మంత్రిగారి సమాధి (బహుమతి కథ)

(స్వప్న మాసపత్రిక జన్మదిన హాస్యకథల పోటీలో మొదటి బహుమతి పొంది, ఆగష్టు 2011 సంచికలో ప్రచురితమైన కథ)


ఇప్పటికి నలభై ఏళ్ళైంది, స్మశానంలో నేను వుండబట్టి. స్మశానంలో వున్నానంటే నేనేదో శవాన్నో, దయ్యాన్నో అని మీరు అనుకుంటున్నారేమో... స్మశానం అంటే సమాధులు, శవాలు, దయ్యాలే కాకుండా మనుషులు కూడ వుంటారని మీ గుర్తుకు రాకపోవటం ఏమంత ఇసిత్రమేమీ కాదు. మీ తప్పూ కాదు. అయ్యా, నన్ను కాటికాపరి అంటారు. నా బతుకు, జీవితం అంతా శవాలు, సమాధుల్లోనే వుంది. పది మంది మంచి కోరుకోవాల్సిన మానవ పుటక పుట్టినా, పాడు కడుపుకోసం పది మంది చస్తే బాగుండు అని కోరుకోవాల్సిన బతుకు నాది. ఏం చేస్తాం.. అట్టా పుట్టింఛాడు దేముడు.
సరే, ఇంతా నేను చెప్పొఛ్ఛేదేమిటంటే మొన్న నాలుగు రోజుల క్రితం నా అరవై ఏళ్ళ జీవితంలో చూడని రెండు ఇసిత్రాలు చూశాను నేను. అయ్యి ఎట్టాటివంటే మీ లాంటి పెద్దమనిషికి చెప్పకుండా వుండలేనటువంటివి. నా సంగతి చెప్పనే చెప్పాను కదా.. స్మశానంలో వుండే నాబోటోడికి మాట్టాడుకునేదానికి ఎవడు దొరుకుతాడు? అందుకే మీకు చెప్పుకుంటున్నా..
నాలుగు రోజుల క్రితం తెల్లవారేటప్పటికి చూద్దును కదా స్మశానానికి ఉత్తరం వైపు వున్న గోడ కూలిపోయి వుంది. కూలి పోవడం అంటే కూలిపోవడం కాదు.. ఎవరో జాగర్తగా గడ్డపారతో కొట్టి కూల్చినట్టు చివర నించి చివరదాక ఖాళీగా వుంది.
రాత్రి తెల్లారేసరికి గోడ ఎట్టా కూలిందిరా?అని మీరనచ్చు..సరే ఎవడో కూల్చాడనుకో... అప్పుడు నువ్వేం చేస్తున్నావ్?అని కూడా మీరు అడగచ్చు. ధర్మప్రభువులు మీరు అడగకపోతే వూర్లొ వున్న పెద్ద మనుషులు అయినా అడుగుతారు. నేనేం సమాధానం చెప్పేది? ఒక వర్షమా, ఒక పిడుగా ఒక భూకంపమా? ఏదీ లేక పాయే...!! రాత్రి నాలుగు గుటకలు సారా తాగిన మాట నిజమే కానీ, విషయం నేనే ఎట్టా చెప్పేది. నేను చెప్పినా చెప్పక పోయినా, తాగి తొంగున్నావట్రా?అని అడగకుండా వుంటారా అని అనుమానం వచ్చేసింది. ’తాగుబోతోడివి నువ్వు ఈడ వుండద్దు ఫోఅంటారేమో అని భయపడ్డాను. కానీ అదేందో ఇచిత్రం. ఒక్క పెద్దమనిషీ విషయమే అడగలేదు. అటు దిక్కుకు వచ్చినా గొడ ఎంక చిత్రంగా చూడనైనా చూడలేదు. అదేం ఇచిత్రమో నాకర్థంకాలా..!!
అదట్టా వుండనీయండి.. అసలు గోడ కూలగొట్టినోళ్ళు లోపలికి జొరబడి ఏం చేశారు అనేది ఇంకో ప్రశ్న. సమాధినో తొవ్వి లోపల శవాన్ని ఎత్తుకెళ్ళారా? ఎత్తుకెళ్ళి మాత్రం ఏం చేస్తారు? బయట తిరిగే జనాలమాదిరి శవాలు ఏడువారాల నగలు, పర్సులో డబ్బులు పెట్టుకోని తొంగోరు కదా? వున్న గుడ్డలు కూడా చివికి చివికి చిరుగులు పట్టి వుంటాయి. ఇంక శవాన్ని తీసుకెళ్ళి చేతబడులో, మాంత్రికం పనులో చేశారేమో అని అనుకుందామంటే ఇంత వరకు అట్టాటివి ఇనటమే కానీ, చూసింది లేదు. మా అయ్య చెప్పేవాడు, అఘొరాలు, తాంత్రికులు స్మశానాల్లో, శవాలదగ్గర పూజలు చేత్తంటారని. పుట్టి బట్టకట్టిన తర్వాత ఇంత వరకు అట్టాంటాళ్ళని చూసినట్టు గమనమే లేదు. ఎందుకైనా మంచిదని సమాధి సమాధి తవిడి తవిడి చూసినా... గుట్ట గుట్ట తట్టి తట్టి వెతికినా.. ఏడా అట్టాటి జాడ అగపడలేదు.
ఇంక రేతిరి ఎందుకైనా మంచిదని చుక్కేసుకోకుండా అట్టాగే కూచోని ఏం జరగతదా అని ఆత్రంగా చూస్తా వున్నా. అప్పుడే నేను జెప్పిన రెండో ఇచిత్రం నా కళ్ళబడింది.
ఎవడో మనిషి.. కూలిపోయిన ఉత్తరం గోడ కొసాన వున్న నల్లరాయి సమాధి మీద కూర్చోని వున్నట్టు గోచరమైంది. దయ్యమో భూతమో అయ్యుంటుందని నాకనిపించలేదు. ఎందుకంటారేమే.. మూడు తరాలుగా పని చేస్తా వున్నాము. మా తాత గాని అయ్యగాని దయ్యాలు వుండాయా లేదా అనే మాట ఇలావరిగ్గా ఎప్పుడూ చెప్పనే లేదు. “కోరికలు తీరకపోతే దయ్యమై పుడతార్రాఅన్నాడు నాయన ఒకసారి కల్లుతాగి. అయితేనువ్వు జూసినావా నాయనాఅంటేఒక్కటి గూడా చూల్నేదన్నాడు. - “అందరూ కోరికలు తీరాకే చస్తన్నారు గావాల్నఅనుకోని నేను గమ్మునే వుండిపోయినా. ఇంక అట్టాటప్పుడు ఆలోచన నాకెట్టా వస్తాది?
ఎవుర్రా అదీ..” అని అరిచినా. సమాధానం రాలా.. “ఎవురంటే పలకేందిరా..” అన్న ఇంకా గట్టిగా. మనిసి ఎవుడో గాని, విన్నా ఇననట్టే అటు తిరిగి అట్టాగే కూర్చోనున్నాడు. కనీసమంటే తల కూడా తిప్పలా. చేతి కర్ర అందుకోని, టార్చిలైటు వేసుకుంటా చివరికంట పొయినా. “ఎవర్రా.. ఎవరూ..” అని అంటూనే వెళ్ళా గాని సమాధానం మటికి రాలా. దగ్గరకి పోయి మినిషిమీద లైటు వేశా. ఏభై ఏళ్ళ పెద్దాయన, ముఖంలో దిగులుతో కూర్చోని వున్నాడు.
ఎవరు బాబయ్యా.. పిలత్తంటే పలకరేంది..” అన్నా. ఆయన తలెత్తి చిన్నంగా చెప్పాడు.
నేనెవరో చెప్తా గానీ.. భయపడకూడదు..” అన్నాడు.
నా స్మశానంలో నాకు భయమేంది.. ఏం చెప్తావో చెప్పు...” అన్నాను కోపంగా.
నేను.. దయ్యాన్ని.. ఇదుగో ఇదే నా సమాధి..” అన్నాడు నల్లరాయి సమాధి చూపిస్తూ. నమ్మాల్నా లేదా అని చానా సేపు ఆలోచించినా.
నేను చెప్పేది నిజం.. నేను నాలుగు నెలల క్రితం చచ్చిపోయిన మినిష్టర్ పాపయ్యనిఅన్నాడు నల్లరాయి మీద చెక్కిన అచ్చరాలు చూపిస్తూ. అక్కడేమి రాసుందో తెలియదు కానీ, నాలుగు నెలల క్రితం ఎవరో మినిష్టర్ గారు సచ్చి మా స్మశానానికి వచ్చింది మాత్రం నిజమే. యాళ ఒకటే జనం... తొక్కుకుంటూ తోసుకుంటూ అంతా ఆగం ఆగం జేసినారు. నాలుగైదు గుట్టల్ని తొక్కి పాడు జేస్తే మళ్ళీ సరి జెయ్యడానికి నాకు రెండు రోజులు పట్టింది. అయితే అందరూ తలా అంత ఇవ్వడంతో వారం పనిజేస్తే వచ్చే డబ్బులు ఒక్కరోజే వచ్చినాయి.
భలేటోడివేనయ్యా.. మినిస్టేరునంటావు.. అంత డబ్బులు వుండాయి కదా నీ కాడ.. ఇంకా తీరని కోరికలుండాయా.. ఇట్టాగ దయ్యమై వచ్చావు..” అనడిగా. నేను భయపడకుండా నిలబడేసరికి మినిస్టేరు దయ్యం గారికి ఆశ్చర్యం వేసింది. మాటే చెప్పి అన్నాడు
నాలుగు నెలల నించి ప్రశాంతంగానే వున్నా.. నిన్న రాత్రే మెలుకువ వచ్చింది.. ఎవరో నా పక్కనే ఖణ ఖణా మని కొడుతున్నట్టు అనిపిస్తే లేచి కూర్చున్నా... పక్కన చూస్తే ఇదుగో గోడ పడగొడతా వున్నారు..” చెప్పాడు.
ఇదేం ఇచిత్రం.. సచ్చినోడికి కూడా ఇనపడేట్టు కొడితే.. వూరకే మందు కొట్టి పడుకున్నానే... నాకెట్టా ఇనపళ్ళేదు.” అన్నాను నేను.
ఇనపడకపోతే ఏమైంది.. ఇప్పుడు కళ్ళ ముందే కనపడుతోంది కదా..” అన్నాడు.
సరే సామీ.. ప్రాణమన్నాక పోకుండా వుంటదా గోడన్నాక పడకుండా వుంటదా.. దానికి నువ్వేమిటికి ఇదైపోతున్నావు..” అన్నాను నేను.
గోడ పడిపోలేదు.. కూల్చారు.. చూడు గోడ కొట్టేసిన తరువాత ఇటుక, మట్టి కూడా మిగలకుండా ఎత్తుకెళ్ళారు..” చెప్పాడాయన.
అవును సామి.. నాగ్గూడా ఇట్టాటి అనుమానమే వచ్చింది.. అయితే ఇట్టాగ స్మశానం గోడ కూల్చేటికి ఎవరికి అవసరం వుండాది.. అదే అర్థంకాకుండా వుండాదే..” అన్నాను ఆలోచిస్తా..
అవన్నీ చెప్తాను కానీ, నాకో సహాయం చేసి పెడతావా..?” అడిగాడు.
అట్టాగే సామీ.. అయినా నీ అంత పెద్దాయనకి నేను జేసి పెట్టేదేముంటాది..” అన్నాను పక్కనే కూర్చుంటూ.
నేను బతికుంటే, పదవిలో వుంటే ఇవన్నీ ఒక్క లెక్కలో తీర్చేసేవాణ్ణి.. అందుకే నువ్వే సాయం చెయ్యాలి..” అన్నాడు.
అట్టాగే అన్జెప్తున్నా గదా.. అదేందో చెప్పు సామీ..”
ఏం లేదు.. ఇక్కడ గోడ కూలిపోయిన విషయం నువ్వు వెళ్ళి వూర్లో పెద్ద మనుషులందరికి చెప్పాలి..” హడావిడిగా చెప్పేడయన.
నాను జెప్పేదేంది సామీ.. పెద్దమడుషులంతా రోజూ ఇదే దిక్కు తిరగతావుంటారు.. అందరూ చూశారు.. ఇంగ నేను పోయి జెప్పేదేంది..??” అనడిగా బీడీ ముట్టించుకుంటూ. దయ్యాలకు నిప్పు చూస్తే భయమని మా నాయనమ్మ అనేది. మినిస్టరు దయ్యానికి పట్టింపు లేనట్లుంది, ఆయన మాత్రం తన ధోరణిలో చెప్పుకుంటా పోతన్నాడు
తెలిసినా ఎవ్వరూ వచ్చి నిన్నడగలేదా..?”
లేదు.. సామీ అదే ఇచిత్రంగా వుంది..”
ఇందులో ఇచిత్రం ఏముంది.. అందరికి అంది వుంటాయి..”
ఏం అందాయి సామీ..”
డబ్బులు రా డబ్బులు.. నీకర్థం కాదులే.. మీడియా.. మీడియాని పిలిచి..”
ఏంటి దొరా? వీడియోనా..”
వీడియోకాదురా.. మీడియా.. పేపరు వాళ్ళు, టీవీ.. వాళ్లని కలువు.. ఇట్లా గోడ కూలిందని పేపర్లో, టీవీలో వ్రాయించు..” ఆవేశంగా అరిచాడు.
ఇంత సిన్న ఇశయానికి పేపర్లో ఎందుకు సామీ..” అన్నాను నేను చప్పరిస్తూ.
ఇది చిన్న విషయం కాదురా.. గోడని ఎందుకు కూల్చారో తెలుసా? స్మశానాన్ని కబ్జా చేస్తున్నారు.. నిన్న గోడ అయ్యింది.. రేపెప్పుడో నా సమాధి కూలుస్తారు రా.. నాకు మిగిలింది కాస్త స్థలమే.. అది కూడ లేకపోతే చెట్టుకో వేలాడాలి.. నీకు పుణ్యముంటుంది.. ఎలాగైనా ఆపించరా..” అంటూ ఏడ్చేసినంత పని చేసిందా మినిస్టేరు దయ్యం.
అయ్యా. తవరు చెప్పింది ఇంటే వూరక భయపడుతున్నారని అనిపిస్తంది.. అట్టాటిది ఏమి లేదు..”
నీకు తెలుసా నాకు తెలుసా.. వచ్చిన వాళ్ళని చూశావా నువ్వు.. వాళ్ళంతా నా దగ్గర పని చేసినోళ్ళే.. వాళ్ళు చేసే పనేమిటో, ఎలా చేస్తారో నాకు బాగా తెలుసు.. నా మాట విను.. నా సమాధిని కాపాడు..” దణ్ణం పెట్టి మాయమయ్యాడు దయ్యం సామి..
అయ్యా అదీ కథ.. నేను విషయం పెద్దోళ్ళకి జెప్పినా వినీ వినట్టు వూరుకుంటున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటున్నారు. వూర్లో ఎవరికి చెప్పినా నవ్వుకోని, మినిస్టేరుకి బాగా శాస్తి జరిగిందని అంటున్నారు. తవరేమన్నా ఆయన సమాధి కాపాడేదానికి ఏమన్నా చేస్తారా..??
***