పడవలు

ప్పటిదాకా తనకు తోడుగా వున్న సూర్యుడు వెళ్ళిపోతున్నాడని ఆకాశం ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా చేసుకుంది. ఆ ఆకాశం కన్నీరులా ఉంది పులికాటు సరస్సు. సూర్యుడు అందులో మునిగిపోతున్నాడు.

పులికాటి గట్టుమీద ఆ పసివాడు జాగ్రత్తగా తన పని చేసుకుంటున్నాడు. వాడి చేతులు అతి లాఘవంగా కదులుతున్నాయి. వడ్డున దొరికిన రబ్బరు చెప్పుకు ఒక పుల్లను గుచ్చి దానికి గుడ్డకట్టి పడవలా తయారుచేస్తున్నాడు. వాడి పేరు చంద్రిగాడు.

"రేయ్ సెంద్రిగా.. ఈ పాలి పడవని నేనిడుత్తారా" సెల్వం అడిగాడు. వాడు చంద్రిగాడి స్నేహితుడు.

"సెత్.. పోయిన తడవ నువ్ ఇడిత్తే ఏటైనాదిరా.. నట్టేటికిబోయి.. బుడుంగున మునిగిపోయిళ్ళా... రేయ్.. సెంద్రిగా నువ్వే ఇడురా.. నువ్వు ఇడిత్తే.. బలేగ పోతాది పడవ.." పక్కనే వున్న మరొకడన్నాడు.

"రేయ్.. సెంద్రిగా నువ్వు పొద్దస్తమానం ఇంకా సదువులు సదివి పెద్ద పెద్ద పడవలు సేత్తానంటావు కదరా.. ఎప్పుడురా అది.." ఇంకొకడు అడిగాడు.

చెంద్రిగాడు మాట్లాడలేదు. తయారైన పడవ వంక తృప్తిగా చూసుకొని కొల్లేరు వైపు పరుగు తీసాడు - వాడి వెనకే పిల్లలందరూ. పడవని నీళ్ళలోకి వదిలిపెట్టి చిన్నగా ఒక్క తోపు తోసాడు. అది వయ్యారంగా వూగుతూ ముందుకు కదిలింది. దానివైపే చూస్తూ చంద్రం అన్నాడు -

"పెద్ద పడవలంటే ఇట్టాటివి కాదురా.. మరపడవలు.. నేను సదూకొని సేసేవి అయ్యే.. అట్టాటియి యేసుకొని యేటగిన పోతే ఎన్ని సేపలైనా దొరుకుతాయి.. మా అయ్యకింక కట్టమే వుండదు.."
పడవ కనుమరుగౌతూ వుంది.

ఛెళ్ళున వీపున ఎవరో చరిచినట్లయ్యి నీళ్ళలో పడ్డాడు చంద్రం. పిల్లలందరూ పరుగుదీసారు. వెనక్కి చూసాడు చంద్రం.

"అయ్యా.. నువ్వా.. ఎందయ్యా" అన్నడు వీపు రుద్దుకుంటూ

"నాయాల.. ఏడబోయినావురా.. పైటాల కూడు దినక అమ్మకి సెప్పకుండా సస్తే.. ఏడెతికేది నేను..? నడువ్ ఇంటికి.." శీనయ్య అన్నాడు.

చంద్రం మాట్లాడలేదు. శీనయ్య చెయ్యి పట్టుకొని కదిలాడు. ఇద్దరూ నడక సాగించారు.

"రేయ్.. రేపటాలనించి నువ్ నాతో గూడా యేటకి రావాల.."

"అయ్యా.. బడికి బోవద్దా మరి..?"

"బడేందిరా.. సదువొద్దు ఏటొద్దు.. ముందు మన తిండి సంగతి సూసుకోబళ్ళే.. సదివేం సేత్తావురా.. ఎదవా.."

"అయ్యా.. నే సదివి.. పెద్ద పెద్ద పడవలు సేసేత్తానయ్యా.. అప్పుదు నువ్వు నేను ఆటిమీనే బోయి సేపలేసకరావచ్చు.."

"ఏందిరా నువ్ సేసే పడవలు.. బిన్నా నడువ్ పొద్దేలౌతాంది..రేపటేళ నించి నువ్వు సేపలేటకి రావాల"
"అయ్యా.. నువ్ ఎల్తావుండావు గదా మళ్ళా నేనెందుకు యేటకి.."
"సంపుతా ఎదవాని.. ఇయ్యాల వలేత్తా వుండానా.. నడుం పట్టుకుపోయింది.. నువ్వుగోడా రేపొచ్చి యేటాడాల.. నాయుడుగోరికాడ దుడ్డు అప్పెట్టినాకా.. ఒక్క పైసాకూడా జమెయ్యలేదు..." శినయ్య గబగబ నడుస్తూ చంద్రాన్ని లాక్కుపోయినంత పనిచేసాడు. అతని గుండెలో సుడిగుండాలు తిరుగుతున్నాయి.

పులికాటు జాలర్లందరికి ఇది మామూలే. దొరికిన రోజు ఎంత దొరుకుతాయంటే అవి అమ్ముకోటానికి ధర విపరీతంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అందరు కలసి ధరలు నిర్ణయించడం అక్కడ సాధ్యం కాని పని. సరుకును దాచుకునే కొల్డ్‌స్టోరేజీల గురించి వాళ్ళలో చాలామందికి తెలియదు. దళారులు నిర్ణయించిన ధరకి అమ్ముకోవడం.. వచ్చిన డబ్బును తాగడానికి, పండగలకి జాతర్లకి ఖర్చు పెట్టటం, గ్రూపులుగా విడిపోయి తెడ్లతో ఈటెలతో తన్నుకోవడం మాత్రమే వీరికి తెలుసు. దొరికిన రోజు దర్జా దొరకని రోజు పస్తులు ఇదీ వాళ్ళ జీవితం.

"ఏందిరా శీనయ్యా.. బుడ్డోణ్ణి అట్టా లాక్కపోతుండావు.." రాజయ్య ఎదురొచ్చి అడిగాడు.

"ఏటి సేసేది మావా.. ఈడు మాట ఇంటావుంటెగదా.. నేను ఇట్టాగిట్టాగే ముసలోణ్ణవతావుండానా.. యేటకి రారాఅయ్యా అంటే ఇననే ఇనడబ్బా.."

"సదువుకుంటండాడు గదరా.."

"సట్టుబండల సదువు.. ఆడు ఎపుడో సదివి సేసేదేంది మావా.." శీనయ్య అంటుండగానే చెంద్రిగాడు అందుకున్నాడు.

"సదివినాక నేను పడవలు సేత్తా నయినా.. మర పడవలు.."

"నీ పాసుగొల.. భలేటోడయ్య.. బిన్నాబో రేయౌతాంది..మర పడవలు తయారుజేత్తా.." అంటూ చెంద్రిగాణ్ణి ముద్దుపెట్టుకొని కదిలాడు రాజయ్య.

"అయ్యా మనం అటు దిక్కు పోదామయ్యా.."

"అటెందుకురా ఇటు అడ్డదోవన పోదాం.. నడువ్.."

"కాదు నయినా.. ఆడ మూల మీద పడవలు సెత్తావుంటారు.. సూసుకుంటూ యెల్లదాం.. "

"సెండాలు వలుత్తా ఎదవ.. పొద్దాకల అదే యావ? పడవలు.. పడవలు.." కోపంగా అరిచి చెంద్రిగాణ్ణి అడ్డదోవవైపు లాక్కబోయాడు శీనయ్య.

"అయ్యా.." నడుస్తూనే పిలిచాడు చెంద్రిగాడు.

"ఏందిరా"

"పడవలు సెయ్యడానికి అంతంత సెక్కలేడనించి వత్తాయి..?"

"నోర్ముయ్యరా.."

"కాదయ్యా.. మరి మర పడవల్లో మన యేటలోకి పోడానికి కుదురుద్దా..?"

"పీకపిసుకుతా.. కుర్రనాయాల.. ఎందిరా ఇదె.. ఇదేనేట్రా నువ్ సదుతుండాది.. పొద్దాకల పడవలో.. మర పడవలో అంటాంటావు.." కోపంగా అరిచాడు శీనయ్య.. "నోరు గినా లేచిందా నరుకుతా.. " భయపెట్టాడతను

చెంద్రిగాడు మరింకేమి మాట్లాడలేదు. వాడికి మాత్రం తాను పెద్ద పెద్ద పడవలు చెయ్యటం, అవి నీళ్ళలో తేలడం కళ్ళముందు కనపడుతూవుంది.
"అమ్మా.." అరిచాడు ఒక్కసారిగా

"ఏందిరా.. ఏటైనాది.." శీనయ్య ఆత్రంగా అడిగాడు

"ఏదో కుట్టిందయ్యా.." కూలబడ్డాడు చెంద్రిగాడు. శీనయ్య ముందుకు వంగి చూసాడు.
పాము..!

కట్లపాము..!!
"పాము.." అరిచాడు అప్రయత్నంగానే

"ఆ.. పామా.. ఓర్నాయనో.. పాము.." గట్టిగా ఏడుపందుకున్నాడు చెంద్రిగాడు.

"లేదులేరా.. నడువ్.. నడువ్.. బిన్నా డాక్టరుతానకి పోదాం.." చెంద్రిగాడి చెయ్యి పట్టుకొని లేపబోయాడు శీనయ్య.

"అయ్యా.. నే సచ్చిపోతానా.. పాము కరిస్తే సస్తారుగా.." ఏడుస్తూనే అడిగాడు. శీనయ్యకి ఏమి చెప్పాలో అర్థంకాలేదు.
"లేదురా నికేమిగాదు.. లే నడువ్.. అది పాము కాదులే.. లే నాయనా.."
చెంద్రిగాడు లేచి రెండడుగులు వేశాడు. కాళ్ళు తిమ్మిరెక్కినట్లుంది.ఇక కాళ్ళు కదపలేనట్లు కూలబడిపోయాడు. స్పృహ నెమ్మదిగా కోల్పోతున్నాడు.

"అయ్యోవ్.. నా వల్లగాదు.."

శీనయ్య వంగి చెంద్రిగాడ్ని పైకెత్తబోయాడు. నడుం దగ్గర కలుక్కుమంది. అయినా ఆగలేదు. చెంద్రిగాణ్ణి రెండు చేతుల్లోకి తీసుకొని నడవడం మొదలుపెట్టాడు. అది నడక కాదు .. పరుగు. గసపెడుతున్నాడు- నడుంలో బాధను పంటికింద తొక్కిపెట్టాడు.
"రేయ్ సెంద్రమా.. సూడరా అయ్యా.. కళ్ళు మూతెయ్యబాక.. మాటాడరా.. మాటాడు.."
చెంద్రిగాడి కళ్ళు మూసుకుపోతున్నాయి.. బలవంతంగా కళ్ళు తెరిచాడు.

"మాటాడరా.. నిద్రలోకిపోతే ఇసం పాకిపోతది.. సూడిట్టా.. సెప్పు నువ్వు పడవలెప్పుడు సేత్తావురా.. ఇదుగో ఇందాకల సేసినావే అదెట్టా సేసావో సెప్పరా.." పరుగెడుతూనే అడుగుతున్నాడు. అడుగుతూనే పరుగెడుతున్నాడు. ఇంక ఎంతో దూరం పరుగెత్తలేడని అతనికి అర్ధమౌతూనేవుంది. చెంద్రిగాడు మత్తుగా ఎదో గొణుగుతున్నాడు.

"అదీ.. చెప్పుదొరికితే దానికి..అబ్బా.. ఒక పామును తెచ్చి... అహ పాముకాదు.. కట్టె తెచ్చి.. అబ్బా అయ్యా నెప్పెడతాంది.."

శీనయ్య నడుంనొప్పి ఇంక ఎక్కువైతోంది. ఇక పరుగెత్తలేనని ఆగిపోయాడు. ఒక చెట్టుకింద చెంద్రిగాణ్ణి కూర్చోబెట్టాడు. 'నేనే ఇక దాక్టర్ దగ్గరకి వెళ్ళి పిల్చుకురావాలి..' అనుకున్నాడు.

"సూడయ్యా.. సంద్రమా.. నేనెళ్ళి డాకటరుని పిల్చుకొస్తా.. నువ్వీడనే కూకో.. నిద్రపోబాక అయ్యా.. ఇదో నిద్రపోయినావా ఇసం నెత్తికెక్కుద్ది.. సూడు.. ఈ సెట్టుతోటో.. పుట్టతోటో మాట్టాడతావుండాల.."

"పుట్టనా.. అందులో పాముటదయ్యా.."

"అయ్యో.. పాములేదు.. ఏటిలేదు బిడ్డా.. ఏదోకటి సేత్తావుండరా నేనుబోయి బిన్నావత్తా.." పరుగెత్తబోయి ఆగాడు శీనయ్య. అక్కడ దగ్గర్లో ఒక పుస్తకం కనపడింది. అది తీసుకొని చెంద్రిగాడి దగ్గరికి వెళ్ళాడు.
"రేయ్.. సెంద్రమా.. సూడునాయనా.. ఇదో పుస్తకం.. సదూకుంటూ వుండాల.. నిద్రపోబాకయ్యా.."

అంతే..! శీనయ్య పరుగుతీసాడు. నడుంనొప్పిని ఏ మాత్రం లెక్కచెయ్యలేదు. స్పృహ తప్పుతున్న చెంద్రిగాడే కళ్ళముందు కనపడుతున్నాడు. డాక్టరు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి ఆయన్ని వెంటబెట్టుకొని మళ్ళి పరుగుతీసాడు. ఇద్దరూ చెంద్రిగాడు వున్న చోటికి వచ్చి ఆగిపోయారు. అక్కడ -
శీనయ్య చదువుకొమ్మని ఇచ్చిన పుస్తకంలో కాగితాలన్నీ చించి పడవల్లాగ చేసివున్నాయి. ఆ పడవల మధ్యలో అచేతనంగా పడివున్నాడు చెంద్రిగాడు. వాడి చేతిలో ఒక పడవ అసంపూర్ణంగా మిగిలి వుంది.
* * *



ఇది జరిగి చాలా రోజులైంది.
ఇప్పుడు పులికాటు దగ్గర అక్కడక్కడ మరపడవల మీద చంద్రం అని రాసి కనపడుతుంటాయి.. అవి చెంద్రిగాడి తమ్ముడు కిట్టయ్య చేసినవే.


(అముద్రితం)

మనం కలిసినప్పుడు...

పొద్దున్నుంచి సూర్యుణ్ణి గాలిపటం చేసి ఆడుకున్న పిల్లలు
అప్పుడే కొండచాటు ఇంటికి లాక్కెళ్ళిపోతుంటారు


ఎక్కడెక్కడో తిరిగొచ్చిన మబ్బుముక్కలనీ
కలిసిన ఆనందంలో ముద్దులు పెట్టుకుంటుంటాయి


వంపుకర్రలు పట్టుకున్న కుర్రాళ్ళంతా
ఏ పార్కులోనో చేరి మనవళ్ళని ఆడిస్తుంటారు


పక్షులన్నీ అప్పుడే shift అయిపోయినట్టుగా
మామిడి చెట్టుమీద get-together పెడతాయి


అప్పుడే మనమందరం కలిసి butter scotch ఐస్‌క్రీం తింటూ
ఒకళ్ళ మనసులోకి ఒకళ్ళం కరిగిపోతుంటాం

(21.08.2000)

ఒక చావు...!


రోడ్డు మీద జన ప్రవాహం సాగుతోంది..


రోడ్డు పక్క ఒక ముసలిది పడి ఉంది..


అందరూ చూస్తున్నారు,అందరూ తప్పుకుంటున్నారు!


ఎండలు మెండుగా ఉన్నా, తగ్గలేదు జనసందోహం!


ఎండిన ఖర్జోరంలా పండిన శరీరంతో..


పాపం కదలలేక ముసలి కష్టం మీద మూలుగుతోంది


ఏ పాపం తెలియని అవిటి మనమరాలు వెక్కి వెక్కి ఏడుస్తోంది


వళ్ళంతా గాయాలతో.. వంటినిండా రోగాలతో


కళ్ళకు శుక్లాలతో.. చలనం లేని కాళ్ళతో..


దాహం దాహం దాహం అంటూ దీనంగా అడుగుతోంది


అడిగి అడిగి నోరు మూగవోయింది గానీ,


ఏ ఒక్కరి అడుగులు ఇటు పడలేదు


కనికరం లేని హృదయాలు కర్కశంగా సాగిపోతున్నాయి


మృత్యువుతో పోరాటం సాగించిన ముసలిది


అందరూ చూస్తుండగానే 'వీర మరణం ' పొందింది


ఒక దీపం ఆరిపోయింది...


ఒక ప్రాణం సాగిపొయింది


అవిటి మనుమరాలు అనాధ అయిపోయింది


పాపం! మానవత్వానికి పరువు పోయింది

విలువైనది

ఇంటి యజమాని చనిపోయి పదిహేనురోజులైంది. పల్లెటూరు కావడంతో బంధువులు ఎక్కువ రాలేదు. ఊర్లో వాళ్ళే ఒక్కక్కరు వచ్చి పరామర్శించి వెళ్ళరు. మొదటి గదిలో ఓ మూల పెట్టిన ఆయన ఫోటో తీసి గోడకు తగిలించాడు చిన్న కొడుకు రాఘవ. దీపారాధన చేసిన ప్రమిదను మిగిలిపోయిన నూనెను ఆ ఇంటి పనిమనిషికి ఇచ్చేసాడు. ఆయన తాలూకు జ్ఞాపకం, బాధ ఆ ఇంటివాళ్ళని అప్పుడప్పుడే వదిలి వెళ్తున్నది.

"అన్నయ్యా ! రేపు నేను విమల వెళ్ళిపొదామనుకుంటున్నాం. లీవ్ అయిపొయిందికదా!" అన్నడు ఆ ఇంటి రెండో కొడుకు పరమేశ్వర్.

ఉండమని చెప్పలని వున్న వెళ్ళద్దని అనలేదు విద్యధర్.


"మేం కూడా వెళ్ళిపొతాం అన్నయ్య. ఇంకా ఎందుకీక్కడ?" రాఘవ అన్నడు తండ్రి పటానికి దండవేస్తూ.

