రాజకీయం

అది కాబొయే పీయంగారి ఆఫీసు.

"ఇదిగో సుబ్రమణ్యం! వచ్చే నెల్లొ నేను మీ రాష్ట్రానికి వస్తున్నా. సభకి వచ్చిన జనాన్ని చూసి ఎగస్పార్టి వాళ్ళు గుండెలు బాదుకోవాలి. ఎంతైనా ఖర్చుపెట్టు. ఫర్లేదు. ఈసారి నిన్ను సియం చెసే పూచి నాది. ఇక వెళ్ళిరా" చెప్పాడు కాబోయే పీయం. సుబ్రమణ్యం లేచి వెళ్తుండగానే పీయే పరుగు పరుగున వచ్చి చెప్పాడు.

"సార్ మీ మెనల్లుడు అదే రాష్ట్రానికి సీయం కావాలనుకుంటున్నడు కదా. మరి మీరు ఈయనకి మాటిస్తున్నారు?"
"అబ్బా! పీయే... నేనేదంటె అది నమ్మేయడమేనా? ఎదో మాటలు చెప్పి పని చెయించుకుంటాం. అసలు రాజకీయమంటె అదేనయ్యా"

****

అది కాబోయే సీయం సుబ్రమణ్యం ఇల్లు."చూడు గంగులు! ఎన్నాళ్ళనిలా రౌడియిజంతో బ్రతుకుతావు? రాజకీయాల్లొకి వచ్చెయ్. పెద్దాయన వచ్చెనెల్లొ వస్తాడట. బాగా జనాలని పోగుచెయ్యి. ఆయనకి చెప్పి ఈసారి ఎన్నికల్లొ నీకు టికెట్ నేను ఇప్పిస్తాగా"

"గట్లనే సారు. నేబోయస్తామల్ల!" గంగులు వెళ్ళిపొయాడు.

"పిచ్చివాడు! నేనేదంటె అది నమ్మెయడమే. అసలు రాజకీయమంటే తెలిస్తేగా" అని నవ్వుకున్నాడు సుబ్రమణ్యం.

****


అది కాబొయె ఎమ్మెల్యె గంగులు డెన్.


"అరే యాదగిరి! ఈయాల రేపు నీ పిల్లొల్కి నౌక్రి గావాల్నని ఎతుకుతున్నవంట? నువ్వెం ఫికరుజేయకు. నేనన్ని జూస్కుంటగాని పెద్దయ్య వస్తున్నాడుగదా. నువ్వు మీ కూళోళ్ళని ఏసుకొచ్చెయ్. పైసలిప్పిస్త. ఇంకా నీకు యర్కనేగద" చెప్పాడు గగులు. యాదగిరి తలూపి వెళ్ళిపొయాడు.


"అన్నా గిదెంది. ఆని పిల్లల్కి మనం వుద్యొగాలిప్పిస్తే మనకేమొస్తది?"

"వార్నీయవ్వ. నీకు దమాక్ లేదురాభై. ఏదొ అంటిగాని నిజంగానే ఇప్పిస్తాననుకుంటివా? రాజకీయమంటె ఇదేరా భై"

***

అది యాదగిరి గుడిసె...

"యేంది మావ! ఆళ్ళు చెప్పినట్లే మీటింగులకి పోతాంలేగాని పైసలిస్తారంటావా?"

"ఎందుకియ్యరే. ఇస్తరు. ఆళ్ళకాడ పైసలన్ని గుంజి మనం ఓట్లు మాత్రం మనోడికే ఏసుకుందాం."

"అదెంది మావ! ఆళ్ళందరికి అట్ల చెప్పినావుగంద""మరి అదెనే ఎర్రిమగమా రాజకీయమంటె" అన్నాడు యాదగిరి.


(ఆంధ్రభూమి వారపత్రిక, 27.03.1997)


Category: