మొపాస కథలు: భయం

అయితే మీకు అర్థంకాలేదంటారు? సరే ఒప్పుకుంటాను. నా బుర్ర పని చెయ్యడం మానేసిందని కూడా అనుమానపడుతున్నారా? సరే అదీ ఒప్పుకుంటాను. అయితే దోస్త్... మీరు అనుకుంటున్న కారణాల వల్ల మాత్రం నాకు పిచ్చి పట్టలేదు.
అవును నిజమే.. నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. అంత పెద్ద నిర్ణయం కారణం వల్ల తీసుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను.
సరే మరో విషయం చెప్పేస్తున్నా. రేపు పొద్దున నాకు భార్యగా రాబోయే అమ్మాయి గురించి నాకేం పెద్దగా తెలియదు. ఏదో నాలుగైదు సార్లు మాత్రమే చూశానామెని. నచ్చకపోవడానికి ఏ కారణం కనపడలేదు. అంతకంటే ఇంకేం కావాలి పెళ్ళి చేసుకోడానికి? కాస్త పొట్టిగా వుంటుంది. మంచి రంగు కూడా. సరే, కాస్త బొద్దుగా కూడా.. అయితే మాత్రం? పెళ్ళైన మర్నాడే నాకు పొడుగ్గా నల్లగా సన్నగా వుండే అమ్మాయి అయ్యుంటే బాగుండేది కదా అని అనిపించవచ్చు. విషయం నాక్కూడ తెలుసు.
పెద్దగా డబ్బు కూడా లేదు. మధ్య తరగతి అమ్మాయి. మొత్తం మీద చూస్తే, తెలిసిన సంబంధాలు దొరక్క మాట్రిమోనీలో ప్రకటన ఇచ్చేలాంటి లక్షణాలు అన్నీ వున్నాయి. లోపాలు మాత్రం లేవు. ఎవరినా చూస్తే "లాజీలీ ఎంత చక్కని పిల్ల" అనుకుంటారు. సరే రేపటినుంచి "రేయ్మోన్ గారి భార్య ఎంత చక్కని పిల్ల" అని అనుకుంటారనుకోండి.
ఒక్క మాటలో చెప్పాలంటే చూడగానే ఈమె నా భార్య అయితే బాగుండు అని అనిపించే చాలా మంది అమ్మాయిలలో ఈమె ఒకతి. సరే, ఎలాగూ పెళ్ళైన తరువాత పెళ్ళాం కన్నా మిగిలిన ఆడవాళ్ళే అందంగా కనిపిస్తారనుకోండి. కనీసం అప్పటిదాకైనా ఈమె అందగత్తేనని అంటాను నేను.
"అది సరే లేవోయ్.. అసలు పెళ్ళి చేసుకోవాల్సినంత అవసరమేమొచ్చింది ఇప్పుడు నీకు" అని మీరు అడగవచ్చు.
ఇలాంటి బుద్దితక్కువ పని చెయ్యడానికి దోహదం చేసిన ఒక అసంభద్ధమైన, చిత్రమైన కారణం వుంది. అది చెప్పడానికి కొంచెం సంశయిస్తున్నాను. సరే, ధైర్యం చేసి నిజం చెప్పేస్తాను. నాకు ఒంటరిగా వుండాలంటే భయం. అందుకు.
మీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ దారుణంగా తయారైన నా మనఃస్థితి గురించి చెప్పానంటే మీకు నా మీద జలిగానీ, ఏహ్యభావంగానీ ఏదో ఒకటి కలిగి తీరుతుంది.
ఇకపై నేను ఏ రాత్రీ ఒంటరిగా వుండకూడదని నిర్ణయించుకున్నాను. ఏమైనా సరే, నా దగ్గర వుండి, నన్ను తాకుతూ, నాతో మాట్లాడుతూ వుండే మనిషి ఒకరు వుండితీరాలని అనిపిస్తోంది.
నా పక్కనే వుండి నన్ను నిద్రలేపే మనిషి కావాలి. నా మనసులో పుట్టే ఎలాంటి పిచ్చి ప్రశ్న అయినా సంకోచించకుండా ఆ క్షణమే అడిగే అవకాశం కావాలి. మరీ ముఖ్యంగా అలా అడిగినప్పుడు అందుకు సమాధనంగా నాకు మనిషి గొంతు వినపడాలి. నా పక్కనే మేలుకోని మరో ప్రాణి వుందన్న భావన నాకు కలగాలి. ప్రాణి ఆలోచించగలదని నమ్మకం కావాలి. రాత్రిపూటో కొవ్వత్తి వెలిగిస్తే ఒక మానవ ముఖం నాకు కనపడాలి. ఇదంతా ఎందుకంటే.. ఏం చెప్పను? చెప్పాలంటే సిగ్గుగానే వుంది. అయినా చెప్పేస్తాను. నాకు ఒంటరిగా వుండాలంటే భయం వేస్తోంది.
అబ్బే.. మీరు నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నట్లు లేదు.
నాకేదో ప్రమదం జరిగిపోతుందని నేను భయపడటంలేదు. ఏవడైనా మగాడు నా గదిలోకి వస్తే మాత్రం బెదరకుండా వాణ్ణి చంపేయగలను. అతీంద్రియ విషయాలను నమ్మను కాబట్టి దయ్యాలంటే అసలు భయమే లేదు. చనిపోయినవాళ్ళు నన్ను భయపెట్టలేరు. ఎందుకంటే చనిపోయినవాళ్ళు భూమిమీద నుంచి ఆనవాలు లేకుండా నిర్మూలించబడతారని నా విశ్వాసం.
సరే.. సరే.. చెప్పక తప్పేట్టు లేదు. నన్ను భయపెట్టేది వేరే ఎవరో కాదు. నన్ను నేనే భయపెట్టుకుంటున్నాను. అర్థంకాని ఆందోళనలు కలుగుతున్నాయన్న భావన లోనుంచే భయం పెరుగుతోంది.
మీకంతా నవ్వొస్తుండచ్చు. సరే నవ్వుకోండి. కానీ నేను చెప్పే భయం చాలా దారుణమైనది. దాని బారినుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కావటంలేదు. నాకు గోడలంటే భయం. కుర్చీలు బల్లలంటే భయం. వీటన్నింటిలో అసహజమైన జంతుప్రాణం ఏదో దాగివుందని బలమైన నమ్మకం నాకు. అన్నింటికన్నా ముఖ్యంగా దారుణమైన నా ఆలోచనలంటేనే నాకు ఎక్కువ భయం. అవి నన్ను ఏదో నిగూఢమైన, అదృశ్యమైన బాధల తీరాలకు లాక్కెళ్ళి వదిలేస్తాయని భయం.
ఒక అర్థంకాని విచారం మొదట నా మెదడుని కమ్మేస్తుంది. దాంతో నా వళ్ళంతా సన్నటి చలిలాంటి వణుకు పాకుతుంది. చుట్టూ చూస్తాను. ఏమీ వుండదు. ఏమన్నా వుంటే బాగుండు అనిపిస్తుంది. ఏమన్నా అంటే - నేను తాకీ, చూసీ వునికిని అనుభవించగల్గినది అలాంటిది ఏదైనా వుంటే బాగుండు అనిపిస్తుంది.
నేను ఇంత పిరికివాడిగా మారడానికి కారణం ఏమిటో తెలుసా? నా భయానికి అర్థం తెలుసుకోలేకపోవడం.
నేను మాట్లాడితే నా గొంతు నాకే భయాన్ని కల్పిస్తుంది. నడుస్తున్నానంటే - తలుపు చాటునో, కర్టన్ వెనకో, నా మంచం కిందో - ఎక్కడో ఏదో వుందని భయం వేస్తుంటుంది. అక్కడేమీ ఉండదని నాకు తెలిసు కానీ భయం వేస్తుంది. నా వెనక ఏమన్నా వుందేమో అని మరో భయం. వున్నట్టుండి వెనక్కి తిరిగి చూసుకుంటుంటాను. ఏమీ వుండదు. వుండదని కూడా నాకు తెలుసు.
నాలో కలవరం పెరుగుతుంది. అప్పుడే నా గుండెల్లో భయం కూడా క్రమేపి పెరగడం కూడా తెలుస్తుంది. నా గదిలో దూరి తలుపులేసుకుంటాను. నా మంచం మీద అమాతం పడిపోయి, బట్టల మాటున దాక్కుంటాను. నిండా దుప్పటి కప్పుకోని, వుండలా చుట్టుకుపోయి, భయంతో కళ్ళు మూసుకోని ఎంతోసేపు అలాగే వుండిపోతాను. నా మంచం పక్కన కొవ్వొత్తి వెలుగుతోందని, పడుకునే ముంది దాన్ని ఆర్పేయలాని కూడా తెలుస్తూనే వుంటుంది. ఐనా ఆర్పడానికి ధర్యం చాలదు.
