మౌనమేలనోయి.. (కథ)


ఒక పెళ్ళైన అమ్మాయి ఇలా ఆలోచించవచ్చా?
ఈ అనుమానం వచ్చినా ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయింది. రవి నేను కొట్లాడుకోవడమే అందుకు కారణమా అంటే కావచ్చేమో.! కానీ మనసులో కలిగే ప్రతి ఆలోచనకీ బయటప్రపంచంలో కారణం వుంటుందనుకోవడం అమాయకత్వం.
అసలింతకీ నాకు వచ్చిన ఆలోచన ఏమిటనేనా మీ అనుమానం? చెప్తాను... చెప్పాలనే కదా మొదలుపెట్టాను.
పుట్టింటికి వచ్చి అప్పటికి వారం రోజులైంది. రవితో గొడవపడ్డ విషయం కానీ, ఆ వారం రోజులుగా మేమిద్దరం మాట్లాడుకోవటం లేదని కానీ ఇంట్లో చెప్పలేదు. చెప్పాలని అనిపించలేదు.కానీ, మా ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగే వుంటుందని అమ్మ నాన్న అనుమానించినట్లున్నారు. వాళ్ళూ ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా, చూచాయగా అడగాలని ప్రయత్నిస్తూనే వున్నారు. నేను చెప్పకుండా దాటవేస్తూనే వున్నాను.
నిజానికి, నేను రవి మాట్లాడుకోవటం లేదని అనడం కన్నా, నేను రవితో మాట్లాడటంలేదని చెప్పడమే సబబు. ఎందుకంటే నాతో మాట్లాడటానికి రవి ప్రయత్నిస్తూనే వున్నాడు. రోజూ క్రమం తప్పకుండా పది పదిహేనుసార్లు ఫోన్ చేస్తూనే వున్నాడు.
ఇంతకీ నాకు వచ్చిన ఆ రాకూడని అనుమానం ఏమిటా అని మళ్ళీ మీరు ప్రశ్నిస్తారు... నాకు తెలుసు. కానీ ఇదంతా చెప్తే కానీ ఆ ఆలోచన ఎలాంటిదో మీరు బేరీజు వెయ్యలేరు. నాకు వచ్చిన ఆలోచనని మీరు సమర్థించాలంటే మీ సానుభూతి పొందాలి కదా?
చాలా కాలం క్రితం, అంటే నాకు పెళ్ళి కాకముందు సంగతి. మా కాలేజీకి రెండు వీధుల వెనక ఒక టైప్ ఇన్స్టిట్యూట్ వుండేది. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి, సాయంత్రం టైపింగ్ నేర్చుకునేందుకు అక్కడికి వెళ్ళేదాన్ని. నాకు తోడుగా పూర్ణిమ కూడా వచ్చేది. నిజానికి నేను చెప్పాలనుకున్నది ఆ అమ్మాయి గురించి కాదు. ఆ అమ్మాయి కాకుండా నా వెనకాలే వచ్చే ఆ అబ్బాయి గురించి. కాలేజి వదిలిపెట్టే సమయానికి ఠంచనుగా వచ్చి నిలబడేవాడు. నేను బయటికి రాగానే నవ్వుతున్న కళ్ళతో చూసేవాడు. నా వెనకే సైకిల్ నడిపించుకుంటూ వచ్చేవాడు. నా టైపింగ్ క్లాస్ అయ్యేదాకా అక్కడే వుండి, మళ్ళీ నా వెనకే వచ్చి మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల ఆగిపోయేవాడు.
నాలుగైదు రోజుల దాకా నా వెనకాల ఒకడు వస్తున్నాడన్న స్పృహే వుండేది కాదు కానీ, పూర్ణిమ చెప్పడంతో నాకూ అనుమానం మొదలైంది. అనుమానం కొద్దిగా భయంగా మారింది. ఆ తరువాత అలవాటుగా రూపాంతరం చెందింది. అక్కడితో ఆగితే బాగుండేది. నా కోసమే అతను వస్తున్నాడు, ఎదురు చూస్తూ నిల్చుంటున్నాడు అన్న ఆలోచన పదే పదే మెదలడం వల్లనేమో అతనంటే కొంచెం అభిమానం ఏర్పడింది. అతను నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడన్న ఆలోచన మొదలైంది. అమ్మా నాన్నా పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అది అంతటితో ఆగిపోయింది.
ఇంతకీ ఇప్పుడు కలిగిన ఆ దుష్ట ఆలోచన ఏమిటంటారా? అదే... ఆ అబ్బాయి ఎవరో, ఒక్కసారి నా ముందుకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్పి వుంటే? నేను ఒప్పుకునేదాన్నేమో.. ఆ తరువాత? ఇంట్లొ చెప్పేవాళ్ళమా? మా పెళ్ళి జరిగేదా?ఇదినామనసులోమెదిలినఆలోచన.కానీఒకటి మాత్రం నిజం. అతనే నా భర్త అయ్యుంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
అయితే రవి ప్రేమగా చూసుకోవటంలేదా అని మీరు అనుమానపడకూడదు. ప్రేమ లేదని చెప్పలేను. వున్నదని చెప్పడానికీ బలమైన ఆధారాలు లేవు. పెళ్ళైన తరువాత అన్ని జంటల పరిస్థితి ఇంతేనేమో... ముఖ్యంగా పెద్దల కుదిర్చిన పెళ్ళిలో..!!
రవి మళ్ళీ ఫోన్ చేశాడు. నాకు మాట్లాడాలని లేదు మొర్రో అంటే ఎందుకు అర్థం చేసుకోడు? ఫోన్ కట్ చేశాను.
నాకు ఎందుకో నన్ను వెంటాడి ప్రేమించిన ఆ అబ్బాయితో మాట్లాడాలనిపించింది. అతను ఎవరో, పేరేంటో కూడా తెలియదు. పూర్ణిమకి ఫోన్ చేశాను.
“అప్పుడు నాతో టైపింగ్ సెంటర్ కి వచ్చేవాడు గుర్తుందా... మనం బాడీగార్డ్ అనేవాళ్ళం... అతను ఎవరు? ఎక్కడుంటాడు?” అడిగాను. మాట్లాడటం మొదలుపెట్టిన అయిదు నిముషాలలోపే ఆ విషయం అడగటం దానికి నచ్చినట్లు లేదు.
“వాడి సంగతి ఎందుకులేవే..” అంది దాటవేస్తూ.
“ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తోందే... నిజంగానే చాలా ప్రేమించినట్లున్నాడు...” చెప్పాను.
“ఛ ఏమిటా మాటలు... పెళ్ళైనదానివి...” పూర్ణిమ కోపాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తోంది.
“పెళ్ళైతే... ఒకప్పడు ప్రేమించిన వాణ్ణి గుర్తు చేసుకోకూడదా? నిన్నటి నుంచి నాకు అనిపిస్తోంది– ఒక్కసారి వాడు వచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పి వుంటే ఈ కథ మరోలావుండేదని...” అన్నాను.
“చెప్పేవాడే... కానీ ఎలా చెప్పగలడు... తరువాత తెలిసింది అతను మూగవాడట...!!” ఆ తరువాత పూర్ణిమ ఏం మాట్లాడిందో గుర్తులేదు. ఫోన్ ఎప్పుడు పెట్టేశానో కూడా గుర్తులేదు.
మూగవాడు... మాట్లాడలేని మూగవాడు...!!
నాకు అప్పుడు గుర్తొచ్చింది. రెండు మూడు సార్లు దగ్గరగా వచ్చాడు. చేతికి పూలు ఇచ్చాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ... చెప్పలేదు... కాదు కాదు చెప్పలేడు.. అందుకే చెప్పలేదు.
చెప్పి వుంటే మరో కథ. చెప్పలేదు కాబట్టే ఈ కథ.
ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? మాట్లాడగలిగి కూడా మాట్లాడకపోవటం. మాట పట్టింపుకు పోయి మాట్లాడే దారుల్ని మూసెయ్యడం. రేపు ఇది రవికి నాకు మధ్య విషాదమై మిగిలితే..?? అప్పుడు ఇలాగే మాట్లాడుంటే బాగుండేది కదా అని అనుకోవాల్సి వస్తుందేమో..!!
ఫోన్ అందుకోని రవికి ఫోన్ చేశాను.
<< ?>>
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, 12 జులై 2012)

Category: