మొపాస కథలు: నా శ్రీమతి

మగవాళ్ళ డిన్నర్ పార్టీ. అంతా పెళ్ళైనవాళ్ళే. అయినా బ్రహ్మచారులుగా వున్న రోజుల్లో లాగానే, భార్యలు లేకుండా అప్పుడప్పుడు ఒక చోట చేరుతుంటారు. తింటూ తాగుతూ చాలా సమయం గడుపుతారు. అదీ ఇదీ అని లేకుండా మాట్లాడుకుంటారు. ఉల్లాసంగా వుండే పాత జ్ఞాపకాలను కదిపి తమ పెదవుల పైన చిరునవ్వుల్ని, గుండెల్లో చిరుప్రకంపనల్ని కల్పించుకుంటారు.
"జార్జెస్! మనం సెయింట్ జెర్మైన్‌కి ఎక్స్‌కర్షన్ వెళ్ళాం. నీకు గుర్తుందా? అదే ఇద్దరు మోమార్తో అమ్మాయుల్ని తీసుకోని" అందులో ఒకడన్నాడు.
"అసలు మర్చిపోగలనా?"
ఇక ఆ సమయంలో జరిగిన ప్రతి చిన్న సంఘటనని తల్చుకోని మనసుల్లో ఉల్లాసాన్ని నింపుకున్నారు.
మాటల్లో పెళ్ళి ప్రస్తావన వచ్చింది. అందరూ నిజాయితీపరుల్లా ముఖం పెట్టి - "ప్చ్.. మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశం లేదు కదా" అన్నారు. జార్జియస్ అందుకున్నాడు.
"ఎంత విచిత్రంగా జరిగిపోతుందో కదా. అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకోని వున్నవాడు ఓ వసంతకాలంలో సొంతూరు వెళ్ళాల్సివచ్చి వెళ్తాడు. వెచ్చటి ఉదయాలు. అందమైన వెలుగు నీడలు. తోటలంతా విరగబూసిన పూలు. ఎవరో స్నేహితుడి ఇంట్లో ఒక అమ్మాయిని చూడటం. ధడేల్..!! ఇంకేముంది. తిరిగి వచ్చేటప్పుడు సతీ సమేతంగా వస్తాడు."
ఒక్కసారి అందుకున్నాడు ప్సేరీ లిట్వోల - "కరెక్ట్! సరిగ్గా నాకు అలాగే జరిగింది. కాకపోతే కొన్ని చిత్రమైన సంఘటనలు.."
"నీ సంగతే చెప్పు.. నీకేంరా ప్రపంచంలోనే అందమైన భార్య, అందానికి తగ్గ అణకువ.. పర్ఫెక్ట్. ఇక్కడున్న వారందరికన్నా నువ్వే అదృష్టవంతుడివి, ఆనందంగా వున్నవాడివి" అన్నాడో స్నేహితుడు మధ్యలోనే అందుకోని.
"అందులో నాదేం లేదు" అన్నాడు అతను.
"ఏంట్రా నువ్వనేది?"
"నాకు పర్ఫెక్ట్ భార్య దొరికిందని ఒప్పుకుంటాను కానీ ఆమెతో పెళ్ళి మాత్రం నాకు ఇష్టం లేకుండా జరిగింది"
"నాన్‌సెన్స్"
"నిజంరా.. అదంతా ఒక సాహసమే అనుకో. అప్పటికే ముప్పైఅయిదేళ్ళు. పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనల కన్నా ఉరిపోసుకోని చావాలన్న ఆలోచనలు ఎక్కువగా వచ్చే వయసు. అందమైన ఆడపిల్లని చూసినా ఏ భావమూ వుండేది కదు. సుఖం మాత్రం కోరుకునేవాణ్ణి."
ఒకసారి మేనెల్లో నార్మండీ ప్రాంతంలో నా కజిన్ సైమన్ దియెరబెల్ పెళ్ళికి పిలుపు వచ్చింది. ఆ ప్రాంతంలో జరిగే అన్ని పెళ్ళిళ్ళు లాగానే జరిగింది. సాయంత్రం అయిదింటికి టేబుల్ చుట్టూ కూర్చున్నాం. రాత్రి పదకొండైనా ఇంకా తింటూనే వున్నాం. డుమోలిన్ అనే ఒక అమ్మాయితో తాత్కాలికంగా జత కుదిరింది. వాళ్ళ నాన్న రిటైర్డ్ కల్నల్. ఆ అమ్మాయి మంచి వయసులో, ఎర్రటి జుట్టుతో చూడచక్కగా వుంది. మాటకారి. పైగా సూటిగా మాట్లాడే తత్వం. ఆ రోజంతా నన్ను ఆవహించేసింది.  పార్క్ కు లాక్కేళ్లింది అక్కడ నాతో పిచ్చి పిచ్చి డాన్స్లు వేయించింది. ఏదో ఏదో చేసింది. ప్రాణం విసుగెత్తిపోయిందనుకో. "ఇప్పుడంతా బాగానే వుంది. రేపు నేను వెళ్ళిపోతాను. అంతకన్నా ఏముందని ఇదంతా చేస్తున్నావు" అని కూడా అడిగాను.
రాత్రి పదకొండు గంటలకి ఆడవారంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మగవాళ్ళు అక్కడే వుండిపోయారు. పొగతాగుతూ, మందు కొడుతూ లేదంటే మందు కొడుతూ పొగతాగుతూ - నువ్వు ఎలా అనుకుంటే అలా - వుండిపోయారు.
అక్కడ తెరిచి వున్న కిటికీలో నుంచి పల్లె మనుషులు జానపదాలు పాడుతూ నాట్యం చేస్తున్నది కనిపిస్తోంది. కొంత మంది రైతులు, అమ్మాయిలు కలిసి గుండ్రంగా నిలబడి గొంతులు చిట్లేలా కేకలేస్తూ, ఎగురుతూ ఆడుతున్నారు. వాళ్ళ పాటకి రెండు వయోలిన్లు, ఒక క్లారినెట్ సన్నగా వంతపాడుతున్నాయి. ఆ వాయిద్యాలలో నుంచి వస్తున్న సంగీతాన్ని వాళ్ళ గోల దాదాపు వినపడకుండా అణిచేస్తోంది. అలా అణిగిపోయిన సంగీతం ముక్కలు ముక్కలుగా విడిపోయి చెవిన పడుతోంది. కాగడాల వెలుగులో రెండు పెద్ద పెద్ద పీపాలని నిలబెట్టి వాటినిండా మందు సరఫరా చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు చకచకా గ్లాసులను కడిగి, వాటిని పీపాలకి వున్న కొళాయికింద పెడుతున్నారు. ఒకదాని నుండి ఎర్రటి ధారగా వైన్, మరో పీపా నుంచి బంగారు రంగులో మెరిసిపోతున్న ఏపిల్ సారా నిండుతోంది. ఆ గ్లాసులని అందుకోవాలనుకునే వాళ్ళు తడితగలక ఎండిపోయినవాళ్ళలా అవురావురంటూ అక్కడికి చేరుతున్నారు. ముసలివాళ్ళు నెమ్మదిగానూ, అమ్మాయిలు గసపెడుతూ వచ్చి చేతులు చాచి నచ్చిన డ్రింక్ అందుకోని, తల వెనక్కి వంచి మొత్తం ఒక్క గుక్కలో పోసుకోని తాగేస్తున్నారు. అక్కడే టేబుల్ మీద బ్రెడ్, బటర్, చీజ్, సాసేజ్ లాంటివి వున్నాయి. అడపదడపా ఎవరో ఒకరు వచ్చి అందినంత నోట్లో వేసుకోని తింటున్నారు. అసలా వాతావరణం చూడాలి - పైన తారలు నిండిన ఆకాశం. కింద ఎంతో ఉల్లాసంగా ఆ జనం. చూసే వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళిపోయి పీపాలలో వున్నదంతా తాగేసి, కరకరలాడే బ్రెడ్డుని ఉల్లిపాయ నంచుకుంటూ తినెయ్యాలనే కోరికను రగిలిస్తోంది.
