సిరి మాలచ్చిమి..!!



ధనమూలం ఇదం జగత్ అని పెద్దలు శెలవిచ్చారు - (శెలవంటే హాలీడే కాదండీ.. చెప్పడం). అలా మూలాధారమైన ధనమే ఇంధనమై ఈ భూమిని గిరగిరాతిప్పుతోందని చెప్పుకుంటారు. అసలు భూమి తిరిగేది సూర్యుడి చుట్టూ కాదని, రూపాయి బిళ్ళ చుట్టూ అని కొంతమంది భావుకుల ఊహ. అంత గొప్పదైన డబ్బు విషయంలో కూడా మన మనుషుల్లాగే చిన్నవి పెద్దవీ, కొత్తవి పాతవి అనే తాహతులు కల్పించి వాటి మధ్యలో వైషమ్యాలు కల్పిస్తున్నాం. డబ్బు ఏదైనా శ్రీమహాలక్ష్మే కదా..! అది వెయ్యి రూపాయల కాగితమైనా, అర్థరూపాయి బిళ్ళైనా డబ్బు డబ్బే కదా...!!

అదేదో సినిమాలో నల్ల ధనం అంటే ఏంటయ్యా అది నల్లగా వుంటుందా అని ఒక అమాయకుడు ప్రశ్నిస్తాడు. నిజానికి నల్ల డబ్బంటే తెల్లగా నిగనిగలాడుతూ వుంటుంది. దేశం దాటింఛే సొమ్ముని మినహాయిస్తే ఇంట్లో పరుపులకింద దాచుకునే నల్ల డబ్బంతా దేశంలో చలామణిలో వున్న అధ్యధిక కరెన్సీ నోటు రూపంలో వుంటుంది. కోటానుకోట్లు మింగేస్తున్న మహామహులకి అలా పెద్దకాగితాలుగా మార్చుకోవటం సులభం, దాచుకోవటం సులభం. అదీ ఒకందుకు మంచిదే... మధ్యతరగతి ప్రజలకు కావాల్సింది పది రూపాయల నోట్లు, వంద రూపాయల నోట్లు. వెయ్యి రూపాయలలాంటి పెద్ద నోట్లు ఎక్కడ పోయినా, కనపడక పోయినా పాపం వీళ్ళ బతుకుల్లో పెద్ద కష్టమేమీ రాదు. డబ్బువల్ల సృష్టించబడిన పేద ధనిక వ్యత్యాసం డబ్బులోనే వుండటం మరీ అన్యాయం. వెయ్యి రూపాయల నోటుకు వున్న విలువ అయిదు రూపాయల నోటుకి వుండదు కదా. వెయ్యి రూపాయలు ధనిక వర్గం, అయిదురూపాయలు మధ్యతరగతి... చిల్లర డబ్బు పేదవాడిది.

మనకి తెలియదు కానీ వెయ్యి రూపాయలనోటు మరో వెయ్యి నోటుతోనో, అది లేకపోతే అయిదువందల నోటుతో ఫ్రండ్‌షిప్ చేస్తుంది కానీ పది రూపాయలను, అయిదు రూపాయలను దగ్గరకి కూడా రానివ్వదు. ఇక రూపాయి, అర్థ రూపాయి కనపడితే చిరాకు పడుతుందనుకుంటా. "దూరంగా వుండండయ్యా... వెధవ చిల్లర ముఖాలు మీరూనూ... " అంటుందేమో. ఇంతవరకన్నా నయం... చినిగిపోయిన కాగితాల బతుకు మరీ దుర్భరం. చినుగులు కనపడకుండా ముడుచుకోవాలి. తళ తళా లాడే మరో కొత్త కాగితం కనికరిస్తే దాని మధ్యలో దూరీ, పై పై మెరుగుల ముసుగులో చేతులు మారాలి. పొరపాటున బయటపడిందా, గుట్టు రట్టైందా - అవమానాలు భరించాలి. "ఇది చెల్లదు సార్..!!" ఇది వినడానికేనా నేనింకా బతికుంది అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏ నోట్లాసుపత్రిలోనో చేరి ష్రడ్డర్ మెషిన్ కింద చావడానికి సిద్ధపడాలి.

నోటు ఏదైనా నోటే కదా..!! ఏ నోటైనా గాధీ తాత బోసి నవ్వు అలాగే వుంటుంది కదా. కానీ ఒకసారి చినుగు పడితే దాని మీద ఆర్.బి.ఐ. అధికారులు చేసిన హామీపత్రం, సంతకం స్పష్టంగా వున్నా దాని విలువ పడిపోతుంది. "ఇది ఎవరూ తీసుకోరు సార్.." అనేది చాలా చోట్ల వినపడే వాదన. ఇది వింటే నాకు భలే చిరాకు... - "ఎవరూ తీసుకోరు అంటే? నేను తీసుకోలా? నాకు ఎవడో ఇస్తేనేగా నాదగ్గరకి వచ్చింది? నేనేమైనా చినిగిపోయిన నోట్లు తయారు చేసే యంత్రం ఒకటి కనిపెట్టి ఇలాంటి కాగితాలని సృష్టిస్తున్నానా?" ఇవన్నీ అడగాలనిపిస్తుంది. అడిగినా పట్టించుకునేది ఎవరు - నోటును బట్టి మనిషికి గౌరవం, మర్యాద..!!

ఇలా పాతనోటుని వాడటం విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్దతి వుంటుంది. కొన్ని చోట్ల కొంచం చినిగినా ఒప్పుకోరు. మరికొన్న చోట్ల చినిగిపోయిన నోటు ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కాగితంలో వేసి ఇచ్చినా తీసుకుంటారు (కొంత కాలం క్రితం కర్నాటకలో వున్న పద్దతి ఇది). ఏ రకంగా చూసినా కరెన్సీకి వుండేది వూహాత్మక విలువు (notional value). అందరూ కలిసి కొన్ని పేపరు ముక్కలకి ఒక విలువ ఆపాదించి, పరస్పర అంగీకారం (mutual agreement) మీద ఆ విలువని బదిలీ చేసుకోవడామే కరెన్సీ. అలాంటప్పుడు కాగితం చినిగినా, నలిగినా వచ్చే తేడా ఏమీ లేదు. నిజానికి కొన్నిచోట్ల అర్థ రూపాయికి బదులుగా ఒక చాక్లెట్ ఇవ్వడం మనందరికీ తెలుసు. పరస్పర అంగీకారం ప్రకారం ఆ చాక్లెటే అర్థ రూపాయి. దాన్ని తిరిగి ఇచ్చినా ఆ షాపువాళ్ళు తిరిగి అర్థ రూపాయిగానే తీసుకుంటారు. అందుకే నోటూ మీద వ్యామోహం అనవసరం. ఇప్పుడు ఉన్నట్టుంది ప్రభుత్వం వెయ్యిరూపాయల నోటును ఉపసంహరించుకుంటే అంత పెద్ద నోటు కూడా కాగితం ముక్కగా మిగిలిపోతుంది. దాచుకున్న నల్ల డబ్బు తీసి లెక్క చెప్పి మార్చుకోలేని వారు ఆ కాగితాలు కాల్చి టీ కాచుకోడానికి తప్ప ఇంక దేనికీ వాడలేరు.

చిరిగిపోయిన కాగితాల పరిస్థితి ఇలా వుంటే ఇక చిల్లర మాలచ్చిమి సంగతేమిటి? దారుణం. అన్నింటికన్నా ముందు అంతరించే జాతి ఇది. మొన్న మొన్నటిదాకా నున్నగా గుండ్రంగా బతికిన పావలా ఇప్పుడు పరమపదించింది. నా చిన్నప్పుడు వున్న ఐదుపైసలు (రాంబస్ ఆకారం), పది పైసలు (నొక్కులు నొక్కులుగా గుండ్రంగా), ఇరవై పైసలు (అష్ట భుజి) మా కళ్ళముందే అంతరించిపోయాయి. ఇక కాణీ, అర్థణా, అణా, బేడ ఇత్యాది పదాలు నాయనమ్మల దగ్గర వినడమే కానీ, చాలా తక్కువమంది చూసుంటారు. మెళ్ళోనూ, మొల్లోనూ కట్టుకునే సాంప్రదాయం వల్ల చిల్లి కాణీ ఇంకా అక్కడాక్కడా కనిపించే అవకాశం వుంది. ఇలాంటి చిల్లర పైసలకి ఆయువు మూడిందని తెలియడానికి మొదటి గుర్తు వ్యాపారులు దాన్ని తీసుకోవడం మానేస్తారు. ఆ తరువాత ఆర్టీసీవారు (ఇక్కడ కొన్ని యుద్ధాలు జరుగుతాయి). ఆ తరువాత ఆ చిల్లర తీసుకున్న యాచకులు విచిత్రమైన చూపులు విసరటం మొదలుపెడతారు. ఇక చివరిగా మిగిలేది దేవుడు. ఎందుకూ పనికిరాని ఆ చిల్లర డబ్బు హుండీ ద్వారా దైవ సన్నిధికి చేరుకుంటుంది. చెల్లని డబ్బు వేసినా నిఖార్సైన పుణ్యం మిగుల్తుంది.