కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఇష్ట కామ్యం


నన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యమ్మా! డూప్లే ఇల్లు, ఎస్ యూ వీ  కావాలి. – విక్రాంత్
పిల్లలు మంచి పొజిషన్ కి రావాలి. IAS, IPS అవ్వాలి. మహదేవ్
ఎమ్ సెట్ లో వందలోపు రాంక్ రావాలమ్మా వైదేహి
నాకు డిస్నీ లాండ్ టికెట్స్ కావాలి. ఒక బైనాకులర్స్ కూడా – సుస్వర. ఇంకోటి ప్లీజ్. బార్బీ డాల్ కూడా!
మేం ఇద్దరం భార్యాభర్తలుగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చూడు తల్లీ విహాన్, ఫాతిమా
“ఇది చూశావా! విహాన్, ఫాతిమా అంట! పెళ్ళైందో లేదో” నవ్వేస్తున్నాడు శివరామ్.
“ఇంకా ఎంతసేపు ఉండాలో లైన్లో” శైలజ నిట్టూర్చింది.
“టైమ్ పడుతుంది. అందుకే కదా ఈ గోడల మీద రాసినవి చదువుతున్నాను. భలే టైమ్ పాస్. ఇదిగో ఇది చూడు – “ఆమె చాలా మంచిది. ఆమెకి ఏమీ కాకూడదు” – ఎవరో ఆ పేరు చెప్పుకోలేని ’ఆమె’” మళ్ళీ నవ్వాడు.
“ఊర్కోండి. మీ ఇంటర్పెటేషన్ ఏమీ అఖర్లేదిక్కడ. వంద రూపాయల క్యూలో వెళ్తే అరగంటలో అయిపోయేది దర్శనం. అనవసరంగా ఐదొందలు పెట్టి టికెట్ కొన్నారు. ఇదే పెద్ద క్యూ వున్నట్లుంది. డబ్బులు పోయే టైమూ వేస్టు”
“నాకేం తెలుసు. అందరూ ఐదొందల టికెటే కొంటున్నారని కొన్నా. అది సర్లే ఇది చూడు –“
డబ్బులు కావాలి. బాగా సంపాదించాలి. గుడి కట్టిస్తాను అమ్మా – భరత్ రెడ్డి
“ఎర వేశాడు... హ్హా హ్హ!”
“మనం కూడా రాద్దామా?”
“ఏంటది! డైరెక్ట్ గా అమ్మవార్ని చూసినప్పుడు అనుకో! ఈ రాయడం అంతా బూటకం. ఎవరో పని లేక మొదలుపెట్టి వుంటాడు. ఇప్పుడు చూడు గుడి గోడలు మొత్తం నింపేశారు”
“మీరు కూడా రాశానన్నారు”
“అదెప్పుడో చిన్నప్పుడు. నాన్నగారితో వచ్చినప్పుడు. నలభై ఏళ్ళ క్రితం. ఆయన ఎవరికీ ఇవ్వని పెన్ ఇచ్చి రాయిచ్చాడు మా నాన్న. అప్పుడు ఇంత గుడి ఎక్కడుంది. గర్భగుడి గోడల మీదే రాశాను. ఇప్పుడు చూడు, ఈ మంటపాలేంటి, ఈ గుడేంటి? చాలా పెద్దదైపోయింది.”
జీవిత ఎలాగైనా నాకు పడేలా చూడు -  నీ భక్తుడు
“అనానిమస్ రిక్వెస్ట్. పడాలంట పడాలి! చూడు చూడు”
“ముందుకు పదండి”
డైరెక్టర్ అయ్యేలా చూడమ్మా. పెద్ద డైరెక్టర్ అవ్వాలి. పూరి కన్నా పెద్ద డైరెక్టర్ అయ్యే....
“నీలాగే ఎవరో తోసేసుంటారు. పాపం అతని కోరిక రాయాలన్నా కోరికే తీరలేదు.”
యూఎస్ జాబ్ కావాలి. సొంత కంపెనీ పెట్టాలి. మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా ప్రతాప్
యమ్ సెట్ లో ప్రణవి కన్నా మంచి ర్యాంక్ రావాలి - సుహాసిని
బాబు పుట్టాలి తల్లీ. ఎలాగైనా సరే అబ్బాయి పుట్టేలాచూడమ్మా. - రాజారావ్
నాకు బాగా చదువు రావాలి. స్కూల్ ఫస్ట్  స్టేట్ ఫస్ట్ రావాలి - మల్లేశ్వర్రావ్
నాన్న ఒప్పుకునేలా చెయ్యవా! కిరణ్ అంటే నాకు ఇష్టం - రమ్య
స్మిత సూపర్ సింగర్స్ విన్నర్ అవ్వాలి. మంచి సింగర్ అవ్వాలి. గిరిజ ఆరోగ్యం బాగుండాలి. అప్పులన్నీ తీరిపోవాలి.
“ఎందుకలా ఆగిపోతారు. పదండి ముందుకి”
ఎగ్జామ్స్ బాగా రాయాలి. 550 దాటాలి - విజయవర్ధన్
ఎట్టాగైనా చిన్న ఇల్లు కట్టుకునేలా చెయ్యమ్మా – నర్సిమ్మ, కమల
మంచి ఉద్యోగం రావాలి. అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి - అన్నారావు
శిరీషకి పెళ్ళి కావాలమ్మా. ఇంకేమీ వద్దు. చెల్లి పెళ్ళి అయిపోతే చాలు. - సుశాంత్
బ్యాంక్ ఉద్యోగం రావాలి. మోహనతో పెళ్ళి అవ్వాలి. మామయ్యని ఒప్పించు తల్లీ. – రాఘవ
అమ్మ ఆరోగ్యం బాగయ్యేలా చూడమ్మా రజిత
ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యకుండా కాపాడమ్మా. నన్ను క్షమించు అమ్మా.  వినోద్
“అబ్బా... వీడికొస్తుందే పుణ్యం. చూడు! నిజంగా పశ్చాత్తాపం! కానీ ఏం తప్పు చేశాడో...”
“మనకెందుకండీ. మన గోలేదో మనం చూసుకుందాం పదండి.”
“అది సరే నిన్ను రాయమంటే ఏం రాస్తావ్?”
“రాయద్దన్నారుగా?”
“ఒకవేళ రాస్తే”
“ముందు పదండి.”
సప్లిమెంటరీ అయినా పాసయ్యేట్లు చెయ్యి అమ్మా – ప్రతాప్
ప్రమోషన్ ఇప్పించమ్మా. నా పిల్లల్ని కాపాడమ్మా. శ్రీలతని కాపాడమ్మా. మా కుటుంబాన్ని కాపాడమ్మా. - అశోక్
నాకు బాగా చదువు రావాలి. టెంత్ ఫస్ట్ క్లాస్ రావాలి. మంచి చదువులు చదవాలి – శ్రీనివాస్
నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాన్న కనపడేలా చెయ్యమ్మా. అమ్మ కోసం. – పావని
బాబాయ్ నాన్న కలిసి వుండేలా దీవించమ్మా. మేం అందరం కలిసే వుంటాం. నేను భానక్క, శివుడు, ప్రసాద్, చిట్టి ఎప్పుడూ కలిసే వుండాలా చూడమ్మా. - ఆదిలక్ష్మి
నవల రాయాలి – కోనేటిపాలెం గోపాలమాధవ్
“హ్హ హ్హ..”
“ఏంటది”
“నవల రాయాలట. యద్దనపూడి, యండమూరి కాలం అయ్యుంటుంది. పేరు చూడు ఎలా పెట్టుకున్నాడో – కోనేటిపాలెం గోపాలమాధవ్ – హహ”
“హబ్బా.. పదమంటుంటే”
పంటలు బాగా పండేట్టుగా చెయ్యి అమ్మా – వెంకట్రెడ్డి
సుబ్బన్న కాలు బాగయ్యేలా చూడమ్మా - మహలక్ష్మి
అందరూ చల్లగుండాలి తల్లి - అప్పారావు
నన్ను, నా కుటుంబాన్ని కాపాడు మాతా - సీతాపతి
పిల్లలు బాగా చదువుకునేట్లు చూడమ్మా - సరోజ
లోకమంతా సుఖసంతోషాలతో వుండేలా దీవించు తల్లీ జ్యోస్యులు
తల్లీ నిన్ను తలచి అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ....
“ఎవరో పద్యం రాసేశారు”
“అదిగో గర్భగుడి. వచ్చేశాం”
“ఇంతకీ నువ్వేం రాస్తావో చెప్పలేదు”
“ఇంకా ఏముందని కోరుకోవాలి?”
“ఫర్లేదులే చెప్పవోయ్”
“ఇదిగో ఇదే రాస్తాను” గోడ మీద చూపించింది.
నాకు మంచేదో చెడేదో తెలుకునే జ్ఞానాన్ని ఇవ్వమ్మా. – శివరామ్
“అరే! ఇది నేను రాసిందే. నలభై ఏళ్ళ క్రితం”
“సర్లే పదండి”

***

యంత్ర


“Ladies and gentlemen, now we request your full attention as the flight attendants demonstrate the safety features of this aircraft.”
సీట్ బెల్ట్, ఆక్సిజన్ మాస్క్, లైఫ్ వెస్ట్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, ఇన్ ఫ్లైట్ మాగజైన్. అన్నీ వున్నాయి. ఇప్పుడు నవ్వు ముఖం వేసుకోని మొదలుపెట్టాలి. నవ్వు రాదేంటి? కమాన్ శ్రీలతా! ఓహ్ సారీ. ఫ్లైట్ లోపల మన పేరు సిరి కదూ?
“When the seat belt sign is on, please fasten your seat belt.
అబ్బ! మొదటి వాక్యం వినగానే, ఆటోమాటిగ్గా ముఖం మీదకి స్మైల్ వచ్చేస్తుంది. అలా అలవాటైపోయింది. ట్రైనింగ్ లో నేహా బిస్వాల్ చెప్పేది. కనెక్ట్ సమ్ థింగ్ ఫన్నీ టు థ ఏక్టివిటీస్ దట్ యూ డూ అని. అప్పుడే ముఖం మీద చిరునవ్వు వుంటుందట. అన్నీ దొంగనవ్వులే.
To fasten your seat belt Insert the metal fittings one into the other, and tighten by pulling…
జాస్మిన్ ఈ పార్ట్ విని ఎంత నవ్వుతుంది? ఏం కనెక్ట్ చేసుకుంటుందో! నాక్కూడా నవ్వొచ్చేస్తోంది. 14Cలో కూర్చున్న బట్టతల తదేకంగా చూస్తున్నాడు. వాడేం కనెక్ట్ చేసుకున్నాడో. 10 A,B,C లో కూడా ఏదో గుసగుసలు నవ్వులు. రో మరీ పక్కనే వుంది. కళ్ళు ఎంత తిప్పినా చూపు చేరట్లేదు. కళ్ళు అలా తిప్పడం కూడా నచ్చినట్లుంది బట్టతలకి. చూపు తిప్పట్లేదసలు.
There are eight emergency exits on this aircraft two forward, two rear and two over each wing.
అస్సలు పని చెయ్యాలని లేదు. చిరాగ్గా వుంది. అవునూ ఈ రోజు డేట్ ఎంత? ట్వెంటీ ఎయిట్? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం మర్చిపొయా. ఈ రోజే లాస్ట్ డే. ఫ్లైట్ లాండ్ అవగానే - లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎచ్.డీ.ఎఫ్.సీ ఏటీయం వుందా? ఛ! లాస్ట్ టైమ్ కూడా ఇంతే... ఆక్సిజన్ మాస్క్!! ఇక్కడే పెట్టానే. యాహ్.. రెడీ
When the cabin pressure falls, an oxygen mask will automatically drop from the over- head panel
ఇప్పుడు కనిపిస్తున్నారు 10 A,B,C. ఆక్సిజన్ మాస్క్ పానల్ కి తాకించి పుల్ చేస్తుంటే ముగ్గురూ ఏదో చెప్పుకోని నవ్వుకుంటున్నారు. కాంట్ హెల్ప్! అందుకే వేరే ఏదైనా ఆలోచించాలి. ఇందాకేదో.. ఆ కార్డ్ పేమెంట్! లాస్ట్ టైమ్ కూడా లాస్ట్ డేనే కట్టాను. ముంబైలో. లే ఆఫ్ ఆరోజు. నాకేమో థర్డ్ డే. ఒకటే బ్లీడింగ్... షిట్! ఈ నెల ఇంకా ఎందుకు అవలేదు! సింప్టమ్స్ కూడా లేవు. ఓహ్ షిట్!
Secure your mask before assisting others
నా ఫేవరెట్ వర్డ్స్. పక్కనోడికి ఫేవర్ చేసే ముందు నీ సంగతి చూసుకో! అలా ఎందుకు పెట్టారో కానీ కరెక్ట్ గానే పెట్టారు.
A life vest is located in a pouch under your seat .When instructed to do so, open the plastic pouch...
లైఫ్ వెస్ట్ ఏదీ. మాగజైన్ కింద పడింది. జాగ్రత్తగా వుండాలి అనుకుంటూనే వుంటాను కానీ ప్రతిసారి ఏదో ఒకటి పడిపోతోంది.
జాగ్రత్త అని చెప్తూనే వున్నా. సేఫ్టీ వుంచుకోరా అని. నివాస్! నివాస్! ఎంత పని చేశావురా! నువ్వూ నీ లెక్కలు. పదమూడు పధ్నాలుగు పదిహేను అనుకుంటూ! రేపు ఉదయాన్నే టెస్ట్ చేసుకుంటే? ఇప్పుడే తెలియదేమో. ఓ పదిహేను రోజులు టెన్షన్ తప్పదు.
...Use the whistle and light to attract attention.
ఇంక అందరికీ చెప్పేయడమే మంచిది. పెళ్ళి చేసేసుకుంటే? మరి జాబ్? మనదేం ఎయిర్ ఇండియా కాదు కదా – ఆంటీలని పెట్టుకోడానికి. పెళ్ళైందని తెలిస్తే కనీసం క్రూ క్రూరమైన చూపులు తప్పించుకోవచ్చేమో. ఫస్ట్ అసిస్టెంట్ సుశాంత్ సాహూ. వాడూ వాడి ఒడియా యాస. కంపరం వాణ్ణి చూస్తే. ఏదో రకంగా చెయ్యి వెయ్యకుండా వుండలేడు... వాణ్ణీ...  బూతులొస్తున్నాయ్! మన ఒరిజినల్ బ్యాక్ డ్రాప్ అలాంటిది మరి. ఏదో ఎయిర్ హోస్టెస్ జాబ్ లో గ్లామర్ చూసి వచ్చాను కానీ...
You are not allowed to use any electronic devices during the flight. Please switch off your mobile phones or keep them in airplane mode
మనకీ వుంది ఒక ఎయిర్ ప్లేన్ మోడ్. మా వూర్లో నన్ను నా ఒరిజినల్ మోడ్ లో చూస్తే తెలుస్తుంది. ఊరంటే గుర్తొచ్చింది. అమ్మ ఏమంటుందో. అసలు ఇలా స్కిప్ అయిన సంగతి తెలిస్తే? చంపేస్తుందేమో. స్మోక్ చేస్తానని అనుమానం వచ్చినందుకే చావ కొట్టేసింది.
We remind you that this is a non-smoking flight. All the wash rooms are equipped with smoke detectors.
స్మోక్ చెయ్యాలనిపిస్తోంది. లక్నోలో స్మోకింగ్ జోన్ లేదు. బయటికి వెళ్ళాలి. తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. క్యాబిన్ క్రూ లో ఎవరున్నారు?. నతాషా వుంది కానీ అది తాగేది ఫ్లేవర్డ్ సిగరెట్. డెక్ లో వదేరా వున్నాడు కదా! ఇస్తాడు కానీ సణుగుతాడు. ’తెచ్చుకోవాలి బేబీ’ అంటాడు. వాడి ఊతపదం - బేబి. ’యు ఓవ్ మీ వన్ బేబీ’ అంటాడు. సాధు జంతువే కాబట్టి వేరే అర్థం ఏం లేదనే అనుకోవాలి. అడుగుదాం.
You will find this and all the other safety information in the card located in the seat pocket in front of you
బట్ వై షుడ్ ఐ స్మోక్ ఎటాల్. మానేద్దాం అనుకున్నా కదా. మానెయ్యాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నించి. యస్ అక్టోబర్ ఫస్ట్ డెడ్ లైన్. నో. నో. ఈ రోజే లాస్ట్. నో. నో. అక్టోబర్ సెవంత్ రేవంత్ బర్త్ డే పార్టీ తరువాత. ఆ రోజు నో లిమిట్. ఫుల్ డ్రింక్స్, ఫుల్ స్మోక్.
అప్పుడే రన్వే మీదకు పంపించారు. పోన్లే కరెక్ట్ టైమ్ కి టేకాఫ్ చెయ్యచ్చు.
Now let us introduce our in-flight magazine Up in the air’. If you would like to order any food, please turn to page 26…
చిరాకొచ్చేస్తోంది. ఎయిర్ హోస్టెస్ గ్లామర్ లేదు. అసలు ఎయిర్ హోస్టెసే కాదు. ఫ్లైట్ అటెండెంట్. థ్రిల్ కూడా చచ్చిపోయింది. సంపాదించడానికి అలవాటుపడ్డాను కాబట్టి తప్పదు. ఫుడ్ అమ్మడం. డొనేషన్ అడగటం. ఇదేం జాబ్ అసలు. సర్వీసా? సేల్సా? కంఫర్టబుల్ సీట్లు, విండో సీట్లకి కూడా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. రేపు పొద్దున నిద్రపోతే కూడా ఛార్జెస్ అంటారేమో. To sleep during the whole flying time, the bill would be Rs. 549, and if you want our staff to wake you up Rs. 849. చేసినా చెస్తారు.
Flight attendants, prepare for take-off please.
To take off, we would dim the lights –
ఎవరినా వింటున్నారా అసలు. అసలు నా వైపు చూస్తున్నారా? ఆ బట్టతలోడు తప్ప? మే బీ రో 10లో ముగ్గురు. లేదు లేదు. వాళ్ళలో కూడా ఒకడు బయటకి చూస్తున్నాడు. మిగిలిన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే చిన్న పిల్లతో వున్న ఆ ఫ్యామిలీ వినట్లేదు. రో సిక్టీన్ లో అమ్మాయి ఎందుకో ఏడుస్తోంది. డెత్ కాల్ విని ఆఖరి చూపు కొసం ఫ్లైట్ ఎక్కేవాళ్ళు వారంలో ఒకరైనా వుంటారు. మే బీ ఆ అమ్మాయి కూడా? సరిగ్గా నా వయసు కూడా అంతే మా నాన్న చనిపోయినప్పుడు. ఫ్లైట్ ఎక్కే స్థోమత లేదప్పుడు. ఇప్పుడు కూడా... ఐ మీన్..!
దట్స్ ఓకే. మిగిలిన వాళ్ళకి ఏమైంది? సేఫ్టీ గురించి వినకపోతే ఎలా? ఒక వేళ ఏదైనా టెర్రరిస్ట్ ఎటాక్ జరిగితే? హైజాక్? ఆ బట్టతలోడే టెర్రరిస్ట్ అయితే? మే బీ నాకు మంచి ఆపర్చునుటీ కావచ్చు. నీరజా భానోత్ లాగా! అశోక చక్ర!! టెర్రరిస్ట్ ఎటాక్ అయితే క్యాబిన్ లోనే వుంటారా? కాక్ పిట్ దాకా వెళ్తారా? ఎంత మంది వుంటారు? ఇద్దరైతే ఫైట్ చెయ్యచ్చు. వెపన్స్ వుంటాయేమో! కాల్చేస్తే. నీరజా భానోత్ లాగే! నెక్స్ట్ డే న్యూస్ లో – ధైర్య సాహాసాలు ప్రదర్శించిన సిరి. కాల్పులలో మరణం. మన తెలుగు తేజం శ్రీలత. ఆమె ప్రగ్నెంట్ అని నిర్ధారించిన డాక్టర్లు.
షిట్..!! అదేంటో కన్ఫర్మ్ చేసుకోవాలి. నివాస్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి... వాడికసలు పెళ్ళి చేసుకునే వుద్దేశ్యం వుందో లేదో!
Cabin crew; please take your seats for take-off
బట్టతల టెర్రరిస్ట్ చొంగ కార్చుకుంటూ చూడటమే కానీ ఇంత సేపు చెప్పింది కూడా విన్నట్టు లేదు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీట్ కూడా వెనక్కి వాలిపోయి..
Sir, please fasten your seat belt and keep your seat upright
“తెలుగొచ్చా అమ్మాయి? నిన్ను చూస్తుంటే తెలుగమ్మాలేగే వున్నావు. నాకు నువ్వు చెప్పిందేమి అర్థం కాలేదు”
జాలేసింది. అందుకా అంతలా చూశాడు? భయపడిపోతున్నాడు.
ఊరికే తొందర అన్నింటికి. టెర్రరిస్ట్ అదీ అనుకుంటూ ఊరికే ఊహించుకోవడాలు. పేపర్లో ఫోటో వచ్చేసినట్లు, ప్రసిడెంట్ అవార్డ్ వచ్చేసినట్లు...
“వచ్చు బాబాయ్! ఈ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సీటు ఇలా... మీకేమైనా అవసరమైతే ఈ బటన్ నొక్కండి. నేను వస్తాను”
నా సీట్లో కూర్చుంటుంటే నటాషా చిత్రంగా చూసింది.
What is that smile about Siri?”
“Nothing Natasha”
That isn’t your smile”
“This IS