"ఆ సంబరంలో కలిసిపోవాలన్న ఓ వెర్రి కోరిక నన్ను ఆవహించింది. నాతో వున్నవాళ్ళని వదిలేసి కదిలాను. అప్పటికే కాస్త మైకంగా వున్నమాట నిజమే, కానీ ఆ తరువాత ఏకంగా మైకంలో మునిగిపోయిన్న మాట కూడా వాస్తవమే మరి.
"అప్పటికే ఆడి ఆడి ఆయాసపడుతున్న ఓ రైతు భార్య చేయిపట్టుకోని డాన్స్ మొదలుపెట్టను. అలసిపోయేదాకా ఎగిరాను.
"ఆ తరువాత కాస్త వైన్ తాగి మరో అమ్మాయిని అందుకున్నాను. మళ్ళీ ఫ్రెష్ అవడానికి గుక్కెడు ఏపిల్ సారా తాగాను. ఆ తరువాత దెయ్యం పట్టినవాడిలా ఆడటం మొదలుపెట్టాను.
"కాళ్ళు గాలిలో తేలిపోయినట్లు వుంది. అక్కడున్న కుర్రాళ్ళంతా నన్నే గమనించి, నన్ను అనుకరిస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అమ్మాయిలందరూ నాతో డాన్స్ చెయ్యాలని కోరుకున్నారు. వయ్యారంగా నా దగ్గరకు రావటం మొదలుపెట్టారు.
"ఒక డాన్స్ చెయ్యడం ఓ గ్లాస్ వైనో, సారానో తాగడం. ఇదీ వరస. రాత్రి రెండుగంటలకి ఎంత తాగేసానంటే ఇక నిలబడటమే కష్టం అనే పరిస్థితి వచ్చేసింది.
"నా పరిస్థితి అర్థం అయిన తరువాత ఇక లాభంలేదని నా రూమ్ కి వెళ్ళాలని కదిలాను. అప్పటికే అందరూ నిద్రపోవడంతో ఇల్లంతా నిశబ్దంగా, చీకటిగా వుండింది.
"నా చేతిలో అగ్గిపెట్టె కూడా లేదు. అందరూ నిద్రలో వున్నారు. సరిగ్గా ఇంటి ముఖద్వారం దగ్గరకు వచ్చేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. మెట్ల వెంబటే వుండే చేతిపట్టుని వెతకడం కోసం చాలా కష్టపడ్డాను. చివరికి ఎలాగైతేనేం చేతికి తగిలింది. దాన్ని ఆధారం చేసుకోని మొదటి మెట్టు మీదే కూర్చోని చెల్లా చెదరైపోయిన స్పృహని ఏకం చేసుకునే ప్రయత్నం చేశాను.
"రెండో అంతస్థులో ఎడమచేతి వైపు మూడో గది నాకు ఇచ్చారు. టైం బాగుండి అదన్నా గుర్తుంది. అదే నా ఆయుధం అనుకున్నా. కష్టపడుతూ లేచి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాను. పడకుండా ఇనుప రైలింగ్‌ను గట్టిగా పట్టుకున్నాను. ఏ శబ్దం కాకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేశాను.
"ఓ మూడు నాలుగుసార్లు అనుకుంటా అడుగు మెట్టు మీద సరిగ్గా పడక పట్టు తప్పి మోకాళ్ళమీద ముందుకు పడ్డాను. అయితే నా చేతుల్లో వున్న బలం వల్లైతేనేమి, దిట్టమైన నా మనోబలం వల్ల అయితేనేమి పూర్తిగా ముందుకి బోర్లా పడిపోకుండా ఆపుకోగలిగాను.
