వారసుడొచ్చాడు (సరదా కథ)

అప్పటికే వయసు మీద పడుతోందని గ్రహించాడు పరమేశ్వర్. తన తండ్రి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని పెద్దది చేస్తూ, శాఖోప శాఖలుగా విస్తరిస్తూ కోట్ల ఆస్థి సంపాదించాడు అతను. భార్య ఉమాదేవి అనుకూలవతి, సహధర్మచారిణి. గణేష్, కుమార్ వారి సంతానం. ఆ ఇద్దరికి తను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే అంతటి ఆస్థికి మూలమైన తన తొలి వ్యాపారం ఎవరి చేతుల్లో పెట్టాలా అని చాలా ఆలోచించాడు. చివరికి తన అడ్వైజర్ త్రిలోక్ సంచారి చెపిన సలహా మేరకు తన పిల్లలిద్దరికీ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.ఆ రోజు రానే వచ్చింది.పరమేశ్వర్ భార్య ఉమాదేవితో కలిసి, వ్యాపారంలో కీలకమైన వ్యక్తులందరి సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు. త్రిలోక్ కూడా ఏమి జరగబోతోందా అని వుత్సుకతతో వున్నాడు. ఇద్దరు పిల్లలు అక్కడికి చేరుకున్నారు. వారిద్దరినీ చూసి పరమేశ్వర్ అన్నాడు -"నాయనలారా.. నేను మునుపు చెప్పినట్టే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాను. అందుకు ముందుగా నా సమస్త వ్యాపారాలని మీ ఇద్దరి మధ్య పంచాలని నిర్ణయించుకున్నాను. అంతా సమానంగా పంచిన తరువాత అతి ముఖ్యమైన, నాకు ఎంతో ఇష్టమైన మన మూల వ్యాపారాన్ని ఎవరికి ఇవ్వాలి అన్న విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాను. అందుకే మీకొక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. మీకు సమ్మతమేనా?" అడిగాడు పరమేశ్వర్.ఇద్దరు కొడుకులూ సరే అన్నారు. పరమేశ్వర్ ఆ పరీక్ష ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు -"పరీక్ష చాలా చిన్నది. మీ ఇద్దరు వెంటనే బయలుదేరి ప్రపంచంలో వున్న అన్ని దేశాలు చుట్టేసి రావాలి. ఏడు సముద్రాలు, ఐదు ఖండాలు దాటి ఇక్కడికి ఎవరు ముందు చేరుకుంటారో వారికే ఆ బిజినెస్ మొత్తం ఇవ్వబడుతుంది" అన్నాడు.ఆ మట వింటూనే కుమార్ ఎగిరి గంతేసాడు. కుమార్ ఇరవై ఐదొవ పుట్టినరోజు సంధర్భంగా పరమేశ్వర్ అతనికి ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనిచ్చాడు. అందుకే ఆ ఆనందం. ఆలోచన వచ్చినదే తడవుగా కుమార్ పరుగున వెళ్ళి చార్టేడ్ ఫ్లైట్‌లో తన ప్రయాణం మొదలెట్టాడు.గణేష్ నిరుత్సాహ పడిపోయాడు. తన ఇరవయ్యొవ పుట్టినరోజుకి ఇలాగే ఫ్లైట్ కొనిస్తానంటే తనే వద్దన్నాడు. తనకేమో కార్లమీద మోజెక్కువ.. అందుకే డిజైనర్ రోల్స్ రాయల్ కారు కొనివ్వమన్నాడు. ఇలాంటి పరీక్ష రాబోతోందంటే తనూ ఫ్లైట్ కొనివ్వమనేవాడు. ఏమి చెయ్యాలో పాలుపోక గణేష్ త్రిలోక్ దగ్గరకు వెళ్ళాడు."చూశారా అంకుల్.. నాన్నకి కుమార్ అంటేనే ఇష్టం. అందుకే ఇలాంటి పరీక్ష పెట్టాడు. వాడు ప్రపంచమంతా చుట్టి వచ్చేసరికి నేను కారులో మన దేశం కూడా దాటలేను. ఇప్పుడేమిటి చెయ్యడం?" అంటూ వాపోయాడు.త్రిలోక్ సంచారి "మీ నాన్నకు ఎలాంటి పక్షపాతం లేదు. ఆలోచించు నాయనా" అన్నాడు.గణేష్ ఆలోచించించాడు. ఒక వుపాయం తట్టింది. అతని ముఖంలో ఆనందం తాండవించింది. వెంటనే తన గదిలోకి పరుగెత్తాడు. వై ఫై కనెక్ట్ అయ్యి వున్న తన లాప్ టాప్ తెచ్చాడు. తన తల్లి తండ్రి ముందు పెట్టి, ఎక్స్‌ప్లోరర్ తెరిచి, టైపు చేశాడు -....earth.google.comతన తల్లి తండ్రికి భారత దేశం మొత్తం చూపించాడు. తరువాత పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఆఫ్రికా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా.. అలా అన్ని దేశాలు తిప్పి తిప్పి చివరకి భారత దేశానికి తీసుకువచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్‌కు తీసుకు వచ్చాడు. తన ఇంటి పైకి తీసుకొచ్చాడు.. ఆఖరికి త్రిలోక్ సంచారి బట్టతలతో సహా అన్నీ చూపించాడు.దాంతో సంతోషించిన పరమేశ్వర్ ఆశీర్వదించి - "నాయనా మన వ్యాపారం చెయ్యడానికి ఇలాంటి సమయస్ఫూర్తి చాలా అవసరం. అందుకే ఆ వ్యాపారం నీకే ఇస్తాను." అని ప్రకటించాడు.(సరదాగా వ్రాసిన కథేకాని ఎవరి నమ్మకాలనూ నొప్పించాలని కాదు.)

Category:

2 వ్యాఖ్య(లు):

Unknown చెప్పారు...

వినాయకుని కధకు కొద్దిగా మోడ్రన్ హంగులద్దారుగా... బాగుంది మీ ప్రయత్నం

Sravya V చెప్పారు...

బాగుంది :)