కురుక్షేత్రంలో 18వ రోజు

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణిచిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -

"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.

అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడిది. తను జయించాడు... కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!

అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.

భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.

"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -

"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."

"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"

"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.

"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.

భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.

"చెప్పండి పితామహా.."

"నీవేమి చెప్పవేం..??"

"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."

"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనవునికి నమస్కరించాడు.

"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."

ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.

"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.

అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.

"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.

శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.

అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.

ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.

"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంటుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -

"పార్థా.. నవ్వక ఎమిచెయ్యమంటావు. నిన్నుకాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది.."

"నన్ను కాపాడాడా..?"

"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."

"మరి..?"

"నీ రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."

హనుమంతుడు ఈ మాటలంగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగ్గురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.

"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.
శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


(ఈ నెల 24 జన్మాష్టమి సందర్భంగా)

ఎర్ర గోదారి



అమ్మా గోదారమ్మా..!! అంతదాహమేసిందా..??
పాతకాగితాల పడవలైన బాల్యాన్ని ఒక్క గుక్కలో మింగేసావే?
నీ గట్టుపై చేపలై ఈతగొట్టే పిల్లల్ని
అమాంతంగా అడుగీతలో ముంచేసావే?



కార్తీకంలో నీ కురులపై దీపాల పూలు పెట్టి
అట్లతద్దెకి నీ కళ్ళముందు వుయ్యాలలూగి
నీ పాదాల నీళ్ళు చల్లుకొని కాపురానికెళ్ళిన
ఆ బంగారుతల్లి కాపురం నీళ్ళపాలేనా?



వెలుగు రేఖలు రాకముందే తట్టిలేపి
గుండెలోతున నిన్ను కావలించుకొని
నీ చన్నీళ్ళ వణుకుతొ రాగసుప్రభాతం పలికే
సంగీతం మాష్టారు గొంతునొక్కేసావే?



కడుపులో ఆక్రోశం వరదలై పొంగుతుంటే
కావలసినవాళ్ళ శవాలను మోస్తూ కొందరు
నీ బురద నీటిలో కన్నీటి తర్పణం విడుస్తున్నారు
నీ దాహం తీరిందా..? అమ్మా గోదారమ్మా..!!


(06.08.2008న భద్రాద్రిలో నలభై ఎనిమిది అడుగుల గోదావరిని చూసి... గోదావరి కబళించిన వార్తలు విని. )

ఉగాది నిషేధం

నిదురపో కోయిలమ్మా నిదురపో
వసంతం వచ్చిందేమోనని ఉలిక్కిపడిలేచేవేమో
వసంతం గొంతునులిమిన రాక్షసులం కనిపిస్తాం


పూయకమ్మా వేపపూవా విరబూయకు
ప్రతి సంవత్సరం నిన్ను తిని
నిలువెల్లా విషమయ్యాం మేం


ఇంకెలా కాస్తావులే మామిడిపిందా
నీ చెట్టు కొమ్మల్ని నిరుడేగా
నరికి పొయ్యిలో మంటబెట్టాం


పాత కుళ్ళు కడుక్కుంటూ
కొత్త బట్టలు కట్టుకుంటూ
మళ్ళి ఉగాదికి మేం మాత్రం సిద్దం


(2000 ఉగాదికి ఇంటికి వెళ్తూ కొట్టేసిన చెట్లని చూసి...)

ఈరేశంగాడి ముచ్చట..!

మా ఈరేశం గురించి చెప్పాలంటే ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది. మరదేంటొగాని ఆణ్ణి చూసినోళ్ళంతా నవ్వుకోవాల్సిందే. ఆడికి బట్టలు కుట్టే టైలరు కొలతలు తీసుకునేకాడ తెగ ఐరానా పడిపోతాడని చెప్పుకుంటుంటారు సరదాగా మా వూరోళ్ళు..! ఆడి కర్రినలుపు, బట్టపుర్రె, బానబొజ్జ గురించి కాదుగాని, ఆడి ఇశయం ఇంకోటి చెప్తాను నేను.. ఇనండి..!!

ఆడికి నాకు సిన్నప్పట్నుంచి స్నేగం. బడెగ్గొట్టే కాడ నుంచి బస్సెనకాల లగెత్తేదాక ఇద్దరం కలిసే సేసేవాళ్ళం. ఆడు పట్నంబోయి నాలుగేళ్ళు తెగ సదివేసి పశువుల డాక్టరుకాడ కాంపౌండరి అయిపోయినాడు. నేను ఇంకా ఐనోళ్ళం గలిసి పెళ్ళి గుదిర్చినాము.. సక్కని పిల్ల ఆడికి ఆలైంది. అదంటే ఆడికి పేనం. బాగా జూసుకుంటాడు...! పూలెడతాడు.. పళ్ళేడతాడు.. పండగలకి పబ్బాలకి చీరకొనెడతాడు. అంటా బాగానే వుంటది గాని ఒక్కసోట సిక్కొస్తది. అది ఇప్పుడో అప్పుడో సిరంజీవి సినిమా వచ్చినప్పుడు గారంగా "పొయ్యొద్దాం మామా.." అంటది. ఈడు గైమంటూ లేత్తాడు..!!

ఆడెందుకంత కోపం జేత్తాడో సీలచ్చికి అర్ధమయ్యేది కాదు..! (సీలచ్చంటే ఆడి పెళ్ళామన్నమాట..!) అసలు సంగతేందంటే - ఈడు అది కలిసి సినిమాకి బోతే 'కాకి - దొండపండు ' సామెత గుర్తొచ్చేస్తది ఎవరికైనా..! సీలచ్చి బంగారంలాగుంటే ఈడేమో బొంగరంలాగుంటాడు. ఆడికీ పాపం సిగ్గుగానే వుండేది మరి..! అందుకే దాన్ని బయటకి తీస్కెళ్ళేవాడుగాదు. ఇదంతా ఆడు పట్నంలో వున్నప్పటి ముచ్చట..!

అట్టాటి ఈరేశం కొన్నాళ్ళకి బదిలి సేపించుకొని మళ్ళా మా వూరికొచ్చేసినాడు. ఇక్కడ గొడ్లాసుపత్రిలో కాంపౌండరిగా జేరాడు. మా బోటి వూర్లో కాంపౌండరి అంటే డాట్టరైపోయినట్లే..! అసలు డట్టరేమో పక్కూరినించి రావాల..! ఆయన ఏ కాలునొప్పో, కన్ను నొప్పో చెప్పి సెలవలెడతావుంటాడు. ఇక గొడ్లకు కడుపొచ్చినా కష్టమొచ్చినా కాంపౌండరీ ఈరేశంగాడే డాట్టరు..!

సరే..! అసలు సంగతేందంటే, ఆడు ఆసుపత్రి పక్కనే ఇల్లేసుకొని సీలచ్చితో కాపురమెట్టాడు. నిజం జెప్పద్దూ..! సీలచ్చికి సినిమాలమీద యావ ఎక్కువే..! అది సంజేళ సింగారించుకొని 'సినిమాకి పోదామా' అనేది. ఈడు మళ్ళి గైమంటాలేసేవాడు. అట్టాగని ఇద్దరూ అరుసుకుంటారనుకుంటే తప్పే..! లచ్చికి ఇదంతా అలవాటవడం మూలాన గమ్మునే వుండేది.

రోజూ సీలచ్చి మద్దేనం పూట మంచి వంటలన్నీ వండి గిన్నెల్లో సర్ది తెచ్చిపెట్టేది. అదేటోగాని అది రాగానే ఆసుపత్రి తలుపులేసేవాడు ఈరేశం. అసలు దాని మొగం ఊర్లో ఎవరూ సూన్నేలేదంటే సత్యం..! అట్లాగ దాచుకునేవాడు ఈరిగాడు.

ఇట్టాగనే సానా రోజులు గడిచినాయి. ఒక యాళ సాయంపూట ఈరేశంగాడు, సీలచ్చిని యేంటేసుకొని సినిమాకొచ్చాడు. ఇద్దరూ దర్జాగా ఈదెమ్మటి వత్తావుంటే నేను సూసి నోరెళ్ళబెట్టినా..! లచ్చి సినిమా అంటేనే 'సీరేత్తా.. సంపేత్తా.. ' అని సిందులేసి ఈరంగంజేసే ఈరిగాడేంది, ఇంత ఇదిగా మారిపోయాడని అనుకున్నాను.

ఇక్కడ మా సినిమా హాలు గురించి కొంత సెప్పుకోవాల.

మాదొక టురింగు టాకీసు..! పట్నంలో హాలుకి ఒకటే ఇశ్రాంతైతే మాకు నాలుగుంటాయి..! నల్లులు, సీమలు సుర్రు, సుర్రున కుడతాంటె నా సామిరంగ సినిమాలు భలేగుంటాయి..! అసలు సినిమా బొమ్మ సరింగా పడదు.. బొమ్మపడితే ఇనపడదు..! ' సిరంజీవి భలే యాక్టింగు సేసినాడురోయ్.. ' అంటే, "సెత్.. ఎదవ.. ఆడు బెమ్మానందంగాడు.." అంటాడు పక్కనోడు. ఈ లోపల కాళ్ళ కింద కుక్క దూరిపోద్ది. అదే ఆడొళ్ళైతే కెవ్వున కేకేత్తంటారు..! బీడీల వాసన గుప్పు గుప్పు మంటది... ఆడ, ఈడ తుపుక్కు.. తుపుక్కున వూసేత్తుంటారు. నాకే సిరాకేసి మద్దేలో లేచొత్తుంటా.. అది యంటీవోడి సినిమా ఐయినా సరే..!

మరి పట్నంలో ఏసీ హాలుకే దీస్కెల్లని ఈరేశంగాడు ఇట్టాటి టాకీసుకి సీలచ్చిని దీస్కొచ్చాడు. ఇసిత్రమే గదా..! ఇదే ఇసిత్రమైతే.. ఆ యాళనుంచి బొమ్మ మారినప్పుడల్లా సీలచ్చితో వచ్చేవాడు. 'ఇదేందిరా నాయనా..' అనుకొని నేను ఒక రోజు సల్లగా యిశయం అడిగా..!

ఆడు ముందు సెప్పలేదు..! నేనొదుల్తానేటి..? "అరే మనం స్నేగితులం.. సిన్నప్పుడు గోలీలాడినాం.. గిల్లీలాడినాం.." అన్నా.

"అవును" అన్నాడు.

"నీ పెళ్ళి నే గుదిర్చినా.."నన్న

"ఆవు" నన్నాడు.

ఆ మాటా ఈ మాటా జెప్పి ఇశయం జెప్పరా అన్నా..! ఆడు సెప్పేశాడు..!! అదేంటో మీకు జెప్తా ఇనండి -

ఓ నాడు డాట్టరుబాబు రాలెదు.. (వత్తే గదా సెప్పాల్సిన ఇశయం) నేను, ఈరేశంగాడు కూకోని కబుర్లు సెప్పుకుంటండాం..! ఈ రైతొచ్చినాడు.

"ఏందిరా సాములు ఇట్టొచ్చినావు..?" అన్నాన్నేను
"నువ్వుండెశె.." అని ఈరేశంగాడితో - "బాబు ఇట్టా సూడండి.." అన్నాడు.
అంటానే ముందుకు వంగి నాలుగు కాళ్ళ మీద నిలబడ్డాడు. నాలక బయట పెట్టి, గుడ్లు తేలేసి ముందుకి ఎనక్కి వూగటం మొదలుపెట్టాడు.

"ఒరెయ్.. సాములు ఏమైందిరా.. ఇప్పటిదనకా బాగానేవుండావు గదా.." అని నేను ఈరిగాడు ఖంగారుగా నిలబడ్డాం.

సాములు గాడు వూగడం ఆపి..

"నా గొడ్డు ఇట్ట కొట్టుకుంటందయ్యా.." అన్నాడు

"దానికి నువ్వుకొట్టుకొని సూపించాలట్రా.. సెప్తే సాలదు" అన్నాడు ఈరిగాడు

"వోర్నీ.. అదే కానుపైతే ఎట్టా సూపించేవాడివిరా.." అన్నాన్నేను.

"సరే డాట్టరు బాబు లేడుగాని.. ఇదో ఈ మందు తవుడులో కలిపెట్టు తగ్గిపోద్ది" అన్నాడు ఈరిగాడు.

సాములు ఆ మందుతీసుకున్నోడు గొడ్డుకేమైందో అని లగెత్తాలా? వూహు.. మాతో పాటే కూకొని బీడీ ముట్టించాడు.

"ఏందిరా ఇంకా కూకున్నావు. అవతల గొడ్డుకట్టావుంటే..?"

"కాదులే మామా.. ఈరేశంగోరిని ఒక ఇశయం అడగాల.."

"ఏందది?" అడిగాడు ఈరేశం.

"తమరేటి అనుకోకూడదు మరి.."

"సెప్పేహే.. సొద బెట్టకుండా.."

"బాబుగోరు ఎవర్నో సెటప్పు జేసినట్టున్నారు.. ఎవరు బాబు పిల్ల..?" అన్నాడు వాడు.

"ఏందిరా సాములు.. నేనేంది సెటప్పేందిరా..?" ఈరిగాడన్నాడు.

"కాదు బాబూ.. మన రైల్వేటేసను మాట్టరు లేడూ.. అదే రమణయ్య.. ఆరు కనుక్కు రమ్మన్నారు.."

"ఏం కనుక్కురమ్మన్నారురా.." నేనెనడిగా. వాడు నాతో పలక్కుండా ఈరిగాడితొ అన్నాడు -

"కాదు బాబు.. మొన్న ఎవతో పిల్ల మీ ఆసుపత్రిలో దూరడం సూసాడట.. పిల్ల భలేగుంది.. ఎవరా పిల్లా ఏంటి కథ కన్నుకోమన్నాడు.."

ఈరేశం కోపంతో వూగిపోయాడు."రేయ్..ఎదవ నాయాల.. అది నా పెళ్ళంరా.."

"వూరుకోండి బాబూ.. పెళ్ళమైతే దర్జాగా రాదా దర్జాగా పోదా.. ఇట్టా సాటుగా రావడామెందుకు.. అదిరాగానే మీరు తలుపైయ్యడమేంది.. సెప్పండి బాబు ఎవత్తది.."

"సెండాలు తీత్తా నాయాల.. నా పెళ్ళం గురించి తప్పుడుకోతలు కూత్తావట్రా.." అంటూ వాణ్ణి పట్టుకొని చావమోదాడు. నేను అడ్డం పోయి ఈరిగాణ్ణి పట్టుకున్నానో లేదో సాములుగాడు దొరికిందే సందు నారాయణా అని లగెత్తాడు.

"మీరు సెప్పకపోతే నేను కనుక్కొలేననుకున్నారా.. సూడండి కనిపెట్టేత్తా.." అంటూ లగెత్తాడు వాడు.

ఈరిగాడు ఈ కథనతా సెప్పగానే నేనడిగాను - "అవున్రా.. నేనూ అక్కడే వున్న కదా.. దానికి సినిమాకి సంబధం ఏందని.."
"ఏముంది మామా.. సీలచ్చి అందరికి కనపడపోవటం వల్లే కద అందరు ఇట్టగనుకుంటున్నారు.. నేను ఎవ్వరికి కనపడకుండా దాచటం వల్లె కదా సాములులాటోళ్ళు రంకు అనుకుంటున్నారు.."
"అవును.. ఐతే"
"ఇంక ఐతే గీతే ఎందిరా.. నా పెళ్ళం అందరికి కనిపించాల.. అది నా పెళ్ళమని అందరికి తెలియాల.. అందుకే వారం వారం సినిమాకి దాన్నేసుకోని వచ్చేది.."
"వోర్ని భలేటొడివిరా... సరేలే సాములుగాడి పున్నెమా అని మా సీలచ్చి ఎంతో సంబరపడిపోతోంది.. అది సాలు" అనుకున్నా నేను మనసులో.

(విద్యుల్లత, ఆగష్టు 1998)

జాగారం

నక్షత్రానికి నక్షత్రం కనపడని చీకట్లో
ప్రపంచం మొత్తం సుషుప్తావస్థలో

సూర్యుడెప్పుడో డ్యూటీ దిగి కొండలమాటున కలలుకంటుంటే
చంద్రుడు మబ్బుల ముసుగులో తూగుతుంటే

నువ్వొక్కడివే.. నువ్వొక్కడివే మేలుకుంటావు


జనమంతా దబల్‌కాట్ పై ముసుగులౌతుంటే
కీచురాయి సైతం బండకింద ముడుకుంటే

అందరు మగతలో మూలుగుతుంటే
ఆనందాల కలల నిద్రలో జోగుతుంటే

నువ్వొక్కడివే.. నువ్వొక్కడివే మేలుకుంటావు.. ప్రకృతికి విరుద్ధంగా

ఎంతకాలం ఎదురుచూపు జోలపాట కోసం
ఎన్నిరాత్రుల జాగారం ఒక ఉషస్సు కోసం

(నేను నైట్ డ్యుటి చేసే రోజుల్లో నాకోసం రాసుకున్నది)

చీకటి పాట


చుట్టూ వసంత గీతికలే

కాని ఎక్కడ్నించో విషాదవీచికలు


అంతా ఆనందగానాలే

అంతలోనే అపశ్రుతులు


వెలుగు మధ్యలో నిలబడ్డా

మనసులో మసక చీకట్లు


అయినా చీకటికి వెలుగుకి

ఒక రెప్పపాటెగా దూరం


ఈ మెఘాలు దాటితే

అవతల ఆనంద ద్వీపం వుంటుందేమో..!!