ఇష్ట కామ్యం


నన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యమ్మా! డూప్లే ఇల్లు, ఎస్ యూ వీ  కావాలి. – విక్రాంత్
పిల్లలు మంచి పొజిషన్ కి రావాలి. IAS, IPS అవ్వాలి. మహదేవ్
ఎమ్ సెట్ లో వందలోపు రాంక్ రావాలమ్మా వైదేహి
నాకు డిస్నీ లాండ్ టికెట్స్ కావాలి. ఒక బైనాకులర్స్ కూడా – సుస్వర. ఇంకోటి ప్లీజ్. బార్బీ డాల్ కూడా!
మేం ఇద్దరం భార్యాభర్తలుగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చూడు తల్లీ విహాన్, ఫాతిమా
“ఇది చూశావా! విహాన్, ఫాతిమా అంట! పెళ్ళైందో లేదో” నవ్వేస్తున్నాడు శివరామ్.
“ఇంకా ఎంతసేపు ఉండాలో లైన్లో” శైలజ నిట్టూర్చింది.
“టైమ్ పడుతుంది. అందుకే కదా ఈ గోడల మీద రాసినవి చదువుతున్నాను. భలే టైమ్ పాస్. ఇదిగో ఇది చూడు – “ఆమె చాలా మంచిది. ఆమెకి ఏమీ కాకూడదు” – ఎవరో ఆ పేరు చెప్పుకోలేని ’ఆమె’” మళ్ళీ నవ్వాడు.
“ఊర్కోండి. మీ ఇంటర్పెటేషన్ ఏమీ అఖర్లేదిక్కడ. వంద రూపాయల క్యూలో వెళ్తే అరగంటలో అయిపోయేది దర్శనం. అనవసరంగా ఐదొందలు పెట్టి టికెట్ కొన్నారు. ఇదే పెద్ద క్యూ వున్నట్లుంది. డబ్బులు పోయే టైమూ వేస్టు”
“నాకేం తెలుసు. అందరూ ఐదొందల టికెటే కొంటున్నారని కొన్నా. అది సర్లే ఇది చూడు –“
డబ్బులు కావాలి. బాగా సంపాదించాలి. గుడి కట్టిస్తాను అమ్మా – భరత్ రెడ్డి
“ఎర వేశాడు... హ్హా హ్హ!”
“మనం కూడా రాద్దామా?”
“ఏంటది! డైరెక్ట్ గా అమ్మవార్ని చూసినప్పుడు అనుకో! ఈ రాయడం అంతా బూటకం. ఎవరో పని లేక మొదలుపెట్టి వుంటాడు. ఇప్పుడు చూడు గుడి గోడలు మొత్తం నింపేశారు”
“మీరు కూడా రాశానన్నారు”
“అదెప్పుడో చిన్నప్పుడు. నాన్నగారితో వచ్చినప్పుడు. నలభై ఏళ్ళ క్రితం. ఆయన ఎవరికీ ఇవ్వని పెన్ ఇచ్చి రాయిచ్చాడు మా నాన్న. అప్పుడు ఇంత గుడి ఎక్కడుంది. గర్భగుడి గోడల మీదే రాశాను. ఇప్పుడు చూడు, ఈ మంటపాలేంటి, ఈ గుడేంటి? చాలా పెద్దదైపోయింది.”
జీవిత ఎలాగైనా నాకు పడేలా చూడు -  నీ భక్తుడు
“అనానిమస్ రిక్వెస్ట్. పడాలంట పడాలి! చూడు చూడు”
“ముందుకు పదండి”
డైరెక్టర్ అయ్యేలా చూడమ్మా. పెద్ద డైరెక్టర్ అవ్వాలి. పూరి కన్నా పెద్ద డైరెక్టర్ అయ్యే....
“నీలాగే ఎవరో తోసేసుంటారు. పాపం అతని కోరిక రాయాలన్నా కోరికే తీరలేదు.”
యూఎస్ జాబ్ కావాలి. సొంత కంపెనీ పెట్టాలి. మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా ప్రతాప్
యమ్ సెట్ లో ప్రణవి కన్నా మంచి ర్యాంక్ రావాలి - సుహాసిని
బాబు పుట్టాలి తల్లీ. ఎలాగైనా సరే అబ్బాయి పుట్టేలాచూడమ్మా. - రాజారావ్
నాకు బాగా చదువు రావాలి. స్కూల్ ఫస్ట్  స్టేట్ ఫస్ట్ రావాలి - మల్లేశ్వర్రావ్
నాన్న ఒప్పుకునేలా చెయ్యవా! కిరణ్ అంటే నాకు ఇష్టం - రమ్య
స్మిత సూపర్ సింగర్స్ విన్నర్ అవ్వాలి. మంచి సింగర్ అవ్వాలి. గిరిజ ఆరోగ్యం బాగుండాలి. అప్పులన్నీ తీరిపోవాలి.
“ఎందుకలా ఆగిపోతారు. పదండి ముందుకి”
ఎగ్జామ్స్ బాగా రాయాలి. 550 దాటాలి - విజయవర్ధన్
ఎట్టాగైనా చిన్న ఇల్లు కట్టుకునేలా చెయ్యమ్మా – నర్సిమ్మ, కమల
మంచి ఉద్యోగం రావాలి. అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి - అన్నారావు
శిరీషకి పెళ్ళి కావాలమ్మా. ఇంకేమీ వద్దు. చెల్లి పెళ్ళి అయిపోతే చాలు. - సుశాంత్
బ్యాంక్ ఉద్యోగం రావాలి. మోహనతో పెళ్ళి అవ్వాలి. మామయ్యని ఒప్పించు తల్లీ. – రాఘవ
అమ్మ ఆరోగ్యం బాగయ్యేలా చూడమ్మా రజిత
ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యకుండా కాపాడమ్మా. నన్ను క్షమించు అమ్మా.  వినోద్
“అబ్బా... వీడికొస్తుందే పుణ్యం. చూడు! నిజంగా పశ్చాత్తాపం! కానీ ఏం తప్పు చేశాడో...”
“మనకెందుకండీ. మన గోలేదో మనం చూసుకుందాం పదండి.”
“అది సరే నిన్ను రాయమంటే ఏం రాస్తావ్?”
“రాయద్దన్నారుగా?”
“ఒకవేళ రాస్తే”
“ముందు పదండి.”
సప్లిమెంటరీ అయినా పాసయ్యేట్లు చెయ్యి అమ్మా – ప్రతాప్
ప్రమోషన్ ఇప్పించమ్మా. నా పిల్లల్ని కాపాడమ్మా. శ్రీలతని కాపాడమ్మా. మా కుటుంబాన్ని కాపాడమ్మా. - అశోక్
నాకు బాగా చదువు రావాలి. టెంత్ ఫస్ట్ క్లాస్ రావాలి. మంచి చదువులు చదవాలి – శ్రీనివాస్
నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాన్న కనపడేలా చెయ్యమ్మా. అమ్మ కోసం. – పావని
బాబాయ్ నాన్న కలిసి వుండేలా దీవించమ్మా. మేం అందరం కలిసే వుంటాం. నేను భానక్క, శివుడు, ప్రసాద్, చిట్టి ఎప్పుడూ కలిసే వుండాలా చూడమ్మా. - ఆదిలక్ష్మి
నవల రాయాలి – కోనేటిపాలెం గోపాలమాధవ్
“హ్హ హ్హ..”
“ఏంటది”
“నవల రాయాలట. యద్దనపూడి, యండమూరి కాలం అయ్యుంటుంది. పేరు చూడు ఎలా పెట్టుకున్నాడో – కోనేటిపాలెం గోపాలమాధవ్ – హహ”
“హబ్బా.. పదమంటుంటే”
పంటలు బాగా పండేట్టుగా చెయ్యి అమ్మా – వెంకట్రెడ్డి
సుబ్బన్న కాలు బాగయ్యేలా చూడమ్మా - మహలక్ష్మి
అందరూ చల్లగుండాలి తల్లి - అప్పారావు
నన్ను, నా కుటుంబాన్ని కాపాడు మాతా - సీతాపతి
పిల్లలు బాగా చదువుకునేట్లు చూడమ్మా - సరోజ
లోకమంతా సుఖసంతోషాలతో వుండేలా దీవించు తల్లీ జ్యోస్యులు
తల్లీ నిన్ను తలచి అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ....
“ఎవరో పద్యం రాసేశారు”
“అదిగో గర్భగుడి. వచ్చేశాం”
“ఇంతకీ నువ్వేం రాస్తావో చెప్పలేదు”
“ఇంకా ఏముందని కోరుకోవాలి?”
“ఫర్లేదులే చెప్పవోయ్”
“ఇదిగో ఇదే రాస్తాను” గోడ మీద చూపించింది.
నాకు మంచేదో చెడేదో తెలుకునే జ్ఞానాన్ని ఇవ్వమ్మా. – శివరామ్
“అరే! ఇది నేను రాసిందే. నలభై ఏళ్ళ క్రితం”
“సర్లే పదండి”

***