మొపాస కథలు: ఒక సాయం చేస్తావా?

మొన్నామధ్య ఏవో సంగతులు మట్లాడుతుండగా పాడు పెట్టిన భవంతుల ప్రస్తావన వచ్చింది. ఆ రోజు కొంతమంది పాత స్నేహితులమంతా గోపాలరావుగారి బంగ్లాలో చేరి కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. అందరూ ఎవరికి తెలిసిన పాత భవంతుల కథలు వారు చెప్పాలనీ, అదీ నిజంగా జరిగినవి చెప్పాలని ఎవరో అన్నారు. సరిగ్గా అప్పుడే సీతాపతిరావుగారు ఈ కథ చెప్పారు. ఎనభై రెండేళ్ళ వయసు ఆయనది. మోకాళ్ళ నొప్పుల వల్ల కష్టపడుతూ లేచి, చేతిని బల్లమీద ఆనించి, వణుకుతున్న కంఠంతో చెప్పడం ప్రారంభించడాయన.

"
నాకు చిత్రమైన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఆ సంఘటన జరిగి ఇప్పటికి యాభై ఆరేళ్ళైనా, నెలలో ఒకసారైనా అది పీడకలలా గుర్తుకువస్తూనే వుంటుంది. ఇప్పటికీ పెద్దగా శబ్దం అయితే అదిరిపడతాను. చీకట్లో మసకగా ఏ వస్తువు కనపడ్డా అక్కడి నుంచి పరుగెత్తి పారిపోవాలనిపిస్తుంటుంది. అసలు చీకటంటేనే ఒకలాంటి దడ నా గుండెల్లో మిగిల్చిన సంఘటన అది. ఇలాంటి విషయాన్ని ఒకప్పుడు చెప్పుకోడానికి సిగ్గుపడేవాణ్ణి. కానీ ఈ వయసులో చెప్పుకోడానికి అభ్యంతరం ఏముంటుంది?. కాకపోతే అప్పట్లో వేసిన భయం వల్ల నాకు అంతు తెలియని అసహనం కలిగింది. అందువల్ల ఎవరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు మీకందరికీ జరిగింది జరిగినట్లు చెప్తాను. సావధానంగా వినండి.

1827
జులైలో రాజుపాలంలో అలా రోడ్డు వెంట నడుస్తూ వుండగా ఒక వ్యక్తి తారసపడ్డాడు. చూడగానే ఎవరో గుర్తుకురాలేదు కానీ ఎక్కడో పరిచయం వున్న ముఖం లానే తొచింది. అందువల్ల నేను ఆగి అతన్ని పరికించి చూశాను. అతను కూడా ఆగిపోయి, నన్ను గుర్తుపట్టినట్లు నా వైపు చెయ్యి చాపాడు.

అప్పుడు గుర్తించానతన్ని. అతను నా చిన్ననాటి స్నేహితుడు. దాదాపు అయిదేళ్ళైంది అప్పటికతన్ని చూసి. అయిదేళ్ళలో అర్థ శతాబ్దం వయసు మీద పడ్డట్లు కనిపించాడు. జుట్టంతా తెల్లబడి, ఏదో భారం మోసి అలిసిపోయినవాడిలా ముందుకు వంగి నడుస్తున్నాడు. అతనికి నా కళ్ళలో ప్రశ్నార్థకాలు కనిపించాయనుకుంటాను. అందుకే అతను అలా తయారవడానికీ, అతని జీవితం నాశనం కావడానికి కారణాన్నినాకు వివరించాడు.

ఒకమ్మాయి ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. సంవత్సరం పాటు సంతోషంగానే వున్నారు కానీ ఆ తరువాత ఆమె ఏదో హృద్రోగంతో కన్నుమూసింది. దాంతో వాడు ఒక్కసారిగా పిచ్చివాడైపోయాడు. ఆమె అంత్యక్రియలు జరిపిన రోజే ఆ వూరినీ, ఇంటిని వదిలేసి సొంతవూరైన రాజుపాలం వచ్చి అక్కడే ఒంటరిగా బతుకుతున్నాడట. బాధవల్లతేనేమీ, జీవితం పట్ల అనాసక్తతవల్లైతేనేమీ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట.

"
అనుకోకుండా కలిశావు కాబట్టి నిన్నో సహాయం అడగాలనుకుంటున్నాను. ఏమనుకోకు. నువ్వు ఒక్కసారి రాజమండ్రిలో వున్న నా పాతింటికి వెళ్ళిరావాలి. అక్కడ నా బెడ్‌రూంలో  ఒక బల్ల సొరుగులో కొన్ని కాగితాలు వున్నాయి. నాకు అత్యవసరంగా కావాల్సిన కాగితాలు.. అవి తెచ్చి పెట్టాలి. నా నౌకర్నో మరొకర్నో పంపించలేను. చాలా రహస్యమైన పత్రాలవి. ఇక నేనంటావా? ఆ ఇంటితో రుణం అప్పుడే తీరిపోయింది. ఆమె లేని ఇంట్లో నేను అడుగుపెట్టలేను. నీకు ఇంటి తాళం, సొరుగు తాళం ఇస్తాను. అక్కడ ఒక వాచ్‌మెన్ కూడా వున్నాడు. బంగ్లా తెరవమని అతనికి ఉత్తరం రాసి నీ చేతిలో పెడతాను. రేపు ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ కి ఇంటికి వచ్చావంటే అన్ని ఏర్పాట్లు చేసి మరీ పంపిస్తాను."

అతను అడిగిన ఆ చిన్న సహాయం చెయ్యడంలో నష్టం ఏమీ లాదని భావించాను నేను. అందుకే అతను చెప్పినదానికి ఒప్పుకున్నాను. నిజానికి వాళ్ళ వూరు అక్కడికి నాలుగైదు మైళ్ళ దూరంలో వుంది. అప్పట్లో నా దగ్గర వున్న గుర్రం మీద వెళ్ళానంటే ఒక గంట ప్రయాణం.

వాడు చెప్పినట్లే మర్నాడు పదిగంటలకి వాడితో కలిసి టిఫిన్ చేసి వివరాలు అవీ తెలుసుకున్నాను. ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లడలేదు వాడు. నాతో కలిసిన తరువాత గుర్తుకొచ్చిన ఇంటినీ, కరిగిపోయిన తన సంతొషాన్ని తల్చుకున్నాడు. ఒంటరిబతుకుని తిట్టుకున్నాడు. అంతుతెలియని మానసిక సంఘర్షణ గురించి చెప్పాడు.

ఆ తరువాత వివరంగా ఏం చెయ్యాలో చెప్పాడు. చాలా చిన్న పని అది. అతను చెప్పిన బల్ల కుడి వైపు పైన వున్న సొరుగులోంచి రెండు కవర్లు, ఒక కట్ట కాగితాలు తీసుకొచ్చి వాడి చేతిలొ పెట్టాలి. అంతే!

"
వాటిల్లో ఏముందో చూడకూడదు మరి.." అన్నాడు.

వాడి అనుమానానికి నాకు బాధనిపించింది. అదే విషయాన్ని కస్త కటువుగా చెప్పాను. వాడు తడబడ్డాడు.

"
క్షమించరా.. నా పరిస్థితి అర్థం చేసుకో..." అన్నాడు. వాడి కళ్ళలో నీళ్ళు. ఇంకేమీ చర్చించలేదు నేను.

మధాహ్నం ఒంటిగంటప్పుడు వాడు చెప్పిన పని చెయ్యడానికి బయల్దేరాను.

ఆ రోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. నా గుర్రం హుషారుగా ముందుకు సాగుతుంటే నేను లయబద్ధంగా వచ్చే గాలిపాట వింటూవుండిపోయాను. నా మొలలో వున్న కత్తి నా బూట్లకు తగులుతూ శబ్దం చేస్తూ వుంటే అది కూడా సాంగీతంలాగే వినిపించింది నాకు. అడవిలాంటి చెట్ల గుండా గుర్రం నడుస్తుంటే చేట్ల కొమ్మలు నా ముఖాన్ని తాకుతున్నాయి. నేను సరగాగా చెట్ల ఆకులను పళ్ళతొ పట్టి కోస్తూ, నములుతూ ఆ ప్రయాణాన్ని, అంతటి ఆహ్లాదకరమైన రోజుని అనుభవిస్తూ, ఆనందిస్తూ గడిపాను.

వాడి భవంతిని చేరుకోగానే వాచ్‌మెన్‌కి ఇవ్వమని వాడు రాసిచ్చిన కవర్ బయటకు తీశాను. అంతకు ముందు గమనించలేదు కానీ, ఆ కవరు అన్ని వైపులా అంటించివుంది. ఒక్కసారిగా కోపం పుట్టుకొచ్చింది. పోనీ ఆ పని అక్కడే వదిలేసి వెనక్కి పోదామని అనుకున్నాను కానీ, మర్యాదకాదని ఆగిపోయాను. వాడేదో బాధల్లో వున్నాడు - యధాలాపంగా అతికించి వుంటాడని సర్ది చెప్పుకోని ముందుకు కదిలాను.

అప్పటికి నాలుగేళ్ళే అయినా దాదాపు ఇరవై ఏళ్ళు పాడు పెట్టినంతగా శిధిలమై వుందా భవనం. సింహద్వారం దగ్గర వున్న ఇనుపగేటు తెరిచే వుంది. పైగా వూడి పడిపోయేందుకు సిద్ధంగా వుంది. లోపలికి దారితీసే నాపరాళ్ళ బండల మధ్యలోనుంచి మొక్కలు మొలిచి దారి కనపడకుండా చేస్తున్నాయి.

నేను తలుపు తీసిన శబ్దం వినపడిందేమో వాచ్‌మెన్ బయటికి వచ్చి ఆశ్చర్యంగా చూశాడు. నేను ఇచ్చిన వుత్తరాన్ని అనుమానంగా అందుకోని ఒకటికి రెండు సార్లు చదివాడు. మధ్య మధ్యలో నా వైపు చూసి రెండో సారి చదవటం పూర్తి చేసి ఆ కాగితాన్ని తన జేబులో పెట్టుకున్నాడు.

"అయితే తమరెందుకొచ్చినట్లు?" అన్నాడు చివరికి.
"
ఏం? అందులో మీ అయ్యగారు రాయలేదా? నేను లొపలికి వెళ్ళాలి" అని క్లుప్తంగా చెప్పాను. అతను బిత్తరపోయాడు.
"
మీరు లొపలికి... అంటే ఆమె గదిలోకి వెళ్తారా?" అడిగాడు. నా సహనం నశించింది.
"
ఏరా నా మీదే అనుమానమా? ప్రశ్నలడుగుతున్నావ్?" అన్నాను. వాడు తడబడ్డాడు.
"
కాదు బాబుగారూ.. ఇదీ.. ఈ బంగ్లా.. ఆ చావు తరువాత తెరవలేదు. ఒక్క అయిదు నిముషాలు వున్నారంటే నేను లోపలి పోయి మొత్తం ఒకసారి చూసి.." అతని మాటల్ని అక్కడే తుంచేశాను నేను.

"
ఏరా ఆటలాడుతున్నావా? తాళం నా దగ్గర వుంటే నువ్వు లొపలికి ఎట్లా వెళ్తావు?" అన్నాను. అతను ఆ పైన అభ్యంతరపెట్టలేదు.

"అయితే పదండి బాబు తమరికి దారి చూపిస్తాను" అన్నాడు.

"నాకు పైగదికి వెళ్ళే మెట్లు ఎక్కడున్నాయో చూపించు చాలు.. నేను వెళ్ళగలను"

"చూపిస్తాను బాబూ... కాకపోతే.." అంటూ ఇంకేదో చెప్పబోయాడు. నా ఓపిక పూర్తిగా నశించి వాణ్ణి ఒక్క తోపు తోసి లోపలికి వెళ్ళిపోయాను.

ఆ ఇంటి మొదట్లో వున్న రెండు గదుల్ని, ఒక వంటగదిని వాచ్‌మెన్ కుటుంబం వాడుతునట్లుంది. వాటిని దాటుకోని మధ్యలో వున్న పెద్ద హాలులోకి చేరుకున్నాను. అక్కడున్న మెట్లు ఎక్కి పైన వున్న గదిలోకి వెళ్ళాలని నా మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ మెట్లేక్కి వాడు చెప్పిన గదిలోకి సులభంగానే ప్రవేశించాను.

లోపల మొత్తం చీకటిగా వుండటంతో మొదట ఏమీ అర్థం కాలేదు. పైగా ఎన్నాళ్ళుగానో మూసి వుండటం వల్ల వచ్చే ఒకరకమైన వాసనకి కొంత వెనకడుగు వేశాను. కాస్త కళ్ళు కుదుటపడగానే ఆ గదిలో వున్న మంచం, దాని మీద వున్న పరుపు, దిండు అస్పష్టంగా కనిపించాయి. అంతా చిందరవందరగా వుంది. పరుపు మీద పక్కగుడ్డ కూడా పరిచిలేదు. దిండు మీద మాత్రం అప్పుడే ఎవరో పడుకున్నట్టుగా గుంతపడి వుంది. కుర్చీలు ఎక్కడ పడితే అక్కడ పడివున్నాయి. పక్కన అరమరలా కనిపిస్తున్న చోట తలుపు సగం మూసినట్లు అనిపించింది.

అన్నింటికన్నా ముందు కిటికీల దగ్గరకు వెళ్ళి, వాటిని తెరిస్తే కొంత వెలుగు వస్తుందేమో అని ప్రయత్నం చేశాను. తుప్పు పట్టిన తలుపులు ఒక పట్టాన తెరుచుకోలేదు. నా కత్తితో వాటిని పగులగొడదామని కూడా చూశాను కాని ఫలితం శూన్యం. నా ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో చిరాకనిపించింది. పైగా అప్పటికే నా కళ్ళు ఆ మసక చీకటికి అలవాటుపడటంతో, వెలుతురు కోసం ప్రయత్నం ఆపి నేను నా స్నేహితుడు చెప్పిన పని చెయ్యడానికి బల్లదగ్గరకు నడిచాను.

అక్కడే వున్న ఒక కుర్చీలో కూర్చోని బల్ల కుడివైపు పైన వున్న సొరుగు తెరిచాను. దాన్నిండా ఏవేవో కాగితాలు వస్తువులు వున్నాయి. అయితే నాకు కావాల్సిన వస్తువులు ఎలా గుర్తించాలో తెలుసుకాబట్టి వాటికోసం వెతకసాగాను.

అలా కనిపించీ కంపించని వెలుగులో కష్టపడి వెతుకుతున్న హడావిడిలో వెనుకగా ఏదో చప్పుడు అయినా పట్టించుకోలేదు. బహుశా కిటికీకి వున్న పరదా వూగుతూ చేసిన చప్పుడేమో అని అనుకున్నాను. అయితే మరికొద్ది సేపటికే అర్థం కాని ఆ శాబ్దమేదో మళ్ళీ వినిపించడంతో కొద్దిగా అనుమానించాను. అయితే నా అనుమానం, భయం నా గౌరవానికే భగం అనిపించి వెనక్కి చూడకూడదనుకున్నాను. అప్పటికే నాకు కావాల్సిన రెండో కవర్ కూడా దొరికింది. సరిగ్గా నేను అందుకోవాల్సిన కాగితాల కట్ట మీద చెయ్యి వేశానో లేదో అప్పుడే నా వెనుక, నా భుజాలకి కొంచెం పైన ఒక బాధాకరమైన నిట్టూర్పు వినపడి అదిరిపడ్డాను. ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి దూకి, అవతల నేల మీద పడుతూనే చేతిని నా కత్తి ఒరమీద వేశాను. ఆ కత్తి వుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే భయంతో అక్కడినుంచి పరుగుతీసేవాణ్ణి.

అక్కడ.. ఒక పొడవాటి అమ్మాయి.. తెల్లటి చీరలో... నేను కూర్చున్న కుర్చీ వెనకే నిలబడి నేను చేస్తున్న పని చూస్తూ వుంది.

నా కాళ్ళు చేతుల్లో పుట్టిన వణుకుకి తూలిపడబోయాను. ఆ క్షణం నేను అనుభవించిన భయం, స్వయంగా అనుభవిస్తే తప్ప ఎంత చెప్పినా అర్థంకాదేమో. మెదడు మొద్దుబారిపోయి, గుండెల్లో దడ చెవులకు వినపడుతూ శరీరమంతా దూది పింజెలాగా మారిపొయినట్లు అనిపించింది.

అప్పటిదాకా నాకు దయ్యాలంటే ఎలాంటి నమ్మకమూ లేదు. అలాంటివాణ్ణి మొదటిసరి ప్రత్యక్ష అనుభవంతో గడగడాలాడిపొయాను. ఆ కొన్ని క్షణాలు అనుభవించిన భయం, నా జీవితం మొత్తం మీద అనుభవించిన భయాలన్నింటికన్నా ఎక్కువ. ఆ పిల్ల నాతో మాట్లాడకపోతే అక్కడికక్కడే చచ్చిపోయేవాణ్ణేమో. అవును, మాట్లాడింది. సన్నగా పీలగా వున్న స్వరంలో, బాధ ధ్వనిస్తున్న గొంతుతో మాట్లాడింది. ఆ మాటలతో నా భయం నరాల్లోకి పారిపోయింది. అక్కడికేదో ధైర్యం వచ్చిందని కాదు నేను చెప్పేది. అప్పటికీ నేను ఏం చేస్తున్నానో తెలియని భీతావస్థలో వున్నాను. కాకపోతే లేని ధైర్యం ఏదో అరువు తెచ్చుకోని ముఖం స్థిరంగా వుంచే ప్రయత్నం చేశాను.

"మీరు నాకొక సహాయం చెయ్యగలరా?" అంది ఆ పిల్ల.

నాకు సమాధానం చెప్పాలని అనిపించింది. అయితే నొట్లో నుంచి ఒక్క మాట కూడా పెగలని పరిస్థితి. ప్రయత్నిస్తే నోట్లో నుంచి ఏవో వింత శబ్దాలు మాత్రం వచ్చాయి. ఆమె అదేమీ పట్టించుకోనట్లు చెప్పుకుపోతోంది -

"కాదనకండి మీరు సహాయం చెయ్యాలి. నన్ను కాపాడలి. నన్ను బాగుచెయ్యాలి. ఎంత బాధ అనుభవిస్తున్నానో తెలుసా? అబ్బ... ఎంత బాధో ఈ బాధ.." అలా అంటూనే వచ్చి నేను ఇంతకు ముందు కూర్చున్న కుర్చీలో కూర్చుంది. నేను మాత్రం అలాగే చూస్తూ వుండిపొయాను.

"చేస్తారు కదూ?"

తలాడించాను మాట రాక. అంతే ఆమె తన చేతిలో ఒక చెక్క దువ్వెనని తీసుకోని నా వైపు చాచి సన్నగా గొణిగింది.
"
నా తల దువ్వుతారా? దువ్వుతారా? చూడండి ఎలా చిక్కు పడిపోయిందో. నొప్పి కూడా పెడుతోంది. కొంచెం చిక్కు తీస్తారా? తల దువ్వుతారా?"

విరబోసుకోని వున్న ఆమె జుట్టు వైపు చూశాను. చాలా దట్టమైన పొడుగైన నల్లటి జుట్టు. ఆమె కూర్చున్న కుర్చీ మీదుగా కిందకు పడి నేలని తాకుతోంది. ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు. వణుకుతున్న చేతుల్తో ఆమె చేతిలో దువ్వెన ఎందుకు అందుకున్నానో తెలియదు. ఎందుకు ఆమె నల్లటి జుట్టుని నా చేతుల్లోకి తీసుకోని ఆ స్పర్శకి గడగడలాడుతూ, పాములు పట్టుకున్నంత భయంతో ఎందుకు నిలబడ్డానో అసలే తెలియదు. ఇప్పుడు మీరు అదే ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేను.

ఇదుగో ఇప్పటికీ ఆ స్పర్శ గుర్తుకు వస్తే నా చేతులు ఇలా గడగడా వణుకుతుంటాయి.

ఆమె తల దువ్వాను. చిక్కు తీశాను. సుతారంగా జారిపోయే జుట్టు అది. అలాగే దువ్వాను. పాయలు తీసి జడ అల్లాను. దాన్ని చుట్టి ముడి పెట్టాను.

అంతా అయిపోగానే అమె గట్టిగా శ్వాస వదిలి, తల చూసుకోని మురిసిపోయింది. తల వంచి "ధన్యవాదాలు" అంటూ నా చేతిలో దువ్వెనని ఒక్క ఉదుటున లాక్కోని ఇంతకు ముందు తలుపు వున్నట్లు అనిపించిన వైపు పరుగెత్తింది.

నేను ఒక్కణ్ణే మిగిలాను..! ఒక్కసారి పీడకల నుంచి అదిరిపడి లేచినవాడికి మల్లే అలాగే నిలబడిపొయాను. ఎప్పటికోకాని ఈ లోకంలోకి రాలేదు. ఒక్కసారి కిటికీలవైపు పరుగెత్తి బలమంతా ఉపయోగించి కిటికీ తలుపు తెరిచాను. భళ్ళున వెలుతురు వచ్చిపడింది. ఆమె పరుగెత్తిన తలుపు వైపు పరుగెత్తాను. ఆ తలుపు గడియ వేసి వుంది. తెరుచుకునే అవకాశమే కనపడలేదు.

అంతే! పిచ్చి పట్టినవాడిలా ఒక్కసారి అక్కడినుంచి పరుగెత్తాలని అనిపించింది. యుద్ధానికెళ్ళే సైనికుడిలా కదిలాను. చకచకా నేను తీసుకోవాల్సిన కాగితాలు అందుకున్నాను. గదిలో నించి పరుగులు పెడుతూ బయటికి పరుగెత్తాను, ఒక్కొక్క సారికి నాలుగు మెట్లు చెప్పున గెంతుకుంటూ ఎలా వచ్చానో తెలియదు కానీ మొత్తానికి బయటికొచ్చిపడ్డాను. బయట నిలబడి వున్న గుర్రం మీదకు ఒక్క అంగలో దూకి దౌడు తీయించాను.

మళ్ళీ మా ఇంటికి వచ్చేదాకా ఎక్కడా ఆగలేదు నేను. గుర్రం జీను తీసి పనివాడి మీదకు విసిరేసి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జరిగిందంతా నెమరేసుకున్నాను. పొరపాటున ఏ చిత్త భ్రాంతికైనా లోనైయ్యానా అన్న అనుమానం కొద్దిసేపు కలిగింది. నాకు నరాల ఒత్తిడి ఉంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు చిత్రమైన విషయాలు గోచరించడం మామూలే. అందువల్ల ఇది ఖచ్చితంగా నా భ్రాంతే తప్ప నిజం కాదని నిర్థారణకి వచ్చాను. కానీ నా గదిలో కిటికీ దగ్గరకు వెళ్ళిన తరువాత, నా గుండెపైన, మిలటరీ చొక్కా పైన నల్లగా పొడుగ్గా వున్న వెంట్రుకలు కనపడ్డాయి. వణుకుతున్న చేతులతో ఒక్కొక్కటే తీసి పడేశాను.

అప్పటికే నా మానసిక స్థితి అర్థం కాని రీతిలో వుండటం వల్ల నా మిత్రుణ్ణి కలవకూడదని అనుకున్నాను. అదీకాక, కాస్త స్థిమితపడి నాకు జరిగిన అనుభవాన్ని గుర్తుచేసుకోని అది నిజమేనన్న నిర్థారణకి రావాలని అనుకున్నాను కూడా. అందుకే నౌఖర్ని పిలిపించి, వాడి ద్వారా తెచ్చిన కాగితాలు పంపిచాను. ఆ కాగితాలు అందుకోని నా మిత్రుడు నా గురించి అడిగాడట. నాకు అనారోగ్యంగా వుందనీ (వడదెబ్బ తగిలిందని చెప్పమన్నాను) తెలిసి చాలా కలవర పడ్డాడట. మర్నాడు వాణ్ణి కలిసి, జరిగిన విషయం వివరంగా మాట్లాడాలని వెళ్ళాను. ముందు రోజు రాత్రి బయటికి వెళ్ళినవాడు ఇంకా రాలేదని అక్కడివారు చెప్పారు. మళ్ళీ సాయంత్రంగా కబురుపెట్టాను. లేడనే సమాధానం వచ్చింది. మరో వారం ఎదురుచూసి ఇక లాభం లేదని పోలీసులకి తెలియబరిచాను. వారంతా తీవ్రంగా గాలింఛినా అతని జాడ దొరకలేదు. అసలు ఎలా మాయమైపోయాడో కూడా తెలియలేదు.
ఆ పాడుబడ్డ భవంతిని కూడా అణువణువూ గాలించారు కానీ అనుమానాస్పదమైనది ఏదీ కనిపించలేదన్నారు. అక్కడ ఒక అమ్మాయి వుండే అవకాశమే లేదన్నారు. ఇంకా కొంతకాలం ప్రయత్నాలు చేసి, ఫలితం లేకపోవటంతో మానుకున్నారు. యాభైఆరేళ్ళైంది ఇప్పటికి. వాళ్ళ గురించి ఇంకా ఏ సంగతీ తెలియలేదు.

మూల కథ:  Appartion

2 వ్యాఖ్య(లు):

Murthy K v v s చెప్పారు...

Very good translation sir.Hmm..changed Rouen to Raju palam..no problem..!

Unknown చెప్పారు...

Thank you Murthy garu.
Tried to make it easier to read by bringing in nativity.