వాడిన పూలే వికసించులే... (సరదా కథ)


మాధవరావు అద్దంలో ఒక్కసరి చూసుకోని, తలపైన చేత్తో సవరించుకున్నాడు. నలభై ఏళ్ళ వయసు నల్లటి జుట్టు అయితే అందులో పదిహేనేళ్ళ వివాహంలా అక్కడక్కడ తెల్లజుట్టు మెరుస్తోంది.
“ఇంకా ఎంతసేపని ఆ అద్దం ముందు... మీరు కానిచ్చి బయల్దేరితే నేను చేసుకోవాల్సిన పనులు సవాలక్ష వున్నాయి..” వంటింటిలొ నుంచి అరిచింది అన్నపూర్ణ.
“చాల్లే సంబడం... నువ్వు అద్దం ముందు నిల్చుంటే నేను కేలండర్ ముందు నిలబడి తేదీలు మార్చాలి... నువ్వు నాకు చెప్పొచ్చావు...” మాధవరావు ప్రతిగా అన్న మాట ప్రతిధ్వనించింది.
“అనండి.. అనండి... మీరు నాకు నగలు, చీరలు సరైనవి కొనిస్తే, నాకు ఈ పైపైన మెరుగులు వేసుకోవాల్సిన పనే ఉండేది కాదు... అందరూ నగల్ని చూసి నన్ను అంచనా వేసేవాళ్ళు..” ఆ మాటలతో పాటు గరిటె వెళ్ళి పళ్ళెంపైన చేసిన నాట్యం తాలూకు శబ్దాలు కూడా మాధవరావును చేరాయి.
“ఇల్లు చూడు... ఇల్లాలిని చూడు అన్నారు కానీ... ఇలా నగల్ని చూడు నా ముఖం చూడు అనలేదే ఎవరూ..” అన్నాడు మాధవరావు.
“అయితే ఇంకే ఈ ఇల్లుని చూపించండి ఎవరికైనా... ఈ ఇంటిని, మన వాలకాన్ని చూస్తే ఇది ఇల్లు కాదు ఏదో మెంటల్ హాస్పిటల్ అనుకోని..”
“మరే.. మరే... నువ్వు పేషంటు, నేను డాక్టరు..” వెక్కిరించినట్లు నవ్వాడు.
“అవునవును... మిమ్మల్ని కట్టుకునేదాకా బాగానే వుండేదాన్ని పాపం... కట్టుకున్నాకే ఇలా పేషంట్ అయ్యాను”
“నీతో మాట్లాడటం కన్నా నోటికి ప్లాస్టర్ వేసుకోని..” ఆయన మాట పూర్తి కాకముందే అన్నపూర్ణ అందుకుంది..
“అక్కడ డ్రస్సింగ్ టేబుల్ కింద డ్రాయర్లో వుంది ప్లాస్టర్...” అనేసి గిరుక్కున తిరిగింది.
పాపం ప్లాస్టర్ వెయ్యకుండానే నోరు మూతపడటంతో, తప్పనిసరై ఇంట్లో నించి బయటపడ్డాడు మాధవరావు. ఏదో ఆఫీసు పని వల్ల వేరే వూరు క్యాంపుకి బయల్దేరాడు. జరిగిన ప్రహసనం అంతా అన్నపూర్ణ గారి తరహాలో చెప్పాలంటే వీడ్కోలు..!!
***
ఇదిలా వుండగా... పైన ఆకాశంలో...
“నాథా..!” రతీదేవి పలకరించింది.
“ఏం దేవీ” పులకరించాడు మన్మధుడు.
“మదీయ మానసంబున ఏదో అంతుతెలియన వింత భావన కలుగుచున్నది. సుగంధవీచకలను ఆఘ్రాణించిన భ్రమరమునకు చిత్తచాంచల్యము కలిగినటుల పరిపరి విధముల పరితపించుచున్నది..” అందామె భారంగా నిట్టూరుస్తూ. మన్మధుడు తేలికగా నిట్టూర్చి –
“ఏమిటిది దేవీ... ఇంకా ఆ గ్రాంధిక భాషను వదలలేదా? మనం ఎప్పుడూ మానవుల మధ్య తిరిగేవాళ్ళ... వారిలో ప్రేమ మొలకెత్తించేవాళ్ళం... ఆ భాషను వదిలి ఇప్పుడు ప్రేమకు కారణమైన ఇంటర్ నెట్, చాటింగ్ వంటివి నేర్చుకో అని నీకు ఎన్నిసార్లు చెప్పాను..” అన్నాడు అసహనంగా.
“బాగానే వుంది... ఆ విషయంలో మీకంటే ముందే వున్నాను... మీరు చెప్పినవే కాక ఫేస్ బుక్, ట్విట్టర్ గురింఛి కూడా తెలుసుకున్నాను... కానీ ఏకాంత వేళ... ఈ మధుర మధుమాసపు సంధ్యవేళ, మనసులో భావాలను చెప్పడానికి అదే అనువైన భాషనీ..”
“బాగానే వుంది... నీకు బొత్తిగా వేళాపాళా లేకుండా పోయాయి... సరసానికి ఇదా సమయం... ఇంకా మనం పూర్తి చెయ్యాల్సిన టార్గెట్ ఎంత వుందో తెలుసా... కనీసం ఈ నెల మనం వాడవలసిన బాణాలలో సగం కూడా వాడలేదు...”
“పూలతో చేసిన బాణాలు కదా... అవే వాడతాయిలే స్వామీ..”
“అయ్యే.. ఆ వాడటం కాదు సఖీ... మనం వాడటం గురించి చెప్తున్నాను... అర్థంచేసుకోకుండా...” మధ్యలో అందుకుంది రతీదేవి.
“నాకు బాగానే అయ్యింది... నేనేదో చమత్కారంగా అంటే అది మీకే అర్థం కావటంలేదు... అసలు నవ్వడమే మర్చిపొయారీమధ్య...!!” రుసరుసలాడుతూ వెనక్కి మళ్ళింది ఆమె. ఆ విసురుకి తగిలిన వాల్జడ దెబ్బకి సరసం కావాల్సింది విరసం అవుతోందని అర్థం అయ్యింది మన్మధుడికి.
“అంతలోనే అలకా... సరే ఏం కావాలో చెప్పు...”
“ఏదైనా అడిగితీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది... నా మనసులో విషయం మనసులో వుండగానే గ్రహించి తెచ్చిన ఆ అసమాన ప్రేముకుడైన మన్మథుడివేనా నువ్వు..” ఉక్రోషంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
“ఎంత మాట దేవీ... గ్రహించే వాడినే కానీ ఏం చేద్దాం... అంతకన్నా ముందే నా వుద్యోగ ధర్మం అడ్డుపడుతోంది... నీకు తెలుసుగా ఈ మధ్య ప్రేమికులు ఎలా పెరిగిపోయారో.. పని వత్తిడి..” సంజాయిషీ ఇచ్చాడు అతడు. “ఇంతకీ విషయం చెప్పరాదూ” అంటూ తొందరపెట్టాడు.
“ఇన్ని యుగాలుగా చూస్తున్నాను. ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులు ఒకరికొకరు కోసం ఒకరన్నట్లు బ్రతుకుతారు... పూలు ఇచ్చుకుంటారు, బహుమతులు ఇచ్చుకుంటారు, పదే పదే ప్రేమ ప్రేమా అంటూ పలవరిస్తారు... తీరా పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకేముందిలే అన్నట్లు అవన్నీ మర్చిపోతారు... అంటే పెళ్ళి తరువాత ఆ ప్రేమలు వున్నట్లా లేనట్లా? అని సందేహం?” అనుమాన శరం వదిలింది ఆమె. ఆమె సంధించిన ప్రశ్న తమ వైవాహిక జీవితం గురించేనని మన్మధుడికి అనుమానం.
“అదంతా మనకెందుకు దేవీ... మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్... అంటే ప్రేమలు మన సామ్రాజ్యం, పెళ్ళిళ్ళు ఆ దేవేంద్రులవారి సామ్రాజ్యం...” అంటూ దాటెయ్యబోయాడు.
“అయితే మాత్రం... ప్రేమ పెళ్ళిళ్ళకి రిజస్ట్రార్ ఆఫీసరు, ఇద్దరు సాక్షులతో పాటు మనం కూడా బాధ్యులమే కదా? పెళ్ళి తరువాత మన పవర్ తగ్గి ప్రేమలు మాయమౌతున్నాయేమో తెలుసుకోవద్దూ...”
“సరే అలాగే... అయినా నీకు ఈ అనుమానం మన పెళ్ళి తరువాత రాలేదు కదా?” ఖంగారుగా అడిగాడు మన్మధుడు.
“అయ్యే ’ప్రేమా’... అలాంటిదేమీ లేదండీ...” అంటూ గోముగా కాముడి చేతిపై తన మునివేళ్ళని ఆడిస్తూ అడిగింది ఆవిడ. ఆవిడ అలా ఆడించినప్పుడల్లా ఆయన ఆమె చెప్పినట్లల్లా ఆడతాడు.
“సరే నీ సందేహాన్ని ఇప్పుడే నివారిస్తాను... వెంటనే ఒక ప్రేమ జంటని వెతుకు. వాళ్ళిద్దరికీ ప్రేమ వివాహం జరిగి కనీసం పదేళ్ళ అయ్యివుండాలి. ఇప్పుడు వాళ్ళ వైవాహిక జీవితంలో ప్రేమ పరిస్థితి ఏమిటో తెలుకుందాం...” అన్నాడు. రతీ దేవి భూలొకం వైపు దృష్టి సారించింది.
“అదిగో ఆ ఇద్దరిని చూడండి. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కానీ నిద్రలేచింది మొదలు ఎలుక పిల్లిలా తన్నుకుంటుంటారు.” అంటూ ఆమె చూపించింది. ఆమె చూపుడువేలు చూపించిన ఇద్దరి చూపులు దూసుకెళ్ళాయి.
ఆ ఇద్దరి పేర్లు – మాధవరావు, అన్నపూర్ణ.
***
బస్టాండ్ లో వస్తుందో రాదో తెలియని బస్సు కోసం ఎదురు చూస్తూ కునుకు తీస్తున్న మాధవరావు ఉలిక్కిపడి లేచాడు. అప్రయత్నంగా అన్నపూర్ణ గుర్తుకువచ్చింది. ఈ ట్రైనింగ్ ఒకటి దాపురించింది కానీ లేకపోతే ఒక్కడే వూరు దాటి వెళ్ళిందే లేదు. ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు.
“అన్నపూర్ణ జాగ్రత్త ఎక్కువ. నాతో వుందంటే సామాన్ల గురించి బెంగలేకుండా వుండేది... ఇప్పుడు కునుకు తీయటానికి కూడా లేదు...” అనుకున్నాడు. లేచి అసహనంగా అటూ ఇటూ తిరిగాడు. అన్నపూర్ణ పెట్టి పంపిన టిఫిన్ కేరియర్ లో నించి రెండు స్పూన్లు ఉప్మా తిన్నాడు. అది రుచిగా వుందా లేదా అనేది అనవసరం, అన్నపూర్ణ చేసి పెట్టిన ఉప్మా కాబట్టి ఎలా వున్నా తినాలనిపిస్తుంది ఆయనకి. మళ్ళీ లేచి అటూ ఇటూ తిరిగాడు.
“మూడు రోజులు... వూరు కాని వూరు, భాష కాని భాష... మాట్లాడుకోడానికి ఎవరూ వుండరేమో”... అనుకున్నాడు... “పోనీ ఎగ్గొడితే? ఏదైనా అనారోగ్యమని చెప్తే మూడు రోజులు ఇంట్లోనే వుండచ్చు... అనుకోని సెలవు కాబట్టి అన్నపూర్ణతో గడపచ్చు” మాధవరావు ఆలొచనలు అలా వుండగానే బస్సు వచ్చి ప్లాట్ ఫారం పైన నిలబడింది. ఆయన మాత్రం భారంగా నిట్టూర్చి బస్టాండ్ బయటికి అడుగులేశాడు.
***
అక్కడ అన్నపూర్ణకి వంట చెయ్యబుద్దెయ్యలేదు. “వంకాయలు వున్నాయి కానీ, అవి ఆయనకి ఇష్టం, ఆయన వచ్చిన తర్వాత గుత్తొంకాయ చేస్తే ఇష్టంగా తింటారు” అనుకుంది. పప్పు చేద్దామనుకుంది కానీ పొరపాటున నీళ్ళెక్కువ పడిపోయాయని దాన్ని సాంబారుగా రూపాంతరం చేసేసింది. అందులో కూడా వుప్పు రెండు సార్లు వేశానా అని అనుమానం ఒకటి మొదలైంది.
ఉడికీ ఉడకని అన్నం పక్కన పెట్టి, పొద్దున మాధవరావుకోసం వండి మిగిలిన ఉప్మా రెండు చెమ్చాలు తినింది. ఏమీ తోచకుండా వుండటంతో టీవీ పెట్టుకోని అందులో ఏదో మళయాలం ఛానల్ వస్తున్న గుర్తించకుండా – “ఈయన ఎట్లా పోతున్నాడో ఏమో..” అనుకుంది. టీవీ పాటికి టీవీని వదిలేసి బట్టలు సర్దే నెపంతో బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
“ఏమిటో ఈ మనిషి... షేవింగ్ కిట్ తీసుకెళ్ళడం మర్చిపోయారు... దారిలో గుర్తొచ్చి తిరిగి వచ్చినా బాగుండు...” అనుకుంది.
కాలింగ్ బెల్ మోగింది.
“ఏం వెనక్కొచ్చారు? మీ మాజీ ప్రేయసి శకునం రాలేదనా?” తలుతీసి ఆశ్చర్యం కనపడకుండా అంది అన్నపూర్ణ.
“కాదు నీ మాజీ ప్రియుడు శవం ఎదురొస్తే వెనక్కొచ్చా...” కసిగా అన్నాడు ఆయన లోపలికి వస్తూ.
“షేవింగ్ కిట్ కోసం వచ్చారా?”
“షేవింగ్ కిట్టే కావాలంటే నువ్వు తెచ్చిన కట్నం డబ్బుల్తో కొనుకునేవాణ్ణి... ట్రైనింగ్ కాన్సిల్ అయ్యింది..” అబద్దమాడాడు మాధవరావు.
“మూడు రోజులు సుఖంగా వుందామనుకున్నా... ఆ అదృష్టం కూడా లేదన్నమాట...” కొంగు విలించింది ఆమె.
“నాకు ఏమైనా వండావా?”
“పోతాను పోతాను అన్న తర్వాత ఎందుకు వండుతాను... నాకొక్క దానికే వండుకున్నా...” మూతి విసిరింది అన్నపూర్ణ.
“సరే కాఫీ ఫ్లేవరుతో వేణ్ణీళ్ళు ఇస్తావుగా అవైనా తగలబెట్టు...” అన్నాడు ఆయన. ఆమె రుసరుసలాడుతూ వంటింటిలొకి వెళ్ళి గుత్తొంకాయ చేయడానికి సరంజామా సర్దుకుంది.
“సాయంత్రం తొందరగా తెమిలితే ఆ చీరలకొట్టుకు పొయ్యద్దాం...” పేపరు చదువుతూ అరిచాడు ఆయన.
***
“ఇంతకీ ఏం జరిగింది స్వామీ... నాకేమీ అర్థం కాలేదు...” అడిగింది రతీదేవి.
“ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది... ఆమెను వదలేక ఆయన తిరిగి వచ్చాడు... ఆయన కోసమే ఎదురుచూస్తూ ఆమె కూర్చుంది...”
“అది సరే స్వామీ... మరి అంత ప్రేమ వున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకోవచ్చు కదా?”
“అయ్యో దేవీ... వాళ్ళిద్దరి మధ్యా రోజూ జరిగి పిల్లి ఎలక పోరులోనే వారి ప్రేమలు వ్యక్తమౌతాయి... అందుకే ఒకరిని విడిచి ఒకరు వుండలేక పోతున్నారు... పెళ్ళి అయిపోగానే ప్రేమలు వుండవనేది నిజం కాదు... ఆ ప్రేమని వ్యక్తం చేసే విధానం మారుతుంది అంతే...” అంటూ నవ్వేడు నవమన్మధుడు.
“అయితే ఆ కొట్లాటలు, వెటకారాలు అన్నీ ప్రేమేనంటారా?” అడిగింది ఆశ్చర్యంగా.
“నిస్సందేహంగా...”
రతీదేవి క్షణం ఆలోచించి - “వాళ్ళ సంగతి సరే మరి మీ ప్రేమ పెళ్ళి తరువాత ఏ రూపాంతరం చెందిందో?” అడిగింది చిలిపిగా. కాముడు నవ్వి కార్యోన్ముఖుడయ్యాడు. వాడిన పూలు మళ్ళీ విచ్చుకున్నాయి.                
(ఆశ మాసపత్రిక సరదాకథల పోటీలో బహుమతి పొందిన కథ, ఆగష్ట్ 2012)
<?>