చివరికి ఎలాగోలా రెండో అంతస్థుకు చేరి గోడల్ని తడుముకుంటూ హాల్‌ మీదుగా నడక సాగించాను. చేతికి ఒక తలుపు తగలగానే 'ఒకటి' అంటూ లెక్క మొదలుపెట్టాను. అయితే ఒక్కసారిగా మత్తు కమ్మేసి, గోడ ఆధారం తప్పిపోవడంతో గిరగిరా తిరిగి రెండో వైపు వున్న గోడ దగ్గరకు చేరాను. మళ్ళీ దారిలోకి రావాలని ప్రయత్నించాను. ఆ చివరనుంచి ఈ చివరికి చాలా దూరం వున్నట్లు, దారిలో ఎన్నో అడ్డంకులు వున్నట్లు అనిపించింది. చివరికి అవతలి వడ్డుకు చేరి, జాగ్రత్తగా గోడవెంబడే ప్రయాణం సాగింఛాను. మరో తలుపు చేతికి తగిలింది. మళ్ళీ ఏ తప్పు జరగకూడదని గట్టిగానే 'రెండు' అంటూ లెక్క కొనసాగించాను. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. మూడో తలుపు కూడా చేతికి తగిలింది. 'మూడు, అంటే ఇదే నా రూమ్' అని అనుకోని, తలుపు నాబ్ తిప్పాను. తలుపు తెరుచుకుంది. కాస్త అయోమయంగా వున్నప్పటికీ తలుపు తెరుచుకుంది కాబట్టి ఇది ఖచ్చితంగా నేను వుంటున్న గదే అని నిర్థారించుకున్నాను. శబ్దం రాకుండా మెత్తగా తలుపు వేసి, చీకటిలోకి అడుగులు వేశాను. ఏదో కాలికి తట్టుకుంది. నా పడక కుర్చీ. వెంటనే అందులో పడి నిద్రకి ఉపక్రమించాను.
ఆ పరిస్థితుల్లో నా బీరువా ఎక్కడుందో వెతుక్కోవడం, కొవ్వత్తులు అగ్గిపెట్టె వెతుక్కోవడం వ్యర్థ ప్రయాస అని తెలుసు. అదంతా చెయ్యాలంటే కనీసం రెండు గంటలైనా పడుతుంది. ఇంక బట్టలు మార్చుకోవాలంటే మరో రెండు గంటలు. అంత సమయం కష్టపడ్డా అవన్నీ చేయగలనన్న నమ్మకం కూడా లేదు. అందువల్ల ఆ ప్రయత్నాలన్నీ విరమించుకున్నాను.
నా కాళ్ళకున్న బూట్లు మాత్రం విప్పదీశాను. నాకు ఊపిరాడకుండా చేస్తున్న వెయిస్ట్ కోట్ గుండీలు విప్పాను. ప్యాంట్ కూడా కాస్త వదులు చేసుకోని నిద్రపోయాను.
బహుశా అలాగే చాలా సేపు పడివున్నట్టున్నాను. ఉన్నట్టుండి కేకలు వేస్తున్న గొంతు వినపడి లేచి కూర్చున్నాను - "ఏమే ఒళ్ళు బరువు పిల్లా.. పదైంది. ఇంకా పడుకోనే వున్నావా?" అన్నదా గొంతు.
దిక్కు తోచని పరిస్థితిలో ఏమిటీ మాటలకి అర్థం అని ఆలోచించాను. ఎక్కడున్నాను నేను? ఏం చేశాను? నా బుర్ర తిరిగిపోయింది. ఎదురుగా పొగమంచు కమ్మినట్లుంది. ఇంతలో ముందు మాట్లాడిన కంఠం మళ్ళీ పలికింది - "నీ కర్టన్స్ తీస్తున్నాను" అంటూ.
ఎవరివో అడుగులు నావైపే వచ్చాయి. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో లేచి కూర్చున్నాను. ఎవరిదో చెయ్యి నా తలపైన పడింది. నేను ఉలిక్కి పడ్డాను.
"ఎవర్రా నువ్వు?" అడిగిందా కంఠం.
నేను సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకోని మాట్లాడకుండా వుండిపోయాను. ఆ చెయ్యి కోపంతో నన్ను బిగించి పట్టుకుంది. నేను కూడా ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాను. ఇద్దరి మధ్య భీభత్సమైన పెనుగులాట నడిచింది. కిందపడి దొర్లాము, ఫర్నీచరు లాంటి వస్తువులు గోడకి తగిలేట్టు తోసాము. ఓ ఆడగొంతు మాత్రం అరుస్తూనే వుంది - "కాపాడండి.. హెల్ప్... హెల్ప్.." అంటూ.
నౌఖర్లు, చుట్టుపక్కలవాళ్ళు, భయంతో వణికిపోతున్న ఆడవాళ్ళు మొత్తం ఓ గుంపులా మా చుట్టూ చేరారు. కిటికీలు తెరిచి, పరదాలను తొలగించారు. అప్పుడు తెలిసింది - కల్నల్ డుమోలిన్‌తో పెనుగులాడుతున్నాను.
ఆ రాత్రి మొత్తం ఆయన కూతురి బెడ్ పక్కనే పడుకున్నాను.!
మా ఇద్దరినీ విడదీయగానే అదే అదనుగా మాట కూడా మాట్లాడకుండా నా గదిలోకి పరుగెత్తాను. ఆ గది తలుపులు బిగించుకోని కుర్చీలో కాళ్ళు పైకి పెట్టుకోని కూర్చున్నాను. ఆ అమ్మాయి గదిలోనే నా బూట్లు వుండిపోయాయి.
ఇల్లంతా ఒకటే గోల అయిపోయింది. అన్ని గదుల తెలుపు తీయడం వెయ్యడం వినపడుతోంది. గుసగుసలు, వడివడిగా పరుగెత్తే అడుగుల చప్పుళ్ళు.
ఓ అరగంట తరువాత ఎవరో నా గది తలుపు కొట్టారు. "ఎవరది" అరిచాను.
మా మామయ్య. పెళ్ళికొడుకు తండ్రి. తలుపు తీశాను.
ఆయన ముఖం కోపంతో పాలిపోయినట్లు వుంది. నాతో చాలా దురుసుగా మాట్లాడాడు.
"నా ఇంట్లో ఇలాంటి పోకిరి వేషాలు వేస్తావట్రా?" అంటూ అరిచాదు. మళ్ళీ కాస్త నెమ్మదించాడు.
"చేస్తే చేశావ్ కుర్రవెధవా. పొద్దున పదిగంటలదాకా అక్కడే చచ్చి దొరకకపోతే ఏం పోయింది? అక్కడే దున్నలాగా పడి నిద్రపోకపోతే ఆ పనేదో అయిపోయిన వెంటనే బయటికి వచ్చేయకూడదూ.."
"కానీ మామయ్యా. ఒట్టేసి చెబుతున్నా. అలాంటిదేమీ జరగలేదు. నేను తాగిన మత్తులో పొరపాటున వేరే గదిలోకి వెళ్ళాను అంతే" మొరపెట్టుకున్నాను నేను.
ఆయన భుజాలు ఎగరేశాడు. "పిచ్చి కూతలు కుయ్యకు"
నేను చెయ్యి పైకెత్తి ఆయన మీద పెట్టాను - "ఒట్టు మామయ్యా. నీమీద ఒట్టు"
మామయ్య మళ్ళీ అందుకున్నాడు - "సరేలేరా. ఇప్పుడు అలా కాక ఇంకెలా చెప్తావులే"
నాకు మండిపోయింది. జరిగిందంతా వివరంగా చెప్పాను. ఆయన నా వైపు నమ్మాలా వద్దా అన్నట్లు సంభ్రమంగా చూశాడు. తరువాత కల్నల్‌తో మాట్లాడటానికి వెళ్ళాడు.
అక్కడేమో తల్లులు అందరూ కలిసి ఓ జ్యూరీలా తయారయ్యారట. జరిగిన సంఘటన వివరాలను వారిముందు వుంచాడాయన.
ఓ గంట తరువాత తిరిగి వచ్చాడు. ఓ జడ్జి కూర్చున్నట్లు హుందాగా కూర్చోని చెప్పడం మొదలుపెట్టాడు. "జరిగింది ఏమైనా కానీ. నాకు ఒకటే మార్గం కనపడుతోంది. నువ్వు ఆ పిల్లని పెళ్ళి చేసుకోవాలి"
నేను కుర్చీలోంచి ఒక్కసారి దూకి - "చస్తే చేసుకోను.. చంపినా చేసుకోను." అన్నాను.
"అయితే ఏం చేస్తావురా" అన్నాడాయన గంభీరంగా.
"ఏముందీ.. నా బూట్లు నాకు పడేస్తే ఇట్నుంచి ఇటే పోతాను.”
"తొందర పడద్దు. ఆ కల్నల్‌కి నువ్వు కనిపించావంటే పిట్టని కాల్చినట్లు కాల్చేస్తానంటున్నాడు. ఏదో వూరకే భయపెట్టే రకం కాదు వాడు. నేను వాడికి చెప్పి చూశాను. ఇద్దరం కూర్చోని మాట్లాడదాం అని. వాణ్ణి వదలను కాల్చిపారేస్తాను అనే అంటున్నాడు.
“సరే ఇదే విషయాన్ని మరోవైపు నుంచి కూడా ఆలోచించు. నువ్వు తప్పుగా ప్రవర్తించావా లేదా అన్నది పక్కనపెట్టు. ఒకవేళ తప్పు చేసివుంటే, నేను చెబుతున్నా కదా, అప్పుడు దాని పర్యవసానం చాలా దారుణంగా వుంటుంది. ఒక యుక్తవయసులో వున్న అమ్మాయి దగ్గరకు అలా వెళ్ళచ్చా? తాగున్నానంటావు. రూమ్ విషయంలో తడబడ్డానంటావు. అలాగైనా సరే నీకు కష్టం తప్పదు. అలాంటి పరిస్థితిలో ఇరుక్కోకుండా ముందే జగ్రత్త పడాలి. నువ్వెన్ని చెప్పినా ఆ అమ్మాయి పరువు పోయినట్లే కదా. తాగుబోతోడి మాటలు ఎవరైనా నమ్ముతారా? ఏమైనా సరే ఈ మొత్తం ప్రహసనంలో బలైంది ఆ అమ్మాయే. కాదంటావా? ఆలోచించు.” అన్నాడు.
"నువ్వు నీకిష్టమైనట్లు అనుకో. నేను మాత్రం ఆ అమ్మాయిని పెళ్ళాడే ప్రశ్నే లేదు" అని నేను అరుస్తుండగానే ఆయన వెళ్ళిపోయాడు.
ఒంటరిగానే దాదాపు ఓ గంట గడిపాను. ఆ తరువాత మా అత్తయ్య వచ్చింది. ఒకటే ఏడుపు. అన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నం చేసింది. నా మాట నమ్మేవాళ్ళే కరువయ్యారు. ఇంతమంది వున్న ఇంట్లో ఒక ఆడపిల్ల తలుపు గడియవేసుకోకుండా పడుకుందంటే ఎవరూ ఒప్పుకోవటంలేదు. కల్నల్ ఆ అమ్మాయిని కొట్టాడట. ఉదయం నుంచీ ఆ అమ్మాయి ఏడుస్తూనే వుంది. నేను జీవితంలో మర్చిపోలేని దారుణమైన సంఘటన అది. ఆ అత్తయ్య కస్త మంచితనం చూపించింది. "ముందు ఆమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అడుగు. ఆ తరువాత అక్కడిదాకా వస్తే ఏదో ఒకరకంగా అడ్డుపుల్ల వేద్దాం" అంది.
ఈ ఆలోచన కాస్త ఊరటనిచ్చింది. ఆ రకమైన ప్రతిపాదన రాసి ఇవ్వడానికి ఒప్పుకున్నాను. అలా ఒప్పుకోవడం వల్లే ఓ గంట తరువాత ప్యారిస్ వెళ్ళే ప్రయాణంలో వున్నాను. ఆ మర్నాడు నా ప్రతిపాదన అంగీకరించినట్లు తెలిసింది.
మరో మూడు వారాల్లో, నేను తప్పించుకునేందుకు కారణం వెతికేలోగానే శుభలేఖలు వేసేశారు. అందరికీ ప్రకటించేశారు. చివరికి ఒక సోమవారంరోజు చర్చిలో తేలాను. మంచికో చెడుకో ఆ అమ్మాయి నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తున్నాను అని మెజిస్ట్రేట్‌తో చెప్పాను. పక్కన ఆ అమ్మాయి భోరుమని ఒకటే ఏడుపు..!!
నేను ఆ పెళ్ళింటిలో సాహసం చేసినప్పడు ఆ అమ్మాయిని సరిగ్గా చూసిందే లేదు. చూసిన తరువాత నాకు అంటగట్టారన్న భావన ఖచ్చితంగా కలుగుతుందని అనుకుంటూనే ఓర కంటితో ఆ అమ్మాయివైపు చూశాను. ఆశ్చర్యం. ఆ అమ్మాయి నేను వూహించినట్లు అందవిహీనంగా లేదు. పోనీలే, నన్ను చూసి ప్రతి ఒక్కడు ముసిముసిగా నవ్వుకునే తిప్పలు తప్పాయి అనుకున్నాను.
సాయంత్రందాకా ఆ అమ్మాయి నావైపు చూసిందీ లేదు, ఒక్క మాట కూడా మాట్లాడిందీ లేదు.
ఎప్పుడో అర్థరాత్రి కావస్తుండగా మా మొదటి రాత్రికోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళాను. నా నిర్ణయం ఏమిటో చెప్పేయాలని ముందే అనుకున్నాను. ఆ అమ్మాయి చక్కగా అలంకరించుకోని పడక కుర్చీలో కూర్చోని వుంది.  పాలిపోయిన ముఖం, ఎర్రటి కళ్ళు. నేను గదిలోకి అడుగుపెట్టగానే ఆమె లేచి నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది. "మాన్స్యూర్.. నేను సిద్ధంగా వున్నాను. ఆజ్ఞాపించండి. మీరు కోరితే ప్రాణాలైనా ఇస్తాను" అన్నది.
ఎంత అందంగా కనిపించిందో అంత ధైర్యంగా కూడా అనిపించింది. కల్నల్ కూతురు కదా. ఆమెకు ఓ ముద్దు పెట్టాను. నిజం చెప్పద్దూ అలా పెట్టగలగడం నా అదృష్టం అనిపించింది.
క్రమంగా నాకు అర్థం అయ్యింది. నాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. ఐదేళ్ళైంది ఇప్పటికి పెళ్ళై. ఏ ఒక్క రోజు అలా జరగకుండా వుంటే బాగుండేది అన్న ఆలోచన కూడా రాలేదు."
ప్సేరీ లిట్వోల ఇదంతా చెప్పి నిశ్శబ్దంగా వుండిపోయాడు. అతని స్నేహితులంతా నవ్వారు. "పెళ్ళి ఒక లాటరీ లాంటిది. నువ్వు ఏరి కోరి ఎన్నుకునే నెంబర్ల కన్నా ఏ మాత్రం ప్రాధాన్యత లేని నెంబర్లే మంచివి" అన్నాడు ఒకతను.
ఇంకెవరో దానికి ముగింపు వాక్యం పలికారు - "అవునవును. కాకపోతే మన ప్సేరీ గాడి కోసం ఆ నెంబరు వెతికిపెట్టింది మాత్రం తాగుబోతోళ్ళ దేవుడు అయ్యుంటాడు.."

<<***>>

2 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

very good, thanks.

Venkata Naresh చెప్పారు...

chala bavundi..