ఫో...ఇక్కడ్నుంచి..!!

"లే.. ముందు లే ఇక్కడ్నుంచి... ఫో అవతలికి... ఫో.. ఇక్కడుంటానికి వీల్లేదు.." కానిష్టేబుల్ రాముడు అరుస్తున్నాడు ఆ ముసలామెను.

"అయ్య.. రోగమొచ్చినదయ్య.. నాలుగు రూపాయలు రాగానే పోతాను.. పది నిముషాలు బాబు...!"

"ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా బుద్దిరాదు.. ఎస్సైగారు వచ్చి నాలుగు తగిలిస్తేగాని కదలవు.." అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు.

రెండురోజులుగా ఇదే వరస. ముక్కోటి ఏకాదశికని స్పెషల్ డ్యూటీ మీద అమరావతి గుడి దగ్గర చిన్న టెంట్ వేసి పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసారు. పెద్దగా జనంలేరు. పెద్దగా పని కూడా లేదు. అడపదడప మా పాప తప్పిపోయిందనో, పర్సు పోయిందనో వస్తున్నారు. ఎక్కువమంది వచ్చేది మాత్రం గుంటూరు బస్సు ఎప్పుడుందో కనుక్కోవడానికి.

రాముడు మాత్రం ప్రతి అరగంటకి లేచి ఎదురుగా కూర్చుని అడుక్కుంటున్న ముసలమ్మను అరుస్తూనే వున్నాడు. కేకలు వేసినంతసేపు వేసి, ఎస్సైగారు వస్తేగాని నీకు బుద్ధిరాదు అంటూ కూలబడుతున్నాడు. ముసలిదానికి నాలుగురూపాయలు రావటంలేదు.. అది అక్కడ్నించి కదలటంలేదు.

"ఫో.. లే ఇందాకట్నుండి చెప్తున్నానా... ఏం వినపడలేదా.. లే ఇక్కడ్నుంచి" మళ్ళీ అరిచాడు.

"అయ్యగారు.. అయ్యగారూ.." ముసల్ది.

"నోరు మూసుకొనిలే.. ఈ కర్రతో ఒక్కటిచ్చానా..!!" కర్ర పైకెత్తాడు.

"బాబుగారు.. బాబుగారు.. నీ కాళ్ళకు దణ్ణాం పెడతా... పోనీ అయ్యా ముసల్దాన్ని.."

"ఛీ ఛీ.. చెప్తే వినే రకమైతేగా.." మళ్ళీ యధాస్థానం. హెడ్‌కానిష్టేబుల్ విశ్వనాధం ఇదంత గమనిస్తూనే వున్నాడు.

***

మర్నాడు -

"మళ్ళీ దాపురించావూ..? నా ఖర్మ.. లే ఇక్కడ్నుంచి. ఈ రోజు వదలను నిన్ను. లే.. ఫో ఇక్కడ్నుంచి. ఇక్కడ అడుక్కోకూడదు.. బయటకిపో ఆ చివర్న కూర్చో ఫో..!!"

"అయ్యా అయ్యా.. ఆడ సానామంది వుండారు బాబుగారు.. ఈడుంటే నాలుగు డబ్బులైనా వస్తాయి... మందులు కొనుక్కోవాలయ్యా.."

"సెత్.. నీ యవ్వ... నీ తలకాయ పగలగొడితేగాని.." మళ్ళీ లాఠీ ఎత్తాడు.

"బాబుగారు.. కొట్టమాకండయ్యా.. ఈయాలొక్కరోజేనయ్యా.. రేపుటాలనుంచి ఈడ కూకోను బాబు.."

"సరే ఛావు ఈ రోజుకి.." విసురుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.

విశ్వనాధం రాముడి భుజమ్మీద చెయ్యేసి అడిగాడు -

"ఏంట్రా రాముడు... ఎప్పుడూలేంది నీక్కూడా కోపం వస్తోందే..?? ఆ ముసల్దానితో మనకెందుకురా.. వచ్చిన డ్యూటీ చూసుకోక..?"

"మీకు తెలియదండి.. అది కొవ్వు పట్టి ఛస్తోంది.. మూడు రోజులబట్టీ చూస్తున్నారుగా..? ఒక్కసారైనా లేపగలిగానా..అని"

విశ్వనాధం మరి మాట్లాడలేదు.

***

మర్నాడు డ్యూటీకి బయల్దేరిన విశ్వనాధానికి నైట్ డ్యూటీ చెయ్యాల్సిన వీరన్న కనిపించాడు.

"మీతోపాటు ఈ రోజు నేనొస్తున్నాను విశ్వనాధం మాష్టారు.." వీరన్న అన్నాడు.

"అదేమిటి రాముడు రాలేదా.."

"మీకు తెలియదా వాడు రిజైన్ చేశాడు.."విశ్వనాధం అదిరిపడ్డాడు.

"ఏమిటి రిజైనా.. ఎప్పుడు..? అసలెందుకు..??"

"ఏమో మరి.. మొన్న అడ్జెస్ట్మెంట్లో నాకు బదులు నైట్ ద్యూటీకి వెళ్ళాడు. పొద్దున వస్తూనే ఎస్సైగారిని కలిసి వుద్యోగం వదిలేస్తున్నానని చెప్పాడు"

"అదే ఎందుకని..??"

"ఏమో మాష్టరు.. నేనూ అడిగాను.. మనసు చంపుకొని పోలీసుద్యోగం చెయ్యలేడట.. పోలీసుల్లో మనసున్నవాళ్ళు పనికి రారట.."

విశ్వనాధం ఆలోచనలో పడ్డాడు."ఆ రోజు రాత్రి ఏమైనా జరిగిందా..?"

"ఆ ఏముంది మాష్టరు.. ఎవరో ముసల్ది చచ్చిపోయింది.. మనవాడికి శవ జాగారం.. పంచనామ.. మనోడికి కొత్తనుకుంట.. భయపడుంటాడనే అనుకుటున్నారు అంతా..!!"

విశ్వనాధం గుండె కలుక్కు మంది. ఇద్దరూ కలిసి డ్యూటీ చేసిన రోజు జరిగినది గుర్తొచ్చింది. ఆ రోజు ఇద్దరూ కలిసి డ్యూటీ అయిపోయాక గుంటూరు బయలుదేరారు. దారిలో అడిగాడు విశ్వనాధం -

"రేయ్ రాముడు.. నిజం చెప్పరా.. ఆ ముసల్దాన్ని ఎందుకక్కడ అడుక్కోనివ్వడం లేదు..??""ఎందుకేంటి అక్కడ అడుక్కోకూడదు..."

"రేయ్ రూల్స్ గురించి నాకు చెప్పకు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. సైకిల్‌మీద పొయ్యేవాడివికూడా ఆగి బిక్షగాళ్ళకి డబ్బులు వేయటం నేను చూశాను. అట్లాంటిది ఆ ముసల్దాన్నెందుకు అట్లా తరిమావు..?"

రాముడు రెండు నిముషాలు మాట్లాడలేదు. గట్టిగా నిట్టూర్చాడు. ఉన్నట్టుండి అన్నాడు -

"అది.. ఆ ముసల్ది నన్ను డ్యూటీ చేసుకోనివ్వటంలేదు సార్.. అది అంత బాధగా మూల్గుతూ.. దయనీయంగా అయ్యా అయ్యా అంటూ అడుక్కుంటుంటే.. నా గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు వుండేది. ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడైనా దానికి డబ్బులేశాడా..? అన్నం తినలేదయ్యా అంటుంటే హేళనగా చూస్తున్నారు. అది పొద్దుననుంచి మన కళ్ళముందే పడి వున్నా, తిండి కూడా తినలేదని తెలిసినా.. అది చస్తుందని తెలిసినా నేను ఏమి చెయ్యలేను. పోలీసులే ఇలా అడుక్కునేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారని అంటారు. పైగా నేను జాలి తలిస్తే అది ఇంక అక్కడే కూర్చుంటుంది.. నా బాధని ఎక్కువ చేస్తూ..!! అది అమ్మ అయ్యా అంటుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది.. ఎంత తరిమినా పోదు.. నేను కొట్టలేను..ఏం చెయ్యాలి సార్..??" అంటుంటే రాముడు కాళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.

విశ్వనాధం ఆశ్చర్యంగా అతని వైపు చూసాడు.

"ఇంత సెంటిమెంటల్‌గా వుంటే ఎలారా.. పోలీసు వుద్యోగానికి ఇలాంటివి పనికిరావు.."

"పోతే పోనీయండి సార్..!! మనసు చంపుకోని ఎవరు చేస్తారు వుద్యోగం" అన్నాడు రాముడు.

***

విశ్వనాధం బాధగా నవ్వాడు.

"పోలీసుల్లో మనసున్నవాళ్ళు లేక కాదురా.. నీలాగ మనసు కోసం, విలువలకోసం బ్రతుకుతెరువుని వదల్లేక" అనుకుంటూ అమరావతి బస్సెక్కాడు విశ్వనాధం.

(2001)
Category:

3 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

Mansunu kadilinchaaru ... chaala chinna Story [incident] tho

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

"అది.. ఆ ముసల్ది నన్ను డ్యూటీ చేసుకోనివ్వటంలేదు సార్.. అది అంత బాధగా మూల్గుతూ.. దయనీయంగా అయ్యా అయ్యా అంటూ అడుక్కుంటుంటే.. నా గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు వుండేది. ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడైనా దానికి డబ్బులేశాడా..? అన్నం తినలేదయ్యా అంటుంటే హేళనగా చూస్తున్నారు. అది పొద్దుననుంచి మన కళ్ళముందే పడి వున్నా, తిండి కూడా తినలేదని తెలిసినా.. అది చస్తుందని తెలిసినా నేను ఏమి చెయ్యలేను. పోలీసులే ఇలా అడుక్కునేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారని అంటారు. పైగా నేను జాలి తలిస్తే అది ఇంక అక్కడే కూర్చుంటుంది.. నా బాధని ఎక్కువ చేస్తూ..!! అది అమ్మ అయ్యా అంటుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది.. ఎంత తరిమినా పోదు.. నేను కొట్టలేను..ఏం చెయ్యాలి సార్..??" అంటుంటే రాముడు కాళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.
రాముడి కళ్ళలోనే కాదండి పై మాటలతో మా కళ్లవెంట కూడ నీళ్ళు తిరిగాయి.

అజ్ఞాత చెప్పారు...

Excellent!
Good narration. chalaa bagundi. channallaki oka manchi kadha chadivaanu. manasu dravinchelaa vraasaru.