***

అద్భుతమ్



“ఇప్పుడు నీకు దేవుడి కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అడిగాడు ఆయన. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు.
“చివర్రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడిగురించి మాట్లాడటమేమిటి? పడుకోండి” అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీసా మూత పెట్టిందామె.
“ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏం అడుగుతావనే కదా అడిగాను” తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలని నేరుగా పెట్టింది ఆమె. “ఎప్పుడూ ఆ సీలింగ్ నే చూడమంటే ఎలాగ పద్దూ. వుండే నాలుగు రోజులు నీ ముఖం చూడనీ” అన్నాడాయన మళ్ళీ ముఖం ఆమె వైపు తిప్పి.
ఆమె కిసుక్కున నవ్వింది. పద్దు ఆమె పేరు కాదు. పెళ్ళైన కొత్తల్లో పిలిచేవాడలా. ప్రతి ఖర్చుకీ లెక్కలు రాస్తోందని.
“ఆ పేరు గుర్తొచ్చిందే?”
“జ్ఞాపకాన్ని మించిన ఆనందం ఏముటుంది ఈ వయసులో? సరే విషయం దారిమళ్లుతోంది. దేవుణ్ణి ఏం కోరుకుంటావ్?”
ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టీ చివర కూర్చుంది.
“ఏం కోరుకుంటాను. మా ఆయన ఆరోగ్యం బాగుపడీ..” మురిపెంగా తల మీద చెయ్యి వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు.
“వీటినే గొంతెమ్మ కోరికలంటారే గొంతెమ్మా... డాక్టర్ చెప్పలేదూ? వారమేనని. అందులో మూడు రోజులు అయిపోయాయి... ఇంకో నాలుగో అయిదో..”
“చాల్లే ఆపండి. ఏం కాదు. వాళ్ళకు తెలిసి ఏడ్చి...”
“వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుస్తోంది కదా... నీకు మాత్రం తెలియట్లేదూ?”
“కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా...”
“ఆ తరువాత? వాడి పెళ్ళి. మునిమనవడు. వాడి బారసాల... అంతం వుందంటావా?” గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడాయన.
“జరిగేదేదో జరుగుతుంది. మీరు మాట్లాడకుండా పడుకోండి. ఆ భగవంతుడు తల్చుకుంటే ఏ అద్భుతమైనా జరగచ్చు”
“పిచ్చిదానా నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలేమైనా వున్నాయంటే అవి రెండే - పుట్టుక, మరణం. నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతోంది.” ఆమె అతని పదవుల మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది.
అతను కళ్ళు మూసుకోని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు. అంతలోనే కళ్ళు గట్టిగా బిగించేసి బిగుసుకుపోయి నిద్రపోయినట్లు నటించాడు.
ఆమె నవ్వుకుంది. “అన్నీ దొంగ వేషాలే” అనుకుంది మనసులో. బయట వర్షం మొదలైంది.
“నిద్రపోతున్నావా? లేవర్షం చూద్దువుగాని లే” పెళ్ళైన కొత్తల్లో ఓ సాయంత్రం నిద్రలేపుతూ అతనన్న మాటలు గుర్తుకొచ్చాయామెకి.
పడుకోనివ్వండి. అయినా వర్షం చూసేదేంటి?”
చూసేదేంటి అంటే ఏం చెప్పేది? చూస్తే తెలుస్తుంది
వర్షం అంటే గుర్తొచ్చింది. బట్టలు ఆరేసాను..” గబగబా లేచి పరుగెత్తిందామె.
“వర్షం అంటే గుర్తుకొచ్చేది ఆరేసిన బట్టలా? బాల్యం గుర్తుకురావాలి. కాగితప్పడవలు గుర్తుకురావాలి.” కిటికీ దగ్గర స్టూల్ వేసుకోని కూర్చున్నాడతను. దండెం మీద బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తోంది. తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా వేసుకుంటూ వుందామె.
“అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి నాలుగు బట్టలు అందుకోవచ్చు కదా
“నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో. నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా వుంటుంది” నవ్వాడతను.
లోపలికి వచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని ఫెళఫెళలాడించింది.
“నానా చాకిరీ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి. ఒక్క పనికి సాయం లేదు కదా” అంది
“నేను చూస్తోంది నీ అందం కాదు దేవీ. నువ్వు నన్నూ, మన సంసారాన్ని బాధ్యతగా తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను.” ఆమె పేరు దేవి కూడా కాదు. అదో నాటకీయ ఫక్కీ.
“బద్దకానికి పది రకాల అబద్దాలు” నవ్వేసి వచ్చి అతని పక్కనే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది.
ఆయన మాటలతో మళ్ళీ ఈరోజులోకి వచ్చిపడింది.
“ఏం చేస్తున్నావు కిటికీ పక్కన?” తల మళ్ళీ తిప్పాడాయన.
“నిద్రపొమ్మన్నానా?”
“ఒకేసారి పోతాలే. నిన్ను కాస్సేపు చూద్దామనిపించింది” చిలిపి నవ్వు కళ్ళలో కనిపించింది.
ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను కదలడానికి ఇబ్బందిపడుతూ కొద్దిగా తిరిగాడు.
“పిల్లలకి విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా” ముఖం రాయిలా పెట్టి అన్నది.
“చెప్తావు. రమ్మంటావామ్మా అంటారు. వీకెండ్ కి వస్తాం అంటారు. నా ఎండ్ వీక్ లోనో వీకెండ్ లోనో తెలియదు కదా?”
“చాల్లేండి. పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు”
“కాదులే. ఇప్పటి పిల్లల్తో పోలిస్తే మనవాళ్ళు కాస్త నయమే అనిపిస్తుంది. అయినా నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికెట్లు ఇచ్చేయకు. జాగ్రత్త”
అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు. అయినా భవిష్యత్తుకు లోటు లేకుండా చూశాడాయన. కొడుకు కోడళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు.
“పిల్లలు వస్తే ఈ ప్రైవసీ కూడా వుండదు” అన్నాడు.
నిజమే పెళ్ళైన దగ్గర్నుంచి ఇద్దరూ కలిసి ఏకాంతంగా వున్న రోజులు చాలా తక్కువ. పెళ్ళైసరికే ఇంటి నిండా జనం. మామగారు, అత్తగారు, ఆడపడుచులు వీళ్ళు కాక చదువుకోడానికని వచ్చిన మామగారి తరఫు బంధువుల పిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు చదువులు అయిపోయి, ఆడపడుచుల పెళ్ళిలైపోయి, మామగారు కాలం చేసే సరికి తనకే ఇద్దరు పిల్లలు. మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు. అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లలు చదువులు పూర్తై పెళ్ళిళ్ళు అయ్యి హమ్మయ్య అనుకునేసరికి అరవైల్లో పడ్డారు. ఈ మధ్యే కాస్తంత ఏకాంతం. ఎంత అపురూపమో ఆయనకి ఆ ఏకాంతమంటే.
“మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఏం గుర్తుకొచ్చింది?” చిలిపిగా కన్నుకొట్టాడతను.
“మీరేం అనుకుంటున్నారు?”
“మన మొదటి రాత్రి ఏమైనా గుర్తుకొచ్చిందేమో అని” నవ్వబోయి గట్టిగా దగ్గి “అమ్మా” అన్నాడు బాధగా.
“చాల్లేండి సంబడం. ఆ రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు”
“ఏం? నేను అంత భయంకరంగా వున్నానా?”
“ఊహూ. మీరు చాలా బాగున్నారు. పంచె కట్టుకోని. మీ కట్టు చాలా బాగుంటుంది.”
“ఎప్పుడూ చెప్పనేలేదు? నేను ఎన్నిసార్లు నీ చీర కట్టుని మెచ్చుకోలేదు”
“ఏమిటి చెప్పేది. మీరు ఒకటి ఒప్పుకున్నారా. పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే లేడని కదా గొడవ”
“దణ్ణం పెట్టుకున్నానుగా చివరికి. గుళ్ళకి గోపురాలకి కూడా వచ్చాను”
“ఎందుకొచ్చారు? వదిలేయాల్సింది.”
“దేవుడి భక్తి అని కాదులే. నీకు నేను అలా వుంటే ఇష్టం అని వచ్చాను. పూజలు వ్రతాలంటావా? నిన్ను ఎప్పుడైనా కాదన్నానా? నీకు నీ దేవుడికి మధ్యలో నేనెప్పుడూ రాలేదమ్మా సోమిదేవమ్మా” మళ్ళీ మరో పేరు కలిపాడు.
“సర్లే ఇంక పడుకోండి. మాట్లాడితే అలిసిపోతున్నారు మీరు.” మంచం పక్కనే బొంత పరుస్తూ చెప్పిందామె. ఆయన అలాగే చూస్తూ వుండిపోయాడు. ఆమె దిండుకి బదులు పాత దుప్పటి పెట్టుకోని పక్కకి తిరిగి పడుకోని కళ్ళు మూసుకుంది.
“ఏమైనా కావాలంటే నాకు చెప్పండి” అంది కళ్ళు మూసుకోనే.
“చెప్పనా?” కళ్ళు మెరిసాయి.
“ఏమిటి” కళ్ళు తెరవలేదు.
“చెప్తే నిజంగా చేస్తావా?” ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిందతని వైపు. “నాకు పంచె కట్టగలవా?”
“ఇప్పుడా? ఈ పరిస్థితిలో...”
“ఏం ఫర్లేదు. నేను లేస్తానుగా. కడతావా?”
“ఏమిటీ చాదస్తం? మళ్ళీ పెళ్ళికొడుకు అవదామనా?” అనటానికి అంటూనే వుంది కాని లేచి నిలబడింది.
“ఏం తప్పేంటి?” అని ఆయన అనే లోగా ఆమె బీరువా తెరిచి పంచె తీసింది. దగ్గరగా వచ్చి ఆయన వీపు మీద చెయ్యి వేసి, పెదాలను బిగపట్టి పైకి లేపింది. ఆయన బరువుకి ఆమె అలిసిపోయింది. ఆ కాస్త శ్రమకి  ఆయన కూడా అలిసిపోయాడు. ఆమె రొప్పుతుంటే ఎగిరిపడుతున్న గుండె మీద ఆయన తెలపెట్టి రొప్పుతున్నాడు. అరనిముషం తరువాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆమె కంటితో సైగ చేసి, రెండు చేతులతో భుజాలను పట్టుకోని “హుప్” అంటూ నిలబెట్టింది. ఆమెని కౌగిలించుకోని బరువు ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను.
పంచె తీసిందామె. బెత్తెడు అంచు వున్న తెల్లటి పంచె. ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ తన చేతులతోనే ఉతికేది. గంజి పెట్టి మరీ. మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది. ముందు కుచ్చిళ్ళు పెట్టి బెత్తడంచూ కనపడేలా దోపింది. ఆమెనే చూస్తూ వున్నాడతను.
ఆమె నవ్వుతూ అతని వెనక్కి వెళ్ళి గోచీ తీసి దానికి కుచ్చిళ్ళు పెట్టింది. పెడుతున్నంత సేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ వుండిపోయింది. మంచానపడ్డ తరువాత వీపంతా కురుపులు లేచాయి. కళ్ళలో నీళ్ళు వచ్చాయి కానీ రెప్పలని దాటలేదు. గోచీ దోపి ముందుకొచ్చి, ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్ళు జారతాయని పంచె వంకే చూస్తూ “బాగానే కుదిరిందండీ” అంది.
ఆయన ఆమె తల పైకెత్తాడు. ఆయన నవ్వుతున్నాడు. ఆమె నవ్వినట్లే వుంది కానీ కన్నీళ్ళు కారాయి.
మంచం మీద కూర్చోపెట్టింది. నెమ్మదిగా ఒరిగి, చిన్నగా సర్దుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. ఆమె మళ్ళీ బొంత మీదకు వెళ్ళబోయింది. చెయ్యిపట్టుకోని లాగాడు. రెండో చేతితో తన గుండెమీద కొట్టి చూపించాడు.
“వద్దండి” అందామె ఆయన పరిస్థితి గమనించి. ఒప్పుకోలేదతను. మంచం చివర కూర్చోని బరువు ఎక్కువ పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది. గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది. గాలి ఆడటంలో వున్న ఇబ్బంది గుర్రుమంటూ వినపడుతోంది.
“ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఈయన వెళ్ళిపోతే బాగుండు” అనుకుంది ఆమె. ఆమె నమ్ముకున్న దేవుడో, ఆయన నమ్మని దేవుడో ఆమె మాట విన్నాడు. అద్భుతం జరిగిపోయింది.
ఆఫీసుకెళ్ళే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకోని “వస్తాను” అని చెప్పకుండా వెళ్ళిన రోజు లేదు. ఒకసారి శ్రావణ శుక్రవారం. ఆమె హడావిడిలో ఆమె వుంది. ఆఫీసులో ఆడిట్ అంటూ ఆయన హడావిడి ఆయనది. వెళ్ళిపోయాడు.  చెప్పకుండా వెళ్ళాడే అని ఆమెకి గిలిగా అనిపించింది. అరగంటలో నాలుగుసార్లు గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది. అరగంట తరువాత వచ్చాడాయన.
“హడావిడిలో మర్చిపోయాను” అంటూ హత్తుకున్నాడు. “వస్తాను” అని వెళ్ళబోతూ “ఇంకెప్పుడూ మర్చిపోను” అన్నాడు. ఆయన కంట్లో నీటి పొర.
ఇదంతా గుర్తుకు వచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద కట్టలు తెంచుకుంది.

><><><>< 

నేను చెప్పనీ కథ


నేను ఈ కథ చెప్పను.
చెప్పకూడదు.
చెప్పట్లేదు కూడా. మీరు కూడా వినకండి. చదవకండి.
అయినా చెప్పేదానికేముంది? ఇలాంటివి మీరు ఎన్నో చూసుంటారు. మీ చుట్టుపక్కలే జరుగుతుండచ్చు కూడా. మీకే జరుగుతుండచ్చు. కాకపోతే నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను. నోరు కట్టేసుకోవాలని అనుకున్నా నా వల్ల కావటం లేదు.
అయినా చెప్పకూడదు. చెప్పాలని వుంది కాని చెప్పను. మీరు కూడా చదవకండి. ప్లీజ్.
నేను వద్దన్నా చదువుతున్నారు మీరు. నేను కూడా చెప్పకూడదని అనుకుంటూనే చెప్పేస్తున్నాను. వద్దండి. ఒకళ్ళ సంగతి మనకెందుకు చెప్పండి. ఇక ఇక్కడి నుంచి చదవటం ఆపేయండి. సరేనా?
వినరన్నమాట. సరే. ఎలాగూ చదువుతున్నారు కాబట్టి చెప్తాను వినండి. నేను ఊహించినదాంట్లో తప్పే వుందో ఒప్పే వుందో మీకే తెలుస్తుంది.
ఆ పాప పేరు.. వద్దులెండి పేరెందుకు. పాప అనే అనుకోండి. చిన్నదే - యల్కేజి. నాకు అప్పటికింకా ప్రమోషన్ రాలేదు.  నర్సరీ పిల్లలకి టీచర్ గా వున్నాను. మొదటిసారి ఆ పాపని చూసినప్పుడు భలే అనిపించింది. అసలు చిన్నపిల్లలా బిహేవ్ చేసేదే కాదు. ఏం పద్ధతి! ఏం శుభ్రత! మాటల్లో కూడా ఎంతో స్పష్టత? భలే ఆశ్చర్యం వేసింది. మొదట్లో నేను ఇంటికి వచ్చాక మా ఆయనకి పిల్లలకి ప్రతి రోజూ చెప్పేదాన్ని. మా పిల్లల సంగతే చెప్పాలి ఇక. ఇంటి నిండా బొమ్మలు పడేయటం. అటూ ఇటూ పరుగులు. అరిచినట్లు మాట్లాడటం. అయినదానికి కానిదానికి అలకలు, చాక్లెట్ లంచాలు. చచ్చిపోతుంటాను. ఆ పాప అలా కాదు. అసలు ఆ లక్షణమే లేదు. అమ్మో ఎంత పద్ధతోనండి.
స్కూల్ కి వస్తుందా. బ్యాగ్ నీట్ గా టేబుల్ మీద పెడుతుంది. పుస్తకాలు తీస్తే మొదటి రోజు కొత్తగా అట్టలేస్తే ఎలా వున్నాయో అలాగే వుంటాయి. చెక్కు చెదరకుండా. నెక్స్ట్ పిరియడ్ ఏ క్లాస్ వుంటే ఆ క్లాస్ పుస్తకాలు తీసి పెట్టుకుంటుంది. పక్కన పెన్సిల్ ఎరేజర్ సెట్ చేసినట్లు పెడుతుంది. క్లాసుల మధ్యలో లేవటం, మిగతా పిల్లల్లాగా కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకి చూడటం, బోర్డ్ మీద ఏదో రాయటం ఇలాంటివేవి వుండవు. అసలు మిగతావాళ్ళతో ఆడుకోవటం కూడా చూడలేదు నేను. ఎక్కువగా మాట్లాడటం కూడా చూడలేదు. నిజం చెప్పాలంటే ఎవరో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల యూకేజిలో కూర్చున్నట్లుగా వుండేది బిహేవియర్. ఏదో అంటారు... యా... మెచ్యూరిటీ. చాలా ఎక్కువ ఆ పిల్లకి.
ఏదో చెప్దామని మొదలుపెట్టి ఏదేదో వాగేస్తున్నాను. అందుకే చెప్పనన్నాను. మీరు కూడా ఇక్కడిదాకా చదివేశారు. ఇంక చాలు. నన్నేమీ అడక్కండి. మీరు ఇంకేమీ చదవకండి. ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. నిజం.
ఇంకేం లేదన్నాను కదా? ఇంకా ఎందుకు చదువుతున్నారు?
సరే. మీ మొండిపట్టు మీదే. కానివ్వండి.
ఆ పిల్ల... అదే ఆ యల్కేజి పిల్ల ఏడవడం కూడా చూళ్ళేదు నేను. అహ! కాదు కాదు ఒకసారి ఏడ్చింది లెండి. తరువాత సంవత్సరం. పాప క్లాస్ కి నేనే క్లాస్ టీచర్ని అయ్యాను. ఒక మూడు నెలల తరువాత పేరెంట్ టీచర్ మీటింగ్ ఆ రోజు. శనివారం. మధ్యాహ్నం పిల్లల స్కూల్ మూడున్నరకి అయిపోతుందని ఆ టైమ్ కి మీటింగ్ అని చెప్పాం. సాయంత్రం నాలుగున్నర దాకా వెయిట్ చేశా. అందరి పేరెంట్స్ వచ్చారు కానీ ఈ పాప పేరెంట్స్ రాలేదు.
“మీ పేరెంట్స్ వస్తారా? నువ్వు చెప్పావా ఈ రోజు పీటీయే అని” అని అడిగాను. పాప చెప్పానని తలాడించింది.
“డాడీ వస్తారా?” అంటే తల అడ్డంగా ఊపి తల దించుకుంది.
“మమ్మీ?” – “వస్తుంది” అని వెళ్ళి బెంచి మీద కూర్చోని ముందుకు వంగి డెస్క్ మీద చేతులు చుట్టుకోని వాటి మీద తల పెట్టుకుంది.
దగ్గరగా వెళ్తే కానీ ఆ పాప ఏడుస్తోందని తెలియలేదు నాకు. ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. అందరి పిల్లల పేరంట్స్ వచ్చారు కానీ తన పేరెంట్స్ ఇంకా రాలేదని ఫీల్ అయ్యిందేమో. పిల్లలన్న తరువాత మిగతా పిల్లలతో కంపేర్ చేసుకోవడం మామూలే కదండి. పైగా ఆ రోజు సెకండ్ శాటర్డే కావటం వల్లేమో దాదాపు అందరి పిల్లల ఫాదర్ మదర్ ఇద్దరూ వచ్చారు. చాలా మంది పిల్లలు పీటీయే తరువాత ఇటు నుంచి ఇటే సినిమాకి వెళ్తాం అనీ, మెక్ డీ కి వెళ్తామని చెప్పుకోవడం కూడా విన్నాను నేను. ఇవన్నీ విని కంపేర్ చేసుకుందేమో. పాపం. సముదాయించే సరికి కాస్త తేరుకుంది. చెప్పానుగా చాలా మెచ్యూర్డ్ బిహేవియర్.
వాళ్ళ అమ్మ వచ్చింది. పాప చాలా ఫార్మల్ గా నిలబడి గుడ్ ఈవినింగ్ మమ్మీ అంది తప్ప మిగతా పిల్లల్లా పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసుకోలేదు. చాలా డిసిప్లిన్డ్. అదీ పదం. ఇందాకట్నుంచి చెప్పాలనుకున్నది అదే. ఎంత డిసిప్లిన్డ్ గా వుంటుందో ఆ పిల్ల.
డిసిప్లిన్డ్ అంటే గుర్తొచ్చింది. వాళ్ళమ్మ కూడా అలాగే వుంటుంది. ఏ రోజూ డైరీలో సైన్ చెయ్యడం మర్చిపోదు. పాపని టైమ్ కి దించేస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా అంతే. టైమ్ అంటే టైమ్. ఊరికే వచ్చి టీచర్లతో మాట్లాడటం కానీ, మిగతా పేరెంట్స్ తో కబుర్లు చెప్పడం కానీ చెయ్యదు. తల్లి పోలికే అయ్యింటుంది అనుకున్నాను. మరి అంత డిసిప్లిన్డ్ గా వుండె ఆమె ఆ రోజు పీటియేకి లేటుగా రావటమేంటి?
“లేటైనట్లుంది మేడం” అన్నాను నేను ఆమె రాగానే.
“సారీ అండీ నిద్రపోయాను. టైమ్ తెలియలేదు” అందామె నా ఎదురుగా కూర్చుంటూ. ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతోంది. జుట్టంతా రేగిపోయి. కళ్ళంతా ఉబ్బిపోయి. నాలుగైదు గంటలు నిద్రన్నాపోయి వుండాలి, నాలుగైదు గంటలు ఏడ్చన్నా వుండాలి. ఏదీ కళ్ళలోకి చూడనిస్తే కదా తెలిసేది. తల దించుకోనే వుంది.
గబగబా టేబుల్ మీద వున్న ప్రోగ్రస్ రిపోర్ట్ తీసుకోని చూసింది. నా చేతిలో వున్న పెన్ను “ప్లీజ్” అంటూ లాగేసుకోని బరబరా సంతకం పెట్టేసి తిరిగి ఇచ్చేసింది.
“మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు మేడం. మండే పంపించండి” అన్నాను నేను అప్పటికీ.
“అవసరం లేదు లెండి. చూశానుగా” అంటూ లేవబోయింది. అప్పుడు గమనించాను ఆమె చేతి మీద కాలిన గాయం కనపడుతోంది.
“మేడమ్ చేతికి ఇంజూరీ వున్నట్లుంది” అన్నాను నేను.
“యా. పొద్దున కుకింగ్ చేస్తుంటే... ఆయిల్.. యు నో... హాట్ ఆయిల్” అంటూ చున్నీ కిందకి చేతిని పోనిచ్చింది. ఆమె ఆ మాటలు చెప్తుంటే చూశాను ఆమె ముఖంలోకి. ఆమె నవ్వింది. నవ్వాలని ప్రయత్నించింది. నవ్వలేకపోయింది. అంత వరకే నాకు అర్థం అయ్యింది.
పాప పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మ పక్కన నిలబడింది. చున్నిలో నుంచి చేతి వైపు చూసి తల ఎత్తి వాళ్ళ అమ్మ ముఖంలొకి చూసింది. పాప కంట్లో నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఆమె లేచి పాప చేతిని గట్టిగా పట్టుకోని లాక్కెళ్ళిపోయింది. వెళ్తుంటే ఆమె వీపు మీద చూశాను. ఎర్రగా...
ఓహ్ మై గాడ్! మీరు ఇంకా చదువుతున్నారా?
ఎందుకు చదువుతున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? వద్దు వద్దు అని చెప్పానా? ఎందుకు నాతో ఈ విషయం మాట్లాడించారు అసలు. తల్చుకుంటే ఏడుపు తన్నుకొస్తుంది నాకు. ప్లీజ్. నేను చెప్పింది ఎక్కడా చెప్పకండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే నేను చెప్పను, చెప్పను అన్నాను. చెప్పకుండా వుండలేక చెప్పాను. నా మాట వినండి. ఎందుకు అని అడక్కండి. ఈ విషయం ఎవరి దగ్గరా అనకండి. అసలు నేను ఈ సంగతి మీకు చెప్పానని తెలిస్తే ఇంకేమన్నా వుందా? తల్చుకుంటేనే భయం వేస్తోంది.
<><><><> 

తాతరాయి చెప్పిన చరిత్ర

అప్పటికి కొంతకాలమైంది నేను నా కొండ నుంచి విడిపడి. పక్కనే వున్న అడ్డరాయితో బాగా పరిచయం కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి అలా వుందో కానీ బాగా నునుపుతేలి మిలమిల మెరుస్తూ వుంటుంది. రోజు కూడా ఎండ నా ఒళ్ళు చుర్రెక్కిస్తుంటే, అడ్డరాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరిగ్గా అప్పుడే చిన్న గులకరాయి దొర్లుకుంటూ వచ్చి మా ముందర ఆగింది. నేనేమో అంత ఎత్తు ఇంత లావు వుంటాను. నా ముందు గులకరాయి పాటిది. నేను పెద్దగా పట్టించుకోలేదు.

ఏంట్రా అబ్బాయిలూ మాట్లాడుకుంటున్నారుఅంటూ అటూ ఇటూ దొర్లింది గులకరాయి.

మాటతీరు అదీ నాకు బాగా చిరాకు కలిగించాయి. ఏదో పెద్దబండవాళ్ళం మాట్లాడుకుంటుంటే, మా మధ్యలో చేరి అలా మాట్లాడినందుకు నాకు చాలా కోపం వచ్చింది.

ఏయ్నీకు చిన్నంతరం పెద్దంతరం లేదా? ఏమిటా మాటలు?” గద్దించాను. చిన్నరాయి గరగరా నవ్వింది.

ఎవరు? నువ్వు పెద్దా? నిన్నగాక  మొన్న పుట్టావుఅంతెత్తున శారీరం వుంటే సరిపోయిందా? వయసు బట్టి గౌరవం కానీ ఒడ్డుపొడవు బట్టి కాదోయ్..” అంది గులకరాయి.

నా కోపం ఇంకా పెరిగిపోయింది. “అయితే నీ వయసు నా వయసు కంటే ఎక్కువంటావు?” అన్నాను.

ఓరి నీ బండపడకనిపించేదాన్ని బట్టి అంచనాలు వెయ్యకూడదురాసరిగ్గా చూస్తే నేను మీకు తాతనవుతాను” అంటూ తన మీద పడ్డ ఎదురెండ నా ముఖానికి తిప్పికొడుతూ నిలబడిందా గులకరాయి.

అడ్డరాయి భళ్ళున నవ్వింది. “మేము గట్టిగా దొర్లితే భూమిలోకి దిగిపోతావునువ్వు మా తాతవాఅంది నవ్వలేక ఒగురుస్తూ.

సరే, నా చరిత్ర చెప్తా వినండి. తాతనో కాదో మీరే చెప్పండి.” అని కథ మొదలుపెట్టింది. “మా ముత్తాత ఇరవై వేల ఏళ్ళ క్రితం ఒక పెద్ద కొండగా వుండేవాడు. అప్పుడప్పుడే మనుషులుగా మారుతున్న కొన్ని కోతులు కొండ మీద వుండేవంట. వాళ్ళు తల దాచుకోడానికి, అక్కడక్కడ సేకరించిన తిండి, జంతుకళేబరాలు పెట్టుకోడానికి మా తాతని తొలిచి ఒక గుహ చేసుకున్నారంట. కాలంలో అట్టా ఏర్పాటు చేసుకున్నోళ్ళే లేరని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మా తాత ఒంటిమీద ఏందేందో బొమ్మలు కూడా గీసినారంట మనుషులు.

కొన్నాళ్ళకి మా తాత కొండ నుంచి విడిపడి చదరంగా వుండే నేల మీద స్థిరపడ్డాడు. ఇంకొన్ని వేల ఏళ్ళ తరువాత ఎండాకాలం అనుకోకుండా చినుకు పడి రెండు ముక్కలయ్యాడు. వాళ్ళే మా పెదనాయన, మా నాయన. వాళ్ళిద్దరూ   శిల్పి కంట్లో పడ్డారు. ముందు మా నాయనని ఆయన చెక్కి చెక్కి శిల్పంగా మార్చాడు. అయితే దానికన్నా పెద్దది కావాలని రాజుగారు చెప్పాడంట. మా నాన్నని వదిలేసి పెదనాన్నని పెద్ద శిల్పంగా చేశారట. ఆయన్ని తరువాత దేవుడు అని పూజలు చేశారు. మతం అని ఒక కొత్త మంత్రం చదివారు. అదో రకం విప్లవం. అయితే పెద్దగా పనికిరాలేదంట.

ఇక్కడ మా నాన్న ఎండకి ఎండి, వానకి నాని నాన్న ఎన్నో ముక్కలయ్యాడు. నేనూ, ఇంకోంతమంది తమ్ముళ్ళు లోకంలో పడ్డాం. తరువాత ఒక చోటని లేదు, ఒక ఊరని లేదు. తిరిగి తిరిగి, అరిగి అరిగి అదిగో లారీలో పడి ఇక్కడికి వచ్చానుఅని చెప్పి కాస్త సర్దుకునిందా రాయి.

అట్నా. అయితే నువ్వు ఖచ్చితంగా మా తాతవేఅయితే నాలాంటి పిల్లరాయికి నీ లాంటి తాతరాయి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వుంటాయేఅవన్నీ నాకు నేర్పించు తాతా…” అని మనవడి గోమంతా పడ్డాను నేను.

అలాగే చెప్తాలే కానీ మనవడాఇంతకీ మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పుట్టించారు? కథలు చెప్పండి ముందుఅంటా పక్కనే వున్న మెత్తటి గడ్డి మీద కుదురుకున్నాడు తాతరాయి.

మాదేముంది తాతా! అదిగో కొంచెం అవతలగా రాళ్ళని పగలగొడుతూ కొన్ని వింత జంతువులు తిరుగుతున్నాయే అక్కడ వుండేవాళ్ళం. అందరం కలిసి వున్నప్పుడు కొండగుట్ట అనేవాళ్ళు.”  అని నా పక్కనున్న అడ్డరాయి చెప్తుంటే నేను మధ్యలో అందుకున్నా.

మధ్యలో వింత జంతువులు పైన ఎక్కి కొంత మనుషులు వచ్చారు. అప్పుడె తెలిసింది వాటిని మెషీన్లంటారని. ఏదో డెవలప్మెంట్ అంటా తలా ఒక జంతువుని మా మీదకు ఎక్కించి గడగడ మంటూ మమ్మల్ని ఇట్టా పుట్టించారుఅన్నాను.

డెవలప్మెంటా?” అన్నాడు తాతరాయి ఆశ్చర్యంగా. ముసిలిరాయి చాదస్తం చూస్తే మా ఇద్దరికీ నవ్వొచ్చింది.

నీకు తెలవదులే తాతాడెవలప్మెంట్ అంటే అభివృద్ధిఅంది అడ్డరాయి అర్థం చెప్తూ.

తాతరాయి గడ్డి మొత్తం గిరగిరా దొర్లుకుంటూ నవ్వాడు. కాస్త ఆగి మళ్ళీ వెనక్కి దొర్లుకుంటూ నవ్వాడు. “ఈళ్ళకి ఇంకా అభివృద్ధి పిచ్చి చావలేదా?” అన్నాడు ఆగాక.

అదేంది తాతా? వీళ్ళ అభివృద్ధి గురించి నీకు తెలుసా?” అన్నాను నా నీడ తాతరాయి మీద పడేలా సర్దుకుంటూ.

తెలియకేం మనవడానేను చెప్పానే మా తాత, ఆయన కూడా అభివృద్ధి గురించి మా నాయనకి చెప్పాడంట. అంటే పదివేల ఏళ్ళ క్రితం సంగతి. కథ మీక్కూడా చెప్పమంటారా?” అన్నాడు

మేమంతాచెప్పు తాతా, చెప్పు తాతాఅంటూ అటూ ఇటూ దొర్లాము. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు.

ఒకప్పుడుఅంటే మా తాత కాలంలో కూడా మనుషులు వుండేవాళ్ళు...!! వాళ్ళు ఎప్పుడూ వుంటార్లే. చచ్చేవాళ్ళు చస్తుంటే, పుట్టేవాళ్ళు పుడుతుంటారుఅందువల్ల మునుషులు చచ్చినా మనిషి అనే ప్రాణి బతికే వుంటదంట. మనలాగ కాదుసరే ఏం చెప్తున్నాను కాలంలో వాళ్ళు అడవుల్లో బతుక్కుంటా, చెట్టుచేమా ఎక్కుతా దిగుతా, కాయదుంప తినుకుంటా వుండేవాళ్ళు. ఒకోసారి గుంపులు గుంపులుగా పోయి, మీ లాంటి రాళ్ళ వెనక నిలబడి ఏదైనా జంతువు దొరికితే వేటాడి, దాన్ని తిని హాయిగా వుండేవాళ్ళు.” మధ్యలో ఆపి అటూ ఇటూ చూసి కొనసాగించాడు తాతరాయి -

కొన్నాళ్ళయ్యాక ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్ని ఇప్పటివాళ్ళు వ్యవసాయ విప్లవం అంటున్నారంట కానీ అప్పట్లో దానికేమీ పేరుండేది కాదుఏదైతేనేంది మనుషులందరూ, వేటాడ్డం మానేసి వడ్లు, గోధుమలు, దుంపలు పెంచడం మొదలుపెట్టారు. రాన్రాను పరిస్థితి మారిపోయింది. ఎకరాలకెకరాలు అవే వడ్లు, అవే గోధుమలు, అయ్యే దుంపలుఎక్కడో చీకటి రాజ్యంలో మొదలైందంట. తరువాత ఒక రాజ్యామని లేదు, దేశమని లేదు, నదని లేదు, సముద్రమని లేదు అన్నింటినీ దాటుకోని పొయ్యినాయి. ఎక్కడ చూసినా అవే. వందా నూటాభై ఏళ్ళు గడిచినాయి. కావల్సినంత పంట, తిన్నంత తిండిఅప్పటిదాకా ఏడాడో తిరిగిన మనుషుల జాతి ఒక చోట కుదురుకున్నారు. గూడేలు, రాజ్యాలు, దేశాలు పుట్టుకొచ్చినాయి. అదే అభివృద్ధి అని పాటలు గట్టి పాడుకున్నారు..”  నేను ఏదో అడగబోతున్నానని తెలిసి అక్కడ ఆపాడు తాత.

నేను అడిగా –“తాతా! నువ్వు చెప్పినట్లు అభివృద్దే జరిగింది కదామరి మాట విని ఎందుకు నవ్వావు?” అన్నాను.

నీక్కూడా మనుషుల్లానే తొందర ఎక్కువున్నట్లుందే మనవడా ఒక్కరవ్వ ఆగుచెప్తున్నా కదాఎందాక చెప్పాను? ఆపాట్నఅందరూ వ్యవసాయ విప్లవం వచ్చిందని సంబరపడ్డారు. నీలాగా నా లాగా కదలకుండా అంతా చూస్తున్న రాయి రప్పా గట్టిగట్టిగా నవ్వుకున్నాయంట. మా తాత (అప్పటికి ఇంకా పిల్లాడే) ఇదంతా చూసి, నీలాగే - “రాళ్ళల్లారా రప్పల్లారా ఎందుకు నవ్వుతున్నారు? అభివృద్ధి జరిగిన మాట నిజమే కదాఅని అడిగినాడంట.

అప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ నవ్వేసి – “ఒరేయ్ నాయనావాళ్ళకంటే బుద్ధి లేక అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు?” అని అడిగినాయంట. ఇంకా వివరంగా చెప్పమని అడిగితే అయ్యి చెప్పడం మొదలెట్టినాయంట.

ఒరేయ్ నాయనానువ్వింకా చిన్నరాయివిసుత్తి దెబ్బకు, ఉలిదెబ్బకి తేడా తెలియనివాడివి. వాళ్ళు చెప్పగానే అభివృద్ధి జరిగిపోయిందని నమ్మితే ఎట్లా? ఒక్కసారి వాళ్ళని చూడు. ఇంతకు ముందు పూటకో రకం తినేవాళ్ళు. ఒకపూట ఆకులు, ఇంకోపూట తేనే, ఇంకోరోజు మాంసం, మళ్ళి ఒకరోజు పండ్లు ఇట్టా అన్ని రకాలు తినేవాళ్ళు, ఇప్పుడు చూడు పొద్దున బియ్యం, మధ్యాన్నం బియ్యం, రాత్రికి బియ్యంఇదీ ఒక తిండేనా? ఇట్టా తిని తిని, ఏదో ఒకరోజు శరీరానికి సరిపోయే పోషకాలు అందటంలేదని వాళ్ళే ఏడుస్తారు చూడుఅంది పెద్దతలరాయి.

అంతేనాఅప్పుడు ఒకచోటని కాకుండా నాలుగు చోట్ల తిరిగే వాళ్ళుఆడవాళ్ళు కూడా అడవుల్లో, గుట్టల్లో తిరిగేవాళ్ళు. అట్టా తిరగడానికి బిడ్డలు ఎక్కువుంటే కష్టమని ఒక బిడ్డకి నడకొచ్చిందాకా ఇంకో బిడ్డని కనకుండా వుండేవాళ్ళు. మరి ఇప్పుడు? ఇల్లు కట్టుకున్నారు. చాటు మాటు కుదిరింది. పంటలు పండించేదానికి ఇంకో రెండు చేతులు వస్తాయిలే అని ఒకళ్ళ తరువాత ఒకళ్ళని కంటూనే వున్నారు. జనాభా పెరిగింది. చేతులున్నోళ్ళకి నోళ్ళు కూడా వుంటాయిగాదానికోసం ఇంకా ఎక్కువ వడ్లు, గోధుమలు పండిస్తున్నారు…  దానికింకా నేల కావాల. ఇది నాదంటే ఇది నాదంటున్నారు. రేపు నేలకోసం తలకాయలు పగలగొట్టుకుంటారు…” అన్నాడు రాయప్ప.

తాతరాయి అక్కడ ఆపి కాస్త ఊపిరి తీసుకున్నాడు.

ఇట్టా వ్యవసాయ విప్లవం గురించి మా తాతకు కథలు కథలుగా చెప్పాయి రాయీ రప్పా. కథలే మా తాత నాకు చెప్పాడు. నేను మీకు చెప్పానుఅన్నాడు తాతరాయి

ఒక్క విప్లవం వెనక ఇన్ని కథలు వుంటాయా తాతా?” అన్నాను నేను ఆశ్చర్యంగా.

తాతరాయి నవ్వేసి – “అక్కడితో కథ అయిపోలేదు మనవడాకాలం గడిచి, మా నాయన ఎదిగేసరికి ఇంకా చానా విషయాలు తెలిసాయి. అంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, పంటలు పండిచడం మొదలుపెట్టాక ఒకే చోట కుదురుకున్నారు పొలం చుట్టూ కాపలా వుండాలికదాఅందుకే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే తినడం, అక్కడే పిల్లలు, అక్కడే జంతువులుఅప్పటిదాక లేని అంటు రోగాలు మొదలైనాయి. అట్టా కొంతమంది చస్తా వుంటే ఇంకొంత మంది ఇంకో రకంగా చచ్చేవాళ్ళు.

అడవుల్లో వున్నప్పుడు ఇంకో జాతి జనం కొట్లాటకి వస్తే చేతనైతే తిరగబడేవాళ్ళు, చేతకాకపోతే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు పారిపోవటం ఎట్లా? పొలం, పాడి, కొంప, గోడుఅన్నీ అక్కణ్ణే వున్నాయయ్యపోయె..!! కాపాడుకోవాలకాదని పోతే పస్తులుండి చావాలకొంతమంది కొట్లాడి చచ్చినారు, ఇంకొంత మంది పస్తులుండి చచ్చినారు. ఎప్పుడన్నా వరి మింగే పురుగొచ్చిందంటే వాళ్ళ దిగుబడి తగ్గి చచ్చినారు…”

అదేంది తాతాఅంతకు ముందు ఒక పండు దొరకకపోతే ఇంకో కాయో, ఆకో, జంతువో తినేవాళ్ళు కదా?”

అప్పుడు తినేవాళ్ళురావిప్లవం దెబ్బకి అయన్నీ మర్చిపోయారుఅదే మనిషికి వుండే శాపం. అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడాఇంక అంతేచానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. కష్టమో నష్టమో కానీలే అనీ అక్కడే పడి కొట్టుకుంటా వుంటాడుఅదే అభివృద్ధి అని పాటలు కట్టి పాడుకుంటా వుంటాడు. అసలు ఇంకో రహస్యం చెప్పనా?”

చెప్పు చెప్పుఅన్నాం మేమిద్దరం

మనిషి అందరికన్నా తెలివైనవాణ్ణని అనుకుంటాడు కానీ వాడంత ఎర్రోడు ఎవరూ లేరు…”

అదేంది తాతా అంత మాట అన్నావు?” అని ఆశ్చర్యపోయాను.

చెప్తా చూడు వరి, గోధుమలు పెంచడం మొదలయ్యాక ఇదంతా జరుగుతోంది కదా. వరి మొలకల్లో ఏదో రహస్యం వుందని, అదేందో తెలుసుకుందామని చాలా సార్లు పొలాల్లోకి దొర్లుకుంటూ పొయ్యాను.”

కనుక్కున్నావా?”

యాడ కనుక్కునేదినన్ను పొలంలో వుండనిస్తే కదా మనిషిరాత్రి పగులు పొలం మీదే కదా వాడి ధ్యాసనేను కనపడగానే ఎత్తి అవతలకి పారేసేవాడు. మొక్కలని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడనినీళ్ళు తెచ్చి పోస్తాడు, మందు తెచ్చి చల్లుతాడు, రాయి రాకూడదు, పురుగు రాకూడదు పంటకి కుక్క కాపలా కాసేవాడనుకో…” అన్నాడు తాతరాయి.

తాతాఅంతా బాగానే వుంది కానీకుక్క కాపలా అంటావే? కుక్కని మనిషి పెంచుకున్నాడు. అందుకని అది విశ్వాసంగా మనిషిని చూసుకుందివరిని గోధుమని కూడా మనిషే పెంచుకున్నాడు కదా…” చెప్పింది అడ్డరాయి.

అక్కడే బురదలో పడుతున్నావు. ఎంతసేపు మనిషి వైపు నుంచే చూస్తే ఎట్లా? ఒకసారి మొక్కల వైపు నుంచి ప్రపంచాన్ని చూడు. అసలు రహస్యం ఏంటో తెలుసాగోధుమని, వరిని మనిషి పెంచలేదు. గోధుమలు, వరి ప్రపంచమంతా పాకడానికి మనిషిని వాడుకున్నాయి. వాడి బతుకేదో వాడు బతక్కుండా, వాటి మాయలో పడ్డాడు తెలివితక్కువ మనిషి. మనిషి కుక్కని పెంచితే అది అడవి నుంచి వచ్చి మనిషి దగ్గర బతికింది. అట్టాగే అడవిలో వుండాల్సిన మనిషి అడవి వదిలేసి, వరి చేలు పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవరు ఎవరిని పెంచుకున్నట్లు?” అన్నాడు తాతరాయి. ఆయన చెప్పింది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటూ ఎవరో వచ్చారు. సరిగ్గా మా ముందు నిలబడి దూరంగా వున్న నేలని చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు.

అదిగో సార్అక్కడ టెక్నో పార్క్ వస్తుంది. రోబోటిక్స్ ఇక్కడ, ఎనలటిక్స్ పక్క. అవర్ కంపెనీ విల్ రెవెల్యూషనైజ్ టేక్నాలజీ. భూమి మీద మనుషుల లైఫ్ మారిపోతుంది మన ప్రాడక్ట్స్ తో…” అంటున్నాడతను.
నేను తాతరాయి వైపు చూసేసరికి ఆయన దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

***