తపాలా స్టాంపు ఎలా అంటించాలి?
ఏమంటూ మళ్ళీ రాస్తానని ప్రకటించానోగానీ, ఆరోజు నుంచి నా లాప్‌టాప్ మొడికేసింది. ఇంటర్నెట్ అసలు చేతులు ఎత్తేసింది. సరే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని - ఈ మధ్య కాలంలో నాకు నా దైవానికి ఇదే ఆట నడుస్తోంది.

ఇంతకీ ఈ రోజేం జరిగిందో తెలుసా.. నేను పోస్టాఫీసుకి వెళ్ళాను. ఎంత కాలం అయ్యిందో పోస్టాఫీసుకు వెళ్ళి.!! కాకపోతే అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పులేమీ కనపడటంలేదు. అప్పట్లో గాంధీ స్టాంపులు ఎక్కువగా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇందిరా గాంధీ స్టాంపులు అమ్ముతున్నారు. అప్పట్లో కనీసం పావలా (ఈ మధ్యే పరమపదించిన రూపాయిలో నాలుగో వంతు), ఇప్పుడు అధమం అయిదు రూపాయలు. అంత కన్నా పెద్ద మార్పేమీ లేదు. ఇప్పుడు కూడా కౌంటరు వెనకాల చిరాకు ముఖం పెట్టుకోని, ఆవలిస్తూ స్టాంపులమ్మే రిటర్మెంటుకు దగ్గరైన వుద్యోగి, పోస్టు డబ్బాలో వేస్తే వెనకనించి బయట పడిపోయే డబ్బాలు అవన్నీ అలాగే వున్నాయి.

నాకు చిన్నప్పటి నుంచి స్టాంపులంటే భలే సరదా. స్టాంపు కి స్టాంపుకి మధ్యన వుండే చిల్లుల వెంబడి మిగతా స్టాంపు చినగకుండా చించడం అరవై నాలుగు కళలలో ఒకటని నా నమ్మకం. కాకపోతే స్టాంపుల మీద దేశనాయకుల ఫోటోలు ఎందుకు వేస్తారో అర్థం అయ్యేది కాదు. ఈ మధ్య నాకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే - మీకు నచ్చని దేశనాయకుడి/నాయకురాలి స్టాంపు కొనుక్కోని దాని వెనక ఎంగిలి పూసి, కవరు మీద పెట్టి ఆ నాయకుడు/నాయకురాలి ముఖం మీద రెండు పిడిగుద్దులు గుద్దచ్చు. అంటే నాయకుల పట్ల మనకి వుండే కసి, కోపం ఆ రకంగా తీర్చుకోవచ్చునని బహుశా ఇలా ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది.

(ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా గుర్తున్నవాళ్ళు, ఈ నాలికమీద స్టాంపు ప్రహసనాన్ని అంత ఇష్టపడక పోవచ్చు. అందుకే ఒక డబ్బాలో జిగురు కూడా ఏర్పాటు చేశారు పోస్టాఫీసు వారు.)

ఏదో అలవాటు కొద్ది అనడమే కానీ పోస్టాఫీసు అనే పదం కన్నా తపాలా కార్యాలయం అంటే ఎంత సొగసుగా వుందో చూడండి. అసలు ఆ అందమంతా తపాలా అన్న పదం లోనే వుందని నాకనిపిస్తుంది. స్కాములన్నీ 2G 3Gలలో జరిగాయి కానీ తపాలాలో జరిగుంటే "తపాలా హవాలా" అంటూ ఎంత ప్రాసగా వుంటుందో కదా..!! అయినా మన పిచ్చి కానీ ఏదో జరిగే వుంటుంది. ఇంకా మనదాకా రాలేదు అంతే..!!

ఇంతకీ విశేషమేమిటంటే అదేదో కథలపోటీకి నేను సైతం ఒక కథ పంపిద్దామని సదరు పోస్టాఫీసులోకి అడుగుపెట్టాను. నేను స్టాంపులు కొంటుండగా, పక్కనే ఎవరో పిల్ల వచ్చి చటుక్కున నా కవరు ఒకటి తీసుకోని పరిశీలనగా చూస్తోంది. నేను హడలిపోయి, ఏమైనా పోస్ట్ కవర్లలో ఆంత్రాక్స్ వుందని చెకింగ్ చేస్తున్నారా అని హాచ్చర్యపడిపోయా.

"ఏమిటమ్మా విషయం?" అని ఆడిగితే -
"ఏం లేదండీ.. అడ్రస్ ఎక్కడ వ్రాయాలో తెలియదు అందుకే చూస్తున్నా.." అంది.
ఆహా... ఇది కదా నా దేశ పరిస్థితి అని కొంత విచారించి, ఆ అమ్మాయిని విచారణ దగ్గరకు పంపించాను. ఆ అమ్మాయి రాకెట్‌లా తిరిగొచ్చి "అక్కడెవ్వరూ లేరండీ... కొంచెం ప్రాసెస్ చెప్తారా?" అంది.
"ఏం ప్రాసెస్ తల్లీ" అంటే - "అదే.. అడ్రస్ ఎలా వ్రాయాలి? స్టాంప్ ఎక్కడ కొట్టించాలి.."
"స్టాంప్ నువ్వు కొట్టక్కర్లేదమ్మా... స్టాంపులని అమ్ముతారు అవి కొనుక్కోని, అంటించి ఆ డబ్బాలొ పడేస్తే వాళ్ళే తీసి ముద్దుగా ముద్దర్లు కొట్టుకుంటారు" అని వివరంగా వివరించాను.

నేను కొనుక్కున్న స్టాంపులు అంటించుకుంటుండగా ఆ అమ్మాయి కౌంటర్ దగ్గరకు వెళ్ళి -"మేడం ఎక్కువ స్టాంపులు వేస్తే తొందరగా వెళ్తుందా?" అని అడుగుతోంది.

ఇంకా ఎక్కువసేపు వుంటే "స్టాంపుకి జిగురు ఏ పక్క పూయాలి" అని అడుగుతుందేమో అని నా కవర్లు డబ్బాలొ వేసి పారిపోయి వచ్చాను.


(ఇది నిజం జరిగింది... కాకపోతే రాం గోపాల్ వర్మ రక్త చరిత్ర లాగా యధార్థ సంఘటన ఆధారంగా కల్పించిన కథ)

5 వ్యాఖ్య(లు):

రిషి చెప్పారు...

>స్టాంప్ నువ్వు కొట్టక్కర్లేదమ్మా... స్టాంపులని......

:))

Raghothama Rao C చెప్పారు...

:)))))))))

గీతాచార్య చెప్పారు...

Scream :D

Zilebi చెప్పారు...

Baavundandi. mee gurnaadam mavayya kathalu emayyaayi ?

cheers
zilebi
http://www.varudhini.tk

Kottapali చెప్పారు...

కేక, but sad too.
నిన్ననే ఒక టపా గిలికా, పట్టభద్రులైన భారతీయూలకి తెలిసుండవలసిన కనీస విషయ పరిజ్ఞానం ఎంత?