ఎవడు చేసిన కర్మ వాడనుభవించకా.. తప్పదూరన్నా..!!


ఎకౌంట్స్ కొంచమైనా తెలిసినవాళ్ళు చెప్తారు ఒక చోట క్రెడిట్ పడితే మరెక్కడో డెబిట్ పడాలి అని. ఈ డెబిట్ క్రెడిట్‌లు జంట కవుల్లాగా కలిసే వుంటాయి. ఒక దానికి ఒకటి ప్రతిగా సమానంగా పడుతుంటేనే లెక్క "టాలీ" అవుతుంది. మన నిజ జీవితంలో కూడా మనం ఏదైనా పని చేసినప్పుడు - ప్రత్యేకించి ఆర్థిక వనరులు (Economic resources) వాడినప్పుడు - దాని పర్యవసానం మరెక్కడో మరెవరి మీదో పడుతూనే వుంటుంది. చాలా సార్లు ఆ విషయం మనకి తెలియకపోవటమే అందులో చిత్రం.వుదాహరణకి ఒక ఆఫీసరుగారు గుమస్తాని తిడితే గుమాస్తా ఇంటికి వెళ్ళి ఆ కోపం పెళ్ళాం మీద చూపిస్తాడు. సదరు ఇల్లాలు భర్తని ఏమీ అనలేని పరిస్థితిలో కొడుకుని నాలుగు చీవాట్లేసి కూర్చోపెడుతుంది. మరి కొడుకు చిన్నవాడైపోయే.. ఎవరినీ ఏమీ అనలేక, వెళ్ళి ఒక కుక్కని తంతాడు. ఇలా మనల్ని మోసం చేసే గొలుసు వ్యాపారాల్లాగా ఒకళ్ళనించి మరొకళ్ళకి "పర్యవసానం" పాకుతూనే వుంటుంది. ఒక్కోసారి అదే పర్యవసానం తిరిగి తిరిగి మొదలు పెట్టినవాడి మీదకే వచ్చి పడుతుంది. ఇందాక చెప్పిన కథలో పిల్లాడు కుక్కని కొట్టగానే కుక్క తిరగబడి కరిచిందనుకోండి, తల్లి మీద ఖంగారు ఆందోళన అనే ఎఫెక్ట్ పదుతుంది - అక్కడి నుంచి తండ్రిగారైన గుమాస్తాకి ఫోన్ వెళ్తుంది, గుమాస్తా గారు శెలవడిగితే బాసుగారు కాదంటారు - దాంతో రెచ్చిపోయిన గుమాస్తా - "కన్న కొడుక్కి కష్టం వస్తే శలవివ్వవా? నీలాంటి వాడికింద పనిచెయ్యడం కంటే శనక్కాయలు అమ్ముకోవడం నయం" అని రాజీనామా మొహం మీద కొట్టి వచ్చేస్తాడు.. చూశారా..!! భూమి గుండ్రంగా వుందన్నట్టు తిరిగి తిరిగి బాసు నెత్తినే వచ్చి పడింది కదా?అయితే చాలా సందర్భాలలో ఇలాంటి ఎఫెక్ట్ వెంటనే రాదు. ఏ సంవత్సరానికో, ఐదు సంవత్సరాలకో, కొన్ని దశాబ్దాలకో ఒక్కోసారి కొన్ని తరాల తరువాతో పర్యవసానం వచ్చి పడుతుంది. ఇప్పుడు మనం ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాం అనుకోండి ఆ నాయకుడి అసలు స్వరూపం వెంటనే తెలుస్తుందా? పాపం పండాలి, ప్రెస్ కన్ను పడాలి, స్ట్రింగ్ ఆపరేషన్ జరగాలి.. అప్పుడు మనం చేసిన తప్పు మనకి తెలుసుతుంది. అయితే అది తప్పు అని వొప్పుకోడానికి మనకి మనసొప్పదనుకోండి అది వేరే విషయం (దీని గురించి మరో టపా వచ్చే వారం). మరో విశేషమేమిటంటే పర్యవసానం వచ్చి మొహం మీద కొట్టినా ఆ పర్యవసానానికి మనం చేసిన తప్పుకి లింకు దొరకదు. లంకా వినాశనం సీతాపహరణం వల్లే జరిగిందని రావణుడికి కనీసం తమ్ముళ్ళు చెప్పేరు, వివేకవంతుడు కాబట్టి తెలుసుకున్నాడు. మహాభారత యుద్ధం, కౌరవవినాశనం తన గారాబం వల్లే జరిగిందని దృతరాష్ట్రుడు తెలుసుకోలేకపొయాడు. గాంధార రాజ్యంపైన దండెత్తి శకునిని బంధించినప్పుడే తన పతనం ఆరంభమైందని దుర్యోధనుడూ తెలుసుకోలేకపొయ్యాడు.తెలుసుకున్నా తెలుసుకోక పోయినా పర్యవసానం అనేది బూమరాంగ్ లాగా తిరిగి వచ్చి కొట్టకుండా వూరుకోదు. "ఎవరు చేసిన కర్మ వారు అనుభవించకా తప్పదూరా అన్నా.." అంటూ తత్వాలు పాడినా.. "నరకమనేది ఒకటి వుందంటూ" పెద్దలు చెప్పినా.. "ఏ చెట్టు నాటితే ఆ ఫలాలే తినా"లంటూ సామెతలు చెప్పినా విషయమదే. పిల్లల పసి వయసులో నేర్పించని బుద్ధులు పెద్దైన తరువాత రమ్మన్నా రావని చెప్పడానికే - మొక్కై వంగనిది మానై వంగునా అంటూ చెప్పారు. ఈ విషయం మీద మరో కథ గుర్తుకువస్తోంది -ఒక తల్లి, ఒక కొడుకు. కొడుకు చిన్ననాడే పక్కింట్లో తోటకూర దొంగతనం చేసి తల్లికి తెచ్చిచ్చి వండమన్నాడట. ఆ తల్లి "నా తండ్రే ఈ రోజు కూరగాయల ఖర్చు మిగిల్చావు" అంటూ ఆ పిల్లడ్ని ముద్దాడింది. తరువాత తరువాత ఆ పిల్లాడు పెరుగుతున్న కొద్ది తోటకూర నుంచి డబ్బు, నగలు, ఆఖరుకు ప్రాణాలు దోచుకునే స్థితికి వచ్చి పోలీసులకు చిక్కాడు. తల్లి పరామర్శకొస్తే - "అమ్మా తోటకూర కట్టనాడే తప్పని చెప్పి వుంటే నాకీ పరిస్థి రాకపోవును కదా" - అంటూ బాధపడ్డాడట.ఈ రోజు మనం అందరం ఆ తల్లి లాగే ప్రవర్తిస్తున్నాం. మన పిల్లలకి మనమే వుదాహరణలై తప్పు పనులు చేసి నేర్పిస్తున్నాం. చాక్లెట్ తింటే దాని కాగితం చెత్త బుట్టలో వెయ్యాలని చెప్పడం మరుస్తున్నాం. పబ్లిక్ పార్క్‌లో పూలు కొయ్యద్దంటూ బోర్డు వున్నా పూలు కోస్తూ ఫొటోలు తీసుకుంటాం, రోడ్డు జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలనే రూల్ మర్చిపోయి పిల్లల్ని ఎత్తుకోని అడ్డంగా రోడ్డు దాటేస్తుంటాం. రోడ్డు మీదే వుమ్మేస్తుంటాం, నిషేదించిన ప్రదేశాల్లో సిగరెట్ తాగేస్తుంటం, టాక్సులు ఎగ్గోట్టినా లంచాలు తీసుకున్నా ఇంట్లోనే దర్జాగా మాట్లాడుకుంటాం.ఏదో ఒకరోజు వీటన్నిటి పర్యవసానం వచ్చి పడుతుంది - మన మీదో మన పిల్ల మీదో. నాడు మా ముందు తరాలు ప్లాస్టిక్ వాడకపోయి వుంటే, కాలుష్యం పెంచకుండా వుండివుంటే ఈ రోజు మాకు గ్లోబల్ వార్మింగ్ వుండేది కాదు కదా అని మన ముందు తరాలు అనుకోకూడదు. తోటకూర కట్టనాడే చెప్పివుండల్సిందని మన పిల్లలు మనల్ని అడగే పరిస్థితి రాకూడదు. అలా ముందు తరాల ముందు తల దించుకోకూడదంటే ఇప్పటి నించే మనం మారాలి - ఎందుకంv మంచి చేస్తే దాని పర్యవసానం కూడా వెనక్కి వచ్చి మనకి మంచి చేస్తుంది. లేదంటే చేస్తున్న తప్పు గుర్తించని దృతరాష్ట్రులమై మిగిలిపోతాం..!!సర్వే జనా సుజనో భవంతు

సర్వే సుజనా సుఖినోభవంతు

4 వ్యాఖ్య(లు):

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

పర్యవసాన ప్రయాణం కాన్సెప్టు బాగుంది...నిజమే కదా!

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) చెప్పారు...

నిజమేనండీ, చిన్న చిన్న విషయాల్లో చూపే నిర్లక్ష్యమే తరువాత పెద్ద సమస్యగా పరిణమిస్తుంది.

santhi చెప్పారు...

chala bagundi,nigame schools lo ABC nu nerputaru kani samskaram itlo tali tandri ne nerpali.ade manchi prapanchaniki muulam

Vasuki చెప్పారు...

మీరు చెప్పిన, లేవనెత్తిన అంశాలు విస్మరించదగినవి కావు. మొదటి అడుగు మనమే వేయాలి. మొక్కై వంగనిది మానై వంగునా. నిజమే కదా.
శ్రీవాసుకి