మొపాస కథలు: ఆ తరువాత

"నా బంగారుకొండలూ... ఇంక వెళ్ళి పడుకుంటారా?" అంది ఆ ముసలి జమిందారిణి.
ముగ్గురు పిల్లలూ - ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు - లేచి తమ బామ్మకి ముద్దుపెట్టారు. ఆ తరువాత పాస్టర్ మౌదీట్‌గారి వైపు తిరిగి గుడ్ నైట్ చెప్పారు. ప్రతి గురువారం వీళ్ళింటికి వచ్చి డిన్నెర్ చెయ్యడం ఆయన అలవాటు.
ఆ పాస్టరుగారు తన పొడవైన చేతులను వారి వెనక్కి పోనిచ్చి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకోని తన ఒళ్ళో కూర్చో బెట్టుకున్నాడు. చిన్నగా ముద్దు పెట్టుకోని వాళ్ళ తలలని ఒక కన్న తండ్రిలాగా గుండెలకి హత్తుకున్నాడు. ఆ తరువాత వాళ్ళని కింద విడిచిపెట్టాడు. ముందు అబ్బాయి ఆ తరువాత ఇద్దరు ఆడపిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
"మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా పాస్టర్‌గారూ" అడిగింది జమిందారిణి.
"అవునమ్మా చాలా ఇష్టం"
ఆ పెద్దామె మెరుస్తున్న తన కళ్ళని పైకెత్తి అతని వైపు చూసింది.
"అలాగైతే ఈ ఒంటరితనం మీ మెడలో గుదిబండలా మీకెప్పుడూ అనిపించలేదా?
"అనిపిస్తుంది.. అప్పుడప్పుడు.." అని ఆ తరువాత నిశబ్దంగా వుండిపోయాడతను. కాస్త తటపటాయించాడు. ఆ తరువాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. "నేను అందరిలా సాధారణమైన జీవితం గడపాలని నిర్దేశించబడలేదేమో.."
"అలా ఎందుకు అనిపిస్తుంది మీకు?"
"ఎందుకంటే.. అలా తెలిసిపోయింది అంతే. నేను ఇలా పాస్టరుగా వుండటానికే నిర్దేశింపడింది. ఆ నిర్దేశ్యం ప్రకారమే నడుచుకుంటున్నాను."
జమీందారిణి అతనివైపు కన్నార్పకుండా చూసింది.
"అలా కాదు ఫాదర్.. ఒక విషయం చెప్పండి. మాలాంటి వాళ్ళు ఎంతగానో ప్రేమించే ఈ జీవితానుభవాలని మీరు తృణప్రాయంగా ఎలా త్యజించగలిగారు? ఈ అనుభూతులే కదా మమ్మల్ని నడిపిస్తున్నాయి. మరి పెళ్ళి, సంసారం లాంటి స్వాభావికమైన అనుభవాలనుండి విడివడేలా మిమ్మల్ని ఏ శక్తి ప్రేరేపించింది? మిమ్మల్ని చూస్తే విపరీతమైన భక్తి వున్నట్టుగా అనిపించదు. పోనీ ఆవేశంలో నిర్ణయం తీసుకునేవారిలాగానూ కనిపించరు. అలాగని నిరాశ నిస్పృహలతో కృంగిపోయేవారిలా కూడా వుండరు. మరి ఇలాంటి భీషణమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశారు? ఏదైనా సంఘటన కారణమా? ఏదైనా విషాదం మిమ్మల్ని ఇలా ప్రేరేపించిందా?
పాస్టర్ మౌదీట్ లేచి నడుచుకుంటూ చలికాచుకునే నిప్పుగూడు దగ్గరకు వెళ్ళాడు. సాధారణంగా ఆ ప్రాంతపు పాస్టర్లు వేసుకునే పెద్ద పెద్ద బూట్లను మంటకి దగ్గరగా వుంచి ఏ సమాధానం చెప్పాలా అని తటపటాయిస్తున్నట్లు నిలబడ్డాడు.
అతను బాగా పొడగరి. నెత్తిన తెల్లటి జుట్టు. దాదాపు ఇరవై ఏళ్ళుగా అక్కడి సైంట్ ఆంటోనీ డూ రోచర్ చర్చిలో పాస్టరుగా వున్నాడతను. ఆతన్ని చూసిన ప్రజలు - "సాక్షాత్తు భగవంతుడు. ఎంత మంచివారో..." అని అనుకుంటూ వుంటారు. అతను నిజంగానే ఎంతో మంచివాడు పైగా అందరితో స్నేహంగా వుంటాడు. స్వతహాగా సౌమ్యుడు అన్నింటినీ మించి దయార్థ హృదయుడు. పలకరింపుకే పొంగిపోయి నవ్వేస్తాడు అలాగే చిన్న చిన్న విషయాలకే కన్నీరు పెట్టుకుంటాడు. అది చూసి కూడా చాలామంది ప్రజలు ఆయన్ని గొప్పగా కీర్తించేవారు.
ఈ జమిందారిణిది కూడా అదే అభిప్రాయం. ఆమె తన కన్న బిడ్డనీ, కోడలినీ ఒక దుర్ఘటనలో పోగొట్టుకున్నా, కేవలం మనమలని మనమరాండ్రనీ పెంచడం కోసంమే అన్నట్లు బతికుంది. సదరు పాస్టరు గారి గురించి మాట్లాడాల్సి వస్తే - "ఎంతో గొప్ప మనసు ఆయనది" అనేది.
ప్రతి గురువారం ఆయన వాళ్ళింటికి వచ్చేవాడు. వయసు మళ్ళిన ఆ ఇద్దరి మధ్య నిజాయితి నిండిన స్నేహం సాగుతోంది.
ఆమె పట్టు వదల్లేదు -
"చూడండి పాస్టరుగారూ... ఇప్పుడు కన్‌ఫెషన్ చేసేందుకు మీ వంతు వచ్చింది.. చెప్పి తీరవలసిందే." అంది.
ఆయన మాత్రం చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పాడు. "నేను సాధారణమైన జీవితానికై నిర్దేశింపబడలేదు. అదృష్టవశాత్తూ నా భవిష్యత్తుకి ఆనాడే దిశానిర్దేశ్యం జరిగిపోయింది. ఆనాడు తీసుకున్న నిర్ణయం తప్పుకాదని పదేపదే తెలుసుకుంటూనే వున్నాను -
"నా తల్లిదండ్రులు వర్డీయరస్ లో పట్టుబట్టలు అమ్ముతూ బాగా డబ్బు గడించారు. నేను కూడా ఏదో సాధించాలని కలలుకనేవారు. నా చిన్నతనంలోనే నన్ను బోర్డింగ్ స్కూల్‌కి పంపించేశారు. అలాంటి ఎడబాటు వల్ల కలిగే వంటరితనం వల్ల ఒక పిల్లవాడు ఎంత బాధని అనుభవిస్తారో మీరెవరూ ఊహించలేరు. ఆప్యాయత ఎరగని ఆ అలాంటి బతుకులు కొందరికి నచ్చవచ్చేమో కానీ, మరి కొంతమందికి ఆ తలంపే ఒక ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. వాస్తవం ఏమిటంటే చిన్న పిల్లలు మనం ఊహించే దానికన్నా సున్నిత మనస్కులు. అంత చిన్న వయసులోనే వాళ్ళని ప్రేమించేవారికి దూరంగా నిర్భందించడంతో వారిలో ఆ సున్నితత్వం ఇంకా పెరిగిపోయి వారిని దుర్బలులుగా మార్చేస్తుంది. అది చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు.
"నేను అక్కడ ఏ రోజూ ఆడింది లేదు. నాకు మిత్రులు వుండేవారు కాదు. ఇంటి మీద బెంగతో, అదే ఆలోచనతో గంటలు గంటలు గడిపేసేవాడిని. రాత్రులు నా మంచం మీద కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాడిని. నా ఇంటికి సంబంధించిన ఏ చిన్న జ్ఞాపకాన్నో గుర్తు చేసుకునే ప్రయత్నం చేసేవాణ్ణి. చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న సందర్భాలు కరిగిపోతూ కనిపించేవి. నేను వదిలేసి వచ్చిన ప్రతి విషయాన్నీ ప్రతిక్షణం గుర్తుచేసుకుంటూ గడిపేవాణ్ణి. ఈ క్రమంలో నాకు తెలియకుండా నేను ఇంకా సున్నితమనస్కుడిగా మారిపోయాను. చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడే విధంగా తయారయ్యాను.
చాలా పొదుపుగా మాట్లాడేవాడిని. నాలోకి నేనే కుంచించుకుపోయేవాడిని. ఆప్తులు లేరు. ఎదుగుదల లేదు. ఇదంతా అంతర్లీనంగా, క్రమ క్రమంగా నాలోపల జరిగిపోతూనే వుండేది. అలాంటి చిన్న వయసులో వీటి ప్రభావం మనసుమీద ఎక్కువగా వుంటుంది. ఆ వయసులో మానసికస్థితి పూర్తిగా అభివృద్ధి చెందే వరకూ ప్రశాంతమైన జీవితం గడపడం చాలా అవసరం. కొందరు పిల్లలలో అలాంటిది జరగనప్పుడు అన్యాయంగా విధించబడినిన ఏకాంతాలు ఎంతటి వేదనని కలిగిస్తాయో తెలుసా? కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఆప్త మిత్రుడు చనిపోయిన సందర్భంలో మాత్రమే మళ్ళీ అంతటి వేదనని అనుభవించాను నేను. ఆ తరువాత చిన్న చిన్న కారణాలకే దారుణంగా మధనపడే స్వభాన్ని ఎవరు అర్థంచేసుకోలేరు. ఆ తరువాత అది క్రమంగా వెర్రితనంగానో, నయం కానీ రోగంగానో పరిణమించినా దానికి కారణాలు వెతకలేరు.
"సరిగ్గా ఇదే నా పరిస్థితి. ఆ బాధ నన్ను ఎంతగా దహించేదంటే అది చావుకి మరణానికీ మధ్య ఊగిసలాడేది..
"నేను ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎక్కడా చెప్పుకోలేదు. కానీ క్రమంగా నా మనసు ఒక మానని గాయంలా మారిపోయింది. నన్ను జీవితంలో జరిగే ప్రతి సంఘటన నన్ను బాధతో మెలితిప్పేది. భయంతో వణికిపోయేవాణ్ణి. చివరికి నా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసేవి. తమ మనసుల చుట్టూ నిశ్చింత అనే అడ్డుగోడ కట్టుకోని, ఉదాసీనత అనే ఆయుధంతో బతికేసే వాళ్ళని చూస్తే, వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించేది.
"నాకు పదహారేళ్ళ వయసు వచ్చింది. అప్పటికే అసహజమైన నా సున్నితత్వం లో నుంచి అర్థంలేని పిరికితనం పుట్టుకొచ్చింది. విధి నన్ను మింగేసే అవకాశం కోసం చూస్తోందన్నంతగా భయపడేవాణ్ణి. ప్రతి పరిచయం ఒక భయమే. ప్రతి అడుగు భయమే. ప్రతి కదలికా భయమే. ఏ గుర్తు తెలియని భావమో నన్ను అంతం చేస్తుందని భావిస్తూ ప్రతి క్షణం ఒక దురదృష్టమే అనుకుంటూ బతుకు ఈడ్చేవాడిని. పదిమందిలో మాట్లాడటానికీ, ఏమైనా చెయ్యడానికి కూడా సాహసించేవాడిని కాదు. జీవితం అంటేనే ఒక సంగ్రామమనీ అందులో ఎదురుదెబ్బలుప్రాణాంతకమైన గాయాలు తప్పవని అనిపించేది. అందరిలాజరగబోయే దాని గురించి ఎంతో ఆశతో, ఉత్సాహంతో ఎదురుచేటం మానేసి కేవలం అర్థంకాని భయాలతో మాత్రమే బతికేవాడిని. నన్ను నిహతుణ్ణి చేసే ఆ మహాయుద్దం నుంచి నన్ను నేను దాచేసుకోని, తప్పించుకోవాలాని విశ్వప్రయత్నం చేసేవాడిని.
"నా చదువులు పూర్తైన తరువాత కెరీర్ ఎంచుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఇచ్చారు. అప్పుడు అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన శిధిలమైపోతున్న నా పరిస్థితిని నాకే కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టేలా చేసి, వీటన్నింటి నుంచి దూరంగా పారిపోయేందుకు నిర్ణయం తీసుకునేలా చేసింది.
"మా వూరు వెర్డీయర్స్ చాలా చిన్నది. వూరి చుట్టూ పచ్చటి భూములు, చెట్లూ వుండేవి. వూరి నడిబజరులో వుండేది నా తల్లిదండ్రుల ఇల్లు. అక్కడ గడపాలని ఎంతగానో ఆరాటపడ్డ నేను తీరా అక్కడికి వెళ్ళాక మాత్రం ఆ ఇంటికి దూరంగా గడపడానికే ఇష్టపడేవాణ్ణి. నా మనసులో కదిలే కలలు స్వేచ్చగా ఎగిరి సుదూరానికి వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఒంటరిగా పొలాల వెంబటి తిరిగేవాణ్ణి. అమ్మ నాన్న ఇద్దరూ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో తలమునకలై వుండేవాళ్ళు. నా భవిష్యత్ ప్రణాలికలు చర్చించేవాళ్ళు. ఎన్నో తెలివితేటలతో పాటు ప్రాక్టికల్ ఆలోచనలు వున్నవాళ్ళు ఎలా వుంటారో అలాగే వుండేవాళ్ళు. నాపైన ప్రేమ కురిపించడానికి వాళ్ళ మనసులని కాకుండా మెదడుని వాడేవాళ్ళు. నేను మాత్రం నా ఆలోచనలకు బందీనై, అంతులేని నా సున్నితత్వం వల్ల గడగడలాడుతూ వుండేవాణ్ణి.
"అప్పుడే ఒక సాయంత్రం చాలా సేపు అటూఇటూ తిరిగిన తరువాత ఇంటికి తిరుగు ప్రయణం అయ్యాను. అప్పటికే ఆలస్యమైందని వడివడిగా నడుస్తున్నాను. అప్పుడే ఒక కుక్క నడుచుకుంటూ నా వైపుకి రావడం గమనించాను. రెడ్ స్పానియల్ జాతికి చెందిన కుక్క అది. సన్నగా, పొడవాటి చెవులతో చిత్రంగా వుంది.
"నాకు ఓ పదడుగుల దూరంలో అది ఆగిపోయింది. నేను కూడా అలాగే ఆగిపోయాను. దాంతో అది చిన్నగా తోక వూపుతూ, భయపడుతూ, చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నా వైపుకే నడవటం మొదలు పెట్టింది. మునికాళ్ళ మీద కొద్దిగా ముందుకు వంగి తలాడిస్తూ నాకేదో చెప్పాలనుకున్నటు వ్యవహరించింది. నేనూ పలకరించాను. పాపం అది దిగాలుగా నన్ను చూస్తూ, వినయంగా వంగి నన్ను ఏదో వేడుకుంటున్నట్టు ముందుకు పాకింది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.  నేను దగ్గరకు వెళ్దామని ప్రయత్నం చేస్తే అది కొంత దూరం పారిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. నేను మోకాలి మీద కూర్చోని దాన్ని దగ్గరకు రమ్మనమని మృదువుగా పిలవడం మొదలుపెట్టాను. చివరికి ఎలాగోలా నాకు అందేంత దగ్గరకు పాకుతూ వచ్చింది. నేను చెయ్యి చాపి దాన్ని మృదువుగా తట్టాను.
"అది క్రమంగా ధైర్యం తెచ్చుకోని, నెమ్మదిగా నిలబడి, నా భుజాలపైన కాళ్ళు వుంచి ఎక్కి, నా ముఖాన్ని నాకడం మొదలుపెట్టింది. ఆ తరువాత నా వెనకే మా ఇంటిదాకా కూడా వచ్చింది.
"నేను మనస్పూర్తిగా అభిమానించిన మొదటి జీవి ఆ కుక్క. ఎందుకంటే ఆ కుక్క తిరిగి తన ఆప్యాయతని వ్యక్తం చేసింది. హాస్యాస్పదంగా అనిపించచ్చు కానీ ఆ కుక్క పైనా నేను మితిమీరిన ప్రేమని పెంచుకున్నాను. కొంత తికమకగా అనిపించినా ఆ కుక్కా, నేను ఇద్దరం అన్నదమ్ములమేమో అనిపించింది. ఇప్పటిదాకా ఇద్దరం ఈ ప్రపంచంలో తప్పిపోయి, తోడులేని ఒంటరి జీవితాలను గడిపామని అనిపించింది.
అంతే ఇక ఆ కుక్క నన్ను వదిలింది లేదు. నా మంచం కింద మొదట్లో పడుకునేది. అమ్మా నాన్నా అభ్యంతరపెట్టినా డైనింగ్ టేబుల్ దగ్గరే తినేది. నా ఒంటరి నడకలలో నాకు తోడుగా వచ్చేది.
తరచుగా ఒక గుంటపక్కన వున్న గడ్డిలో నేను కూర్చునేవాడిని. మా "శ్యాంగాడు" పరుగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ దగ్గర చేరేవాడు. నా చేతిని తన తలతో పైకెత్తి తనపైన వేసుకునేవాడు. నేను ప్రేమగా నిమిరితే వాడికి భలే సరదాగా వుండేది.
జూన్ చివరిలో ఒక రోజు మేమిద్దరం సైంట్ పెర్రీ ది ఛావొల్ నుండి తిరిగి వచ్చే రోడ్డు మీద వున్నాం. పవేర్యూ నుంచీ వస్తున్న తపాలా బండి నాకు కనపడింది. నాలుగు గుర్రాలూ మంచి దూకుడు మీద పరుగెడుతున్నాయి. పసుపుపచ్చ బండి, పైన నల్లటి తోలు కప్పి వుంది. బండివాడు కొరడా ఝుళిపిస్తూ నడిపిస్తుంటే చక్రాల కింద దుమ్ము చిన్న చిన్న మేఘాల్లా పైకి లేచి అలాగే వెనక్కి వెళ్ళిపోయి మాయం అయిపోతున్నాయి.
ఆ బండి నాకు దగ్గరగా వచ్చేసరికి మా శ్యాంగాడు ఆ చప్పుడుకి భయపడిపొయాడు. నాకు దగ్గరగా రావాలని ఉన్నట్టుండి ఒక్క దూకు దూకాడు. ఆ దూకటం దూకటం బండి ముందు పడ్డాడు. పాము పడగలా లేచిన గుర్రాల కాళ్ళు వాడి మీద పడ్డాయి. వాడు కింద పడి దొర్లడం, తిరగబడి వెల్లకిలా పడటం, గుర్రాల వెనక కాళ్ళు కూడా తొక్కడం అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. బండి రెండు మూడు కుదుపులకు లోనైంది. బండి దాటిపోయిన తరువాత వెనకగా దుమ్ములో ఏదో కదలడం చూసి ముందుకి ఉరికాను. శ్యాంగాడు దాదాపు రెండు ముక్కలైపోయాడు.  శరీరంలో భాగాలు బయటికి వేలాడుతున్నాయి. గాయాలనుంచి రక్తం కాలువలు కట్టి పారుతోంది. లేచి నిలబడాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు వాడు. ముందు రెండు కాళ్ళు మాత్రం కదిలించగలిగాడు. వాటితో మట్టిని గుంటలు పడేలా గీరాడు. వెనక కాళ్ళు అప్పటికే చచ్చుబడిపోయాయి. బాధతో పిచ్చిపట్టినట్లు ఊళపెట్టాడు.
"కొన్ని నిమిషాల్లోనే వాడి ప్రాణం పోయింది. నేను ఎంత క్షోభననుభవించేనో మాటల్లో చెప్పలేను. దాదాపు నెలరోజులు నా గది దాటి బయటికి రాలేకపోయాను.
"ఒక రోజు మా నాన్న చాలా కోపంగా అరిచాడు. ఇంత చిన్న విషయానికి అంతగా బాధపడాలా అనిపించింది ఆయనకి.
"దీనికే ఇంత ఇదైపోతున్నావు. రేప్పొద్దున నిజమైన బాధ కలిగితే ఏం చేస్తావు? నీ పెళ్ళామో పిల్లలో నీకళ్ళ ముందే చచ్చిపోతే ఏం చెయ్యగలవు?" అన్నాడు
"మా మాటలు నన్ను వెంటాడాయి. అప్పటి నుంచే నా పరిస్థితి నాకు స్పష్టంగా కనపడటం మొదలైంది. చిన్న చిన్న ఇబ్బందులు కూడా నాకు పెద్ద ప్రమాదాలుగా ఎందుకు కనపడుతున్నాయో తెలుసుకున్నాను. భయంకరమైన నా సున్నితత్వం వల్ల ప్రతి బాధా కొన్ని వేల రెట్లు పెరుగుతోంది. అందువల్లే నేను ప్రతిదానికీ విషాదంలో కృంగిపోతున్నాను. ప్రాణాలంటే మహాచెడ్డ భయం నన్ను ఎప్పుడూ కమ్మేస్తోంది. అందుకే నేను ఏ ఆశయమూలేని రసహీనుడిగా మిగిలిపోయాను.
పుట్టాక తప్పని బాధలన్నింటినీ తప్పించుకోవాలంటే ఆనందించడానికి వున్న అవకాశాలను త్యజించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అల్ప ప్రమాణమైన జీవితాన్ని పరుల సేవలో గడపాలనీ, వారి కష్టాలను తొలగిస్తూ వారి సంతోషాలలో పాలుపంచుకోవాలనీ అనుకున్నాను. ఆ విధంగా కష్టాలను సంతోషాలను నేరుగా కాకుండా వేరే వారిద్వారా అనుభవిస్తే ఆ బాధ కానీ ఆనందంకానీ తక్కువగా వుంటుందని భావించాను.
"మీకు తెలుసో లేదో, ఇప్పటికీ కష్టాలు నన్ను కదిలిస్తాయి. కరిగిస్తాయి. అయితే ఇంతకుముందులా భరించలేని బాధగా మార్పు చెందాల్సిన కష్టాలు దయగా, జలిగా రూపాంతరం చెందుతున్నాయి.
"ఇప్పుడు నేను నా చుట్టుపక్కల వారిలో చూస్తున్న బాధలు నేరుగా నాకే సంభవిస్తే అది తట్టుకోగలిగేవాడిని కాదు. నేను చావకుండా నా పిల్లల మృత్యువును చూసే శక్తి నాకు లేదు. ఇన్ని జరిగిన తరువాత కూడా, కొంత బాధ, భయం నిగూఢమై నాలో వుండిపొయింది. ఇప్పటికీ పోస్ట్ మేన్ ఇంటికి వస్తే నా నరాల్లో చిన్న వణుకు పుడుతుంది. కానీ భయపడటానికి నాకంటూ ఏమీ లేదని ధైర్యం కలుగుతుంది."
ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత పాస్టర్ గారు మాట పలుకు లేకుండా వుండిపోయాడు. నిప్పుగూడులో రగులుతున్న మంటలోకి చూస్తూ వుందిపోయాడు. అక్కడేదో నిగూఢమైన రహస్యం వున్నట్లు, ఆయన్ని ఎంతో బాధపెట్టిన భయం అనేది లేకుండా వుండి వుంటే జీవితం ఎలా వుండేదో తెలిసిపోయినట్లుగా వుందా చూపు. చిన్నగా మరో మాట అన్నాడు -
"నేనన్నది నిజమే. నేను ఈ ప్రపంచంలో వుండవలసిన వాడిని కాదు"
జమీందారిణి ఏ బదులు చెప్పలేదు. చాలా సేపు మౌనంగా వుంది ఆ తరువాత అన్నది -
"నేను కూడా ఈ మనుమలు మనుమరాళ్లు లేకపోతే జీవించాలని ఆశించేదాన్నే కాదు.."
ఫాదర్ మరో మాట మాట్లాడుకుండా లేచి నిలబడ్డాడు.
పనివాళ్ళంతా వంటగదిలో వున్నారని ఆమే స్వయంగా ఆయన్ను సాగనంపడానికి ముఖద్వారం దాకా వచ్చింది. ఆ తలుపుకి ఎదురుగా వున్న గార్డెన్ లోకి అతని పొడుగాటి నీడ క్రమ క్రమంగా జారిపోయేదాకా చూసింది.

ఆ తరువాత ఆమె వెనక్కి వచ్చి మంట ఎదురుగా కూర్చుంది. మనం ఏ నాడూ ఆలోచించని ఎన్నో విషయాలు ఇప్పుడు ఆమె తలపుల్లో తిరుగుతూ వున్నాయి.

మూల కథ: After

1 వ్యాఖ్య(లు):

anu చెప్పారు...

‘ఆ బాధ నన్ను ఎంతగా దహించేదంటే అది చావుకి మరణానికీ మధ్య ఊగిసలాడేది’ అన్నారు.. చావుకీ.. మరణానికీ అర్థంలో తేడా ఏమైనా ఉందా? ఏమిటండీ అది?