విద్యధర్ తలెత్తి చూసాడు 'నువ్వుకుడానా ' అన్నట్లు. చిన్నగా "ఊ" అన్నాడు. పరమేశ్వర్ వచ్చి తన అన్నయ్య దగ్గర కూర్చున్నాడు. రాఘవ అతని భార్య సరళ కూడ అతని దగ్గరకి వచ్చారు.

"అన్నయ్యా! ఇక ఈ ఆస్తి సంగతి తేల్చేద్దం. ముగ్గురం మూడుచొట్ల వున్నాం. ఈ వూర్లో ఇంకా ఎందుకు?" అన్నాడు.

"అవును బావగారు. మూడు భాగాలు చేసుకుని పంచేసుకుంటే సరిపోతుంది. మళ్ళి మళ్ళి ఇక్కడికి రావడం ఏం కుదురుతుంది చెప్పండి" సరళ అన్నది

ఈ పనంతా అయిపోతే ముగ్గురం రేపు బయలుదేరవచ్చు" పరమేశ్వర్ అన్నాడు.

విద్యాధర్ 'సరే' అన్నాడు.


***


ముందుగా అనుకున్నట్లుగానే అన్ని పనులు చెసేసారు ఇద్దరు చిన్న కొడుకులు. ఇంటిని అమ్మేసి మూడు భాగాలు చేసారు. మూడు ఎకరాల పొలం మూడు చోట్ల వుంది. 'నీకిది, నాకిది, అన్నయ్యకిది ' అంటూ పంచేశాడు పరమేశ్వర్. మూడిటికి కౌలు కుదర్చటం కూడా పూర్తైంది. ఇంటి సామాన్లు ఒక్కొక్కటె పంచుకొసాగారు.

విద్యాధర్ అంతటిని గమనిస్తునే వున్నడు. అతనికి తెలుసు తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు కలిసి అప్పటికే పంపకాలకు అన్ని సిద్ధం చేసే తనని అడిగారని. ఆ పంపకాలలో తనకు అన్యాయం చెస్తున్నరని అతనికి తెలుసు. తనకిచ్చిన పొలంలో ఏది పండదని, తనకు చెప్పిన ఇంటి ధర అంత తక్కువగా వుండదని అన్నీ తెలుసు. అయినా అవన్ని పట్టించుకునే స్థితిలో లేడతను.

తనకేనాడు వాటిమీద ఆశలేదు. తను సంపాదిస్తున్నది తనకీ, తన భార్యాపిల్లలకి సరిపోతుంది. అంతవరకు చాలు. కానీ శారద ఊరుకుంటుందా? ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు.



అప్పుడు గమనించాడతను. తన తమ్ముళ్ళు అన్నీ సమానమనే ముసుగులో లాభదాయకంగా పంచుకుంటున్నారు. అవసరాన్నిబట్టి ఇద్దరూ 'ఇది క్రితం ఏడాదివచ్చినప్పుడే నాన్న నాకిస్తానాన్నడ్రా' అని అబద్దలు కల్పించుకుంటూ పంచుకుంటున్నారు కాని,


కాని, ఆ గదిలో మూల వున్న ఆ ఒక్కటీ వాళ్ళు పట్టించుకోవటంలేదు. మర్చిపోయారా? విలువ కట్టలేని ఆ సంపదని ఎలా మర్చిపోగలరు? తమ తండ్రి ఎంతో ప్రాణాప్రదంగా చూసుకున్నడు? చివరికి చనిపొయేముందు కూడా తన పక్కనే ఉంచుకున్నాడు. ఆ ఇద్దరిలో ఎవరైనా తీసుకెల్తారా? లేక తనకే వదిలెసారా? అంత అదృష్టమా?

"అన్ని పంచెసినట్లేగా అన్నయ్యా?" పరమేశ్వర్ అడిగాడు.

సంశయంగా ఆలోచించాడు. మిగిలిపోయినా ఆ ఒక్కటి? అటు వైపు చూపిస్తూ ఏం చేద్దాం అన్నట్లు చూసాడు ఇద్దరు తమ్ముళ్ళవైపు.

"అదేంటన్నయ్యా.. నాన్న కోరిక నీకు తెలుసు కదా.. నువ్వే తీసుకెళ్ళు"

"అవునన్నయ్య మీ మరదలు కూడా వద్దంటే వద్దంటోంది.. అందుకే నీకే వదిలేశాం." చిన్నవాడు అన్నాడు.

'వదిలేశారా?' అంతేలే వాళ్ళకి విలువలేం తెలుసు? ఎమైనా తనకే ఆ అదృష్టం కలిగింది.' విద్యాధర్ అనుకున్నాడు.

ముగ్గురు కొడుకులు ఆ ఇంటిని వదిలి తమ తమ ఊర్లకి ప్రయాణమయ్యారు.



***


"శారద ఏమంటుందో" విద్యాధర్ అదే ఆలొచిస్తున్నాడు.

"ఏ రోజైనా డెలివరీ కావచ్చు. పల్లెటూర్లో ఎందుకు ఇబ్బంది పడతారని" డాక్టర్ తీసుకెళ్ళద్దని చెప్పింది. లేకపోతే శారద తప్పకుండా వచ్చేది. ఇప్పుడు తన తోడికోడళ్ళు తెలివిగా అన్నీ పంచేసుకున్నారని తెలిస్తే ఏమనుకుంటుందో? తనతో తీసుకెల్తున్నవన్ని ఎందుకూ పనికిరానివని తనకే తెలుసు. కాని ఎంతో విలువైనది తమ్ముళ్ళు తనకే వదిలిపెట్టారు. శారద ఒప్పుకుంటుందా లేక సరళలా వద్దంటునదా? ఏమో!

ఇల్లు చేరగానే పక్కింటి కాంతమ్మగారు వచ్చి తాళం ఇచ్చింది.

"శారద లేదు. హాస్పిటల్ కి వెళ్తూ తాళాలు ఇచ్చివెళ్ళింది" చెప్పింది. విద్యాధర్ పక్కనున్న విలువైనదాన్ని విచిత్రంగా చూస్తూ.

అన్నీ ఇంట్లోకి చేర్చాడు. తన తండ్రి ప్రాణమనికిన్న ఆ ఒక్కటీ తన బెడ్రూంలో చేర్చాడు.

