కోయిల కోసం వసంతం

పిల్లలు స్కూల్ కి, ఆయన ఆఫీస్ కి వెళ్ళారు. వాళ్ళ బాక్సుల్లో పెట్టడానికి వంట చేసేశాను కాబట్టి అట్టే పని కూడా లేదు. కాఫీ కలుపుకోని బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. చుట్టూ కీకారణ్యం – అదే కాంక్రీట్ జనారణ్యం. మా ఇంటికి నాలుగు భవనాల అవతల కనిపించే రోడ్డు మీద దూసుకుపోతున్న వాహనాలు. అంతా ఆఫీసులకీ, వుద్యోగాలకి, స్కూళ్ళకీ, కాలేజీలకీ పెడుతున్న పరుగులు. పొరపాటున ఏదో ఒక వాహనం ఆగినట్టుంది, ఒక్కసారిగా అన్ని వాహనాలు గొంతు చించుకు కేకలు పెడుతున్నాయి. రకరకాల గొంతులు, రకరకాల శబ్దాలు... మోత. రణగొణధ్వని.

ఒక్క క్షణం ఆగితే వీళ్ళ సొమ్మేం పోయింది? ఆ ఆగిపోయిన బండివాడు ఏమన్నా సరదాగా ఆగేడా? ఆ బండీ ముందుకెళ్ళాల్సిందేగా? ముందున్న బండి కదిలాక ఎలాగూ అందరూ కదలక తప్పదు. ఇంతలోనే హారన్ గొంత్తెత్తి గోలపెట్టాలా?

బండ్లు మళ్ళీ కదిలాయి. అంతా ఒక రూల్ ప్రకారం... ముందే నిర్ణయించుకున్న దారిలో ముందుకు... ముందుకు. ఏమిటో... ఎన్నో సంవత్సరాలు ఒకే రోడ్డు వెంట, ఒకే దారిలో అదే పనిగా తిరుగుతుంటే విసుగనిపించదూ? ఎప్పుడూ అవే భవనాలు, అదే ట్రాఫిక్ కానిస్టేబుల్, ఆ సిగ్నల్ దగ్గర అదే ముసలాయన చెయ్యి చాస్తూ... ఎప్పూడూ అదే రొటీన్ రూటూ... రొటీన్ బ్రతుకు. కనీసం ఒక్కసారన్నా ఎప్పుడూ వెళ్ళే దారిని వదిలి వేరే దారిలోకి మలుపు తిప్పారా? అసలు ఆ మలుపు తిప్పితే ఏముందో ఎవరికైనా తెలుసా? ముందే నిర్ణయమైపోయిన దారిలో విసుగూ విరామం లేకుండా అలా పోతూ వుండకపోతే ఒక్కసారైనా దారి మార్చి చూడకూడదూ...!!

కాఫీ అయిపోయి లేవబోతుంటే ఎక్కడి నుంచో కోయిల గొంతు పలకరించింది. ఎడారిలో నీటిబుగ్గ పుట్టినట్టు పచ్చదనం మచ్చుకైనా కనిపించని ఈ ఇటుకరాళ్ళ గూళ్ళ మధ్యలో కోయిల కూడా ఒకటుందా? “కూ... కూ..” మళ్ళీ కూసిందది. ఇది ఇంకా ఫిబ్రవరి నెలే... ఇంకా దాదాపు నెలరోజులుంది ఉగాదికి. తొందరపడి కూసే కోయిల అని ఎవరో కవి అన్నట్టు, ఇదేనా ఆ కోయిల? వసంతాగమనానికి ముందే గొంతెత్తి కూస్తోంది. లేకపోతే వసంతార్భాటాలన్నీ చూడాలన్న తపనతో ఇంకా రాలేదే అని కోప్పడుతోందా? ప్రియ వసంతుణ్ణి రావేలా అని పిలుస్తోందా? అదే నిజమైతే అసలు వసంతం వచ్చాక కోయిల కూయాలా లేక కోయిల పిలిచిందని వసంతం వస్తుందా?

కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది పనమ్మాయి సుమ. నా చేతిలో గ్లాసు అందుకోని నేరుగా సింక్ దగ్గరకు వెళ్ళి పని మొదలుపెట్టింది. నేనేమీ చెప్పలేదే? అసలు మాట్లాడనేలేదే? రొటీన్.. రొటీన్... ఎప్పుడూ అదే సింక్ అవే గిన్నెలు.. అదే పని. నేను మళ్ళీ బాల్కనీలోకి వచ్చాను. కోయిల గొంతు వినపడ్డటంలేదు. వసంతానికి ఇంకా కొంతకాలం ఆగాలని తెలుసుకుందో, లేక పూత పూసి పిందెలెయ్యడానికి చెట్లు లేని చోటుకి వసంతుణ్ణి ఆహ్వానించడమే తప్పని తెలుసుకుందో... బహుశా ఏ చిక్కటి అడవికో వసంతానికి దారి చూపిస్తూ ఎగిరిపోయి వుంటుంది. మళ్ళీ కార్లు, బస్సులు, స్కూటర్లు... వాటి వాటి చిత్ర విచిత్రమైన హారన్లు.. గోల గోలగా. ఇంట్లో సింకులో గిన్నెలు తీసి కడిగి ఎత్తిపడేస్తున్నట్లు చప్పుడు.

“సుమా... గిన్నెలు జాగర్తగా పెట్టు... పడెయ్యద్దు... గోలగోలగా” అరిచాను నేను. అటునుంచి సమాధానం లేదు. చప్పుడు మాత్రం ఆగింది. సుమ పూర్తి పేరు సుమధార. “అదేం పేరు?” అన్నాడు శ్రీధర్ మొదటిసారి వినగానే.

“ఆ పేరుకేం... అంత చక్కగా వుంటే?” అన్నాను.

“అది కాదు... పనెమ్మయి పేరులా లేదని..”
ఏం చెప్పేది..?? అదేమన్నా భారత రాష్ట్రపతి సంతకం చేసిన చట్టమా – పనెమ్మాయి మంచి పేరు పెట్టుకోకూడదని? ఎల్లమ్మ, పుల్లమ్మ అయ్యింటే అదొక తృప్తి మనకి... మనకి కావాల్సింది మొనాటనీ... మారిస్తే తట్టుకోలేం. ఏం చేస్తాం అందరివీ అవే స్టీరియోటైపు మనసులు, మనస్తత్వాలు.

పనైపోగానే సుమ వెళ్ళిపోయింది. నేను ఏం చెయ్యాలి? టీవీ పెట్టాను. పెట్టానన్నమాటే కానీ చూద్దామంటే ఉత్సాహం కూడా రావటం లేదు. పేరుకు నలభై పైనే తెలుగు చానల్స్ కానీ ఏం లాభం? అవే సీరియల్స్ అవే కథలు, అవే సినిమాలు. ఇప్పటికి నలభై సార్లు వేసినా, అదే సినిమా మళ్ళీ “సూపర్ హిట్ మూవీ” అని, మళ్ళీ మళ్ళీ వెయ్యడానికి ఈ చానల్స్ ఆలోచించవా అనిపిస్తుంది. పండగపూట కూడా చద్దన్నం పెట్టకపోతే... ఇంతింత డబ్బులున్నాయి కదా, సొంతగా ఈ చానల్ వాళ్ళే ఒక సినిమా తీసి చూపించచ్చు కదా? ఇంత వరకూ ఎవరూ చూడని సినిమా అని ప్రకటించచ్చు కదా? ఊహు... అలా చెయ్యరూ... అందరూ ఇరవై సార్లు అదే చానల్లో చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూపిస్తే చూస్తారు. ఇంత వరకూ చూడని సినిమా అంటే అదెట్లా వుంటుందో అని భయం మనకి.

టీవీ ఆపేసి, ఇల్లు సర్దే నెపంతో అటు సోఫా ఇటు, ఇటు కుర్ఛీలు అటూ మార్చి చూశాను. కిటికీకి అడ్డంగా వున్న సోఫా పక్కకి జరిపితే గదిలో గాలీ వెలుతురు పెరిగాయి. గది మధ్యలో ఖాళీ స్థలం కూడా పెరిగింది. మార్పు... ఒక్క చిన్న మార్పు... మరింత మేలైన దిశగా ఒక్క అడుగు. ఇంత మాత్రం అర్థం ఛేసుకోరే ఎవరూ?

టేబుల్ మీద కొడుకు రామ్ పుస్తకాలు పడివున్నాయి. మేథ్స్ మోడల్ పేపర్... పరాగ్గా నాలుగు కాగితాలు తిరగేస్తే అర్థం అయ్యింది. మొదటి సెక్షన్లో పది ప్రశ్నలు ఇస్తారు, అందులో ఆరు వ్రాయాలి. తరువాత అయిదు ప్రశ్నలు ఇస్తారు అందులో రెండు... ఏమిటిది? ఎందుకో మూస? వేరే రకంగా పరిక్ష పెట్టకూడదా? ఒక వేళ పెడితే ఇప్పుడు ర్యాంకు పొందిన వాళ్ళుగా పేపర్లకి, కోచింగ్ సెంటర్ల పోస్టర్లకి ఎక్కిన పిల్లలందరూ అంతే మార్కులు తెచ్చుకోగలరా? రామ్ మాత్రం పరీక్ష తప్పుతాడు. చదువు కూడా అదే మూసలో పడిపోయింది. ఇలాంటి పరీక్షకి ఎలా చదవాలో చెప్పే కోచింగ్ సెంటర్లు, పుస్తకాలు, గైడ్లు, మోడల్ పేపర్లు... అంతా అదే రొటీన్ మూసలోకి తోసేసేందుకు ఏర్పరచుకున్న సాధనాలు. చుట్టూ గోడలు కట్టుకోని, కళ్ళకి గంతలు కట్టుకోని – ఇది ఇంతే అని నమ్మేసి నడిచే మనుషులం మనం.

రామ్ బాగా చిన్నప్పుడు జరిగినది నాకు ఇప్పటికీ గుర్తుంది. మొదటిసారి కొనిచ్చిన రంగులతో బొమ్మల పుస్తకంలో రంగులు వేస్తున్నాడు. వాళ్ళ నాన్న శ్రీధర్ యధాలాపంగా చూసి వెంటనే అన్నాడు –

“రామ్... ఏంటది? ఆకాశం ఎక్కడైనా గ్రీన్ గా వుంటుందా? బ్లూ కలర్ వెయ్యి..” అని.

“వెయ్యనివ్వండి... ఏదో ఒకటి... వాడు పేపర్ మీద పచ్చరంగు వేస్తే ఆకాశం ఏమన్నా మారిపోతుందా?” అన్నాను.

“నో.. నో.. రేపు స్కూల్లో కూడా ఇలాగే వేస్తే ఒక్క మర్కు కూడా రాదు..” అంటూ వాడి వైపు తిరిగి, “కమాన్... బ్లూ తీసుకో...” అంటున్నాడు.

“ఆకాశం బ్లూ అని నాకు తెలుసు నాన్నా... కాని ఒకవేళ గ్రీన్ వుంటే ఎలా వుంటుందా అని చూస్తున్నాను..” వాడు సంజాయిషీ ఇస్తున్నాడు. ఈ విషయంలో బహుశా నా ఆలోచనలే వాడికీ వచ్చినట్లున్నాయి. కానీ వాటిని ఎదగనిస్తే కాదా. ఆ రోజు ఆకాశం మళ్ళీ నీలం రంగులోకి మారింది.

స్వతహాగా రొటీన్ జీవితానికి అలవాటు పడినవాడు శ్రీధర్. ఒకరోజు బాక్స్ లో బ్రెడ్ సాండ్ విచ్ పెడితే.. “ఎందుకు ఇవన్నీ... ఎంచక్కా అన్నం, కూర, పెరుగన్నం పెట్టచ్చు కదా?” అంటాడు.

ఎప్పుడన్నా పిల్లాడికోసం నూడిల్స్, పాస్తా లాంటివి చేస్తే కూడా శ్రీధర్ తినడు. “నాకు ఇలాంటివి సయించవు..” అంటాడు.

ఎలాంటివి సయించవు? ఇటాలియన్ ఏదైనా సైంచవా? లేక ఇవి మాత్రమే సయించవా? అంటే నూడుల్స్ పాస్తా రెండూ ఒకే రకమైన రుచిలో వుంటాయనుకుంటున్నారా... అసలు ఒకసారైనా తింటే కదా తెలిసేది? మొదటిసారి తెచ్చినప్పుడు కూడా అదే మాట – “ఇలాంటివి నాకు సయించవు..” ఎలాంటివి? ఎలాంటివి సయించవో తెలుసా నీకు... ఇదంతా అడగాలనుకున్నాను. అడిగితే వచ్చే రొటీన్ జవాబులు వినలేక అడగలేదు.

సరే, ఎవరి జీవితాలు వారివి. కొందరికి ఇలాగే ఒక చట్రం గీసుకోని, గీచిన గిరి దాటకుండా బతకడమే ఇష్టం కావచ్చు కాక. కానీ తోటివారిని కూడా అదే గిరిలో ఇరుక్కోమనడం ఎంతవరకు సమంజసం?

“పెళ్ళైన దగ్గర్నుంచి మీరేమీ మారలే”దని నా ఫిర్యాదు. అసలెందుకు మారాలని ఆయన అనుమానం. ఏ మార్పూ లేని సంసారానికి పదిహేడేళ్ళు...!!

***

క్రితం రోజు ఆరేసిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెట్టను. బీరువాలో వున్న నా బట్టలన్నీ ఒకసారి చూసుకున్నాను. ఒక ముప్ఫైకి తక్కువ కాకుండా చీరలు, అయిదో ఆరో చుడీదార్లు, ఒకే ఒక జీన్స్ ప్యాంట్.

“ఏం మారలేదంటావు..?? చీరలు మాత్రమే కట్టాలి అనేవాణ్ణి చుడీదర్ వేసుకోడానికి పర్మిషన్ ఇచ్చాను కదా.. అది మార్పు కాదా?” శ్రీధర్ అడిగాడు ఒకసారి.

“ప్రపంచం అంతా మారిన తరువాత ఆఖరుగా మనం మారటం మార్పు కాదు శ్రీధర్... అది కంపల్షన్.. వేరే మార్గంలేక మారుతూ నేను కూడా మారాను అనుకోవడం అవివేకం..” అన్నాను.

“ఇప్పుడేమంటావు? బికినీ వేసుకోని తిరుగుతావా?” వెటకారంగా అడిగాడు.

“నేనేం ఈతల పోటీలకి వెళ్ళట్లేదు... వెళ్తే తప్పకుండా వేసుకుంటా...  ప్రస్తుతానికి మాత్రం ఒక జీన్స్ కొన్నాను..” చెప్పాను.

“వ్యాట్... నీ వయసెంతో తెలుసా? నువ్వు మాట్లాడేదానికి, నీ వయసుకి ఏమన్నా సంబంధముందా?” అన్నాడు ఆవేశంగా.

“అదే నేనూ అంటున్నాను... నేను మాట్లాడేదానికి, వయసుకి సంబంధం లేదు... జీన్స్ అంటే టీనేజర్స్ మాత్రమే వేసుకోవాలని రూల్ లేదు... నాకు నచ్చిందని కొన్నాను.... అన్నట్టు నీకు కూడా ఒకటి కొన్నాను..” చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను.

శ్రీధర్ జీన్స్ పేంట్ అతని బీరువాలో అన్ని బట్టలకి కింద స్థిరనివాసం ఏర్పరుచుకుంది. నా పేంట్ వుండటానికి పైనే వుంది కానీ, వేసుకునేందుకు అనుమతి రాలేదు. రెండు పేంట్లు బయట ప్రపంచం తెలియని బావిలో కప్పల్లా జీవితంలో ఏ మార్పు లేకుండా వుండిపోయాయి.

“నీకు ఎందుకు ఇంత పంతం? జరిగేదేదో బాగానే జరిగిపోతోంది కదా... ఎందుకు ప్రపంచాన్ని మార్చేదానిలా మాట్లాడుతావు?”  అడిగాడు ఒకరోజు.

ప్రపంచం మారాలంటే ముందు మనుషులు మారాలి శ్రీధర్... ఈ సమాజం, ఈ వ్యవస్థ, రాజకీయం, మన సినిమాలు, విద్యా వ్యవస్థ అన్నీ మారాలని మనకీ తెలుసు. కానీ ఆ మార్పుని ఒక అడుగు ముందుకేసి ఆహ్వానించే ధైర్యం లేదు. అసలు నిజం ఏమిటంటే... మార్పు అంటే మనకి భయం. కొత్త అంటే భయం. అనుమానం... ఒక అపనమ్మకం. ఒక అలవాటు ప్రకారం చేసుకుంటూ పోవటం సులభం. కొత్తగా ఏదన్నా చేయాలంటే, చేస్తే ఏమౌతుందో అని భయం, నలుగురూ ఏమనుకుంటారో అని అనుమానం. చెయ్యగలనో లేదో అని అపనమ్మకం. ఎందుకులే మార్చడం అనో, నలుగురితో నారాయణ అనో, సో కాల్డ్ పరువు ప్రతిష్ట కోసమో ఇంకేదో... మరేదో... చిన్నప్పటి నుంచీ నువ్వూ నేర్చిన ఆచారాలు, నమ్మకాలు, నియమాలు, ఫార్ములాలు... ఇవేవి నిన్ను మారనివ్వవు.... మరొకరిని మారనివ్వవు..” ఆవేశంగా అనేసి నా గదిలోకి వెళ్ళిపోయాను.

శ్రీధర్ చాలాసేపు మాట్లాడకుండా నిలబడ్డాడు. ఎంతసేపు వున్నా పరిస్థితి మార్పు రాకపోవటంతో లేచి తను ఎప్పుడూ కాఫీ తాగే ఉడిపి హోటల్ కి వెళ్ళాడు. చెప్పానుగా... పరిస్థితిలో మార్పు లేకపోతే ఒక అడుగు ముందుకేసి మార్పుని మొదలుపెట్టే ధైర్యం, చొరవ అతనికి లేవు.

***

ఎదురుగా జీన్స్ పేంట్. శ్రీధర్ ఆఫీస్ నుంచి రావటానికి మరో అరగంట పట్టచ్చు. అప్పటికే ఇంట్లో అటు ఇటు మారిన సోఫా, కుర్చీలను చూసి ఖచ్చితంగా సణుగుతాడు. అయినా తప్పదు... నేను జీన్స్ పేంట్ తీసుకోని వేసుకున్నాను.

దూరంగా కోయిల మళ్ళీ కూసింది. వసంతం వస్తేనే కోయిల కూయలనేం లేదుగా... కోయిల కూసిందని వసంతమే ముందుకు వస్తుందేమో...!!

<***>
(నవ్య వీక్లీ, 15 అక్టోబర్ 2014)
Category: