కథ చెప్తాను.. వింటావా?


ఎప్పుడూ లేనిది ఆ రోజు ఎందుకో బారు వైపు అడుగులేశాడు ప్రణవ్. సామాన్యంగా తోడు లేకుండా అతను ఒంటరిగా బారుకు వెళ్ళడం చాలా అరుదు. సరే వెళ్ళడం మాట అలా వుంచండి, అక్కడ అనుకోకుండా అతనికి సుజన్ కలవడమే విచిత్రం. సుజన్ కి, ప్రణవ్ కి చాలా కాలంగా స్నేహం వుంది. పైగా ప్రణవ్ రచయితగా పేరు పొందిన తరువాత సుజన్ అతనికి అభిమానిగా కూడా మారిపోయాడు.
“రేయ్ ప్రణవ్.. ఇట్రారా” అన్నాడు సుజన్ అతన్ని చూడగానే. ప్రణావ్ ముందు ఆశ్చర్యపోయినా తోడుగా మనిషి దొరికాడన్న సంతోషంతో సుజన్ దగ్గరకు వెళ్ళాడు.
“రా.. రా.. బేరర్... సార్ కి నాకు విస్కీ తీసుకురా” అంటూ అరిచాడు సుజన్. బేరర్ వరాలిచ్చే దేవుడిలాగా అడిగినవన్నీ అమర్చాడు. బయట చీకటిపడింది. ఇక్కడ బారులో మంది ఎక్కువ లేరు కాబట్టి మందు చిక్కబడింది. మత్తు తలకెక్కబడింది.
"నేను కూడా నీ లాగే కథలు రాద్దామనుకుంటున్నానురా.." సుజన్ అన్నాడు మత్తుగా.
"
ఏంట్రోయ్.. నీకు కూడా కథలు రాయాలనిపించింది.." నవ్వాడు ప్రణవ్ గమ్మత్తుగా.
"
చంపేస్తున్నాడురా వాడు..." సుజన్ అన్నాడు.
"
ఎవర్రా?" ప్రణవ్ చిరాకు.
"
ఇంకెవడు.. మా బాసు బోసుగాడు.."
“బాసులన్న తరువాత అంతమాత్రం ఇబ్బంది పెడతారు మరి. అది వాళ్ళ జన్మ హక్కు” అన్నాడు ప్రణవ్.
"అది కాదురా.. వాడి సాడిజం ఎక్కువైపోయింది... అందుకే వాడి గురించి ఒక కథ రాసిపడేయాలని నిర్ణయించుకున్నా”
"
బాగుంది... మంచి కథాంశం... బాగా రాసావంటే ఏదైనా కథల పోటీలో బహుమతి కూడా వస్తుండి.." భరొసా ఇచ్చాడు ప్రణవ్.
"
మరి కథ చెప్తాను వింటావా?"
"
కథలంటే ఎప్పుడైనా రెడీ చెప్పు... ఆగాగు.. ఇంకో పెగ్గు చెప్పి మొదలుపెట్టు" అన్నాడు ప్రణవ్. సుజన్ పెగ్గు చెప్పి గ్లాసులో వున్న కాస్త ద్రవం మింగి మొదలుపెట్టాడు.
"
ఉదయం ఏడుగంటలైంది...” ఒక్క క్షణం ఆగాడు.. “అలారం అదే పనిగా మోగుతోంది.."
"
ఆపరా.. ఆపు.."
"
ఏంటి అలారమా?"
"
కాదురా నీ కథ.."
"
ఏం? ఎందుకు?"
"
ప్రపంచంలో ఎన్ని కథలు ఇలా అలారం కొట్టడంతో మొదలయ్యాయి? నీ అలారం కొడితే నాకెందుకు, కొట్టకపోతే నాకెందుకు... డైరెక్ట్ గా కథలోకి రావాలి... వేరే రకంగా మొదలు పెట్టు"
"
సరే అయితే విను” అని ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు వాడు చచ్చిపడున్నాడు..."
"
బాగుంది... చాలా బాగుంది.. వాడు చచ్చిపడున్నాడు’... కొంచెం మిస్టరీ, సస్పెన్సుతో మొదలైంది... ఈ వాక్యం చదివారంటే పాఠకులు ఎవరు చచ్చాడు? ఎందుకు చచ్చాడు? అన్న కుతూహలంతో చదువుతారు.. కానీ తరవాత చెప్పు.." ఉత్సాహంగా అన్నాడు ప్రణవ్.
"
వాడు చచ్చిపడున్నాడు. వాడి శరీరం నిండా గాయాలు. బూటుతో తన్నినవి.. కర్రతో కొట్టినవి.. రాడ్డుతో బాదినవి.. మొత్తం రక్తం కారుతున్నాయి.."
"
నో.. నో.. నో... వాయలన్స్ వద్దు మనకి... ఇలా భీభత్స రసం పోషిస్తే ఎవరూ చదవడు... రక్తాలు, హత్యలు వద్దు మనకి.."
"
ఓకే... వాడు చచ్చిపడున్నాడు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. వాడే నా బాస్"
"
వాడు.. వాడు.. ఏంట్రా? వాడికో పేరు లేదా?"
"
వుండి.. బోసుబాబు"
"
అది మీ బాసు నిజం పేరు.. ఆయనకి తెలిస్తే చంపేస్తాడు. వేరే పేరేదైనా పెట్టుకో.."
"
ఏదో ఒకటి - సుబ్బారావో, పరంధామయ్యో.."
"
అదిగో అక్కడే దాల్ ఫ్రైలో కాలు వేశావ్... మన తెలుగు సాహిత్య చరిత్ర ప్రకారం పరంధామయ్య అంటే రిటైరైన మష్టారు. పంచె కట్టుకోని, చేతి కర్రతో, కళ్ళద్దాలతో ఎప్పుడు చూసినా గుండలమీద కుంపటిలా వున్న కూతుర్ని ఎవడో ఒకడి నెత్తిన మంటలా పెట్టాలని కాళ్ళు అరిగేలా తిరుగుతుంటాడు.."
"
అయితే సుబ్బారావు?"
"
సుబ్బారావంటే మధ్యతరగతి సంసారి. జీతానికి జీతానికి మధ్య ముప్ఫై రోజుల బ్రతుకు ఈడ్చే సామాజికుడు"
"
మరైతే పేరు బాగుంటుంది?"
"
ఆఫీసర్ అంటే కొంచెం మోడర్న్గా వుండాలి కదా?"
"
మరి బోసుబాబు అలా లేదుగా.."
"
అది వాస్తవం... కథలు మరీ అంత వాస్తవికంగా వుంటే కథ అచ్చు కాదు... కొంచెం ఆలోచించు.."
"
అయితే రంజిత్ అని పెట్టుకుందాం.."
"
ఫర్వాలేదు... బాగానే వుంది. ఇప్పుడు మళ్ళీ  మొదట్నుంచి చెప్పు"
"
రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. అసలు ఆ రంజిత్ గాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి కానీ భీబత్స రసం అవుతుందని చచ్చి శావంలా వుండిపొయాడు"
"
కథలో ఇలాగే వుంటుందా లేకపోతే నాకు చెప్తున్నావా?"
"
ఏమో తెలియదు నువ్వే చెప్పాలి... కానీ వాణ్ణి మాత్రం కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే"
"
అది నీలో వున్న ఫ్రస్ట్రేషన్.. అలాంటివన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కథ ఆలోచించాలి.."
"
వాణ్ణి తల్చుకుంటేనే వళ్ళు మండిపోతోంది.. ఇంక ప్రశాంతంగా ఎలా వుండగలనురా?"
"
అదే చిత్తప్రజ్ఞత అంటే... రచయతలకి అది చాలా అవసరం.."
"
సరే. అయితే విను. రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమంది ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి నవ్వుతున్నారు. నేను కూడా నవ్వుతున్నాను. ఆనందంగా, సంతోషంగా నవ్వుతున్నాను. "
"
అదిగో మళ్ళీ సాడిజం వస్తొంది... శవం ముందు జనం నవ్వడం వరకు బాగానే వుంది. నీ నవ్వే కొంచెం ఓవరైంది.."
"
సరే తీసెయ్... స్వతంత్రంగా కథ చెప్పే అవకాశం ఇవ్వటంలేదు నువ్వు."
"
నీ పిచ్చిగాని కథలురాసేవాడికీ, కవితలు రాసేవాడికి స్వతంత్రం అనేది వుండదు.."
"
అయితే నన్ను కూడా మామూలుగా నవ్వమంటావు? సరే... తరువాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి పాతిపెట్టారు..."
"
అప్పుడే స్మశానందాకా పొయ్యావే?"
"
ఏం చెయ్యమంటావు... శవాన్ని పెట్టుకోని భజన చేశాం అని రాయమంటావా?"
"
అంతేలే.. కానీ ఒకసారి శవాన్ని పాతి పెట్టాక ఇంక కథేముంటుంది?"
"
ఆలోచించనీ... ఆ... ఇది బాగుంది.. కుక్కలో నక్కలో వచ్చి వాడి శవాన్ని బయటికి లాగి..."
"
ఛీ.. ఛీ... హర్రర్ కథేమన్నా రాస్తున్నావా?"
"
మరి ఎలా... వాడు చచ్చినా నా కసి చావలేదు. ఏదోకటి చెయ్యాలి వాణ్ణి.."
"
అయితే ఒకపని చెయ్యి.. చాలావరకు కథల్లోలాగా మొదటి పేరా చివర్లో.. అతని శవాన్ని చూశాక నాకు గతం గుర్తుకొచ్చింది అని రాసి, మూడు నక్షత్రాలు పెట్టి వెనక్కి పో.. అక్కడ వాణ్ణి ఏదో ఒకటి చేసెయ్యి.."
"
ఇది బాగానే వుంది... కానీ ఏం చేస్తే బాగుంటుంది..?"
"
మొదట్నుంచి ఒకసారి చెప్పు... ఫ్లొ లొ ఏమన్నా వస్తుందేమో.."
"
సరే. అయితే విను. రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమంది ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి నవ్వుతున్నారు. శవాన్ని చూడగానే నాకు గతం గుర్తుకొచ్చింది. మూడు చుక్కలు. రంజిత్ 'నన్ను చంపద్దు... నన్ను చంపద్దూ అని అంటున్నాడు. నేను ఇనప బకిల్ వున్న బెల్టుతో పిచ్చ కొట్టుడు కొట్టాను..."
"
బాలేదు"
"
సరే పిచ్చ కొట్టుడు బాగాలేదంటే, వీర కొట్టుడు కొట్టాను అని రాద్దాం"
"
బాలేనిది అది కాదు... అసలు నువ్వు అతన్ని చచ్చేట్టు కొట్టడమే బాగలేదు... పైగా దానికి గతం అని ఫ్లాష్ బ్యాక్ ఒకటి.."
"
మరేం రాయాలి?"
"
అతని కుటుంబం గురించో, అమాయకమైన ముఖం గురించో, ఆఫీసులో అతను పడే కష్టం గురించో..."
"
రేయ్ ప్రణవ్.. బోసుబాబుకి సపోర్ట్గా మాట్లాడావో.."
"
బోసుబాబు కదురా... రంజిత్.. మన కథలో కారెక్టర్..."
"
కేరక్టర్ కాదు... నా బాసు బోసు బాబే... వాణ్ణే నేను చితక్కొట్టి చంపేశాను.. అదే కథ..."
"
అలాగైతే అది పత్రికల్లో అచ్చుకూడా కాదు... సొంట డబ్బుల్తో పుస్తకం అచ్చు వేయించుకునే రచయితలాగా తయారౌతుంది నీ బ్రతుకు."
"
భేతాళుడిలా డైలాగులు వెయ్యకు... నేను వాణ్ణి చంపుతున్నా అంతే అదే కథ. నువు వొద్దన్నావో నిన్ను ఇప్పుడే చంపుతా.." పక్కనే పడివున్న బీరు బాటిల్ ఎత్తాడు సుజన్. పైగా అప్పటికే బిల్లు టేబుల్ మీదకు వచ్చేసింది. కాదంటే బిల్లు కట్టాల్సివస్తుందని ప్రణవ్ కి అర్థం అయ్యింది.
"
ఇంట ప్రేమగా చెప్తే కాదంటానా? నీ ఇష్టం వచ్చినట్లు చెప్పు"
"
అయితే విను - రంజిత్ చచ్చిపడున్నాడు... వాడి వంటి నిండా గాయాలు. బూట్లతో తన్నినవి, కొరడాతో కొట్టినవి, రాడ్డుతో బాదినవి.
