వానర వీరుడు

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక కౌముది సెప్టెంబర్ 2009 సంచికలో ప్రచురితం)

రోజు కేతకి మనసు మనసులో లేదు. ఆ రోజు హనుమంతుడు అశోకవనానికి రెండొవసారి వస్తున్నాడట..!! మునుపు వచ్చినప్పుడు రాక్షస స్త్రీలనందరిని మాయలో ముంచి, నిద్ర పోనిచ్చి కేవలం సీతమ్మను మాత్రమే కలిసి వెళ్ళాడు. ఈ సారి అలా కాదు, అందరూ మేల్కోని వుండగానే, అందరూ చూస్తుండగానే వస్తాడట..!! తాను హనుమంతుణ్ణి మళ్ళీ చూడబోతోంది..!! ఈ సారి అతనితో మాట్లాడాలి.. తన మనసులో మాట చెప్పాలి.. ఇలా ఆలోచిస్తుంటే కేతకికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు.


రావణవథ నెరిపిన వెంటనే శ్రీరాముడు విభీషణ పట్టాభిషేకానికి ఆజ్ఞ ఇచ్చాడు. అరణ్యవాసం చేస్తున్నందున లంకా నగరంలోకి అడుగుపెట్టనని, లక్ష్మణుడికి పట్టాభిషేక బాధ్యత అప్పజెప్పాడు. ఆంజనేయుడు స్వయంగా సకల నదీనదాల నీరు తీసుకోని రాగా, దేదీప్యమానంగా విభీషణ పట్టాభిషేకం జరిగింది. ప్రజలు, సామంతులు ఇచ్చిన అనేకానేక బహుమతులు, మణులు, రత్న మాణిక్యాలు తీసుకోని విభీషణుడు సముద్రతీరానికి చేరుకున్నాడు. ఆ కానుకలన్నీ రాముడికి సమర్పించి నమస్కరించాడు.

రఘునందనుడు నవ్వి - "విభీషణా.. అరణ్యవాసికి ఈ కానుకలేల..? నాకు నీవు ఇవ్వవలసినది వేరొకటి వున్నదయ్యా.." అన్నాడు.


"రామచంద్ర ప్రభూ.. సీతామాత క్షేమంగా వున్నది. వెంటనే మీ విజయవార్తను ఆ అమ్మకు పంపిస్తాను" అన్నాడు విభీషణుడు.


"నీవు ఇప్పుడు లంకా రాజ్య ప్రభువు, నీ అనుమతి కోసమే వేచి వున్నాము. నీవు అనుమతిస్తే హనుమ ఆ కార్యం నిర్వర్తిస్తాడు" అన్నాడు రాముడు.


"ఎంత మాట ప్రభు... నేను రాజునుకాదు.. నీ దాసాను దాసుణ్ణి.. మీ అనుజ్ఞ ప్రకారమే హనుమను పంపించండి.." అన్నాడు విభీషణుడు.


ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పించుకుందో కేతకి. హనుమంతుడు అశోక వనానికి వస్తున్నాడు.. ఎంతటి శుభవార్త..!! యుద్ధభూమి నుంచి నగరంలోకి రోజూ మరణవార్తలు మోసుకొస్తున్న చారులు మొదటిసారి ఈ శుభవార్త తెచ్చారు. వెంటనే త్రిజటను కలవడానికి విభీషణ గృహానికి బయలుదేరింది.


దారి పొడవునా ఆంజనేయుడి గురించి ఆలోచనలే. అసలు ఆంజనేయుడి గురించి తప్ప ఈ మధ్య వేరేమి ఆలోచించట్లేదు కేతకి. అది ప్రేమ? అభిమానమా? భక్తా? ఏమో తనకీ తెలియదు. అతను ఆజన్మ బ్రహ్మచారి అని తెలిసినప్పుడు మాత్రం కొంచెం బాధపడింది.. కాని అతని మీద అనురాగం మాత్రం తగ్గలేదు. అతని కఠోర బ్రహ్మచర్యం గురించి విని మరింత గౌరవించింది. పూజించింది.


లంకా నగర వీధులన్నీ వెల వెల పోతున్నాయి. ప్రతి ఇంటి ముందు రాక్షస సైనికుల శవాలు, వాటి వెనక విధవలై, అనాధలై భోరున విలపిస్తున్న వారి కుటుంబ సభ్యులు. నాటి లంకా పురీ విభవమ్ము నేడు మచ్చుకైనా కనరావటం లేదు.


"అసలు ఆ రోజు ఆంజనేయుడు వచ్చి ఈ నగరాన్ని తన వాలముతో తగులపెట్టినప్పుడే ఈ నగరం కాంతి హీనమైనది. ఈ నాటి అగ్ని కీలకల్లో తగల బడిన మొండి గోడలు అదుగో ఇప్పటికీ కనిపిస్తున్నాయి.. ఒక్క కోతి కారణంగా మయుడిచే నిర్మించిన ఈ మహా నగరం ఇలా బూడిద పాలౌతుందని ఎవ్వరూ, ఏనాడు వూహించి వుండరు..." అలా ఆలోచిస్తూ పుర వీధుల్లోకి అడుగుపెట్టింది కేతకి.


"ఇదుగో ఇక్కడే కదూ... ఆనాడు ఆ వానర వీరుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధించి ఈ వీధుల్లోనే కదూ నడిపించాడు మేఘనాథుడు? అప్పుడే తాను ఆ వీరుణ్ణి మొదటిసారి చూసింది. ఎలా వున్నాడు..? బంధించారన్న దిగులు లేదు, రొమ్ము విరుచుకొని, చేతులు వెనక్కి పెట్టుకోని, నగరంలో వీధి వీధిని పరికించి చూస్తూ, వాలాన్ని ఝుళిపిస్తూ, రామ మంత్రాన్ని జపిస్తూ, మధ్య మధ్యలో తనని చూడాటానికి వచ్చిన జనులను వానర చేష్టలతో భయపడుతూ.." ఆలోచిస్తూనే అనుకరిస్తోంది కేతకి. చేతులు వెనక్కి పెట్టుకోని, రొమ్ము విరుచుకోని, తల ముందుకు వంచి కోతిలా పళ్ళు చూపిస్తూ "గుర్ర్.. గుర్ర్" అంటోంది.


"ఏమిటే ఇది కేతకీ.. కేతకీ.." చేతులు పట్టుకోని వూపింది కాళనామి. ఆమె కేతకి స్నేహితురాలు. "ఏమిటే ఇది మళ్ళీ ఆ తోకవీరుడు గురించేనా.." అంది కవ్విస్తూ.


"ఏయ్.. కాళ.. నా మారుతినేమైనా అన్నావో" వేలు చూపించింది కేతకి.


"ఏమిటి… ఆ బ్రహ్మచారి నీ మారుతి ఎట్లైనాడమ్మా?"


"వీరుణ్ణి అభిమానించడం తప్పా.. నేనేమి ఆయన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదే"


"సరేలేమ్మా.. నీతో నాకెందుకు.. నాకు అవసరమైన పని వుంది వస్తా"


"ఏమిటే ఆ పని?"


"యువరాణి త్రిజటమ్మగారు చెప్పారు... ఆ పుష్పక విమానాన్ని పూలతో అలంకరించాలట.. అవును నువ్వెక్కడికే?"


"నేనూ త్రిజటమ్మగారి దగ్గరికే.. నాకు ఆ అశోకవనంలో ఏదైనా పని చెప్పమని"


"అశోక వనమేమిటే..?"


"నీకు తెలియదులే.. ఆయన అక్కడికే వస్తున్నాడు" చెప్పి పరుగెత్తింది కేతకి.




***




కేతకి వెళ్ళేసరికి త్రిజట సీతను అలంకరించడానికి నగలు సిద్ధం చేస్తోంది. నగరంలో వున్న సమస్త ఆభరణాలను తెప్పించింది.


"సీత మేని ఛాయ ముందు ఈ బంగారం దిగదుడుపే.. ఇదిగిదిగో ఈ నీలం చీర చూడండి.. అయ్యో ఇది రాముని మేని ఛాయముందు దిగదుడుపే.." అంటూ ఒక్కట్టే సవరిస్తోంది. కేతకి రావటం చూసి -


"ఏమిటే ఇప్పుడా రావటం.. పద పద.. వెళ్ళి సీతను తీసుకెళ్ళే రథం అలంకరించు.." అంటూ పనిలో మునిగిపోయింది. కేతక హతాశురాలైంది. ఎలాగైనా అశోక వనం చేరాలి, అక్కడ హనుమంతుణ్ణి చూడాలి.


"యువరాణిగారు.." అన్నది.


"ఏమిటే.."


"అమ్మా.. నేను అశోక వనానికి వెళ్తానమ్మా.. సీతమ్మను అలంకరిస్తాను.." అన్నది చిన్నగా.


"ఓహో.. హనుమయ్య అక్కడికి వస్తాడనా? బాగానే వుంది.. ఆయనంటే అంత ఇష్టం వున్నదానివి, ఆయన స్వామి భక్తి గురించి తెలిసినదానివి, నేను చెప్పిన దానికి ఎదురు చెప్తావా?" అంది నవ్వుతూ.


"అమ్మా.. అమ్మా.. కాదనకండమ్మా" ప్రాధేయపడింది కేతకి.


"సరేలే.. ఈ నగలు తీసుకెళ్ళి జానకీదేవిని అలంకరించు.. అశోకవనంలో.." అన్నది చివర్లో వత్తి పలుకుతూ.


కేతకి నమస్కరించి, చిన్నగా నవ్వుతూ అశోకవనం వైపు సాగింది. వెనకే పరిచారికలు రకరకాల మణిహారాలు, కేయూరాలు, కడియాలు ఇంకా ఎన్నెన్నో చిత్రమైన రంగులు కలిగిన వస్త్రములు తీసుకొని ఆమెను అనుసరిస్తూ కదిలారు.


కేతకి నడుస్తూ ఆలోచిస్తోంది -


"త్రిజటమ్మగారు అలా అంటారుగాని.. అమెకు తెలియదా తనకి హనుమంతుడంటే ఎంత ఇష్టమో.. ఎన్నిసార్లు ఆమె దగ్గరకు వెళ్ళి హనుమంతుడి కథలు చెప్పలేదు.. ఆ రోజు లంకా నగర రక్షకి లఖిణిని ఎవరో చంపేశారన్నప్పుడు తాను అశోకవనంలోనే వుంది. త్రిజట ఆ రోజు తన స్వప్న వృత్తాంతం వివరించి, ఎవరో వానరవీరుడు వస్తాడని, లంకా నగర నాశనం తప్పదని చెప్పింది కదా. అప్పుడే కదా తను మొదటిసారి వాయునందనుడి గురించి వినడం.. ఆ తరువాత ఆయన రావటం లంకా దహనం కావించడం.. ఆహా.. వాలానికి నిప్పు పెడితే నిబ్బరంగా గాలిలోకి లేచి ఆ ప్రాకారం నుంచి ఈ ప్రాకారం మీదకి దుముకుతూ, తోకని పెంచుతూ ఈ లంకా ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంటే, తనొక్కతే సంభ్రమంగా అలాగే నిలుచోని తదేకంగా అతన్ని చూసిన క్షణాలు.. ఎంత కాలమైనా మరపుకు రావుకదా..!! ఆనాడు ఆయనకు ఏ హాని కలగకూడదని సీతమ్మతోపాటే తాను అగ్నిదేవుడిని ప్రార్థించింది... అప్పుడు ఆ వీరుడు తనను చూశాడా? ఏమో.." ఇలా ఆలోచిస్తూనే అశోక వనం ముందున్న ఫలతోటలోకి చేరుకున్నారు పరివారమంతా.


కొంతకాలం క్రిందట ఎంత మనోహరంగా వుండేదా తోట. ఎన్నో లోకాలతో యుద్ధాలు జరిపి, అన్ని లోకాల చిత్ర విచిత్రమైన ఫలాలను, పుష్పాలను రావాణుడు స్వయంగా మక్కువతో తెచ్చుకోని పెంచిన తోట అది. ఎప్పుడూ దోరమాగిన ఫలాల సువాసనలు వెదజల్లుతూ ఆఘ్రాణింపుకే మైమరపాటునిచ్చే మనోహరమైన తోట. మరి ఈ నాడు -


విరిగిన ప్రాకారాలతో, ఎక్కడిక్కడ పడిపోయి ఎండిపోయిన మహా వృక్షాలతో, దారికి అడ్డంగా పడివున్న మహా పర్వతాలవంటి రాళ్ళతో.. ఇదంతా ఆ వానర వీరుడి పనే కదూ..!! అతను చెట్లను పెళ్ళాగించిన చోట ఇప్పుడు చిన్న చిన్న తటాకాలయ్యాయి. రాళ్ళు విసిరినప్పుడు దాని కింద పడిన రాక్షసులు ఆ రాతికిందే సమాధి అయిపోయి వున్నారు. కొన్ని బండలకింద ఇప్పటికీ రధ శకలాలు వున్నాయి.


కేతకి అక్కడే పడి వున్న ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టును వేర్లతోసహా పెళ్ళగించినప్పుడు హనుమంతుడు చేతులు పడిన చోట నొక్కుకు పోయి వుంది. కేతకి ఆ అచ్చులమీద చిన్నగా తాకింది. ఒళ్ళంతా పులకరించినట్లైంది. భక్తిగా నమస్కరించింది.


"ఏం వీరుడివయ్యా? మా రాక్షసుల చేతులలో చిత్ర విచిత్రమైన ఆయుధాలు చూశాను. కానీ నీలా చెట్లను, బండరాళ్ళాను ఆయుధలు చేయగలిగినవాడిని ఇంతవరకు ఎరుగను..”


రామరావణ యుద్ధంలో హనుమంతుడు చేసిన పోరు జ్ఞాపకం వచ్చింది ఆమెకి. యుద్ధం నుంచి రోజు తిరిగొచ్చిన చారులు యుద్ధ విశేషాలను పూసగుచ్చినట్లు చెప్పేవారు. వారిని అడిగి ప్రత్యేకంగా హనుమంతుడి సంగతులు చెప్పించుకునేది కేతకి. అవే విషయాలు గుర్తుకొస్తున్నాయి. వెంట వస్తున్న పరిచారకలకు ఆ విశేషాలు చెప్పసాగింది -


"ధూమరాక్షసుడు పశ్చిమద్వారం గుండా వెళ్ళినప్పుడు అక్కడ కాళ యముడిలా నిలబడ్డాట హనుమంతుడు. పెద్ద బండరాయిని ఎత్తి అతని రధం మీద విసిరాడట. రథం తునాతునకలైంది. ధుమరాక్షసుడు పరుగు లంకించుకున్నాడు.. అతని వెంటే హనుమంతుడు కూడా. మరో పెద్ద రాతిని చేతులతో పైకెత్తి అలాగే పరుగెత్తాడట.. రాక్షసుడు గదతో కొట్టినా చలించలేదట.. ఎన్నో యోజనాలు అలా పరుగెత్తి ధూమరాక్షసుడు అలసిపోతే వాడి నెత్తి ఆ రాయిని విసిరి చంపేశాడు.. తెలుసా?" అన్నది.


"అమ్మయ్యో.. ఎంతటి వీరుడో" అన్నది ఒక రాక్షసపడుచు.


"మరి ఏమనుకున్నావు? మరోనాడు అకంపనుడు పధ్నాలుగు బాణాలతో హనుమంతుడి గుండెల్ని చీలిస్తే కూడా లెక్క చేయక పెద్ద చెట్టుతో వాడి తలపై మోదాడుట.. నీలుణ్ణి చంపబోయిన నికుంభుణ్ణి పిడిగుద్దులతో చంపాడు, త్రిషీరుడు కోపగించి వస్తే అతని కత్తితో అతనినే చంపాడు.. ఆనాడు జంబుమాలిని శిరస్సును సైతం గదతో వేయి వక్కల చేయలేదా?" తదాత్మీయంగా చెప్పుకొచ్చింది కేతకి.


"అయితే అమ్మా... రావణుడి రాజ్యంలో పుట్టి శత్రువైన హనుమంతుణ్ణి ప్రేమిస్తున్నారే.."


"నోరు ముయ్యండి.. ప్రేమకాదిది.. ఆరాధన.. ఆయన నాకు దైవంతో సమానం" కోపంగా అంటూ బిర బిరా నడిచింది కేతకి.


అక్కడ అశోకవనంలో సీత కూర్చొని వుంది. రామాలింగనాభిలాషియై క్షణ క్షణం పరితపించిపోతోంది. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదని ఆమె కళ్ళు చెప్తున్నాయి. శీతలపవనాలతో ఆమెను నిద్రింపచేయాలని ప్రయత్నిస్తూ అశోక చెట్లు అలసిపోయాయి. రావణ సంహారం గురించి త్రిజట చెప్పగానే ఆనందంతో త్రిజటను గట్టిగా కౌగలించుకుంది. "రముడొస్తున్నాడు.. నా రాముడొస్తున్నాడని.." ప్రతి చెట్టుకీ చెప్పుకుంది. కీరవాణి రాగాల పక్షులను చేరదీసి రామనామం చెప్పించి మురిసిపోయింది. ఇక రాత్రేమిటి పగలేమిటి.. ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా.. ఎప్పుడు తాను అహల్య అయ్యి పాదాలు తాకుతానా, ఎప్పుడు తాను గుహుడు అయ్యి పాదాలు కడుగుతానా అని ఎదురు చూస్తోంది.. రామవామాంకాన కూర్చొని ఎప్పుడు ఆ పవిత్ర కరస్పర్శకు పరవశురాలిని అవుతానా అని ఎదురు చూస్తూ నిద్రను ఎప్పుడో తరిమేసింది.


కేతకి సీతను పరిశీలనగా చూసింది. నిద్ర లేమితో ఆమె కళ్ళు మగతగా వున్నాయి. నెమ్మదిగా మూసుకుపోతున్న కళ్ళతో ఒక్క క్షణం నిద్రలోకి జారుకొని, ఆ ఒక్క క్షణంలోనే రాముడు వచ్చేశాడేమో అన్న ఆతృతతో చటుక్కున కళ్ళు తెరిచి చుట్టుపక్కల చూస్తోంది. కేతకి నవ్వుకుంది.


"ఆ రోజు.. హనుమంతుడు సంజీవని తేవడానికి ఉత్తరానికి వెళ్ళినప్పుడు.. తాను ఇలాగే రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూసింది. గగన మార్గంలో తిరిగి వచ్చే హనుమంతుణ్ణి చూడాలని కళ్ళలో దీపాలు వెలిగించి కూర్చుంది. నిద్ర మత్తు వదలకపోతుంటే అటూ ఇటూ గెంతుతూ ఆంజనేయుణ్ణి అనుకరిస్తూ.. ఎప్పుడెప్పుడు వస్తాడా అని దృష్టంతా ఆకాశం మీదే నిలిపి వుంచింది... అంతలో సూర్యోదయం... సూర్యుడు వుదయిస్తే లక్ష్మణుడు బతకడు... లక్ష్మణుడు లేకపోతే రాముడు జీవించడు... స్వామి కార్యం నిర్వర్తించలేకపోయాడన్న అపఖ్యాతి హనుమంతుడి వస్తుంది.. ఆ విషయం తలుస్తూ సూర్యుణ్ణి నిందిస్తూ భోరున విలపించింది... తీరా చూస్తే అది సూర్యబింబం కాదు... సంజీవని బదులు ఆ పర్వతాన్నే పెకలించుకొని హనుమంతుడు.. ఆ పర్వత కాంతిలో వెలుగుతూ... ఓహ్... ఎంతటి మనోహర దృశ్యమది..!!"


"అమ్మా కేతకమ్మగారు.. ఏమిటమ్మ మీ పరధ్యానం" అంటూ పిలిచారు పరిచారికలు.


కేతకి తేరుకోని తెచ్చిన నగలను, పట్టు వస్త్రాలను సీత ముందు పెట్టించింది. సీతకు నమస్కరించి - "అమ్మా మిమ్మల్ని అలంకరించమని యువరాణి త్రిజటగారి ఆజ్ఞ.." అన్నది.


సీతమ్మ నవ్వింది. అలంకార భూషణాదులు తిరస్కరించింది. తన భర్త నార వస్త్రాలతో వుంటే తాను అవే ధరిస్తానని పట్టుబట్టింది.


"అమ్మా ఇంతకాలానికి నీ భర్తను చూడబోతున్నావు.. కొంతైనా అలంకారం లేకపోతే ఎట్లాగమ్మా" అని నచ్చ చెప్పబోయింది కేతకి.


సీతమ్మ నవ్వి నాడు హనుమంతుడు తెచ్చిచ్చిన అగుళీయకము తీసి చూపించి, తన వేలికి తొడుగుకుంది. కేతకి సంభ్రమముగా చూసింది. సీతారాముల అనురాగానికి చిహనమైన ఆ అంగుళీయకము తళుక్కున మెరిసింది. ఆ వుంగరము తెచ్చి ఇచ్చి ఈ నాడు వారి సమాగమానికి కారణమైన ఆంజనేయుణ్ణి తలచుకొని కేతకి భక్తిగా నమస్కరించింది.


ఇంతలో వందిమాగధులు వచ్చి నిలబడ్డారు. కేతకి గుండె వేగంగా కొట్టుకుంది.


"సీతారామసేవాపరాయణ.. బహాబలశాలి.. అంజనీపుత్ర.. వాయునందన.. హనుమనామభూషణ వేంచేస్తున్నారు.." అంటూ ప్రకటించారు.


సీత దిగ్గున లేచి నిలబడింది. కేతకి అనాలోచితంగా నాలుగడుగులు ముందుకు వురికి హనుమంతుణ్ణి చూడటానికి తహ తహ లాడింది.


"ఎందుకమ్మా అంత తొందర?" అన్నారు పరిచారికలు.


"నీకు తెలియదే.. ఒక్కసారి ఆయన్ను చూస్తే చాలు... ఆ వీరుడు.." చెప్తున్నదల్లా ఆగిపోయింది. అక్కడికి కొన్ని అడుగుల దూరంలో..


అదుగో.. అతనే.. వస్తున్నాడు.. చేతిలో గద, సూక్ష్మ దృష్టి, ఆజాను బాహువులు, కండలు తిరిగిన శరీరం.. ఠీవిగా.. దర్జాగా.. ఆయన వేసే ఒక్కొక్క అడుగుకి భూమి కంపిస్తున్నట్లుంది.. నిరంతర రామ నామ గానం.. అదిగో అదిగో అతనే ఆంజనా దేవి తపఃఫలం.. హనుమంతుడు.


కేతకి అలాగే చూస్తూ వుంది. హనుమంతుడు కొంత దూరమ్నుంచే సీతను చూశాడు.. అతనిలోని వానరుడు నిద్రలేచాడు. సంతోషంతో దుముకుతూ.. "అమ్మా.. సీతమ్మా.. జయం తల్లీ... విజయం.. శ్రీరామ విజయం.. నీ కష్టాలు తీరాయి మాతా.." అంటూ వచ్చాడి. సీతమ్మ పాదాలకు నమస్కరించాడు.


"అమ్మా నాడు నిన్ను దర్శించి నీ క్షేమ వార్తను రాముడికి తెలిపే భాగ్యం నాకు కలిగింది. ఈ నాడు యుద్ధానంతరం రామ క్షేమ వార్తను నీకు తెలియజేసే భాగ్యం కూడా నాకే దక్కింది తల్లీ.. నా జన్మ చరితార్థమైంది." అన్నాడు కన్నీళ్ళ పర్యంతమౌతూ.


సీతమ్మ కూడా కన్నీళ్ళు వర్షిస్తుండగా - "నాయనా.. ఈ శుభవార్త చెప్పిన నీకు ఏ బహుమతి ఇవ్వలేని నిర్భాగ్య స్థితిలో వున్నాను.. నిన్ను నా బిడ్డగా స్వీకరించడం తప్ప ఇంకేమి ఇవ్వలేను నాయనా" అన్నది.


"అమ్మా.. నీవెప్పూడూ మా సీతమ్మ తల్లివేనమ్మా.." అంటూ ఆమె చుట్టూ కలియ చూశాడు. ఆమె పక్కగా కేతకి తన పరివారముతో నిలబడివుంది. వారంతా అక్కడ జరుగుతున్న సంభాషణకు ఆర్ద్ర్తతకు లోనై స్థాణువుల్లా నిలబడిపోయారు.


"ఓహో.. రాక్షసులు అంతమైనా ఇంకా నిన్ను భయపెట్టి.. రావణుడికి లొంగమని నిన్ను ప్రలోభపెట్టిన ఈ రాక్షస కాంతలు ఇంకా బ్రతికే వున్నారా" అంటూ హూంకరించి గద పైకెత్తి వారి మీదకు దూకబోయాడు. ఆయన కళ్ళు పెద్దవి అయ్యాయి.. ఆవేశంతో వూగిపోతున్నాడు.. బలంగా పెదవులను బిగించాడు.. చేతులపై, వక్షస్థలం పైన కండలు వుబికి వస్తున్నాయి..


అతని భీకరాకారం చూసి పరిచారికలంతా భయంతో చెల్లాచెదురయ్యారు. ఎటు దిక్కు వారు అటు పరుగులు తీశారు. కేతకి ఒక్కతే అక్కడ నిలబడిపోయింది. నిశ్చలంగా, నిర్భయంగా.. హనుమంతుడి రౌద్ర రూపాన్ని మనసారా ఆస్వాదిస్తూ పరిసరాలను మర్చిపోయి వుంది.


"హనుమా ఆగు ఆగు నాయనా.." అంటూ సీత ఆపింది అతడిని. వీరంతా వీభీషణుడి కూతురు త్రిజట పంపించగా నన్ను అలంకరించేందుకు వచ్చారు. వీరే పాపము ఎరుగరు.. అయినా నన్ను బాధించిన రాక్షస కాంతలు సైతం వారి రాజు ఆజ్ఞనే కదా పాటించారు.." అంటూ సర్ది చెప్పింది.


కేతకి తేరుకోని హటత్తుగా ముందుకు వంగి హనుమంతుడి పాదాలపై పడి నమస్కరించింది. హనుమంతుడు ఆమెను లేవనెత్తి -


"నా రౌద్ర రూపం చూసి మహా మహులే భయకంపితులౌతారు.. నీవు చూస్తే పదహారేళ్ళు దాటని పసి పిల్లవి.. నీవు నన్ను చూసి అంత ధైర్యంగా ఎలా నిలబడ్డావు.." అన్నాడు మారుతి.


"స్వామి.. నేను పుట్టిన దగ్గరనుంచి లంకా నగర ఖ్యాతిని, రావణ పరివార వీరత్వాన్ని మాత్రమే విన్నాను. ఆ వీరులను సంభ్రమాశ్చర్యాలతో చూచాను.. అటువంటి వీరులనందరిని ఒక్క చేతితో మట్టి కరిపించిన మీ వీరత్వానికి ముగ్ధురాలనైనాను.. మిమ్మల్నే ఆరాధించాను.. పూజించాను.. మీరు నా దైవం.. అందుకే నాకు భయం వెయ్యలేదు.. ఈ లంకా నగర ఖ్యాతిని సమూలంగా నాశనం చేసిన మీ వీరత్వం.. మహా బలశాలురైన రాక్షుసులను దురిమిన మీ రౌద్రం దర్శించుకునే భాగ్యం కలిగినందుకు ధన్యురాలనైనాను.." అంటూ నమస్కరించింది కేతకి.


"పిచ్చి దానా.. ఎంతటి అమాయకురాలవమ్మా? ఈ రాక్షస సంహారం చేసింది మా కోతిమూక అనుకున్నావా? ఇదంత నా ప్రజ్ఞే అనుకున్నావా.. రాక్షసులను తుదముట్టించినది రామనామనే అస్త్రాలు, ఈ లంకను నాశనం చేసింది.. నా తోకకి పెట్టిన నిప్పు అనుకుంటున్నావేమో.. అది కాదు.. ఇదుగో ఈ సీతమ్మతల్లి కార్చిన కన్నీరు లంకా దహనం గావించింది.. అటువంటి ఈ సీతారాములను ధ్యానించు నీకు తప్పక శుభం కలుగుతుంది" అంటూ వెనుతిరిగాడు హనుమంతుడు.




కేతకి మనసులోనే సీతరాముల్ని ధ్యానించింది.
Category:

2 వ్యాఖ్య(లు):

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

బాగుందండీ.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అద్భుతంగా ఉంది.చదుతుండగానే ఎందుకో మరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.