మంచినీళ్ళ బావి (పొద్దు సౌజన్యంతో)

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక పొద్దులో మే 26 న ప్రచురితం)

ఎన్నో ఏళ్ళ క్రిందటి మాట. మా వూరిమధ్యలో శివాలయాన్ని ఆనుకోని ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. ఎప్పుడో రాజుల హయాంలో కట్టించిన ఆ బావి దాదాపు వూరు మొత్తానికి నీళ్ళు అందించేది. నాలుగు వైపులా నాలుగు గిలకలు రోజంతా కిలకిలమంటూ కళకళలాడుతుండేది. తెల్లవారుఝామున ఏ నాలుగింటికో శివాలయం పూజారి దక్షిణామూర్తిగారు బావిని నిద్రలేపి చన్నీళ్ళ స్నానం చేసి, తడిగుడ్డతో నాలుగు బిందెలు మడినీళ్ళు పట్టుకోని రుద్రం నమకం చదువుకుంటూ గుళ్ళోకి నీళ్ళు మోసుకెళ్ళేవారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బ్రాహ్మణవీధి ఆడంగులంతా దక్షిణామూర్తిగారి స్నానం అయ్యేదాక ఆగి, ఆ తరువాత ఏ వచనరామాయణమో పాడుకుంటూ బావికి పసుపు అద్ది, బొట్లు పెట్టి, గిలకలమీద చేదలేసేవారు. ఇక అక్కడినించి ఆ బావి చలివేంద్రంలా రోజంతా జలదానం చేస్తూనే వుండేది.

కొంచెం తెలవారుతుండగా ఆడవాళ్ళ వరస మొదలయ్యేది. కులం ప్రాతిపదికన వేళల్లో మార్పులుండేవిగాని ఫలానా కులం వాళ్ళు నీళ్ళు పట్టుకోకూడదని ఎవ్వరూ అనేవారు కాదు. అప్పుడే నిఖా అయ్యి మా వూరు వచ్చిన నూర్‌జహాన్, బిందెతో అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోడానికి వెనకా ముందు ఆడుతుంటే సెట్టెమ్మగారు చూసి -

“ఏమ్మా కొత్త కోడలా.. అట్టా ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి వేస్తే ఇంక ఇంటికి నీళ్ళు చేర్చినట్టే.. రా, నేను తోడి పెడతాను..” అంటూ వద్దన్నా వినకుండా బిందె నిండా తను తోడుకున్న నీళ్ళు పోసి పంపేది. “కొత్త కోడలుకదా నీళ్ళబావి దగ్గర ఎక్కువసేపు వుంటే ఆ అత్తగారు ఏం సాధిస్తుందో.. పోనీలే పాపం ఒక్క బిందె నీళ్ళిస్తే మాత్రం ఏం పోతుంది” అనేది మిగతా ఆడంగులతో. బావిలో నీళ్ళు నవ్వుతూ సుడులు తిరిగేవి.

తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే, అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గటగటా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి, గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు -

“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.

చాలాకాలం ఇలాగే ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ వుండే వూరిజనం మధ్య, నెమ్మదిగా గొడవలు మొదలయ్యాయి. అప్పటిదాకా అక్కచెల్లెళ్ళలా కలిసి నీళ్ళు తోడుకునే ఆడవాళ్ళు ఆడపడుచుల్లా గిల్లి కజ్జాలు పెట్టుకోసాగారు. తెల్లవారుఝామునే వచ్చే ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఆలస్యంగా వచ్చి మణ్ణీళ్ళు తోడుకోవాలంటే మిగిలిన వాళ్ళు అడ్డు తప్పుకునేవాళ్ళు కారు.

“నీ వేళలో నువ్వు రాకుండా మమ్మల్ని తప్పుకోమంటావేంది?” అనేవారు.

నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు. మాట మాటా పెరిగినాయి.

“ఇది శివాలయం బావి.. బ్రాహ్మల బజారులో వుంది.. మిగిలిన వాళ్ళు ఎవరూ ఇక్కడ నీళ్ళు తీసుకోను వీల్లేద”ని తీర్మానం చేశారు.

“బావులు, నీళ్ళు ఒకళ్ళ సొత్తవడానికి వీల్లేద”ని మిగిలిన జనం తిరగబడ్డారు. ఆ తరువాత కొంత గొడవ జరిగి ఇట్లా తేలేది కాదని వూరికి మరో పక్క పోలేరమ్మ చెట్టు దగ్గర ఇంకో బావి తొవ్వించారు. మిగిలిన కులస్తులంతా అక్కడికి వెళ్ళి నీళ్ళుతోడుకోవడం మొదలెట్టారు. ఆ తరువాత చిత్రంగా శివాలయం బావి నీళ్ళ రుచి మారటం మొదలైంది. చెరకు రసంలా తియ్యగా వుండే నీళ్ళు చప్పంగా మారిపోయాయి… కొంచెం కొంచెంగా ఉప్పెక్కడం మొదలైంది. అయినా అక్కడి పెద్ద కులాల ఆడంగులంతా అవే నీళ్ళతో కాలం గడుపుతున్నారు. అక్కడి నీళ్ళు తాగడానికి చాలా మంది వెనకాడటంతో నీళ్ళు తోడిపెట్టే పని తప్పింది జనానికి. పెద్ద బాడిసెతో పెద్ద పని జరగట్లేదని సాంబయ్య అక్కడే ఒక సోడా కొట్టు పెట్టుకున్నాడు. ఆ బావి మాత్రం పెద్ద బొట్టు పెట్టుకున్న ముత్తైదువులా చేతనైనంతవరకు జలదానం చేసేది.

ఇక్కడ పోలేరమ్మ చెట్టు దగ్గర కొత్తగా కట్టిన వొరల బావేమో అప్పుడే చీరకట్టడం నేర్చిన కుర్ర పిల్లలా వుండేది. అక్కడ నీళ్ళు చెరకురసంలా కాకపోయినా చక్కెరనీళ్ళలాగా బాగుండేవి. బావి గట్టున చెట్టు మీద కొన్ని పావురాళ్ళు కాపురం వుండేవి. ఆడంగులు నీళ్ళు తోడుకోని వెళ్ళిపోయాక అవి చిన్నగా దిగి వచ్చి, గట్టు మీద బిందెలు పెట్టి పెట్టి పడ్డ గుంటల్లో నీళ్ళు నిలిస్తే ఆ నీళ్ళు తాగుతూ కువ కువ కబుర్లు చెప్పుకునేవి. కొంతకాలం అట్లా గడిచింది.

ఒకరోజు పోలేరమ్మ బావిదగ్గరా ముసలం పుట్టింది. “నేను ముందు నీళ్ళు తోడుకుంటుంటే కోపంతో నీళ్ళలో చెన్నమ్మ వుమ్మేసింది” అని నూకాలు అన్నది.

“ముందొచ్చింది నేను.. నువ్వెట్టా తోడుకుంటాయే.. నీళ్ళు..” అని చెన్నమ్మ అరిచింది.

నూకాలుకి మా చెడ్డ కోపంవచ్చింది. చెన్నమ్మ జుట్టు పట్టుకోని వంచి బిందెతో బాదింది. ఇద్దరూ కిందపడి దొర్లారు.. బూతులు తిట్టుకున్నారు, దుమ్మెత్తి పోసుకున్నారు. విషయం తెలుసుకోని ఆ ఇద్దరి మొగుళ్ళు కర్రలతో కొట్టుకున్నారు. ఇద్దరి రక్తం బావి గట్టుమీది గుంటల్లో పడింది. అది చూసిన పావురాళ్ళు ఆ వూరు వదిలి వలసెళ్ళిపోయాయి. చాలామంది ఆ రోజు నీళ్ళు తోడుకోకుండానే ఇంటికెళ్ళిపోయారు.

వలసలెళ్ళిన పావురాళ్ళు తిరిగిరాలేదు. కొన్ని రోజులకి ఏదో మంత్రం వేసినట్టు పోలేరమ్మ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఎండిపోయిన నాలుగు రోజులకే ఆ బావిలో పురుగు పడింది. గుర్రపు డెక్క ఆకు వేస్తే నీళ్ళు బాగుపడతాయని ఎవరో అంటే అందులో ఆ ఆకు వేశారు. అది పెరిగి పెరిగి బావంతా పాకింది. బావి ఒరల గోడలకి నాచు పట్టింది. ఆ నీళ్ళు కూడా తాగడానికి పనికిరాకుండా పోయాయి.

దాంతో వూరంతటికి మంచినీళ్ళ బావి లేకుండాపోయింది. వూర్లో ఆడవాళ్ళంతా బిందెలు చంకన పెట్టుకోని నాలుగు మైళ్ళు నడిచివెళ్ళి వాగులో నీళ్ళు నింపుకొచ్చేవాళ్ళు. సోడా కొట్టు సాంబయ్య తమ్ముడు రాములు కావిడి కట్టి వూర్లోకి నీళ్ళు మోసుకొచ్చేవాడు. బిందెకు రూపాయి చొప్పున తీసుకునేవాడు. సాంబయ్య వ్యాపారం కూడా వూపందుకుంది. అప్పుడే బస్సు దిగిన పొరుగూరోళ్ళు, శివాలయం చూడటానికి వచ్చే భక్తులు బావిలో వుప్పు నీళ్ళు తాగలేక సాంబడి సోడాలతోనే సెదతీరేవారు. కొంతకాలానికి సాంబయ్య సోడా మిషను కూడా పెట్టాడు.

కొన్నేళ్ళు ఇలాగే గడిచాయి. వూర్లో డబ్బున్నవాళ్ళు మంచినీటి ఎద్దడి తట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించారు. బావులు తొవ్విస్తే బండలు అడ్డంపడుతున్నాయే కానీ నీళ్ళు పడటంలేదు. పట్నం నించి బోరు లారీలని పిలిపించి ఇళ్ళలో బోర్లు వేయించాలని కూడా చూశారు. ఎక్కడ వేసినా ఉప్పు నీళ్ళేకాని మంచి నీళ్ళు తగలట్లేదు.
శివాలయంలో శివుడికి వుప్పునీళ్ళ అభిషేకమే చేసేవారు దక్షిణామూర్తిగారు.


“శివుడి ఆజ్ఞ లేదు.. ఆ గంగమ్మను వదలటంలేదు.. ఏ భగీరథుడో మళ్ళీ రావాలి..” అనుకునేవాడు ఆయన.

***

గోపాలయ్య అనీ, శివాలయం పక్కవీధిలోనే వుండేవాడు. వూరిలో వచ్చిన మంచినీటి కరువు చూసి చాలా బాధపడ్డాడు. శివాలయంలో శివుడికి దణ్ణం పెట్టి -

“పరమేశ్వరా ఏదైనా మార్గం చూపించు స్వామీ..” అంటూ మొక్కాడు.

ఇంటికి తిరిగి వస్తూ దారిలో నీళ్ళ బిందెలు మోస్తున్న ఆడవాళ్ళని చూసి వుస్సురని నిట్టూర్చాడు. ఆయన ఇంట్లోకి రాగానే జానకమ్మగారు ఎదురొచ్చి చేతిలో సంచీ, భుజం మీద కండువా అందుకుంది. తీరిగ్గా కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చాక చెప్పుకొచ్చింది-

“మన ఇంటికి ఎలాగూ ప్రహరీ కట్టించాలని అనుకుంటున్నాము కదా.. ఆ ఆగ్నేయం మూల, స్థలం ఎట్లాగూ వదిలిపెట్టాలి.. ప్రహరీ అవతల, పోనీ ఒక బావి తొవ్వించే ప్రయత్నం చెయ్యకూడదూ.. నీళ్ళు పడితే వూరికి మంచి చేసినవాళ్ళమౌతాము.. పది మందికి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కితే వస్తుంది చెప్పండి..” అంది.

జానకమ్మగారి ఆలోచన వినగానే సంతోషంతో ఆయన ముఖం వెలిగిపోయింది. చటుక్కున లేచి.. ఆమె చేతిని గట్టిగా పట్టుకోని, చిన్నగా నొక్కి, ఒక చిరునవ్వు నవ్వాడు. ఆమె కండువా చేతికిచ్చింది. అంత ఎండనూ లెక్కచెయ్యకుండా గోపాలయ్య కరణంగారింటికి బయలుదేరాడు.

ప్రహరీ సంగతి పక్కన పెట్టి, ముందు బావి తొవ్వించాలని సంకల్పించాడు గోపాలయ్య. మంచినీళ్ళు ఎక్కడపడతాయో మంత్రం వేసి చెప్పగలిగిన కేశవాచార్యులు పెదవి విరిచి,

“లాభం లేదయ్యా.. వుత్త బండ తప్ప అసలు నీళ్ళు పడే మార్గమే లేదు” అంటూ తేల్చేశాడు. దాంతో పంచాయితీ పెద్దలు డబ్బు సాయం చెయ్యమన్నారు. గోపాలయ్య నీరసపడి ఇంటికొచ్చాడు.

ఆ రాత్రి జరిగింది విని జానకమ్మ ఎంతో నొచ్చుకుంది. “బండే పడుతుందో.. గంగే పడుతుందో.. ప్రయత్నిస్తే తప్పేముంది..? వాళ్ళేమనుకుంటే మనకెందుకు, మన స్థలం అది. మనం అనుకున్నట్టే చేద్దాం” అని ప్రహరీ ఖర్చుకి తీసిపెట్టిన డబ్బులు గోపాలం చేతిలో పోసింది.

మర్నాడే పని ప్రారంభమైంది. జానకమ్మ, గోపాలయ్య అందరు దేవుళ్ళకి మొక్కుకోని నలుగురు కూలీలతో తొవ్వడం మొదలు పెట్టారు. వూర్లో జనమంతా గోపాలయ్యని పిచ్చివాడన్నారు.

“మన కేశవాచారి నీళ్ళు పడవంటుంటే.. ఎందుకురా నీకీ పిచ్చి ఆరాటం..” అని ఎద్దేవా చేశారు.

వాళ్ళిద్దరు మాత్రం ఏ మాత్రం వెరవలేదు. ఒక కూలి ఖర్చు మిగిలినా మిగిలినట్టే అని గోపాలయ్య కూడా ఒక పలుగు పట్టాడు. జానకమ్మ కూలివాళ్ళందరికి అన్నం వండి వార్చేది. చల్లటి మజ్జిగ ఇచ్చేది.. ధనియాల కాఫీ పెట్టేది. ఖాళీ వుంటే మట్టి తట్టలు అందుకునేది. పది రోజులు తొవ్వారు. ఎక్కడా నీటి జాడ కనపడలేదు.

ఆ రోజు రాత్రి గోపాలయ్య చాలా మథనపడ్డాడు.

“పరమేశ్వరా.. ఇంక నా చేతిలో చిల్లిగవ్వలేదు.. ఊరికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇక నీదే భారం” అనుకున్నాడు. జానకమ్మ నవ్వుతూ తన నగలు తెచ్చి ఇచ్చింది.

మరి జానకమ్మ మంచితనం చూసి కరిగాడో, గోపాలయ్య మొరనే విన్నాడో, ఆ పరమేశ్వరుడు గంగను వదిలిపెట్టాడు. తెల్లవారేసరికి బావిలో నీళ్ళు..!! నీళ్ళంటే నీళ్ళుకాదు.. లేత కొబ్బరిపాలు వున్నట్టున్నాయి..!! వూరంతా వరదలా పరుగెత్తుకొచ్చారు. ఆ నీళ్ళు తాగారు.. ఒకరి మీద ఒకరు చల్లుకున్నారు.. ఆ వూరికి జలదానం చేసిన గోపాలయ్యకు, జానకమ్మకు దణ్ణాలు పెట్టారు. అప్పటి నుంచి అది జానకమ్మగారి బావి అయ్యింది.

వూరి జనమంతా మళ్ళీ ఒక బావిలో నీళ్ళు తోడుకోవడం మొదలు పెట్టారు. కావడి రాములు ఈ బావి నీళ్ళే తీసుకోని వూరిలో పెద్దవాళ్ళకి పోసేవాడు. రూపాయికి రూపాయి ఎక్కువడిగినా కాదనేవాళ్ళు కాదు. గోపాలయ్య ఇంట్లోకి వస్తూ పోతూ గిలక చప్పుడు విని వేదమంత్రం విన్నట్లు తలవూపేవాడు. జానకమ్మ బావి పక్కనే తులసి చెట్టు నాటింది.. ఆ పక్కనే ఒక వేపచెట్టు, రావి చెట్టు కలిసి పుట్టుకొచ్చాయి. ఆ చెట్లకు నీళ్ళు తోడి పోసి బిడ్డల్లా పెంచుకుంది.

కాలం తిరిగింది. జానకమ్మ పురుడు పోసుకోడానికి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ వూరందరికీ తులసి కోటలో చెంబెడు నీళ్ళు పొయ్యమని చెప్పింది. పండంటి మగబిడ్డని కన్న తరువాత, చూడవచ్చిన గోపాలయ్యతో “బారసాల మనింట్లోనే జరగా” లని పట్టుబట్టింది. అన్నట్టుగానే ఇరవై రోజుల పిల్లాడిని తీసుకోని ఎడ్లబండి కట్టించుకోని తిరిగివచ్చింది. రామచంద్రుడని పేరు పెట్టుకున్నారు. సాయంత్రం వుయ్యాలలో వేసేముందు బావికి పూజ చేసింది. ప్రేమగా ఆ బావి నెమిరింది. పసుపుతో గుండ్రంగా రాసి, కుంకుమ బొట్లు పెట్టింది. రావి, వేప చెట్ల చుట్టూ తిరిగింది. తులసి చెట్టు పాదులో నీళ్ళుపోసి “అమ్మా నా పసుపు కుంకుమలు పదికాలాలపాటు నిలుపు తల్లీ” అంటూ మొక్కుకుంది.

ఆ మర్నాడు గోపాలయ్య చెట్లపాదులు సవరిస్తూ పైకి చూస్తే రావి చెట్టు మీద రెండు పావురాలు కనిపించాయి. ఆయన జానకమ్మను కేకేస్తే ఆమె బయటకు వచ్చి వాటిని చూసి, బావి దగ్గరకు వెళ్ళి ఒక చేదడు నీళ్ళు తోడి అక్కడ పెట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళినట్లే వెళ్ళి తలుపు చాటు నించి తొంగి చూసారు. రెండు పావురాళ్ళు బావి గట్టు చేరి ఆ నీళ్ళు తాగి కువ కువల కబుర్లు మొదలు పెట్టాయి. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోని తృప్తిగా నవ్వుకున్నారు.

***

రామచంద్రుడు పెరిగి పెద్దవాడౌతున్న కొద్దీ ఆ వూరు నీటి ఎద్దడి సంగతి మర్చిపోయింది. జానకమ్మగారి బావి మినహాయించి ఆ వూరిలో ఏ బావిలోనూ మంచి నీళ్ళు పడనేలేదు. ఒకవేళ పడ్డా ఆ రుచి మరిగినవాళ్ళు తాగడానికి మాత్రం జానకమ్మగారి బావినుంచే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఎండకాలం వస్తే నాలుగు మైళ్ళ అవతలున్న వాగుతో సహా అన్నిచోట్లా నీళ్ళు ఎండిపోయేవి. శివాలాయం బావికూడా అందుకు మినహాయింపు కాదు. దక్షిణామూర్తిగారు తూర్పు వాకిలి నుంచి నీళ్ళు తేవడం మానేసి వుత్తర గోపురం గుండా వెళ్ళి జానకమ్మగారి బావి నుంచే నీళ్ళు తెచ్చేవాడు. సోడా కొట్టు సాంబడు వయసు మీదపడ్డాక కొట్టు మూసేసి పట్నంలో తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. కావిడి రాములు ముసలివాడై నీళ్ళు మొయ్యలేక ఇంటి పట్టునే వుంటున్నాడు. కొన్నేళ్ళు అలా గడిచాయి.

రామచంద్రుడికి పన్నెండేళ్ళ వయసులో జానకమ్మగారికి జబ్బుచేసింది. గోపాలయ్య అహర్నిశలు దగ్గరుండి ఆమెకు సపర్యలు చేసాడు. అయినా ఫలితం లేకపోయింది. మరో రెండేళ్ళకి ఆమె కన్నుమూసింది. ఉన్నా లేకపోయినా ఆమెను వూరంతా దేవతలానే చూసింది. ఆఖరి చూపులకి కులం మతం తేడాలేకుండా అందరు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. బావి గట్టునే ఆమెకు స్నానం చేయించి, నిండు ముత్తైదువలా అలంకరించి సాగనంపారు. గోపాలయ్యకు మరో పదేళ్ళ వయసు మీదపడ్డట్టైంది. అయినా బాధను దిగమింగుకోని రామచంద్రుణ్ణి పెద్దవాడిని చేశాడు. రామచంద్రుడు అదే వూర్లో డైరీలో వుద్యోగంలో చేరి గోపాలయ్య కళ్ళెదుటే వున్నాడు.

ఒకరోజు పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న సోడా సాంబయ్య కొడుకు కుమారస్వామి ఆ వూర్లో దిగబడ్డాడు. నేరుగా డైరీకి వెళ్ళి రామచంద్రుడితో మంతనాలు జరిపాడు. ఇద్దరి మధ్యా ఏం మాటలు జరిగాయో తెలియదుగాని మరో రెండురోజులకి రామచంద్రుడు జానకమ్మ బావిలో మోటరు బిగించాడు.

“నాయనా రాముడూ..ఎందుకురా ఈ మోటరు అదీ.. బావి ఎప్పుడో వూరికిచ్చేశాము.. వాళ్ళే చూసుకుంటారు” అన్నాడు గోపాలయ్య.

“ఈ బావి వూరిదికాదు.. ఆ స్థలం మనది, బావి మనది.. మీరు అనవసరంగా కల్పించుకోవద్దు..” అన్నడు రాముడు దురుసుగా. అంతేకాని అసలు సంగతి చెప్పనేలేదు.

మర్నాడు తెల్లవారుఝామునే పట్నం నుంచి నాలుగు ట్యాంకరు లారీలు వచ్చాయి. వాటి హారను మోతలకి వూరంతా వులిక్కిపడి లేచింది. గిర్రున తిరిగింది.. వచ్చిన నీళ్ళను ట్యాంకర్లకు పట్టుకున్నారు. ఆ మోటారు చప్పుడుకి రావిచెట్టుమీద వున్న పావురాలు చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. నీళ్ళు నింపుకున్న ట్యాంకర్లు చల్లగా వూరుదాటాయి.

గోపాలయ్య ఎంతో బాధపడ్డాడు. వూరంతా ఇంటి ముందు చేరి రాముడికి నచ్చ చెప్పాలని చూశారు. వాడు ససేమిరా అన్నాడు..

“ఏమిటండీ మీ అజమాయిషీ.. ఇది మా బావి.. మా ఇష్టం.. ఒక్కొక్క ట్యాంకరుకి ఆరొందలు ఇస్తారు.. ఎంత లేదన్నా నెలకి వేలల్లో లాభం.. వూరకొచ్చే డబ్బు.. నేనొదులుకోను” అన్నాడు.

“మోటర్లతో లాగితే నీళ్ళు తగ్గుతాయి.. వూర్లోవారందరికీ కరువొస్తుంది” అన్నాడోక పెద్దమనిషి.

“అసలు మా బావిలో మీరు నీళ్ళు తోడుకోవడం ఏమిటి.. పట్నంలో నీళ్ళతో ఇంత వ్యాపారం జరుగుతుంటే వూరందరికీ వూరకే నీళ్ళు ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడినా? అసలు మీరెవ్వరూ రేపటినుంచి నీళ్ళు తోడుకోవడానికి లేదు. ఈ రోజే బావిపైన ఇనపగేటు వేయించి తాళం వేస్తాను..” అన్నాడు. అన్నంత పనీ చేశాడు వాడు.

గోపాలయ్య ఎంతో మథనపడ్డాడు.

“పది మందికి మంచినీళ్ళు ఇస్తే ఆ పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కినా రాదురా.. ఆ బావి తొవ్వడానికి మీ అమ్మ తన నగ నట్రా కూడా ఇవ్వడానికి సిద్ధపడింది..” అంటూ బ్రతిమాలాడు.

“ఇప్పుడుమాత్రం ఏమైంది.. పట్నంలో ఎంతోమందికి మన నీళ్ళు వుపయోగపడుతున్నాయి.. వాళ్ళు ఇవ్వగలరు కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాము.. ఇందులో మాత్రం పుణ్యం రాదని ఎవరన్నారు..” అంటూ వితండవాదం చేశాడు రాముడు.

ఆ రోజునించి ట్యాంకర్లు వస్తూనే వున్నాయి. వూరి జనమంతా మళ్ళీ వాగు వైపు నడకసాగించారు. ఏ అమ్మలక్కలు ఒక చోట చేరినా “జానకమ్మ మనసుకి ఇట్టాటి కొడుకు పుట్టాడే” అని చెప్పుకున్నారు. ఎక్కడ నలుగు మొగవాళ్ళు చేరినా “నలుగురి మంచి ఆలోచించే గోపాలయ్య ఎక్కడ ఈ రామచంద్రుడు ఎక్కడ” అని తిట్టుకున్నారు.

గోపాలయ్య చెవిన ఇవన్నీపడ్డాయి. బాధతో కుమిలిపోయాడు.. మంచాన పడ్డాడు.. నిద్రలోను, మెలకువలోనూ జానకమ్మను పలవరించాడు. ఒకరాత్రి వోపిక చేసుకోని బావి దగ్గరకు వెళ్ళాడు. బావి చుట్టూ తిరిగాడు, రావి చెట్టును నెమిరాడు. తులసి చెట్టుకు నీళ్ళు పోద్దామంటే బావి దగ్గర చేదలేదు. చేద వేసేందుకు అవకాశంలేకుండా ఇనప వూచలు అడ్డంపెట్టివున్నాయి. తన బలమంతా వుపయోగించి లాగాడు. కొద్దిగా కదిలింది. ఇంట్లో రాముడు దాచిపెట్టిన తాళంచెవి తెచ్చి తెరిచాడు. కష్టపడి చేద దించాడు. నీళ్ళు తోడాడు.. తులసి మొదట్లో నీళ్ళు పోసాడు. నీళ్ళు బురద బురదగా వున్నాయి. రుచి చూసాడు.. మునుపటి రుచి లేదు. ఇంతలో చేద గిలక మీదనించి జారింది. ఆయనా కూలబడ్డాడు. ఇరుసు విరిగి గిలక ఒక పక్కకి వొరిగిపోయి చెరిగిన తిలకంలా వుండిపోయింది. గోపాలయ్య కూడా అలాగే వొరిగిపోయాడు…మళ్ళీ లేవలేదు.

తెల్లవారాక ట్యాంకర్లు వచ్చాయి. నీళ్ళు పట్టాలని మోటరెయ్యడానికి లేచిన రాముడు గోపాలయ్యను చూశాడు. వూరంతా వార్త గుప్పుమంది. అందరూ వచ్చారు..

“ఆయన కూడా పోయాడు.. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో..” అంటూ నిష్టూరమాడారు.

విరిగిన గిలకని, ఆయన చేతిలో వున్న చేదను చూస్తే అందరి మనసు చివుక్కుమంది. చేదతీయబోతే అందులో మురికి నీళ్ళు కనపడ్డాయి. బావిలోకి తొంగి చూశారు -

“బావిలో నీళ్ళు లేవు..” ఎవరో అరిచారు..

“జానకమ్మగారి బావి ఇంకిపోయింది..” వూరంతా చెప్పుకున్నారు.

“ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం.. ఎంతటి ఎండలొచ్చినా ఏ నాడైనా ఇంకిపోయిందా?” అన్నారెవరో శివాలయంలో.

“ఇంకిపోయింది నీళ్ళుకాదు.. పదిమందికి సాయంచేసే మంచితనం..” అంటూ శివాలయంలోకి వెళ్ళిపోయారు దక్షిణామూర్తిగారు.
Category:

4 వ్యాఖ్య(లు):

రవి చెప్పారు...

ఇంత గొప్ప కథ ఇంతవరకు ఎలా నా కళ్ళబడలేదో తెలియట్లేదండి.

తర్కం అనే కత్తితో ప్రతీ విషయాన్ని నరకాలనుకునే మనకు "జానకమ్మ" లాంటి వారి బావుల్లో మాత్రమే నీళ్ళు ఎందుకు పడతాయో అర్థమవదు.

Kathi Mahesh Kumar చెప్పారు...

@రవి: తర్కం అంటే అనుభూతి రహితమూ కాదు "నమ్మకం" లేకుండటం కాదుకదా! కేవలం మన అనుభూతి,నమ్మకాలకు హేతువుని అర్థం చేసుకోవడం అంతే.

ఈ కథ పొద్దులో చదివాను.చాలా బాగుంది. కామెంట్ కూడా పెట్టానే!

రవి చెప్పారు...

"తర్కం అనే కత్తితో ప్రతీ విషయాన్ని..."

అక్కడ ఠాగూర్ స్ట్రే బర్డ్స్ కవిత గుర్తొచ్చి అలా చెప్పానండి. పర్టిక్యులర్ గా ఎవరిని ఉద్దేశ్యించలేదు. :-)

"తర్కం అంటే అనుభూతి రహితమూ కాదు "నమ్మకం" లేకుండటం కాదుకదా! కేవలం మన అనుభూతి,నమ్మకాలకు హేతువుని అర్థం చేసుకోవడం అంతే."

ఇది కొంచెం Tricky statement అనుకుంటున్నాను. తర్కానికి అందనిదే కదా అనుభూతి. అనుభూతికి హేతువు ఎలా ఉంటుంది?
ఈ మధ్య ఆచార్య నాగార్జునుడు అనే పుస్తకం చదివాను. (సార్వజనీన) సత్యం అన్నది, "హేతువు కు హేతువు కానిదానికి ఎక్కడో మధ్య ఊగుతూ ఉంటుంది" అన్నట్టుగా ఏదో చెబుతాడాయన. అయినా ఇవన్నీ అనవసరంగా తల బద్దలు కొట్టుకునే వ్యవహారాలు మాత్రమేలెండి.

Sujata M చెప్పారు...

చాలా బావుందండీ. నేను పొద్దు లో చదవలేదు. ఇపుడే చదివాను. ఇంత చక్కని కధని చదవడం ఈ మధ్యకాలంలో ఇదే.