వాడి గాయాల నిండా రక్తం కారుతోంది. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు... కాదు కాదు నేనే నిర్ణయించాను. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమండి ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి
నవ్వుతున్నారు. వాళ్ళాంతా ఆఫీసులో అతని కింద పనిచేసే వాళ్ళు. నేను కూడా విరగబడి నవ్వుతున్నాను. హ్హా.. సరిగ్గా అప్పుడే నాకు గతం గుర్తుకొచ్చింది. మూడు చుక్కలు. రంజిత్ 'నన్ను చంపద్దు... నన్ను చంపద్దూ అని అంటున్నాడు. నేను ఇనప బకిల్ వున్న బెల్టుతో పిచ్చ కొట్టుడు కొట్టాను. దెబ్బలకే వాడు చచ్చిపోయాడు. వాడి శవాన్ని స్మశానానికి తీసుకెళ్ళి
పాతిపెట్టారు. తరువాత నక్కలు వచ్చి వాణ్ణి పీక్కుతిన్నాయి. వాడు దయ్యమయ్యాడు..."
"
అదేంటి కొత్తగా?"
"
చెప్పేది విను - వాడు దయ్యమయ్యి మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. నాకు మేరేజిడేకి లీవ్ ఇవ్వడానికి ఏడ్చిన వాడికి ఇప్పుడు వాడి డెత్ డే రోజు వాడి సీట్లో కూర్చోని వున్న నేను కనిపించాను..."
"
అదేంట్రా? నీకు ప్రమోషనా? నీకన్నా ముందు రావాల్సినవాళ్ళు ఉన్నారు కదా?"
"
కథ రాస్తోంది ఎవరు?"
"
నువ్వే"
"
సో ప్రమోషన్ కూడా నా ఇష్టమే..."
"
సరే కానీ"
"
ఇంకేముంది ఆఫీసరుగా నన్ను చూసిన బోసుబాబుగాడి దయ్యం ఆత్మహత్య చేసుకుంది."
"
బోసుబాబు కాదు రంజిత్.."
"
రంజిత్ అని రాస్తే నాకు తృప్తి రావటంలేదు... బోసు బాబనే రాస్తాను"
"
అయినా చచ్చి దయ్యమైనవాడు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడమేంటిరా?"
"
నా ఇష్టం... ఆత్మహత్య కాకపోతే మళ్ళీ నేనే దయ్యాన్ని కూడా చంపానని రాస్తా..."
"
సరే నీ ఇష్టమే.. కాకపోతే ఒక చిన్న సజెషన్.."
"
చెప్పు -"
"
మన ప్రస్తూత తెలుగు సాహిత్య ధోరణులు చూసినట్లైతే.."
"
తెలుగులో చెప్పు"
"
ఏం లేదురా... ఇప్పుడొస్తున్న కథలు చూడు.. చివర్లో ఒక పాత్ర మరో పాత్రకి మూడు నాలుగు పేరగ్రాఫుల ఉపన్యాసం ఇవ్వాలి... అండుకే చివర్లో దయ్యాన్ని చూసి నువ్వు బాసుగాడికి చిన్న లెక్చర్ ఇచ్చినట్లు రాస్తే బాగుంటుంది."
"
లెక్చెర్ ఇవ్వాలా... చచ్చినొడు.. వాడికి లెక్చెర్ ఇచ్చేదేంటి... వాణ్ణి మళ్ళీ మళ్ళీ చంపాలి అంతే.."
"
సరే అలాక్కానీ... బారు మూసేస్తున్నారు వెళ్దామా?"
"
సరే పద... కానీ ముందు కథ ఎలా వుందో చెప్పు?"
“కథ సూపర్ రా...
“అవును... బోసుబాబుని చెంపేశా... అదే సూపర్...
“కరక్టే... చంపాల్సిందే వాణ్ణి”
"
అన్నొటొరే మర్చిపోయాను కాకులు గద్దలు వున్నాయని మొదట్లో చెప్పాను కదూ... అవి మర్చిపోయాను. మళ్ళీ మొదట్నుంచి మొదలుపెడతాను..."
అప్పటికే ఆలస్యమౌతోందని ఇద్దరిని బయటికి మోసుకొచ్చి పడేశారు బార్లో పని చేసేవారు. కథ బయట కూడా కొనసాగుతూనే వుంది. మర్నాడు ఆఫీసుకి వెళ్ళాలని వాళ్ళకి గుర్తుకొచ్చేదాకా సాగుతుందది.
అయితే సుజన్ కథ రాశాడా? ఆ కథని తెలుగు సాహితీలోకం నిండు హర్షంతో స్వీకరించిందా? నిబిడాశ్చర్యంతో చూసిందా? లేక నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిందా? ఇవన్నీ ప్రస్తుతానికి శేషప్రశ్నలే.

<< ?>>
(కౌముది మాసపత్రిక, డిసెంబర్ 2012)
Category: