె అలాగే కొద్దిసేపు చూస్తూ నిలబడిపోయింది.

లాడ్జికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయాడు సూర్యనారాయణరావు. తడిబట్టలతోనే మంచం మీద వాలాడు.
కనపడ్డది కోడలే అని మనసు చెప్తోంది. కొడుకుని చూడలేకపోయానన్న బాధకన్నా మనవణ్ణి చూశాన్న ఆనందం వుంది. సుఖంగా వున్న కుటుంబాన్ని కష్టపెట్టకుండా వచ్చేసినందుకు సంతోషంగా వుంది. ఒంటరితనం మళ్ళీ మొదలైందని కలతగా వుంది. అలాగే నిద్రపోయాడు.

తెల్లవారుతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడు. చప్పున మెలుకువ వచ్చింది. తలుపు తీశాడు.
అదే ముఖం... గత కొంతకాలంగా పగలూ రాత్రి కళ్ళముందు కనిపిస్తున్న మల్లి ముఖం. అవును మల్లే..!! కాదు కాదు... మల్లి పోలికలున్న వాడు.. వాడే... తన కొడుకు భాస్కర్..!! ఇంకా వెతికితే ఆ ముఖంలో తన పోలికలు వుంటాయని అనిపించిందతనికి. అయినా వెతకలేదు. ఆ ముఖంలో మల్లి కనపడటంలోనే ఆనందం వుంది.

“నమస్కారమండి...” అన్నాడతను.

“లోపలికిరా బాబూ...” పిలిచాడు. అతను లోపలికి వచ్చాడు కానీ కూర్చోలేదు. సూర్యనారాయణరావు చూపు మరల్చలేదు.

“రాత్రి మా ఇంటి వైపు వచ్చారట కదా... సీత చెప్పింది...” అడిగాడతను. తలూపాడు సూర్యనారాయణరావు. 

ఒక్కసారి భాస్కర్ “నాన్నా” అంటాడేమో అని గుండె ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ ఒక్క మాట అతను అంటే తన సమస్త వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేయడానికైనా సిద్ధంగా వున్నాడు. కొడుకు ఒప్పుకోవాలేగానీ వాళ్ళందరినీ తన కుటుంబంగా చేసుకోడానికి తహతహలాడుతున్నాడు. కానీ భాస్కర్ ఆ ఒక్క మాట అనలేదు. కొద్ది సేపు సూర్యనారాయణ ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.

“మీ వస్తువేదో పోయిందని చెప్పారట... అది దొరికింది. మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను...” అంటూ ఒక కాగితపు పొట్లం అతని చేతిలో పెట్టి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడతను.

సూర్యనారాయణ చేతిలో చూసుకున్నాడు. వణుకుతున్న చేతులతో కాగితం మడతలు విప్పి చూశాడు...
బంగారు గొలుసు...!

ఆ రోజు ఒకరు బాధ్యత అనీ, మరొకరు లంచమనీ అనుకున్న దండ. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించి మంచం మీద కూలబడిపోయాడతను.

భాస్కర్ వడి వడిగా అడుగులేసుకుంటూ లాడ్జి దాటి వెళ్ళిపోయాడు. బయట మబ్బులు తొలగి సూర్యుడు బయిటికి వస్తున్నాడు.

<< ?>>


మొపాస కథలు: ఏమో? ఎవరికెరుక??

(మొపాసకు మతిభ్రమించి పిచ్చాసుపత్రిలో 1893లో మరణించడానికి ముందు రాసిన ఆఖరు కథగా చెప్పబడుతున్న కథ)

మై గాడ్! మై గాడ్!

రాసేయ్యబోతున్నాను. నాకేమైందో రాసేయ్యబోతున్నాను. కానీ ఎలా? ఇలా రాయంలంటే అంతె ధైర్యం కావాలో నాకు తెలుసు. ఇది ఎంత విచిత్రమైనదో అంత ప్రత్యేకమైనది. అంతే కాదు, అనూహ్యమనదీ, అర్థం లేనిది కూడా!
నేనేం చూశానో ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ నా తర్కంలో ఏ తప్పు లేదు. నా మాటల్లో ఏ పొరపాటు లేదు. నేను గమనించిన దాంట్లో ఏదీ ముందు వెనుక కాలేదు. కేవలం హాలూజినేషన్ వల్ల మోసపోయానంటారేమో? అర్థం లేనిదేదో చూశానని అందరూ ఎద్దేవా చేస్తారేమో. ఏమో ఎవరికెరుక?

నిన్న నేను ఒక పిచ్చాసుపత్రికి వెళ్ళాను. నా అంతట నేనే వెళ్ళాను. నాకున్న కాస్త విజ్ఞత వల్ల అనుకోండి, భయం వల్ల అనుకొండి. నా గతం మొత్తం తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ ఆసుపత్రిలో డాక్టరు. అతనికోసమే రాస్తున్నాను. ఎందుకు అని మీరు అడిగితే నేనేం చెప్పలేను. నాక్కూడా తెలియదు. బహుశా నాకున్న ఆ ఇబ్బందిని తొలగించుకోడానికేమో. అవును, ఒక భరించలేని పీడకల నాకు తెలియకుండానే నన్ను ఇబ్బంది పెడుతోంది.

ఆగండాగండి..! కాస్త వివరంగా చెప్తాను.

నా గురించి చెప్పుకోవాలంటే – ఏకాంతంగా వుంటాను, కలలు కంటుంటాను. ఒక రకమైన ఒంటరి తత్వవేత్తలా బతుకుతుంటాను. ఏం జరిగినా అంతగా పట్టించుకోను. ఉన్నదాంట్లో తృప్తిగా బతకగలను. ఈ లోకంలోనే కాదు, పై లోకంలో కూడా నాకు ఎవరితోనూ విరోధమనేది లేదు. చిన్నప్పటి నుంచీ ఒంటరిగా బతకడమే అలవాటైంది. అందువల్ల పదిమందితో కలవాలంటే ఒక రకమైన ఇబ్బంది నన్ను అవరిస్తుంది. మీకు ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు. నాక్కూడా తెలియదు. బయట ప్రపంచంలో తిరగకూడదని ఏం లేదు. తిరుగుతాను. స్నేహితులతో కలుస్తాను, మాట్లాడతాను, వాళ్ళతో కలిసి డిన్నర్లకి కూడా వెళతాను. కానీ వాళ్ళు నాకు దగ్గరగా ఎక్కువసేపు వున్నారంటే చాలు, వాళ్ళు ఎంత దగ్గరవాళ్ళైనా సరే నాకు బోరు కొట్టేస్తుంది. నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు అప్పటికప్పుడు లేచి వెళ్ళిపోతే చూడాలన్న కోరిక నా మనసులో మొదలై అది ఒక బాధలా రూపాంతరం చెందుతుంది. నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంటాను.

అది కోరిక కాదు. ఒక అవసరంగా మారిపోతుంది. అది జరగకపోతే తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. నాతో పాటు వున్న మనుషులు కదలకుండా అలాగే వున్నారనుకోండి, వాళ్ళ మాటలను నేను వినక తప్పలేదనుకోండి, వినడమే కాకుండా చాలాసేపటి వరకు వాళ్ళ సంభాషణ అర్థం చేసుకోవాల్సి వచ్చిందనుకోండి.. ఇంకేముంది? అది ఓ ప్రమాదంగా పరిణమిస్తుంది. ఎలాంటి ప్రమాదం అంటే? ఏమో ఎవరికెరుక? బహుశా తీవ్రత తక్కువగా వున్న పక్షపాతం రావచ్చు? ఏమో జరిగినా జరగవచ్చు!

నాకు ఒంటరితనం ఎంత ఇష్టం అంటే ఒకే పైకప్పు కింద నాతో పాటు మరో మనిషి ఉంటే, అతను పడుకోని నిద్రపోతున్నా సరే, కనీసం ఆ భావనని కూడా నేను తట్టుకోలేను. ప్యారిస్ మహానగరం బతకడం నా వల్ల కాదు. అలాంటి చోట నా బాధ మరింత తీవ్రతరం అవుతుంది. నేనేదో నా పాటికి ధర్మంగా బతికేస్తుంటాను. అందువల్ల లెక్కకు అందకుండా తండోపతండాలుగా తిరిగే జనం మధ్య వుండలేను. నా శరీరంలోపల, నరనరాల్లోపల ఒక యాతన కలుగుతుంది. వాళ్ళేమో నిద్రపోయేటప్పుడు కూడా గుంపులు గుంపులుగానే వుంటారు. అబ్బా! అవతలివాళ్ళు నిద్రపోయే దృశ్యం వాళ్ళతో సంభాషణ కన్నా దారుణమైనది. నా గది గోడకి అవతల వైపు ఎన్నో జీవాలు నిత్యం ఇలా గ్రహణం పట్టిన గ్రహాల్లా బతుకుతున్నారన్న భావన కలిగినా కూడా ఇక నేను ఆ గోడ పక్కన పడుకోని విశ్రమించలేను.

నేను ఎందుకులా వున్నాను? ఏమో ఎవరికెరుక? బహుశా చాలా చిన్న కారణం అయ్యుంటుంది. నాలోంచి ఉద్భవించినవి తప్ప వేరే ఏమైనా నాలో అసహనాన్ని కలిగిస్తాయి. అలా అసహనం కలిగించే మనుషులు ప్రపంచంలో చాలా మంది వున్నారు.

అంతా భూమి మీదే వున్నాం. కానీ రెండు వర్గాలుగా బతుకుతాము. మొదటి రకానికి ఇతరులతో అవసరం వుంటుంది. ఆ ఇతరులు వీళ్ళని ఆనందింపజేస్తారు, ఆలోచింపజేస్తారు, ఓదారుస్తారు. ఇలాంటి వాళ్ళకి ఒంటరితనం బాధని కలిగిస్తుంది. వేధిస్తుంది. ఒక దారుణమైన మంచుపలకలాగ, దాటలేని ఎడారిలా అనిపిస్తుంది. ఇక రెండో వర్గం మొదటి రకానికి పూర్తి వ్యతిరేకంగా వుంటారు. ఇతరులతో కలవడం వీళ్ళకి విసుగుని కలిగించి అలసిపోయేలా చేస్తుంది. సన్నగా బాధిస్తుంది. వీళ్ళకి ఒంటరితనం సాంత్వననిస్తుంది. స్వతంత్రంగా విశ్రమించే అవకాశాలు వెతుక్కోని అందులో జలకాలాడుతారు. తమ ఆలోచనలోనే హాస్యాన్ని వెతుక్కోని అందులో మునిగితేలుతూ నవ్వుకుంటుంటారు. ఇది చాలా సాధారణమైన, సామాన్యమైన శారీరిక లక్షణం మాత్రమే. కొంతమంది తమ లోనించి తాము బయటపడి అక్కడే బతకడానికి సృష్టించబడితే, కొంతమంది తమలోపలే బతకడానికి కల్పించబడ్డారు. నా విషయానికి వస్తే, బయటప్రపంచంతో నా సంబంధాలు ఆకస్మికంగా ఆగిపోతూ, బాధకరమైన ముగింపుని త్వరగా తీసుకొస్తుంటాయి. అవి ముగిసిపోవాల్సిన హద్దుని దాటి కొనసాగాయంటే నా శరీరం మొత్తంలోనూ, నా ఆలోచనలోనూ తట్టుకోలేని ఇబ్బంది కలుగుతుంది.

ఆ కారణంగానే నేను అచేతనమైన వస్తువులతో అనుబంధం ఏర్పరుచుకున్నాను. ఏర్పరుచుకోక తప్పలేదు అని కూడా చెప్పచ్చు. అవి నాకు మనుషులంత ముఖ్యమైనవి అయ్యాయి. అందుకే నా ఇల్లే నా ప్రపంచంగా బతుకుతుంటాను. అందులోనైతే నేను ఒంటరిగా, చలాకీగా బతికేయగలను. నా చుట్టూ రకరకాల వస్తువులు, ఫర్నీచర్, బాగా పరిచయం వున్నట్లు వుండే చిన్న చితకా వస్తువులు వుంటాయి. వాటిని చూస్తే నా కళ్ళలో ఒక మనిషి ముఖాన్ని చూస్తే కలిగే భావనే కలుగుతుంది. అందుకే అలాంటివి ఇంటి నిండా ఒక్కొక్కటిగా చేర్చి పెట్టుకున్నాను. చక్కగా అలంకరించుకున్నాను. వాటిని చూస్తే నా అంతరాంతరాలలో ఒక తృప్తి, సంతుష్టి కలుగుతుంది. వాటిని తాకినప్పుడల్లా అలవాటైన ఆ స్పర్శలొ లాలన నాకు సాంత్వనని ఇవ్వటమే కాదు, క్రమంగా ఒక అవసరంగా కూడా మార్చేసాయి. బహుశా గాఢంగా ప్రేమించిన అమ్మాయి కౌగిలి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వదేమో.

ఓ అందమైన తోట మధ్యలో ఈ ఇల్లు కట్టించుకున్నాను. తోటలోని చెట్లు రహదారుల్లో తిరిగే మనుషుల కంట్లో పడకుండా ఈ ఇంటిని దాచిపెడతాయి. నగరానికి ముఖద్వారానికి దగ్గరగా వుండటం వల్ల అప్పుడప్పుడు వుండే సామాజిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం వుంటుంది. నా పనివాళ్ళందరూ నా ఇంటికి కాస్త దూరంగా కట్టించిన వేరే ఇంటిలో వుంటారు. ఆ ఇల్లు నా పెరడు చివర్లో వుంటుంది. ఆ ఇంటివెనకే మొదలై చుట్టూ వుండే ఎత్తైన గోడలు. చీకట్లు నిగూఢంగా వుంచే లోకం, మౌనం కమ్మేసే ఏకాంత గృహం, మహా వృక్షాలు పెద్ద పెద్ద ఆకులతో కప్పేసిన ప్రదేశం. ఇంకేం కావాలి. ఈ ప్రాంతం నాకు ఎంత నెమ్మదిని ఇస్తుందో చెప్పలేను. రోజూ నిద్రకు ఉపక్రమించడానికి ముందు సాయంత్రాలు కొన్ని గంటలు అక్కడక్కడే పచార్లు చేస్తాను. ఏకాంతాన్ని ఇంకొంచెం జుర్రుకునే ప్రయత్నం చేస్తాను.

ఒక రోజు సిటీ థియేటర్లో “సింగ్నాడ్ప్రదర్శన జరిగింది. అంత అందమైన, అద్భుతమైన సంగీతాన్ని వినడం అదే మొదటిసారి నాకు. కలలో జరిగినట్లుండే కథ. ఆ నాటకం ద్వారా ఉల్లాసాన్ని, ఎంతో సంతోషాన్ని పొందాను. తిరిగి వచ్చేటప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంటే నా తలలో సన్నటి శబ్దంలా ఆ నాటకంలోని వాక్యాలే వినపడుతున్నాయి. అద్భుతమైన సన్నివేశాలు నా మెదడులో నుంచి నన్ను వెంటాడుతున్నాయి. చుట్టూ మృత్యువులాంటి చీకటి. ఎంత చీకటి అంటే ఏది దారో ఏది కాదో తెలియడం లేదు. ఫలితంగా రెండు మూడు సార్లు తుప్పల్లోకి వెళ్ళిపోయాను. ఊరి మొదట్లో వుండే కస్టమ్స్ హౌస్ దాటిన తరువాత ఒక మైలు దూరంలో నా ఇల్లు. అటూ ఇటుగా ఓ ఇరవై నిముషాల నడక.

అర్థరాత్రి ఒంటి గంటో, ఒకటిన్నర గంటో అయ్యుంటుంది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయి నెలవంక తొంగి చూసింది. విషాదాన్ని మోస్తున్న మూడో ఝాము నెలవెంక. మొదటి ఝాము వచ్చే నెలవంక వేరు. సాయంత్రం అయిదు ఆరుగంటలప్పుడు స్పష్టంగా, ఆనందాన్ని మోస్తూ వెండి రంగుతో మెరిసిపోతుంటుంది. అర్థరాత్రి దాటిన తరువాత కనిపించే చంద్రుడు ఎర్రగా, బాధల్ని మోస్తూ ఒంటరిగా వుంటాడు. రాత్రుళ్ళు తిరిగిన ప్రతి వేటగాడికి ఇది అనుభవమే. సాయంత్రపు చంద్రుడు సన్నటి దారంలా వుండి కనిపించీ కనిపించని ఆహ్లాదకరమైన వెలుగుల్ని పరుస్తూ గుండెల్లో ఆనందాన్ని నింపుతాడు. ఆ చంద్రుడు భూమి మీద పల్చటి నీడల్ని వరుసగా పేరుస్తాడు. ఆఖరి అంకంలో వున్న చంద్రుడు ఆరిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటూ వుంటాడు. అతని వెలుగులు ఏ నీడలనీ కల్పించలేవు.

దూరంగా నా తోట విషాదవార్తల్ని చేరవేస్తున్నట్లు అనిపించింది. ఎందుకో తెలియదు కానీ ఆ తోటలోకి వెళ్ళనివ్వకుండా వుంచే ఒక వ్యాకులత లాంటి భావం నన్ను కమ్మేసింది. నా నడక మందగించింది. గుంపులు గుంపులుగా వున్న చెట్లు పాతిపెట్టిన నా ఇంటి పైన కట్టిన సమాధుల్లా కనపడ్డాయి.

నేను నా ఇంటి వైపుకి వెళ్ళే ముఖద్వారం తెరిచాను. ఆ దారిలో గుహలా కప్పేసిన రావిచెట్ల, బయటి ప్రపంచానికి నా ఇల్లు తెలియకుండా అడ్డుగోడలాగా నిలబడి వున్నాయి. ఆ చెట్లు ఒకదాని తరువాత ఒకటి దారి ఎటు తిరిగితే అటు వంకలు తిరుగుతూ గరిక పెరిగిన లాన్లను కప్పేస్తున్నాయి. ఆ లాన్లలో వున్న మొక్కలకు పూసిన పూలు ఆ అంధకారంలో అస్పష్టంగా గోచరమౌతున్నాయి.

ఇంటికి దగ్గరపడే కొద్దీ, అనూహ్యమైన భావాలేవో కమ్ముకున్నాయి. ఏమీ వినపడటం లేదు. నిశ్చలంగా నిలబడ్డాను. దట్టమైన చెట్ల మధ్యలోనుంచి కనీసం గాలి కదులుతున్న చప్పుడు కూడా లేదు. “ఏమైంది నాకు” అనుకున్నాను.

పదేళ్ళనుంచి ఇదే దారిలో ఇంటికి వస్తూనే వున్నాను. ఇంతటి స్థబ్దత ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. రాత్రి చీకట్లు నన్ను ఎన్నడూ భయపెట్టింది లేదు. ఆ సమయంలో ఏ దొంగో, బందిపోటో కనపడితే అమాంతంగా వాడి మీదికి కోపంతో ఉరికేవాడిని. ఏ మాత్రం జంకేవాడిని కాదు. పైగా నా దగ్గర నా రివాల్వర్ కూడా వుంది. కాని నేను దాన్ని తాకలేదు. నా మనసులో రగులుకున్న భయం నా చేతులు కట్టేసింది.

ఏమిటిది? ఇదేమైనా శకునమా? ఏదో నిగూఢమైన శకునం కావచ్చు. ఊహకందని ఏదో అనుభవాన్ని చవిచూడబోయే ముందు కలిగిన అపశకునం కాదు కదా? ఏమో? ఎవరికెరుక?

ముందుకు వెళ్తుంటే కొద్దికొద్దిగా పెరుగుతూ నా చర్మం కింద వణుకు పెరగటం మొదలైంది. నా ఇంటి గోడ దగ్గరకు చేరిన తరువాత, తలుపులు తెరిచి లోపలికి వెళ్ళకుండా అక్కడే కాస్సేపు ఆగి కొద్ది నిముషాలు గడిపితే మంచిదని అనిపించింది. నా డ్రాయింగ్ రూమ్ కిటికీ కింద వున్న బెంచి మీద కూర్చున్నాను. మనసులో కలవరం అలా వుండగానే అక్కడే కాస్సేపు సేదతీరాను. నా తల గోడకి ఆనించి, కళ్ళు తెరిచి చూస్తున్నాను. చెట్ల ఆకులు నా ముఖం మీద చిత్రమైన నీడలు వేస్తున్నాయి. కొన్ని నిముషాలపాటు నాకేమీ అసహజంగా కనిపించలేదు. నా చెవులలో ఝుమ్మంటూ ఏదో శబ్దం వినపడింది. కానీ, నాకు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఒకోసారి నాకు రైళ్ళు పరుగెడుతున్న చప్పుడు వినపడుతుంది. మరోసారి గోడగడియారం గంటలు కొడుతున్నట్లు, ఇంకోసారి సైనికుల కాల్బలం కవాతు చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది.

కాస్సేపటిలో ఝుమ్మంటున ఆ శబ్దాలు మరింత స్పష్టంగా, మరింట ప్రత్యేకంగా మారుతున్నట్లు నిర్థారించుకున్నాను. బహుశా నన్ను నేనే నమ్మించుకున్నాను. నా శరీరంలో నరలు జలదరించడం వల్ల కలిగిన శబ్దాలను నా చెవులకు అలాంటి శబ్దాలుగా వినిపిస్తున్నాయని అనుకోడానికి లేదు. అవి ఇంకా స్పష్టంగా వున్నాయి. కాస్త తికమకగా అనిపిస్తున్నా అవి మాత్రం ఇంటిలో లోపలి నుంచే వస్తున్నాయి. అందులో ఏ అనుమానమూ లేదు. ఆ శబ్దాలు అలా గదిలో నుంచి గోడలను దాటి వస్తునే వున్నాయి. శబ్దాలు అనడానికి లేదు. ఏదో భారమైన వస్తువులు జరుపుతున్నట్లు, ఎవరో మనుషులు నా ఫర్నీచర్ మీదకు దూకుతున్నట్లు, వాటి కదిలిస్తున్నట్లు, ఈడ్చి ఎత్తుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపించింది.

నా చెవులలో వినపడుతున్నది నిజమేనా అన్న అనుమానంతో కాస్సేపు గడిపాను. నా ఇంటికి బయటవైపు వున గదులలో ఒక గది గోడపైన నా చెవిని ఆనించి వింటే అర్థంకాని వింత శబ్దాలు అక్కడ్నుంచే వస్తున్నాయని నిర్థారణ అయ్యింది. నాకేం భయం కలగలేదు. ఎలా చెప్పాలి మీకు? ఆశ్చర్యం వల్ల అచేతనంగా వుండిపోయాను అంతే! దగ్గరే వున్నా రివాల్వర్ బయటకు తీయలేదు. దాని వల్ల ఏమంత ప్రయోజనం వుంటుందని నాకు అనిపించలేదు.
చాలాసేపు విన్నాను కానీ ఏ నిర్ణయానికీ రాలేకపోయాను. నా ఆలోచనలు స్పష్టంగానే వున్నాయి. కాకపోతే లోలోపల ఎక్కడో ఉత్సుకత వుంది. లేచి నిలబడి ఇంకొద్దిసేపు ఎదురు చూశాను. వస్తున్న శబ్దాలను మాత్రం వింటూనే వున్నాను. అవి కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. ఉండుండీ గట్టి శబ్దాలు వినపడుతున్నాయి. ఆ చప్పుడులోనే ఏదో కోపం, కసి కలగలిపినట్లు విచిత్రంగా అనిపిస్తోంది.

ఉన్నట్టుండి నా పిరికితనం మీద నాకే అసహ్యం వేసింది. నా తాళాల గుత్తి చేతిలో తీసుకున్నాను. నాకు కావాల్సిన తాళం చెవి తీసి తలుపుకు వున్న తాళంలో పెట్టి రెండుసార్లు తిప్పాను. ఒక్కసారి తలుపుల్ని బలమంతా ఉపయోగించి తోయడంతో అది ధబ్బున తెరుచుకోని వెనక్కి వెళ్ళి గోడలకు కొట్టుకుంది. ఆ చప్పుడు ఓ తుపాకి పేలినట్లు వినపడింది. దాంతో పైకప్పు నుంచి, పునాదుల్దాకా అల్లకల్లోలమైనట్లైంది. రెప్పపాటులో జరిగిన ఆ సంఘటన ఎంత పెద్ద చప్పుడు చేసిందో అంతే భయపెట్టింది కూడా. నేను రెండు అడుగులు వెనక్కి తగ్గి, పెద్దగా ఫలితం వుండదని తెలిసినా జాగ్రత్తకోసం రివాల్వర్ తీసి చేతిలో వుంచుకున్నాను.

అలాగే వుండి చాలాసేపు విన్నాను. ఇప్పుడు స్పష్టత వస్తోంది. ఇంట్లో వున్న పెద్ద పెద్ద మెట్లమీద, నున్నటి నేల మీద, కార్పెట్ మీద బలంగా నడుస్తున్న అడుగుల చప్పుడు తెలుస్తోంది. ఆ చప్పుడు బూట్లేసుకున్న పాదాలవి కావు. ఉత్త కాళ్ళతో నడిచినప్పుడొచ్చే శబ్దమూ కాదు. బహుశా ఇనుముతో చేసినవో, లేక చక్కతో చేసిన కర్రలవి. కాళ్ళు లేనివాళ్ళు చేతికింద పెట్టుకోని నడిచే కర్రలు వుంటేయే లాంటి కర్రలు నేలమీద మోదుతున్న చప్పుడు. ఆ శబ్దం బ్యాండు మేళంలో వాడే పెద్ద పెద్ద చేతి తాళాలను కొట్టినట్లు వుంది. నేను నా తలుపు మొదట్లో వుండగానే ఏం జరుగుతోందో అర్థం అయ్యింది. నా చేతి కుర్చీ - నేను చదువుకునేటప్పుడు కూర్చునే పెద్ద కుర్చీ కదిలింది. దొర్లుకుంటూ బయట వున్న తోటలోకి వెళ్ళిపోయింది. దాని వెంటే డ్రాయింగ్ రూమ్ లో వున్న మిగిలిన వస్తువులు కూడా కదిలాయి. సోఫాలు వాటిని అవే ఈడ్చుకుంటున్నట్లు, మెసళ్ళు ముందుకాళ్ళ మీద దేకినట్లు కదిలాయి. ఆ తరువాత నా కుర్చీలు గొర్రల్లా బయటపడ్డాయి. చిన్న చిన్న టీపాయిలు కుందేళ్ళలా గెంతుకుంటూ వచ్చాయి.

ఓహ్! ఎలాంటి అనుభూతి! ఒక్క ఉదుటన దట్టమైన పొదల చాటుకు దూకి అక్కడే గుట్టుగా చూస్తూ కూర్చున్నాను. చూస్తుండాగానే తమ గత స్థితిని మరచిపోయినట్లు ఫర్నీచర్ మొత్తం ఒకదాని వెంట ఒకటి నడక సాగించాయి. వాటి వాటి బరువుని బట్టి కొన్న చకచకా నడుస్తుంటే కొన్ని నింపాదిగా నడుస్తున్నాయి. నా పియానో, గ్రాండ్ పియానో గుర్రంలా దూకుతూ వచ్చింది. అలా వస్తుంటే దానిలో నుంచి మందంగా గొణిగినట్లు సంగీతం వినిపిస్తోంది. చిన్న చిన్న వస్తువులు నత్తల్లా గులకరాళ్ళ మీద జారుతున్నాయి. నా బ్రష్షులు, కప్పులు, సాసర్లు, రంగురాళ్ళు ఇలాంటివన్నీ చంద్రకిరణాలు పడి మెరుస్తున్నాయి. ఆ తరువాత నా రైటింగ్ డెస్క్ వచ్చింది. అది ఓ శతబ్దకాలం నాటి నిగూఢ సత్యాల ఆలవాలం. దాని నిండా నా జీవితకాలం మొత్తం అందుకున్న వుత్తరాలు వున్నాయి. నా హృదయం చరిత్ర మొత్తం వాటిలోనే వుంది. తడిమినప్పుడల్లా నేను క్షోభపడ్డ గతం మొత్తం అక్కడే వుంది. అవికాక అపురూపంగా దాచుకున్న ఎన్నో ఫోటోలు అందులోనే వున్నాయి.

ఒక్కసారిగా నాలో భయం మాయమైపోయింది. దాని మీదకు దూకి ఒక దొంగని పట్టుకున్నట్లు, పారిపోబోతున్న భార్యని పట్టుకున్నట్లు పట్టేసుకున్నాను. అది మాత్రం దాని దారిలో పోవటం ఆపలేదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బిగించి పట్టుకున్నా దాని వేగాన్ని తగ్గించలేకపోయాను. దాన్ని ఆపడానికి విశ్వప్రయత్నం చేశాను కానీ, దాని బలం ముందు తట్టుకోలేక కిందపడ్డాను. అది నన్ను తొక్కేస్తూ ముందుకు వెళుతూ నన్ను కూడా గులకరాళ్ళ మీద ఈడ్చుకెళ్ళసాగింది. దాని వెనకే వస్తున్న మిగిలిన ఫర్నీచర్ కూడా నా మీద ఎక్కుతూ, నా కాళ్ళని నలగకొట్టాయి. డెస్క్ మీద నుంచి నా పట్టు తప్పగానే మిగిలినవన్నీ నా మీద నుంచీ ఒక చచ్చిన సైనికుడిమీద నుంచి వెళ్ళే సైనిక దళంలా సాగిపోయాయి.

భయం మళ్ళీ చుట్టుముట్టింది. ఆ దారిలోనించి తప్పుకోని మళ్ళీ పొదల చాటుకు వెళ్ళగలిగాను. అక్కడ్నుంచి చూశాను. ఒక్కక్కటిగా వస్తువులన్నీ వెళ్ళిపోవటం, ప్రతి చిన్న వస్తువు, నాకు ఎంతో పరిచయం వున్న వస్తువులు.. అవి నా వస్తువులు.. నావనుకున్న వస్తువులు.

అప్పుడే దూరంగా నా ఇంటిలోనుంచి వస్తున్న శబ్దాలు వినపడ్డాయి. ఇల్లంతా ఖాళీగా వుందేమో ఆ చప్పుడు మరీ పెద్దదిగా వినపడింది. తలుపులు మూతపడుతున్న చప్పుడు. అవును, ఎవరో తలుపుల్ని దభీమని వేస్తున్నట్లు పైన గదుల్నించి కిందదాకా ప్రతి తలుపు మూతపడుతున్నాయి. నేను ఇంతకు ముందు తెరిచిన తలుపుతో సహా అన్నీ తలుపులు ఆయా గదుల్లో వున్న వస్తువులు బయటికి వెళ్ళిపోగానే మూసుకుపోతున్నాయి. ఆఖరి తలుపు పడిపోయిన మరుక్షణం నేను అక్కడ్నుంచి పరుగందుకున్నాను... సరే, పారిపోయాను. సిటీ వైపుకి వెళ్ళి అక్కడి తోటల దగ్గర చీకట్లో మనుషులు కనపడేదాకా నేను మనిషిని కాలేకపోయాను.

నాకు తెలిసిన హోటల్ ఒకటి వుంటే అక్కడికి వెళ్ళి బెల్ కొట్టాను. నా వంటి మీద వున్న దుమ్ము ధూళి విదిలించుకోని నిలబడ్డాను. బయటికి వచ్చిన పోర్టర్ తో నా తాళాల గుత్తి పోయిందనీ, వాటిలోనే పెరటి తలుపు తాళాలు కూడా వున్నాయని చెప్పాను. వెనక నించైనా వెళ్ళగలిగితే అక్కడ నౌఖర్లు వుంటారనీ, కానీ అటు వెళ్ళే అవకాశం లేకుండా దొంగల్నుంచి తోట పళ్ళని కూరగాయల్ని కాపాడేందుకు కట్టిన ఎత్తైన గోడ వుందని చెప్పాను.
వాళ్ళు ఇచ్చిన పడక మీద పడుకోని కళ్ళదాకా దుప్పటి కప్పుకున్నాను కానీ నిద్ర పోలేకపోయాను. తెల్లవారేదాకా నా గుండె చప్పుడు వింటూ వున్నాను. పొద్దున్నే నా నౌఖర్లందరినీ అక్కడికే పిలిపించమని అంతకు ముందే ఆర్డర్ వేశాను. ఉదయం ఏడు గంటలకి మా పెద్ద నౌఖరు వచ్చి తలుపుకొట్టాడు.

వాడి ముఖం దిగాలుగా వుంది.

“రాత్రి ఘోరం జరిగిపోయింది మాన్సియర్” అన్నాడు వాడు.

“ఏమైంది”

“మాన్సియర్ గారి ఫర్నీచర్ మొత్తం ఎవరో ఎత్తుకెళ్ళారు. చిన్న చిన్న వస్తువు కూడా వదిలిపెట్టలేదు”

ఆ మాట నాకు సంతోషాన్నిచ్చింది. ఎందుకు. ఏమో ఎవరికెరుక? నేను మళ్ళీ నా అదుపులోకి వచ్చేశాను. ఇక జరిగిన విషయం, నేను చూసిన విషయం ఎవరికీ చెప్పకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ దారుణమైన రహస్యాన్ని నా గుండెల్లోనే సమాధి చెయ్యాలని అనుకున్నాను.

“నా తాళాలగుత్తి దొంగతనం చేసినవాళ్ళే అయ్యుంటారు. వెంటనే పోలీసులకు చెప్పాలి. మీరు పదండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అన్నాను.

ఆ తరువాత ఐదు నెలల పోలీసులు అసలా దొంగతనం ఎలా జరిగిందో అర్థం చేసుకోడానికి పరిశోధన చేశారు. ఏమీ దొరకలేదు. నాకు జరిగిన అనుభవం గురించీ తెలుసుకోలేకపోయారు, దొంగల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. భగవంతుడా! నాకు తెలిసిన సంగతంతా వాళ్ళకి చెప్పి వుంటే? అహా అసలు చెప్పి వుంటే? నన్ను తీసుకెళ్ళి మూసేసేవాళ్ళు. దొంగల్ని కాదు, నన్ను లోపలేసేవాళ్ళు. జరిగిందంతా మొదట్నించి తెలిసినవాడిని, చూసినవాడిని నేనే కదా. అవును! అయినా నాకు మౌనంగా వుండటం ఎలాగో తెలుసు కదా!

ఇక నా ఇంట్లో ఒక్క సామాను కూడా వుంచను. అసలు పనికిరాని వస్తువులవి. మళ్ళీ వుంచితే అదే జరుగుతుంది. అసలు ఆ ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా నాకు మనస్కరించడం లేదు. ఇంక చచ్చినా ఆ ఇంటికి వేళ్ళను. ఆ ఛాయలకే వెళ్ళను. అక్కడ్నుంచి ప్యారిస్ లో ఒక హోటల్ కి వచ్చేశాను. ఆ సంఘటన తరువాత నా నరాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయని డాక్టర్లని కలిసాను.


వాళ్ళంతా ఎటైనా వేరే ప్రదేశానికి వెళితే మంచిదని సూచించారు. నేను వాళ్ళ మాటలు పాటించాను.

***

విహారానికి ఇటలీ ప్రయాణం పెట్టుకున్నాను. అక్కడ కాచిన ఎండల్లో తిరగడం వల్ల కొంత మేలే జరిగింది. ఆరు నెలల పాటు తిరిగాను. జినొ నుంచి వెనీస్, వెనీస్ నుంచి ఫ్లోరెన్స్ అక్కడ్నుంచి రోమ్, ఆ పైన నేపుల్స్ వెళ్ళాను. సిసిలీకి కూడా వెళ్ళాను. అందమైన ప్రకృతికి, ప్రాచీన అవశేషాలకు ఆ ప్రాతం ప్రసిద్ధి. గ్రీకులు, నోర్మన్లు వదిలిపెట్టిన వారసత్వ సంపద అక్కడ వుంది. అక్కడ్నుంచి ఆఫ్రికా వెళ్ళాను. బ్రహ్మాండమైన ఎడారుల్లో కూడా చాలా తాపీగా తిరిగాను. ఒంటెలు, గాజెల్లా జింకలు, అరబ్ దిమ్మరులు తిరిగే ఆ పసుపు పచ్చని ఇసుక నేలలో ప్రశాంతతను వెతుకున్నాను. చాలా అరుదైన, స్వచ్ఛమైన అలాంటి వాతావరణంలో అర్థంలేని ఆలోచనలేవీ కలుగలేదు. పీడకలలు కనడానికి కూడా అక్కడ రాత్రుళ్ళు లేదు.

మార్సే పోర్ట్ ద్వారా మళ్ళీ ఫ్రాన్స్  లోకి వచ్చాను. ఆ రాచరికపు నగరం ఎంత సంబరంగా వున్న, మబ్బుల మసకలు కమ్మిన ఆకాశాన్ని చూశాక నాలో బాధ మళ్ళీ మొదలైంది. ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణం ఎప్పుడో తగ్గిపోయిన నా అనారోగ్యం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపించింది. సన్నటి బాధ మొదలై నా మనసులో పాత రోగం అవశేషాలు ఇంకా వున్నాయని గుర్తుచేసింది.

తిరిగి ప్యారిస్ చేరుకున్నాను. ఓ నెలపాటు నా మనసు మనసులో లేదు. చెట్ల ఆకులు రాలుతున్నకాలం. ఆ తరువాత వచ్చే చలికాలం లోగా అప్పటి వరకు చూడని నార్మండి ప్రాంతంలో తిరిగిరావాలని అనుకున్నాను.
నా ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఎనిమిది రోజుల పాటు సాగింది. ఎక్కడా చొరవ చూపించింది లేదుకానీ, ఉత్సుకత ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించాను. ప్రాచీన గోథిక్ సాంప్రదాయంలో కట్టిన కట్టడాలవల్ల రూహ్వా నగరం ఒక మ్యూజియంలా వుంది.

ఒకరోజు మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు కాస్త బద్దకంగా అడుగులో అడుగేసుకుంటూ ఓ వీధిలో నడుస్తూ వున్నాను. ఆ వీధిని చూస్తే ఏ మాత్రం ఆసక్తి కలగలేదు. అయినా అలా ముందుకు వెళ్ళే సరికి  నల్లటి ఇంకులాంటి మరకలు వరసగా కనిపించాయి. అక్కడేదో పురాత వస్తువులు వుండి వుంటాయన్న అనుమానం కలిగింది. ఒక్క క్షణం ఆగిపోయి గమనించాను. చూడటానికి మామూలు ఇళ్ళలాగే కనిపించినా ప్రతి గుమ్మలో సెకండ్-హ్యాండ్ వస్తువులు అమ్ముతున్నారు. నాకు స్వతహాగా అలాంటి వస్తువులపైన వున్న ఆసక్తితో వాటి వైపు ఆకర్షితుణ్ణి అయ్యాను.

ఆ! తెలిసింది! పురాతన సామాగ్రితో దొంగవ్యాపారం చేసేవాళ్ళకి వాటి ఆనుపానులు బాగా తెలుస్తాయి. అందుకే ఇలాంటి స్థలంలో అమ్మకాలు పెట్టుకున్నారు. చాలా చిత్రంగా కనిపించే ఈ వీధిలో, ఏదో అపశకునంలా ఎప్పుడూ పారే కాలువలు, వాటి నిండా బురద, పాతకాలం నాటి ఇళ్ళు, వాటి పైన కొనదేరిన పై కప్పులు వాటిపైన గడిచిపోయిన కాలం ఆనవాళ్ళు వీటన్నింటినీ ఆనందంగా గమనించాను. ఇలాంటి చోటే అపురూపమైన పాత వస్తువులు ఎన్నో దొరుకుతాయి.

గంభీరంగా నిలబడున్న ఆ ఇళ్ళ చివర శిల్పాలు, కువ్హా, సెవ్ర, మూస్టీయే మొదలైన కళాకారులు నగిషీలు చెక్కిన బొమ్మలు, అందమైన పెయింటింగ్స్, చెక్కతో చేసిన బొమ్మలు, క్రీస్తు బొమ్మలు, మరియమాత బొమ్మలు, చర్చి అలంకరణకు వాడిన బొమ్మలు, పవిత్రమైన గిన్నెలు, చెక్క బల్లలు ఇంకా ఎన్నో వున్నాయి. గుహల్లా వున్న ఆ చిన్న ఇళ్ళ లాంటి షాపుల్లో ఎన్నో రకాల వస్తువులు గుట్టలు గుట్టలుగా వున్నాయి. వాటి అస్థిత్వం మరచిపోయినట్లు అలా పడి వున్నాయి. అవి బతికిన రోజులే వాటి అస్థిత్వపు జ్ఞాపకాలు అన్నట్లున్నాయి. ఎంత మంది యజమానులను చూశాయో, ఏ ఏ శతాబ్దాలలో బతికాయో, ఏ ఏ కాలాలనీ, మార్పుకులోనౌతున్న ఎన్నో భావాలనీ దాటుకోని ఎప్పటికప్పుడు కొత్తతరానికి ఆసక్తి కలిగిస్తూ వాటి జీవితం మొత్తం గడిచిపోయి వుంటుంది.
పురావస్తువుల మీద నాకుండే ప్రేమ ఆ నగరవీధిలో పునరుజ్జీవం పొందింది. ప్రతి షాపుకు వెళ్ళాను. రోడ్డుకు అటూ ఇటూ పరిగెత్తాను. బురదనీటి పైన వున్న చెక్క వంతెనల మీద ఎగిరెగిరి దూకాను.

ఒక్కసారిగా షాక్! భగవంతుడా నువ్వే కాపాడాలి!! ఒక షాపు చివరి గది మొత్తం సామాన్లతో నిండిపోయి వుంది. ఒక స్మశానంలో సమాధుల్లా పురాతన సామగ్రీ ఎక్కడ పడితే అక్కడ వున్నాయి. నా బట్టల బీరువా లాంటిదే ఒకటి కనిపించింది. కాస్త దగ్గరగా వెళ్ళి తాకి చూడాలని చెయ్యి చాపాను. నా రెండు కాళ్ళు, రెండు చేతులు గడగడ వణుకుతున్నాయి. చాపిన చేతితో ఆ బీరువాని తాకడానికే భయమేసింది. వేద్దామా వద్దా అని వెనకాడాను.ఎట్టి పరిస్థితుల్లో అది నాదే. అందులో అనుమానమే లేదు. ఎనిమిదో లూయీస్ కాలం నాటి బట్టల బీరువా అది. ఎవరైనా ఒకసారి చూశారంటే మళ్ళీ మర్చిపోయే అవకాశమే కాదు. చూపు తిప్పి మరో వైపు చూశాను. ఆ గేలరీ లోతుల్ని కొలిచనట్లుగా చూశాను. కాస్త అవతలగా మూడు కుర్చీలు, వాటి మీద అల్లకం చేసిన గుడ్డ కనిపించాయి. ఇంకొంచెం అవతలగా రెండో హెన్రీకి చెందిన నా టేబుల్స్ కనిపించాయి. అవి ఎంత అపురూపమైనవంటే, నా దగ్గర వున్నప్పుడు ప్యారిస్ నగరం నుంచి వాటిని చూడటానికే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

ఒక్కసారి ఊహించండి! ఆ క్షణం నా మానసిక పరిస్థితి ఎలా వుండి వుంటుందో మీరే ఊహించండి! ముందుకు కదిలాను. ఆగుతూ, వెనకాడుతూ, మనసులోనే ఊగిసలాడుతూ కదిలాను. కానీ ముందుకే వెళ్ళాను. ధైర్యంగా, పాతకాలపు యోధుడిలా ముందుకు సాగాను.

నడుస్తుంటే ప్రతి అడుగులో నాకు సంబంధించిన ఏదో ఒక వస్తువు కనిపిస్తూనే వుంది. నా బ్రష్షులు, నా పుస్తకాలు, నా బల్లలు, నా కవర్లు ప్రతి ఒక్కటి అక్కడే వున్నాయి. ఒక్క ఉత్తరాల కట్ట మాత్రం దొరకలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

అలాగే నడిచాను. చీకటి గేలరీలోకి వేళ్ళాను, అక్కడ్నుంచి పై అంతస్తులోకి వెళ్ళాను. చూస్తే నేనొక్కడినే వున్నాను. పిలిచినా ఎవరూ పలకలేదు. నేను ఒంటరిని. ఎవరూ వున్నట్టు లేరు ఆ ఇంట్లో – సువిశాలమైన సమాధిలా వున్న ఆ ఇంట్లో..!!

చీకటి మరింత చిక్కగా ప్రవేశించింది. ఎటూ వెళ్ళే అవకాశం లేక ఆ అంధకారంలో నా స్వంత కుర్చీలోనే కూర్చున్నాను. అసలు అక్కడ్నుంచి వెళ్ళాలనే అనిపించలేదు. ఉండుండీ – “హలో.. ఎవరైనా వున్నారా” అంటూ కేకలు పెట్టాను.

దాదాపు ఓ గంట అలాగే కూర్చోని వున్నాక ఎవరివో అడుగుల చప్పుడు వినపడ్డాయి. ఎటు నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు కానీ మెత్తగా, నెమ్మదిగా ఆ చప్పుడు దగ్గరైంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడ్నుంచి వస్తున్నారో తెలియకపోయినా కాస్త ధైరం కూడగట్టుకోని మళ్ళీ ఒకసారి పిలిచాను. అప్పుడు కానీ గమనించలేదు  - పక్కన గదిలో మిణుకు మిణుకుమంటున్న వెలుగును.

“ఎవరక్కడ?” అన్నారెవరో

“కొనడానికి వచ్చాను” అన్నాను.

“ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు. వేళ మించిపోయింది”

“గంటసేపటి నుంచి ఎదురుచూస్తూ వున్నాను” అంటూ సమాధానం ఇచ్చాను.

“రేపు రండి”

“రేపు నేను రూహ్వా నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను”

ముందుకెళ్ళే ధైర్యం నేను చెయ్యలేదు. అతను కూడా నా వైపుకు రాలేదు. అతను తెచ్చిన వెలుగు మిణుక్కుమంటూ అక్కడ బల్లమీద పరిచివున్న గుడ్డ అల్లికలమీద పడి అది మెరుస్తోంది. ఆ గుడ్డమీద ఇద్దరు దేవదూతలు చనిపోయిన యుద్ధవీరుల మీద ఎగురుతున్నట్లు అల్లబడి వుంది. అది కూడా నాదే.

“ఒకసారి ఇటు వస్తారా?” అన్నాను.

“మీరే ఇటు రండి” అన్నాడతను.

నేను లేచి అతను వున్న వైపుకు వెళ్ళాను.

ఆ పెద్దగది మధ్యలో నిలబడి వున్నాడతను. పొట్టిగా, ఇంకా చెప్పాలంటే చాలా పొట్టిగా, లావుగా అంటే చాలా లావుగా చిత్రంగా వున్నాడతను. పొడుగ్గా వేలాడుతున్న గడ్డంలో తెల్లటివి, రాగిరంగువి వెంట్రుకలున్నాయి. తల మీద మాత్రం ఒక్కటంటే, ఒక్కటి కూడా వెంట్రుకలేదు.

అతను చెయ్యి చాచి కొవ్వొత్తిని దూరంగా పెట్టి నన్ను చూసే ప్రయత్నం చేశాడు. ఆ వెలుగులో అతని బట్టతలని చూస్తుంటే, పాత ఫర్నీచర్ తో నిండిన ఆ పెద్ద గదిలో ఒక చిన్న చంద్రుడి మెరుస్తున్నట్లు అనిపించింది. ముఖం మొత్తం ముడతలు పడి వేలాడుతోంది. అతని కళ్ళు మాత్రం నాకు కనపడలేదు.

అతనితో మాట్లాడి నావే మూడు కుర్చీలు కొనుక్కోని, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి డెలివరీకి నా హోటల్ రూమ్ నెంబర్ చెప్పాను. మర్నాడు తొమ్మిది కన్నా ముందే తెచ్చివ్వాలని ఒప్పందం చేసుకున్నాను.
అక్కడ్నుంచి బయల్దేరాను. అతను నాతో పాటు మర్యాదగా గుమ్మం దాకా వచ్చి సాగనంపాడు.

వెంటనే సెంట్రల్ పోలీస్ డిపోలో వున్న కమీషనర్ ఆఫీసుకు వెళ్ళి అయనతో నా ఇంటిలో దొంగతనం ఎలా జరిగిందో వివరించి, ఇప్పుడు మళ్ళీ వాటిని ఒక షాపులో చూశానని చెప్పాను. నేను మునుపు ఇచ్చిన కంప్లైంట్ వివరాల కోసం ఎవరికో టెలిగ్రాఫ్ ద్వారా వర్తమానం పంపి, సమాధానం వచ్చేదాకా వేచి వుండమని చెప్పాడు. ఓ గంట తరువాత సమాధానం వచ్చింది. అంతా నేను చెప్పినట్లే వుంది.

“నేనిప్పుడే వాణ్ణి అరెస్ట్ చేసి, వాడి సంగతేంటో తేలుస్తాను. మీ దగ్గర వున్న వాటి గురించి ఎలాగో తెలుసుకోని వాటిని మీక్కాకుండా చేసుంటాడు. మీరు వెళ్ళి భోజనం కానిచ్చుకోని ఓ రెండు గంటల తరువాత రండి. మీరొచ్చేసరికి వాణ్ణి ఇక్కడ నిలబెట్టి, మీ ఎదురుగానే రెండోసారి కూడా ఫ్రెష్ గా ఇంటరాగేట్ చేస్తాను. సరేనా” అన్నాడాయన.

“ధన్యవాదాలు మాన్సియర్, అలాగే చేయండి.” అన్నాను నేను.

నేను నా హోటల్ కి వెళ్ళి నేనే నమ్మలేనంత భోజనం చేశాను. వాణ్ణి ఆ పాటికే పోలీసులు పట్టుకోని వుంటారని చాలా ఆనందంగా వున్నాను.

రెండు గంటల తరువాత నేను మళ్ళీ కమీషనర్ గారి ఆఫీసుకు వెళ్ళేసరికి ఆయన నాకోసమే ఎదురుచూస్తున్నాడు.
“రండి మాన్సియర్” అంటూ ఆహ్వానించాడాయన. “మీరు చెప్పిన వ్యక్తిని పట్టుకోలేకపోయాము. నా మనుషులు ఎంత ప్రయత్నించినా అతని ఆనవాలు కూడా దొరకలేదు.” అన్నాడు.

నాకు ఉసూరనిపించింది. గుండె జారిపోయింది.

“కనీసం అతని ఇల్లు కనుక్కోగలిగారా?” అడిగాను,

“కనుకున్నాం. అంతే కాదు, అతను ఎప్పటికైనా తిరిగి వస్తాడు కదా అని ఈ క్షణం కూడా ఆ ఇంటికి కాపలా కాస్తున్నాం. కానీ ఇంతలోనే వాడు ఎలా మాయమయ్యాడో అర్థం కావడం లేదు”

“మాయమయ్యాడా?”

“అవును, మాయమయ్యాడు. అతను సామాన్యంగా సాయంత్రం పూట అతని పక్కింట్లో వుండే ఆవిడతో గడుపుతాడు. ఆమెకి భర్తలేడు. ఇతని ఫర్నీచర్ కి కూడా ఆమే బ్రోకర్ గా వ్యవహరిస్తుంటుంది. మంత్రగత్తె అని కూడా చెప్తుంటారు. ఆమెని అడిగితే అతను ఈ రోజు సాయంత్రం రాలేదని చెప్పింది. అతని గురించి ఏ సమాచారం ఇవ్వలేకపోయింది. రేపటి దాకా చూద్దాం”

నేను వచ్చేశాను. రూహ్వా నగర వీధులన్నీ శాపగ్రస్తమైనవిగా అనిపించసాగింది. మళ్ళీ ఓ బాధ వెంటాడసాగింది.
నిద్రపోదామని విశ్వ ప్రయత్నం చేశాను కానీ, పడుకున్న ప్రతిసారీ పీడకలలు వచ్చాయి.

త్వరగా వెళితే మరీ ఆతృత పడుతున్నానని అనుకుంటారని మర్నాడు పది దాకా ఆగి నింపాదిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను.

ఆ వ్యాపారి మళ్ళీ రాలేదట. షాపు మూసే వుందట.

“మరే ఫర్లేదు. మేము అన్నీ ఏర్పాట్లు చేశాము. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. మనం కలిసి అక్కడికి వెళ్ళి, ఆ షాపు తెరిపిద్దాం. మీ సామాన్లేవో మీరు గుర్తిస్తే చాలు” అన్నాడు కమిషనర్.

క్యాబ్ మాట్లాడుకోని బయల్దేరాము. ఆ బిల్డింగు చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. తాళాలపని చేసేవాడిని కూడా పిలిపించారు. కాస్సేపటికి ఆ షాప్ తలుపులు తెరిపించారు కూడా.

లోపలికి వెళ్ళి చూద్దును కదా నా బట్టల బీరువా కానీ, నా కుర్చీలు కానీ, టేబుళ్ళు కానీ ఏదీ లేవు. నా ఫర్నీచరంటూ ఏదీ అక్కడ లేదు. ఒక్కటి కూడా లేదు. అంతకు ముందు రోజు ప్రతి అడుగుకీ నా వస్తువు ఏదో ఒకటి కనిపించింది. అలాంటిది ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడ లేదు.

పోలీసు కమీషనర్ మొదటి ఆశ్చర్యపోయినా ఆ తరువాత నన్ను అనుమానంగా చూశాడు.

“మై గాడ్! మాన్సియర్... ఈ ఫర్నీచర్ అదృశ్యమవడానికి, ఆ వ్యాపారి అదృశ్యమవడానికీ ఏదో సంబంధం వున్నట్లుంది” అన్నాను నేను.

ఆయన గట్టిగా నవ్వాడు.

“అవును నిజమే. అయినా మీరు తప్పు చేశారు. నిన్న మీ వస్తువులు మీరే డబ్బులిచ్చి మరీ కొనుక్కున్నారు కదా. అదే పొరపాటు. దాంతో వాడికి అనుమానం వచ్చినట్లుంది.”

“అయినా సరే నాకు అర్థం కాని విషయం ఏమిటో తెలుసా? నా ఫర్నీచర్ లేదు సరే, కానీ వాటి స్థానంలో వేరే కొత్త ఫర్నీచర్ ఎలా వచ్చింది?”

“దాందేముంది? రాత్రంతా గడిచింది కదా. పైగా అతనితో పాటు దొంగతనం చేసినవాళ్ళు వుండి వుంటారు. వాళ్ళంతా కూడా సహాయం చేసి వుంటారు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసుంటుంది. ఎక్కడికి పారిపోతాడు? పైగా అతని షాపు మా అధీనంలో వుంటే” అంటూ నవ్వాడు

* * *

అయ్యో నా గుండె. పాపం నా గుండె. ఎలా కొట్టుకుంటోందో!

రూహ్వాలోనే రెండు వారాలు వున్నాను. ఆ మనిషి తిరిగి రాలేదు. ఏం చెప్పేది? అతను ఆశ్చర్యపోయాడా? అనుమానపడ్డాడా? భయపడ్డాడా? ఏమో! ఎవరికెరుక?

పదహారో రోజు ఉదయాన్నే నా ఇంటి తోటమాలి, కాపలాదారు రాసిన చిత్రమైన ఉత్తరం ఒకటి వచ్చింది.:
“మాన్సియర్:

“తమ సమక్షానికి రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను నివేదించాలని ఈ ఉత్తరం రాయిస్తున్నాను. జరిగిందేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. పోలీసులకి కూడా ఏమీ అర్థం కావటం లేదు. జరిగిందేమిటంటే – మీ ఫర్నీచర్ మొత్తాన్ని తిరిగిచ్చేశారు. ఏ వస్తువూ పోలేదు – అన్నీ ఎక్కడ వుండాలో అక్కడే వున్నాయి. చిన్న చిన్న వస్తువులతో సహా అన్నీ! దొంగతనం జరగడానికి ముందు ఇల్లు ఎలా వుందో, ఇప్పుడూ అలాగే వుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే వాళ్ళ బుర్ర తిరిగిపోయేలాగుంది. శుక్రవారం – శనివారం మధ్యరాత్రి ఇలా జరిగింది. దారి మొత్తం తొవ్వినట్లు బారుగా గుంతలు పడ్డాయి. చుట్టూ వుండే కంచెని ఎవరో ఈడ్చినట్లు తలుపుల దగ్గరకు వచ్చింది. సరిగ్గా మన ఫర్నీచర్ మాయమైన రోజు బయట ఎలాంటి పరిస్థితి వుందో ఇప్పుడు కూడా అలాగే వుంది.
మేము మీకోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నాము మాన్సియర్.

ఇట్లు మీ విధేయుడైన నౌఖరు ఫిలిప్ రౌదీన్”

“నో నో... నేను చస్తే ఆ ఇంటికి వెళ్ళనని ఒట్టుపెట్టుకున్నాను కదా! నేను వెళ్ళను” అనుకున్నాను.
ఆ ఉత్తరాన్ని పోలీస్ కమీషనర్ దగ్గరకు తీసుకెళ్ళాను.

“మొత్తానికి చాలా సుళువైన పరిష్కారం దొరికింది. ఇంకేముంది? ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. వాడిక్కడికి రాకపోతాడా ఏదో ఒకరోజు వాణ్ణి పట్టుకోకపోతానా” అన్నాడాయన.

* * *

కానీ అతను దొరకలేదు. కాదు. పోలీసులు పట్టుకునే ప్రయత్నమే మానుకున్నారు. నాలో భయం పెరిగిపోయింది. ఏదో క్రూర జంతువు నా వెంటపడుతున్నట్లుగా వుంటోంది.

భరించలేను! నా వల్ల కావటం లేదు! జానపద భూతాల కథల్లో అర్థం కాని మిస్టరీలా ఎప్పటికీ జరిగిందేమిటో తెలుసుకోలేము. తెలియదు కూడా. నేను ఇక ఆ పాత ఫర్నీచర్ షాపుకు వెళ్ళడం కల్ల. ఎందుకెళ్ళాలి? వెళితే మళ్ళీ అతన్ని కలుసుకోవాల్సి వస్తుందేమో. ఆ రిస్క్ తీసుకోడానికి మనస్కరించలేదు.

ఒకవేళ అతను తిరిగి వచ్చినా, ఆ షాపు మళ్ళీ తెరిచినా, అక్కడ ఒకప్పుడు నా ఫర్నీచర్ వుందని ఎలా నిరూపించడం? నా మాటలు తప్ప వేరే ఏ ఆధారమూ లేదు. నా మాటల్ని కూడా నమ్ముతారని ఏమిటి నమ్మకం?
ఓహ్! ఇలా బతకడమే కష్టంగా వుంది. నేను చూసిన వాస్తవాన్ని రహస్యంగా మార్చి నాలోనే దాచుకోవడం కష్టంగా వుంది. లోపల అలాంటి సంఘటన మళ్ళీ జరుగుతుందని అనుమానం వున్నా, ప్రపంచంలోని మిగతా మనుషుల్లాగా పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు వుండటం నా వల్ల కాదు.

అందుకే ఈ డాక్టర్ దగ్గరకు వచ్చాను. ఈ పిచ్చాసుపత్రికి ఆయనే డైరెక్టర్. ఆయనకి జరిగిందంతా వివరంగా చెప్పాను.

చాలా సేపు ఏవేవో ప్రశ్నలు వేశాడు. – “పోనీ ఇక్కడే, ఈ హాస్పిటల్లోనే కొద్ది రోజులు వుండకూడదూ?” అన్నాడు.

“తప్పకుండా మాన్సియర్” అన్నాన్నేను.

“ఆదాయానికి ఇబ్బంది లేదుగా?”

“లేదు మాన్సియర్”

“అయితే మీకు విడిగా వుండే గది ఏర్పాటు చేస్తాను”

“అలాగే కానివ్వండి”

“ఎవరైనా స్నేహితులు వస్తే కలుస్తారా?”

“లేదు మాన్సియర్. ఎవరినీ కలవదల్చుకోలేదు. రూహ్వాలో ఆ వర్తకుడు వున్నాడు కదా, అతను నా మీద పగదీర్చుకోవడానికి తప్పకుండా వస్తాడు” అన్నాను.

 * * *

అక్కడే ఒంటరిగా ఎవరినీ కలవకుండా మూడు నెలలు వున్నాను. క్రమ క్రమంగా ప్రశాంత కలుగుతోంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలూ లేవు. కానీ ఒకటే అనుమానం. ఒకవేళ ఆ వర్తకుడికి పిచ్చిపడితే? అతన్ని కూడా ఇదే ఆసుపత్రిలో చేరిస్తే? ఏమో ఎవరికెరుక?
<< ?>>