మిల్కీబార్ (కథ)

అప్పారావుకొక చిన్న కోరిక - ఒక విచిత్రమైన కోరిక..

"మిల్కీబార్ చాక్లెట్ కొనుక్కోని తినాలి" అని.

ఆ కోరిక కలగటం కూడా అనుకోని విధంగా జరిగింది. నాలుగు రోజుల క్రితం ఒక రోజు అప్పారావు చిన్న కూతురు శైలు స్కూల్‌నుంచి వస్తూనే అరవటం మొదలుపెట్టింది -

"నాన్న.. నాన్నా నాకు మా టీచరు చాక్లెట్ ఇచ్చింది.. మామూలుది కాదు మి-ల్కీ-బా-ర్" అంది తమాషాగా కళ్ళు తిప్పుతూ.

"ఎందుకిచ్చారమ్మా?" అడిగాడు అప్పారావు పాపని ముద్దుపెట్టుకుంటూ.

"నేను క్లాసులో ఫస్టొచ్చాను నాన్నా.. అందుకే.." అంది గర్వంగా

"నా బంగారు తల్లి.." మళ్ళీ ముద్దుపెట్టుకొని అన్నాడు-

"అందరికీ పంచి పెట్టి నువ్వు కూడా తిను.." ఆ మాట వింటూనే లోపలికి పరుగుతీసింది పాప.

ఆ తరువాత అప్పారావు సరుకులు తీసుకు రావాలని బయటికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన స్నేహితులతో కాస్సేపు పిచ్చాపాటి మాట్లాడి ఇంటికొచ్చే సరికి కొంచెం ఆలస్యమైంది. పిల్లలు టీవీ చూస్తున్నారు. అతను రావడం చూడగానే పరుగున వచ్చి కరుచుకుంది శైలు.

"నాన్నా నాన్నా మిల్కీబార్ భలే వుంది నాన్నా.." అంది పాప.

"మరి నాకేదమ్మా.." అడిగాడు సరదాగా.

"లేదు నాన్నా అయిపోయింది... అక్క, అన్నయ్యా, నేను, అమ్మ తినేసరికి అయిపోయింది.." అంది చేతులు తిప్పుతూ. అప్పారావు నవ్వి వూరుకున్నాడు.

"నాన్నా నువ్వు తినలేదుగాని భలే వుందిలే" అన్నాడు కొదుకు రవి టీవీ చూస్తూనే.

"సరేలేరా..!" కాస్తంత చిరాకు ప్రదర్శించాడు.

"అది నిజంగా పాలతో చేసినట్టున్నారు. ఇంత ముక్కే వచ్చింది పంచుకుంటే.. ఒక పక్కకి కూడారాలేదు." అంది పెద్ద కూతురు శ్రావణి మంచి నీళ్ళందిస్తూ. "అసలు నీకోసం కూడా వుంచాం నాన్నా.. చిన్నది వాడు కలిసి చెప్పాపెట్టకుండా లాగించేశారు.." అంది మళ్ళీ.

"సరేలే అదేమన్నా అమృతమా .. ఇంక వూరుకో.. !!" అన్నాడు వంటింట్లోకి వెళ్తూ.

రాత్రి భోజనాలయ్యాక మంచం వాల్చి, దిండు, దుప్పటి వేసుకున్నాడు. ఇక పడుకోవడానికి సిద్దమౌతుండగా భార్య ప్రమీల వచ్చింది. "ఈ రోజు ఏ సీరియల్లో ఏ హీరోగారి రెండో పెళ్ళాం మూడో ప్రియుడి గురించి చెప్తుందో" అనుకున్నాడు అప్పారావ్. అయినా తప్పదుకదా.. ఏమిటన్నట్లు చూసాడు.

"ఏంలేదు.. పిల్లలు బావుందంటున్నారు కదా ఎప్పుడైనా కొని తెద్దురూ" అందామె.

"ఏంటది" యధాలాపంగా అడిగాడు.

"అదేనండి ఆ మిల్కీబార్"

"ఇదేమిటే ముఖ్యమంత్రి ప్రచారంకోసం పుట్టిన దినపత్రికలాగ అందరూ ఒకటే విషయం చెప్తున్నారు.. ఇంకేం విషయాలు లేవా.?" కాస్త కోపంగానే అన్నాడు.