శారద వచ్చింది. రెండురోజుల్లో డెలివరీ కావచ్చునని డాక్టర్ చెప్పిందట. శారదని కూర్చోమని జరిగిందంతా చెప్పాడు. ఆమె తేలిగ్గా కొట్టి పారేసింది. చివరగా తను ఓ విలువైన బహుమతి తెచ్చానని, తన తండ్రి ఎంతో ప్రేమగా చూసుకున్నదని చెప్పాడు.

"అక్కడ బెడ్రూంలో వుంది వెళ్ళు. ఇష్టం లేకపోతే చెప్పు. వేరే మార్గం ఆలోచిద్దాం." అన్నడు. శారదా నవ్వుతూ లేచింది.

"ఏంటో చెప్పొచ్చుకదా!" అంటూ బెడ్ రూం వైపు అడుగులేసింది.

'శారద కాదనదు, తన మనసు నాకు తెలుసు ' విద్యాధర్ మనసులోనే అనుకున్నాడు. శారద వెనకాలే వెళ్ళాడు.

బెడ్‌రూమ్ తలుపు తెరిచి స్థాణువులా నిలబడిపోయింది శారద. ఒక్క క్షణంలో తేరుకుని పరుగున పరుపు దగ్గరకు చేరుకుంది.

"అత్తయ్యా!" అంటూ ఆమెను కౌగలించుకుంది

విద్యాధర్ తృప్తిగా నిట్టూరుస్తూ అనుకున్నాడు.

'నాకు తెలుసు శారద కాదనదు!'


(02.09.1999, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక)

కలియుగ కర్ణుడికి...

ఎందుకు పుట్టవు పసికందూ..

ఎందుకు బతికావు

నాకొద్దు పొమ్మని అమ్మ నిన్ను విసిరెసినప్పుడు

ఎంగిలి విస్తరాకుల పొత్తిగుడ్డలపై

పడుకోమని పంపినప్పుడు

చెత్తకుప్పల చెత్తకప్పుకు చలిలో వణికినప్పుడు

తొడుక్కోను గుడ్డాలేక నగ్నంగా నువ్వు తిరిగినప్పుడు

ఎందుకు చచ్చిపొలేదు నువ్వు?


***



అనురాగంతో నిన్ను చేరదీయను రాధమ్మ లేదు


ఆప్యాయంగా ఆదరించే సుయొధనులం కాలెము మేము


అభినవ కర్ణుడా నువ్వు బ్రతకటం ఇక తప్పు


నీ జీవనం మానవతకే పెద్ద ముప్పు.



(07.01.1999, వార్తాపత్రికలొ తల్లి వదిలేసిన బిడ్డ గురించి చదివి స్పందించి..)


గుప్పెట తెరుచుకుంది..!

ఆశలు విరిశాయి

పొగమంచు పరుచుకుంది

కొత్తపువ్వులు విచ్చుకున్నాయి

సుర్యుడు నిద్రలేచి ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు

ఇది వుదయం

****
బాధల గాయాలు మానాయి

జయజయధ్వానాలు మ్రొగాయి

శత్రువుల శవాలు వూరిచివర కాలుతున్నాయి

మా నెత్తిన కిరిటాలుపెట్టి సిం హాసనాలపై కూర్చోబెట్టారు

ఇదే విజయం

పేపర్ పురాణం

"ఆంధ్రప్రభ ఒకటివ్వు..." అడిగాను రైల్వేస్టేషన్ బుక్ షాప్ లో. న్యూస్ పేపర్ తీసి ఇచ్చాడతను.

బంధువులింటికి పెళ్ళికని బయల్దేరిన నేను ట్రైన్ లేటనితెలియడంతో టైంపాస్ కోసం పేపర్ కొన్నాను. దగ్గర్లోనే వున్న బెంచి మీదకు చేరి పేపర్ తెరిచాను. వార్తలన్నీ మాములే. కొద్దిక్షణాల తర్వాత ఎవరి తాలుకోగాని ఒక తలకాయ నాకూ పేపరుకి అడ్డమొచ్చింది.

తెరుకొని చూద్దునుకదా నా కుడివైపు కూర్చొని ఉన్న రుబ్బురోలు లాంటి వ్యక్తి నా మీదుగా పేపర్ మీద పడిపోతున్నాడు.

"బాబూ... నిద్రపోతున్నావా..?" అడిగాను నేను.

"ఛ.. ఛ.. చదువుతున్నానండీ బాబు..." అన్నాడతను.

"నాకు అడ్డంగా తలపెట్టారండీ... నేనెలా చదువుకోను...?" ఆ మాటకు ఎడమవైపు కూర్చున్న వ్యక్తి సమాధానం ఇస్తూ

"ఓహొ మీరూ ఈ పేజే చదువుతున్నారా..! నేను పక్క పేజీ అనుకున్నను.. హి హి" చెవుల్దాక నవ్వి సర్దుకుకూర్చున్నాడతను. అతను నాకు ఎడమవైపు వున్నాడు. నిదానంగా నా భుజం మీదుగా తలచేర్చి పేపర్లోకి చూడటం మొదలుపెట్టాడతను.



"అబ్బా.. వీరప్పన్ మళ్ళి తప్పించుకున్నడా..? గ్రేట్... ప్చ్ ఈ పోలీసులు లంచాలు మరిగారు.." తనలో తానే అనుకున్నాడు. నేను పేజీ తిప్పాను.



"ఓహొ.. మళ్ళి అజారుద్దీన్ పెళ్ళి చేసుకున్నాడా? బాగానే ఉంది.. ఈసారి అందాల పోటీలు.. " అతను చదివేలోపే పేజీ తిప్పేసాను నేను.



"అబ్బా కొద్దిగా ఆగండిసార్! మాంఛి ఇంటరెస్టింగ్ ఐటం." అన్నాడతను.



"పేపర్ కొన్నది నువ్వు చదవడానికి కాదు..!" ఈ మాటలన్నది నేను కాదు..! నా కుడివైపు కూర్చున్న రుబ్బుడు పొత్రం లాంటి వ్యక్తి..! అతను కూడా నా పేపర్లోకే చూస్తున్నాడు. నేనతని వైపు చూడగానే ఒక వెర్రినవ్వు నవ్వాడు.. "చూసావా నీ బదులు నేనన్నాను.." అన్నట్లు



"నువ్వెవరయ్యా.. మధ్యలో.." ఎడమవైపు అతనన్నాడు



"ఎవరా..? నేను కూడా చదువుతున్నా..! నీలాగా ఏమన్నా గొడవ చెశానా?" కుడివైపున్నతను.



