మన కోసం ఒక దినం..!!






లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ ప్రతీ విషయానికి, సంబంధబాధవ్యాలకి ఒక దినం (డే) ఏర్పాటు చేసుకున్నాం మనం. మొన్నామధ్య కర్నూలు వెళ్తే అక్కడ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ పెద్ద బ్యానర్ కనపడింది. ఇదెక్కడి చోద్యమా అని ఆశ్చర్యపోతుంటే ఆ పక్కనే ప్రింటర్స్ డే సందర్భంగా మరో శుభాకాంక్షల బ్యానర్ కనిపించింది. ఇంకనే.. ఇక ముందు ముందు ఇంటర్నేషనల్ సినిమా కర్టన్ పుల్లర్స్ డే అనో చెవిలో గుబిలి తీసే వాళ్ళ డే అనో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని కొన్ని దినాలు ఆ రోజు చేయ్యాల్సిన పని మీద ఆధారపడి వుంటాయి. వుదాహరణకి నో స్మోకింగ్ డే అంటే ఆ రోజు పొగ తాగ రాదు. అలాగే ముందు ముందు సెల్ఫ్ బాత్రూం క్లీనింగ్ డే అనో చిరుగు బట్టలు కుట్టుకునే డే అనో క్యాలండర్లో వచ్చినా మీరు ఖంగారు పడకూడదు. అంతెందుకు ఎవరైనా తెలుగు వాడు అఖిలాంద్ర మాగాయ్ ఈటింగ్ డే అని ప్రకటిస్తే ఆనందంగా మజ్జిగలో మాగాయ నంజుకోవాలేకాని ఇదేమిటి అనకూడదు.

ఇంటర్నేషల్ లెఫ్టీస్ డే అని ప్రకటించారనుకోండి ఇక ఆ రోజంతా లెఫ్ట్ మహిమే. "వామాంక స్థిత జానకీ కాంత" ఆ రోజు పండగ చేసుకోవచ్చు. మన వామపక్షాలు కూడా ఆ రోజు ఎర్ర చొక్కాలేసుకోని సంబరాలు చేసుకోవచ్చు. ఇక కుడి చేతి వాటంగాళ్ళంతా తమది పుర్ర చెయ్యి వాటం కాదని బాధపడుతూ ఎన్టీఆర్ కృష్ణుడుగా ఎడంచేత్తో దీవించే ఫొటోలకి దణ్ణం పెట్టుకోవాల్సిందే. అలాగే నేషనల్ బ్లాక్ స్పెక్టకిల్స్ వేరింగ్ డే అని ప్రకటిస్తే ఎలా వుంటుంది. ఆ రోజు అందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. కరుణానిధి పుట్టినరోజే రోజే ఈ డే జరపాలని అరవ సోదరులు అరిచి గోల చేస్తారేమో. ఆ రోజంతా ప్రతివొక్కరు అమావాస్య చంద్రుళ్ళు అయిపోయి తిరగచ్చు. ఎంచక్కా అమ్మాయిల్ని చూసి కన్నుకొట్టినా, కను సైగ చేసినా ఏమాత్రం తెలియదు. సేఫ్టీకి సేఫ్టీ.. మనకీ ఏదో ఒక ఆనందం.

అసలు ఇన్ని రకాల డేస్ వున్నప్పుడు మన లాంటి సామాన్యుడి కోసం ఒక డే ఎందుకు వుండకూడదు అని నాకు ఆలోచన వచ్చింది. ప్రభుత్వాలు మారినా బతుకులు బాగుపడని సామాన్య జనం కోసం ఒక రోజు చాలా అవసరం అనిపించింది. అసలు అలాంటి రోజు ఒకటి వుందేమో అని విచారించి, లేనందుకు మరింత విచారించి ఎలాగైన మన కోసం ఒక దినం ఏర్పాటు చెయ్యాలని తీర్మానించుకున్నాను. ఈ విషయమై అసంబ్లీ స్థాయిలో పైరవీలు చేస్తే మంచిదని మా వూరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను.

ఆయన నా డిమాండు హోలు మొత్తంగా విని గట్టిగా నవ్వి - "అదేమిటయ్యా మీలాంటోళ్ళకోసం ఆల్రెడీ ఒక డే వుందిగా" అన్నాడు.
నేనెంత రీసర్చి చేసినా తెలియనిది మా ఎమ్మెల్యే గారికి తెలిసినందుకు ఎంతో సంతోషించి, చేతులు కట్టుకోని "అదేమిటో" అని అడిగా.
"ఏప్రియల్ ఒకటి.. ఫూల్స్ డే వుండనే వుందిగా" అంటూ పంచ సర్దుకోని చక్కాపోయాడాయన.
బుద్ధుడికి అదేదో చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు ఎమ్మెల్యే గారి ఇంట్లో యూరోపియన్ చాండిలీరు కింద నాకు జ్ఞానోదయం అయ్యింది. ఏప్రియల్ ఒకటో తారీఖు. ఆర్థిక సంవత్సరం మొదలయ్యే రోజు. ఇంటర్నేషనల్ ఫూల్స్ డే.. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అయితే ఒకటే బాధ పది రోజుల క్రితమే అయిపోయింది. ముందే తెలిసి వుంటే ఎంచక్కా పండగ చేసుకునే వాళ్ళం కదా?

అయితే ఆ విషయానికీ సాంత్వన కలిగించే సంగతి ఒకటుంది. ఎవరో ఇంగ్లీషు రచయిత చెప్పినట్లు - ఫూల్స్ డే అంటే మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు మనం ఏమిటో గుర్తు చేసే రోజట. నిజమే కద.. మనం 364 రోజులు ఎన్నిసార్లు ఫూల్స్ అవుతున్నామో మనకి తెలియదూ..!? అలా అంటే మొదట ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు మనకి ఇచ్చే వాగ్దానాలు, ఆ తరువాత గట్టున పెట్టే వొట్లు గుర్తుకు రావచ్చు. అంతకన్నా ఎక్కువే వున్నాయి - రాష్ట్రంలో ప్రభుత్వం నిజంగానే వుందని భ్రమింపజేస్తున్నది నిజం కాదా. అంతెందుకు మీ పర్సులో వున్న వెయ్యి రూపాయల నోటు నిజమైనదే అని మీరు నమ్ముతున్నారా? మీ వూర్లో మీ పొలం ఇంకా ఏ గనులకో లీజుకి వెళ్ళకుండా ఇంకా మీ పేరు మీదే వుందని నమ్ముతున్నారా? మీరు కొనే సరుకుల్లో ఇటికరాయి పొడి, మట్టిబెడ్డలు లేవని నమ్మి కొంటున్నారా? సెక్స్ స్కాము వీడియోల్లో కనిపించే నాయకులు, నటీమణులు అంతా గ్రాఫిక్స్ మహిమే అని చెప్తే వింటున్నాం కదా? ఏదో ప్రైవేటుగా చదువుకోనీ ర్యాంకు తెచ్చుకున్న పిల్లాణ్ణి కొనుక్కోని మా స్టూడెంటే అని చెప్పే విద్యా సంస్థల మాటలు నమ్ముతున్నామా లేదా? నెల రోజుల్లో మీరిచ్చిన డబ్బు రెట్టింపు చేస్తాం అనే “చీట్” ఫండ్ కంపెనీలను మీరెప్పుడు నమ్మలేదా? ఇంత ఏల - ఆఖరికి బస్సులో టికెట్ కొనుకున్న తరువాత కండెక్టర్ చిల్లర లేదు అంటే గుడ్డిగా నమ్మేసి కిటికీసీట్లో కూర్చోవట్లేదు...

ఇన్ని రకాలుగా అందరినీ నమ్మి అందరికీ మనల్ని ఫూల్స్ చేసే అవకాశం ఇచ్చాక ఏప్రియల్ ఒకటి మన దినం కాకుండా ఎలా పోతుంది? చెప్పండి.