అలాంటి పరిస్థితి అత్యంత భయంకరమైనది. కాదంటారా?
ఇంతకు ముందు ఇలాంటిదేమీ వుండేది కాదు. చాలా మామూలుగా వచ్చేవాడిని. నా ప్రశాంతతకి మాత్రం భంగం కలుగకుండా హయిగా అపార్ట్మెంట్ పైకి కిందకీ తిరిగేవాణ్ణి. సమయంలో నాకు ఎవరైనా ఇలాంటి అర్థంలేని భయం అనే వికారం (అంతకన్నా వేరే మాట దొరకటంలేదు మరి)కలుగుతుందని చెప్పివున్నా బాగుండేదేమో. చెప్పినా ఇంత అర్థంలేని వికారం గురించి విని పగలబడి నవ్వేవాడినేమో. అసలు చీకట్లో తలుపు తెరవడానికి నేను ఏనాడు భయపడింది లేదు. అలా తీసిన తలుపును సరిగా మూయకుండానే వెళ్ళి మంచం మీద పడి ధైర్యంగా నిద్రపోయేవాడిని. కనీసం అన్ని సక్రమంగా వున్నాయో లేదో చూడటానికి కూడా మధ్యలో లేచేవాణ్ణి కాదు.
గత సంవత్సరం ఎండాకాలం తరువాత చిత్తడి రాత్రిపూట విచిత్రమైన సంఘటన జరిగింది. నేను భోజనం పూర్తిచేశాక, నా పనివాడు నా గది వదిలి వెళ్ళాడు. అప్పుడు ఏం చెయ్యాలా అని కొంతసేపు ఆలోచిస్తూ వుండిపోయాను. గదిలో అటూ ఇటూ నాలుగుసార్లు పచార్లు చేశాను. కారణం లేకుండానే అలసిపోయినట్లు అనిపించింది. పనీ చెయ్యబుద్ది వెయ్యలేదు. పుస్తకాలు చదవాలనిపించలేదు. బయట సన్నటి వర్షం పడూతూ వుంది. నాకు మాత్రం దిగులుగా అనిపించింది. దిగులు తరువాత రాబోయే నైరాశ్యానికి ఎరలా అనిపించింది. ఎలాంటి కారణమూ లేదు. ఏడుపొచ్చేంత నిరాశ పరుచుకుంది. ఎవరితోనైనా విషయమైనా మాట్లాడితే చాలు వ్యాకులత తప్పిపోతుందేమో అనిపించింది.
ఒక్కసారిగా నేను ఒంటారివాడినన్న స్పృహ కలిగింది. గది మొత్తం ఇంతకు ముందు కన్నా ఖాళీగా మారిపోయినట్లు అనిపించింది. నన్ను ముంచేసే అనంతమైన ఏకాంతం మధ్యలో నిలబడ్డట్లు తోచింది. నేనేం చెయ్యగలను? కొద్ది సేపు కూర్చున్నాను. కానీ నా కాళ్ళ నరాల్లో తెలియని అసహనం పెరిగినట్లు అనిపించి లేచి మళ్ళీ అటూ ఇటూ నడిచాను. సామాన్యంగా అటూ ఇటూ నడిచేవాళ్ళలాగానే చేతులు వెనక్కి పెట్టుకోని ఒక అరచేతిలో మరో అరచేతిలో పెట్టుకోని నడుస్తున్నాను. నా చేతులు రెండూ వేడిగా వున్నట్లు తెలుసూనే వుంది. బహుశా జ్వరం లాంటిదేదో అయ్యిందని అనుకున్నాను. అంతలోనే చల్లటి వణుకు నా వెన్నెముకలో పాకినట్లైయింది. చలిగాలో నా గదిలోకి వచ్చివుంటుందని సరిపెట్టుకున్నాను. గదిలో వున్న నిప్పుగూడులో మంట వేసి మంటని చూస్తూ కూర్చున్నాను. సంవత్సరానికి అదే మొదలు గూట్లో మంట వెలిగించడం. ఎంతోసేపు గడవలేదు. నేను అక్కడ ఒంటరిగా వుండటం అసాధ్యమని అనిపించడం మొదలైంది. ఇక తప్పదని నిర్థారించుకోని అక్కడి నుంచి బయల్దేరాను. నాకు తోడుగా వుండేందుకు ఎవరో ఒక స్నేహితుడు దొర్కకపోతాడా అని అనుకున్నాను.
బయటెవరూ లేకపోవటంతో పరిచయం వున్న వాళ్ళని వెతుక్కుంటూ ఊరి సెంటర్ దాకా నడిచాను. వీధులన్నీ దౌర్భాగ్యంగా వున్నాయి. గాస్ దీపాల వెలుగులో తడిగా వున్న పేవ్మెంట్లు మెరుస్తున్నాయి. మరో పక్క చేతులకి తగలనంత సన్నటి వాన దీపాల వెలుగుకు అడ్డంపడుతోంది.
"నాతో మాట్లాడేందుకు ఒక్క మనిషి కూడా దొరికేట్టు లేదు" అని నాలోనేనే అనుకుంటూ ముందుకుసాగాను.
నడిచినంతమేర కాఫీ షాపులన్నీ వెతికాను. మాడీనీ నుంచి ఫాబోర్గ్ పొసినేర్ దాకా. ప్రతి చోటా దిగులు నిండిన ముఖాలు టేబుళ్ళ దగ్గర కూర్చోని కనిపించారు. కనీసం వాళ్ళు అడిగి తెప్పించుకున్న ఆహరపదార్థాలని కూడా తినలేనంత నీరసంగా కనిపించారు.
చాలాసేపు దారీతెన్నూ లేకుండా అటూ ఇటూ తిరిగి ఎప్పుడో అర్థరాత్రికి ఇంటిదారి పట్టాను. బాగా అలసిపోయి వున్నాను. మా జానిటర్ చటుక్కున తలుపుతెరిచాడు. సామాన్యంగా అంత త్వరగా ఎప్పుడూ తెరవడు. బహుశా అంతకుముందే అదే బిల్డింగ్లో వుంటున్నవాళ్ళు ఎవరినా వచ్చివుంటారేమోనని అనుకున్నాను.
నేను ఎప్పుడు నా గదిలోనుంచి బయటికి వెళ్ళినా డబుల్ లాక్ చేసి మరీ వెళ్తాను. ఇప్పుడు చూస్తే తలుపు దగ్గరకి మాత్రమే వేసి వుంది. సాయంత్రంగా నా కోసం వచ్చిన ఉత్తరాలను ఎవరినాతెచ్చి పెట్టి వుంటారని ఊహించాను.
నేను లోపలికి వెళ్ళే సరికి నేను వెలిగించిన మంట ఇంకా మండుతూనే వుండి, సన్నటి వెలుగుని ప్రసరింపజేస్తోంది. కేండిల్ తీసుకోని వెలిగించే ప్రయత్నం చెయ్యబోతుండగా నా పడక కుర్చీలో ఎవరో మంట వెలుగు వైపు తిరిగి కూర్చోని కాళ్ళను మంట వైపు చాచి వెచ్చగా కాచుకున్నట్లుగా అనిపించింది.
నేను కాస్త కూడా భయపడలేదు. పైగా నన్ను కలవడానికి స్నేహితుడో ఇంకెవరైనా వచ్చి వుంటారని అనిపించింది. నేను బయటికి వెళుతూ నౌఖరికి చెప్పి వెళ్ళాను కదా - అదే నౌఖరు అతని దగ్గర వున్న మరో సెట్టు తాళాలు ఇచ్చివుండచ్చు కదా అనుకున్నాను. మరుక్షణం నేను వచ్చినప్పుడు పరిస్థితి మొత్తం కళ్ళముందు మెదిలింది. వీధి వాకిలి వెంటనే తెరవబడటం, గది తలుపులకు తాళం లేకుండా కేవలం గొళ్లెం మాత్రమే వుండటం ఇవ్వన్నీ జ్ఞాపకానికి వచ్చాయి.
స్నేహితుడెవరోకానీ అతని తల వెనుక భాగం తప్ప ఇంకేమీ కనపడలేదు. నాకోసం ఎదురుచూస్తూ నిద్రపోయినట్లున్నాడని అనుకొని అతన్ని లేపడానికి దగ్గరగా వెళ్ళాను. అతను కొంత స్పష్టంగా కనిపించసాగాడు. అతని కుడి చేయ్యి కిందకి జారిగిలపడి వుంది. కాళ్ళు ఒకదానిమీద ఒకటి క్రాస్గా వేసుకోని వున్నాడు. అతని తల మాత్రం కొంత ఎడమవైపుకి ఒరిగివుండటం చూస్తే అతని నిద్రపోతున్న విషయం నిర్థారణ అయ్యింది. "ఎవరై వుంటారబ్బా?" అని అనుకున్నాను. గదిలో ఇంకా చీకటిగానే వుండటం వల్ల అతన్ని స్పష్టంగా చూడలేకపోతున్నానని గుర్తించి అతని భుజం మీద చెయ్యి వేశాను. నా చేతికి కుర్చీ తగిలింది. అక్కడెవరూ లేరు! కుర్చీ ఖాళీగా వుంది!!
భయంతో ఒక్కసారి వెనక్కి గెంతాను. ఏదో పెద్ద ప్రమాదాన్ని తాకినంత భయంతో వెనక్కి వెళ్ళాను. వెంటనే వెనక్కి తిరిగాను. భయంతో గస పెడుతూ గడకర్రలా నిలబడిపోయాను. నన్ను భయం ఎంతగా అవహించిందంటే అసలెలాంటి ఆలోచన చెయ్యడానికీ వల్ల కాలేదు. దాదాపు స్పృహతప్పినంత పనైంది.
నేను స్వతహాగా పిరికివాణ్ణి కాదు. అందుకే త్వరగా కోలుకున్నాను. "ఇదంతా భ్రమ అయ్యుంటుంది. అంతే." అనుకున్నాను. జరిగిన ప్రహసనాన్ని పునరాలోచుంచుకున్నాను. ఇలాంటి సందర్భాలలో ఆలోచనలు రెక్కలు కట్టుకోని ఎగురుతాయి.
నాకు ఏదో చిత్తభ్రమ కలిగింది. అందులో అనుమానమూ లేదు. నా మెదడు సరిగానే ఆలోచిస్తోంది, సక్రమంగానే పనిచేస్తోంది. మెదడు దెబ్బతిని ఇలా ఊహించే అవకాశం ఏమాత్రమూ లేదు. నా కళ్ళే మోసపోయినట్లున్నాయి. వాటికి ఏదో భ్రాంతి వల్ల అలాంటి దృశ్యం కనపడింది. సామాన్యులు ఇలాంటివి చూసే ఏవో మాయలు మంత్రాలు అనుకుంటారు. నా కళ్ళకి ఏదో పిరికి పొర కమ్మి ఇలా జరిగింది. అంతకన్నా ఏమీ లేదు. నా కళ్ళు బహుశా భారంగా వుండివుంటాయి.
కొవ్వొత్తి వెలిగిద్దామని మంట వున్న గూటి దగ్గర వంగినప్పుడు నా చేతులు వణకడం గమనించాను. ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో తాకినట్లైంది. అదిరిపడి ఎగిరి అవతల నిలబడ్డాను.
నా మనసు ఏమాత్రం నెమ్మదిగా లేదని అర్థం అయ్యింది.
నాలుగడుగులు అటూ ఇటూ వేసి రెండు మూడు పాటలు కూనిరాగం తీశాను. తరువాత తలుపు మూసి డబుల్ లాక్ చేశాను. ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఎవరూ లోపలికి రారని నిర్థారించుకున్నాను.
తరువాత ఒక చోట కూర్చోని చాలసేపూ నా సాహసం గురించి ఆలోచించాను. తరువాత దీపం ఆర్పేసి మంచం మీద పడుకున్నాను. కొన్ని నిముషాల పాటు అంతా బాగానే వుందివెల్లకిలా పడుకోనున్నాను. ఆప్పుడే ఒక్కసారి గది మొత్తాన్ని పరిశీలించి చూడాలన్న కోరిక నన్ను ఆవహించింది. కొద్దిగా పక్కకి తిరిగాను. మంట దాదాపుగా ఆరిపోయినప్పటికీ మిగిలి వున్న నిప్పులు పల్చటి కాంతిని నేలమీద పరుస్తున్నాయి. సరిగ్గా నేను మనిషిని ఊహించుకున్న కుర్చీ దగ్గరగా వెలుగు పడుతోంది.
వెంటనే అగ్గిపుల్ల వెలిగించాను. నాదే పొరపాటు. అక్కడేమీ లేదు. అయినా సరే లేచి కుర్చీని మంచం వెనుకగా దాచిపెట్టి మళ్ళీ చీకటిలో నిద్రపోవాలని ప్రయత్నించాను. ఒక అయిదు నిముషాలు అన్నీ మర్చిపోయాను కానీ అంతలోనే ఒక కల వచ్చింది. అంతకు ముందు జరిగిన సంఘటన మళ్ళీ కళ్ళముందు జరిగినంత స్పష్టంగా కనిపించింది. అదిరిపడి లేచాను. కొవ్వొత్తిని మళ్ళీ వెలిగించి అలాగే మంచం మీదే కూర్చుండిపోయాను. ఇక నిద్రపోయే సాహసం మళ్ళీ చెయ్యలేదు.
ఎంత ప్రయత్నించినా రెండుసార్లు కొన్ని నిముషాల నిద్ర కమ్మేసింది. అలా నిద్ర పట్టిన రెండుసార్లూ అదే దృశ్యం కనపడింది. ఇక నాకు పిచ్చిపట్టడం ఖాయమని అనుకున్నాను. తెల్లవారిన తరువాత నా భ్రమలన్నీ తొలగిపోయాయని  అనుకోని ధైర్యంగా మధాహ్నందాకా నిద్ర పోయాను.
అయినదేదో అయిపోయింది. నాకు జ్వరం వచ్చినట్లుంది. లేకపోతే అలాంటి పీడకలు ఎందుకొస్తాయి? ఏమైందో మరి. మొత్తానికేదో అనారోగ్యం. ఏది ఏమైనా నేనొక శుఠనని అనుకున్నాను.
సాయంత్రం హాయిగా గడిపాను. రాత్రి మంచి రెస్టారెంట్లో భోజనం చేసి నాటకం చూడటానికి వెళ్ళాను. అది అయిపోయిన తరువాత ఇంటికి బయల్దేరాను. ఇల్లు దగ్గరపడుతున్న కొద్దీ ఏదో తెలియని వ్యాకులత కలిగింది. మళ్ళీ అతన్ని చూస్తానేమో అని భయం వేసింది. నాకు అతనంతే భయంలేదు. అతను వుండటం వల్ల నష్టంలేదు. అసలు అతను వున్నాడని కూడా నేను నమ్మడం లేదు. కానీ మళ్ళీ మోసపోతానని భయం వేసింది. మళ్ళీ భ్రాంతి కలుగుతుందోనని భయం వేసింది. భయం కలిగించే సంఘటనని ఊహిస్తానేమో అని భయం వేసింది.
దాదాపు గంటసేపు అక్కడక్కడే పచార్లు చేశాను. మరీ బుద్దిలేనివాడిలా ప్రవర్తిస్తున్నానని అనిపించి ఇంటికి వెళ్ళాను. పైకి మెట్లు ఎక్కలేక ఎక్కుతూ, అడుగడుక్కీ బలంగా ఊపిరి తీస్తూ పైకి వెళ్ళాను. నా గది తలుపు దగ్గర పది నిముషాలు నిలబడ్డాను. ఉన్నట్టుండి ఏదో తెలియని ధైర్యం వచ్చేసింది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. తాళం తెరిచి చేతిలో కొవ్వొత్తి ఉంచుకోని లోపలికి అడుగుపెట్టాను. నా బెడ్రూం తలుపుని ఒక్కసారి బలంగా కొట్టాను. అది అప్పటికే సగం తెరుచుకోని వుంది. భయం భయంగా అటు వైపు చూశాను. అక్కడ ఏమీ లేదు. హమ్మయ్య..!! ఎంత ఉపసమనం కలిగిందో! ఎంత సంతోషం కలిగిందో! ఏదో విముక్తి కలిగినట్లైంది. ధైర్యంగా టకా టకా మంటూ అటూ ఇటూ నడిచాను. అయినా ఇంకా ధైర్యం పూర్తిగా కలిగినట్లు లేదు. వెనక్కి తిరగాల్సిన చోట గెంతినట్లు ఎగిరి తిరుగుతున్నాను. గది మూలల్లో వున్న నీడలు ఇంకా నాలో కలవరం కలిగిస్తున్నాయి.
రాత్రి కూడా నిద్ర సరిగ్గా పట్టలేదు. ఏవేవో శబ్దాలు నేనే ఊహించుకున్నాను. అతను మళ్ళీ కనపడలేదు. అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నాను. కానీ అప్పటి నుంచి రాత్రిళ్ళు ఒంటరిగా వుండాలంటే భయం మొదలైంది. వ్యక్తి అక్కడే ఎక్కడో వున్నాడని, నాకు దగ్గరగానే వున్నాడని, కనపడకుండా తిరుగుతున్నాడనీ నా అనుమానం. ఒక వేళ కనపడితే మాత్రం ఏమౌతుంది? నేను అలాంటివి నమ్మను కదా? అసలు అక్కడేమీ లేకపోతే కనపడేదేంటి?
అయినా సరే దాని వల్ల నా మనసులో గుబులు తీరటంలేదు. ఎప్పుడూ అదే ఆలోచన. కిందకి వేలాడుతూ ఉన్న కుడి చెయ్యి. ఎడమ వైపుకు నిద్రపోతున్నట్లు వంగిపోయిన తల - అమ్మో, నాకు అదంతా తలుచుకోవాలని కూడా లేదు. అయినా సరే అదే ఆలోచన మళ్ళీ కమ్మేస్తుంది. అతని కాళ్ళు - మంటకి దగ్గరగా..!!
అతను నన్ను వెంటాడుతున్నాడు. ఇది చాలా తెలివితక్కువ ఆలోచనలాగుంది. అసలు ఎవరతను? ఎందుకు వెంటాడుతున్నాడు? అసలతను లేనే లేడు కదా? ఆహా.. వున్నాడు..పిరికితనంతో నేను కల్పించుకున్న భ్రమల్లో వున్నాడు! నా భయంలో వున్నాడు! వాడు.. అబ్బ చాల్లే వాడి గురించి..!!
ఇదీ పరిస్థితి. నాతో నేనే తర్కించుకుంటాను. అలాగైనా కాస్త ధైర్యం కలిగి నిటారుగా నిలబడాలని ప్రయత్నం. అయినా సరే ఇంట్లో నేను ఒంటరిగా వుండలేను. అతను అక్కడే వున్నాడని నాకు తెలుసు. కాని మళ్ళీ నాకు కనపడడు. అదికూడా తెలుసు. అదంతా అయిపోయింది. కానీ అసలంటూ అక్కడే వున్నాడు కదా? కనీసం నా ఊహల్లోనైనా వున్నాడు కదా? అతను అదృశ్యంగానే వుంటాడు. కానీ వుంటాడు. తలుపు వెనకాల వుంటాడు. బట్టల బీరువాలోపల వుంటాడు. కబోర్డ్లో వుంటాడు. మంచంకింద వుంటాడు. చీకటిగా వుండే ప్రతిచోటా వుంటాడు. నేను తలుపు తొలగించి చూసినా, బీరువా తెరిచినా, కొవ్వొత్తి తీసుకోని మంచం కిందో, మరో చీకటి ప్రదేశంలోనో వెతికాలని ప్రయత్నించినా అక్కడ వుండడు. మాయమైపోతాడు. నాకు మాత్రం నా వెనుకే వున్నట్లుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే నాకు కనపడకుండా పోతాడాని ఖచ్చితంగా తెలుసు. అయినా చూస్తాను. కనపడడు. ఇంక ఎప్పటికీ కనపడడు. కానీ ఎప్పుడూ నా వెనకే వుంటాడు. మీకు పిచ్చిగా అనిపించచ్చు. భయంకరంగా అనిపించచ్చు. కానీ నా చేతుల్లో ఏమీ లేదు. అది అంతే.
కానీ నాతో ఇంకెవరినా వుంటే? - ఇద్దరం వుంటే? - అప్పుడు ఖచ్చితంగా అతను వెళ్ళిపోతాడు. ఇంక అక్కడ వుండడు. ఎందుకంటే నేను ఒంటరిగా వున్నాననే కదా అతను వచ్చాడు.