"నేను గొడవ చెసానా..?" ఎడమవైపు



"లేకపోతె నేనట్రా..?" కుడివైపు



"మాటలు జాగర్త..!" రుబ్బుడురోలు



"లేకపోతే..?" రుబ్బుడుపొత్రం



ఇక అక్కడ్నుంచి లేవకపొతే నాకు ప్రామాదమనిపించి లేచి పరుగెత్తబొయాను. ఇంతలో నాకాళ్ళకి ఒక శాల్తీ అడ్డంపడి బోర్లాపడ్డాను. అక్కడెవడో ముష్టివాడున్నాడు.



"నువ్విక్కడెందుకున్నావురా.. కాళ్ళ కింద..?" అడిగాను లేస్తూనే.



"పేపర్లో చిరంజీవి బొమ్మేసినారు సారు.. సూస్తుండినా.. ఇట్ట నువ్వు జర్రున లేస్తావని నాకేమెరుక.. హి.. హి.. బోర్ల పడినావులే.. హి" అనండువాడు నవ్వుతూ.



"చాల్లే నోర్ముయ్.." అని అరుస్తూ అక్కడ్నుంచి కదిలాను నేను. ఈ హడావిడిలో ట్రైన్ కూడ వచ్చెసింది. గభాల్న ఎక్కేసి సీట్లొ కూలబడ్డను.



పేపర్ని బాగ్ లో దాచాను. చదవాలని మనసు పీకుతుండటంతో బయటకు తీసాను. కొద్దిసేపట్లోనే..



"సార్.. చదువుతున్నారా?" అడిగాడు ఎదురుటాయన



"అబ్బే.. అక్షరాలు లెక్కబెడుతున్నా.." అన్నను నేను కోపంగా



"అహా.. అలాకాదూ మెయిన్ చదువుతున్నరు కదా.. స్పెషల్ ఇవ్వండి చదివిస్తా.." అడిగాడతను. నేను మొహమాటపడిపొయి ఇచ్చేసాను.



ఇంకొద్దిసేపట్లో పక్కన కూర్చున్నతను పేపర్ పట్టుకొని చిన్నగా లాగాడు. నేనతని వైపు చూశాను. పేపర్ ఇవ్వమని బ్రతిమిలాడుతున్నట్లు కళ్ళతోనే సైగ చేసాడతను.



"నేను చదువుతున్ననండి.."



"అదే లోపలి పేజీ ఇవ్వండి" అడిగాడతను.



"అట్లా నాకిష్టం ఉండదండి మొత్తం చదివాక మీకే ఇస్తాగా.."



ఫర్లెదండీ.. మీరు పై పేజీ చదివే లోపు ఇచ్చేస్తాగా.. ఢిల్లీ హెడ్ లైన్స్..." అంటూ నా సమధానం రాకుండానే సర్రున లాగేసుకున్నాడతను. ఒళ్ళుమండినా ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపొయాను నేను. కొద్దిసేపు పేపర్లో తలపెట్టి చదువుతూ వుండిపొయిన నాకు పక్కన కాగితం చింపిన చప్పుడవడంతో తలతిప్పాను. పేపర్ తాలుకు రెండో పేజీ రెండు ముక్కలైంది. ఒకటి పక్కనతని చేతిలో మరొకటి అతని ఎదురుగా వున్నతని చెతుల్లొ ఉన్నాయి.




"సారి సార్. ఇవ్వమని కాస్త గట్టిగా లాగాను. అదీ..." నా పక్కనతనికి ఎదురుగా కూర్చున్నాయన చెబుతున్నాడు.



"ఫర్లేదులెండి.." అంటూనే తెలుగు నిఘంటువులొ లేని తిట్లన్ని తిట్టుకుంటూ మళ్ళి పేపర్ లోకి వంగిపొయాను. అంతలోనే అనుమానం వచ్చింది.. 'స్పెషల్" పేపర్ పరిస్థితి కూడా..? తలెత్తి చూసేసరికి ఆయన నిద్రపొతున్నాడు.



చేతిలో పేపర్ లేదు.
"మాష్టారు... అయ్యా.." అంటూ లేపి "నా పేపరెక్కడ.." అంటూ అడిగాను."చాల్లేవయ్యా అదేమన్నా బంగారమా... దానికోసం బంగారంలాంటి నిద్ర పాడుచెసావు.. నా వెనకతను అడిగితె ఇచ్చాను.. ఆ.. హా.. హా.. వ్" అంటూ ఆవలించాడు. మరోమూల కుర్చున్న పెద్దమనిషి మెయిన్ పేపర్ కూడా తీసుకున్నాడు.



"మీదేగా ఇంటికెళ్ళాక చదువుకోవచ్చులెండి" అన్నాడు పేపరందుకుంటూ. పుండుమీద కారం, ఉప్పు కూడా చల్లినట్లు అనిపించింది. అట్లాగే కొద్దిగంటలు గడిచిపోయాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. గంటసేపు నిద్రపోయి కళ్ళు తెరిచాను. బండి ఏదో స్టేషన్ లో ఆగివుంది.



"ఏ వూరండి..?" అడిగాను"తెనాలి.." చెప్పాడొకడు



"దీని తర్వాత..?"



"దుగ్గిరాల.. మీరెక్కడిదాక...?" అతనడిగాడు. నా దగ్గర మొదట పేపరడిగింది అతనే.


"అక్కడికే.. అవును నా పేపరేది?"


"చెప్పానుగా వెనకిచ్చానని వెళ్ళి అడుగు ఇస్తారు.." అన్నడాయన ధీమాగా. బండి కదిలింది. నేను వెళ్ళి వెనకేన్న వ్యక్తిని అడిగాను.


"మీకు పేపర్ ఇచ్చరటకదా.. ఇస్తారా..?"


"పేపరా..? అదుగో ఆయనకిచ్చాను..." నేను ఆయనవైపు చూశాను. చేతిలో పేపర్ లేదు. నాకర్ధమైపోయింది. ఆ పేపరు చాలాదూరం వెళ్ళిపోయుంటుందని. అందుకే ఒక్క అంగలో మొదట వ్యక్తి దగ్గరకు వెళ్ళాను.


"వాళ్ళ దగ్గర లెదట.. మీరే వెళ్ళి తీసుకురండి." అన్నను పంతంగా. నాకప్పటికే కసిగా వుంది. కొద్దిసేపు వాదించి చివరికి స్పెషల్ పేపర్ వెతకటానికి బయల్దేరాడతను. నేను మెయిన్ పేపర్ అన్వేషణలో పడ్డాను.


నా పక్కనతని దగ్గర్నుంచి అతని పక్కనతనికి, అతని వెనక లేడీకి అక్కడ్నుంచి నిల్చునున్న కాలేజీ స్తూడెంట్ దగ్గరకి.. అక్కడే ఆగిపోయింది.


"బాబూ పేపరెది..?"


"ఇక్కడే ఉండాలే.." అన్నాడు కిందకు చూస్తూ. నేను సీటుకిందట దూరి వెతుకుతున్నను. శనక్కయలమ్మేవాడు వచ్చి నన్ను తట్టుకొని కిందపడ్డాడు. చివరకు పేర్పర్ దొరికింది.. సగానికి చినిగిపోయుందది."ఏంటి బాబూ ఇలా చించెశారు..?" అడిగాను.


"నేనా..? ఏంతిక్కగా వుందా నా దగ్గరకు అట్లాగే వచ్చింది" అన్నాడతను కోపంగా"


పోని మీకొద్దనుకుంటే ఇట్లగీయ్ పొట్లం గట్టుకుంటా" శనక్కయలమ్మేవాడన్నడు. నాకు కసి పెరిగింది. చించిందెవరని అడుగుతూ ఆ స్తూడెంట్ దగ్గరనించి లేడీదగ్గరకు, అక్కడ్నుంచి వెనకతని దగ్గరకు అతని పక్కనతని దగ్గరకు వచ్చను. నా వెనకాలే శనక్కాయలోడు కూడా! "పొట్లం కట్టడానికి పేపరిమ్మంటూ.."


ఆ చివరి వ్యక్తి కూడా అదె అన్నడు. "నా దగ్గరకూ అట్లాగే వచ్చింది" అంటూ.


"అంటే నేనే చించి ఇచ్చానా..? ఛ కర్మ.." అన్నాను తలపట్టుకుని.


"పోని నాకివ్వండి సార్ పొట్లం కట్టుకుంటా" శనక్కయలు.


"రేయ్ నువ్వునోరు మూసుకొని పో.. ఇది ఇవ్వనుగాక ఇవ్వను.." అరిచాను నేను. వాడు బెదిరిపొయి వెళ్ళిపొయాడు. నేను రెండో పేజీ కోసం వెతకబోయాను. వెతకగా వెతకగా చివరకు ఆ కంపర్ట్ మెంట్ చివరి బెర్త్ పైన చదువుతూ ఉన్నాడొకడు.


"బాబు పేపర్ ఇవ్వవయ్యా.." అడిగాను.


"ఆగవయ్యా.. చదువుతున్నను కదా.. చదివిస్తాలే. ప్రతి వాడికి పేపర్ కావల్సిందే.." అన్నడతను. నేను జుట్టుపీక్కొవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాను.


"ఆ పేపర్ నాదే బాబూ.." అన్నను నేను బాధగా.


"అరే.. ఇది మీదేనా..? ఇదుగో తీసుకొండి.. అన్నట్లు స్పెషల్ పేపరుంటే ఇవ్వండి చదివిస్తాను.." అన్నడతను.


"ఇవ్వను.. చచ్చినా ఇవ్వను.." గట్టిగా అరిచి వచ్చెసాను నేను. వాడు తెల్లబొయాడు. తిరిగి నా సీటు దగ్గరకు వచ్చెసరికి మొదటివ్యక్తి కూడా వచ్చేసాడు.


"ఏంటి దొరికిందా..?" అడిగాడు నన్ను.


"ఆ దొరికింది.. ఒకటి నలిగిపొయి, ఇంకొకటి చిరిగిపొయి" బాధగా అన్నాను.


"సర్లే నాకు మాత్రం తడిసిపొయి దొరికింది.." అన్నాడు నా చెతికి తడిపేపర్ అందిస్తూ.


"తడిసిందా..??" ఆశ్చర్యంగా అడిగాను.


"అవును మరి.. ఈ వెనకాలాయన నుంచి ఎదురాయనకి, అక్కడ్నుంచి పైన బెర్తు మీదకు అక్కడ్నుంచి ఆ చివరకు వెళ్ళింది. పాపం వాళ్ళకి పసిపిల్ల ఉన్నట్లుంది. దానికేం తెలుసు పాపం తడిపేసినట్లుంది" అన్నాడు చల్లగా.


"ఛీ.. ఆ మాట ముందే చెప్పచ్చుగా.. నేనింకా నీళ్ళనుకున్న.." అంటూ బయటకు విసిరేసాను. అంతే కోపంతో పేపర్ని పరా పరా చించేశాను.


"అరే చించేసిన్రా.. నాకిస్తే పొట్లం కట్టుకుంటానన్నాను కదా.." మళ్ళి శనక్కయలోడు వచ్చాడు. వాణ్ణి కొట్టబోతుంటే నా ఎదురుటాయన ఆపి -


"పద.. పద.. దుగ్గిరాల వచ్చెసింది" అన్నాడు తన బాగ్ తీసుకుంటూ. ఇద్దరం కిందకి దిగాక అన్నాడు.


"చూడు బాబు.. ఇంకెప్పుడూ ప్రయాణంలో పేపర్ కొనద్దు.. కొన్నా బయటకు కనపడనీయద్దు.. కనపడిందంటే మళ్ళి నీకు చేరదు.. అందుకే కొన్నా దాన్ని లోపలే దాచుకో.. నాలాగ.."


అతను ఓపెన్ చేసిన బాగ్ లోంచి 'ఆంధ్రప్రభ ' పేపర్ నన్ను వెక్కిరిస్తూ కనపడింది.


