ఇండోరుకు వీడ్కోలు మొదటిభాగం - సరాఫా

నాకు ఇందోరు నుంచి బదిలీ దాదాపు ఖరారైపోయింది. అసలు ఈ కార్పొరేట్ వుద్యోగాలే అంత. మా గురు మామయ్య కూడా ఇలాంటి కష్టాలవల్లే అనుకుంటా ఈ మధ్య కథలు చెప్పటంలేదు. విషయం ఏమిటంటే నేను ఈ కంపెనీలో చేరి ఐదొవ సంవత్సరం అవుతోంది.. ఐదొవ వూరుకి బదిలీ జరుగుతోంది. హైదరాబాదుతో మొదలెట్టి, చెన్నై, బాంబే మీదుగా ఇండోరు చేరుకోని ఇప్పుడు - మరో వూరు. అది ఏ వూరు ? త్వరలోనే చెప్తాను..!!


సరే ఇందోరు వదిలిపెట్టే ముందు ఇక్కడి విశేషాలు, దగ్గర్లో చూడదగ్గ ప్రదేశాలు (నేను చూసిన ప్రదేశాలు అని చదువుకోండి) గురించి ఓ రెండు మాటలు - కాదూ రెండు టపాలు చెప్పాలని ఈ టపా మొదలు పెట్టాను.మీకు తెలుసుగా ఇందోరు మధ్యప్రదేశ్‌లో వుందని.. వూరు చూస్తే రాజధాని నగరంలా వుంటుందికాని - రాష్ట్ర రాజధానికి దాదాపు 200 కి.మీ దూరం. మన కృష్ణా జిల్లాకి విజయవాడ ఎట్లాగో మ.ప్ర.కి ఇందోరు అలాగా. భోపాలులో అన్నీ గవర్నమెంటు ఆఫీసులేకాని ఒక్క మాల్ లేదు, ఒక్క మల్టీప్లెక్సు లేదు. అదే ఇందోరులో అయితే ఒక ఐదుకు తగ్గకుండా పెద్ద పెద్ద మాల్‌లు, ఒక నాలుగు మల్టీప్లెక్సులు వున్నాయి. ఇంకా చాలా పుట్టుకొస్తున్నాయి. హోటళ్ళు, కాలేజిలు ఏవి చూసినా భోపాల్‌కి కన్నా ఓ రెండాకులు ఎక్కువే. అందుకేనేమో ఇందోరుని మిని బాంబే అంటారిక్కడ.


ఇందోరు దేనికి ప్రసిద్ధి అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పగలిగేది "సేవ్" అని ఇక్కడ పిలిచే మన శనగపిండి కారాసు లాంటివి. ఇంకా రత్లామి సేవ్ అనీ, హీంగ్ సేవ్ అని రకరకాల వెరైటీలు కూడా దొరుకుతాయి. (ఆ మధ్య హైదరాబాద్‌లో ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో ఒక చోట ఇందోరి సేవ్ అమ్ముతుండటం చూశాను..) అదలా పక్కన పెడితే ఇందోరులో చిరు తిండ్లు కూడా చాలా ప్రసిద్ధి."చెప్పన్ దుకాణే" అని ఒక ప్రాంతం పేరు. అక్కడ యాభై ఆరు (చప్పన్ అంటే 56) దుకాణాలలో కేవలం చిరుతిండ్లు అమ్ముతారు - కచోరి, సమోస, సాండ్‌విచ్, పాని పతాషే (పాని పూరి), చోలె కట్లెట్, చోలే భతూరే... ఇలాంటి వుత్తరాది వంటకాలే కాక చైనీస్, సౌత్ఇండియన్ కూడ దొరుకుతాయి. సాయంత్రం ఆరునుంచి రాత్రి పదకొండుదాక వేడి వేదిగా అమ్మకాలు సాగుతుంటాయి.

అంతకన్నా ముఖ్యమైంది, ఇందోరు వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం రాజవాడ వెనక వున్న సరాఫా అనే ప్రాంతం. పగటిపూట ఇక్కడంతా బంగారు, వెండి నగల దుకాణాలతో కోలాహలంగా వుంటుంది. రాత్రి ఏడు దాటగానే ఒక్కొక్క దుకాణం మూతపడాగానే దాని ముందొక తాత్కాలిక షాపు తయారవుతుంది. చాలా వరకు బంగారం కొట్టుకు సంబంధించినవాళ్ళో, ఆ షాపు మెట్లని అద్దెకి తీసుకున్నవాళ్ళో ఇలాంటివి మొదలు పెడతారు. మునుపు రాత్రి మూడు దాకా నడిచే ఈ బజారు ఇప్పుడు పోలీసు ఆజ్ఞలకు పన్నెండు గంటలకే మూతపడుతోంది.


ఇందోరు ప్రజలు మరి భోజనం చేసి వస్తారో, ఇదే భోజనంగా వస్తారో కాని ఏ రోజు వచ్చినా ఇసుకేస్తే రాలని జనం వుంటారు. రకరకాల రంగు లైట్లు, అమ్మేవాళ్ళ అరుపులు, జనరేటర్ చప్పుళ్ళు, చిన్న పిల్లల బొమ్మలు అమ్మేవాళ్ళు వూదే పీకల కూతలు, ఇరుకు జనం మధ్యలోనించీ దూసుకెళ్తూ స్కూటర్ల హారన్‌లు.. అది రాత్రంటే నమ్మటం కష్టమే.


ఆ ప్రాంతంలో అడుగుపెట్టాక ఒక పది అడుగుల తరువాత కనిపించే "జోషి కా దహీ వడా" ప్రత్యేకమైంది, చెప్పుకోదగ్గది. "నాదేముది సార్.. నేను వడా అమ్మేది తక్కువ.. మాటలు అమ్మేది ఎక్కువ" అంటూ నవ్వుతాడుగాని, సదరు జోషిగారు చేసే దహీ వడా ఇంతవరకూ నేను తిన్న దహీ వడల్లోకెల్లా వుత్తమమైనది.


మనలాంటి వాళ్ళని చూడగానే "తెలుగా? తమిళా?" అని అడిగేస్తాడు. "తెలుగు" అనగానే "రండి కూర్చోండి.. దహీ వడా తింటారూ? ఎన్ని? ఒకటి రెండు మూడూ?" అంటాడు తెలుగులో వచ్చిన నాలుగు వాక్యాలు అప్పజెప్తూ. ఈ వడా మన తెలుగువాళ్ళు చేసే ఆవడ లాంటిదికాదు - పిండి అదే అయినా వడలను ముద్దగా చేసి నూనెలో వేయించిన తరువాత నీళ్ళలో నానపెడతారు. కావాలన్నప్పుడు ఆ వడని పిండి చిన్న దొన్నెలో పెట్టి దానిలో పెరుగు (తియ్యటిది) దానిపైన చింతపండు చెట్నీ, వుప్పు, కారం, మసాల, నల్ల వుప్పు వేసి ఇస్తారు.

ఇది మాములుగా ఎవరైనా చేసేదే.. మన జోషి మాత్రం పెరుగు వెయ్యగానే వున్నట్టుండి ఆ దొన్నెను పైకి గాలి లోకి విసురుతాడు. చిత్రంగా తిరుగుతూ అది రెండో చేతిలో వచ్చి పడుతుంది. "ఒక్క చుక్క పెరుగు కూడా వొలకలేదు చూసుకోండి" అంటాడు. ఆ తరువాత దొన్నె మనచేతిలో పెట్టి, వరసగా వుప్పు, కారం, మసాల, నల్ల వుప్పు గిన్నెల్లో చెయ్యి పెడతాడు. అన్ని అతని బొటన వేలికి, మిగిలిన నాలుగు వేళ్ళకి మధ్యలో వుంటాయి. అప్పుడే మన దొన్నెపైన చెయ్యిపెట్టి - "ఇది వుప్పు, ఇది కారం, ఇది మసాలా.." అంటూ ఒక్కొక్క వేలు తీస్తుంటే సరిగ్గా ఉప్పు, కారం, మసాల మాత్రమే దొన్నెలో పడతాయి.


"ఎంతకాలం నించి ఇక్కడ వున్నారు?" అంటే "మా తాత కూడా ఇక్కడే అమ్మేవాడు. అంతకు ముందు ఎంతమంది అమ్మారో తెలియదు.. అప్పుడు అదుగో ఆ కోటలో (పక్కనే రాజవాడా కోట) నవాబులు పోషించారు.. ఇప్పుడు మీలాంటి మహరాజులు పోషిస్తున్నారు" అంటాడు.

"మాటలు మాత్రం బాగా చెప్తావు.." అంటే"మా నాన్న ఏమి మాట్లాడే వాడు కాదు. దహీ వడా రుచిగా వుంటుంది కాబట్టి.. ఇప్పుడు నాకు వడా చెయ్యటం రాదు కాబట్టి ఇలా మాటలు చెప్పడం నేర్చుకున్నాను." అని నవ్వేస్తాడు.
నమ్మకండి. అంతా అబద్ధం. దహీవడా మొదటి చెంచా నోట్లో పెట్టుకోగానే అప్రయత్నంగా "వాహ్.. క్యా బాత్ హై" అంటారు.


ఇంక అక్కడి నుంచి మొదలు. ముందుకెల్తే బుట్టే కి కీస్ అనే ఒక వెరైటీ కనిపిస్తుంది. మొక్క జొన్న విత్తులని పాలలో మెత్తగా వుడకబెట్టి గట్టిగా అయ్యాక దాని మీద మసాల చల్లి, నిమ్మకాయ పిండి ఇస్తారు.

మరో చోట సాబు దానే కి కిచిడి - సగ్గు బియ్యంతో చేసిన కిచిడి. కొంచెం కారం ఎక్కువగా వుంటుంది కాని.. అదేంటో ఒక ప్లేటు తింటే సరిపోయినట్లు అనిపించదు. ఇవి కాక దోసిలి వెడల్పు జిలేబీలు, మాల్ పూరి, గులాబ్ జామున్ లాంటి స్వీట్లు, లస్సీ, బాసుంది, షికంజీ లాంటి పానీయాలు.. మీరే చూడండి..!!


(మరికొన్ని విశేషాలు తరువాతి టపాలో)

3 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

next majili kAsiyEnA? lEka allahabAdA? reMDU maMcivE. AdhruShTavaMtulu dEsaM aMtA kaMpenI KarcutO cUDagalgutunnAru kadA ucitaMgA? AnaMdiMcaMDi.

Raj చెప్పారు...

మీరు చాలా అదృష్టవంతులు సుమండీ.

Unknown చెప్పారు...

అజ్ఞాత,

కాశి కాదు, అలహాబాదు కాదు.. ఒక రాజధాని నగరం - లక్నో కాదు. (ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు.. చెప్పగానే ముందు మీకే చెప్తాను.. ;))

రాజ్‌గారు,

నిజమే ఒక రకంగా అదృష్టమే. కాకపోతే సంవత్సరానికొకసారి వూరు మారటం ఎంత కష్టమో ఒక టపా రాస్తాను అది కూడా చదవండి..!!