"లేదు... ఇదేం ప్రచారంకాదు.. నిజంగానే బాగుంది. నాకే ఇంకొంచెం తినాలనిపిస్తుంటే.. అబ్బ నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. మీరూ తినుండాల్సింది.." అంటూ పడుకుంది ప్రమీల.

అంతే అక్కడ పడింది బీజం.. తనూ మిల్కీబార్ తినాలి అని. ఆ తరువాత అది దేశంలో అవినీతి పెరిగినట్టు పెరిగి పెద్ద చెట్టై కూర్చుంది. రెండురోజుల్లో మిల్కీబార్ తినాల్సిందే అని నిర్ణయించుకున్నాడు అప్పారావ్. కానీ నెలాఖరు...!! జేబులో యాభై రూపాయలున్నాయి..!! జేబులో యాభైరూపాయల నోటు తీసి ఒకసారి తెరిపార చూసుకున్నాడు. "ఆ మిల్కీబార్ ఎంతుంటుందో అయిదో..? పదో..? ఆ కాస్తా అయిపోతే... అమ్మో ఇంకా వారం రోజులు గడవాలి." ఆలోచిస్తూ పడుకున్నాడు.

మర్నాడు స్నానం చేస్తుండగా మళ్ళీ గుర్తొచ్చింది. మిల్కీబార్.. మిల్కీబార్.. అతని గుండె గొడవ చేస్తోంది. ఆఫీసుకు వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గరే వున్న ఒక జెనరల్ స్టోర్‌కి వెళ్ళాడు.

"ఏం కావాలండీ..?" అడిగాడు ఆ కొట్టువాడు. అప్పారావు ఇంకా సంశయిస్తూనే వున్నాడు.

"మి-ల్కీ-బా-ర్" అస్పష్టంగా గొణిగాడు.

"ఏమిటి సార్"

"మిల్కీబార్" కొంచెం గొంతు పెంచాడు.

"మిల్కీబార్ లేద్సార్.. పోనీ డైరీమిల్క్ ఇవ్వనా.." అన్నాడతను. అప్పారావు మనసొప్పుకోలేదు.

"ఊహు.. మిల్కీబారే.." అంటుండగా ఆ షాపులో అతను అందుకున్నాడు.

"ఇదీ అదీ ఒకటె రకం సార్... పిల్లలు ఇదే ఎక్కువ తింటారు.." కొంచెం తెలివి వుపయోగించాననుకున్నాడు కొట్టువాడు.

"పిల్లలికి కాదురా.. నాకే కావాలి" అందామనుకున్నాడు, మొహమాటమేసింది.

"మిల్కీబార్ లేకపోతే ఇంకేమీ వద్దులే" అంటూ బయటకు రాబోయాడు. అంతలోనే ఆగి -

"ఎంతుంటుందేమిటి..?"

"మిల్కీబారైతే ఇరవైసార్.. ఇదైతే పది రూపాయలే"

గుండెల్లో బాంబు పడ్డట్టైంది అప్పారావుకి. "ఇరవై రూపాయలా.. ఇరవై.. ఇరవై రూపాయలుంటే ఒక రోజు ఇల్లు గడిచిపోతుంది.. అంత డబ్బు ఒక చాక్లెట్ కోసమా.. వద్దులే" అనుకుంటూ పక్కన బేకరీలో మిల్కీబార్ అద్దాల పెట్టెల్లో కనిపించినా ఆగలేదు.

ఆ రోజు అలాగే గడిచిపోయింది. యాభై రూపాయల నోటు రెండు ఇరవై రూపాయలైంది. మిల్కీబార్ తినాలన్న కోరిక మాత్రం రెండింతలైంది. ఆ రోజంతా డబ్బుకి కోరికకి యుద్ధం జరుగుతునే వుంది. ఆ రాత్రి డబ్బుని కోరిక జయించింది.

"రేపు ఎలాగైనా కొనుక్కొని తింటాను" అనుకొని పడుకున్నాడు అప్పారావు.

నిద్రలేవగానే ఆఫీసుకి తయారయ్యి వెళ్తూ వెళ్తూ మధ్యలో బేకరీ ముందు ఆగాడు. ఒక సారి జేబు తడుముకునాడు. షాపు వాడు అప్పుడే సీసాలు సర్దుకుంటూ దేవుడి పటాలకు పూజ చేసుకుంటున్నాడు.

"పొద్దున్నే బేకరిలో మిల్కీబార్ కొనుక్కు తింటే చూసేవాళ్ళకి బాగుండదేమో" అనిపించింది. సాయంత్రం తీసుకోవచ్చు అనుకొని ఆఫీసుకు వెళ్ళిపోయడు. ఆఫీసులో క్షణమొక యుగమైపోయింది. ఏం పని చేస్తున్నాడో, ఎందుకలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు.

"ఏమోయ్ ఏమిటివాళ క్యారేజి" అడిగాడు పక్క సీటు కామేశం.

"మిల్కీబార్" అని నాలిక కరుచుకొని "మునక్కాయ్ పులుసు" చెప్పాడు.

సాయంత్రమైంది. ఎన్నడూ లేనిది ఆ రోజు అయిదు గంటలకే ఆఫీసు నుంచి బయలుదేరాడు. పరుగులాంటి నడకతో బేకరీ చేరుకొని "మిల్కీబార్" అన్నాడు. అతను ఇరవై రూపాయలు తీసుకొని ఇచ్చాడు.

అప్పారావు చేతిలో మిల్కీబార్. దాని పైన వున్న కాగితాన్ని నెమ్మదిగా తడిమాడు. చివరలు పట్టుకొని చించబోయాడు. అప్పటికే అక్కడ చాలామంది కాలేజీ పిల్లలు వున్నారు. వాళ్ళ ముందు తన వయసువాడు మిల్కీబార్ తింటే బాగుండదేమో అనిపించింది అప్పారావుకి. మిల్కీబార్ జేబులో వేసుకొని బయటపడ్డాడు. కానీ ఎక్కడ తినగలడు. చూసే వాళ్ళు తన వయసు గమనించి గేలి చేస్తే? అయినా ఎంత మంది తినడంలేదు? మిగతావాళ్ళ సంగతేమో కాని తన మనసు వొప్పడం లేదు... అటు ఇటూ వూగిసలాడుతోంది.

చివరికి దగ్గరలో వున్న ఒక చిన్న పార్కులో చేరాడు. అక్కడైతే ఎవరూ చూడరని అనుకున్నాడు. కానీ సరిగ్గా చాక్లెట్ కవర్ చించబోతుంటే వచ్చాడు - శనక్కాయలు అమ్మే ఒక చిన్న పిల్లాడు.

"సార్ శెనక్కాయలు కావాలా?"

"వద్దురా నువ్వు పో"

"తీసుకోండి సార్ బాగుంటాయి.."

"వద్దన్నానా.??"

"వేడిగా వున్నాయి సార్.. వుడకబెట్టినవి.."

అప్పారావుకి విసుగొచ్చేసింది. అతనికి తెలుసు - వాడి దగ్గర కొనకపోతే వదలడని.

"సరే ఒక రూపాయికి ఇవ్వరా" అంటూ మిల్కీబార్ పక్కన పెట్టి ఒక రూపాయి ఇచ్చి శనక్కాయలు తీసుకున్నాడు. శనక్కాయలవాడు కనుమరుగవగానే మిల్కీబార్ అందుకోబోయాడు. -

మిల్కీబార్ అక్కడ లేదు..

మిల్కీబార్ పోయింది...

ఇరవై రూపాయలు.. మిల్కీబార్.. తిన్నదిలేదు కనీసం రుచి ఐనా చూడలేదు. అప్పారావు ఆ చుట్టుపక్కలంతా పిచ్చిగా వెతికాడు. ఎక్కడా లేదు. శనక్కాయలోడు కనిపించలేదు.. అప్పారావు ప్రాణం వుసూరంది. కళ్ళలో నీళ్ళు వచ్చినంత పనైంది. ఒక అరగంటపాటు ఆ ప్రాంతమంతా కలియ తిరిగాడు. ఏ ప్రయోజనం లేకపోయింది.

కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరాడు. ప్రమీల మంచి నీళ్ళు, కాఫి తెచ్చిచ్చింది.

అవి తాగి తలపై చెయ్యి పెట్టుకొని కూర్చున్నాడు.

"ఏమండీ.." అంది ప్రమీల

"ఏమిటే.." విసుగ్గా అన్నాడు అప్పారావ్

"ఒక విషయం చెప్తా.. ఏమనకూడదు.."

"చెప్పు"

"నేను ఈ రోజు.. మిల్కీబార్ కొన్నాను" చెప్పిందామె.

"ఏమిటి మిల్కీబార్... డబ్బులెక్కడివి" అడిగాడు అనుమానంగా.

"నాకెక్కడివి.. మీ జేబులో నించే వుదయం తీసుకున్నా. ఇంకో ఇరవై వుందిగా అని తీసుకున్నా" అంటూ ఆమె చెప్తుంటే బాంబు పడ్డట్టైంది. వుదయం నించి మిల్కీబార్ కొనే హడావిడిలో గమనించలేదు.. జేబులో రెండు ఇరవై రూపాయలకి బదులు ఒకటే వుంది. అంటే చేతిలో వున్న నలభై రూపాయలు అయిపోయాయన్న మాట. కోపం, బాధ, నిస్సహాయత కలిసిపోయి ముఖంలో కనపడుతోంది. అతను తేరుకునేలోగా ప్రమీల -

"వుండండి మీకు వుంచాను.. తెస్తాను.." అంటూ బుల్లెట్లా దూసుకొని ఇంట్లోకి వెళ్ళింది.

అప్పారావుకి ఏమి తోచలేదు. చేతిలో వున్న నలభై రూపాయలు అయిపోయినందుకు బాధపడాలా తన కోరిక తీరుతున్నందుకు సంతోషించాలా? లోపలినించి ప్రమీల గొంతు వినపడింది -

"శ్రావణీ.. ఇక్కడ నాన్న కోసం మిల్కీబార్ పెట్టాను.. ఎవర్రా దొంగతనంగా తినేసింది..?"

అప్పారావు మళ్ళీ తల పట్టుకున్నాడు. అప్పటికే అతని బుర్రలో మర్నాడు కామేశాన్ని ఇరవై రూపాయలు అప్పు అడిగే పథకం రూపు దిద్దుకుంది.

Category:

11 వ్యాఖ్య(లు):

చెడుగుడు చెప్పారు...

బాగుంది. :)

మధురవాణి చెప్పారు...

ఎంత బాగా రాసారండీ కథ..!!
ఇది చదివి.. నాకూ ఇప్పుడు మిల్కీ బార్ తినాలనిపిస్తుంది :)

అజ్ఞాత చెప్పారు...

Good one! lol...i couldn't stop laughing!

Raghuramaiah manchi చెప్పారు...

ప్చ్..... పాపం అప్పారావ్ !ఒక ఐడియా.. అసలే ఎలెక్షన్ సమయం కదా...
కాంగిరేసు లో చేరమనండి. YSR గారు పావలా వడ్డీ కే ఇచ్చేయగలరు.. ఏమంటారు?

అజ్ఞాత చెప్పారు...

గోవిందం
నెనర్లు

మధురవాణిగారు,
కెనడాలో మిల్కీ బార్ దొరుకుతుందా? నెనర్లు.

కాఫీ+మగ్గు+స్నాక్స్
నెనర్లు

రఘురామయ్యగారు,
కాంగి"రేసు"లోనే కాదు ఏ పొలిటికల్ రేసులో పడ్డా నాక్కోటానికి పైన కాగితం తప్ప చాక్లెట్ మిగలనివ్వరు. నెనర్లు.

అరిపిరాల

wrangler చెప్పారు...

చాలా నచ్చిందండి...
కథనం అల్లిక చాలా బాగుంది.

Unknown చెప్పారు...

lower middle class dreams r so.well established.aasa ki adrustaniki bhale link.

Unknown చెప్పారు...

lower middle class dreams r so.well established.aasa ki adrustaniki bhale link.

Unknown చెప్పారు...

lower middle class dreams r so.well established.aasa ki adrustaniki bhale link.

Unknown చెప్పారు...

lower middle class dreams r so.well established.aasa ki adrustaniki bhale link.

mmkodihalli చెప్పారు...

అరిపిరాల గారూ మీరొక సారి నాకు ఇ-మెయిల్ చేయండి.mmkodihalli@gmail.com