(1996 ఆదివారం ఆంధ్రప్రభ సంక్రాంతి హాస్య కథల పోటీలో సాధారణ ప్రచురణాకు స్వికరించిన కథ, 8 డిసెంబర్ 1996)

వాడు

వాడు
బేలగా చూస్తుంటాడు
నిస్సహాయంగా నిలబడుంటాడు..
వాడి మాసిన బట్టలూ వాడూనూ..


ఆరేళ్ళు నిండని వాడి అరచేతిని బిగించి
ఆశలన్నీ బంధించాననుకుంటాడు..!
అవన్నీ వెళ్ళసందుల్లోంచి జారిపోయి వాణ్ణి వెక్కిరిస్తుంటాయి
రాత్రిపూట వాడి కలల్లో..
వాడి పలకబలపాన్ని యంత్రం భూతం మింగేస్తుంటుంది
దేపావళికి ఫాక్టరీలో పంచిపెట్టే మిఠాయి పొట్లం...
అదొక్కటె వాడికి మిగిలే తీపిగుర్తు.


Dec 04, 1999

పురిటి నొప్పులు

ఏ భావం కుదరటంలేదు
ఏ కవిత కదలటంలేదు


తెల్లకాగితాలకు నీలి మరకల్ని పులిమి
చెత్తబుట్టలో పడేస్తున్నాను

ఎదేదో తలపుకొస్తున్నవి
ఎవేవో తొలుపుకొస్తున్నవి

ఇక్కడ సిటే బస్సులో సేట్లు దొరకటంలేదని కొందరు కొట్టుకుంటున్నారు
ఇంకెక్కడో అన్నం దొరకలేదని తుపాకి పట్టుకుంటున్నారు
వోట్లు దండుకునే కాలం వచ్చిందని కొందరు ప్రముఖులు కుళ్ళు కడుక్కుంటున్నారు

ఎదేదో తలపుకొస్తున్నవి
ఎవేవో తొలుపుకొస్తున్నవి

బిచ్చమెత్తే ముసలివాడు - పడుచుపిల్ల కాటుక కన్నులు
అత్తలు తగలబెట్టే కొడళ్ళు - తాగొచ్చి తన్నే మొగుళ్ళు

వెన్నెల రాత్రులు - చీకటి బ్రతుకులు
తోటలు... పూలు... స్వేదాలు... అలలు... రక్తాలు
ఎది రాయను... ఏమని రాయను


26 July, 1999

రాజకీయం

అది కాబొయే పీయంగారి ఆఫీసు.

"ఇదిగో సుబ్రమణ్యం! వచ్చే నెల్లొ నేను మీ రాష్ట్రానికి వస్తున్నా. సభకి వచ్చిన జనాన్ని చూసి ఎగస్పార్టి వాళ్ళు గుండెలు బాదుకోవాలి. ఎంతైనా ఖర్చుపెట్టు. ఫర్లేదు. ఈసారి నిన్ను సియం చెసే పూచి నాది. ఇక వెళ్ళిరా" చెప్పాడు కాబోయే పీయం. సుబ్రమణ్యం లేచి వెళ్తుండగానే పీయే పరుగు పరుగున వచ్చి చెప్పాడు.

"సార్ మీ మెనల్లుడు అదే రాష్ట్రానికి సీయం కావాలనుకుంటున్నడు కదా. మరి మీరు ఈయనకి మాటిస్తున్నారు?"
"అబ్బా! పీయే... నేనేదంటె అది నమ్మేయడమేనా? ఎదో మాటలు చెప్పి పని చెయించుకుంటాం. అసలు రాజకీయమంటె అదేనయ్యా"

****

అది కాబోయే సీయం సుబ్రమణ్యం ఇల్లు."చూడు గంగులు! ఎన్నాళ్ళనిలా రౌడియిజంతో బ్రతుకుతావు? రాజకీయాల్లొకి వచ్చెయ్. పెద్దాయన వచ్చెనెల్లొ వస్తాడట. బాగా జనాలని పోగుచెయ్యి. ఆయనకి చెప్పి ఈసారి ఎన్నికల్లొ నీకు టికెట్ నేను ఇప్పిస్తాగా"

"గట్లనే సారు. నేబోయస్తామల్ల!" గంగులు వెళ్ళిపొయాడు.

"పిచ్చివాడు! నేనేదంటె అది నమ్మెయడమే. అసలు రాజకీయమంటే తెలిస్తేగా" అని నవ్వుకున్నాడు సుబ్రమణ్యం.

****


అది కాబొయె ఎమ్మెల్యె గంగులు డెన్.


"అరే యాదగిరి! ఈయాల రేపు నీ పిల్లొల్కి నౌక్రి గావాల్నని ఎతుకుతున్నవంట? నువ్వెం ఫికరుజేయకు. నేనన్ని జూస్కుంటగాని పెద్దయ్య వస్తున్నాడుగదా. నువ్వు మీ కూళోళ్ళని ఏసుకొచ్చెయ్. పైసలిప్పిస్త. ఇంకా నీకు యర్కనేగద" చెప్పాడు గగులు. యాదగిరి తలూపి వెళ్ళిపొయాడు.


"అన్నా గిదెంది. ఆని పిల్లల్కి మనం వుద్యొగాలిప్పిస్తే మనకేమొస్తది?"

"వార్నీయవ్వ. నీకు దమాక్ లేదురాభై. ఏదొ అంటిగాని నిజంగానే ఇప్పిస్తాననుకుంటివా? రాజకీయమంటె ఇదేరా భై"

***

అది యాదగిరి గుడిసె...

"యేంది మావ! ఆళ్ళు చెప్పినట్లే మీటింగులకి పోతాంలేగాని పైసలిస్తారంటావా?"

"ఎందుకియ్యరే. ఇస్తరు. ఆళ్ళకాడ పైసలన్ని గుంజి మనం ఓట్లు మాత్రం మనోడికే ఏసుకుందాం."

"అదెంది మావ! ఆళ్ళందరికి అట్ల చెప్పినావుగంద""మరి అదెనే ఎర్రిమగమా రాజకీయమంటె" అన్నాడు యాదగిరి.


(ఆంధ్రభూమి వారపత్రిక, 27.03.1997)