ప్లాట్‌ఫారం నెంబర్ వన్..!! (కవిత)

రైలు వచ్చి నిలబడగానే
ఆ ప్లాట్‌ఫారం అమ్మకాల అరుపులౌతుంది
పోర్టర్‌ల కేకలౌతుంది
పలకరింపులు, వీడుకోలులు అక్కడే చిత్రంగా కలిపోతాయి
ఎవరో సమోసా తింటూ..
గాలికి వదిలిన కాగితం పొట్లం
ప్లాట్‌ఫారం టికెట్టు లేకుండానే
స్టేషనంతా కలియ తిరుగుతుంది


రైలు ఎక్కించే నెపంతో
చేతులువేస్తున్న పెళ్ళికొడుకును చూసి
కొత్తపెళ్ళికూతురు సిగ్గుపడితే
అది మల్లెపూవై రాలి విచ్చుకుంటుంది

సీజన్ టికెట్టుగాళ్ళంతా
చివరి నించి రెండోపెట్టెలో చేరి
సరదా కబుర్ల సావాసగాళ్ళైతే
ఆ జ్ఞాపకం పేకముక్కలై పట్టాలమీద పడుతుంది

బేరాల్లేని పోర్టర్
ఎర్రచొక్కా తలకిందపెట్టుకొని
పస్తులున్న పిల్లల్ని తల్చుకుంటుంటే
కంటినీరు బాధను మోసుకుంటూ రాలుతుంది

రైలు కూతపెట్టి కదలగానే
గార్డు వూపిన పచ్చలైటు
బండెక్కించినవాళ్ళ ముఖాలపై
దిగులు రంగై పరుచుకుంటుంది

తిరుగు ముఖం పెట్టిన తాతయ్యకి
ఇంకా చెయ్యి వూపుతున్న మనవడికి మధ్య
దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాయి
జాలి లేని రైలు పెట్టెలు

ఆఖరి నిముషంలో
పరుగెత్తుకొచ్చిన ప్యాసింజరు
రైలు వేగంతో పోటి పెట్టుకుని
ప్లాట్‌ఫారం చివరిదాకా ఆశని పరుస్తాడు

చివరి రైలు తప్పిపోయాక
సూట్‌కేస్ దిండుపై పిల్లల్ని పడుకోబెట్టి
రాత్రంతా కునికిపాట్ల కాపలా కాస్తే
అది తెల్లవారేసరికి ఖాళీ టీ కప్పులై మిగులుతుంది

తూరుపు తలుపు తెరుచుకున్నాక
మల్లెల్నీ, ఆశల్ని, కన్నీళ్ళని వూడ్చేసిన వెంటనే
కొత్త అనుభవాలని మోయాలనుకుంటూ
ప్లాట్‌ఫారం మళ్ళీ నిద్ర మేల్కొంటుంది

(ఆవకాయ్.కాం లో ప్రచురితం)
Category:

6 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

భలే ఉందండి. క్లైమాక్సు కొచ్చేసరికి ఓ మనసు మెలికపడిపోయింది. ఏం బావుందో తెలీటంలేదు గానీ, భలే బావుంది.

అజ్ఞాత చెప్పారు...

very good chalaa bagundi

నవ్వులాట శ్రీకాంత్ చెప్పారు...

మీ కవిత ప్లాటు(వస్తువు),ఫాం(వ్యక్తీకరణ)రెండూ నంబర్ వన్

Unknown చెప్పారు...

రేరాజ్,బోనగిరి
నెనర్లు..!!

శ్రీకాంత్,
మీ కామెంట్ భలే కుదిరింది..

chittithalli చెప్పారు...

ఎవరో సమోసా తింటూ..
గాలికి వదిలిన కాగితం పొట్లం
ప్లాట్‌ఫారం టికెట్టు లేకుండానే
స్టేషనంతా కలియ తిరుగుతుంది

the best part of the kavitha as per me.........yedayina platform gurinchi neekanna lively ga evaru rayagalaru anna??swanubavam bavukatvam kalagalipina kavitha adaraho..........

జ్యోతిర్మయి చెప్పారు...

మీ బ్లాగంతా తీరిగ్గా ఆస్వాదించాలి. ఎంత చక్కని కవితలు వ్రాశారు..మీ కథలు చదివాను కాని కవితలు ఇవాళే చూడడం..ధన్యవాదాలు.